ఆత్మగౌరవ పతాక ఈ ఆదివాసీ కవయిత్రి!

ణిపూర్‌లో ఆదివాసీలకు గౌరవం ఇవ్వడం లేదనే ఆవేదనతో ఆదివాసీ రచయిత్రి,జర్నలిస్టు జసింతా కెర్కెట్టా 2022లో ప్రచురితమైన తన పుస్తకం ‘ఈశ్వర్ ఔర్ బజార్‌’కు వచ్చిన ‘ఆజ్ తక్ సాహిత్య జాగృతి ఉద్యమన్ ప్రతిభా సమ్మాన్‌'(ఇండియా టుడే గ్రూప్ )అవార్డును నిరాకరించింది.

భారతీయ భాషలను,  సాహిత్యాన్ని ప్రోత్సహించడానికి,గౌరవించడానికి ఆజ్ తక్ సాహిత్య అవార్డులలో ఎనిమిది విభాగాలు ఉన్నాయి.ఈ అవార్డుతో పాటు రూ. 50,000 బహుమతి ప్రదానం చేస్తారు.

రాజ్‌కమల్ ప్రకాశన్ ప్రచురించిన ‘ఈశ్వర్ ఔర్ బజార్’ కవిత్వం భారతదేశంలోని స్థానిక జనాభా ఎదుర్కొంటున్న నాగరిక సమాజ బెదిరింపులు,మతానికి,అధికారానికి,ఆధిపత్యానికి వ్యతిరేకంగా ఆదివాసీ ప్రజల అట్టడుగు పోరాటాల గురించి మాట్లాడుతుంది.

“మణిపూర్ గిరిజనుల జీవితం పట్ల గౌరవం అడుగంటుతున్న సమయంలో ఈ అవార్డు వస్తోంది”అని ఆమె న్యూస్‌లాండ్రీతో అన్నారు.“మధ్య భారతదేశంలో గిరిజనుల జీవితం పట్ల గౌరవం కూడా కనుమరుగవుతోంది.ఇతర వర్గాల ప్రజలు కూడా ప్రపంచ సమాజంలో నిరంతరం దాడికి గురవుతున్నారు.నా మనస్సు బాధగా ఉంది.ఈ అవార్డుతో నేను ఎలాంటి సంతోషాన్ని,ఉద్వేగాన్ని అనుభవించడం లేదు.ఇది ఒక నిర్దిష్ట మీడియా హౌస్‌ను గురించి కాదని”కెర్కెట్టా నొక్కిచెప్పారు.

“మణిపూర్‌లో జరిగిన సంఘటనలపై కొన్ని ప్రముఖ మీడియా సంస్థలు మరియు వార్తా ఛానళ్లు ఎలా మౌనం వహిస్తున్నాయో దేశం మొత్తానికి తెలుసు.ఆదివాసీల దుస్థితిని గౌరవప్రదంగా వెలుగులోకి తీసుకురావడానికి ప్రధాన స్రవంతి మీడియా ఎప్పుడూ ప్రయత్నించలేదు.నేను తీసుకునే ఏ నిర్ణయం అయినా ఈ దేశంలోని ప్రధాన స్రవంతి మీడియాగా పిలవబడేవి అట్టడుగు ప్రజల పట్ల తన పాత్రను ఎలా పోషిస్తుందనే దానిపై ఖచ్చితంగా ప్రభావం చూపుతుంది.”అని జసింతా కెర్కెట్టా అన్నారు.

“మనం ఒక పుస్తకాన్ని వ్రాసినప్పుడు, పుస్తకం సమాజానికి ముఖ్యమైనదిగా మారుతుంది,కానీ జనం అలా భావించడం లేదు.కానీ మేము ఆ దృష్టితో చూడము.మేము మా పనిని సమిష్టిగా చేయాలనుకుంటున్నాము.ఒక రచయిత లేదా కవి తన స్వాభిమానం కోసం ఏంచేయాలి?అందుకోసమే నేను ఈ గౌరవాన్ని స్వీకరించడానికి నిరాకరించాను.”అని జసింతా కెర్కెట్టా అనింది.

జసింతా కెర్కెట్టా(జననం.1983) జార్ఖండ్‌కు చెందిన ప్రఖ్యాత రచయిత్రి,కవయిత్రి,హిందీ పాత్రికేయురాలు,ఒరాన్ ఆదివాసీ సంఘం సభ్యురాలు,కార్యకర్త.ఆమె భారతదేశంలో ఆదివాసీ వర్గాల దుస్థితిని,వారిపై దైహిక హింసను, మహిళలపై లింగ వివక్షను,ఆదివాసీ సమాజాలపై,వారి అణచివేతపై ప్రభుత్వ ఉదాసీనతను తన కవిత్వంలో,పాత్రికేయ రచనలలో నిర్భీతిగా ప్రశ్నిస్తున్నది.

