అయ్యా సారూ..పిడికెడు మట్టిని అదనంగా పుట్టించండి

డిగ రాఘవేంద్ర రాయలసీమ కవి. “గాయపడ్డ విత్తనం” కవిత్వసంపుటితో సుపరిచితుడు. సామాజిక సమస్యలను వస్తువులుగా తీసుకుని కవిత్వం రాస్తారు. అతని రచనల్లో ప్రాంతీయస్పృహ కొట్టొచ్చినట్టు అవుపడుతుంది. ఇటీవల రాసిన కవిత “మా ఆత్మల మాయిని పూడ్చిన నేల”. ఒకనాడు రాయలసీమలో రతనాలు పండేవని చెప్పుకుంటారు. ఇప్పుడది కరువు సీమ. ఇక్కడి రైతులు పంటపండని భూముల్ని రొంబొచ్చెపై పడుకోబెట్టి ముదిగారంగ జోకొడుతుంటరు. తడితగలకపోదా..విత్తు మొలవకపోదా అని ఆశ. రైతు గుండెలపై పడుకున్న పసిబిడ్డలాంటి భూములవి. పానం పోయినా వదులుకుంటానికి మనసొప్పదు. ఎట్లాగూ పంటపండని భూములే కదా అనే సాకుతో కార్పోరేట్ల కన్నుపడ్డది. అగ్గువకు సగ్గువకు భూములు కొని విదేశీ సంస్థలకు ధారాదత్తం చేయాలని చూస్తుంటారు ఇక్కడి ఏలిక ప్రభువులు. ఇప్పుడూ అదే జరుగుతోంది.
పెన్నానది పరివాహక ప్రాంతంలోని “నూతిమడుగు” గ్రామంలో వున్న రాయలనాటి చెరువు కింద వున్న 8,000ఎకరాల భూమిని ప్రభుత్వం సోలార్ ప్లాంట్ కోసం కట్టబెట్టాలని చూస్తుంది. ఇప్పటికే 400ఎకరాలు కైవసం చేసుకుంది. ‘రాప్పాడు’ రైతులు తరిమికొడితే ‘నూతిమడుగు’ కొచ్చి పనులు చక్కబెట్టుకుంటున్నారు. ఎకరానికి రూ.20,000/- ఆశచూపి, పంటపండినా అంత డబ్బు కండ్లసూడరని రైతుల్ని మభ్యపెట్టి భూముల్ని లాక్కుంటున్నారు. ఇది అన్యాయమని మిగిలిన రైతులు తమ భూములివ్వడానికి నిరాకరిస్తూ ఎదురుతిరగడానికి సిద్ధపడుతున్నారు. నయానో భయానో దక్కించుకోవాలని ప్రభుత్వం విశ్వప్రయత్నం చేస్తోంది. ఈ నేపథ్యం నుండి రాసిన కవితే యిది.
*
మా ఆత్మల మాయిని పూడ్చిన నేల
~
సాయంత్రం సాటింపు
విన్నాక !
రాత్రంతా నిద్రపట్టని మెలుకువ
కన్నీళ్లయి చీకటిపల్లం లో
గండిపడ్డ చెరువులా పారింది
తెల్లారిగట్టున
వూళ్ళో ఒక్కొక్కరి
ముఖాల్లో నుంచి నేల
పెల్లలు పెల్లలుగా రాలిపోతోంది
ఆవూళ్ళో ఈ వూళ్ళో
రైతు కన్నీటి కథల్ని వార్తలుగా చదివి
అయ్యో అనుకున్నం
మనసులో ఆ దిగులు ఆరకముందే
ఇపుడు మావూరి వంతొచ్చింది !
బొడ్డుపేగు
తెంపుకున్నంత బాధ
పంటసేన్లు వొదులుకోవాలంటే !
చెవుల్లో సాటింపు జోరీగైంది !
కొత్త కథలు
రచింపబడుతున్నాయి
మా భూముల పై
పిచ్చి కుక్కల ముద్రేసి చిల్లరపైసల
మందుపెట్టి
సంపేకి సిద్ధమయ్యారు
భూమంటే కొడుకులెక్కే కదా !
ఎంత గాలికి తిరిగినా
బాధ్యత ఎరిగిన్నాడు
ఇవాళ కాకపోతే రేపైనా
పండిన చేనయితాడనేది
ముడుపు కట్టుకున్నంత నమ్మకం
రైతుది
మా ఆత్మల మాయిని పూడ్చింది
ఈ భూముల్లోనే
నేల శృతి చేసే గానం
మా గుండెల దాకా వినిపిస్తుంది
మరి అక్కడే
మా ఆత్మల హననం జరగల్లంటే ఎట్లా ?
మనిషి మనిషి మాట్లాడుకున్నట్లే
గట్టు కవతల ఇవతల
నేల మాట్లాడుకుంటుంది
రైతు – నేల ముచ్చట్లు జరుగుతుంటాయి
పసరమైన పంట భూమైన
మా ఆకలి తీర్చే సాధనాలేనా ?
ముద్ద కలిపి నోట్లోకుక్కిన
మా యింట్లో మనుషుల్లాంటివి !
బాధొస్తేనో ఏడుపొస్తేనో
