లైలా మజ్ను

లైలామజ్ను కావ్యం గురించి

లైలామజ్ను పారశీక భాషలో నిజామీ గంజవీ (క్రీ.శ.1140- 1209) రాసిన మహాకావ్యం. నిజామీ మన నన్నయకంటే సుమారు నూరేళ్ళ తర్వాతివాడు. తిక్కనకు కొంచెం ముందువాడు. కందుకూరి వీరేశలింగంగారిచ్చిన తేదీని మనం ఒప్పుకుంటే నన్నెచోడుడు తెలుగులో కుమారసంభవం స్వతంత్రకావ్యంగా రచిస్తున్నప్పుడే నిజామీ ఇప్పటి అజర్‌ బైజాన్‌లోని గంజ్‌లో కూర్చుని లైలామజ్నూ కూడా రాస్తుండివుండవచ్చు.

పర్షియన్ సాహిత్యంలో నిజామీ చాలా పెద్ద పేరు. నిజామీ కావ్యపంచకం ‘ఖమ్సా’ అనే పేరుతో ప్రపంచసాహిత్యంలో సుప్రసిద్ధం. లైలామజ్ను అనే కల్పిత కథ అందులో ఒకటి. భారతదేశంలో అమీర్ ఖుస్రో దెహలవీ (క్రీ.శ.1253-325) నిజామీ కావ్యపంచకాన్ని వున్నదున్నట్టుగా స్వీకరించి తిరగరాశాడు. అమీర్ ఖుస్రో కూడా పారశీలోనే ఈ ఖమ్సా రాసినప్పటికీ అది భారతదేశానికి ప్రత్యేకమైన హిందవీలో వుంది. తర్వాతి కాలంలో హిందుస్తానీగా పేరొచ్చిన ఉర్దూ భాషకిది పూర్వరూపం. నిజామీ ఖమ్సాకున్నంత పేరు అమీర్ ఖుస్రో ఖమ్సాకూ వుంది. భారత ఉపఖండంలోనూ ఆ చుట్టుపక్కలా లైలామజ్నూ కథ అందరి నోళ్ళలోనూ నానిపోవడానికి అమీర్ ఖుస్రో రచనే మూలకారణం.

  నిజామీ గంజవీ ఒక సూఫీ మహాకవి. సూఫీలు ఇస్లాంలో విశ్వమానవ ప్రేమను  శ్వాసిస్తూ  రచన చేస్తారు. కథాకావ్యంగా అది మలచడమే నిజామీ ప్రత్యేకత. నిజామీ సమకాలికుడైన ఉమర్ ఖయ్యాం రచన చూస్తే నిజామీ ప్రత్యేకత తెలుస్తుంది. నిజామీ మీద ఉమర్ ఖయ్యాం ప్రభావం వుందో, ఉమర్ ఖయ్యాం మీదే నిజామీ ప్రభావం వుందో ఇదమిద్దంగా తేల్చి చెప్పడం కష్టం. నిజామీ మీద కాళిదాసు ప్రభావం మాత్రం స్పష్టంగా వుంది.

సూఫీలు కడు స్వతంత్రులు. మనిషిమీద మనిషి ఆధిపత్యాన్ని అంగీకరించరు. ఎంత వినమ్రులో అంత మొండిఘటాలు. ఒకసారి అతా బేగ్ అనే ప్రభువు నిజామీగురించి విని తన ఆస్థానానికి రమ్మని ఆహ్వానం పంపించాడు.

“నేనొక ఏకాంతవాసిని. రాజుల్తో నాకేం పనిలేదు,” అని నిజామీ సమాధానం పంపించాడు. అతా బేగ్ చాలాకాలంపాటు నిరీక్షించి చివరికి తనే నిజామీని దర్శించుకున్నాడనేది ఒక కథనం. ఈ కథ నిజమే కావచ్చు. ఎందుకంటే లైలాని తప్ప ప్రపంచంలో మరొకర్ని పట్టించుకోని మజ్నూలో అదే తత్వం మనం చూడొచ్చు. మజ్నూలాంటి పిచ్చి ప్రేమికుడి మనస్తత్వాన్ని గురించి చెప్పడానికి షేక్స్‌పియర్‌కి మించి అర్హులెవరు? ‘హీ విల్ నాట్ బి కమాండెడ్,’ అని ఒక్కమాటలో తేల్చేశాడు.

