ఎవరు ఎవరికి ఏమౌతున్నారు?

దేవా…
ఈ చోటున
ఇప్పుడు…
వేదనలేవీ నా కంటబడటం లేదు
దుఃఖాలు
ఓటములు
ఏవీ నా చుట్టూ తండ్లాడటం లేదు
అపరాత్రి వరకూ ఆగి
నిన్ను కలుసుకుని
నా లోలోపలి గుహలేవో నీ ముందు తెరచిపెట్టి
కాసిన్ని అక్షరాలుగా మారే చింతనల చితులు
నా దగ్గరిప్పుడు లేనేలేవు…
ఎవరు ఎవరికి ఏమౌతున్నారు?
ఎవరిని ఎవరు మార్చాలని చూస్తున్నారు?
ఎవరిలా ఎవరు మారి ఎవరిని ఏమారుస్తున్నారు?
ఎవరిని ఎవరు హతమారుస్తున్నారు?
ఈ వాదనలన్నీ నాకిప్పుడు అనవసరం
ఈ వేదాలేవీ నా కొరకూ కానివన్నవి నాకు అవగతం
ఎవరు యుద్ధానికి ప్రారంభ సూచికలిస్తున్నారో
ఎవరు ఆజ్యం పోస్తున్నారో
అవాంతరాల తాళాలు వేసేదెవరో ,
అజ్ఞాతాన నిలిచి తానా తందనలు ఆడేదెవరో
తనది కాని యుద్ధాన తనమానాలు కోల్పోతున్నదెవరో
గెలుపూసులేని యుద్ధంలో
విజేయులై అజేయులై పరాజితులై
పరాన్నులై నింగికెవరు ఎగిసిపోతున్నారో
ఆత్మలెక్కడికి బదిలీ కాబడుతున్నాయో….
యుద్ధము-
ఎవరికోసమో
ఎందుకోసమో
యుద్ధమెక్కడిదో
ఎలాంటిదో
నాకివి నిమిత్తాలు…
పైగా అప్రస్తుతాలు-
దేవా…
నేను నిశ్శబ్దాన్ని జయించలేకపోవచ్చు
మరణాన్ని మోహించగలను
ఉదయపు దిక్కులకు సమాధానానవ్వలేకపోవచ్చు
చీకటి చందనాన్ని ఆస్వాదించగలను
వైషమ్యాల వాకిటి తలుపులను మూయలేకపోవచ్చును కానీ
ఏ విద్వేషాల జాడలపై నడవను
ఏ ఇరుసూ ఇరుకుల మధ్యకు జారను
ఊపిరికీ
ఉరికీ
మధ్య లోలకాన్నై వేలాడుతూ
కాంక్షకూ
తృప్తికీ
నడుమ రాయబారాన్ని నడిపిస్తూ
నాతో నన్ను విభేదించుకుంటూ
నాలో నన్ను అన్వయించుకుంటూ
నేనిక పోరాటమవ్వను
పొందని దానిని పోగొట్టుకోను
నేను –
పోగొట్టుకోలేని దానికై ఆరాటపడను
*

సుధా మురళి

Add comment

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

‘సారంగ’ కోసం మీ రచన పంపే ముందు ఫార్మాటింగ్ ఎలా ఉండాలో ఈ పేజీ లో చూడండి: Saaranga Formatting Guidelines.

పాఠకుల అభిప్రాయాలు