ఆఖరి శిశిరం

దో గుర్తొచ్చినట్లుగా ఉంటుంది.అదేంటో పూర్తిగా తెలిసిరాదు.ఎప్పటివో,ఏవో జ్ఞాపకాలు అన్నీ కలగపులగమై ఏఒక్కటి స్పష్టంగా అర్థం కాదు.

రోజులన్నీ ఒకేలాగ నడుస్తున్నాయి.అప్పట్లో ఫ్రాక్ లు వేసుకు తిరిగిన పిల్లలు.చీరలు కట్టేంత పెద్దవాళ్ళయిపోతున్నారు.

కానీ నేను మాత్రం ఎప్పట్లాగే వ్యధార్తజీవిత వర్తమానంలో,ఆరోజు లాగే ఒంటరితనంలో  ఏకాంతశిలల్ని జ్ఞాపకాల శిల్పాలుగా మలుస్తూ, లోకానికి వ్యర్ధుడిగా ఇలా మిగిలున్నాను.

మరి నువ్వో? ఏమో?

ఇవాళ కార్తీక మాసపు చలిగాలి వీస్తోంది. ఆకాశం మబ్బులాంటి మంచుతెరలతో కప్పబడి చలికి వణుకుతోంది.

పగలంతా మేడ మీద గదిలో గడిపి విసుగు భరించలేక వరండాలో కూచున్నాను.రోడ్డు మీద పిల్లలు కేరింతలు కొడుతూ బంతాట ఆడుకుంటున్నారు.

ఆటతో పాటే మరేదో కంపించే గుండెలో కలుక్కుమని ముల్లులా కదిలింది.

నీరజా.ఎక్కడున్నావ్?ఎలాగున్నావ్?

నేను మాత్రం నువ్వు వెళ్లిన చోటే స్థంభించిన జీవితపు అగాధాల అంచుల్లో నీ జ్ఞాపకాల్నే తాగుతూ,లిల్లీపూలపరిమళంలో మిగిలి ఉన్నాను.

ఇంతలో వెచ్చటి నిట్టూర్పుతో పాటే అమ్మ ఇచ్చిన టీకప్.

ఇలాంటి ఒక చల్లని సాయంత్రం.ఒకే కప్పులోని టీ మనిద్దరం కలిసి తాగుతున్నప్పుడు,ఆరోజు నువ్వన్న మాటలు..

” ఆఖరి సిప్ ఎవరు తాగితే  వాళ్ళు గెలిచినట్లు.ఓడినవాళ్ళు గెలిచినవాళ్ళు అడిగింది ఇవ్వాలి.సరేనా?”

ఎవరికి వాళ్ళం.ఇద్దరం ఒకరు గెలవడం కోసం మరొకరం ఆఖరి సిప్ గా ఉంచేసిన చప్పగా చల్లారిన టీ.కప్పులో అడుగున.

నువ్వూ గెలవలేదు.నేనూ గెలవలేదు.మన జీవితాల్లాగా.మనంతట మనమే చేజార్చుకున్న మన గుండె లోతుల్లోని ప్రేమలాగా.అలాగే మిగిలిపోయిన టీ.అయితే,నిజానికి మనలో ఓడిపోయింది ఎవరు? నువ్వా?నేనా?

హృదయంలో కేంద్రీకృతమై ఉన్న తుపాను కళ్ళలో పురుడుపోసుకుంది.ఓ వెచ్చటి కన్నీటి చుక్క రాలి చేతిలోని కప్పులో పడింది.

నీ జ్ఞాపకాలు.ఎంత బాధపెట్టినా,గుండెని మెలిపెట్టినా గుర్తుచేసుకోకుండా ఉండలేను.అవి కన్నీళ్ళుగా మారి జారిపోయినా.ఉప్పగా ఉన్నా వెచ్చగా ఉంటాయి.ఓదార్పు కలిగిస్తాయి.

***       ****      ***    ****      ****

కాలేజ్ లో పాఠాలు చెప్పి ఇంటికొస్తే ఎవరూ లేరు.అందరూ ఏదో ఫంక్షన్ కి వెళ్ళారు.బయటికి వచ్చి మట్టి రోడ్డు లో తాపీగా నడక.

ఇంకెన్నాళ్లీ గమ్యం లేని జీవితపు నడక.అదే దారిలో,అదే బతుకులో.మార్పులేని,మార్చలేని స్మృతుల్లో,అనుభూతుల్లో.

