ఊబి

న్నగా నొప్పి. అందుకే అనుకుంటా మెళుకువ వస్త. కదపడానికి లేకుండా ఒక కాలికి ఒక చేతికి సిమెంట్ పట్టీలు.

అవును, నిన్ననే కదా ఆపరేషన్ చేసింది. సెడెటివ్స్ , పెయిన్ కిల్లర్స్ ఇచ్చినంత వరకూ బరువు తప్ప నొప్పి తెలియలేదు.

మొన్న సాయంత్రం … అవును స్నానం చేసేందుకు బాత్ రూమ్ లో ఉన్నాను.

ఎవరిదో ఫోన్. ఇంకా బకెట్ నిండలేదు కదా అని హడావిడిగా కాలు బయట పెట్టానో లేదో జర్రున జారా నున్నటి టైల్స్ పైన.ఎంత బాలెన్స్ చేసుకుందామని చూసినా ఆగలేకపోయాను. అక్కడికీ వెల్లకిలా పడితే తల దేనికో కొట్టుకుని ముక్కలై ఉండేది, పక్కకు పడిపోడం, అదీ కుడి వైపుకు పడటం వల్ల కుడి కాలు , కుడి చెయ్యి ఫ్రాక్చర్.

ఇంట్లో ఉండేది ఇద్దరమే, శివాని నేను. ఇద్దరమ్మాయిలూ అమెరికాలో పెద్ద ఉద్యోగాలు, పిల్లా పాపలతో బిజీ. ఆర్నెల్లు అక్కడ ఉండి వచ్చి గట్టిగా నెలరోజులు దాటలేదు.

శివాని వంటగదిలో ఉంది. పెద్ద చప్పుడు వింటూనే పరుగెత్తుకు వచ్చింది.

అప్పటికే లేవడానికి ప్రయత్నించినా నా వల్ల కాలేదు.

నాకు అర్ధమైంది, ఇది ఖాయంగా ఫ్రాక్చర్ అని.

నన్ను లేపడం తన వల్ల ఎక్కడ అవుతుంది. ఏదో చెప్పబోయే లోగానే నోట మాట రాలేదు , స్పృహ తప్పింది.

నలుగురినీ పిలిచి ఎలా మానేజ్ చేసిందో శివాని హాస్పిటల్ లో అడ్మిట్ చేసింది.

మొన్నంతా , నిన్న ఉదయం అన్ని పరీక్షలూ చేసి సాయంత్రం ఆపరేషన్ చేసారు.

విషయం తెలియగానే పిల్లలిద్దరూ కంగారు పడి పోయారు. రావడానికి సిద్ధమైపోయారు, శివానీ యే నచ్చజెప్పింది.

” అవసరం ఉంటే నేనే చెప్తానుగా రమ్మని, నేను మానేజ్ చెయ్యగలను. ఎవరో మీకు చెప్పడం కన్నా నేను చెప్పడం మంచిదని … అంతేరా. బెంగ పడకండి , ఇవ్వాళా రేఫు అన్ని సదుపయాలూ ఆసుపత్రి వాళ్ళే ఇస్తున్నారుగా …”

అవును శివానిలా ఎవరూ మానేజ్ చెయ్యలేరు.

అన్నట్టు నిన్ననగా శైలుకి మెస్సేజ్ పెట్టాను, ఏమైందో…

ఎడమ చేత్తో పక్కన వెతుక్కున్నాను. ఫోన్ నా పక్కనే ఉంది.

పక్కనే కుర్చీలో కూచునే నిద్రపోతోంది శివాని. మొహం వాడి పోయింది. ఏమైనా తిన్నదో లేదో.

ఈ రెండూ రోజులుగా ఎంత అలిసి పోయిందో …

ఎంత ఇన్స్యూరెన్స్ ఉన్నా హైరానానే కదా.. తట్టి లేపి పడుకోమని చెబ్దామని చూసాను, ఉహు చెయ్యి అందలేదు.

నిద్రలేపడం ఇష్టం లేక తంటాలుపడి ఫోన్ ఆన్ చేసాను.

శైలు మెస్సేజ్

” హోప్ యు ఆర్ ఇన్ హాస్పిటల్, రికవర్ సూన్”

*************

ఇంటికి వచ్చి వారం రోజులు గడిచింది. ఆరు వారాలు బెడ్ పైనే ఉండాలి.

అడపా దడపా పిల్లలు ఇద్దరూ కాల్ చేసి మాట్లాడుతూనే ఉన్నారు ఎప్పటెప్పటి విషయాలో గుర్తు చేస్తూ … నవ్విస్తూ …

శివానీకి శ్రమ ఎందుకని రోజంతా ఉండేలా ఒక అటెండర్ ని పెట్టుకున్నాము. అదీ పిల్లల సూచనే.