పెళ్ళాంతో కసరింపో కొడుకుతో అదలింపో
అప్పులోళ్ళ బెదరింపో
రుమాలు విదిలించినట్లు
మాగుండెల్లో కొండంత భారాన్ని
వలపోసుకోదగ్గ ఒక్కగానొక్క
మిత్రుడు భూమి
రెక్కలిరిగే మాకష్టం తడి
తగిలిన బొదవుల్లో రాళ్లు కూడా
గింజయి పండుదామని
ఆరాటపడుతుంటాయి
గుక్కబట్టి ఏడ్చినప్పుడల్లా
రొమ్ములు పాలిపోయి పాలింకినా
నోటికి సన్నందించిన తల్లి – నేల
పుట్టిన కాన్నుంచి
కాడి కట్టి సాలల్లో ప్రాణంగా
నడవడమే బతుకనుకున్నోల్లం
భూమిని మీ చేతుల్లోబెట్టి
తరలిపోవాలన్న తలంపు
మనిషినంతా కుదేసి ఎగదన్నుతున్నట్లుంది
సౌరఫలకాల పాదాలకింద నేల
ఊపిరాడని పసికందై
చితికిపోతుందన్న దిగులు దుఃఖం
గునపమై గుండెలంతా గుదిగుచ్చి
తవ్వుతున్నట్లుంది
ఆమట్టి అణువణువుతో
ఇన్నేండ్ల సావాసాన్ని
తరతరాలు నడిసొచ్చిన అడుగుల్ని
ఎన్ని పరిహారాలైతే
ఆ మమకారాన్ని మా బతుకుల్ని
సవరించగలవు ?
అయ్యా సారూ ! పిడికెడు మట్టిని
బెత్తెడు నేలను అదనంగా
మా వూరిలో మీ చేతులతో పుట్టించండి
గుండెకాయనో కాలేయాన్నో
కిడ్నీనో రక్తాన్నో
కడాన మాతలకాయల్నో ఫణంగా పెట్టి
‘వుత్పత్తి బహుమానం’ కింద
మేమే మీకు చెల్లిస్తాం !!
*
ఒకసారి గతాన్ని పరిశీలిస్తే మూడేండ్ల కిందట అప్పటి ప్రభుత్వం అనంతపూర్ జిల్లాలోని పెనుగొండ దగ్గర దక్షిణకొరియా కార్ల కంపెనీ “కియా” కు ప్లాంట్ ఏర్పాటుకు అనుమతులిచ్చింది. ఇది ఇండియాలోనే మొదటి ప్లాంట్. ప్రపంచంలో ఏడవది. చెప్పుకోవడానికి ఇవికావు గొప్పలు. ప్రజల్ని ఏమార్చే తంత్రాలు. “కియా” కంపెనీ కార్ల అమ్మకాల్లో గడిచిన సంవత్సరాల్లో మూడోస్థానానికి ఎగబాకింది. ఇది కూడా ఇక్కడి ప్రజలకు కూడుబెట్టే అంశం కాదు. ఇక్కడ క్షుణ్ణంగా పరిశీలించాల్సిన విషయమేమిటంటే అప్పటి వరకు నీటిసుక్క అందని ప్రాంతానికి కేవలం “కియా” కంపెనీ కోసం కృష్ణానీటిని ఎత్తిపోతల ద్వారా ‘జీడిపల్లి రిజర్వాయర్’ నుండి ‘గొల్లపల్లి రిజర్వాయర్’ కు తరలించి కార్ల కంపెనీ దాహాన్ని తీర్చింది ప్రభుత్వం. గొల్లపల్లి రిజర్వాయర్ నిండితే అక్కడికి చెరువులకు నీళ్ళచ్చి వాటికింది భూములు తడిచి పంటలు పండుతాయనే ఎరుక “కియా”కు అనుమతులివ్వకమునుపు లేదా? అనేది అసలు ప్రశ్న. నదుల పక్కనే ఫ్యాక్టరీలు నెలకొల్పడంలోని లాజిక్ తెలియకుండానే భూముల కొనుగోలు, అమ్మకం ప్రక్రియ జరుగుతుందా? ఇక్కడైతే భూమి తక్కువరేటుకు కోట్ చేయొచ్చు. ప్రభుత్వమే నీటిసరఫరా జరిగేలా చూస్తుంది. కుక్కకు నాలుగు బిస్కెట్లు వేస్తే అదే విశ్వాసంగా పడివుంటుందనేది విదేశీ సంస్థల నీతి. ఇక్కడ కార్ల కంపెనీ వినియోగించుకునే నీటిని కూడా వ్యవసాయానికి మళ్ళిస్తే ఇంకెంత సస్యశ్యామలం అవుతుందో తెలుసుకోవాలి. అసలు ఇలాంటి పరిశ్రమలు అవసరమా? అనే దిశగా ఆలోచిస్తే సమస్యకు పరిష్కారం దొరికే అవకాశం వుంది.
*
