ఇక కలలోనే మిగిలే మన వూరు!!

నం పుట్టిన ఊరు, మనం పెరిగిన ఇల్లు, మనం చదివిన స్కూలు, అల్లరిగా తిరిగిన బజార్లు, చిల్లర తిళ్లు మరిగిన కొట్లు .. రారమ్మని పిలుస్తున్నాయి. రండి నేస్తం! చివరిసారిగా కలిసి, చూసెళదాం ఒకసారి!!

భుజాలపై చేతులేసుకొని ఖులాసాగా మనం గంతులేసిందీ, సైకిళ్ళ పై సర్కస్ ఫీట్లు చేస్తూ దిలాసాగా మనం ఫోజులు కొట్టిందీ దుమ్ము రేపిన ఈ మట్టి రోడ్ల పైనే కదా. చూస్తూచూస్తూనే ఆ గల్లీలో మొక్క ఎదిగిందీ, ఏ చిన్న తుపాను ధాటికో సిల్లీగా అంతటి మాను కుప్పకూలిందీ మన కళ్ళ ముందరే కాదా? ఆ జ్ఞాపకాలన్నీ లోపల సందడి చేస్తున్నాయి! బాల్య మాధుర్యాలతో మనం కలియ తిరగాలని, లేత మనసుల వూసులు కడదాకా పెనవేసుకుపోవాలనీ తొందర పెడుతున్నాయి!! మొన్న రాత్రంతా ఆ కలల్లోనే మునిగి తేలాను. నిన్న పగలంతా మెలకువలోనా కొత్త కలలుగన్నాను!కిట్టిగాడు బొమ్మ గీస్తూ ఉంటే సంభ్రమాశ్చర్యాలతో చూస్తూ పరవశించాలని ఉంది. రాంబాబుతో కలిసి కేరమ్స్ డబుల్స్ గేమ్ పై గేము గెలవాలని ఉంది. ఆసుపత్రి డౌనులో రవికుమారికి సైకిల్ తొక్కటం ఎలాగోలా నేర్పాలని ఉంది. స్కూలు దారిలో పుష్ప కుమారి ఇచ్చిన దోర జాంపండు కొరుక్కు తినాలని వుంది. పుల్లయ్య గాడితో కలిసి నిమ్మకాయ గోలీసోడా తాగాలని ఉంది. ఖాజా గాడితో గొంతు కలిపి, తేట తేనియల తెలుగు పాట పాడాలని ఉంది. సత్తిగాడి స్కాలర్షిప్పు డబ్బుతో పప్పల సీతమ్మ గారి మిఠాయి తినాలని ఉంది. శివన్న పొడవాటి స్నేహహస్తాన్ని అంతెత్తున ఎగిరి అందుకోవాలని వుంది. ప్రసాద్ గాడితో కలిసి ట్యూషన్ క్లాసు నుంచి సుబ్బులును రాత్రి లాంతరు వెలుగులో ఇంటిదాకా పంపి రావాలని ఉంది. ఈశ్వరయ్యతో సాయంత్రాలు బాల్ బ్యాడ్మింటన్ ఆడేయాలని ఉంది.

చీమలోడిపై పరుగుపందెం గెలవాలని ఉంది. శంకర్ గాడి కోర చూపుల నుంచి సైదులు గాడిని కాపాడాలని ఉంది. తుమ్మల శీనన్న టీముకు సవాల్ విసిరి, కబడ్డీ బెట్టు గెలవాలనీ ఉంది. ఊర చెరువులో, వాగు వరదలో, దిగుడుబావిలో హాస్టల్ ఫ్రెండ్స్ తో కలిసి ఈత కొట్టాలని ఉంది. వెంకన్నతో కలిసి పీర్లగుండం తొక్కాలని ఉంది. టీవీ అన్నకు తోడుదొంగనై మొక్కజొన్న పొత్తులు కాజేయాలని, పొలంలోనే జొన్న కంకులు కాల్చుకు తినాలని ఉంది. రామారావు, పుల్లయ్యన్న మాదిరి అంతెత్తున నిటారుగా నిలబడి, నెట్టు ముందరే వాలీబాల్ షాటు కొట్టాలని వుంది. మసీదు వద్ద బరిలో రంజుగా కోడి పుంజుల కొట్లాట చూడాలని వుంది. పది పైసలకో పందెం కాయాలని వుంది.

