ఈ కథా సంపుటి ప్రజావైద్యశాల. ఇతడు ప్రజా వైద్యుడు…

న్వీక్షికీ ప్రచురణల వాళ్ళే కొత్త కథకుల పుస్తకాలు ఎందుకు వేయగలుగుతున్నారు ? ఇదీ నన్ను ఈ పుస్తకం చదివేందుకు పురిగొల్పిన అసలు విషయం. శీలం సురేంద్ర పార్వేట, నాగేంద్ర కాశి నల్లవంతెన, చరణ్ పరిమి కేరాఫ్ బావార్చి  ….ఇలా ఈ లిస్టు చాలా పొడుగ్గా కనబడుతుంది నాకు. చక్కటి కథా సంపుటులతో వీళ్ళు కొత్త కథకులని సాహిత్య ప్రపంచానికి పరిచయం చేస్తున్న క్రమం చాలా ప్రేరణగా ఉంది. కథా గౌరవాన్ని మరింత ఇనుమడింపజేస్తున్నట్టుగా ఉంది. వెంకట్ ఈశ్వర్ కు ఈ యేటి ఫిబ్రవరి పదోతారీఖు కు ముప్పయ్యేళ్ళు నిండాయి. నెట్వర్క్ ఇంజినీర్ గా పని చేస్తున్నాడు. చిత్తూరు జిల్లా వాడు. మరి ఇంత చిన్న కుర్రాడికి ఆకలి గురించి, వేశ్యా వృత్తిలో ఉన్న ఇందుమతి గురించి, బిడ్డే ప్రపంచంగా బతికే తండ్రి గురించి– ఎలా తెలుసు. ఇలా రక రకాల విభిన్నమైన కథాంశాలతో, పాత్రలతో మనల్ని ఉక్కిరిబిక్కిరి చేయడం ఎలా సాధ్యపడింది ? ఈశ్వర్ కథలు ఇతివృత్తపరంగా చాలా సామాన్యమైనవి. చాలా వరకూ పాతవి. కానీ పాత బంగారం వంటివి.

సమాజం మనిషి జీవితాన్ని ప్రభావితం చేసే పద్దతి ఎవ్వరూ ఊహించలేడు. అదొక డైనమిక్ వ్యవహారం. కుటుంబాల్లో ఎవరు ఎలా ప్రవర్తిస్తారో, ఏ యే బంధాల మధ్య అవగాహన ఎలా రూపం మారుతుందో; ఆయా పరిణామాలన్నింటినీ గమనిస్తే ఒక కొత్త సామాజిక శాస్త్రమే కళ్ళ ముందు సాక్షాత్కరిస్తుంది. ఆ జీవన సారాంశం కథకుడి నోట్లోంచి చెప్పినా, అతని కథలోని పాత్రలు మాట్లాడినా; కాలంతో పాటు వచ్చిన మార్పులు అర్థం కావాలి. మార్పులు వెనుక సంఘర్షణ తెలియాలి. ఆ నలుగుడులో ఏ సిద్దాంతాలు ఎరుకపడతాయో లేదో తర్వాత సంగతి; పాఠకుడిగా అప్పటివరకూ తనకున్న ఆలోచనా విధానం పట్ల తనకే కొత్త స్పృహ కలగడం గమనించదగ్గది. అదీ ఆసక్తి తగ్గకుండా, విసుగు పుట్టించకుండా కథకుడు మనల్ని వశపరుచుకునే పద్దతి అసలు గొప్పదనం. వెంకట్ ఈశ్వర్ అంత చక్కటి కథలు రాశాడు.

