ఆక్టోపస్ కబళించిన మనం!

ఒకే కథలో ఇద్దరు గొప్ప రచయితల్ని గుర్తు చేస్తూ కూడా ఒరిజినాలిటీ ఎక్కడా పట్టు తప్పకుండా కథను నడిపించడం  గొప్పతనం. పైగా ఈ కథ  మన సమకాలీన జీవితం మీద గొప్ప వ్యాఖ్య.

క కథ  చదివినప్పుడు జీవితం లో ఒక భాగమేదో  అయినట్లు ఉండాలి . ఒక ఉద్వేగం మనసంతా ముంచెత్తి , మనని మనంగా ఉండనీయక , లోలోపల ఒక సంచలనమేదో కలిగించాలి .మనలని మరింత నాగరికులుగా తయారు చేసే స్వయం కార్యాచరణకి దారి తీయాలి .  అలాంటి ఉద్వేగపూరిత కథలు  బుచ్చిబాబు చాలా రాసాడు . అరకు లోయలో కూలిన శిఖరం , అజంతా ఇలా చాలా .

ఒక కథ  చదివినప్పుడు ఒక సామాజిక వాస్తవికత లేదా సమాజ దుర్నీతి  అర్ధం అయినట్టు ఉండాలి . ఒక ఆలోచన మన మేధకు పదును పెట్టాలి . ఆ ఆలోచన మనని  మనం లా ఉండనీయక ఒక కార్యాచరణకు పూనుకునేలా చేయాలి .ఒక సమూహం  మనమేమి చేయగలం అనే ఆలోచనకి దారి వేయాలి. అలాంటి ఆలోచనాత్మక కథలు గోపీచంద్ చాలా రాశాడు . ధర్మ వడ్డీ , గోడ మీద మూడో మనిషి ఇలా చాలా.

ఇవాళ సాక్షి ఫన్ డే (01-07-2018) లో పూడూరి రాజి రెడ్డి కథ  రెండో భాగం చదువుతుంటే నాకు బుచ్చిబాబు , గోపీచంద్   గుర్తుకు వచ్చారు . ఈ రెండో భాగం కథ  ఉద్వేగాన్ని ( ఎమోషన్ ను నేను ఉద్వేగం అంటున్నాను ) కథ పొడవునా కొనసాగిస్తూనే ఒక సామాజిక వాస్తవికత లేదా దుర్నీతిని ఇది అరచేతిలో ఉసిరికాయలా కరతలామలకం చేసింది .

రాజి రెడ్డి కథా  ప్రపంచం లోకి నేను కాస్త ఆలస్యంగా ప్రవేశించాను . అతడి మొదటి పుస్తకం మధుపం అంటే నాకు చాలా ఇష్టం . అతడి రియాలిటీ చెక్ ఎందుకో తెలియదు కానీ నా హృదయం లో ఎక్కడా చోటు వెతుక్కోలేక పోయింది . వంద శాతం తప్పు నాదే అయి ఉండవచ్చు . కానీ కథలు  మాత్రం ఎప్పుడూ అబ్బురపరుస్తూనే ఉంటాయి . అలా బాగా ఆశ్చర్య పరచిన కథ  రెండో భాగం .

నా రెండో కవిత్వ సంపుటి డబ్బుపిట్ట లో నేనొక కవిత రాశాను . దానిపేరు గతి తార్కిక భౌతిక వాదం . అది ఇలా ఉంటుంది:

