అసలు సిసలైన ఇండియన్ అనుభవం

ఈ నెల పరిచయం చేస్తున్న Authentic Indian Experience అన్న కథ గూర్చి చెప్పడానికి ముందు మూడు విషయాల గూర్చి చెప్పాలి. (ఇక్కడ ఇండియన్ అంటే అమెరికన్ ఇండియన్ అని. కానీ, మన ఇండియన్లకు కూడా ఎలా ఇది వర్తిస్తుందో తరువాత వివరిస్తాను.)

మొదటిది వర్చ్యువల్ రియాలిటీ గూర్చి. ప్రయాణాలు అంత తేలిక కాని రోజుల్లో దూరదేశాలకు వెళ్లి తిరిగొచ్చినవాళ్లు చెప్పిన విశేషాలని విని చుట్టపక్కాలు మురిసిపోయేవారు. ఫోటోల కాలం వచ్చిన తరువాత అది యాత్రా ప్రదేశాల విశేషాలను చూపి చెప్పడంలోకి మారింది. క్రితం శతాబ్దంలో తొంభయ్యవ దశకంలో కేమ్‌కార్డర్లు వచ్చి కేసెట్లల్లో రికార్డ్ చేసి ఆ వెళ్లివచ్చినవాళ్లకు ఆ క్షణాలని మళ్లీమళ్లీ టీవీ మీద చూస్తూ జీవించగలిగే అవకాశాన్ని కలిగించాయి. ఇప్పుడు ఇంటర్నెట్ ద్వారా ఇంట్లోంచి బయటకు అడుగు పెట్టకుండా ప్రపంచాన్ని చూడగలిగే వెసలుబాటు వచ్చింది. కానీ, యాత్రలు చెయ్యనివాళ్లకి ఈనాడు కూడా ఆ దూరపు ప్రపంచంలో విహరించే అవకాశం ఉన్నదా? ఫ్లారిడా రాష్ట్రంలోని కెన్నెడీ స్పేస్ సెంటర్లో వర్చ్యువల్ రియాలిటీని ఉపయోగిస్తూ అంగారక గ్రహం (మార్స్) మీద చుట్టూ చూసి వచ్చాను కాబట్టి ఆ అవకాశ మున్నదని చెబుతాను. మార్స్ రోవర్ తీసిన ఫోటోల ఆధారంగా, కళ్లకు అమర్చిన ప్రత్యేక మయిన గాగుల్స్ ద్వారా ఆ అనుభవాన్ని అక్కడ అందిస్తున్నారు.

రెండవది, కాలమానంలో వెనక్కు వెళ్లి ఆ జీవితాన్ని అనుభవించ గలగడం, లేదా, ఆ అనుభవాలని పొందగలగడం. కాలయంత్రాల గూర్చిన ఊహాగానాలు కల్పనల గడపని దాటి బయటికి రావడం మొదలుపెట్టలేదు గనుక మిగిలింది ఎవరన్నా ఆ వేషాలని వేస్తూ మన ముందుకు రావడం. ఇది సినిమాల్లోకీ, నాటకాల్లోకీ పరిమితం కాకుండా వీక్షకుల కోసం అమర్చబడి కూడా ఉండవచ్చు. ఆ చివరి కోవకు చెందిన ప్రదర్శన వర్జీనియా రాష్ట్రంలోని కలోనియల్ విలియంస్‌బర్గ్‌లో కనిపిస్తుంది. రెండువందల ఏళ్లనాటి (యంత్రాలు అంతగా రాని కాలం) వేషాలు వేసుకుని ఆనాటి పనులు చేస్తూ అక్కడ కొన్ని ఇళ్లల్లో కొంతమంది కనిపిస్తారు. వీళ్లు జీతానికి పనిచేస్తారు. జీతం అంటే అక్కడ అలా చేస్తూ కనిపించడానికి తీసుకునే వేతనం. కాలమానంతో పనిలేకుండా వేరే ప్రాంతం వాళ్ళతో కలిసిపోయే వెసులుబాటు కూడా కొన్నిచోట్ల ఉన్నది. జైపూర్, చెన్నైల దగ్గరి చోకీ ధని దానికి ఉదాహరణ. రాజస్థానీల వేషంలో వాళ్ల తిండిపదార్థాలని మనకు అందజేస్తారు. ముసోరి, కాశ్మీర్ లాంటి ప్రదేశాలకు వెడితే అక్కడి వాళ్ల దుస్తుల్ని వేసుకుని ఫోటో కూడా దిగచ్చు. కానీ వాళ్ల అనుభవాలు ఆ గుడ్డలతో పాటు పొందే అవకాశం లేదు గదా!