మొత్తం పదిహేను కథలు. ఒక్కో కథా మనల్ని ఒక్కో అనుభవానికి గురి చేస్తుంది. ఇందుమతి అనే వేశ్యకి తనదగ్గరికి వచ్చిన పాతికమంది తనని పెళ్ళి చేసుకుంటానని చెప్పి మోసం చేశాక ఇరవై ఆరో వ్యక్తి కూడా అలానే మోసం చేయడమే ఇందుమతి ఇరవైఆరవ మరణం ఇతివృత్తం. ఇందులో కొత్తేముంది ? మనకి మల్లెపూవు సినిమాలో లక్ష్మి పాత్రో, మాయదారి మల్లిగాడు సినిమాలో జయంతి పాత్రో గుర్తుకు రావొచ్చు; లేదా ఓల్గా రాసిన మెహందీ స్త్రీల విజ్ఞప్తి కవితో గుర్తుకురావొచ్చు. జీవితమ్మీద విరక్తి చెందిన ప్రతీ వాడు అంతిమంగా స్త్రీ దగ్గరకి ఎందుకు రావాలనుకుంటాడో అర్థం కాదు. చచ్చే ముందు శారీరక సుఖం పొందే ఎందుకు చావాలనుకుంటాడో ఏ కథకుడూ చెప్పలేదు. ఈశ్వర్ కూడా చెప్పలేదు. అలాంటి ఒకతన్ని బ్రతికిస్తుంది ఇందుమతి. కానీ అతనూ సగటు మగవాడిలా ప్రవర్తించడమే ముగింపు. ఇందుమతికి కావల్సిన స్వచ్చమైన ప్రేమ ఇవ్వలేని మగవాణ్ణి ఇంకా ఈ సమాజంలో ఎవరు తయారు చేస్తున్నారు ? ఆ ప్రేమ కోసం ఇందుమతి పడే ఆరాటం ఎన్నాళ్ళుగా స్త్రీల అంతరంగాన్ని చిత్రిస్తోంది ? ఈ రెండు పాత్రలు ఏ పరిణామాలకి ప్రతిరూపాలు ? ఈశ్వర్ ఇందుమతి పాత్రను దు:ఖ పూరితం చేసిన పద్దతి మింగుడు పడదు. నియతి చుట్టూ తిరిగే కథగా భావించాలి దీన్ని.

అలాంటిదే ఆకలి యుగంలో ఒక రోజు కథ. వర్షంలో సాంబయ్య అనే వ్యక్తి తన పిల్లలకి తిండి పెట్టలేక వంట చెరుకు కోసం అడవిలోకి వెళ్ళినవాడు కాస్తా నక్సలైటు గా పొరబడ్డంతో పోలీసుల చేతిలో హతమైపోతాడు. అదే వర్షపు రాత్రి ఒక కాకీ తన పిల్లల కోసం అదే ఆరాటం పడుతుంది. వేటగాడి ఉండేలు దెబ్బకి దొరికిపోతుంది. కథకుడు ఈ కథలో పిల్లల్ని, కాకి పిల్లల్ని ఒంటరి వాళ్ళని చేస్తాడు. పైగా వర్షానికి గూడూ గుడిసె రెండూ ఉంటాయో లేదో కూడా అనుమానం కలిగిస్తాడు. పాఠకుడిలో అలజడి రేపుతాడు. వర్షపు రాత్రి వాతావరణ చిత్రణ, అడవి నేపథ్య వర్ణన చాలా తాజాగా ఉంటాయి. డోలుబాబా కథ గానీ, గోరువెచ్చని కన్నీరు కథ గానీ అదేవిధంగా కరుణ రస ప్రధానంగానే ఉంటాయి. రంగడనే డోలుబాబా ఒక నాటకాలాడే సుభద్రని ప్రేమించి పెళ్ళి చేసుకున్నాక ఆమె ఒక డాక్టర్ తో లేచి వెళ్ళిపోతుంది. ఎవ్వరూ లేని రంగడు గుండె పగిలేలా ఏడుస్తాడు. రోడ్డు పక్కనే చనిపోతాడు. సుభద్ర లాంటి స్త్రీలెందుకున్నారు ఈ సమాజంలో ? ఏ దిక్కూ లేని ఆమెను చేరదీసి ప్రేమించడమే రంగడు చేసిన తప్పా ? పోలీసులకి నక్సలైట్లెవరో సామాన్యులెవరో ఎందుకు తెలియడం లేదు ?

గోరు వెచ్చని కన్నీరు కథలోనూ అంతే. మల్లి అనే పాత్ర మన హృదయాల్ని మెలిపెడుతుంది. మల్లికి రాములుకి పెళ్ళయ్యాక సంతోషంగానే ఉంటారు. కానీ పెళ్ళైన కొద్ది నెలలకే రాములు గుండె నొప్పి వచ్చి చనిపోతాడు. అతని శవాన్ని తీసుకుపోతుండగా “అప్యాయంగా తన మూడు నెలల కడుపు తడుముకుంటూ మౌనంగా ఏడ్చిందామె. అది ఏడుపు కాదు. రోదన” అని ముగిస్తాడు రచయిత. గుండె జబ్బు ఉన్న సంగతి చెప్పకుండా పెళ్ళి చేసి మల్లి దు:ఖానికి కారణమయ్యిన మనిషిని ఏమనాలి ? ఎవరి వల్ల ఎవరు బలైపోతున్నారు ?