దాదా హయాత్ ప్రస్తుతం తెలుగు చేస్తున్న లైలామజ్నూ కావ్యానికి జేమ్స్ ఆట్కిన్సన్ చేసిన ఆంగ్లానువాదం మూలం. జేమ్స్ ఆట్కిన్సన్ ఇప్పటి పశ్చిమ బెంగాల్‌లోని బారాక్‌పూర్‌లో ఈస్టిండియా కంపెనీవారి తరఫున మెడికల్ ఆఫీసరుగా పనిచేసేవాడు. సొహ్రాబ్, పిరదౌసి షానామా సంక్షిప్త కావ్యం, చాస్ని(Tassoni) కవి ‘లా రఛియా రఫిటా’ ఇటాలియన్ కావ్యానికి ఆంగ్లానువాదం ఆట్కిన్సన్ ఇతర రచనలు.

1835లో ఆట్కిన్సన్ లైలామజ్ను ఆంగ్లానువాదం మొదటి ప్రచురణ జరిగింది. నిజామీ మూలానికి కావ్యరూపంలో వున్న ఆంగ్లానువాదం ఇదొక్కటే కావచ్చు.

 

 

పారశీక మూలం: నిజామి గంజవి
ఆంగ్లానువాదం: James Atkinson (1915)
తెలుగు: దాదా హయాత్
మొత్తం ఆశ్వాసాలు: 19

ప్రపంచానికి ప్రేమసందేశం

 

నిజామీ పారశీక మహాకావ్యం

 

లైలా మజ్ను

 

ప్రస్తావన

 

మాది కదా ప్రేమదారి!

వినిపించ వలసిందే-

కక్షలు కార్పణ్యాలతో

కుళ్ళుతున్న లోకానికి

 

శ్వేతసౌధంలోపల

చల్లగా పడుకుంటూ

వంచనతో కుట్రలతో

పెత్తనాలు సాగిస్తూ

 

మనుషుల ప్రాణాలను

లాభాలతో తూస్తూ

తన పబ్బం గడుపుకునే

మృత్యు బేహారికిపుడు.

 

ఇంకెంత విడదీస్తావ్

మనిషినుంచి మనిషినీ?

ఎన్నిసార్లు విభజిస్తావ్

గ్లోబులోని దేశాల్ని?

 

డాలర్ల ఖణఖణలో

చెవులు మూసుకుపోయి

నువ్వెక్కడ వింటావు,

నీకెక్కడ మనసుంది?

 

అయినా వినిపించాలి,

ప్రపంచం శ్వాసలోన

కలిసిపోయిన గేయం

అలిసిపోలేదింకా!

 

నీ ఆటలు చాలించు,

వచ్చి కూర్చొని విను

దిక్కులేక దీనుడై

విలపించే మజ్నూని!

 

సమాధినుంచి ఎక్కడో

వినిపిస్తున్నది చూడు

ఆక్రోశంతో లైలా

పాడుతున్న పాటొకటి!

*

 

1

మధువేగా నా ఆరాధన!

నీకు తెలియదా మరి సాకీ?

మధురాతిమధురమీ పానం!

అందించవా నా మధుపాత్ర!

 

మధువు! జలజలా జారిపోయేటి

నా కన్నీటి ధారలా మధువు!

పొంచిన విరహవేదన భీతి

ఎంచి తరిమి కొట్టేటి మధువు!

 

మధువు సుమా మరి నా ప్రేరణ!

నా ధృతియే మరి మధువు సుమా!

ఘోరమౌ జీవన సమరాన

మధువు సుమా నా ఆలంబన!

 

మధువిచ్చిన ప్రేరణ మీర

ముదమారా నా మనసారా

మీటనా ఇక ఈ విపంచిక,

పాడనా మరి ప్రణయగీతిక!

 

పరుగులిడుతూ చెంగుచెంగున

వనాలలో పడి స్వేచ్ఛగా

తిరుగాడే ఆ హరిణాలను

వేటాడే సింహం నువ్వే.

 

సింహం లాగే నేను సైతం

కారడివిని విహరిస్తానిక;

ఆనందం వేటాడి తెచ్చి

నా ఇంటిని సవరిస్తానిక.

 

ఇలలోపల వెలలేనిది యిది,

జీవితంలో తీయనైనది;

మరి సాటిలేని సంపద యిది-

మధువు గ్రోలిన ఈ పులకింత.

 

అందించు సాకీ అందించు

మిలమిల మెరిసే మణిదీపం,

నీ నుదుటను వెలిగే అరుణిమ,

ఎర్రని ఆ మధుపానీయం.

 

కాంతులీనే నీ రెండు కళ్ళూ

ఆ వెలుగే వెదజల్లుతాయి,

దరహసించే ఆ నయనాలు

మరెంతగానో మెరుస్తాయి.

 

ఇచ్చేయి ఇచ్చేయి సాకీ,

ద్రవరూప మణి నాకిచ్చేయి;

అది నాకిచ్చే శక్తి చూడు,

చూడు మరింక దాని మహత్తు.

 

ముందువెనకాల ఎవరు నాకు?

లేరు సుమా నా పూర్వీకులు;

నా పిమ్మట మరి ఎవరు లేరు,

లేరెవరూ నాకు వారసులు.

