ఆంధ్రదేశానికి వలసొచ్చిన గేదె కథ !

భారత దేశానికి స్వాతంత్య్రం వచ్చి ఇంత కాలం అయినా ఇంకా జనం అతిసారతోనూ,అసలు సారా తోనూ , మరణినిస్తున్నారని మనం బాధపడుతూ ఉంటాము కానీ మనకు  తెలియని బ్రహ్మ రహస్యం ఒకటి వుంది . అది భారత దేశం లో అభివృద్ధి  అనే ఒక బహు విచిత్రమైన  బ్రహ్మ పదార్ధం  ఆ రహస్యం . అధికారం లో వున్న  వాళ్లకు అభివృద్ధి  కాంతులీనుతూ రాజు గారి దేవతా వస్త్రాల లాగా అద్భుతంగా కనిపిస్తుంది . విపక్షం లో వున్న  వాళ్లకు పసిపిల్లాడి కళ్ళ  ముందు నగ్నత్వం లాగా బహిరంగ మవుతూ ఉంటుంది

మన ఉపనిషత్ వాక్యం ” తద్దూరే , తదంతికే , తదన్తరస్య స్వాదుస్యాన్ ” ఆత్మ  చలిస్తుంది , ఆత్మ  చలించదు , ఆత్మ  దగ్గరగా ఉంటుంది , ఆత్మ  దూరంగా ఉంటుంది  అని చెప్పినట్టుగానే మన అభివృద్ధి కూడా తద్దూరే , తదంతికే . అంటే అభివృద్ధి  అది కనిపిస్తుంది .కనిపించదు . చలిస్తుంది , చలించదు . దగ్గరగా ఉంటుంది , సుదూరంగా కనిపిస్తుంది .

ఇన్ని భాషలు , ఇన్ని మతాలు , ఇన్ని సామాజిక దొంతరలు వున్న  దేశం లో ఏ ఒక్క అభివృద్ధి నమూనా దేశమంతా సరిపోదు . కేరళ కొచ్చి లో వుండే అవసరాలు వేరు , కాశ్మీర్ బారాముల్లా లో వుండే అవసరాలు వేరు . ఆంధ్రప్రదేశ్ అనంతపురం అనుభవాలు వేరు తెలంగాణ మెదక్ అనుభవాలు వేరు . కానీ కేంబ్రిడ్జి విశ్వవిద్యాలయాలు , డూన్  స్కూళ్ల లో చదువుకుని  వారసత్వంగా అధికారం చేపట్టే మన భాగ్యవిధాతలకు ఈ సూక్ష్మం అర్ధం కాక , అర్థమైనా పట్టించుకునే తీరిక లేక కాలమనే  వెల్లువలో కొట్టుకునిపోతూ వుంటారు . తమకు వారసత్వంగా వచ్చిన అధికారాన్నిస్థిర పరచుకునే మహా యజ్ఞం లో హవిస్సుల కోసం వెతుకుతూ వుంటారు

ప్రపంచీకరణ తరువాత మనిషి ఒక మార్కెట్ వస్తువు అయిపోయాడని  ఈ దేశం లో మేధావులు బాధ పడతారు కానీ మనుషులను మనుషులుగా కాక మతాలుగా , కులాలు గా , కేవలం ఓటర్లు గా మాత్రమే గుర్తించే ఒక దారుణ విషాదం ఎప్పుడో ఈ దేశం లో మొదలయింది . రాజకీయ నాయకుల కనుసన్నలలో నడుచుకునే అధికార గణం  రాజకీయ నాయకుల అపరిపక్వ ఆలోచనలకు వంత పాడుతూ పరిస్థితి ని బ్యాడ్  నుండి వరస్ట్ కి తయారు అవడానికి తమవంతు దోహదం చేస్తూ వుంటారు .