మూడవది, అమెరికాలో అమెరికన్ ఇండియన్ల చరిత్ర, అనుభవాలు, జీవన విధానాలు. కొలంబస్ అమెరికా ఖండాన్ని కనుక్కున్న తరువాత యూరోపియన్లు వలస వచ్చి, ఇక్కడ ఎన్నో శతాబ్దాలుగా నివశిస్తున్న ఇండియన్లని నిర్వాసితులని చేసి, వాళ్లకి పరిమిత మయిన స్థలాన్ని కేటాయించి అక్కడికి వాళ్లని గుంపులుగా తరలించారు. యూరపియన్ల తుపాకీల ముందు వీళ్ల విల్లంబులు, బాణాలు ఎందుకూ కొరగాకుండా పోయాయి. ఎదురుతిరిగినవాళ్లని నిర్దాక్షిణ్యంగా అణచివేశారు. గత శతాబ్దం మొదట్లో వచ్చిన సినిమాలలో ఆ ఇండియన్లని విలన్లు గానూ, ఈ దేశానికి వలసవచ్చి ఆ ఇండియన్లని వాళ్లుండే చోటునుంఛీ తరిమేసిన శ్వేతజాతీయులని హీరోలగానూ చూపడం సాధారణం. పిల్లలు కూడా కౌబాయ్స్ వెర్సస్ ఇండియన్స్ ఆటలు ఆడేవాళ్లు – వాళ్లల్లో విలన్లు ఎవరో వేరే చెప్పాలా?

పై మూడు అంశాలనీ కలగలిపిన కథ ఆథెంటిక్ ఇండియన్ ఎక్స్‌పీరియన్స్. వర్చ్యువల్ రియాలిటీని ఉపయోగిస్తూ అమెరికన్ ఇండియన్ల అనుభవాలని వాటిని కోరుకునేవాళ్లకి అందజేసే ఒక స్పెషల్ పార్క్ కథాస్థలం. ఆ పార్క్ బాగానే డబ్బు చేసుకుంటోంది. అక్కడ ప్రతి ఉద్యోగీ విజిటర్ కోరికని బట్టీ తనకు చేతనయిన ఒక ఇండియన్ అవతారాన్ని ధరిస్తూంటాడు. (తెలుగువాళ్లల్లో వాళ్లు నివసించే ప్రాంతాన్నిబట్టీ తిండిలో, ఆచార వ్యవహారాల్లో, భాషలో తేడా లున్నట్టే అమెరికన్ ఇండియన్లలో కూడా తేడా లుంటాయి. అమెరికా దేశం విస్తీర్ణంలో భారతదేశానికి మూడు రెట్లుంటుంది గనుక దేశంలో మూలమూలలా ఉన్న ఆ ఇండియన్లలో తేడాలు ఎంతగా ఉంటాయో అర్థం చేసుకోవచ్చు.) ఇక్కడ అవతారాలంటే ఆయా ఇండియన్లలాగా రూపూ, భాషా, ఆలోచనా మార్చుకోవడ మన్నమాట. ఈ అనుభవాలని కోరుకోవడానికి వచ్చేవాళ్ల ఆలోచనల్లో వ్యత్యాసా లుంటాయి కాబట్టి కూడా ఈ పార్క్ బిజినెస్ నడపాలంటే వచ్చినవాళ్లకి కావలసినవాటిని అందించాలి. అది ఉద్యోగికి చేతకాకపోతే అతను/ఆమె వేరే ఉద్యోగాన్ని చూసుకోవాలి. కొత్త అట్రాక్షన్లు లేకపోతే మూతపడే అమ్యూజ్‌మెంట్ పార్కుల గతే దీనికీ పడుతుందని యాజమాన్యానికి తెలుసు గనుక వాళ్లు ఉద్యోగులకి కొత్త కొత్త సూచనలని ఇస్తూనే ఉంటారు.

ఆ పార్కులో ఒక ఉద్యోగిని ఎలాంటి దయినా సరే కొత్తదనం చూపించమని, లేకపోతే ఉద్యోగం ఉండదని సూచనప్రాయంగా తెలియజేస్తూనూ అతని యజమాని ఒకటే పోరుచేస్తున్న సమయాన ఈ కథ మొదలవుతుంది. ఈ ఉద్యోగి సమస్య ఏమిటంటే, “ఉదర నిమిత్తం బహుకృత వేషం” చందాన, రెడ్ ఇండియన్ అంశ ఏమాత్రం లేని తను ఇండియన్ల పాత్రలని వర్చ్యువల్ రియాలిటీలో పోషిస్తూ విజిటర్లని తృప్తిపరచడం. కొండ లెక్కీ, అడవులలో తిరిగీ యాత్రా స్థలాలని దర్శించీ కొందరు తృప్తి పొందినట్లుగా ఆ ఇండియన్స్ తో మసలిన అనుభవాలకోసం కొందరు ఈ పార్కుకు వస్తారు. ఈ ఉద్యోగానికి కావలసిన అర్హతలని అతనికి సంపాదించింది పెట్టింది పాత కాలపు కౌబాయ్స్ వెర్సస్ ఇండియన్స్ సినిమాలని చూసి వాళ్ల యాసలని, సంభాషణలనీ బట్టీపట్టినట్లుగా గుర్తుంచుకోవడం మాత్రమే గాక అలా తిరిగి అప్పజెప్ప గలగడం. దినదిన గండం చందాన బతుకుని ఈడుస్తున్నాడు. ఉద్యోగం లేకపోతే భార్య అతన్ని వదిలేస్తానని చెప్పింది. ఇంకొక ఉద్యోగాన్ని వెదుక్కోవడానికి ఇంకే అంశంలోనూ సామర్థ్యం లేదని అతనికి తెలుసు.

