అభద్రత

మట్టిని నమ్ముకుంటాడా? మట్టిని అమ్ముకుంటాడా?

తను అలిగాడు. అలక దీర్ఘకాలికం కాకూడదు. సాగతీత అసలే పనికి రాదు . రోజులేమో కేలండరు కాగితాల్లా చిరిగిపోతున్నాయి. దేవుడు అసహనంగా పీఠం మీద కదిలాడు. దేవుడంటే నిజం దేవుడు కాదు. ప్రజలు అంగీకరించి నెత్తిన కూర్చున్నవాడు. జారిన కిరీటాన్ని సర్దుకున్నాడు. పెరిగిన తెల్ల గడ్డంలో ఎక్కడా నల్ల వెంట్రుక లేకుండా జాగ్రత్త పడటం కూడా ముందస్తు వ్యూహమే. వేషభాషల ద్వారా మత్తు కలిగించే శక్తి సామర్ధ్యాలున్నవాడు.

అతను బహువచనం. రోడ్డు మీద కంచెలు చూశాడు. ఇదేమిటీ అనుకోలేదు.  దాటాడు. తర్వాత దశలో ముళ్ల బాటలు కనిపించాయి. మధ్య మధ్యన విత్తనాలు నాటాడు. ఒత్తుగా పెరిగింది. గర్వంగా దేశం కేసి చూశాడు. దేశం వెంట రాలేదు. అయినా వెనుకాడలేదు. అడుగులేశాడు. ఆకలిని జయించాడు. ఇక కొత్తగా మొలకెత్తాలి. చిగురులు కత్తులయ్యేంత వరకు నిరీక్షించాలనుకున్నాడు.

‘ అసలు రైతు ఇలాగున్నాడేంటీ?’

జట్టు కట్టే తత్వం లేనివాడు. సమూహంలో ఏకాకిగా మిగిలేవాడు. ఆరుగాలం శ్రమకు ప్రతిఫలం దక్కకపోయినా నోరు మెదపనివాడు. మట్టిని భుజానికెత్తుకుని మట్టిలోనే జీవించేవాడు.

‘ అసలు కడుపు లోకి అన్నంముద్ద అందించేవాడు …ఎలాగుండాలి?’

పుష్టిగా ఉండాలి. కండలు పెంచాలి. పోషక విలువల ఆహారం  తెగ తిని బలాలి. శాంపులు మందులన్నీ మింగేసిన మందుల ప్రతినిధిలా ఉండాలి. చవకగా ధాన్యం కొనేసి గోదాములు నింపేసిన మిల్లు యజమానిలా

ఉండాలి. కదలలేని స్థితిలో భారీ కాయంతో నడవలేనట్టుండాలి. కూచున్నవాడు లేవలేనట్టుండాలి.

అతను దేశమంతా ఆవరించి ఉన్న పెద్ద సమూహం. అతనులో సత్తెయ్య ఉన్నాడు. ఎంతో కొంత చదువుకున్నవాడే. లోకం పట్ల అవగాహన ఉన్నవాడే. మట్టిని నమ్ముకున్న కోట్లమందిలో ఒకడు.

సత్తెయ్య ఇపుడెలా ఉన్నాడు? డొక్కలు అతుక్కుపోయాయి. బుగ్గలు వదులుగా వేలాడుతున్నాయి.

కళ్లు లోతుకు పోయాయి. కండలు జారిపోయాయి. అలసిన చేతులు రక్తబిగి తగ్గి కట్టెలా ఉన్నాయి.

పైగా నాగలి కర్రు భుజం వెనుక వైపుండి కాడి ఎదరకు పెట్టుకుని చేతులతో నొక్కి ఉంచుతున్నాడు.

ఇదేం చోద్యం? బరువున్నది వెనుక వైపు కదా. బొత్తిగా సమతుల్యత తెలీనివాడిలా ఉన్నాడు. చదువుకుంటే

ఉన్న మతి పోయినట్టుంది. చెబితే వినడు. కిరీటిధారి డబ్బు చేసుకునే వాళ్లకు ఊతంగా ఉన్నాడు. వాళ్లతో మామూలుగా మాట్లాడడు కౌగిలించుకుని తప్ప. అన్నీ రాజకీయ విన్యాసాలే.

