అమ్మ పనికి పోయింది!

ప్పుడంటే వారానికొకసారో, రెండువారాలకి ఒకసారో అమ్మకి ఫోన్ చేసి మాట్లాడుతూ “నువ్వసలు ఫోనే చేయవు. వారానికొకసారి చేస్తారా ఎవరైనా? రెండుమూడు రోజులకి ఒకసారైనా చేయొచ్చుగా, అసలు హైద్రాబాదుకి పోతే ఇంట్లోవాళ్ళున్నారనే విషయమే మర్చిపోతావేమో…” అని తిట్లు తింటుంటాను కానీ, చిన్నప్పుడు మా అమ్మ లేనిదే ఏపనీ చేసేవాడిని కాదు.

మా అమ్మ ఎక్కడికి వెళ్తే అక్కడికి వెంటవెళ్తూ ఉండేవాడిని. పెళ్ళిళ్ళకి, పేరంటాలకీ అని సంబంధం లేకుండా మా అమ్మ ఎక్కడుంటే అక్కడ వెనకాలే ఉండేవాడిని. పొరపాటున ఎప్పుడైనా నేను లేకుండా మా అమ్మ వెళితే అందరూ “ఎక్కడికి పోయినాడమ్మా నీ చిన్నకొడుకు? బానే తప్పించుకోని వచ్చినావే..!” అనేవారు అని చెప్తుంది మా అమ్మ.

కట్టెలపొయ్యి ముందు కూర్చొని మా అమ్మ వంట చేస్తుంటే నేను కూడా వెళ్ళి పక్కనే కూర్చొనేవాడిని. పప్పు చేసేటప్పుడు ఆ పప్పు ఉడికిందో లేదో చూడటానికి గరిటెతో కొంత పప్పుని బయటికి తీస్తే చిన్న ప్లేట్ తెచ్చుకుని అది అందులో పెట్టించుకుని తింటూ కూర్చునేవాడిని. అన్నం ఉడికేటప్పుడు అయితే నా ప్రశ్నలకి అంతే ఉండేది కాదు. “ఆ గంజి వార్చకుండా అలానే వదిలేస్తే ఏమవుతుంది?”, “ఇప్పుడిందులో చక్కెర వేస్తే తీపన్నం అవుతుందా?”, “ఇందులో బెల్లం వేసి అదే తిందామా పప్పు లేకుండా?”, “కోడిగుడ్డు వేసినప్పుడు అది ఉడకకుండా పగిలిపోతే?” ఇలాంటి ప్రశ్నలన్నీ అడిగేవాడిని. ఒకసారి అడిగినవే మర్చిపోయి మళ్ళీమళ్ళీ అడిగేవాడిని. ఎన్నిసార్లు అడిగినా అమ్మ మాత్రం విసుక్కోకుండా సమాధానాలు చెప్పేది. అన్నం, పప్పు వండేలోపు పొయ్యిపక్కనున్న పొంతలో నీళ్ళు కాగితే ఆ నీళ్ళతో స్నానం చేయించేది. నూనె టిఫిన్‌లో నూనె ఎంతుందో చూసి కొంచెం ఎక్కువుంటే వడియాలు వేయించేది. లేదంటే చింతొక్కో, కొబ్బరి కారమో పెట్టి కొంచెం కొంచెం నంజుకుంటూ తినమని చెప్పేది. అన్నం కలుపుకోడానికి బద్దకమై ప్లేటులో పెట్టినంత తిని చేయి కడుక్కుంటున్నా అని తెలిసి అన్నం కలిపి పెట్టేది కొన్నిసార్లు.