 

ఆదామునుంచి అందుకున్న

వారసత్వం అదేమి నాకు?

దుఃఖంతో కుంగిన హృదయం,

బాధల అలమటించే ఆత్మ.

 

అనాదినుంచీ మనిషి బతుకు

యేముందీ మరి యేముందీ?

ముద్రపడిన నేరం కొంతా,

అపరాధ భావన మరికొంత.

 

మోసగించినవాడు మనిషే,

మోసపోయినవాడు మనిషే,

నీడచాటున సాలెపురుగై

పొంచివుండేవాడు మనిషే.

 

అయినా మంత్రమై పారేది,

మనసు సేద తీర్చేది మధువు;

దిగజారిపోయే హృదయాన్ని

పట్టి లేవనెత్తేది మధువు.

 

ఎందుకు సాకీ సందేహం?

నా సంజీవని నాకందివ్వు;

వెనుకాడకు మరి తారాడకు,

ఈ హాయే నా ప్రాణదాత.

 

రా, ఇలా వచ్చేయి! తే మరి,

ఎర్రని ఆ ద్రాక్షాస్రవాన్ని;

తే తే! కస్తూరి పరిమళం

కలగలిసిన ఆ మధురసాన్ని.

 

చుక్క గ్రోలితే చాలు సుమా,

కదిలివచ్చే మనోగతాలు;

లేచివచ్చే ఏళ్ళతరబడి

మూలపడిన జ్ఞాపకాలు.

 

ఎరుపెక్కిన చెక్కిలితో

ఆకాశం వెలుగువేళ,

నింపవా నా మధుపాత్ర

అంచుదాకా పైపైకి.

 

గ్రోలనిస్తే ఆ మధువు,

ఎండిపోయిన ఈ పెదవి

చిరునవ్వుల మూయగలదు

వెతలపైన పరదాలను.

 

అలిసిపోయే దారిలో

వెలుగుచూపే కిరణమిది,

రేయిపగలు దారివెంట

పూలుపరిచే మాలి యిది.

 

సాగిపోయే ప్రతిక్షణం

ఆనందం అలుముతుంది,

అత్యున్నత శిఖరాలకు

మనసు లేవనెత్తుతుంది.

 

చక్రవర్తి వైభవాలు

చవులూరా చూపుతుంది;

అయినా జాగ్రత్త సుమా!

రాచజాతి చేటు సుమా!

 

చిరునవ్వులు వారితోటి

ససేమిరా పంచుకోకు,

ముసినవ్వులు మోసాలే!

దావాగ్నులు మేలుసుమా!

 

ఆకట్టుతుంది అగ్నిశిఖ,

అయినా మరి తెలుపుతుంది-

దూరాన్నే వుండాలని,

మేను కాలిపోతుందని.

 

దీపకాంతి ప్రేమలో పడి

కాలిపోయే భ్రమరమైనా

కొంచెమైనా లెక్కచేయదు

రాచవారి దురభిమానం.

 

తే తే! కస్తూరి పరిమళం

కలగలిసిన ఆ మధురసాన్ని;

ఆనందం తలుపులు తెరిచే

తాళంచెవి అదే సుమా!

 

కానరాని సిరులెన్నో

తలుపు తెరిచి చూపుతుంది,

ఎనలేని విభవానికి

మనసు పొంగిపొరలుతుంది.

 

కోపతప్త హృదయానికి

మధువు నివురు కప్పుతుంది,

చెప్పలేని దయాగుణం

మంత్రంలా పారుతుంది.

 

కానివ్వు మరి తెచ్చివ్వు

మరో పానపాత్ర నాకు,

చిక్కటి ఆ మధుపానం

ఇంకాస్త, మరి యింకాస్త!

 

మనసారా గ్రోలాలని

దప్పికతో వున్నాను,

ముంతలోంచి మరికాస్త

తాజాగా ఇంకాస్త!

 

తడియారిన పగుళ్ళతో

దాహార్తుని ఎండు పెదవి

మధువు కాస్త చిలికించక

మోడువారి వాడనీకు.

 

రా సాకీ, వచ్చేసెయ్!

జవం గల పాదాలతో,

రయం గల కవిత ముందర

ఓడిపోక పరుగున రా!

 

గుండెలోన పేరుకున్న

దుఃఖమనే కల్మషాన్ని

ఈ ద్రాక్షాస్రవంతో

కడిగిపారవేయనివ్వు.

(ఇంకా వుంది)

దాదా హయాత్

5 comments

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

‘సారంగ’ కోసం మీ రచన పంపే ముందు ఫార్మాటింగ్ ఎలా ఉండాలో ఈ పేజీ లో చూడండి: Saaranga Formatting Guidelines.

పాఠకుల అభిప్రాయాలు