సత్తెయ్య అజ్ఞాని కాడు. లౌకిక జ్ఞానం అబ్బి నేలమీద నిలబడినవాడే. వాడికి మనుషుల మనస్తత్వాలు తెలిశాయి. దేశం లోని తిరోగమన చట్టాల ఉపద్రవం తెలిసింది. విద్యుత్‌ భారం పెంచే బిల్లులూ తెలిశాయి. ఆచరణలో కాకుండా కాగితం మీద గొప్పగా కనిపించే శాసనాలు తెలిశాయి. తెలియనివీ ఉన్నాయి. పండిన పంటను ధర ఉన్న చోటుకు నెత్తిన పెట్టుకుని అమ్మడం ఎలాగో తెలీదు. ఖచ్చితంగా అమలయ్యే గిట్టుబాటు ధర ఏమిటో తెలీదు. అప్పుల బావిలో కూరుకుపోయిన వాడికి రుణ విమోచనం ఎలాగో తెలీదు.

‘ అసలు చట్టాలెలా తయారవుతాయి? ’ జనాంతికంగా అడిగాడు సత్తెయ్య. అక్కడ ఒకడున్నాడు. విన్నాడు. చెప్పడానికి సిద్ధంగా ఉన్నాడు. నలగని బట్టలు ధరించి సోగ్గా నిలుచున్నాడు.

‘ నన్నేనా…నన్నేనా…నన్నేనా…’ ముమ్మారు అడిగాడు. ఎందుకైనా మంచిదని  తల ఊపాడు సత్తెయ్య. చెవి ఒగ్గి ఒళ్లంతా కళ్లు చేసుకుని ఆ మనిషి కేసి చూశాడు.

‘‘ అరేయ్‌… అబ్బీ… నీకర్థమౌతుందో లేదో తెల్దు గానీ చెబుతా…కంగారుపడకు…చట్టం చుట్టం ఎలా అవుతుందంటే…’’ తన మాటకు తనే బిగ్గరగా నవ్వాడు. నలుదిశలా ప్రతిధ్వని…

‘‘ అక్కడ…వాతావరణం చల్లగా ఉంటుంది. ఏవేవో భాషలు గుసగుసలాడుతుంటాయి. మొత్తం దేశమంతా

ఒకచోట కూచున్నట్టుంటుంది. శాసనాలు చేసే ప్రజాప్రతినిధులుంటారు. వాళ్లేమీ కష్టపడి తమ మనసులోని మాటలు చెప్పక్కర్లేదు. దేశ పెజానీకం చూడకుండా టీ.వీ కెమెరాలు ఆపు చేసేస్తారు. పీఠం మీద కూచున్నోడు అంతా సరేనా అంటాడు. ఓ…అంటూ చెవులు చిల్లులు పడేలా కేకలు పెడతారు. సరే అయితే చేతులెత్తండని ఊరికే అంటాడు. మరీ ఎక్కువ సేపు వద్దు. ఇక చాలు అంటాడు. మరంతే… బిల్లు పాసయ్యిందని పంటి బిగువన నవ్వకుండా చెప్పేస్తాడు. అందరూ నిమిత్తమాత్రులే. దేవుడే ఈ ఆట ఆడిస్తాడు ’’ అర్థమైందా అన్నట్టు సూటిగా సత్తెయ్య కేసి చూసి చెప్పాడు.

సత్తెయ్య నోరెళ్లబెట్టి చూస్తున్నాడు.

‘‘ మరి…మరి…’’ ఏదో అనబోయాడు.

‘‘ ఓసేస్‌.. ఇక మాట్లాడకు. అనుమతులు లేకుండా విత్తనాలు వేయకండి. మీ చేలో ఏం పండిరచాలో

