కథానిలయం: మన గూడుని మనం కాపాడుకోవాలి 

ఏటా శ్రీకాకుళంలో జరిగే కథానిలయం వార్షికోత్సవం ఈసారి హైదరాబాద్ లో జరుగుతోంది (24.2024 న). ఇప్పటికే చాలామంది సాహితీమిత్రులు మాష్టారి గురించి, కథానిలయం గురించి చాలా వ్యాసాలు రాశారు. ఈసారికి బహుశా ఇదే చివరి వ్యాసం కావచ్చు కూడ. అందరికీ తెలిసిన దాన్ని గురించి రాయడానికి ఏముంటుంది — అని అనుకుంటుండగా గురువు నారాయణావేణు వాట్సాప్ లో పంపిన ఇమేజ్ కనబడింది.

“బహుశా ఒక సాహితీ ప్రక్రియకి సంబంధించి ఇలాటి ఒక ప్రత్యేకమైన ఏర్పాటు జరగడం ప్రపంచంలో బహుశా మొదటిసారి,” అని గూటాల క్రిష్ణమూర్తి కథానిలయం గురించి చేసిన కామెంట్ ఒక ఇమేజ్ లో కనిపించింది. గూటాల గురించి నాకూ పెద్దగా ఏమీ తెలియదు. ఆయన మా పెదనాన్న సమకాలికుడు. ఇక్కడ చదువు అయిపోయిన తర్వాత లండన్ వెళ్లిపోయాడని, ఎవరో రచయిత రాసిన సమస్త రచనల సంగ్రహం, నిర్వహణ, పరిశోధనలో పూర్తికాలం పనిచేసేవాడని పెదనాన్న చెప్పేరు.

ఎవరైనా ఒక రచయిత గురించి జీవితాంతం వెచ్చించిన ఉదాహరణాలెన్నో వున్నాయి పాశ్చాత్య దేశాల్లో. అక్కడి రచయితల ఇళ్లను ప్రభుత్వ లేదా ప్రైవేట్ సంస్థలు మ్యూజియంల వలె మార్చిన సందర్భాలు కూడా చాలా వున్నాయి. మన పరిస్థితి దీనికి పూర్తి విరుద్ధం. చరిత్ర పట్ల, చరిత్ర రచన పట్ల మనకు పెద్దగా గౌరవం లేదు. చరిత్రను డాక్యుమెంట్ చెయ్యడం, నిక్షిప్తం చెయ్యడం మనకి అలవాటులేదు. బాధ్యత లేదు.

ఎక్కడో విదేశాలనుంచి వేళ మైళ్ళు నానాకష్టాలు పది వచ్చిన నికోలా కాంటి, మార్కో పోలో, టావెర్నియర్ వంటి విదేశీ యాత్రికులు రాసిన విషయాలు తప్ప మనకు చరిత్ర పుస్తకాలు లేవు.

వలసపాలకులకు వున్న కొన్ని అలవాట్లు — కొత్తప్రాంతానికి వెళ్ళేటప్పుడు అక్కడి ఆహారపు అలవాట్ల దగ్గరనుంచి, సంప్రదాయాలు, భాష, సంస్కృతి, వ్యవసాయం, ఆర్ధికం వంటి ఎన్నో అంశాలను అధ్యయనం చేసి రికార్డు చేసే పద్దతి ఉండడం వల్ల కనీసం మనకు ఒక రికార్డు వున్నది. ప్రభుత్వాలు లేదా ఇతర సంస్థలు నిక్షిప్తం చెయ్యగల చరిత్ర కొంచెం మాత్రమే. జీవితానికి, సమాజానికి సంబంధించిన కొన్ని పార్శ్వాలను మాత్రమే, కొన్ని లేయర్లను మాత్రమే అవి పట్టుకోగలవు.

చరిత్ర లభ్యం కానిచోట్ల సాహిత్యంలోంచి చరిత్ర ఆనవాళ్లు వెతుక్కోవచ్చు. కథలు ఆపనిని ఎంతో చక్కగా చేస్తాయి. వైవిధ్య భరితమైన, సంక్షుభితమైన జీవితాన్ని దాని అన్ని కళ్ళల్లో కథకులు పట్టుకోగలరు. తారీకులునడకపోవచ్చు కానీ చరిత్రగమనాన్ని, కథలు ఎంతో ప్రభావశీలంగా పట్టుకోగలవు.

రాజ్యాల చరిత్రల మీదే మనకున్న గౌరవం శూన్యమైతే ఇక సాహిత్య చరిత్ర గురించి, సాహిత్యాన్ని భద్రపరచడం గురించి చెప్పనక్కర్లేదు.

చరిత్రను (అది వాళ్ళ దృష్టికోణం నుంచి కావచ్చు గాక) రికార్డు చేసే అలవాటున్న చోటుకు వెళ్లి సాహిత్య పరిశోధనలో కృషిచేసిన కృష్ణమూర్తిగారు కారా మాష్టారు తలపెట్టిన ప్రాజెక్టును మెచ్చుకుంటూ — బహుశా ప్రపంచంలో ఇలాటి ప్రయత్నం లేదు — అన్నారంటే కథానిలయానికి ఉన్న ప్రాసంగికత అర్ధమవుతుంది.