సకృత్తుగా కనిపించే శంకరన్  లాంటి అధికారులు  స్వచ్ఛమైన హృదయంతో పనిచేయాలి అనుకున్నా రాజకీయ అధికార గణం , వారిని ఆశ్రయించే ఆశ్రిత జనం  వాళ్ళను పనిచేయకుండా అడ్డుపడతారు . 1970 వ దశకం లో చిత్తూరు జిల్లా కలెక్టర్ గా ఉన్న వళియప్పన్ , కడప జిల్లా కలెక్టెర్ గా ఉన్న  చంద్రమౌళి సంయుక్తంగా ఆలోచించి షెడ్యూల్డ్ కులాల అభివృధ్ధికోసం కొంత చొరవ తీసుకుని , వివిధ డిపార్ట్మెంట్లలో చల్లాచెదురు గా ఉన్న  ఎస్ సి నిధులను  సమీకరించి  ఎస్ సి కార్పొరేషన్ ఏర్పరిస్తే అది తదనంతర కాలం లో దేశం అంతా అనుసరించిన అభివృద్ధి నమూనా అయింది . కానీ ఆ అధికారులకు లభించిన బహుమతి ఏమిటంటే , ప్రభుత్వ అనుమతి లేకుండా కార్పొరేషన్స్ సృష్టించినందుకు మెమో . కానీ ఇప్పుడు ఈ ఇరవై ఒకటవ శాతబ్దాపు ద్వితీయ దశాబ్దం లో అలా చొరవ తీసుకునే అధికారులు లేరు . ఇవాళ నమస్కారం చేయమంటే సాష్టాంగ నమస్కారం చేసే అధికారులే ఎక్కువ . నా సహచరి ఆంద్ర ప్రదేశ్ ప్రభుత్వం లోను , నేనొక గ్రామీణ బ్యాంకు లోనూ పనిచేస్తాను కనుక ఈ  అభివృద్ధి దొంగాటాలు నాకు బాగా తెలుసు

తరళ మేఘ చాయ లో ఒక మంచి కథ  గురించి వంశీ చెప్తాడు అనుకుంటే ఈ అభివృద్ధి వెలుగు నీడల తత్వాన్వేషణ ఏమిటి అనుకుంటున్నారా ? తల్లావజ్జల పతంజలి శాస్త్రి కథల  సంపుటి నలుపెరుపు  లో “సింవ్వా సెలం  గోరి గేదె  ”  కథ  చదువుతున్నప్పుడు  మన అభివృద్ధి నమూనా లోని డొల్ల గురించి గొప్ప కవితాత్మకంగా ఆయన వివరించిన తీరు అవగాహన చేసుకుంటున్నప్పుడు నాకు కలిగిన ఆలోచనల సమూహం ఇది

తల్లావజ్జల పతంజలి శాస్త్రి అచ్చమైన రచయిత . మరో సుప్రసిద్ధ రచయత కే .యెన్ .వై  పతంజలి    ” పతంజలి శాస్త్రి గారిది కేవలం జీవితం మాత్రమే పట్టుకుని ప్రయాణించే సాహిత్యం . చేదైన  జీవితమూ , తేనెయిన  హృదయము ఆయన సాహిత్యం లో ప్రధాన లక్షణాలుగా ఉంటాయి . జీవితంలో చేదు మాత్రమే ప్రతిఫలించిన చోట ఏదీ తేనే గుండె అని అడిగితే అది రాసిన వాడి గుండెల్లో వుంది కాబట్టి ఇంత చేదు కథ  పుట్టిందని సమాధానం చెప్తాను నేను ”  అంటారు

పతంజలి శాస్త్రి గారి గుండెల్లో తన పాత్రల పట్ల , ఆ పాత్రలు రూపు దిద్దుకోవడానికి కారణభూతులైన వ్యక్తుల పట్ల అపారమైన , అమృతోపమానమైన  అనుకంప వున్నది కనుకే   చేదు జీవితాలు కూడా తేనే గుండెలై  మనలని కలవరపెడతాయి . పతంజలి శాస్త్రి గుండెల్లో తేనే వుంది కానీ అతడి శైలి లో మాత్రం కరకు జీవన వాస్తవం కాకలు తీరి కనిపిస్తుంది .

ఈ  సింవ్వా సెలం  గోరి గేదె మొదటి సారి ఎక్కడ ప్రచురితమైందో తెలియదు కానీ చినుకు పబ్లిషర్స్  రాజగోపాల్ గారు ప్రచురించిన నలుపెరుపు  అన్న కథా  సంపుటిలో వుంది

ముందుగా కథ  గురించి రెండు వాక్యాలు చెప్పుకుందాము . మొత్తము  చెప్పుకోవడానికి కూడా రెండు వాక్యాలకు మించని విషయమే ఇది . కానీ శాస్త్రి గారి రచనలో కాలాతీతంగా విస్తరించింది

