అవిరామం!

 కరోనా కహానీలు

మె పొద్దున్నే టిఫిన్ చేసింది.

అతనూ టిఫిన్ చేసాడు. పిల్లలూ టిఫిన్ చేసారు. అత్తమామలూ టిఫిన్ చేసారు.

అందరు టిఫిన్ చెయ్యడానికి ఆవిడ టిఫిన్ చెయ్యడానికీ తేడావుంది. అందరూ టిఫిన్ చేసారు. ఆమె టిఫిన్ తయారు చేసింది.

కరోనా కాలంలో పనిమనిషి మీద ఆధారపడడం సేఫ్ కాదు గనుక తిన్న ప్లేట్లన్నీ తోమి కడిగి స్టాండుకు వేసింది. మళ్ళీ కూరలు తరిగింది. అన్నమూ పప్పూ కూరా వండేసరికి మధ్యాన్నం అయ్యింది. మధ్యాన్నం భోజనానికి అంతా సిద్ధం అయ్యారు. వడ్డించింది. తిన్నాక మళ్ళీ తోమింది. ఆతరువాత కూర్చోబోయి మేడ మీద ఆరబెట్టిన బట్టలు వుంటే తీసి తెచ్చి మడతలు పెట్టింది. ఆరోజు బట్టలన్నీ వాషింగ్ మిషన్లో వేసింది. తీసింది. ఆరేసింది. నానేసిన పప్పు రుబ్బింది. మళ్ళీ రాత్రికి కూర చేసి రొట్టెలు కాల్చింది. తినని వాళ్ళకి అన్నం పెట్టింది. తోడు పచ్చడి చేసింది. అంతా తిన్నారు. త్రేన్చారు. తను తింది. తోమింది. పొద్దున్న టిఫిన్ కోసం చెయ్యాల్సినవి చేసింది. వంటగది సర్దింది. అప్పటికే పిలుపులు. వలపులు. అరుపులు. ఆవలింతలు. బెడ్ రూమ్లో దూరింది.

మూడువందల అరవై అయిదు రోజులూ వొకే టైం టేబుల్.

ఆమెకి విసుగు రాలేదు. రాకూడదు.

అతడికి విసుగు రాకూడదు. వచ్చింది.

అయినా అతడు బాధ్యతగల పౌరుడు గనుక లాక్ డౌన్ గనుక యింటి పట్టునే వుంటున్నాడు. రిమోట్ అరిగిపోయేలా టీవీ చూస్తున్నాడు. చూసిన న్యూసే చూసి రేటింగ్ పెంచుతున్నాడు. అన్ని ఛానళ్ళకూ పంచుతున్నాడు. కానే యెంత అలవాటయినా బోరు కొట్టింది. వాట్సప్ చూసినప్పుడు బాగుంది. చూడగా చూడగా విసుగు ఆవలింతల్లా తోసుకువచ్చింది. నిద్రపోయాడు. లేచాడు. పిల్లలతో సినిమా చూసాడు. మూడో సినిమా చూడ్డం వల్లకాలేదు. తలనొప్పి వొచ్చింది. ఫేస్ బుక్కూ తిరగేసాడు. కరోనాని తిట్టుకున్నాడు.

రెండు నెలలుగా రోజూ వొకే టైం టేబుల్.

“కరోనా వచ్చినా బాగుణ్ను” అనుకున్నాడు. కాదు, అన్నాడు. ఇంటిల్లిపాదీ ఫ్రీజయి చూసారు.

“పేరుకి ఐసోలేషనే గాని వార్డులో అయితే యెంచక్కా జనం మధ్యన వుండొచ్చు” సమాధానంగా చూసాడు. ఆమె కోపంగా చూసింది. అతని అమ్మానాన్నలు పిచ్చోడనుకున్నారు. పిల్లలు నాన్నెప్పుడూ యింతే అనుకున్నారు. అయితే అతడు మాత్రం యెవరూ తనని అర్థం చేసుకోలేదనుకున్నాడు.

“ఊరెళ్తే?”

అతడి మాటకు యెవరూ ‘ఊ’ అనలేదు.

“ఫర్ సపోజ్ మీరు నెల రోజులకోసమని ఆఫీసులో అడ్జెస్ట్ చేసుకొని వూరెవెళ్ళారే అనుకోండి… వూరెళ్ళాక పద్నాలుగు రోజులు క్వారంటైన్ అక్కడ… వూర్నుంచి వచ్చాక పద్నాలుగు రోజులు క్వారంటైన్ యిక్కడ… యింకా రెండ్రోజులు మిగిలితే యిట్నుంచి వొకరోజు జర్నీ… అట్నుంచి వొకరోజు జర్నీ…” బావమర్ది లెక్కలు చెప్పాడు.

