ఇది ఏం బ్రీడు…?

 “ఇదేం బ్రీడండీ?”

ఉదయం వాకింగ్ ట్రాక్ లో ఓ పెద్ద మనిషి ప్రశ్న. నువ్వు ఉలిక్కిపడతావు.

“అరేయ్… మీదే కులంరా?” అని మూడో తరగతిలో కృష్ణమూర్తి సార్ తరచుగా నిన్ను అడిగే ప్రశ్నతో మొదలైన ఉలికిపాటు అది.

“నాటు కుక్కేనండీ…”

“అబ్బే ఈ ఊరకుక్కలెందుకండీ! చిరాకు.”

“ఊర కాదు… నాటు!”

“ఆఁ తేడా ఏముందిలెండి?”

“నాటు అంటే ‘జాతి’… ఊర అంటే దాని ‘బతుకు’ అని నే అనుకుంటాను.”

“సరేలెండి మాస్టారు… మంచి బ్రీడ్ డాగ్ ను పెంచుకోవచ్చుగా అని… టౌన్ లో మేలు జాతివీ తక్కువకే దొరుకుతున్నాయట. ఆ మధ్య మా మనవడు ‘హచ్’ కుక్కపిల్లను తెచ్చాడు. పదిహేను వేలట. భలే వుందిలే!”

“హచ్చీ గిచ్చీ కాదండి.’పగ్ ‘ అంటారు దాని బ్రీడ్ ని”

నువ్వేదో క్లారిటీ యిచ్చి ఆయన వ్యానిటీని కొంచెం తగ్గిద్దామనుకున్నట్లున్నావు!

“హా… హా… ఆ మాత్రం తెలుసులేండి. ‘హచ్ డాగ్’ అంటేనే మీకెంటనే తడుతుందనీ!”

ఫేకింగ్ నాలెజ్ ఈజ్ ద ఆర్డర్ ఆఫ్ ద డే! నీకు మాత్రం ఎంత మండాలో అంతా మండింది.

“అంతా టాప్ బ్రీడ్ శునకాల్నే పెంచుకోవాలంటే మరి మన ఈ దేశవాళీ నాటు కుక్కల్నెవరు సాకాలండీ? అవెప్పటికీ ‘ఊరకుక్కలు’ గా పెంటకుప్పలెమ్మటే బతికేయాల్సిందేనా?”

భలే అడిగేశా… కాదు పొద్దున్నే ఆ పెద్దాయన్ని కడిగేశా-అని లోలోపలే సంబరపడతావు నువ్వు. ఎంతైనా మాజీ సోషలిస్ట్ వి కదా! నవీన నగర కులీన బూర్జువా’ అని ముద్రేశావు ఆయన మొహంమీద!

ఆ పెద్దమనిషి నీ వైపు వెర్రిగా చూస్తుంటాడు.

నీ చేతిలో కుక్కపిల్ల గుర్రుగా చూస్తుంటుంది.

* * *                                         * * *                                         * * *

అసలు ‘నువ్వూ-నీ నాటుకుక్క’ ముచ్చటేంటో తెలుసుకోటానికి మీ ఇంటి వాల్ క్లాక్ ముళ్లని బాగా వెనక్కి తిప్పేద్దాం. జీవితపు తీయదనాల్ని పూర్తిగా ఇంకా లోతుగా అనుభవించకముందే ఆ మొదనష్టపు చెక్కెరవ్యాధి నీ దేహపుదర్వాజ దగ్గరకొచ్చిందట… అదే అదే… ‘ప్రీ-డయాబెటిక్’ అని డాక్టరుగారు చెప్పేసరికి దెబ్బకు బెదిరిపోయి బద్దకాన్ని విసిరేసి ఇక రోజూ స్టేడియంలోకెళ్ళి శ్రీమతితో కలిసి ఆటలు, కసరత్తులు మొదలు పెట్టావు నువ్వు.

ఆ రోజు శివరాత్రి. రాత్రి జాగారానికి ఫిట్నెస్ కావాలిగా మరి. అందుకే సాయంత్రం కాస్త ఉప్మా బిర్రుగా పట్టించేసి, స్టేడియంకు వెళ్లి, కొద్దిసేపు షటిల్ ఆడి పక్కనే మినీపార్క్ ముందు బడలిక తీర్చుకుంటున్నారు నువ్వూ, నీ శ్రీమతి. అప్పుడు ఒక బొద్దు కుక్కపిల్ల మీ కాళ్ల సందుల్లోకి దూరి వెచ్చగా ఆడుకోసాగింది. ఆ దగ్గర్లో ఫెన్సింగ్ సందులో చల్లటి మరుగు చూసుకొని కొన్ని రోజుల క్రితం ఒక ఊరకుక్క నాలుగు పిల్లల్ని కన్నది. వస్తూపోతూ మీరు వాటిని గమనిస్తూ వున్నారు. ఆ పిల్లల్లో ఒకటే ఇప్పుడు మీ కాళ్ళ దగ్గర ఆడుకునే కుక్కపిల్ల. అది కొద్దిసేపాడి నడుము, మెడని బారుగా సాగదీసి నీ శ్రీమతి పాదాలపై హాయిగా తలవాల్చి పడుకుంది.

శ్రీమతి పొంగిపోయింది. అటువంటి ఘడియల్లోనే స్త్రీలోని అమ్మతనం ప్రేమమీగడలై కురిసేది. దాన్నిమృదువుగా చేతుల్లోకి తీసుకుని నీతో ఆమె అంటుంది.

“మనం యానిమల్ లవర్స్ అని భలే పసిగట్టేసిందండీ!”

“ఒకటా రెండా? ఎన్నింటిని సాకి వుంటావు ఇప్పటిదాకా!”

“దీన్ని మనం పెంచుకుందామండి.”

“వద్దు… నాటుకుక్క! నవ్వుతారేమో?”

(నీలోకూడా వున్నాడాయేంటి ఒక రేసిస్టు దాక్కొని!)

“నవ్విపోదురుగాక నా శంకరానికేమిటి సిగ్గు!”

“మధ్యలో వాడెవడు?”

“యిడిగో వీడే… ఈ నాటు భైరవుడే! శివరాత్రినాడు వచ్చాడుగా వొళ్లోకి… అందుకే ‘శంకర్’ అని పిలుద్దాం…”

“అబ్బో… యింకా నయం… అన్నప్రాసన కూడా చేయించేలావున్నావు. సరేలే రా పోదాం” అంటూనే నవ్వుతూ నువ్వు ఆ కుక్కపిల్లను దాని తల్లి గమనించకుండా బండి మీద కూర్చోబెట్టుకుని తెచ్చుకున్నావు.