మీకు తెలీదు. కొన్ని శక్తులొస్తాయి…శిక్షణ ఇస్తాయి. పురుగు పుట్టదనీ రెట్టింపు పంట హామీ అనీ అంటారు. నమ్ముతావు. నీవు కష్టపడు…తుపానులకు ఎదురొడ్డు…పంట పండేక ఇంత రేటు అని వారే చెబుతారు. అమ్మెయ్‌…మీనమేషాలు లెక్కించి విశ్వసనీయత పోగొట్టుకోకు. నాణ్యత చూసుకుని కొంటారు…పర్వాలేదులే రంగు వెలసిన గింజలకు సగం ధర ఇస్తారులే. మద్ధతు ధర మాటెత్తకు…భూములన్నీ మీ దగ్గరే ఉంటాయి. ఎక్కడికీ పోవు…అవునొరే…వేసుకునే బట్టలు, ట్రాక్టర్లు, ఎరువులు గట్రా ఎవడు తయారు చేస్తున్నాడో ఎరుకేనా? పెద్ద పెద్ద డబ్బులున్నోళ్లు బడా కార్పరేట్‌ వ్యాపారవేత్తలు… అంతే కదా ’’

సత్తెయ్యకు అంతా తెలిసిపోయింది. గబగబా అడుగులేసుకుంటూ చేను దగ్గరకెళ్లాడు. కన్నుల పండుగగా కంకులు బరువుగా ఊగుతున్నాయి. చుట్టూ తిరిగాడు. కుప్ప వేసుకునే చోటులో పిచ్చి మొక్కలుంటే పీకాడు. గొప్పులుంటే పారతో చదును చేశాడు. అలుపొచ్చింది. చెమట పట్టింది. వెంటనే ఇంటికెళ్లాలనిపించింది.

వరండాలో గోనె సంచులున్నాయి. తవుడు మూట, తిండి కోసం దాచుకున్న ధాన్యం బస్తాలు

ఉన్నాయి. అస్తవ్యస్తంగా పడేసిన అనవసర వస్తువులున్నాయి. ఏవో తాళ్లున్నాయి. బొంబాయి కర్రలున్నాయి. కొడవల్లున్నాయి. అన్నీ చెల్లాచెదురుగా పడి ఉన్నాయి. ఇది ఒక రైతు ఇల్లు అని చెప్పకుండానే ఇట్టే తెలిసిపోతుంది.

తిన్నగా ఇంట్లోకి వెళ్లాడు. వంటింట్లో అన్నం ఉడుకుతోంది. సీతమ్మ మొగుడి రాకను గమనించింది.

‘‘ ఏమిటయ్యా…వచ్చేసావ్‌…పొలంలో పనుందన్నావ్‌? బేగా వచ్చేసావేంటీ? ’’

‘‘ ఒళ్లు అలసి పోయిందే…బుర్ర లోకి ఎంతో జిడ్డు జొరబడినట్టుందే. అన్నం తినేసి పెందళాడే పడుకుంటాను ’’ లోపలికెళ్లిపోయాడు.

కాసేపటికే బయటకు వచ్చేశాడు. వాకిట్లో నూతి దగ్గరకు చేరుకున్నాడు. చేదతో తోడి డేసాలో

నీళ్లు పోశాడు. పొయ్యి లోకి కట్టెలు వేసి మంట పెట్టాడు. సలసల కాగాయి. తువ్వాలు కట్టుకుని తగు మాత్రం

చన్నీళ్లు కలుపుకుని వేడిగా తల మీదుగా పోసుకుని స్నానం చేశాడు. నూతి చప్టా మీద నీరెళ్లే చోట నాచు కట్టి ఉంది. ఇనప ఊస తీసుకుని శుభ్రంగా గోకాడు.

చీకటి జలజలా రాలుతోంది. చిరు వెలుగు తోక ముడిచి నెమ్మదిగా జారుకుంటోంది.

సత్తెయ్య చిరిగిన నలిగిన లుంగీ కట్టుకున్నాడు. గెన్నె తెచ్చుకుని పీట వేసుకుని కూచున్నాడు.

‘‘ ఎపుడూ లేంది ఈ ఆత్రం ఏమిటి? ’’ సీతమ్మ అడిగింది. సత్తెయ్య సమాధానం చెప్పలేదు.

పొగలు కక్కుతున్న అన్నం గెన్నె లోకి పెట్టింది. ఊరగాయ దగ్గరగా ఉంచింది. ఎర్రగా కలిపాడు. ముద్ద నోటికందించగానే ముక్కుపుటాలు లోంచి ఘాటు బయటకొచ్చింది. కళ్లల్లో నీళ్లుబికాయి. కొబ్బరి పచ్చడి, పొద్దుటి కూర తెచ్చింది. సుష్టిగా తిన్నాడు. తేన్చాడు. తనలో తాను నవ్వుకున్నాడు.