దేశంలో మిగతా భాషల్లో, దేశాల్లో కథలకు సంబంధించి ఎలాటి ప్రయత్నాలు జరిగాయో మనదగ్గర సరైన సమాచారం లేదు కాబట్టి — ఇంకెక్కడా లేదు అని అనలేం. కానీ కథానిలయం సరైన సమయంలో చేసిన సరైన ప్రయత్నం.
(కృష్ణమూర్తి అన్నట్టు ఒక భాషలో అందరి కథలను భద్రపరిచే ప్రయత్నమేమైనా జరిగిందోలేదో తెలియదు కానీ కొందరి రచయితల సాహిత్యాన్ని భద్రపరిచే ప్రయత్నాలు చాలానే జరిగేయి. ఐర్లండ్ రాజధానిలో జేమ్స్ జాయిస్ సాహిత్యం కోసం జేమ్స్ జాయిస్ సెంటర్ వున్నది. బెర్లిన్లో సాహిత్య మ్యూజియం వున్నది. బ్యూనస్ ఎయిర్స్ లోని జార్జ్ లూయి బోర్హెస్ సెంటర్ వున్నది.)

కారా సాహిత్యం ద్వారా పరిచయమైన వారిని, అభిమానులను కథాసేకరణ ఉద్యమంలో భాగస్వామ్యం చేసేరు మాష్టారు. కథని ఎంత చక్కగా నిర్మించేవారో, కథానిలయానికి ఒక నిర్మాణాన్ని ఊహించి, డిజైన్ చేశారు.
ఆయన జీవితంలో మూడోవంతుపైగా సమయాన్ని ఈ ప్రాజెక్టుకోసం పెట్టేరు. ఎవరిదగ్గరైనా కొంచెం మంచి కలెక్షన్ ఉన్నదంటే ఎంత దూరమైనా వెళ్లేవారు. ఒకసారి హైదరాబాద్ వచ్చినపుడు — “ఈపూట నాతో రాగలవా? కొందరు పుస్తకాలివ్వాలి తెచ్చుకుందాం,”  అన్నారు.

ఒకరింటికి వెళ్ళేం. అరగంట, గంట అయింది కానీ ఇస్తానన్న పుస్తకాలివ్వడం లేదు. ఏదో సాకు చెప్తున్నారు. మధ్యాహ్నమైంది. అన్నంతినే టైం దాటిపోతోంది. మాస్టారికి తిండి లేటయిపోతుందని ఆందోళనపడుతున్నా. పుస్తకాల సంగతి తేలితే బయలుదేరదామని ఆయన అనుకుంటున్నారు. కానీ బాగా మొహమాటస్తుడు కాబట్టి నేరుగా అడగలేకపోతున్నారు.

చివరికి ఇద్దరికీ అర్ధమైపోయింది — ఒక్క పుస్తకమూ రాదని. ఇక లేచేం. ఆయన గుమ్మం దాకా వచ్చారు — చేత్తో రోడ్డుని మలుపును చూపిస్తూ — అదిగో అక్కడ చాల మంచి భోజనం దొరుకుందని, తిని వెళ్లండని అన్నాడు. (సబ్బవరం సత్రంలో భోజనం చెయ్యకపోతే నామీదొట్టే అని ఉత్తరాంధ్రలో సామెతఒకటి వుంది.)

ఇలాటి అనుభవం నాకు ఒక్కటే — కానీ (ఉమ్మడి) రాష్ట్రం మొత్తమ్మీద ఎన్ని అనుభవాలున్నాయో మాస్టారికి. ఎలాటి అనుభవం వున్నా తిరగడం ఆపలేదు. అడగడం ఆపలేదు. అది ఒక దశ. ఇప్పుడు మూడు దశాబ్దాలు గడిచింది. అరుదైన అపురూప కథాసాహిత్యమంతా దాదాపు ఒకచోట చేరింది. మాష్టారికి వెన్నుదన్నుగా నిలిచిన టీమ్ కృషి ప్రత్యేకమైనది. కథానిలయం లేకపోతే అత్యంత విలువైన కథలు వెళ్ళసందుల్లోంచి జారిపోయివుండేవి. మరెన్నటికీ దొరికివుండేవి కావు.
***

కానీ అసలు ప్రయాణం ఇప్పటినుంచే మొదలవుతుంది.

ఇలాటి సంస్థలు నాలుగు కాలాలుండాలంటే కొందరి ప్రయత్నం సరిపోదు. తెలుగు సమాజం బాధ్యత తీసుకోవాలి. నిర్వహణ ఖర్చులతో పాటు, కొత్త పుస్తకాల సేకరణ, వాటిని భద్రపరచటానికి సదుపాయాలు, డిజిటైజ్ అయిన కంటెంట్ రక్షణ, నిర్వహణ -, పరిశోధనలకోసం, కథలపట్ల ప్రేమతో వచ్చేవారికి సదుపాయాలు కలిపించడం, అవసరమైన వాళ్లకి కాపీలు పంపడం, అందుకు అవసరమైన మనుషులను సమకూర్చడం — ఇలాటి అవసరాలను తీర్చగలగాలి.

కథల్ని కాపాడుకోవడమంటే మన చరిత్ర ఆనవాళ్ళని కాపాడుకోవడమే. ఇప్పటిదాకా కథానిలయం టీమ్ తన పరిమిత వనరులతో అద్భుతమే సృష్టించింది. అలాటి అపురూపమైన ప్రయోగాన్ని కాపాడుకోవడం తెలుగు సాహిత్య అభిమానులపై వున్నది.

*

కూర్మనాథ్

1 comment

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

  • కారా మాస్టారు చూపిన కథా కార్యశాలను గూర్చి,దాని అంతిమ లక్ష్యం కోసం గూటాల కృష్ణమూర్తి గారు చూపిన అంకితభావాన్ని మీ వ్యాసంలో అద్భుతంగా ఆవిష్కరించారు.బాగుంది కూర్మనాథ్ గారు. అభినందనలు.

‘సారంగ’ కోసం మీ రచన పంపే ముందు ఫార్మాటింగ్ ఎలా ఉండాలో ఈ పేజీ లో చూడండి: Saaranga Formatting Guidelines.

పాఠకుల అభిప్రాయాలు