“ఊరెళ్తే… కనీసం క్వారంటైన్లో వుండొచ్చు. పిక్నిక్ మాదిరి…” పాస్ సంపాదించలేదని తిక్కతిక్కగా మాట్లాడుతూ బావమర్దిని తిట్టుకున్నాడతడు.

ఇంత నెగటివ్ థింకింగ్ మంచిది కాదన్నాడు బావమర్ది. పాజిటివ్ గా ఆలోచించమన్నాడు. కరోనా పాజిటివ్ రావడం నెగటివ్ గాని, కరోనా వల్ల అంతా పాజిటీవే అన్నాడు. మనం కూడా కరోనాని పాజిటీవ్ గానే చూడాలన్నాడు. కరోనా వల్ల యెవరికి యెన్ని లాభాలో చెప్పాలన్నాడు. ఏ విధంగా హేపీయో చెప్పాలన్నాడు. ఎవరికి యెక్కువ పాయింట్స్ వస్తే వాళ్ళే విన్నర్ అన్నాడు. టైం పాస్ అన్నాడు. నాలెడ్జ్ కూడా అన్నాడు.

“గేమ్ స్టార్ట్”

“కరోనా వల్ల యెప్పుడూ బడి వద్దనుకొనే నాకు బడికి వెళ్ళాలనిపిస్తోంది” కొడుకు నిజాయితీ నచ్చింది. అభినందిస్తూ యింకా చెప్పమన్నట్టు చూసాడతడు. “వర్క్ ఫ్రమ్ హోం కూడా బాగుంది” వాడి మాట పూర్తి చెయ్యకుండానే “ఔను, స్కూలు యెగ్గొట్టడానికి” అంది అక్క. “ఏదయినా వాడు హేపీ… థాంక్స్ టు కరోనా” అన్నాడు బావమర్ది.

“ట్రాఫిక్లో పడి వెళ్ళడం కష్టంగా వుండింది, యిప్పుడు ట్రాఫిక్కూ లేదు. వెళ్ళడానికీ లేదు” కూతురు మాటలు పూర్తికాకముందే “నువ్వు హేపీ కదా?” అన్నాడు తమ్ముడు. “ఏదయినా తను హేపీ… థాంక్స్ టు కరోనా” అన్నాడు బావమర్ది.

“సిటీలో స్వచ్ఛమైన గాలి, యెప్పుడైనా పీల్చామా? పొల్యూషన్ నుండి రిలీవ్ చేసింది” గుండెలనిండా గాలి పీల్చుకున్నాడు పెద్దాయన. “ఏదయినా గ్రాండ్ పా హేపీ… థాంక్స్ టు కరోనా” అన్నాడు బావమర్ది.

“అసలు యిలా పిల్లలూ తల్లులూ అందరం వొక చోట కలిసి కూర్చొని హాయిగా గడపడం మరి రాదు, యీ అవకాశం మునుముందు కూడా రాదు” మురిసిపోతూ అంది ముసలమ్మ. “ఏదయినా గ్రాండ్ మా హేపీ… థాంక్స్ టు కరోనా” అన్నాడు బావమర్ది.

“ఎగ్జామ్స్ లేకుండా పై క్లాసులకు ప్రమోట్ చేసారు. చదవాల్సిన పని తప్పింది. సో నేనూ హేపీ… థాంక్స్ టు కరోనా” అన్నాడు బావమర్ది.

అందరూ అతడి వంక చూసారు.

“ఊ… పని చెయ్యకుండా జీతాలిస్తున్నారు, ఆ కటింగ్స్ లేకుండా వుంటే బాగుణ్ను” అతడి మాటలకి అడ్డు తగులుతూ “రేపు కాకపోతే ఆరునెలల తరువాత అయినా మీ డబ్బు మీకు వస్తుంది, జేబులో వుండడం కన్నా బ్యాంకులో వుండడం బెటరుకదా?” అని “ఏదయినా బావ హేపీ… థాంక్స్ టు కరోనా” అన్నాడు బావమర్ది.

“పర్సనల్ వ్యూ నుండి కాకుండా పబ్లిక్ వ్యూ నుండి కూడా కరోనా పాజిటీవ్ పాయింట్స్ చెప్పండి… వూ…” ప్రోత్సహించాడు బావమర్ది.