పెరట్లోకి వెళ్లాడు. చింతచెట్టుకు జారవేసున్న నులక మంచం చదునుగా ఉన్ననచోట వాల్చాడు. చెట్టు మొదలులో ఉన్న దిండు తీసుకున్నాడు. మడత విప్పి దుప్పటిని మంచం మీద పరచాడు. వెల్లకితలా పడుకున్నాడు. గుబురుగా ఉన్న చెట్టు కొమ్మల్లోంచి వెన్నెల వెలుగులు… చల్లని గాలి…ప్రశాంతమైన వాతావరణం..

అరగంటలో గాఢనిద్ర లోకి జారుకున్నాడు.

***

శరీరం తేలికైంది. ఆకాశంలో విహరించేంత హాయిగా ఉంది. గాలిలో తేలిపోతున్నట్టుగా అనుభూతి.

ఉన్నట్టుండి రెక్కలు మొలిచాయి. చేతులు మామూలుగానే ఉన్నాయి. కొత్తశక్తి ఏదో వచ్చినట్టు గమ్మత్తు చప్పుడు…

రెక్కల్ని టపటపా ఊపాడు. ఇదేమిటీ? పైకి ఎగిరి పోతున్నాడు. కొమ్మల సందు లోంచి చెట్టు గుండా

ఎగురుతున్నాడు. కిందకు చూస్తే చింతచెట్టు చిన్నదిగా కనిపిస్తోంది. ఇంకా అనేక చెట్లనూ పర్వతాల్నీ దాటుకుంటూ

మేఘాల అంచు వరకూ పోతున్నాడు. పక్షి మార్గం. తన లోని అలౌకిక జ్ఞానమేదో దారి చూపుతోంది.

తిన్నగా పొలం చేరాడు.  కింద విరగ కాసిన ధాన్యపు కంకులు. భారంగా ఊగుతున్నాయి. రేయింబవళ్లు కంటికి రెప్పలా పురుగు పుట్రా నుంచి కాపాడుకున్న పంట. నీటి ఎద్దడి నుంచి కాపాడుకోవడం అదను తప్పకుండా ఎరువులేయడం … చంటి బిడ్డలా సాకిన పంట.

రెక్కల్ని కొద్దిగా ముడుచుకుని దేహాన్ని వాలుగా ఉంచి నెమ్మదిగా చేను గట్టు మీద వాలాడు. తృప్తిగా చూసుకున్నాడు. ధాన్యం రాసులు అలలుగా ప్రవహిస్తున్నట్టుగా ఉంది. కళ్లను వారగా కాకిచూపుతో చూస్తూ సంబరపడ్డాడు.

చూస్తుండగానే `    పెద్ద బండరాయి దొర్లుకుంటూ వచ్చేస్తోంది. అది కూడా ఎగిరే వచ్చిందా? రోడ్డు రోలరులా ఎవరో

నడిపిస్తున్నట్టు చేనుకు మునుం వేస్తున్నట్టు గట్టు వార నుంచి వచ్చేస్తోంది. సత్తెయ్యకు గుండె గుభేలుమంది.

వరి మొక్కలు కంకులతో సహా నేలకు అంటుకు పోతున్నాయి. అరెరె…సర్వ నాశనం అయిపోయింది. చిటికెలో నైరాశ్యం అలుముకుంది.

కళ్లంటా నీళ్లు. దు:ఖం…దిగులు…గుండెలోంచి దేవుతున్నట్టుగా ఉంది. లేత గింజలు పాలుపోసుకుని

ధాన్యంగా మారి భారంగా కదలాడే సమయం…రైతు హాయిగా ఊపిరి తీసుకుని సేద తీరే కాలం… .అప్పుసొప్పుల బాధల్నుండి ఉపశమనం పొందే సందర్భం…

ఎవరో ‘ ఇంత అన్యాయమా? ’ అంటున్నారు. ఏవో తిట్లు వినిపిస్తున్నాయి. బండబూతులు చెవిన పడుతున్నాయి. నోటికొచ్చిన బూతులు…మధ్యలో ‘ దేవుడ్ని’ కలుపుతున్నారు. పాపం …ఆయనేం చేశాడు? ఆయనది దైవపాలన…కారణజన్ముడు…