“అరేయ్ చిన్నూ…. ఆ ‘బ్రౌనీ’ గాడి బౌల్ కబోర్ట్ లో సాసర్స్ పక్కనే ఉంది. యిటు పట్రా…” ఇంట్లోకి అడుగు పెడుతూనే ఆర్డరేసింది నీ శ్రీమతి.

బ్రౌనీ అనబడే ఆ అమెరికన్ ఎస్కిమో బ్రీడ్ పెట్ ని పద్దెనిమిదేళ్లుగా పెంచారు మీరు. నీ శ్రీమతి కొన్నేళ్ల క్రితం వాళ్ళింట్లో పెంపుడుకుక్కకు పుట్టిన పిల్లల్లో ఒకదాన్ని యింటికి తెచ్చింది. ముద్దుమురిపాల లవ్లీ పప్ అది. పొడవైన వింజామరల్లాంటి తన సిల్కీ ఫర్ తో నల్లపూసల్లాంటి పెద్ద కళ్ళతో ఆడుతుంటే ర్యాంప్ పై సోయగాలు పోతున్న తెల్లజాతి మోడల్ పిల్లలా అన్పించేది! అదంత క్యూట్ గా వున్నా ఒకరోజు నీ కాళ్ళదగ్గరకొచ్చి నీ వేళ్ళు నాకేసరికి నీకు మీ ఊరి ‘కొట్టెంకటి మామ’ గుర్తొచ్చి యమ ప్యానిక్ ఐపోయావు. ఒళ్ళంతా జలదరింపు కలిగి లాగి దాన్ని ఈడ్చి ఒక్క తన్ను తన్నావు!

చిన్నప్పుడు మీ ఊళ్లో ‘కొట్టెంకటి మామ’ అని ఊరంతా పిల్చుకునే చిల్లర కొట్టాయనకు ఎందుకో నువ్వంటే చాలా యిష్టం. రోజూ పొద్దున్నే నువ్వు బడికెళ్తుంటే దగ్గరకు పిల్చి “ఊఁ పట్టవోయ్” అని నీ దోసిళ్ళనిండా బెల్లం, శనగపప్పులు పోసేవాడాయన. తనోసారి బండిమీద సరుకులేసుకుని వస్తుంటే ఏదో ఊరకుక్క కరిచిందట. యిక తొలకరినాటికి మంచానపడ్డాడు. అసలు నిద్రపోయేవాడు కాదు. చిందులేస్తూ ఏదో వాగేవాడు. ఇంటి చుట్టూ గుర్రుగా అరుస్తూ తిరిగేవాడు. నురగలు కక్కేవాడు. దీపాలను, నీళ్ళను చూసి తీవ్ర ఉన్మత్తతతో మొత్తుకుంటూ ఒంటమీద సరిగా బట్టలు లేకుండానే బైటకు పరిగెత్తేవాడు. ఒక్కోసారి పట్టుకుని ఆయన్ని కొడుకులు నులక మంచానికి కట్టేస్తే అమాంతం మంచంతో సహా దిగ్గునలేచి తాను వయసులో వుండగా వేసిన సత్యహరిశ్చంద్ర నాటకంలో కాటికాపరి సీన్ లోని పద్యాలన్నీ ఊరూవాడ దద్దరిల్లేలా పాడేవాడు. చివరికది రెబీస్ వ్యాధి అని తేలింది. ఒళ్ళంతా పక్షవాతం కమ్మి ‘కొట్టెంకటి మామ’  ఘోరంగా మీ కళ్ళముందే కూలి ప్రాణాలు వదిలాడు. అప్పటినుండీ నీకు ఈ కుక్కలంటేనే భయం… మహా ఏవగింపు.

కుక్కపిల్లను నువ్వు తన్నగానే శ్రీమతి నీపై గయ్యిమని లేచింది. “ఆయన దగ్గరకెందుకెళ్లావురా పిచ్చి బ్రౌనీగా… ఆ మారుమూల మొరటూర్లో నాటుగా పెరిగిన ఆయనకేం తెలుస్తుందిరా మూగ ప్రాణుల ప్రేమ!”అంటూ నిన్ను బ్లేమ్ చేసింది. ఆ పెట్ ని గుండెలకు హత్తుకుని కన్నీరు కారుస్తూ రోజంతా దాన్ని ఓదారుస్తూనే ఉండిపోయింది. ‘ఓహ్… యిలాంటి మనుషులు ఉండబట్టే కదా ఈ కుక్కల్లాంటి మూగప్రాణులు ఇంకా ఈ నేలమీద మనగలుగుతున్నాయి…’ అని నువ్వు ఆ క్షణంలో ఆలోచనలో పడ్డావు. మెల్లగా మెల్లగా నీకు పెట్స్ పట్ల ‘సాఫ్ట్ కార్నర్’ మొదలై చివరికి నువ్వే ఓ హార్డ్ కోర్ ‘సినాఫిలిస్ట్’గా మారిపోయావు. ఆ అమెరికన్ ఎస్కిమో జాతి తెల్ల బొచ్చుకుక్కపిల్ల పద్దెనిమిదేళ్ళు మీ ఫ్యామిలీలో ఉండి మీ ప్రేమను నిండుగా పొంది, తన విశ్వాసాన్ని మెండుగా పంచుతూ ఉండగా ఒక ట్రాజెడీ జరిగింది. దానిని నీ బైక్ మీద ముందు కూర్చోబెట్టుకుని మీ దంపతులిద్దరూ ఒక రోజు బయటకు వెళ్తుంటే ఒక పల్సర్ పోరగాడు వెనకనుండి మిడిసిపాటుగా బండితోలుతూ మీకు గుద్దించేసి దొరక్కుండా పారిపోయాడు. బ్రౌనీ రోడ్డుపై జారిపడి తల నేలకు గుద్దుకొని దిమ్మతిరిగి ట్రాఫిక్ మధ్యలో ఎటెటో పరుగులు తీసి చివరికి అదృశ్యమైపోయింది. నువ్వు ఆర్నెల్లు వెతికించినా దొరకలేదు అది. ‘బ్రౌనీ’ మిస్సవటం వలన దీర్ఘకాలం మీ ఇంట్లో ఒకరిగా తిరుగుతూ ఓ నిండు మనిషి మరణిస్తే ఉండే విషాదమే మీ కుటుంబంలో చాలాకాలం కొనసాగింది. మనుషులు పోయారన్నా ఒక్కోసారి ఆర్తిగా స్పందించని నువ్వు మీ బ్రౌనీ గుర్తొచ్చినపుడల్లా కన్నీరు కార్చేస్తావు!