“ఓ జోన్ పొర చిరిగిపోయింది, తిరిగి అతుక్కుంది” బావమర్ది తనే చెప్పాడు.

“చిన్నా పెద్దా కులమూ మతమూ పేదా పెద్దా తేడాలేదని నేచరు గుర్తుచేసింది” అంది ముసలమ్మ.

“గొప్ప దేశమూ పేద దేశమూ లేదు. ఇంకా చెప్పాలంటే గొప్ప దేశాల గొప్ప యేపాటిదో బట్టబయలు చేసింది” అన్నారు పెద్దాయన.

“ఈ భూమ్మీద మనిషే కాదు, మిగతా జీవరాసులూ వున్నాయని కరోనా గన్ షాట్ గా చెప్పింది. ఈ భూమి తమది కూడా అని జంతువులు జనావాసాలలోకి వస్తున్నాయి. రోడ్ల మీదికి వస్తున్నాయి” చెప్పింది కూతురు.

“అందరూ ప్రజలు కాదని, ప్రజలంటే విమానాల మీద తిరిగే వాళ్ళేనని, రోడ్డున పడ్డ వలస కూలీలను వాళ్ళ మానాన వాళ్ళని వదిలేసి మన కళ్ళని తెరిపించింది ప్రభుత్వం” అన్నారు పెద్దాయన.

“ఇంటివంట తినడం వల్ల ఆరోగ్యంగా వున్నాం” అంది కూతురు.

“హోటల్స్ పబ్స్ రెస్టారెంట్స్… వీటికి వెళ్ళకపోవడం వల్ల ఖర్చు తగ్గింది” అన్నాడు కొడుకు.

“ఫీజులు పెంచొద్దు… ట్యూషన్ ఫీజులు తప్ప మరే ఫీజులూ వసూలు చేయొద్దని ప్రభుత్వంతో ప్రకటన యిప్పించింది” అంది కూతురు.

“త్రీమంత్స్ హౌస్ రెంట్స్ పోస్టుపోన్ చేసింది కరోనా” అన్నాడు కొడుకు.

“ప్రవేటు హాస్పిటల్స్ లేకుండా కాదు, అసలు రోగులే లేకుండా అందరి ఆరోగ్యాలు నయం చేసింది కరోనా” అంది కూతురు.

“రోడ్ యాక్సిడెంట్స్ నిల్” అన్నాడు కొడుకు.

“గుడ్” మధ్యలో యెంకరేజ్ చేస్తూ అన్నాడు బావమర్ది.

“పోలీసులు లంచాలు లేకుండా బాగా పనిచేసేలా చేసింది కరోనా” అన్నాడు కొడుకు.

“ఆ లంచాలు లేవన్న ప్రస్టేషన్తోనే చితకబాది చంపేస్తున్నారు” యేదో గుర్తుకువచ్చినట్టు అడ్డం పడ్డాడు పెద్దాయన.

“రెండూ పాయింట్లే, అయితే గ్రాండ్ పా పాయింటుకు మార్కుల్లేవు” చెప్పేసాడు బావమర్ది.

“అందరికీ సమ్మర్ హాలీడేస్ యిచ్చింది కరోనా” తనవే యెక్కువ పాయింట్స్ అన్నట్టు చూసాడు కొడుకు.

“అమ్మ” అంది కూతురు.

“పిలిస్తే మన నుంచి వంట లేటయిపోయింది అంటుంది, తనని వదిలేయండి” అన్నాడు అతడు.

ఆమె అంతా వింటోంది. కాని జవాబివ్వలేదు.

మౌనం పూర్తి అంగీకారంగా తీసేసుకొని చర్చ మళ్ళీ మొదలయి మరో వైపుకి మళ్ళింది.

“ఈసారి లాక్ డౌన్ యెత్తేస్తే యెవరెవరికి యేమిమి చెయ్యాలని వుందో చెప్పండి” బావమర్ది మాట పూర్తి అయ్యీ అవకముందే-

“నేను పది రోజులు యింటి నుండి పారిపోతాను… యింటికే రాను” అందరికన్నా ముందు అన్నాడు అతడు.

ఆమె చూసింది. ఆ చూపులు అలానే నిలబడ్డాయి. దాన్ని అతడు చూడను కూడా చూడలేదు.

“ఇంటి మీద అంత వైరాగ్యం కలిగిందా బావా?” అన్నాడు బావమర్ది.