1979

ఆంధ్రదేశం లోని 

ఒకానొక గోడ మీద 

రక్తాన్నైనా చిందిస్తాం 

సమసమాజం సాధిస్తాం 

                  పి .డి .ఎస్ .యు 

1990

ఆంధ్రదేశం లోని  

 అదే గోడ మీద  

రక్తాన్నైనా చిందిస్తాం 

మాదిగ హక్కులు సాధిస్తాము 

                       ఎమ్ .ఆర్ .పి .యెస్ 

దీనికి పెద్దగా వ్యాఖ్యానాలు అవసరం లేదు . ఒక సమసమాజ భావన నుండి ఒక అస్తిత్వ భావనలోకి సమాజం నడచి వచ్చిన దారి కనిపిస్తుంది . మనం గొప్పగా ఊహించుకున్న సిద్ధాంతాల ఆచరణా ల లోతు తెలియ చేస్తుంది . సమాజ పరిణామ క్రమం లో మానవ సమూహాలు ఎప్పుడూ ఒకే భావజాలాన్ని అంటుపెట్టుకుని వుండవు . ఒక భావజాలం నుండి మరొక భావజాలం లోకి వలస వెళ్ళినప్పుడు , వలస వెళ్లిన భావజాలం మరింత సమగ్రమూ , ఉన్నతమూ అయిన   భావజాలం అయి మానవులను మరింత పరిణితి చెందించే , నాగరికులుగా మలచే భావజాలం అయితే ఏ పేచీ ఉండదు . కానీ ఒక్కొక్క సారి యూ  టర్న్ తీసుకుని తాము చెప్పిన సిద్ధాంతాలకు సరిగ్గా వ్యతిరేకమైన సిద్ధాంతాలను కౌగలించుకుని , అదే సత్యం , శివమ్ ,సుందరం అని భ్రమపడుతూ , మళ్ళీ వాటికీ లెజిటిమసీ కల్పించాలని చూస్తే దాన్ని మించిన విషాదం మరొకటి ఉండదు . మన బుద్ధి జీవుల మేధోపరమైన దివాలాకి అది తార్కాణం గా నిలుస్తుంది

సరిగ్గా ఈ విషాదాన్ని రాజి రెడ్డి తన రెండో భాగం కధలో అద్భుతంగా చిత్రించాడు . కరీంనగర్ , వేములవాడ ప్రాంతం లోని జీవ భాష తో రెండో భాగం ఎంతలా ఆకట్టుకుంటుందో చెప్పలేను ,

వెంకట్రెడ్డి  భార్య భూలక్ష్మి భర్త మరణించిన రోజును  ఆయనను తలచుకుంటూ ఆయన సంవత్సరీకానికి ఏర్పాట్లు చేస్తూ ఉండటం తో ప్రారంభం అవుతుంది . కధకుడు ఎక్కడా కథాకాలం గురించి చెప్పక పోయినా అది తెలంగాణా లో నక్సలైట్ ఉద్యమం ఉధృతంగా వున్నా రోజులని మనకు అర్ధం అవుతుంది . ఆ ఊళ్ళో  వెంకటరెడ్డి మాజీ సర్పంచ్ . రాజకీయాలను వదిలివేశాక తన వ్యాపారం ఎదో తానూ చేసుకుంటూ ఉంటాడు , ప్రభుత్వం నిర్వహించిన వేలం లో ఒక మద్యం షాప్ పాడుకుని  మద్యం వ్యాపారం లో కొద్దో గొప్పో డబ్బులు సంపాదిస్తాడు . తరచూ నక్సలైట్ల ఇన్ఫార్మర్లు వచ్చి చందాలు అడుగుతూ ఉంటారు . అడిగినప్పుడల్లా అతడు ఇస్తాడు .ఒక సారో , రెండు సార్లో అతడు చందాలు ఇవ్వడానికి నిరాకరిస్తాడు . అప్పుడు నేరుగా కేపన్న రంగం లోకి దిగుతాడు . కేపన్న ఆ ప్రాంత దళ నాయకుడు . తనని ఎవరైనా  ఎదిరించడం , మాట వినక పోవడం అతడికి ఇష్టం ఉండదు . మద్యం వ్యాపారి , వెంకట్రెడ్డి  తాను  చందా ఇవ్వమని అడిగితే నిరాకరించడం అతడి అహాన్ని దెబ్బ  తీస్తుంది . వెంకట్రెడ్డికి  హెచ్చరికలు పంపిస్తాడు . భూలక్ష్మి ఈ గొడవలన్నీ భరించలేక వేములవాడ వెళదామని అంటుంది . వెంకటరెడ్డి కూడా అదే ఆలోచన చేస్తాడు