అలా మిస్సయిపోయిన బ్రౌనీ స్థానాన్ని ఇక మరే కుక్క కూడా భర్తీ చేయలేదని నువ్వు అనుకుంటుండగా నాటు దైనా ఈ కుక్కపిల్ల ‘శంకర్’ గాడు మీ అందరికీ బాగానే కనెక్ట్ అయింది. దాని ఆటాపాటా, అల్లరి చేష్టలూ చూసి మీ ఇంట్లో వాళ్లంతా మీకున్న ఇబ్బందులన్నీ తాత్కాలికంగా మర్చిపోతూ ఎంతో సాంత్వన పొందేవారు.

అంతా మంచిగానే నడుస్తుంది గానీ ‘శంకర్’ ఎదిగేకొద్దీ ఇంటాబయటా ఎవరికీ దాని అలవాట్లు నచ్చట్లేదు. నువ్వు మాత్రం దాన్ని తెచ్చిన కొత్తలో ఎంతగా ముద్దు చేసావో ఇప్పుడూ అంతే ప్రేమగా చూడాలని అనుకుంటున్నావు. ‘తరతరాలుగా వాటి మానాన వాటినొదిలేసి ఏ ఆదరణా, శిక్షణా ఎవరూ వాటికి యివ్వకపోతే ఈ నాటుకుక్కలకు ఆ కులీన పెడిగ్రీ జాతి కుక్కల కుదురుతనం ఎలా వస్తుంది? మన చుట్టూవున్న ప్రతి చిన్నాపెద్దా ప్రాణినీ మన నాగరికత రంగుల్లో చూస్తూ, మన ‘కల్చర్’ కొలబద్దతో వాటి గుణగణాల్ని ఎంచే మనుషులకు అసలీ ఊరకుక్క పిల్ల ఎలా నచ్చుతుంది?’ అనే ఉడుకుడుకు ప్రశ్నలు నీలో చిటపటలాడసాగాయి. అదీ బయటకు చెప్పాలని ఉంది నీకు. కానీ సమూహంలో నువ్వూ ఒకడివేగా!

ఈమధ్య నువ్వుమాత్రం ఇంకో మెట్టుఎక్కి ఇంట్లో కుక్కను కూడా మనిషితో సమానంగా చూసుకోవాలనే ‘అటిట్యూడ్’ కు కుదురుకున్నావు. అందుకే మీ కొత్త పెట్ ‘శంకర్’ కు ఇంట్లో అన్నింటిమీదా సమాన హక్కుభుక్తాలను, అమితమైన స్వేచ్చనీ ప్రసాదించేసావు! ఇదంతా నీ శ్రీమతి ప్రభావం వల్లనా? బహుశా నీ బతుకంతా కష్టాలతో ఏటికి ఎదురీదిన అనుభవాల వల్లనా? నీకు వయసు పెరుగుతూ ఉండటం వల్లనా? లేక ఆ ‘వగరు’ కోరుకునే ‘షుగరు’ జబ్బు ప్రభావమేమన్నా? ఏమో? ఏదైనా నీలోది నీకే తెలుస్తుంది!

ఇక శంకర్ సంగతి చూద్దాం! నిన్న మొన్నటి వరకూ పెద్ద స్పోర్ట్స్ గ్రౌండ్ లో దుబ్బమట్టిలో మిగతా ఊర కుక్కలతోపాటు వీర విహారాలు చేసిన ఆ కుక్కపిల్లకు ఒక్కసారే ఇంటితీరు ఎలా వంటబడుతుంది? యిక అది ఇంట్లోనే ఎక్కడబడితే అక్కడ ఒకటీ రెండూ వదిలేయటం మొదలు పెట్టింది. స్ట్ర్యాప్ పట్టుకుని బయటకు తీసికెళ్ళినా చేయదు. మళ్లీ ఇంట్లోకి రాగానే ఫ్లోర్ మీదనో, మ్యాట్స్ మీదనో పెంటలు పెట్టసాగింది. నీకూ ఇది చాలా వింత అన్పించింది! అదంతా కడగలేక ఎత్తలేక నీ శ్రీమతికి కూడా ఆఖరికి విసుగు మొదలైంది. ఓ నాలుగు వారాల తర్వాత ఒక ఉదయంపూట యిక ఉండబట్టలేక అనేసింది. “అబ్బబ్బా… అనవసరంగా తెచ్చామండీ దీన్ని… ఎంతయినా ఊరఊరేగా!” అని.

నువ్వేమూలనో హర్ట్ అయ్యావుగానీ అది ఆమెతో చెప్పుకోలేవు!

శంకర్ ఎదుగుతున్న కొద్దీ దానికో ‘పద్ధతి’ నేర్పట్లేదనేది అందరి ఏకాభిప్రాయం. దాన్ని కట్టిస్తే అసలు ఊరుకోదు. విపరీతంగా మొరుగుతుంది. లేదంటే స్ట్ర్యాప్ ను కొరికేసి తనను తాను విడిపించుకుంటుంది. దానికి ‘ఫ్రీడమ్ ఈజ్ ద స్వీటెస్ట్!’ మీకు పై పోర్షన్ లోనే ఉంటున్న ఇంటి ఓనర్ గారు దాని చికాకు చూసి అప్పటికే నీకు రెండు మూడు సార్లు హెచ్చరికలు జారీ చేసారు. “ఎందుకు సార్ ఈ కుక్కల గోల మీకు! ఇది బ్రౌనీలా కుదురుగా ఉండే రకంగాదు. అదీగాక ఊరకుక్కకు పుట్టిందాయె! ఎక్కడికి పోతాయి దాని బుద్ధులు?” అంటూ యింకా పెడిగ్రీ డాగ్స్ కు, మాంగ్రెల్స్ కు మధ్యనున్న ఎన్నెనో సామ్యభేదాలను చెపుతూ సుదీర్ఘ ఉపన్యాసం చేసారాయన. పాపం! నువ్వు ఆసాంతం ఓపిగ్గా విన్నావు. లేకుంటే ఇల్లు ఖాళీ చేయమంటే? అదీ నీ అసలు భయం!

మీ శంకర్ కు పళ్లతీట కూడా మహా జాస్తి! ఒకరోజు మీరంతా బయటికెళ్లారు… తిరిగొచ్చేసరికి… పాపం… నీ చిన్న కూతురు నెలపాటు ఎంతో కష్టపడి తయారు చేసుకున్న ఇంజినీరింగ్ గ్రాఫిక్ చార్ట్స్ ని, రెండు రికార్డ్స్ నీ లాగి కొరికేసి కుప్పలు బెట్టి వాటిపై ఆడుతోంది! నీ బిడ్డ అగ్గిగుగ్గిలమై చీపురుతో శంకర్ ను రెండు పీకింది. అంతేనా? “రోడ్డు మీది కుక్కల్ని ఇంట్లోకి తెచ్చిపెట్టుకుంటే యిలానే ఉంటుంది డాడీ! తెస్తే తెచ్చారు సరే! దాన్నెందుకంత గారాబం చేస్తారు?” అంటూ క్లాసు తీసుకుంది నీకూ, శ్రీమతికీ కూడా.