తూర్పు గోదావరి జిల్లా లోవ పక్కనే వున్న  చిన్న పల్లెటూరు లో సింహాచలం అనే ఒక గొల్ల ఆడపడుచు ఉంటుంది . ఆమెది దారిద్ర్య రేఖకు దిగువన వున్న  కుటుంబం . భర్త , కొడుకు   అంతే . కొడుకు కి పెళ్లి అయిందో లేదో కూడా మనకు తెలియదు . రచయత ఎక్కడా చెప్పాడు . దారిద్ర్య నిర్మూలనా కార్యక్రమం లో భాగంగా ఒక సంవత్సరం క్రితం బి సి కార్పొరేషన్  ఆక్షన్ ప్లాన్ కింద సింహాచలానికి ఒక గేదె ను శాంక్షన్ చేస్తారు . ఒక సభ అట్టహాసంగా పెట్టి ఎమ్ .పి  డి  ఓ , ఎమ్మార్వో , ఎమ్మెల్యే  కలిసి సింహాచలానికి గేదెను అందిస్తారు . ఆ గేదె ఆస్ట్రేలియాలో పుట్టి , హర్యానాలో కొంత కాలం కాలక్షేపం చేసి ఆంధ్రదేశానికి తరలించబడింది .  ఆ గేదె వచ్చాక  సింహాచలం జీవితం లో చాలా మార్పులు వస్తాయి .

మొదట్లో నున్నగా బలంగా అందంగా ఉన్న  గేదెను చూడగానే  సింహాచలానికి నీళ్లోసుకున్న కూతుర్ని చూసినంత సంబరం కలిగి మొహం ఇంతైపోతుంది . భారీ శరీరం కనుక పూర్తిగా వంగి ఎమ్మార్వో గారికి దణ్ణం పెట్టలేక కృతజ్ఞతా భావం తో నమస్కరించిందామె . రోజుకాలు ఆరేడు లీటర్లు పాలిచ్చే గేదె కి పసుపు రాసి బొట్టు పెట్టి ” అమ్మా !లచ్చిందేవి ” అనుకుంటూ ఇంట్లో కట్టేసుకుంటుంది . అయితే గేదె విదేశీ పౌరసత్వం గురించి సింహాచలానికి తెలియదు

ఆరో నెల దాటకుండానే సింహాచలం ఇల్లూ , వొళ్ళూ గుల్లయిపోయాయి . కొడుకు కూలిపనులు మానేసాడు . ఓ మాదిరిగా కాలక్షేపం అయ్యే ఇల్లు ,గడవడం కష్టం అయిపొయింది . ఊరంతా సన్నకారు రైతులు, జరిగిన అన్యాయం బక్క రైతులందరికీ తెలిసిపోయింది

లచ్చిందేవి అనుకున్న గేదె నాలుగు కాళ్ళ నల్లటి కరువులా తయారయింది ” ఏం  పొయ్యే కాలమో గానోరే మనకి గవమెంటోడు దయిద్రం అంటగట్టేడు ” అని సింహాచలం కలవరపడిపోయింది . గేదె ఇంట్లోకి వచ్చి సంవత్సరం గిర్రున తిరిగి పోయింది . మళ్ళీ లబ్దిదారులకు  వివిధ కార్పొరేషన్ల  ఆచరణ ప్రణాళికల కింద యూనిట్లు పంచిపెట్టే జాతర మొదలైయింది . ఎంపిడివో  గారు , ఎమ్మార్వో గారు , ఎమ్మెల్యే గారు వస్తున్నారని తెలిసి  గేదెను తీసుకొచ్చి పంచాయితీ ఆఫీస్ ముందు కట్టేసి , అడగాల్సిన నాలుగు మాటలు అడిగేసి , గేదెను వాపస్ ఇచ్చేయాలని సింహాచలం కోరిక

సింహాచలం సభ దగ్గరకు వస్తే రచ్చ రచ్చ అవుతుందని  ఎమ్మెల్యే గారి ముందు పరువు పోతుందని , ఎమ్మెల్యే గారికి మంత్రి గారి ముందు , మంత్రి గారికి ముఖ్య మంత్రి గారి ముందు మాట , పరువు రెండూ జమిలిగా పోతాయని , ఆ ప్రభావం వచ్చే ఎన్నికల్లో ఎమ్మెల్యే గారి సిటు మీద పడుతుందని  సర్పంచ్ గారికీ , ఎంపిడివో , ఎమ్మార్వోలకు  తెగ టెన్షన్ మొదలు అవుతుంది

