ఊర్మిళ కవితలు రెండు

1

నీలి మేఘం

ఏ మేఘాన్ని

ఏ గాలి అడ్డుకుందో మరి

 

ఆ పక్క

నీ వైపు

జడివాన సవ్వడి అన్నావు

 

ఆకాశానికి మోము ఉంచి

రెండు చేతులు చాచి ఉంచా

చిరుజల్లులైనా నా వైపు

ఇటు పక్క

వొంపుతావని

 

కమ్ముకు వచ్చే నిదురను

అరచేత ఆపివుంచా

 

గడియ గడియ కు

పరదా తొలగించి చూస్తూనే…వున్నా

ఏ మబ్బు అయినా

మలుపు తిరుగుతుందేమో అని

 

ఉహు…

మల్లె పూల తెలుపును

అద్దుకున్న వెన్నెలనే

నేలంతా పరుచుకొని

 

అయినా సరే

 

ఏ దిక్కు

నీ అడుగు జాడలో అని

అన్ని దిశల్లో

నక్షత్రాలను వేలాడదీశా

 

దారి తడబడ కూడదనో

భయం తో చీకటనీ

వెనుతిరగకూడదనో

 

వస్తానన్న  సమయాలన్నీ

ఎర్ర అంచు తెల్ల చీర

కొంగులో ముడివేసి

నీ ముందు గుమ్మరించాలనే..

 

ఇక నీవు రావని

 

తెల్లవారి వెలుగులో

నేనే నీ గది తలుపు తట్టా

 

రావాలన్నా

 

నేను

రాలేని కథలను

అడ్డుకున్న మలుపులను

చూపించాలని

 

తలుపులు చేరవేసే ఉన్నాయి

 

బల్లపై తల వాల్చి

గోడపై పాకే బల్లి ని కదా చూస్తూ…

వెనుతిరగకుండానే

 

“నీకు తుది వాక్యం రాయడానికి

పదాలు వెతుకుతున్నా” అన్నావు..

 

తత్తర పడిన

మనసుకు

ఉరి కూడా

అవసరమా

ఇక

**

 

ఏకాకి

 

ఒంటరితనం

శిఖరం అంచుల్లో

వేలాడుతూ

 

ముందేమో

ఝింకరించే సంద్రం

వెనకేమో

నిషబ్ద అగాధం

చేతులు చాపితే

శున్యావరణం

 

నిరీక్షణ

 

ఎప్పుడూ

ఆశా నిరాశల

సయ్యా టే

చివరి మజిలీ

వీధి మలుపే

 

కరిగిపోతున్న రాత్రుల్లో

రంగురాళ్ల నేరుకుంటూ..

 

నీవంటావు

కలల సౌధానికి

నగిషీలు అద్దడానికని

 

కాలమంతా

బీడు బారాక

**

ఊర్మిళ

అస్తిత్వ నుడికారాన్ని కవిత్వంలోకి అలవోకగా అనువదిస్తున్న కవి ఊర్మిళ. "అంగార స్వప్నం" తో అత్యాధునిక స్త్రీ స్వరాన్ని కవిత్వంలోకి తీసుకువచ్చారు.

3 comments

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

  • ఏకాకి, నీలి మేఘం 👌👌👌❤️ ma’am,ధన్యవాదాలు . మంచి కవితలను,రాసినందుకు.

  • బావుంది. చివరి మజిలీ వీధి మలుపే

  • పోయమ్స్ చాలా బావున్నాయి…మేడం…

‘సారంగ’ కోసం మీ రచన పంపే ముందు ఫార్మాటింగ్ ఎలా ఉండాలో ఈ పేజీ లో చూడండి: Saaranga Formatting Guidelines.

పాఠకుల అభిప్రాయాలు