అన్న, అక్క నాకంటే కొంచెం పెద్దవాళ్ళు కావటంతో వాళ్ళిద్దరూ కలిసి వాళ్ళ స్నేహితులతో ఆడుకునేవాళ్ళు. నాకున్న ఒక్క ఫ్రెండు మా అమ్మే. ఇంటిపక్కన ముసలివాళ్ళతో బారాకట్ట(అష్టాచమ్మా లాంటిది) ఆడితే నేనూ పక్కనే కూర్చుని ఆటలో మునిగిపోయేవాడిని. చింతపిక్కలతో అమ్మ ఆడితే, బారాకట్టలోని పావులని అమ్మ చెప్పినట్టు నేను జరిపేవాడిని. మా అమ్మకి అసిస్టెంట్‌లాగా అన్నమాట. మా అమ్మ తనతో ఆడే వాళ్ళందర్నీ ఓడించేది. అప్పుడు వాళ్ళు “తల్లీకొడుకులు బలే తెలివైనోళ్ళులే…” అనేవాళ్ళు. అప్పుడప్పుడు మా అక్క, వీధిలోని పిల్లలతో కలిసి తొక్కుడుబిళ్ళ ఆడేవాడిని. వేరే అబ్బాయిల అమ్మలు వచ్చి “ఆడపిల్లల మాదిరి ఈ ఆటేందిరా?” అని తిట్టి పిల్చుకునిపోయేవాళ్ళు. మా అమ్మ మాత్రం మేం ఆడే ఆట చూస్తూ కూర్చునేది.

నాకు ఎనిమిదేళ్ళు నిండేవరకు కూడా మా అమ్మ ఇంటిపని చూసుకుంటూ ఇంట్లోనే ఉండేది. నా మూడవతరగతి అయిపోయే సమయానికి మొదలైంది మొత్తం. ఇంట్లో ముగ్గురు పిల్లలు పెరుగుతూ ఉండటంతో ఖర్చులు కూడా పెరిగాయి. మా నాన్న అప్పుడు కౌలు రైతు కావడం మూలాన అప్పులు ఎక్కువగా, డబ్బులు తక్కువగా ఉండేవి. ఇలా అయితే ఇంక బండి ముందుకెళ్ళదు అని మా అమ్మ కూడా పనికెళ్ళటం మొదలుపెట్టింది. ఇదంతా మేము మా ఊరొదిలి మా అమ్మమ్మ వాళ్ళ ఊరు చేరాక మొదలైంది.

ఆ ఊరిలో ఎక్కువగా పట్టుచీరలు నేసేపని చేసేవారు. దానికి సంబంధించి ‘అచ్చు అతకడం’ అనే ఒక పని ఉండేది. ఒక్కో పట్టుపోగును మరో పట్టుపోగుతో అతికించడమే ఆ పని. అలా పదహారువేల పోగులను అతికిస్తే పని పూర్తయ్యేది. అప్పుడు అవి ఒక పట్టుచీర వెడల్పుకి సరిపోయేంతగా అయ్యేవి. ఈ పనంతా చీరనేసే మగ్గం ఉన్నచోట చేయాలి. అంటే ఎవరి మగ్గానికి ఆ పని కావాలంటే అక్కడికెళ్ళి ఆ పని చేసి రావాలి. మా పెద్దమ్మ కూడా అదే పని చేస్తుండేది. మా అమ్మ, మా పెద్దమ్మ వెంట వెళ్ళి పట్టుపోగులు ఎలా అతికించాలో గమనించేది. అప్పుడప్పుడు మా పెద్దమ్మ పర్యవేక్షణలో కొన్ని పోగులు అతికించేది. అలా రెండు, మూడు నెలలకి ఆ పని నేర్చుకుంది మా అమ్మ.

అంతకుముందు నేనెప్పుడు ఆడుకుంటూ ఇంటికెళ్ళినా ఇంట్లో కనిపించే మా అమ్మ పనికెళ్ళటం మొదలుపెట్టిన తర్వాత సాయంత్రం దాకా కనిపించకపోవటం చాలా కష్టంగా ఉండేది. పొద్దున నన్ను బడికి పంపాక పనికెళ్ళేది. సాయంత్రం నేను బడి నుండి వచ్చాక చాలాసేపటికి వచ్చేది. ఒక పని పూర్తికావాలంటే మొదట్లో రెండురోజులు పట్టేది మా అమ్మకి. పదహారువేల పోగులు ఒక్కొక్కటి అతికించాలిగా మరి! అంత చేసినందుకు గానూ వందరూపాయల కూలి ఇచ్చేవారు. అలా వారంలో ఏడురోజులూ పనికేళ్ళేది అమ్మ. అప్పట్లో పట్టుచీరల పరిశ్రమ కొంచెం లాభాల్లోనే ఉండేది. కాబట్టి ఒకరి ఇంట్లో పనైపోతే ఇంకొకరి ఇంట్లో ఉండేది. కొన్నిరోజులకి ఒకటిన్నర రోజుల్లోనే పూర్తిచేయటం వచ్చేసింది. అప్పుడు రెండో రోజు మధ్యాహ్నానికల్లా పూర్తిచేసేసి వచ్చి మధ్యాహ్నం నుండి వేరే వాళ్ళ పనికి వెళ్ళేది.