ఎలాగైనా సింహాచలాన్ని మాట్లాడకుండా చేయాలనీ ప్రయత్నాలు మొదలు పెడతారు . సర్పంచ్ గారి అన్న రేగినాయిడు రాయభారం చేస్తాడు కానీ అది ఫలించదు . అంతకుముందే ఎమ్మెర్వో గారు ఇల్లు , లావెట్రీ , ఇంకా ఇవేనా లోన్లు ఉంటే అవీ ఇప్పిస్తానని  బుజ్జగిస్తారు కానీ  సింహాచలం వినదు . ఎమ్మెల్యే వచ్చేలోగా సింహాచలం సమస్య పరిష్కారం అయిపోవాలి . ఎలా ?

అసలు మనిషిని చూడగానే దెయ్యంలా మీద పడుతోంది . అది నోరు తెరిచిందంటే ఎదర నిలబడే మగాడీ జిల్లాలో ఉండడు  అని అంతకుముందే ఎమ్మార్వో చూసీ చూడగానే సింహాచలం వ్యక్తిత్వ లక్షణాలు అన్నీ పట్టేస్తాడు

చివరి ప్రయత్నంగా మళ్ళీ సింహాచలాన్ని పిలిపిస్తారు . ” నువ్విలా మంకు పట్టు పడితే ఎలా ? పెద్దవాళ్ళు వున్నప్పుడు ఇష్టం వచ్చినట్టు మాట్లాడతా నంటే తప్పు కదా ” అంటారు ఎమ్మార్వో గారు . సింహాచలం భళ్ళున పేలిపోతుంది

” ఎవురండీ పెద్దోళ్ళు వోటెల్క్షన్లప్పుడు డబ్బులిచ్చి మాలీ కావడకుండా పోయినోళ్ళంటారా ? మా కొద్దండి , కితం ఏడాదేనండి మీటింగ్ పెట్టి  పెట్టి గేదెలిచ్చారా ?  ఏటం డయ్యా  గేదెలా? దయ్యలా ?పాల సంగతి దేవుడెరుగు తింటానికి గడ్డేదండి ? మేట్లు మేట్లు  తినెత్తం దండి  ఎంత తింటే అన్ని పాలిత్తాయండి  ఆ జాతులు  మన కాదా పనికి రావండి . తాళ్లెత్తున  ఈడ సుక్క నీళ్లు లేవండి . ఇంగితం లేదేటండి?  సుక్క నీరు లేనికాడ  ఇసుమంటి గేదెలిచ్చి సెట్లు దులిపేసుకున్నారండి?కడుగేటండి ,తౌడేంటండీ  ఎంత తింటే అంత మేతేయ్యాలండి  పుస్కలంగా గడ్డీ నీరూ ఉన్న  కాడ  ఉండాలండయ్యా . దీన్ని తెచ్చుకున్న కాణ్ణించీ మేపడంతో సరిపోయిందండి . నా కొడుకు కూలి కెళ్ళడం మానేసి దీన్ని మేపతన్నాడండి ? ఏడ కెళ్ళి మేపతాడండి ? సుబ్బరంగా ఓ పూటైనా తినేటోళ్ళం . బుద్ధిలేని గవమెంతోడి  దయండి  దయిద్రం పట్టుకుందండి . మెత్త పొలాల్లో ఈ గేదెలేటండి . అసలు గ్యానం  ఉందండి  ఆరికి ? తింటానికి మేత లేక గేదె సచ్చి వూరుకుంటుంది . ఆ ఉసురు కొట్టుద్దండి . మీ గేదెలొద్దు . మీరొద్దండి . గేదెను తెచ్చి ఈడ కట్టేసి అన్నీ అడిగెట్టానండి ? మా సావు మేం  సత్తామ్  గానీ . మీరొద్దు , మీ గేదెలొద్దు ”  అంటుంది

ఎవరు చెప్పినా సింహాచలం వినేట్టు లేదు . సభ రసాభాస కాకుండా సింహాచలం నోరు మూసెయ్యాలి . ఎలా ? అప్పుడు సీనియర్ అసిస్టెంట్ ఒక సలహా చెప్తాడు . సింహాచలం నోరు విప్పకుండా ఉండటానికి , సభ సజావుగా జరగడానికి . అందరూ  తమ తమ బుర్రలను అప్పటికే తెగ వాడి వున్నారు కనుక ఇక ఆలోచించే ఓపిక లేక సీనియర్ అసిస్టెంట్ సలహాకు ఒప్పుకుంటారు . సింహాచలం నోరు విప్పదు . సభ సజావుగా జరుగుతుంది . అందరూ ఊపిరి పీల్చుకుంటారు . మళ్ళీ ఇద్దరు ఎస్సీలు , నలుగురు బీసీలకు  యూనిట్లు పంచిపెడతారు .