బుజ్జి బాబు పైసలతో ఈస్ట్ మన్ కలర్ సినిమా చూడాలని ఉంది. శివరాం అన్న సువేగాను బురద రోడ్లపై తెగ నడపాలని ఉంది. అనురాధ పెట్టిన అరిసెలు తింటూ కమ్మని కబుర్లు చెప్పాలని ఉంది. రమాదేవి దాచిన రేగుపళ్ళు, బుక్స్ చాటుగా నొక్కేయాలని ఉంది. మౌలానా మాదిరి మిమిక్రీ చేయాలని, కొండన్న మౌన రాగాలకు గొంతు కలపాలని వుంది. కృష్ణక్కలా మస్తుగ చదివేసి గొప్ప టీచర్ గా ఎదగాలని వుంది. లీడర్ సాబీర్ గాడిలా టెన్త్ లో మండల ఫస్ట్ కొట్టేయాలని వుంది. “హనుమంతు”డిలా మొండిదైర్యంతో ఫైట్లు చేసేయాలని వుంది. బుజ్జమ్మను మంచం వెనుక దాక్కోబెట్టి దొంగా – పోలీస్ ఆటతో గప్ చుప్ గా జారుకోవాలని వుంది. సీతక్క, వెంకడు అన్న నాగలి వెనక సుతిమెత్తని పొలం సాళ్లలో తడిమట్టి సుగంధం పీల్చాలని వుంది.

ఖలీల్ గాడిని తొండి చేసి, గోళీలాటలో ఓడించాలని ఉంది. మున్వర్, నిస్సార్ గాడితో కలిసి రంజాన్ ఇఫ్తార్ దావత్ కు చందాలు పోగేయాలని ఉంది. తెలిమంచు తెరల మధ్య నులివెచ్చని నెగళ్ళ ముందు చలి కాగాలని వుంది. తెలతెలవారక ముందే పొగాకు ముఠా మేస్త్రి గొంతులో జాషువా పద్యమై పరిమళించాలని ఉంది.
సకల వర్ణాల సంతలో రంగురంగుల గాలి బుడగనై పైపైకి తేలిపోవాలని ఉంది. నిండు జాబిల్లి నీడన పండు వెన్నెల దుప్పటి కప్పి, ఆరుబయట హాయిగా శయనించాలని వుంది. వేపచెట్టు చల్లని నీడలో ధనలక్ష్మి అక్కతో ఉయ్యాలలూగాలని, కోటేశ్వ”రమ్మ” చేతి నేతి గారెలు ఆబగా తినేయాలనీ వుంది. జిక్రియా అక్కయ్య పెన్ను కాజేసి చిక్కకుండా సందుగొందుల్లోకి పారిపోవాలని ఉంది. శివక్క అందమయిన నోటు బుక్కులు నొక్కేసి, ఎకాఎకిన పై తరగతికి గెంతేయాలని ఉంది. మన షాహిన్ లా డీఎస్సీ జిల్లా ఫస్ట్ కొట్టాలనీ, శ్రీలక్ష్మిలా ఒక్క టెస్టు తోనే టీచర్ పోస్టు రాబట్టాలనీ వుంది.