అప్పుడప్పుడూ సాయంత్రాలు అమ్మతోపాటు కూర్చుని తర్వాతి పదిరోజులు ఏయే రోజుల్లో పనులున్నాయో, ఏదైనా రోజున పని లేదేమో అడిగి తెలుసుకునేవాడిని. ఒకవేళ ఆరోజు ఆదివారమైతే అమ్మతో ఉండొచ్చు అనే ఆశ. పొద్దున్నే బడికి వెళ్ళి సాయంత్రానికి తిరిగిరావటం, అమ్మ వచ్చేదాకా ఎదురుచూడటం, వచ్చాక  అమ్మ పెట్టే టీ తాగుతూ ముచ్చట్లు పెట్టడంతో గడిచాయి చాలా నెలలు.

అమ్మ పనికెళ్ళటం మొదలుపెట్టాక కొన్నినెలలకి ఇంటికి గ్యాస్‌పొయ్యి వచ్చింది. అప్పటికి నేనే టీ పెట్టడం నేర్చుకున్నాను. అమ్మ చేసేది వెలుతురు మీద ఆధారపడిన పని కావడంతో కొంచెం చీకటిపడేలోపే అమ్మ వచ్చేసేది. దాన్ని బట్టి నేను టీపెట్టి అమ్మకోసం ఎదురుచూసేవాడిని.

కొన్నిసార్లు నేను బడినుండి ఇంటికెళ్ళేసరికి ఒక చిన్న ప్లాస్టిక్ బకెట్, దాని మూత పైన కొంత చిల్లర ఉండేది. అంటే ఆరోజు నాకు ఒక ఎక్స్‌ట్రా పని అన్నమాట. అందులో జొన్నలు కానీ, గోధుమలు కానీ ఉంటాయి. వాటిని తీసుకెళ్ళి పిండి ఆడించుకుని తీసుకురావాలి. ఆరోజు రాత్రికో, తర్వాతి రోజు ఉదయానికో అవి రొట్టెలుగా మారేవి. అలా ప్లాస్టిక్ బకెట్ కనపడగానే “గోధుమలు అయితే బావుండూ. గోధుమలు అయ్యుండాలి దేవుడా…” అనుకుంటూ మూత తెరిచేవాడిని. కానీ చాలాసార్లు అందులో జొన్నలే ఉండేవి. “ఏంటమ్మా ఎప్పుడూ జొన్న రొట్టెలేనా? చపాతీలు చేయొచ్చుగా?” అనడిగితే “నువ్ పెద్దయ్యాక డబ్బులు బాగా సంపాదిస్తే అప్పుడు రోజూ చపాతీలే చేసిపెడతాలే” అనేది మా అమ్మ. ఇదే ప్రశ్నకి నేను ఇంకా చిన్నగున్నప్పుడు మాత్రం “ఒక ఊరిలో ఒక మనిషి ఉండేవాడు. అతనే అందరికంటే బలవంతుడు. ఎంతమందినైనా ఓడించగలిగేవాడు. అతను జొన్నరొట్టెలు తినేవాడు అందుకే అంత బలం…” అంటూ వేరే కథ చెప్పేది. మన వయసుని బట్టి అమ్మ మనకి చెప్పే మాటలు మారుతాయి కదా!

నా పదవ తరగతి అయిపోగానే పై చదువుల కోసం పులివెందుల వెళ్ళాల్సి వచ్చింది. అప్పట్నుంచి దసరాకి ఒక వారం, సంక్రాంతికి ఒక వారం, వేసవిలో ఒక నెలరోజులు సెలవులు దొరికేవి. మధ్యలో ఎప్పుడైనా ఇంటికెళ్ళి వద్దాం అనే ఆలోచన కూడా వచ్చేది కాదు. మహా అయితే రంజాన్, బక్రీద్ పండుగల కోసం రెండురోజులు అంతే. బస్‌చార్జీలకయ్యే ఖర్చుతో సగం సెమిష్టరు గడిచిపోయేది మరి.