సీనియర్ అసిస్టెంట్ ఇచ్చిన సలహా ఏమిటో ఇక్కడ నేను చెప్పను  కానీ కాస్త ఆలోచిస్తే మీకూ అర్ధం అవుతుంది

ఈ కథ  ద్వారా పతంజలి శాస్త్రి గారు మన దారిద్ర్య నిర్మూలనా కార్యక్రమాల మీద , మన పాలసీ మేకర్ల చైతన్య రాహిత్యం మీద  చెప్పలేని చెర్నాకోల దెబ్బలు విసిరాడు . భారత దేశం మొత్తాన్ని ఒకే యూనిట్ గా భావించడం , ఈ దేశ వివిధత్వాన్ని గుర్తించని హ్రస్వ దృష్టిని , పథకాల  రూపకల్పన లో సృజనాత్మకత లేకపోవడాన్ని ఆయన అన్యాపదేశంగా ఎద్దేవా చేస్తాడు . నేను బ్యాంక్ లో పని చేస్తాను అని చెప్పను కదా . మా బ్యాంక్ లో కూడా ఇలాంటి అప్పులు చాలా ఇచ్చాము . ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ నిబంధన ఏమిటంటే గేదెలు తీసుకునే లబ్ధిదారులు ఆంధ్రప్రదేశ్ లో కాక అటు హర్యానా  నుండి కానీ లేక గుజరాత్ నుండి కానీ కొనాలట . ఆ నిర్ణయం లోని హేతుబద్దతను ప్రశ్నిస్తే వాళ్ళు చెప్పిన జవాబు మరింత నవ్వు తెప్పించింది . లోకల్ గా గేదెలు  కొనవచ్చు అంటే ఎక్కడి గేదెలను అక్కడే కొన్నట్టు చూపించి  సొమ్ము చేసుకుంటారట . అందువలన పశు సంపద  పెరగడం లేదట . అందుకని ఈ నిబంధన విధించారట . వాతావరణ పరిస్థితులను గురించి ప్రశ్నిస్తే  ఘనత వహించిన ఆ అధికారి ఆల్విన్ టాఫ్లెర్  తన ఫ్యూచర్ షాక్ లో ప్రస్తావించిన ట్రాన్సిషన్ పీరియడ్ గురించి చెప్పి ” మరేమీ ఫరవాలేదు . అవి తేలికగానే సర్దుకుంటాయి . ఇరవై నాలుగు గంటలు మా పర్యవేక్షణ ఉంటుంది అన్నాడు . రాజకీయ నాయకుల  ఆలోచనలకు అనుగుణంగా సిద్ధాంతాలు తయారు చేసే మేధావిగణం మనది కానీ వాస్తవ అనుభవం మాత్రం సింహాచలం అనుభవానికి భిన్నంగా లేదు . ఇక్కడి పరిస్థితులకు అవి తట్టుకోలేక చాలా గేదెలు చనిపోయాయి . ఉసురు తగులుతుంది అని సింహాచలం బాధపడింది కానీ అలా గేదెల రుణాలు ఇచ్చే మాకు కానీ , జిల్లా అధికారులకు కానీ చీము కుట్టినట్టు కూడా ఉండదు . మాకు మహా అయితే అప్పులు రాని  బకాయిలుగా మారతాయి  అన్న బెంగ ఉంటుంది

ఈ కథ  చదవడం ఒక అనుభవం . పతంజలి శాస్త్రి గారి ఉపమానాలు , రూపకాలు ఈ కథకి  క్లాసిక స్థాయిని ఇచ్చాయి . మచ్చుకి ఈ ఉదహారణలు చూడండి

” ఎమ్మార్వో గారి బట్టతల పల్చటి నీటి బుగ్గలా వుంది ”

” లచ్చిందేవి అనుకున్న నాలుగు కాళ్ళ గేదె నల్లటి కరువులా తయారయింది ”

” పైన ఫ్యాను తిరుగుతూన్నా వుప్పుకుండల్లా మెరుస్తున్నారు ”

“ముఖం చెమట వేసిన కోపం తో మెరిసిపోతుంది ”