తన చిన్న వయసు నుంచే తన తల్లి పడే అనేక దౌష్ట్యాలను గమనిస్తూ పెరిగింది.ఒక మహిళగా పురుషాధిక్య ప్రపంచంలో ఆమె అనుభవిస్తున్న  వివక్షను కళ్ళారా చూసింది.”చిన్నప్పటి నుంచీ నాలో ఎక్కడో లోన ఒక చోట నిప్పురవ్వ లాంటిది బంధించబడింది.వయసు పెరిగేకొద్దీ నేను నా తల్లిపై గృహ హింసను చూశాను, కాబట్టి, అప్పటికే ఆ చిన్న వయస్సులోనే నా మనసులో రగులుతున్న ఈ కుంపటి కవితల రూపాన్ని తీసుకోవడం ప్రారంభించింది.నా హృదయం లోపల నిశ్శబ్దం అమ్మ వేదనారావాలతో ప్రతిధ్వనిస్తుంటుంది.అలాగే ఆదివాసీలు కాని ఇతరులు మా గ్రామ ప్రజలను భూమి కోసం,ఖనిజ నిక్షేపాల కోసం ఊచకోత కోయడం చూసాను”అని ఆదివాసి అయిన కెర్కెట్టా ‘అంగోర్’ (ఆమె భాషలో “నిప్పుకణిక” )అనే తన కవిత్వపుస్తకంలో చెప్పింది.

జసింతా కెర్కెట్టా  కవితలు ఆదివాసీల గుర్తింపు సమస్యల గురించి మాట్లాడతాయి.గిరిజన ప్రాంతాల అభివృద్ధి మీద రాష్ట్ర హస్వదృష్టిని ప్రశ్నిస్తాయి.మహిళలపై హింస,వలస,ఆకలి,ఉపాధి,ఆదివాసీ ప్రాంతాల పాలన పట్ల ప్రభుత్వ ఉదాసీనత వంటి సమస్యలతో వ్యవహరిస్తాయి.

అంగోర్ (2016),జాదోన్ కి జమిన్ (2018),అంగోర్ ( 2022 )వంటి కెర్కెట్టా కవితా సంకలనాలు ఆదివాసీ సంఘాలు ఎదుర్కొంటున్న అన్యాయాలపై వెలుగు పరుస్తాయి.ముఖ్యంగా, ఆమె కవిత్వం భాషా అవరోధాల్ని అధిగమించింది. జర్మన్, ఇటాలియన్,ఫ్రెంచ్ భాషలలోకి అనువదించబడింది.

కెర్కెట్టాకు US, ఇంగ్లాండ్, జర్మనీ, ఫ్రాన్స్, ఇటలీ, స్విట్జర్లాండ్, ఆస్ట్రియా మరియు కోస్టారికాతో సహా అనేక దేశాలలో శ్రోతలు ఉన్నారు.ఇక్కడ ఆమె భారతదేశంలోని గిరిజన వర్గాల స్థితిగతులను,కడగండ్లను వెలికితీసే పద్యాలను పఠించారు.ఆమె కవితలు వివిధ దేశాలలో విస్తృతంగా చదువుతున్నారు.అధ్యయనం చేస్తున్నారు.

 నిప్పుకణికల లాంటి జసింతా మెర్కెట్టా కవితలు కొన్ని :

 

జాతీయ గీతం 

 

నా పరధ్యానాన్ని విచ్ఛిన్నం చేస్తూ

అకస్మాత్తుగా జాతీయ గీతాన్ని ఆలపించడం ప్రారంభించారు.

నేను దేశ ద్రోహి అని

ముద్ర వేస్తారనే భయంతో

సావధానంగా నిలబడతాను

 

అదే సమయంలో,

మట్టి దిబ్బలా లోపల నుండి నన్ను తినేయడం కోసం

ఒక చెదపురుగుల సైన్యం

నా శరీరంలోకి ప్రవేశిస్తాయి.

సావధానంగా నిలబడి వుండి

నేను అరవలేక పోయాను.

 

వేల అసమ్మతి స్వరాలు

ప్రతిఘటించడానికి సిద్ధమయి

తమ ఇళ్ల నుంచి బయటకు వెళ్లబోతున్నప్పుడే

ఇంటి గోడల లోపల

జాతీయ గీతం ప్రతిధ్వనిస్తుంది.

 

అందరి వెనుక నిలబడి

ఒక భయంకరమైన స్వరం

వారి మెడ మీద తుపాకీ గురిపెట్టి

“ఆగు,ఎలా వున్నవాడివి అలాగే

నిలబడి వుండు”అని

ప్రతిధ్వనిస్తున్నట్టుగా వుంది.

 

జాతీయ గీతం పాడుతున్నారు.

నేను నిటారుగానే నిలబడి ఉన్నాను.

చెదపురుగుల సైన్యం

నా శరీరం లోపల నాట్యం చేస్తున్నాయి.

 

వారు దేశద్రోహానికి సంబంధించిన

అన్ని ఆరోపణల నుండి విముక్తి పొందినట్లుగా భావిస్తున్నారు.