దసరాకి ఇంటికివెళ్ళే ముందురోజే ఇంటికెళ్ళాక అమ్మతో ఏమేం వండించుకుని తినాలో లిస్టు రాసుకుని వెళ్ళేవాడిని. ఇంట్లో ఉండే వారం రోజుల్లో ఒక్క రెండు రోజులైనా అమ్మ ఇంట్లో ఉంటే బావుండు అనుకుంటూ వెళ్ళేవాడిని. చాలాసార్లు అమ్మకి దాదాపు ప్రతిరోజూ పని ఉండేది. మొదటి ఆరు రోజులు గడిచిపోయాక        ఇంకొక్కరోజు మిగిలిపోతే రేపు పండుగ రోజు కదా రేపెవరు పని పెడతారులే అనుకునే వాడిని. కానీ మా అమ్మ ఆ తర్వాతి రోజు నిద్రలేచి రోజూ లాగానే త్వరత్వరగా పనులన్నీ చేసిపెట్టి పనికి వెళ్ళడానికి సిద్ధమయ్యేది. “అదేంటమ్మా, పండుగరోజు పనేంటి? ఎవరు పిలిచారు?” అనడిగితే “ఈరోజు పని బాషా మామ వాళ్ళది. వాళ్ళు దసరా పండగ చేసుకోరు కదా…” అనేది. అలా మూడు నెలలు అమ్మకి దూరంగా యూనివర్సిటీలో ఉండి వచ్చినా ఒక్కరోజు కూడా పూర్తిగా అమ్మతో ఉండటానికి వీళయ్యేది కాదు. పైగా ఇంకో మూడు నెలలు అలా ఉండాల్సి వచ్చేది.

ఇలాంటి దసరాల తర్వాత వచ్చే సంక్రాంతులైనా నాపై దయ చూపిస్తే బావుండు అనుకునేవాడిని. కానీ సంక్రాంతికి కూడా ఏడురోజుల ఉపాధిహామీ లభిస్తే అంతే ఇక. మా అమ్మతో నేను ఒకరోజు మాట్లాడుతూ గడపటానికి ఒక వేసవి నుండి మరొక వేసవి దాకా ఎదురుచూడాల్సి వస్తుందనే ఆలోచన చాలా బాధపెట్టేది.

కొన్నిసార్లు అమ్మ చేసేపని తెలిసిన వాళ్ళ ఇంట్లోనే ఉండేది. అప్పుడైతే అక్కడికే వెళ్ళి మాట్లాడుతూ కూర్చునేవాడిని. ఒక్కోసారైతే అమ్మని పనికి పిలవడానికి ఎవరూ రాకూడదు అని దేవుణ్ని కోరుకునే వాడిని. అది నిజంగా జరిగినప్పుడల్లా నేను కాలేజీకి వెళ్ళటం ఆలస్యమయ్యేది. “డబ్బుల్లేకపోవటం వల్లే కాలేజీకి లేట్‌గా వెళ్ళాల్సి వస్తోంది. నా వల్లనే…” అంటూ డబ్బులిచ్చి పంపేది అమ్మ. అప్పుడు అమ్మని అలా చూస్తే నేనలా కోరుకుని ఉండాల్సింది కాదు అనిపించేది. కొన్నిసార్లు అచ్చు అతికే పని లేకపొతే పొలం పనులకి కూడా వెళ్ళేది. అప్పుడప్పుడు నేను కూడా మా అమ్మతో కలిసి రేగుపళ్ళు ఏరడానికి వెళ్ళేవాడిని.