ఇంకో అన్ టు వార్డ్ సంఘటన… ఒక సోమవారం పొద్దున్నే ఎప్పటిలా రొటీన్ గానే సండే సాయంత్రం మిగిలిపోయిన బిర్యానీని వేడిచేసి పనిమనిషి శేషమ్మకు పెడితే ఆమె ఫ్రిజ్ పక్కన కింద కూర్చొని తింటుంది. యింతలో శంకర్ అమాంతం ఆమె ప్లేట్ మీదకు లంఘించింది. అది జారిపడి బిర్యానీ ఇల్లంతా చెల్లాచెదరుగా పడిపోయింది. నోటికాడ యిష్టమైన కూడు… ఎవరికైనా మండిపోద్దిగా మరి! ఐతే శేషమ్మ తిట్టేదేదో మామూలు మాటలైతే బాగుండేది. కాని తనూ జాతివాచకాలు వాడింది.

“ఓసినీ జాతి తక్కువ కుక్కముండా… ఎక్కడ నుండి తెచ్చారయ్యా ఈ ఊరదాన్ని! త్ఫూ… చీ…” అంటూ యింకేవో నాలుగు ‘స్ల్యాంగు’ లాడింది.

నీకంటే నీ భార్యకు శేషమ్మమీద చాలా ఎక్కువ కోపమొచ్చింది. ఆమె ఇంట్లో పిల్లల్నిగానీ, పెట్స్ ని గానీ బయటివాళ్లెవరైనా ఏదైనా అంటే అసలు ఊర్కోదు. సివంగిలా లేస్తుంది. కానీ ఏమన్నా అందామంటే పనిమనిషి వయసురీత్యా పెద్ద వయసుది. అదీగాక ఆవిడ రాకపోతే నీ యింటావిడ చేసుకోలేదు. డిపెండెన్సీ కదా! మజ్ బూరీ అప్నీ అప్నీ అన్నట్లు! అందుకే తను గమ్మునుండిపోయింది అని నువ్వు గమనించావు.

యిక మొన్నఆదివారం ఉదయాన్నే చుట్టు పక్కల అపార్టుమెంట్స్ లోని పిల్లలు మీరేదో వెరైటీ టైప్ కొత్త పప్పీని తెచ్చారని విని ఓ పటాలంలా కూడి మీ ఇంటికి కదిలొచ్చారు. వాళ్లు దాంతో కొద్ది సేపు ఆడారుగానీ అది మునుపటి మీ పెట్ బ్రౌనీలా క్యూట్ గా, వైట్ గా లేదని తెగ డిసప్పాయింట్ ఐపోయారు. వాళ్లలో ఎదుటి అపార్టుమెంట్ లో వుండే పూజారి గారబ్బాయి సాయి కూడా వున్నాడు. మహా ఒవర్ స్మార్ట్ వాడు!

“ఇది ఏం బ్రీడు అంకుల్?” శంకర్ గాడి ఒళ్ళు నిమురుతూ అడిగాడు సాయి.

“పగ్”

‘నాటు’ ది అని చెప్పటం నీకూ నామోషీయేమో! నీలోనూ ‘రేసిస్ట్ ఇన్ కాగ్నిటో’ ఉన్నాడనుకుంటాలే!’

“కాదంకుల్!” అని దాన్ని సవరదీస్తూనే నిశ్శంకగా డిసైడ్ చేసేసాడు సాయి.

“ఎట్లా చెప్తావోయ్ కాదని?” రెట్టిస్తూ అడుగుతావు నువ్వు.

“పగ్ కైతే… మరీ… ఫేసంతా లవ్లీలవ్లీగా ఫోల్డ్స్ ఉంటాయి… ఇంకా అంకుల్… దానికి స్కిన్ భలే స్మూత్ గా, సిల్కీ గా ఉంటుంది తెల్సా! చిన్ని బ్రష్ లాగా తోక కూడా ఉంటదంకుల్…” సాయి గ్రాఫిక్ గా చెప్పసాగాడు.

“అవున్రా సాయి… మా స్కూల్ గ్రౌండ్ లో ఇటువంటి పిల్లలే మస్తు కన్పిస్తాయి!” అంటూ సాయికి మద్దతు పలికాడు ఇంకొకడు.

మిగతా బడుద్దాయిలూ అదే కోరస్ లు అందుకున్నారు.

‘గాడ్! ఎలా తెలుస్తాయి చిన్నారులకూ ఈ జాతి భేదాలు? పెట్స్ వేనా?… మనుషులవీ కూడానా?’ అనుకుంటూ నువ్వు అవాక్కవుతావు.

యింతలో దానికేమయిందో ఏమోగానీ శంకర్ గుర్రుమని లేచి తన తల నిమురుతున్న సాయిని అతని లేత తొడమీద ఠక్కున తన వాడిపళ్లతో ఒక్క పట్టుపట్టి వదిలేసింది! ఇంక చూడాలి వాడి గోల… నీ గోల కూడా! వాళ్ల అమ్మానాన్నకు సర్దిచెప్పలేక ఎంత కిందామీదా పడాల్సివచ్చింది నువ్వు! ఇంకా పైపెచ్చు ఆ సాయి తండ్రి నీ అత్తామామలకు ‘ఫ్యామిలీ ఆస్ట్రాలజర్ కమ్ చీఫ్ స్పిరిచ్యుఅల్ మెంటర్’ కూడాను! దాంతో నీ శ్రీమతికీ మస్తు కోపమొచ్చి శంకర్ కు రెండు తగిలించింది కూడా.

యిక బిగ్గరగా తగులుకున్నారు అయ్యగారు!

“భలేవారు సార్ మీరు… లెక్చరర్ అయ్యుండీ మీరేంటి ఇలా దొమ్మరివాళ్ళలా ఊరజాతి కుక్కల్ని పెంచటం అదీనూ? అసలు మా సాయిగాణ్ణి అనాలి… న్యాస్టీ సన్నాసి వెధవ! ప్రొద్దున్నే లేవగానే ఆవిడగారి చెత్త మొహం చూడొద్దురా అంటే వినడాయె వీడు!”