ఇలా ప్రతీ కథ ఒక ఆలోచనని రేపే కథ. మనల్ని అంతర్యుద్ధానికి గురి చేసే కథ. ఈ కథల్లోని మనవీయ స్పందనలు అతి సహజంగా చిత్రితమవుతాయి. ముందు మాట రాసిన శ్రీనివాస్ గౌడ్ అన్నట్టు ‘ఈ పాత్రలు అధోజగత్ జీవులు. గెలవలేక డీల పడిన అభాగ్యులు”. నూటికి నూరు పాళ్ళూ అతని పరిశీలన నిజం. ఈ కథలన్నీ అట్టడుగున పడి నలిగిపోతున్న సామాన్య మైన మనుషుల జీవితాల్లోని ఎత్తు పల్లాలు. భరించలేని వేదనలు. ఏడుపులు పెడబొబ్బలు. ఆశ నిరాశలు. కానీ కథకుడు వీటిని మన ముందుకు తెచ్చిన విధానం, నేర్పు ఎంతైనా చెప్పుకోదగ్గది. అదే అతడి ప్రతిభ కూడాను. కథాంశాన్ని అతను మలిచే పద్దతిలో అతని హృదయం తెలిసి వస్తుంది. అతనికున్న చూపు అందరికీ ఉంటే సమాజాన్ని ప్రతి ఒక్కరూ ఎంత సున్నితంగా చూద్దురు ? ఎంత బాధ్యతగా చూద్దురు కదా అనిపిస్తుంది. కథల్లోని ఆర్తి చాలా గొప్పగా ఉంటుంది. ఒక నెల భార్యకి పీరియడ్స్ మిస్సైన విషయం తెలిసినప్పటి నుంచి ఒక నిరుపేద కథానాయకుడు ఆమె గర్భాన్ని ఎలా విచ్చిన్నం చేయాలో ఆలోచిస్తూ సాగిన కథ. చాలా బాధ కలిగిస్తుంది. అరె పిల్లల్ని ఇలా కూడా కాదనుకుంటారా ? పిల్లలు కలగక దు:ఖించే జంటల్ని చూసినప్పుడు ఈలాంటి వారిని పోల్చుకున్నప్పుడు ఏది ఎవరికి ఎప్పుడు ఎంత ఆనందాన్ని కలిగించే విషయమో నిర్ధారించడం తేలిక కాదనిపిస్తుంది. ఆఖరుకి తన భార్యకి పీరియడ్స్ రావడంతో భర్త ఊపిరిపీల్చుకుంటాడు. అతను బొప్పాయి కాయ్ బేరమాడేప్పుడు అతని ఆలోచనలు పరిగెట్టిన తీరు చదివి తీరాలి. ఇదంతా రుతుపవన కథాంశం. ఇంకా చాలా మంచి కథలున్నాయి. సీతాపతి మామూలు కథ. జీనా యహా మర్నా యహా, యక్షప్రశ్న కథలు కూడా. అయితే కథకుడి ఊహా లోకం వాస్తవాల్ని వక్రీకరించకుండా పాత్రల్ని మన ముందుకు తేవడం అసలు కిటుకు. అబ్బా ఇవన్నీ రోజూ ఉండే బాధలేగా అనిపించవచ్చు మనకి. కానీ రోజువారీలోంచి జాగ్రత్త చేసుకోవాల్సిన అపురూపమైన అనుభవాల్ని మనకి పరిచయం చేస్తాడు వెంకట్ ఈశ్వర్.

కథల్లో కనబడవు కానీ చాలా సామాజిక ఆర్థిక అంశాలు దాగి ఉంటాయి. వాటి మధ్య పెనుగులాట ఉంటుంది. పెట్టుబడిదారీతనం, దాన్ని భరించలేని దారిద్ర్యం. పైగా అతి సామాన్య జీవితపు వెలుగు నీడలు ఎంత ఆలోచింపజేస్తాయో, సామాజిక స్థితిగతుల్ని మనిషి ఎదుర్కునే క్రమంలో ఉండే దౌర్భల్యం మనల్ని అంతకుమించి అతలాకుతలం చేస్తుంది. ఎవర్నీ తప్పు బట్టలేము. జీవితాల్లో ఈ అస్తవ్యస్తాలన్నీ డబ్బు వలనేనా ? పేదరికమూ, నిస్సహయాత వల్లనేనా ? కథకుడు అన్ని కథల్లో ఇచ్చిన దు:ఖ పూరితమైన ముగింపులకి ఈ సమాజంలో ఉన్న అసమానతలు, బేలతనమే కారణమా ? అనిపిస్తుంది. ఒక్కటీ హాయిగొలిపే ముగింపు ఉండదు. రచయిత దీనివల్ల ఏం చెప్పదలుచుకున్నాడు ? జీవితం రెండు కాళ్ళమీద మాత్రమే నడవట్లేదురా నాయనా అని చెప్పదలుచుకున్నాడు. కలిమిలేములే కాదు వాటిని అవగాహన చేసుకోలేని అమాయకత్వం నిస్సహాయతా కూడా కారణమంటాడు. ఒక రాహిత్యాన్ని ఎరుక పరుస్తాడు. అది ప్రేమ గావచ్చు, దయ గావచ్చు ఇంకోటి గావచ్చు. మానవ స్వభావంలో ఉండే హెచ్చు తగ్గుల్ని కథలు ఆవిష్కరిస్తున్నప్పుడు బీదరికమూ, హింసాప్రవృత్తి, అత్యాచారమూ ఇత్యాది సామాజిక రుగ్మతల మూలాలు తెలిసి వస్తాయి. అబద్దపు బాణం లో సత్యం విలువ తెలిసి వస్తుంది. పచ్చబొట్టు కథలో పా అంటే తను ప్రేమించిన పావని కాదు, అవ్వ పార్వతి అని తన భార్య రాధికకి కథలోని హీరో అబద్దం చెబుతాడు. నిజం చేయగల విధ్వంసం ఊహకొస్తుంది.