చేతికొచ్చిన పంట ఎన్నిసార్లు మాయా జూదంలో పోగొట్టుకోలేదు? ఇది కొత్త కాదు. మరెందుకు ఏడుపు? ఇది అంతే. కొనసాగాల్సిందే. ఏడ్చేవాడే యవసాయం చేయాలి. అయిపోయింది. అంతా అయిపోయింది. పోగొట్టుకున్న చోట ఎంత వెతుక్కున్నా ఏమున్నది గర్వకారణం…అంతా శూన్యం…మట్టి మశానమూ…

ఉన్నదల్లా మట్టితో సంబంధం. వదులుకోలేని అశక్తత నడిపిస్తోంది. బలంగా గట్టుని తన్ని గాలిలోకి

ఎగిరాడు. పైపైకి పోసాగాడు. ఆనందంగా పరుగులు పెట్టే విహారం కాదు. కొండంత బరువును మోస్తూ దారీ తెన్నూ లేని గాలిపటంలా అలసటతో దిక్కుతోచని పయనం.

ఆకాశంలో కొక్కాలు వేలాడుతున్నాయి. ఆ కొక్కాలకు ఏవో ధరల పట్టీలున్నాయి. సరిగ్గా చూస్తే వాటి

మీద పెట్రోలు, డీజిలు, కూరగాయలు, వంటనూనెలు, నిత్యావసర వస్తువుల పేర్లు ఉన్నాయి. ఆకాశానికి అంటుతున్న సరుకుల ధరల జాబితా అది.

అదే ఊపుతో ఇంకా ఎత్తుగా ఎగిరాడు. వెనక్కి చూస్తే కొక్కాలు వెంటబడుతున్నాయి. కిందకు చూస్తే

పాలకులు గోతులు తవ్వుతూ పాలితులు ఆ గోతుల్లో దిగబడుతూ చీకట్లో కూడా కనిపిస్తున్నారు. పాలకులు మాత్రం జిగేలుమని మెరుస్తున్నారు. ఉక్కు పిడికిలితో వాళ్లను నుసి చేయాలని ఉంది. గుండెలు కఠిన శిలలతో

తయారైనపుడు ఎవరైనా చేసేదేముంది?

రెక్కలు బలంగా విస్తరించాయి. గరుడపక్షి ఆవహించినట్టు ఆకారం మారిపోతుందేమో. ఒక్కసారి రెక్కల్ని చూసుకుంటే భలే ముచ్చటేసింది. నేల మీద నడిచే పరుగిడే వాడు ఇలా ఆకాశంలో…తేలిపోతూ…

 

సత్తెయ్య అనబడే వాడిని ఇలా ఎవరైనా చూస్తే ఆనవాలు పడతారా లేదా అన్నది ప్రశ్న కాదు. మట్టిని

తాకే  మహత్తర క్షణాల కోసం ఎదురుచూపులు…

అనుకున్నదే తడవుగా రెక్కలు ముడుచుకుపోయాయి. ఆనక మాయమైపోయాయి. అయ్యో…ఇదేమిటీ?

రంగులీనే సొగసుల రెక్కలు…ఈకలన్నీ పాలు ముంచి తేనె రాసిన రెక్కలు…సప్తవర్ణ శోభితమైన రెక్కలు…జలతారు

మెరుపుల రెక్కలు…

డభీల్ముని కిందకు జారిపోతుండగా జరిగిన విచిత్రం. చేతులు పొడుగ్గా సాగిపోతున్నాయి. పీత డెక్కలా వంపులు తిరుగుతూ దట్టంగా వెంట్రుకలు మొలిచిన చేతులు పెరిగిపోతున్నాయి. దూరం నుంచి వీటితో ఎవరినైనా చుట్టుముట్టి పట్టి దగ్గరకు లాక్కోవచ్చు.

కిందకు చూస్తే చింతచెట్టు కనిపించింది. గుబురుగా ఉంది. ఆత్మీయ నేస్తంలా ఆహ్వానిస్తోంది. ప్రాణం

పోయేవాడికి తల్లిఒడిలా కనిపిస్తోంది. నిండా కాయలతో విరగ కాసిన చెట్టు. భూమికి సమాంతరంగా

సాగిన కొమ్మను బలమైన చేతులు పట్టుకున్నాయి. అట్లతద్దికి ఊయల కట్టే రెండు నిలువుల కొమ్మ.