అడవి బస్సులో ఆనందంగా చక్కర్లు కొట్టాలని వుంది. సెలవు రోజు ఇంటికొచ్చిన ఫ్రెండ్స్ కు అమ్మ కట్టిచ్చిన మీఠాపాన్ పంచుకు తినాలని వుంది. మండుటెండల్లో మిట్ట మధ్యాహ్నం నాన్న చేతికందించిన చల్లని కల్లు రుచిని ఆస్వాదించాలని వుంది. మన దొడ్లోనే చెంగుచెంగున పరుగులిడుతున్న లేగడూడలతో గంతులేయలని వుంది. పెరట్లో మొలుస్తున్న విత్తనం అందాల్ని కంటి నిండా బంధించాలని ఉంది.

నాన్న పేకాటలో వదిలేసిన పది రూపాయల నోట్లు రెండు బరకాల కింద ఏరుకోవాలని ఉంది. మామయ్య ముచ్చటపడి ఇచ్చిన 20నోటు భద్రంగా దాచేయాలని వుంది.  శ్రీరామ నవమి పందిట్లో షర్బత్ తాగి, తీయని పప్పుల ప్రసాదం తినేయాలని ఉంది. రాములోరి పెళ్లి వేదికపై రాత్రికి “ఇన్స్పెక్టర్ విక్రమ్” డ్రామా కనులారా తిలకించాలని ఉంది. “కలిసే కళ్ళలోనా.. కురిసే పూలవాన” .. అంటూ పట్నం పిల్లతో మన పెద్దన్నలు ఆడిపాడిన ఖుషీ జల్సాలు చూస్తూ మురిసిపోవాలని వుంది. అప్పయ్య సారు కంట పడకుండా ఇంటర్వెల్ లోనే ఇంటికి చెక్కేయాలని వుంది. పెదబావ చేలో మంచె ఎక్కి కాకుల పైకి వడిసెల విసరాలని ఉంది. ఇంకా అల్లంత దూరాన ఆకసాన్ని తాకినట్టుండే ఆ పచ్చని కొండ కోనల్లో, ఎవరికీ దొరక్కుండా మన ఊరి చుట్టూనే చక్కర్లు కొడుతుండాలని వుంది!

పోలవరం ప్రాజెక్టు ముంచేస్తుంటే ప్రశాంతంగా, దుఃఖ రహితంగా మరింత కాలం మనమిక్కడ తిరగలేము. ఇక్కడ ఉన్నవన్నీ వెంట తీసుకెళ్ళాలని ఉంది. కానీ అది అసాధ్యం కదా?

ఓ నా దోస్తుల్లారా.. ఎన్నోసార్లు మీరు నా కలల్లోకి వచ్చారు. ఇప్పుడు మరింత లోతైన కలగా నా మెలకువలోకి వస్తున్నారు. మనం బయలుదేరటానికి ఇక సిద్ధం కావాల్సిందే! మరణం లేని ఈ గాలిలో మరొక్కసారి ఊపిరి తీసుకుంటాను. ప్రేమ నిండిన చూపులతో మరోమారు వెనక్కి తిరిగి చూస్తాను.

మాటల్లో చెప్పలేనిది మరెంతో నా హృదయంలో ఉండిపోయింది. ఇక మీ దగ్గరగా వచ్చి ఎద పై పడుతున్న కన్నీటి బిందువులు చూడలేను. వెళుతున్నా, సెలవంటూ .. చివరిసారిగా!

( ముంపు ప్రాంతంలోని త్యాగధనులందరికీ వినమ్రంగా నమస్కరిస్తూ .. ఖలీల్ గిబ్రాన్ – కాళోజీ “జీవన గీతం”లో కొన్ని వాక్యాలు మార్చేసి వాడుకున్నందుకు క్షమాపణలు వేడుకుంటూ.. )

*

అక్బర్ పాషా

Add comment

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

‘సారంగ’ కోసం మీ రచన పంపే ముందు ఫార్మాటింగ్ ఎలా ఉండాలో ఈ పేజీ లో చూడండి: Saaranga Formatting Guidelines.

పాఠకుల అభిప్రాయాలు