వాళ్ళ యింటి బాల్కనీ గ్రిల్ వెనుక నుంచొని అటే చూస్తున్న అయ్యగారి అత్తగారికి ఆ మాటలు విన్పించాయనుకుంటా…. ఆమె అల్లుడివైపు ఉగ్రంగా చూస్తూ మొటికలు విరుస్తోంది! బాప్ రే! కత ఎటు తిరిగి ఎటుబోతుందోనని నీకు గుండెదడ మొదలైంది. వెంటనే నైతిక బాధ్యతగా సాయిని బండెక్కించుకుని నువ్వు హాస్పిటల్ కు బయలుదేరతావు. ఇక సాయికి ఏఆర్వీ వాక్సిన్ డోస్ ఉన్నరోజల్లా నువ్వు సెలవు పెట్టాల్సిఉంటుందని నీకు అర్థమైంది!

ఈ సంఘటన తర్వాత శంకర్ గాడి ‘గలీజు లేబరుతనం’ (ఇది నువ్వు కాకుండా మీ యింటా బయటా పదుగురాడిన మాట!) శృతి మించిపోతుందనీ, యిక దాన్నిఎవరికైనా ఇచ్చేసి వదిలించుకోవాలని ఓ చల్లటిపూట మీరు ‘రౌండ్ డైనింగ్ టేబుల్ కాన్ఫరెన్స్’ పెట్టుకుని డిసైడ్ చేసుకున్నారు… నువ్వు మాత్రం అయిష్టంగానైనా ఒప్పుకోవాల్సివచ్చింది!

“చిన్నూ… శంకర్ ను మీ కాలేజ్ లో ఎవరైనా పెంచుకుంటారేమో అడగరా”, అంటూ బాధతో మీ అమ్మాయిని అడుగుతావు.

“యిక సరేలే డాడీ! మా కాలేజ్ స్టూడెంట్స్ అంతా పోష్ ఫ్యామిలీస్… అంతా హై ప్రొఫైల్. వేలు ఖర్చుపెట్టి ‘కాస్ట్లీ బ్రీడ్’ లే పెంచుకుంటారు. దీన్ని చూస్తేనే తెగ నవ్వుతారు” అంటూ తేల్చిపారేసింది నీ బిడ్డ.

నువ్విక కార్యాచరణకు పూనుకున్నావు. దోస్తులకు, చుట్టాలకు ఫోన్లు చేసావు. శంకరును హై డెఫినిషన్ లో అందంగా క్లోజప్ ఫొటోలు తీసి చాలామందికి వాట్స్యాప్ చేసావు. ఐనా దాన్నిపెంచుకోటానికి ఎవరూ ముందుకు రాలేదు. నువు చాలా ఘోరంగా డిసప్పాయింట్ అవుతూ వున్నావు. ఆ సందర్భంలో ఈ విషయం గుర్తుచేసింది శ్రీమతి నీకు. అది… టౌన్ లో నీ స్నేహితుడొకడు ఎప్పటినుండో పెట్ షాప్ నడుపుతున్నాడని. హుటాహుటీన నువ్వు అతని షాపుకి వెళ్ళావు. ‘శ్రీ కల్కీ పెట్ సెంటర్ అండ్ బ్రీడింగ్ సర్వీసెస్’ అని ఆ షాప్ పేరుని చూసి నీలో నువ్వే నవ్వుకున్నావు! శంకర్ ను చూడగానే నీ మిత్రుడు భళ్ళున నవ్వేసాడు. ఫక్తు కమర్షియల్ అతగాడు! అతనికేం సెంటిమెంట్స్, కంప్యాజన్ లూ లేవు అని నీకూ తెలుసు. కానీ ఏదో ఆశ.

“ఏంట్రా నీ చాదస్తం! ఈ ఊరకుక్కపిల్లను నేనేం చేసుకోను? ఇలాంటివి లక్ష దొరుకుతాయి రోడ్డెమ్మట!” అంటూ మళ్ళీ మళ్ళీ భళ్ళుభళ్ళున నవ్వేస్తున్నాడు అతను.

“రోడ్డు మీద వదిలేస్తే పాపం కదరా! తీసుకుని ఎవరికైనా అప్పజెప్పరా. మెయింటనెన్స్ కింద ఎంతోకంత ముందే ఇచ్చేస్తారా!” అని బతిమిలాడావు.

“ఓర్నీ పిచ్చిగూలా! చెప్తే వినవు. దీన్నెవరూ తీసుకోర్రా బాబూ! పోనీ యిది ఎదిగిన తర్వాత క్రాసింగ్ కైనా పనికొస్తుందేమో అంటే అదీ లేదు! జెన్యూయిన్ పెడిగ్రీ ఫీమేల్ డాగ్స్ ఈ కంట్రీ కుక్కల్ని సహించవు! నీకెలా చెప్తే అర్థమవ్వుద్దో నాకర్థం కావట్లేదురా!” అంటూ కసిరింపుగా గొణిగాడు.

“నువ్వు మరీరా… యూ బ్లడీ అనెథికల్ స్పీసియిస్ట్!” అని అతన్ని తిట్టేసి బయటకొచ్చావు నువ్వు చాలా ఎమోషనల్ గా… ఆ వాడిన పదాలు అసలతనికి అప్లై అవుతాయో లేదో కూడా ఆలోచించకుండానే!

ఎవరికీ కొరగాని, ఎవరూ కోరుకోని ఆ మూగప్రాణిని మళ్లీ ఇంటికి పట్టుకొస్తున్నపుడు ఓ అరవై సెకన్ల పాటు నువ్వు ట్రాఫిక్ సిగ్నల్ దగ్గర ఆగినపుడు అది తలెత్తి చుట్టూ ఆగివున్న జనసముద్రం వైపు మార్చిమార్చి చూస్తుంది – ‘ఈ అనంతకోటి జీవనిర్జీవ పదార్ధాల మధ్య ఈ చిరుప్రాణికి ఏ చిరు హృదయంలో ఇసుమంత స్థానం లేదా?’ అని అది నిన్నడుగుతున్నట్లుగా నువ్వు ఊహించుకొని చలించిపోతావు. నువ్వు మీ కాలేజ్ లో బోధించే కోలరిడ్జ్ గారి ‘మ్యారినర్’ కవితలో ఆ పంక్తులు గుర్తొస్తాయి నీకు….

‘He prays well, who loves well

Both man and bird and beast’.

* * *                                         * * *                                         * * *

ఇంకో వారం గడిచిపోయింది.