 

***

 

ఎందుకీ భూమి మంటల్లో వుంది ?

 

ఒక కర్ర మీద వాలుతూ,భూమి పుత్రుడు గ్రామం అంచున నిలబడ్డాడు.

పురోగతి మరియు అభివృద్ధి తుఫానులు సమీపిస్తున్నప్పుడు,

అతను ఒక షరతు విధించాడు:

“భూమిపై నేను విభజన రేఖను గీస్తాను,

ఒక వైపు మీది కావచ్చు, మరొకటి నాది”

ఒక కొండపైకి ఎక్కి,భూమి పుత్రుడు రెండు వైపులా గమనిస్తూ ఉన్నాడు.

అతను చూసిన ఒక వైపు పురోగతి పేరుతో నిరంతర యుద్ధంలో నిమగ్నమై ఉంది,

మంటల్లో భూమి ఉంది.

ఈ వైపున, విత్తనాలు పొలాల్లో వృద్ధి చెందాయి,

భూమి మొత్తం పోషించడానికి, నిలబెట్టడానికి, పోషించడానికి.

ఇక్కడ భూమి పువ్వులుగా విరజిమ్ముతోంది,

అక్కడ భూమి మండుతోంది, మంటల్లో ఉంది.

 

***

నిప్పు కణిక

 

నగరాల్లో..

బొగ్గు ముక్క కాలిపోతుంది, కాలిపోతుంది…

ఆపై బూడిదగా మారి ఆరిపోతుంది.

 

గ్రామాలలో..

ఒక నిప్పు కణిక

ఒక పొయ్యి నుండి మరొక పొయ్యికి పోతుంది.

ప్రతి ఇంటిలో నిప్పు రాజుకుంటుంది.

జసింతా కెర్కెట్టా సంతాలి, సద్రీ, హిందీ మాట్లాడుతుంది.హో,ముండారి,ఖరియా ,ఇంగ్లీషును అర్థం చేసుకుంటుంది. 2016,2017,2018,2020 సంవత్సరాలలో జర్మనీ,స్విజర్లాండ్,ఆస్ట్రియా,అమెరికా,పారిస్,ఫ్రాన్స్ దేశాలలో పర్యటించి తన ఆదివాసీ ప్రజల సమస్యలను,జీవితాలను కవిత్వంగా వినిపించింది.కెర్కెట్టాను 2014లో ఆసియా ఇండిజినస్ పీపుల్స్ ప్యాక్ట్,థాయ్‌లాండ్ వాయిస్ ఆఫ్ ఆసియా రికగ్నిషన్ అవార్డుతో సత్కరించింది. 2022లో ఫోర్బ్స్ ఇండియా భారతదేశంలోని 20 మంది స్వీయ-నిర్మిత మహిళల్లో ఒకరిగా ఆమెను ఎంపిక చేసింది.

అట్టడుగునపడి,స్వరం కూడా వినిపించని ఆదివాసీల జీవనవిధానాన్ని ప్రపంచానికి తెలియజెప్పి,వారందరి మధ్య ఆమె తన స్థానాన్ని సుస్థిరం చేసుకుంది.

సుఖంగా కవిత్వం రాసుకుంటూ..అవార్డులకు ఎగపడుతున్న భారతీయ కవులంతా జసింతా కెర్కెట్టాను చూసి స్ఫూర్తి పొందాలి.మణిపూర్ ఆదివాసీల మీద కొనసాగుతున్న దమనకాండ మీద మీడియా మౌనాన్ని నిరసిస్తూ,అజ్ తక్ మీడియా( ఇండియా టుడే గ్రూప్ )ఇస్తున్న ప్రతిష్టాత్మక అవార్డును ఆమె తన ప్రజలందరి తరుపున తిరస్కరించింది.

ఏమి రాస్తున్నామో దానిని నిజాయితో అనుసరించడం కవుల కనీస బాధ్యత.ఈ విషయంలో జసింతా కెర్కెట్టా దేశంలోని కవులు,పాత్రికేయులందరికీ ఆదర్శం.

*

శ్రీనివాస్ గౌడ్

ఇప్పటివరకు సంపాదించినవి 5 కవిత్వ పుస్తకాలు..కొంతమంది మిత్రుల ప్రేమపూర్వక ప్రశంశలు..నిర్మాణాత్మక విమర్శలు- వృత్తి.. నిర్మాణ రంగం
ప్రవృత్తి..సాహిత్య నిర్మాణ రంగం--అనేకానేక సంక్షోభ సమయాలలో సాహిత్యం ఊతమిచ్చింది.

సాహిత్యం మనిషిలోని మాలిన్యాలను కడిగేస్తుందని నా నమ్మిక.

Add comment

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

‘సారంగ’ కోసం మీ రచన పంపే ముందు ఫార్మాటింగ్ ఎలా ఉండాలో ఈ పేజీ లో చూడండి: Saaranga Formatting Guidelines.

పాఠకుల అభిప్రాయాలు