ఇప్పుడు “సోలార్ ప్లాంట్” పేరుతో నూతిమడుగులో కూడా అదే జరుగబోతోంది. నిజానికి నూతిమడుగు పక్కనుండే పెన్నానది ప్రవహించేది (పెన్నా పేరు వినగానే విద్వాన్ విశ్వం “పెన్నేటిపాట” యాదికొత్తది). గత రెండేడ్ల నుంచి రాయలసీమలో వర్షపాతం పెరగడం గమనించవచ్చు. కాలం అనుకూలిస్తే అదే గొల్లపల్లి రిజర్వాయర్ నుంచి మడకశిర, రొద్దం, నాగులమడక మీంచి పెన్నానదిలోకి నీటిని వదిలితే “పెరూర్ డ్యామ్” నిండుతుంది. చుట్టుపక్కలున్న చెరువులు కళకళలాడుతాయి. ఆ 8,000ఎకరాలు సస్యశ్యామలం కావడం పెద్దవిషయం కాదు. ఋతువుల విషయం పక్కనబెడితే కృష్ణానీటిని పెన్నానదిలోకి వదిలే ప్రయత్నాలు (trials) గత 20 రోజులుగా జరిగాయి. పెరూర్ డ్యామ్ లోకి నీటిని తీసుకొచ్చే ప్రయత్నం ఫలవంతంగా చేయొచ్చని ఋజువైంది. ఇలాంటి సమయంలో భూములు అమ్మాలని రైతులపై ఒత్తిడి పెంచడం సరియైంది కాదు. ఇక్కడ ప్రభుత్వం యొక్క ద్వంద్వనీతిని పసిగట్టగలగాలి. పెన్నాలోకి నీటిని వదిలే trails చేయడమూ, భూముల సేకరణకు వుసిగొల్పడమూ రెండూ ప్రభుత్వం చేసే పనులే. ఈ నేపథ్యంలోంచి పుట్టుకొచ్చిందే ఈ కవిత.
*
కవి చెబుతున్నాడో, బాధితుల పక్షాన నిలబడి ఏం మాట్లాడుతున్నాడో, వారి గోడును ఎలా తర్జుమా చేస్తున్నాడో చూడొచ్చు. తెగదెంపులకు, ఇడుపుకాయిదానికి దండుగ కట్టిచ్చినట్టు తల్లిబిడ్డల బంధానికి వెలకడుతున్న తీరును విషాదరాగంగా ఆలపించడం కనిపిస్తుంది. తల్లినుండి బిడ్డను వేరుచేయాలంటే బొడ్డుపేగు కోయాల్సిందే. రైతుది, పంటభూమిది కూడా తల్లిబిడ్డల బంధమే. వేరుచేయాలనుకోవడం ఎంత దుర్మార్గం! భూములు కోల్పోతున్నామనే వార్త చెవినపడ్డప్పుడు వారి స్థితిని చెప్పడానికి “చీకటి పల్లంలో గండిపడ్డ చెరువులా కన్నీళ్ళు పారడం, ఒక్కొక్కరి ముఖాల్లోంచి నేల పెల్లలు పెల్లలుగా రాలిపోవడం” లాంటి ఉపమానాలు చెబుతాడు కవి.
*
ఎందుకూ కొరగాని, సరితూగని పరిహారం ఎవడిక్కావాలి? జరగబోయే విధ్వంసం గురించిన బాధ, తండ్లాటను కండ్లకుగట్టడం అగుపడుతుంది. భూమి పంట పండకున్నా ముసలి తల్లిదండ్రుల్లా కండ్లముందు అవుపడితే అదో ధీర. చేతికిరావాలంటే కొడుకు బతికుండాలన్నది పంటచేన్లకూ వర్తిస్తుంది. ఎప్పుడో ఒకసారి సారంలేని నేలకూడా సాలు పంటకైనా తన్నుకులాడుతది. రైతుకు ఏ కష్టమొచ్చినా మట్టితల్లికే మొరపెట్టుకుంటడు. పంటభూమిని బువ్వ పెట్టె మనిషిగా, ఇంట్లో ఒకరిగా చెప్పుకుంటడు రైతు.
*
జరగబోయే ఎడబాటును తలుచుకుని రైతు మట్టితో ఎడతెగని సంభాషణలతో వలపోయడం కనిపిస్తుంది. ప్రాణం మొత్తం భూమి మీదనే పెట్టుకున్న రైతు అదే మట్టికి దూరమవడం భరించలేడు. భూమిని కొడుకులెక్క సాదుకునే గుణమున్నోడు. నమ్మకం మీద నడిచే సంసారమది. కొడుకెంతో భూమి కూడా అంతే. ఇంక్కొంచెం ఎక్కువే అని చెప్పాలి. భూమి మీద రైతుకున్న అవ్యాజమైన ప్రేమకు ఏదీ సాటిరాదు. అందుకే రైతు అయ్యా సారూ పిడికెడు మట్టిని అదనంగా పుట్టించి ఇవ్వమని ప్రాధేయపడుతాడు. అందుకు తనను తానే నిలుపుదోపిడీ ఇచ్చుకుని “వుత్పత్తి బహుమానం” చెల్లిస్తానంటున్నాడు.
*
ఎక్కడా ఆగకుండా తన సాహిత్యప్రయాణం కొనసాగాలని కోరుకుంటూ, హృద్యమైన కవిత్వం రాసిన కవికి శనార్తులు.
*
Avatar