నీ జ్ఞాపకాల్లో పరధ్యానంగా తిరుగుతుంటే ” పిచ్చిమారాజు”అంటున్నారు అందరూ.

దూరంగా పచ్చికమైదానం  నిర్జనంగా.రోజూ ఆడుకునే పిల్లలు ఏమయ్యారో ఇవాళ.

కాలికి ఎదురురాయి తగిలింది.అబ్బా..నొప్పి.

జీవితం నిండా ఎదురుదెబ్బలూ,గుండె గాయాలేనేమో!అంతేనా నీరజా?

సందేహాల్ని,బేధాల్నీ,ఖేదాల్ని ఛేదించుకుని అలా నడుస్తుంటే దారివెంబడి పూలపరిమళంతో కలిసి గుండెని పట్టుకుని ఆపుతాయి నీ జ్ఞాపకాలు.

కానీ నువు మాత్రం లేవు.

ఆకాశం దిగులుతో వొంగి  నన్నే మౌనంగా చూస్తోంది.

పోగొట్టుకున్న చోటే వెతుక్కోవాలి అంటారు. కానీ నిన్ను ఎక్కడ కోల్పోయినో తెలీడం లేదు. అందుకేనా ఈ వెతుకులాట అనంతంగా మిగిలింది నాకు.

దూరంగా ఏవో ఇళ్ళు.తెలిసిన వాళ్ళు మాత్రం ఉండరు.

ఇది.అప్పుడు మనం నడిచిన దారి.

ఒకానొక రోజు ఇదే దారిలో”మన చేతులు ఎన్నడూ విడిపోవు కదూ?”ఒకరి చేతిలో ఒకరి చేతులుండగా నేనడిగిన ప్రశ్న.

ఇంతలో చీలిపోయిన మట్టి దారి.

“ఇదిగో.. విడిపోతున్నాం.నువ్వటూ , నేనిటూ”అని నవ్వుతూ నువ్వన్న మాటలకే వణికిపోతూ నీ కళ్ళలోకి చూశాను కదా అప్పుడు.

నా భయాన్ని గుర్తించి”నేనే నీ దారిలోకి వస్తానంటూ”నా చేతిని వదలకుండా ఒకే బాటలో నడిచిన మనం.

అప్పుడు మనం నడిచిన ఈ దారిలో ఎండిన బురదమట్టిలో లీలగా కనిపిస్తూ,దుమ్ములో కప్పబడినవి నీ పాదాలముద్రలేనా?

ఉన్నట్టుండి తలమీదగా అరుస్తూ వెళ్ళింది తీతువపిట్ట.

ఉలిక్కిపడి చూస్తే.చీకటిపడుతూ ఉంది. ఆకాశంలో నక్షత్రాలు మొలుస్తున్నాయి.దూరంగా ఎవరింట్లోంచో దీపం గాలికి కదిలింది.

ఇంతే.నాకోసం ఎవరూ రారు.ఎదురూ చూడరు

****    ****      ****    *****

 

నాగలిపట్టిన రైతు విగ్రహం పక్క నుంచి కాలేజ్ మెయిన్ గేట్ వైపు నడుస్తుంటే,

“మిమ్మల్నే…బాగున్నారా?” అంటూ ఎవరో పలకరింపు.

ఆగి చూస్తే.భానుప్రకాష్!నీరజ తమ్ముడు..

ఆశ్చర్యం తో గుండె అరసెకండ్ ఆగి,వేగంగా కొట్టుకోసాగింది.

“మీరు.నువ్వు..భానూ..” అమాయకంగా కనిపిస్తున్న అతడ్ని చూస్తూ నీరజ గుర్తొచ్చినట్లై తడబడ్డాను.

“తిరుపతి లో ఏజీ బీఎస్సీ ఫైనల్ ఇయర్. స్పోర్ట్స్ మీట్ కి వాలీబాల్ టీంలో వచ్చాను. బాగున్నారా?”అంటూ నా ముఖంలోకి పరీక్షగా చూశాడు.

కళ్ళ కింద నల్లగీతలూ,ఎర్రజీరలూ,చెంపల్లో వెండివెంట్రుకలూ,మాసిన గడ్డం.అలాగే తెలీని వేదనతో చూస్తున్నట్లు అనిపించింది.

” యూ ఫూల్.నేను సరే.నువ్వెలా ఉన్నావ్.నీరజ ఎలా ఉంది.మర్చిపోయిందా.ఈ వూరినీ,నన్నూ.” గొంతు వణికింది.