ఈ వాక్యాలన్నీ గొప్ప కవిత్వాత్మ తో మనలని ఆకట్టుకుంటాయి

ఆస్ట్రేలియాలో పుట్టి , హర్యానా లో పెరిగి , ఆంధ్రదేశానికి వచ్చిన ఈ గేదె కథ  మన సృజనాత్మక స్తబ్దత , శూన్య తాత్వికత మీద ఒక పెద్ద సెటైర్ , ఒక వ్యంగ్య విభావరి

కథ  చదివితే నేను అన్న మాట నిజమే అని మీరూ ఒప్పుకుంటారు

*

వంశీ కృష్ణ

వంశీ కృష్ణ

5 comments

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

  • వంశీగారు! ఇప్పుడే కథ ,మరియూ మీ విశ్లేషణ చదివాను. నేటి రాజకీయాలను,మనుషుల తత్వాలను,అధికార వర్గం వంతపాడటం సహించుకోవటం , ఈ సమాజంలొ బతకటం చాలా చాలా కష్టం!! నెన్న ‘సర్కార్ ‘ అనే విజయ్ నటించిన ఒక తమిళ సినీమా చూశాను. ఈ వస్తువుతో వచ్చిన సినీమా నేను చూసినది ఇదేమొదలు. ఎన్నికలు , ఫేక్ ఓట్లు,,ఇంకొకరి పెరుతో వేసే ఓట్లు,మనిషికున్న ఒకే ఒక్క ఓటు విలువ .ఆశ్చర్యం!వెనుక తండ్రులను చంపేవారు కొడుకురాజుకావటానికి, ఇందులో కూతురు తండ్రిని చంపేస్తుంది‌ ,sympathy ఓట్లకోసం. ఈ మద్యనె అద్దేపల్లి ప్రభు రాసిన ,లోకం మనది కాదు విన్నాను .ఎంత దయనీయమైన పరిస్థితి. ఎలా మనిషి ఇంత స్వార్థపరుడైపోతున్నాడు. ఇంకొకరి ఆకలి మనదికాదా!తనకు సహాయం చేసే అధికారం ఉన్నా దురాశ, స్వార్థంతో కళ్ళున్న కబోది, వినిపించవు. Sarkar movie, మసాలాలన్నీ ఉన్నాయి. అయిన నాకు వస్తువు నచ్చింది. చాలా మంచి విశ్లేషణ.నిస్సహాయత!!

  • వంశీగారు! ఇప్పుడే కథ ,మరియూ మీ విశ్లేషణ చదివాను. నేటి రాజకీయాలను,మనుషుల తత్వాలను,అధికార వర్గం వంతపాడటం సహించుకోవటం , ఈ సమాజంలొ బతకటం చాలా చాలా కష్టం!! నెన్న ‘సర్కార్ ‘ అనే విజయ్ నటించిన ఒక తమిళ సినీమా చూశాను. ఈ వస్తువుతో వచ్చిన సినీమా నేను చూసినది ఇదేమొదలు. ఎన్నికలు , ఫేక్ ఓట్లు,,ఇంకొకరి పెరుతో వేసే ఓట్లు,మనిషికున్న ఒకే ఒక్క ఓటు విలువ .ఆశ్చర్యం!వెనుక తండ్రులను చంపేవారు కొడుకురాజుకావటానికి, ఇందులో కూతురు తండ్రిని చంపేస్తుంది‌ ,sympathy ఓట్లకోసం. ఈ మద్యనె అద్దేపల్లి ప్రభు రాసిన ,లోకం మనది కాదు విన్నాను .ఎంత దయనీయమైన పరిస్థితి. ఎలా మనిషి ఇంత స్వార్థపరుడైపోతున్నాడు. ఇంకొకరి ఆకలి మనదికాదా!తనకు సహాయం చేసే అధికారం ఉన్నా దురాశ, స్వార్థంతో కళ్ళున్న కబోది, వినిపించవు. Sarkar movie, మసాలాలన్నీ ఉన్నాయి. అయిన నాకు వస్తువు నచ్చింది. చాలా మంచి విశ్లేషణ.నిస్సహాయత!!

‘సారంగ’ కోసం మీ రచన పంపే ముందు ఫార్మాటింగ్ ఎలా ఉండాలో ఈ పేజీ లో చూడండి: Saaranga Formatting Guidelines.

పాఠకుల అభిప్రాయాలు