ఒకరోజు సాయంత్రం నువ్వు ఇంటికి రాగానే “అబ్బ… ఈ కుక్కపిల్ల నాకు నరకం చూపిస్తుందండీ! మీకు తెలుసు… నాకసలే హెల్త్ బాగుండటం లేదని. కట్టేస్తే ఒకటే మూలుగుతుంది. తలుపులేసి ఇంటి ముందు వదిలేస్తే మెష్ లూ, తలుపులూ ఒకటే బాదుతుంది. మధ్యాన్నం అరగంటైనా రెస్ట్ తీసుకోనివ్వదు. మీరు ఇంట్లో బలాదూర్ గా తిరగటం అలవాటు చేసారు. అసలిదంతా  మీ గారాబం వల్లనే అండీ! దీన్నెక్కడుంచాలో అక్కడుంచటం రాదు మీకు!” అంటూ కఠినంగా కోపగించుకుంది నీ ఇల్లాలు. ఎన్నో కుక్కల్ని సాకిన ఆమెకే దానివల్ల అంత చిరాకేస్తే మరి మిగతావాళ్ళకెలాఉండాలి?

“ఇకాగు… మాట్లాడకు… అసలు నువ్వేగదనే హాయిగా ఆ గ్రౌండ్ లో ఆడుకునేదాన్ని పెంచుకుందామని అన్నది. నీ వల్లేగా నాకూ ఈ కుక్కలు పెంచే అలవాటు వచ్చిసచ్చింది!” అంటూ నువ్వూ కోపంగా ఆమె మీద గట్టిగా కసురుకున్నావు.

“సరేలేండి… ఐందేదో అయింది. దీన్ని మళ్లీ ఆ స్టేడియం గ్రౌండులోనే వదిలేసిరండి! మా వల్ల కానేకాదండీ దీని యమగోలను భరించటం…” దెబ్బకు విషయం తేల్చేసింది తను.

బిగ్ షాక్ నీకు మాత్రం! తాననుకున్నట్లు కుదురుగా పెరిగితేనే ఏ తల్లైనా బిడ్డల్ని ఆదరిస్తుంది. లేకపోతే ఆమె మనసూ విరిగిపోతుందని, బిడ్డల్నైనా దూరం పెట్టగలదని నీకు తెలుసు. ఇక ఈ చిన్ని కుక్కపిల్లెంతలే! కానీ నీకు మాత్రం మనసు కొట్టుమిట్టాడుతోంది… హృదయం ద్రవిస్తోంది. అక్కడ స్పోర్ట్స్ గ్రౌండ్ లో మూలన ఎండిపోయిన పొదల దాపున శంకర్ తల్లి, దాని చిన్నారి తముళ్ళు ఎవరో ఏదో పారేసిన ఎంగిలి ఏరుకుని తినటం, ఏవో ఎండు తోలు ముక్కలు, బొక్కలు, పేగుల్లాంటివి పీక్కొని లాక్కొని తినటం చూస్తూవున్నావు కొన్ని రోజులుగా. శంకర్ కు మాత్రం ఇక్కడ నీ యింట్లో ఏ లోటూ రానివట్లేదు నువ్వు… బిస్కెట్స్, మిల్క్ తో బ్రేక్ ఫాస్ట్, చికెన్ ఫ్ల్యావర్ పెడిగ్రీతో లంచ్, కమ్మటి పెరుగన్నంతో డిన్నర్, వారానికి రెండు సార్లయినా చికెన్ బోన్స్ తో సూప్, మధ్య మధ్యలోబ్రెడ్డు లేకుంటే గుడ్డు, అడపాదడపా మిగిలిపోయిన బిర్యానీతో విందు-పసందు… ఫ్యాన్ కిందనో, కూలర్ ముందునో చలువరాతి గచ్చుపై సుఖనిద్ర… అబ్బో ఏమి రాజభోగం! అంత సుఖంగా నిశ్చింతగా మీచెంత పెరుగుతున్న ఆ కూనను యింతగా ఆశపెట్టి మళ్లీ దానిని ఆ ఆకలిరాజ్యంలో విడిచిపెట్టటం చాలా దారుణం అని నువ్వు దీర్ఘంగా ఆలోచిస్తున్నావు.

యింతలో ఓ ఐడియా…. శంకర్ ను  గ్రౌండ్ లో వదిలేయటం కంటే మీ ఊర్లో ఎవరి దగ్గరైనా అప్పజెపితే బాగుంటుందనే ఆలోచన వచ్చింది నీకు. మీ సొంతూరిలో నీకున్న ఏకైక ఎకరం మెరకచేనుని ఎన్నోయేళ్లనుండీ సాగులోకి తేవాలని మహా కష్టపడుతున్న భగీరథ కృషీవలుడు వెంకట నారాయణకు ఫోన్ చేసి నీకొచ్చిన చిక్కును చెప్పుకున్నావు.

“భలే వుందిలే బాసూ… ఎతుకుతున్న తీగే కాలికి తగిలినట్లు… మనూళ్లో అమ్మాజీగారు గుర్తున్నారా? వాళ్ల చుట్టాలెవరో అమెరికా నుండి వచ్చి యిక్కడే పాతూర్లోనే ఆవిడగారి తోట కొనేసి పెద్ద బంగ్లా కట్టుకున్నార్లె. మన పెద్దెంకులు బాబాయ్ చెప్పాడు ఆ మధ్యన. కోతుల బెడద తట్టుకోలేక పోతున్నారట… అదీగాక పాతూర్లో కాస్త దొంగల బెడద కూడా వుంది. రెండు సీమ జాతి కుక్కల్ని పెంచుతున్నార్లే గానీ అవి ఉత్త షోకుకే…. కాపలారాదట వాటికి. కడుపు నిండా దొబ్బితినేసి కంటినిండా నిద్రలు పోతాయట… అందుకేనేమో మాంచి నాటు కుక్కపిల్ల కావాలని అడిగారట… మీరెంటనే దాన్ని పట్టుకొచ్చేయండి” అంటూ అతను నీకు తియ్యటి ఊరట కలిగించాడు.

ఒక్క నిమిషం కూడా ఆలస్యం చేయకుండా కాలేజికి సెలవుపెట్టి, శంకర్ గాడిని అత్తింటికి సాగనంపుతున్న ఆడబిడ్డకు చివరిసారిగా చల్దన్నం తినిపించినట్లుగా ఓ బిర్యానీ పొట్లం తెచ్చి, అది వేడివేడిగా కడుపారా తిన్నవెంటనే దానిని ముందు ట్యాంక్ సీటు మీద కూర్చోబెట్టుకుని అలాగే ఆగకుండా అరవై పైగా కిలోమీటర్లు ప్రయాణిస్తూ నీ సొంతూరుకు బయలుదేరావు.