గుండెలో సుడిగుండం లాంటిది తిరుగుతున్నట్లు నన్నే చూస్తున్నాడు భానుప్రకాష్.” బాగానే ఉంది.మిమ్మల్ని చూడ్డానికి వస్తానంటోంది. రమ్మంటారా”కళ్ళలోకి చూస్తూ అడిగాడు.

నీరజ.నన్ను చూడ్డానికి వస్తుందా?ఎందుకు .ఎందుకు మళ్ళీ రావడం.అన్నేళ్ళ నాడు వెళ్ళి పోయిన ఆమె..

ఆమె మిగిల్చిన జ్ఞాపకాల్లోనే,ఆ పరిసరాల్లో,ఊహల్లో బతుకుతూ,జీవితంలో ఇక తనని పొందలేనని నిశ్చయంగా తెలిసీ నాకై నిర్మించుకున్న స్మృతుల ఏకాంత సౌధంలోకి ..మళ్ళీ ఇప్పుడు తనెందుకు రావడం?

ఒకవేళ వచ్చీ,వెంటనే మళ్ళీ వీడ్కోలు తీసుకుని,జీవితాన్ని ఛిన్నభిన్నం చేసి వెళ్ళిపోతే.మళ్ళీ ఈ గుండె తట్టుకోలేదు.

నాతోనే శాశ్వతంగా ఉండిపోయేట్లైతే తప్ప తనని మళ్ళీ చూడలేను.మళ్ళీ ఈ మొండి చేతులతో తను మిగిల్చి వెళ్ళే ఒంటరితనాన్ని ,జ్ఞాపకాల్నీ మళ్ళీ గుండె గోడల్లో శిల్పాల్లా మలచలేను.

వొద్దు.వొద్దు.నీరజా..నువు మళ్ళీ రావొద్దు.

” వొద్దులే భానూ…తనని రావద్దని చెప్పు.ప్లీజ్.”

నా మాటల్తో  కన్నీళ్లు దాచుకోలేనట్లై ,దగ్గరకొచ్చి భుజం మీద తలవాల్చి వెక్కుతూ ఏడవసాగాడు భాను.

వాడి వీపు మీద చేత్తో తడిమి.ఇక అక్కడ ఉండలేనట్లుగా ముందుకు నడిచాను. అప్పటిదాకా పోర్టికో దగ్గర నిలబడి చూస్తున్న నా స్టూడెంట్స్ నలుగురు  భానుప్రకాష్ దగ్గరకు నడిచారు.

విగ్రహం అరుగు మీద కూర్చుని నన్నే దిగులుగా చూస్తున్నాడు భానుప్రకాష్.

గుండెల్లో ఏదో కలుక్కుమన్నట్లైంది.లోపల సుడిగాలి కలియతిరుగుతున్నట్లుగా ఏడుపు తన్నుకొస్తోంది.తల తిప్పుకుని ముందుకి అడుగులేశాను.

మనసు ఎటూ నిలవక,ఇంటికి నడిచి తాళం వేసిన తలుపుల ముందు మెట్ల మీద కూలబడ్డాక దుఃఖమొచ్చింది.

నాకు ఏ ఆశా కల్పించద్దు.నన్నిట్లాగే బతకనీ నీరజా.

గతజీవితం మిగిల్చిన  కలల్నీ ,అనుభూతుల్నీ జ్ఞాపకాలతో కలిపి  ఏకాంత ప్రపంచాన్ని నిర్మించుకున్నాను.ఇక మిగిలిన జీవితాన్ని ఇలాగే గడిపేయనీ.ఏడవనీ,నవ్వుకోనీ ,కుమిలిపోనీ.నీ స్మృతులతోనే కాలిపోనీ.

నువ్వు మళ్ళీ రావద్దు నీరజా.మళ్ళీ నీ నిష్కృమణాన్ని  నా జీవితం భరించలేదు.

 

******

తిరుపతి నుంచి ట్రైన్ లో వస్తూ  నిన్న తన కేరాఫ్ అడ్రస్ కి కొరియర్ లో వచ్చిన లెటర్ ని మళ్ళీ మడతలు విప్పాడు భానుప్రకాష్.