నా చదువైపోయేనాటికి మా అమ్మ బయటికెళ్ళి చేసే పనులు పూర్తిగా మానేసింది. ఇప్పుడు హాయిగా అమ్మతో గడపొచ్చు అనుకుని బీ.టెక్ అయిపోయాక అమ్మతోపాటు కలిసి తనకిష్టమైన పాటలు వింటూ, టీ.వీలో వచ్చే సినిమాలు, సీరియళ్ళు ఏమీ వదలకుండా చూస్తూ, వండుకుని తింటూ, బట్టలుతకటం లాంటి పనుల్లో సాయంగా ఉంటూ మూడు నెలలు గడిచాక ఉద్యోగం మీద పడింది. అప్పుడింక సీన్ రివర్స్. అమ్మ ఇంట్లో ఉంటే నేను పని కోసమని ఊరు దాటి, రాష్ట్రం దాటి మెట్రో నగరానికి రావాల్సి వచ్చింది.

ఫోన్ చేసి మాట్లాడితే చాలు ఇంటికెళ్ళిపోవాలనిపిస్తుంది. ఇప్పటికీ. అందుకే ఎప్పుడో వారానికొకసారి చేసి నాలుగు మాటలతో సరిపెట్టుకుంటాను. కరోనా అంటూ లోకమంతా ఇబ్బందులు పడుతుంటే నేను మాత్రం అమ్మతో ఉండొచ్చు అని ఎగురుకుంటూ వెళ్ళిపోయాను. అయితే ఇప్పుడు ప్లాస్టిక్ బకెట్, దాని మీద చిల్లర ఉండట్లేదు. డైరెక్ట్‌గా గోధుమ పిండి తెచ్చి చపాతీలు చేస్తోంది అమ్మిప్పుడు.

అమ్మ ఏయే పనులు చేయటానికి ఎక్కువ కష్టపడేదో అవన్నీ సులభం అయిపోయే ఏర్పాట్లు జరిగిపోయాయిప్పుడు. మాతో చెప్పకుండా తనలోనే దాచుకునే దిగులు ఎక్కడికో పారిపోయిందిప్పుడు.

ఇంటికి ఇంతదూరం, ఈ ఉద్యోగం ఇదంతా అవసరమా అనిపించిన ప్రతిసారీ అమ్మ ముఖం గుర్తొస్తుంది, ఆ ముఖంలో దిగులు లేకపోవటం కనిపిస్తుంది. కావల్సినంత ప్రశాంతత దొరుకుతుంది. అమ్మకి ఫోన్ చేద్దామని మొబైల్ తీసి మళ్ళీ అంతలోనే వద్దనుకొని ఫోన్ జేబులో పెట్టుకుంటూ ఆఫీసు వైపు నడుస్తాను.

*

చిత్రం: అనూష 

షేక్ మొహమ్మద్ గౌస్

తక్కువ సమయంలో ఎక్కువ రాస్తూ గుర్తింపు పొందిన రచయిత. స్వస్థలం అనంతపురం జిల్లా తాడిపత్రి. జననం: 1997. బీ.టెక్ కంప్యూటర్ సైన్స్ చదివారు. తొలికథ 'చిల్డ్రెన్స్ డే' 2020లో వెలువడింది. ఇప్పటివరకూ 30 కథలు రాసి వాటిలో రాయలసీమ యాసలో రాసిన కథలన్నీ కలిపి 'గాజులసంచి' గా వెలువరించారు. శిల్ప ప్రాధాన్యంగా రాయడం సాధన చేస్తున్నారు. ఐటీ రంగంలో ఉద్యోగం. ప్రస్తుత నివాసం: హైదరాబాద్.

6 comments

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

  • ప్రతి దిగువ మధ్య తరగతి తల్లీ బిడ్డల కథని స్పృజించారు – నా చిన్నతనపు జ్నాపకాలను తట్టి చూపారు 🙏🏻

  • చాలా బాగుంది కథ. చుట్టూ జరుగుతున్నవాటిని చూస్తూ పిల్లవాడు చేసే వూహలు, అడిగే ప్రశ్నలు చాలా సహజంగా వున్నాయి.

  • గౌస్ భాయ్ కథ చాలా బాగుంది “కోడిగుడ్డు వేసినప్పుడు అది ఉడకకుండా పగిలిపోతే?” యెంత కల్మషం లేని ఆలోచన

‘సారంగ’ కోసం మీ రచన పంపే ముందు ఫార్మాటింగ్ ఎలా ఉండాలో ఈ పేజీ లో చూడండి: Saaranga Formatting Guidelines.

పాఠకుల అభిప్రాయాలు