నువ్వు శంకర్ ను వదిలించుకోటానికి సిద్ధమైన ఆ ఘడియల్లో నీ రెండు కాళ్లమధ్యలో వెచ్చగా కుదురుగా కూర్చొని ప్రయాణం మధ్యమధ్యలో ఆ మూగకూన మోరెత్తి నీ ముఖంలోకి చూస్తుంటే అది నడిరేయి తనను వదలి వెళ్ళిపోగా తెల్లవారు జామున దిగ్గున లేచి తండ్రి కోసం విలపించిన బుద్ధభగవానుని బిడ్డ రాహులుడిలాగానే నీకు కన్పించింది కదూ!

‘ఇంతకూ బుద్ధుని మహాభినిష్క్రమణం కేవలం దుఃఖభాజనులైన మానవుల కోసమేనా? ఓ ముసలిని, రోగిని, బైరాగిని, శవాన్ని చూసి చలించి విరాగుడై మానవ శోకపు అంకురమూలాలను శోధించటానికి వనాలకు తరలిపోయిన సిద్ధార్థునికి ఆయన పునరాగమనం కోసం నిరీక్షించిన ఆయన ముద్దుల గుర్రం ‘కంఠక’ గుండెలు పగిలిన చప్పుడు ఆయన చెవులని చేరలేదా? మనసుని తాకలేదా మరి?’ అని నీలో నువ్వే ఒక తాత్వికమైన ఉక్కిరిబిక్కిరికి గురవుతూ నీ ఊరు చేరతావు.

* * *                                         * * *                                         * * *

‘పెద్ద తోట – మధ్య కోట’ లా వున్న అమెరికన్ రాంచ్ స్టైల్ భవంతి.

దేవదారు ఫినిష్ ఆర్ట్ వర్క్ తో మెరుస్తున్న గోడలు, జిగేలుమంటున్న ఖరీదైన డెకర్ తో కళామంటపంలా వుంది బేస్ మెంట్.

అక్కడ నీ ఎదురుగా మహాఠివీగా పపాసన్ కేన్ చైర్ లో స్నేహలతా______!

ఆమె పేరుకి చివర ఆమె కాస్ట్ సఫిక్స్ ఉంది. అది నువ్వు చెప్పదల్చుకోలేదు. ఒకవేళ ఎవడైనా ఉబ్బాగక అడిగితే “అంతగా ఆసక్తి ఉంటే మీరే ఫిలిన్ ద బ్లాంక్ చేసుకోండి” అని అంటావు! మాకు తెలుసు!

నీ ఎదురుగా ఉన్న గోడమీద ‘మేమెప్పటికీ నీ వెనుకే ఉంటాం’ అన్నట్లు ఆమెకు వెనుకగా ఆమె కుటుంబ సభ్యులు, ఇంకొందరు అయినవాళ్ల ఫొటోలున్నాయి… చాలావాటికి దండలేసి!

నీ ముందున్న ఆ మగువను, ఆ ఫొటోలను మార్చి మార్చి చూస్తావు. ‘భలే… ఎంత బారు పెరిగింది! పిల్ల ప్రౌఢ ఐతే అంతేగా మరి!’ అని లోలోపట చిద్విలాసంగా అనుకుంటావు.

అప్పట్లో నీకు అవి కన్పించలేదు అని అనుకుంటావు… అవే… ఇప్పుడు ఆ ప్రౌఢ ముఖబింబంలో ఆమె తండ్రి, బాబాయిలు, మామయ్యలు, ఆమె అన్నలు, బావలు, బంధువులు, ఆమె తాత ముత్తాతలతో సహా… వాళ్ళంతా రంగురంగుల ప్రతిబింబాలుగా ప్రతిఫలిస్తున్నట్లుగా నీకు అన్పించసాగింది… అవి… చర చరా… గిర గిరా… భ్రమణాలు చేస్తూ నిన్ను మాత్రమే ఢీకొట్టటానికన్నట్లు అటుగా దూసుకొస్తున్న గ్రహ శకలాల్లా… మీ ఊరి నల్లచెరువులో నిన్నే చూస్తూ వెక్కిరిస్తున్నట్లుగా కదులుతూ ఒడ్డున పిండాలు బుక్కుతున్న కాకుల బారు నీడల్లా… అస్పష్టంగా…అచిరకాలంగా…నీకు మాత్రమే కనిపించేలా…ఆమె ముఖదర్పణంలో వాళ్ళంతా!

ఆ పండ్లతోట చుట్టూ లోయలు మాత్రమే ఉన్నట్లు, వాటి దిగంతాలు లేని అగాధాలలో ఎవరెవరో ఏవో క్షుద్ర కోరస్ లు కలిపి ఆలాపిస్తున్నట్లుగా ప్రతిధ్వనులు మోగుతున్నాయి ఏనాటివో కొన్ని కేకలు.

“ర్రేయ్… కుళ్లబొడవండ్రా నా కొడుకుని!”

“కుమ్మండిరా ఆ పక్కనున్న నాయాలుగాళ్లనీ…”

“తన్నరా తన్ను… బీర్జాలు పగలాలి… కొడుకు… యింకెవర్నీ లవ్వు గివ్వూ అని ఎంటబడ్డు!”

“ఏరా బద్మాష్… మీ కొంపల్లో ఆడోళ్ళు ఆనర్రా మీకూ…?”

“ఆళ్ళేం ఆడోళ్ళన్నా! వంకర టింకర లక్క పిడతలు… లేకి ముంజలు!”

“అందుకేగా… ఈ సంకర సన్నాసులకి మనమ్మాయిలు గావాలి…”

“మనమ్మాయిలే గాదు మావయ్యా… మన ఆస్థులు గూడా…”

“మాట్లెందుకు బావా…. ఏ కీలుకాకీలు యిరిసెయ్యక?”

“జాతి తక్కువ కుక్కా! ఒక్కసారి తెలిసోతెలియక నీతో స్నేహంగా ఉండి నిన్ను తాకినందుకే మా బిడ్డను మీ వాడదాన్నిచేద్దామనుకున్నావురా లుచ్చా!”

“వదలొద్దురా వాణ్ణి… ఈ కుక్కనొదిలేస్తే యింకొన్ని ఊరకుక్కలు మన గుమ్మాలముందే కాసుక్కూర్చుంటాయిరా…”

వంటిమీద పడిన దెబ్బలు త్వరగానే మానిపోయాయి. మాటలంకా నీలో రసిగారుతూనే వున్నాయి!

“స్నేహలతా______ గారు… మీరనుకోలేదు!”

“ఆ కులం తోకలూ, గార్లూ, మీర్లూ ఎందుకులే? ‘స్నేహా’ అను చాలు…”

“కుక్కపిల్ల కావాలన్నావటగా?”

“ఔనౌను”

“యూఎస్ నుండి పూర్తిగా వచ్చేసారా?”