రేపో మాపో వేములవాడ వెళదాం అనుకుంటూ ఉండగానే ఒక అర్ధరాత్రి కేపన్న మనుషులు వెంకట్రెడ్డి  తలుపు తడతారు , భయం భయం గానే భర్తను దాచిపెట్టి ఆమె తలుపు తెరుస్తుంది . వెంకట్రెడ్డిని  వెతికిమరీ దారుణం గా కొడతారు . అతడి నుదురుమీద నేను ప్రజారోగ్య కంటకుడిని  అని రాస్తారు . . ఆ అవమానానికి అతడు నాలుగు రోజుల పాటు ఇంట్లో నుండి బయటకు రాడు . వెంకటరెడ్డి  ఆ ఊళ్ళో  చాలావాటికి మొదటి వాడు .ఊళ్ళో  తొలి  సారి మిర్చి పంట వేసింది అతడే . తొలి  సారి గోబర్ గాస్ ప్లాంట్ పెట్టింది అతడే .  చివరకు పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్న మొదటి వ్యక్తి కూడా వెంకటరెడ్డే అవుతాడు .

భర్త సవత్సరీకం రోజు ఇవన్నీ గుర్తు చేసుకుంటూ భూలక్ష్మి పనిచేసుకుంటూ ఉంటుంది . ఇంతలో మరిది రామ స్వామీ ఫోన్ చేసి రాజా రాజేశ్వరి దేవస్థానం ఛైర్మెన్ ప్రతాపరెడ్డి వస్తున్నదని షాప్ ఓపెనింగ్ కి ఆ ఊరి ఎమ్ .పి  టి  సి  గా ఆమె తప్పకుండా రావాలని ఆహ్వానిస్తాడు . నేనెందుకు అమీ తిరస్కరిస్తుంది కానీ అతడు రావలసిందే  అని బలవంత పెడతాడు . ఆమె బూదవ్వ సాయంతో సంవత్సరీకం పూర్తి చేసుకుని షాప్ ఓపెనింగ్ కి వెళుతుంది

ఆమెకు ప్రతాపరెడ్డి రూపం లో, రాజకీయనాయకుడి  రూపంలో , రాజరాజేశ్వరీ దేవస్థానం ఛైర్మెన్ రూపంలో , మధుశాల వైన్స్ ప్రారంభం చేస్తూ కేపన్న కనిపిస్తాడు . అక్కా బావున్నావా ? అని పలకరిస్తారు . ఆమెతోనే రిబ్బన్ కట్ చేయిస్తాడు , నిజానికి ఆ మధుశాల వైన్స్ కూడా ప్రతాపరెడ్డి దే  కాక పోతే ఆ ఊళ్ళో  దాని నిర్వహణ రామస్వామి చూస్తాడు . మొదటి రోజుకనుక 50 రూపాయల తక్కువ ధర పెడతారు . ఒక మిత్రుడు అతడి వ్యాపారం బావుండాలని ఎక్కువ ధరకి కొనుగోలు చేస్తాడు . సభ అయిపోయాక భూలక్ష్మి ఇంటికి వెళుతుంటే ఆమెకు ఒక క్యారీ బాగ్ ఇస్తారు . అది ఆమెకు చల్లగా తగులుతుంది . ఇంటికి వెళ్ళాక కాసేపటికి మరిది రామస్వామి ఫోన్ చేస్తాడు . “ఏం  లేదు . వదినా ! మంచిగా చేరినవా లేదా అని ఫోన్ చేసిన “అంటాడు .  తరువాత లచ్చులు అంటాడు . అతడు తగిన వాసన మొబైల్ లోనే గుప్పుమంటుంది . ఆమె ఫోన్ పక్కన పడేస్తుంది . వెంకట్రెడ్డి  సన్నిహితంగా వున్నప్పుడు పిలిచే పిలుపు లచ్చులు