” నీరజ గారూ,

అనుకోకుండా కల్సిన భానుప్రకాష్

అంతా చెప్పారు.ఆరోజు నుంచి

మాస్టారి హెల్త్ మరీ దిగజారింది

మీరు వెళ్ళాక ఇన్నేళ్ళూ వేరే

లోకం లేకుండా బతికారు.వారం

రోజుల కిందట పాఠం చెబుతూ

మీ పేరే పిలుస్తూ క్లాస్ లోనే పడి

– పోయారు.డాక్టర్లు కష్టమే అంటు

-న్నారు.మగతలో కూడా మిమ్మల్నే

కలవరిస్తూ అలా అలా అందని

లోకాలకి వెళ్ళిపోతారేమో అని

భయంగా ఉంది.ఏదైనా జరిగేలోపు

ఒక్కసారి వచ్చి చూసివెళ్ళండి.ప్లీజ్

మీ ఫోన్ నెంబర్ తెలీక ఈ ఉత్తరం.

కన్నీళ్ళతో

 

మాస్టారి స్టూడెంట్స్”

 

కాగితం మడిచి కళ్ళలో నిలిచిన నీటిని తుడుచుకున్నాడు భానుప్రకాష్.

ఎలా చెప్పాలి? ఏమని చెప్పాలి?

ఏ నీరజ కోసమైతే ఆశల్ని,ప్రాణాల్ని కళ్ళలో నిలుపుకుని బతుకుతున్నాడో.అతనికి.ఆ నీరజ ఇక లేదని,తిరిగి రాదని.దుఃఖం తో పూడుకుపోయే గొంతుతో ఎలా చెప్పాలి.

స్టేట్స్ లో ఉంటున్న నీరజ.కేవలం అతడిని చూడడం కోసమే రెండు నెలల కిందట ఇండియాకి వస్తూండగా,ఆమె ప్రయాణిస్తున్న విమానం నడిసముద్రంలో కూలిపోయిందని.అతనికి ఎలా చెప్పాలి?

భానుప్రకాష్ మనసు వికలమైంది.

అప్పట్లో తాము స్టాఫ్ క్వార్టర్స్ లో ఉన్నప్పుడు తడబడే అడుగులతో,దిగులుకమ్మిన తడికళ్ళతో నీరజ కోసం  పొడవాటి సాయంత్రపు నీడలాగా నడిచి వచ్చే అతను గుర్తొచ్చాడు.

ఒకనాటి మబ్బులు కమ్మిన సాయంత్రం నీరజతో సహా అందరం ఆ ఊరి నుంచి శాశ్వతంగా వెళ్ళపోతుంటే  రైల్వే స్టేషన్ లో సెండాఫ్ ఇచ్చి శిలావిగ్రహంలా ఫ్లాట్ఫామ్ మీద నిలబడిపోయిన అతను కళ్ళలో కనిపించాడు.

ఇంతలో దిగాల్సిన స్టేషన్ వచ్చింది. ఆగుతున్న ట్రైన్ లోంచి తొందరగా దిగి ఆటోలో హడావుడి పడుతూ ఊళ్ళోకి వెళ్ళాడు భానుప్రకాష్.

ఆ రోడ్డు మలుపు మొదట్లోనే సరిగ్గా ఎదురైంది అంతిమయాత్ర.

కాలేజ్ స్టూడెంట్స్ గుంపులు గా పూలు చల్లుతున్నారు.ఎవరో నలుగురు కుర్రాళ్లు కన్నీళ్ళతో కృంగిపోతూ నాలుగు వైపులా మోస్తున్నారు.

కుదుపులకి అటూ ఇటూ కదిలే గులాబీ పూలదండల మధ్య అతని ముఖం వడలిన పువ్వులాగా.

షాక్ తగిలినట్లుగా కళ్ళుతిరిగి పడబోతున్న భానుప్రకాష్ ని పడిపోకుండా పట్టుకున్నారు ఎవరో.

ఎన్ని వసంతాలు,గ్రీష్మాలువర్ష ఋతువులొచ్చి వెళ్ళినా ఋతువుల్లో చివరిది ఆకులు రాల్చి మోడుగా మిగిల్చే శిశిరమే.

జీవితం ఏదో ఒకరోజు రాలిపోయే శిధిలపత్రమే.కొన్ని సార్లు ఆలస్యంగా.కొన్ని సార్లు చాలా ముందుగా!

*

 

Avatar

ఆకునూరి హాసన్

Add comment

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

‘సారంగ’ కోసం మీ రచన పంపే ముందు ఫార్మాటింగ్ ఎలా ఉండాలో ఈ పేజీ లో చూడండి: Saaranga Formatting Guidelines.

పాఠకుల అభిప్రాయాలు