“ఔను. ఆయన ఈ మధ్యే ఎక్స్పైర్ అయ్యారు. హార్టెటాక్…”

“సారీ టు హియర్… మరి పిల్లలు?”

“ఒక్కడేగా బాబు. యుఎస్ లోనే మెడిసిన్ చేస్తున్నాడు. అక్కడే ఉండిపోతాడట!”

“నువ్వు మరి ఇలా ఒంటరిగానే?”

“అమ్మానాన్న పోయారు. నీకు తెలిసే వుంటుంది. మా వాళ్లంతా ఎక్కడెక్కడో సెటిల్ ఐపోయారు. అత్తయ్య, నేనూ… అదిగో ఆ రెండు పమేరియన్ పప్స్… అంతే!” పక్కగోడపై వేలాడదీసివున్న స్యాంసంగ్ 85 అంగుళాల పెద్ద క్యూలెడ్ స్మార్ట్ టీవీలో వస్తున్న ‘సప్తపది’ సినిమా దృశ్యాల్ని నిర్లిప్తంగా, నోస్తాల్జిక్ గా చూస్తూ మాట్లాడింది. సినిమా సంభాషణలు రావట్లేదు. డిస్టబెన్స్ ఎందుకని తనే నువ్వొచ్చి కూచున్నపుడే టీవీని మ్యూట్ మోడ్ లో ఉంచింది స్నేహ.

“మీకు ఈ నాటు కుక్కపిల్లెందుకు?”

“ఊర జాతివి … చాలా విశ్వాసంగా కాపలా కాస్తాయంటగా! ఓ ముద్ద పడేస్తే…”

“అప్పట్లో మా వాళ్లలానే కదూ!”

“మన కాలేజ్ డేస్ నుంచీ అంతే… టంగిన్ చీక్ గా మాట్లాడతావు! ఏం చెప్పాలనుకుంటున్నావు?”

“ఏం లేదులే… మీరు మారరులే అని!”

“నువ్వు మాత్రం బాగానే మారినట్లున్నావు…”

“ఎలా ?”

“కుక్కలంటే ఏవగించుకునే వాడివి…తెగ భయం…మరిప్పుడేమో!”అని ఆషాఢమాసపు ఓ నాటి సాయంత్రపుపూట నింగిలో చల్లబడి కురవలేక తానొక్కటే తిరుగాడుతున్న తెల్లని పొడిమేఘంలా నవ్వింది. ఆ నవ్వు తాను అచ్చంగా నవ్విన నవ్వులాగాక నిన్ను నవ్వించాలని నవ్విన నవ్వులా నీకన్పించింది.

“ఔను స్నేహా… నా భార్యవల్లే ఈ పెట్స్ ని సాకే అలవాటు అబ్బింది!”

“లక్కీ ఫెలో!”

“ఎవరు?”

“నేను కాదులే!”

“బై… ఉంటా స్నేహా… ఇదిగో మరి…నాటుదే ఈ కుక్కపిల్ల…శంకర్ అని ఇష్టంగా పేరుపెట్టుకున్నాం. ఆ పేరుతోనే పిలవండి. ప్రేమగా పెంచుకోండి… ప్లీజ్!” అంటూ శంకర్ గాడి తలమీద గట్టిగా ఓ ముద్దుపెట్టి, దాన్ని ఇవ్వలేకనే ఇస్తూ… కర్పూర స్ఫటికల్లా మెరుస్తున్న కళ్ళతో జాలిగా అది నీ వైపు చూస్తుండగా… నువ్వు చూపులు తిప్పుకొని దానిని ఆమె ఒడిలో ఉంచి… నీ ప్రతి జీవాణువునుండి దుముకుతున్న దుఃఖానికి కళ్ల దగ్గరే కరకట్టలు కట్టుకుంటూ… ఆ ఇంటి మెట్లు దిగి వడివడిగా బయటకు నడిచొస్తున్నావు నువ్వు.

ఆ రాత్రి తనను తాను పూర్తిగా వర్షించుకుని తేలికపడిన మేఘమయ్యావు నువ్వు!

   *

చిత్రం: రాజశేఖర్ చంద్రం 

వేణు మరీదు

12 comments

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

  • కథ వేగంగా నడిచింది. లింకులను కలుపుతూ ఒక చైన్ ను తయారుచేసినట్లు కథను తయారు చేశారు. కొత్తశిల్పం అనలేను గానీ అరుదైనది. కథ వేగంగా నడవడానికనా రచయిత యింగ్లీషు పదాలను విరివిగా వాడారు. ఏమాత్రం టెంపో తగ్గనీయని తెలుగు పదాలున్నచోట కూడా అనవసరంగా యింగ్లీషు పదాలు( రచయిత నేరేషన్ లో) వాడారనిపించింది.
    త్రిపుర వంటి రచయితల కథలు జ్ఞాపకానికి తెచ్చిందీ కథ.
    నాటుకుక్క నేపథ్యంలో, అట్టడుగు మనుషుల పట్ల జనానికున్న చులకన భావాన్ని పరోక్షంగా ఎత్తిచూపారు. బాగుంది.
    వేణు మరీదు గారికి అభినందనలు.

    • విశ్వ ప్రసాద్ గారు, కథను చదివి అభిప్రాయం తెలిపిన మీకు కృతజ్ఞతలు

  • కథ బాగుంది గాని శిల్పపరంగా లోపం ఉంది. ఇంతకీ ఆ కథ చెపుతున్నదెవరో తెలీదు. Second person narration అతకలేదు.

    • కవిత గారు, మధ్యమ పురుష కథనంలో కథ చెపుతుండేది రచయిత నే ….తోలుబొమ్మలాటలో బొమ్మలు పట్టుకుని తెర వెనుక ఉంది ఆడించే వానిలా….
      శిల్పంలో ఉన్న లోపాలు దయచేసి చెపితే ఇంకా మెరుగ్గా రాయగలను అమ్మా… చదివి కామెంట్ పెట్టినందుకు ధన్యవాదాలు…

  • కథ బాగుంది, చెప్పాలనుకున్న విషయం ఆకట్టుకొనేలా రాసిన తీరు కొత్తగా ఉంది. కంగ్రాట్స్ వేమన్న.

  • కథ బాగుంది, చెప్పాలనుకున్న విషయం ఆకట్టుకొనేలా రాసిన తీరు కొత్తగా ఉంది. కంగ్రాట్స్ వేణన్న.

‘సారంగ’ కోసం మీ రచన పంపే ముందు ఫార్మాటింగ్ ఎలా ఉండాలో ఈ పేజీ లో చూడండి: Saaranga Formatting Guidelines.

పాఠకుల అభిప్రాయాలు