ఈ సమయంలో వచ్చిన ఒక విజిటర్ అతనితో మాటలు కలిపి, పార్క్ బయట కూడా అతనితో సన్నిహితత్వాన్ని పెంచుకుని నిజంగా స్నేహితుడు అనుకునేలాగా మసలుతాడు. ఆ విజిటర్‌కి ఇతను పెట్టిన ఇండియన్ పేరు వోల్ఫ్. అతణ్ణి మంచి స్నేహితుడిగా భావించి భార్యకే గాక ఇంకెవరికీ చెప్పని విషయాలని కూడా వోల్ఫ్ కి చెబుతాడు. వోల్ఫ్ లో ప్రత్యేకత ఏమిటంటే, కొన్ని తరాల వెనుక అతని పూర్వీకులు (రెడ్) ఇండియన్లు. ఆ పార్కులో ఇండియన్ మూలాలు ఉన్న విజిటర్ కి ఆ జీన్స్ ఏమీ లేని ఉద్యోగి ఇండియన్ అనుభవాలని అందించడం వింత. ఆ వింత తారుమా రవుతుందా? అయితే, అప్పుడు నేటివ్ ఎవరు, విజిటర్ ఎవరు?

ఇంతకుముందు చెప్పినటువంటి మూడు అంశాలనీ కలిపి చాలా ఆసక్తిదాయకంగా అల్లిన కథ ఇది. అందుకే 2017లో ప్రతిష్ఠాత్మకమైన పురస్కారాలనే గాక పాఠకుల మెప్పుదలని కూడా నందుకుంది.

మొదట్లోనే చెప్పినట్లుగా ఇది భారతదేశం నుంచీ వచ్చిన వాళ్లకి కూడా ఇది ఎలా వర్తిస్తుందంటే –

పాతికేళ్ల క్రితం కాలిఫోర్నియా రాష్ట్రంలో భారత దేశం నుండీ వచ్చినవాళ్ల యాజమాన్యంలో భారత దేశ పదార్ధాలని మాత్రమే వడ్డించే రెస్టారెంట్లలో పనిచేసే వాళ్లందరూ ఒకే మూలాలు కలిగిన వాళ్లయివుండేవారు. పదేళ్ల క్రితం, అది వండేవాళ్లు ఎవరో తెలియకపోయినా వడ్డించేవాళ్లు మాత్రం లాటిన్ అమెరికా నుంచీ వచ్చినవాళ్లకు మార్పు చెందింది. అంతదూరం గూర్చి ఆలోచించవలసిన అవసరం లేకుండా, క్రితంవారం మాకు దగ్గరలో – అంటే, వాషింగ్టన్, డి.సి., పరిసరాలల్లో – జరిగిన ఒక విందులో దోసెలు పోసినవాళ్లు భారతీయ మూలాలు ఏమాత్రం ఉన్నవాళ్లు కారు. వండిన పదార్ధం రుచిగా ఉంటే ఎవరు వండితేనేం అని తేలిగ్గానే అంటాం కదా! మరి మూలాల అనుభవాలు కూడా ఎవరు పంచినా సరిపోతుందా?

రచయిత్రి పరిచయం:

రెబెకా రోన్‌హార్స్ అమెరికన్ ఇండియన్ మూలాలు గల వ్యక్తి. యేల్ యూనివర్సిటీ పట్టభద్రురాలు. లాయర్ కూడా. కథకు ఇచ్చిన లంకెలో ఆమె లఘు పరిచయం, ఫోటో ఉన్నాయి.

*

Avatar

తాడికొండ శివకుమార శర్మ

1 comment

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

  • వ్యాసాన్ని నిర్మించిన పద్ధతి చాలా బావుంది. మంచి కథని పరిచయం చేసినందుకు థాంక్స్.

‘సారంగ’ కోసం మీ రచన పంపే ముందు ఫార్మాటింగ్ ఎలా ఉండాలో ఈ పేజీ లో చూడండి: Saaranga Formatting Guidelines.

పాఠకుల అభిప్రాయాలు