కాలం రాసిన కథనం, విక్రమూర్ఖుడు శైలీ పరంగా మెచ్చుకోదగ్గ కథలు. మంత్రవాస్తవికత ఛాయలు కనిపిస్తాయి కానీ కాదు. రచయిత ఆ ప్రయత్నమైతే చేస్తాడు. కల్పనకి వాస్తవికతకీ మధ్య గల సన్నని పొర తొలగించలేకపోవడమే ఇందుక్కారణంగా అనిపిస్తుంది. వాస్తవిక పరిస్తితులతో వాస్తవికంగానే అల్లబడ్డాయీ కథలు. ఈ రచనా పద్దతిలో పరికరాలన్నీ కథకుడి కళ్ళముందటి పరిశీలనలే. వాటిని కలిపి కథ చెప్పే నిపుణతే అసలు మాయా మర్మం. కథల్లో ప్రాంతాల ప్రస్తావన లేదు. రాజకీయాల గోల లేదు. సున్నితమైన రాగద్వేషాలున్నాయి. సుఖదు:ఖాలున్నాయి. ఈ రచయిత మధ్యతరగతి, ఉన్నత వర్గాలు కాదు, దిగువ తరగతి బ్రతుకుల అపసవ్యతలన్నీ పరీక్షిస్తున్న సామాజిక వైద్యుడు. ఈ పుస్తకం ప్రజావైద్యశాల. వెంకట్ ఈశ్వర్ పాఠకుల మానసిక ఆరోగ్యం పట్ల శ్రద్ద గలిగిన వాడు. బాధ్యత కలిగిన వాడు. లేకపోతే ఈ కథల్ని రాయలేడు. జీవితం వేసే ఇన్నేసి యక్షప్రశ్నలకి ఈ కథలు జవాబు చెప్పగలిగేవి కాదు. రాయలసీమ కన్న మరో ఆణిముత్యం ఈ రచయిత. అన్వీక్షకీ వాళ్ళకి సహృదయ వందనాలు.

యక్షప్రశ్న (కథలు) రచన : వెంకట్ ఈశ్వర్, పేజీలు: 1140, వెల : రూ. 175, ప్రతులకు: అన్వీక్షకి ప్రచురణలు, 9705972222

శ్రీరామ్ పుప్పాల

ఈ తరం కుర్రాళ్ళలో శ్రీరాం కవిత్వాన్నీ, విమర్శనీ సమానంగా గుండెలకు హత్తుకున్నవాడు. అద్వంద్వం (2018) అనే కవితా సంపుటితో పాటు, బీమాకోరేగావ్ కేసు నేపథ్యంగా 1818 (2022) అనే దీర్ఘ కవితని ప్రచురించాడు. తనదైన సునిశిత దృష్టితో వందేళ్ళ వచన కవితా వికాసాన్ని 'కవితా ఓ కవితా' శీర్షికన అనేక వ్యాసాలుగా రాస్తున్నాడు. ఆ వ్యాస సంకలనం త్వరలో రావలసి ఉంది.

3 comments

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

  • చక్కటి విశ్లేషణ. పుస్తకం వెంటనే తెప్పించుకుని చదవడానికి ప్రేరేపించే సమీక్ష.

  • మంచి మార్కులు తెచ్చుకున్న ఈశ్వర్ కి అభనందనలు. సమతుల్య సమీక్ష కి శ్రీరామ్ కి ధన్యవాదాలు

  • చాలా స్పష్టమైన ఎరుకతో రాస్తున్నారిప్పటి రచయితలు.మీ సమీక్ష బావుంది
    ఇరువురికి అభినందనలు

‘సారంగ’ కోసం మీ రచన పంపే ముందు ఫార్మాటింగ్ ఎలా ఉండాలో ఈ పేజీ లో చూడండి: Saaranga Formatting Guidelines.

పాఠకుల అభిప్రాయాలు