బండారి రాజ్ కుమార్

5 comments

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

  • కవితని ఇంత హృద్యం గా అర్థo చేసుకొని నా భావాలను నీ మాటల్లో చెబుతుంటే నాకే ఆర్ద్రత గాను నా కవిత పట్ల నాకే ముచ్చటగానూ ఉంది…ఒక కవితను విశ్లేషణ చేసే ముందు దాని వెనుక నువ్వు చేసే పరిశ్రమ కు నీ మీద నాకు గౌరవాన్ని పెంచింది
    ధన్యవాదాలు మిత్రమా

  • రైతు పడే బాధ ని కవిత్వం ద్వారా చక్క గా వివరించారు

  • భూమి ఉండే మమకారాన్ని ఒక రైతు బిడ్డ గా కవిత రూపంలో చాలా చక్కగా ఉంది. అలాగే పాలకుల కు పరిశ్రమ ల పేరుతో భూమి ని రైతు నుండి దూరం చేసి వాచ్మెన్ గా ఉద్యోగం ఇచ్చే పరిస్థితి ని వాటినే గొప్పగా చెప్పుకొనే మన పాలకులు .చాలా చక్కగా వివరించారు…ధన్యవాదాలు మిత్రమా

‘సారంగ’ కోసం మీ రచన పంపే ముందు ఫార్మాటింగ్ ఎలా ఉండాలో ఈ పేజీ లో చూడండి: Saaranga Formatting Guidelines.

పాఠకుల అభిప్రాయాలు