కాస్త శివానీకి వెసులు బాటు.

మంచం దిగలేక పోడం తప్ప మిగతా అంతా సజావుగానే సాగుతోంది. రేపు వరలక్ష్మీ వ్రతానికి కావలసినవి తెచ్చుకుందుకు శివాని పక్క వారితో కలిసి బజారుకు వెళ్ళింది.

శైల గుర్తుకు వచ్చింది, హాస్పిటల్ లో ఉండగానే మనసు ఆపుకోలేక ఒక సారి ఫోన్ చేసాను.

” సారీ బిజీ గాఉన్నాను, మళ్ళీ కాల్ చేస్తానులే,ఫ్రెండ్స్ వచ్చారు , వాళ్ళతో చట్నీస్ కి వచ్చాము ” అంది. జవాబివ్వకుండానే ఫోన్ కట్ చేసా..

మనసు చివుక్కుమంది.

కనీసం ఇంటికి వెళ్ళావా? ఎలా ఉన్నావు అని కూడా అడగలేదు.

పైగా ఫ్రెండ్స్ తో హోటల్ కి వెళ్ళి, ఎలా ఎంజాయ్ చెయ్యగలదు?

శైల చిన్నప్పటినుండీ తెలుసు, ఒకే వీధిలో ఉన్న కుటుంబాలు మావి.

అయిదుగురమ్మాయిల్లో కడగొట్టు పిల్ల. చిన్న రేకుల ఇంట్లో జీవనం.

అమ్మకు బాగా పరిచయం. అలా అలా నాకూ తెలుసు. చూడటానికి బాగానే ఉండేది. వయసులో ఉన్న అబ్సెషన్ వల్ల ఇష్టంగానే అనిపించేది.

ఎమ్ ఎస్ సీ లో ఉండగా కాబోలు. ఇంటర్ మూడు సార్లు ఫేలై టైప్ నేర్చుకుంటోంది . అక్కడ ఎలా పరిచయమో తెలియదు గాని రాజేశ్ ని పెళ్ళి చేసుకుందట. ఇంట్లో అదే గొడవ.

మొత్తనికి తిట్లూ చీవాట్లూ తిని అతనితో వెళ్ళిపోయింది.

ఆ తరువాత నాచదువు ఉద్యోగం తిరిగి తిరిగి ఏ పది పదిహేనేళ్ళకు అనుకుంటాను హఠాత్తుగా కనిపించింది.

వయసు ఏ మాత్రం ప్రభావం చూపలేదు. అంత క్రితం ఎలా ఉందో ఇప్పుడూ అలానే వుంది.

ఎక్కడో చిన్న ఉద్యోగం చేసుకుంటోంది.

ఒక కొడుకని మాత్రం చెప్పింది.

మళ్ళీ స్నేహంతో పాటు ఒక రకం అబ్సెషన్ కూడా పుంజుకుంది.

అప్పటికే నా పెళ్ళి శివానీతో జరిగింది. ఇద్దరు పాపలు కూడా.

ఏ బలహీన క్షణం లోనో శైలు గుప్పిట్లోకి వెళ్ళిపోయాను.

నా వల్ల సాధ్యమైనంత సాయపడ్డాను, పడుతూనే ఉన్నాను. మంచి ఉద్యోగం ఇప్పించాను. ఇల్లుకొంటున్నానంటే అంతో ఇంతో సాయం చేసాను.

మధ్యలో ఎప్పుడో ఒకరోజున అడిగింది,

“మనం పెళ్ళిచేసుకుందాం , శివానికి డైవోర్స్ ఇచ్చెయ్యరాదూ “..నా తల గిర్రున తిరిగింది.

“ఏం మాట్లాడుతున్నావు ?”అన్నాను.

“నలుగురూ నాలుగు రకాలుగా అనుకోడం నాకు బాలేదు … కనీసం నా తృప్తి కోసం…”

నా నుండి జవాబు రాకపోయే సరికి ” పోనీలే జస్ట్ మంగళ సూత్రాలు కొనివ్వు చాలు …” అంది.

మాటల మధ్య అప్పుడూ ఇప్పుడూ చెప్పినదాన్ని బట్టి పెళ్ళైన రెండేళ్ళకే రాజేశ్ ఎక్కడికో పారిపోయాడట,

’వాడొక రోగ్ , పోతే పోనీ ’ అంది.

కాని ఆ తరువాత తెలిసింది రాజేశ్ ని వదిలేసి నన్ను కలుసుకునే ముందు ఆవిడ లివింగ్ టుగెదర్ కధ.