ఇదీ కథ . ఏమి చెప్పాడు రాజి రెడ్డి ? ప్రజారోగ్య కంటకుడు అని ముద్ర వేసి వెంకటరెడ్డిని చంపినా చేతులతోనే మధుశాల వైన్స్ ప్రారంభించాడు . ప్రతిదీ తన వ్యతిరేక అంశం  లయిస్తుంది  అన్న మావో సూక్తి  మద్యం వ్యాపార నిషిద్ధం , నుండి మద్యం షాప్ ప్రారంభించడం లో లయించింది  అని చెప్పాడా ? లచ్చులు అని రామస్వామి  పిలిచిన  పిలుపులో అంతరించిన మానవ సంబంధాల నైతికతని ప్రశ్నించాడా ? ఏమి చెప్పాడు రాజి రెడ్డి ? మన సైద్ధాంతిక ఆచరణ లోని అస్థిరత్వాన్ని , డొల్ల తనాన్ని ప్రశ్నించాడా ? ఆక్టోపస్ లాంటి ప్రపంచీకరణ జీవితాలను  ఎలా  చుట్టుముడుతున్నదో ,  ఎలా విషాద భరితం చేస్తున్నదో  చెప్పాడా ?   ఏది చెప్పిన ఆలోచన నిలువనీయకుండా చేసేలా  చెప్పాడు

ఈ క్రింది వాక్యాలు చూడండి

జీవితం ఎంత యాంత్రికంగా మారిపోయినా , మరణించినవారి ఫోటో ఒక్క క్షణం మనసును ఒక నెమ్మదిలోకి , ఒక తలపోత లోకి ఒక వైరాగ్యపు నిట్టూర్పూ లోకి జారవిడువగలదు 

భూలక్ష్మి చీర జాకెట్ ఎర్ర రంగు లంగా  బొందులు చేతుల్లా  వేలాడుతున్నాయి  నీలం తడి నెమ్మదిగా  జారుతూ అంచుల్లో  గాఢతను సంతరించుకుంటూ ఒక్కో చుక్కా గుండ్రంగా వుబ్బుతూ ఠప్పున  పడటాన్ని నిస్సహాయంగా చూస్తూ కూర్చున్నాడు 

ఆ పై  ఉటంకింపులూ   నాకెందుకో బుచ్చిబాబును గుర్తు తెచ్చాయి .

ఒకే కథలో ఇద్దరు గొప్ప రచయతలు గుర్తు చేస్తూ కూడా తన ఓరిజినాలిటీ ఎక్కడా పట్టు తప్పకుండా కథను నడిపించడం  గొప్పతనం. పైగా ఈ కథ  మన సమకాలీన జీవితం మీద ఒక  గొప్ప వ్యాఖ్య. మనం  నడచి వచ్చిన  మీద ఒక పోస్టుమార్టం . మనం వెళ్లబోయే జీవితం లోకి ఒక ముందస్తు హెచ్చరిక.

 

వంశీ కృష్ణ

1 comment

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

  • అసలు అలా అద్భుతంగా రాయడం మీకే సాధ్యం.. ఎక్కడా క్రమం తప్పదు.. ఎక్కడా ఒక్క అక్షరం వేస్ట్ గా ఉండదు.. మీ రచనా శైలి ..ఆ కంటెంట్ పట్టుకోవడం అద్భుతం..కుడొస్ వంశీ అన్న

‘సారంగ’ కోసం మీ రచన పంపే ముందు ఫార్మాటింగ్ ఎలా ఉండాలో ఈ పేజీ లో చూడండి: Saaranga Formatting Guidelines.

పాఠకుల అభిప్రాయాలు