“నిజంరా… సన్యాసుల్లో కలిసిపోవాలి” నవ్వుతూ అన్నాడు అతడు.

“కూర్చున్న గుద్ద గుర్రుపెడుతుంది” సామెతని గొణిగింది ముసలమ్మ.

“నేను మా ఫ్రెండ్సూ ఆడుకుంటాం. పిజ్జా సెంటరుకు వెళతాం. ఐస్ క్రీమ్ పార్లరుకు వెళతాం. పార్కుకు వెళతాం. డే అంతా అక్కడే వుంటాం…” ఆనందంగా చెప్పుకు పోతున్నాడు కొడుకు.

“నేను మా ఫ్రెండ్సుని కలుస్తాను. మమ్మీకి చెప్పేసి టూ డేస్ వాళ్ళింట్లోనే నైట్ వుండిపోతాను. అందరితో కలిసి పిక్నిక్ యేదన్నా ప్లాన్ చేస్తాము…” సంతోషంగా కూతురు యింకా చెప్పేదే-

“మా వూరు వెళ్ళి గుళ్ళో అందరితో కూర్చొని హరికథ విని కాలక్షేపం చెయ్యాలని వుంది” వూహిస్తూన్న ముసలమ్మ ముడతల ముఖం విప్పారింది.

“నాకు మా వూరి రచ్చబండ దగ్గరికి వెళ్ళి కరోనా గురించి అసలు వాళ్ళేమనుకుంటున్నారో తెలుసుకోవాలని వుంది” పెద్దాయన మనసులో మాట చెప్పాడు.

“మరి నువ్వో మావయ్యా” అడిగాడు కొడుకు.

“చెప్తే బాగోదు” అన్నాడు బావమర్ది. ‘పర్లేదు చెప్పు’ అన్నట్టు తలూపాడు అతడు. పిల్లలు చెప్పమన్నారు. దాచ కూడదన్నారు.

“ఫ్రెండ్సుతో కలసి డే అండ్ నైట్ బీర్లెయ్యాలని వుంది” సిగ్గుపడుతూ చెప్పాడు.

‘ఓ…వ్వో’ గోల చేసారు పిల్లలు.

అప్పుడు ఆమె ప్లేట్లు పట్టుకు వచ్చింది. “అన్నానికి రండి” అంది.

“అబ్బా… యీ మూడు పూట్లూ తిండొకటి… యెవడు కనిపెట్టాడ్రాబాబూ…” బద్దకంగా లేచాడతడు.

అందరూ కూర్చున్నారు.

కూర్చున్న అందరికీ భోజనాలు వడ్డిస్తూ చెమటలు పట్టి వుంది ఆమె.

నిశ్శబ్దం చోటు చేసుకోబోతుంటే క్లయిమేట్ మార్చాలని బావమర్ది అన్నాడు.

“కరోనా యెందరినో వాళ్ళ వాళ్ళ పనులకు దూరం చేసింది. స్త్రీలకు వంటపని నుండి యింటిపని నుండి మాత్రం దూరం చెయ్యలేకపోయింది”

దుగ్గిరాల పూర్ణయ్య వార్తలు చదివిన స్టయిల్లో వుంది గొంతు.

“కరోనా కాదు కదా- దాని బాబు కాదు కదా- జేజమ్మ వచ్చినా ఆ పని చెయ్యలేదు” అని ఆమె నవ్వింది.

ఇక యెవరూ నవ్వలేదు! మాట్లాడలేదు!

(లాక్ డౌన్ యెత్తేసినా లేదూ కరోనాకి వాక్సిన్ కనిపెట్టేసినా నాకయితే క్వారంటైన్ తప్పదు. ఆడపుట్టుక పుట్టిన చాలామందికి తప్పదు- అని చెప్పిన బిందుశ్రీకి కళ్ళతడితో)

*

Avatar

బమ్మిడి జగదీశ్వరరావు

5 comments

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

  • చివరి వరకు ఆమె మౌనం …… ఆమె అంతరంగాన్ని ఆవిష్కరించింది . ఆఖరిలో ఆమె నవ్వు ….. స్త్రీ శ్రమను గుర్తించ లేని వారందరికీ చెంపపెట్టు లాంటిది.
    వాస్తవ పరిస్థితులను బాగా చెప్పారు.

‘సారంగ’ కోసం మీ రచన పంపే ముందు ఫార్మాటింగ్ ఎలా ఉండాలో ఈ పేజీ లో చూడండి: Saaranga Formatting Guidelines.

పాఠకుల అభిప్రాయాలు