అలాగని దూరంగా ఉందామన్నా భయమే. ఎక్కడ నడిబజారు లోకి ఈడుస్తుందో నని.

ఒకసారి అలాగే శివానికి మలేరియా వచ్చి పదిరోజులు ఇల్లు కదల్లేదు.

ఫోన్ చేసి జాడించి పారేసింది, ” ఆ లంజ ముండ నిన్ను కదలనివ్వట్లేదా? దాని కూతుళ్ళు వద్దన్నారా? నాశనమైపోతారు ” అంటూ

హడలిపోయాను.

ఒళ్ళంతా చమటలు పట్టేసాయి.

శివానికి శైలు సంగతి కొంత తెలుసు , కొంత తెలియదు, చిన్నప్పటి నేస్తం కదా , ఒక్కత్తీ ఉంటుంది. మంచీ చెడూ చూడాలి కదా అనే వాణ్ణీ..

అరేడేళ్ళ క్రితం పిల్లల పెళ్ళిళ్ళూ అయి వాళ్ళు అమెరికా వెళ్ళిపోయాక ఉన్నట్టుండి ఒకరోజున నన్ను అల్లుకు పోయి బావురు మంది శివాని.

నిజానికి పొడుగాటి వాలుజడ. చక్కని కళ ఉన్న మొహం ఛామన చాయే అయినా ఇట్టే ఆకర్షించే మెతకదనం — శివాని పట్ల నాకెలాటి అసంతృప్తీ లేదు.

కాదంటే అదంతే.

ఒక బలహీన సమయంలో ఆ ఊబిలోకి దిగిపోయాను. అది ఊబి అని అప్పుడు తెలియదు.

” మీరు తప్ప నాకు ఇంకో లోకం తెలియదు. చావైనా బ్రతుకైనా మీతోనే. నన్ను వదిలెయ్యరుగా?” వెక్కిళ్ళు పెడుతూ అడిగింది.

“ఎందుకు శివానీ నీకిప్పుడీ అనుమానం?” తొట్రు పడ్డాను.

” నాకు అంతా తెలుసండీ. మీ గురించీ శైలు గురించీ. అయినా తెలుసని చెప్పి మీరు గిల్టీగా ఉండటం బాగుండదనే చెప్ప లేదు.

బయట అందరికీ మీరే తన భర్త అని చెప్పుకుంటుందనీ తెలుసు. నా కెందుకు లెమ్మని ఊరుకున్నాను.

ఇప్పుడు పిల్లలు కూడా వెళ్ళిపోయాక … మనసులో ఏదో భయం.”

శివాని గుండెల మీద మంగళ సూత్రాలు చేతుల్లోకి తీసుకున్నాను,

” వీటి మీద ఒట్టు శివానీ ఒక్క రోజు కూడా నీకు దూరంగా ఉండను” అన్నాను చెమర్చిన కళ్ళతో.

అదే మాట శైలుకీ చెప్పాను.

అదిగో అది మొదలు.

కక్ష సాధింపు చర్యలా తిట్లూ దండకాలూ…

ఒక సాడిస్ట్ లా సాధింపు.

ఇప్పుడిలా మంచం మీద కదల్లేకుండా ఉన్నా ఒక్క పరామర్శా లేదు.

చాలా సేపు ఫోన్ పట్టుకునే ఉన్నాను. కాల్ చెయ్యాలా వద్దా అన్న సందిగ్ధం లో..

ఊబిలో ఇరుక్కుపోయి ఎలా బయటకు రాగలను?

చివరకు నేనే కాల్ చేసాను.

” హలో … విన్నాను, ఆరు వారలు బెడ్ మీద ఉండాలట కదా .. థాంక్ గాడ్ ఇక్కడ పడిపోలేదు… నయం… ” ఆమె తియ్యని స్వరం చేదుగా అనిపించింది.

హలో హలో … విననట్టుగా ఫోన్ పక్కన పెట్టేసాను.

ఎప్పుడు వచ్చిందో శివావి, నా మొహం చేతుల్లోకి తీసుకుని జుట్టు సవరిస్తూ -” వర్రీ అవకండి. అన్నీ సర్దుకుంతాయి” అంది.

నా కాలు ఇంకా ఒకటి ఊబిలోనే ఉంది.

స్వాతీ శ్రీపాద

Add comment

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

‘సారంగ’ కోసం మీ రచన పంపే ముందు ఫార్మాటింగ్ ఎలా ఉండాలో ఈ పేజీ లో చూడండి: Saaranga Formatting Guidelines.

పాఠకుల అభిప్రాయాలు