పడిపోకుండా పట్టుకున్నాననుకున్నాడు. ఆధారం దొరికిందనుకున్నాడు. క్షేమంగా చేరాననుకున్నాడు. కానీ కాదు…జారిపోయాడు.

పెద్ద చప్పుడుతో నేల మీద ఉన్న రుబ్బురోలుపై పడ్డాడు. పటుక్కుమని ఎముకలు విరిగిన చప్పుడు.

దేవుడు పట్టుదల తగ్గించుకుని తెల్లటి గెడ్డాన్ని నున్నగా గీయించుకున్నాడు. వేషభాషలు కాదు మనుగడకు సంబంధించి అత్యవసరమైందేదో తెలుసుకుంటే ఎంత బావుండును.

***

సత్తెయ్య కళ్లు తెరిచాడు. తల పక్కకు తిప్పాడు. కట్లు కట్టిన కాళ్లు కనిపించాయి. తల భారంగా ఉంది.

వాతావరణం కొత్తగా ఉంది. పదడుగుల దూరంలో సీతమ్మ చీరకొంగుతో కళ్లు తుడుచుకుంటూ నిలబడి

ఉంది. కొడుకు ముఖంలో ఆందోళన కనిపిస్తోంది.

‘‘ అలా….ఎలా పడ్డావు…నాన్నా…’’ అంటున్నాడు కొడుకు. వాడికేసి తేరిపారి చూశాడు.

 

అయ్య బాబోయ్‌…తన తర్వాత తరం రైతులా కనబడుతున్నాడు. మసగ్గా వేషమూ అలాగే ఉంది. వాడిని తలపాగాతో ఊహించుకుంటే భయమేసింది. గడచిన సకల కష్టాల జీవితం గుర్తుకొచ్చింది. యవసాయం

జూదం. దానికంటే నరకం అనేది ఉంటే అక్కడికి పోవడమే మేలు అని ఎలా చెప్పాలి. అన్నంముద్ద తినిపించే రైతు అమ్మలాన్తివాడు కదా. రైతుగా జీవించిన తను ఇది చెప్పలేడు. నోరు విప్పలేడు.

ఎలా బతుకుతాడో…ఎలా నెగ్గుకు వస్తాడో…ఎలా పోరాడుతాడో…

మట్టిని నమ్ముకుంటాడా? మట్టిని అమ్ముకుంటాడా?

***

 

దాట్ల దేవదానం రాజు

36 comments

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)
 • కథ బాగుంది సర్.

  దేవుడికి గడ్డం చేసుకునే ఉద్దేశం లేదు. నల్లటి మరక ఎరగని గడ్డంలోని ఋష్యత్వపు బిల్డప్ మహ బాగా వర్కవుట్ అవుతోందని, బెంగుళూరు నుంచి ఫీడ్ బ్యాక్ ఉంది. క్లీన్ షేవ్డ్ మొహాలని, వెంట్రుకల పొడ ఎరగని నిండు మొహాలని ప్రజలు ఇష్టపడుతున్నారని, జనం టేస్టు మారుతున్నదని చారులు నివేదించేదాకా దేవుడు గడ్డం చేసుకోడు.

  సత్తెయ్యకు కాళ్లు విరిగాయని దేవుడికి బాధేసింది. టీవీలను బెదిరించి, రేడియోలను పురమాయించి అందరూ లైవ్ ఇచ్చే ఏర్పాటు చేసి.. దేవుడు వలవల విలపిస్తాడు. దేవుడికి కన్నీళ్లొస్తాయి. దేవుడి కంటినుంచి జారిన నీళ్లు, శివుడి జుట్టనుంచి జారిన దానికంటె, జహ్ను చెవినుంచి జారిన దానికంటె చాలా శక్తిమంతమైనవి. ఇంకా పెద్దప్రవాహంగా పోటెత్తి.. ఇటు హస్తినుంచి అటు ఈశాన్యమూలలదాకా ఎత్తిపోతల పథకాలేమీ లేకుండానే ప్రవహించేసి, అటునుంచి దక్షిణపు కొసన మూడు సముద్రాలు కలిసేచోటుదాకా జారిపోయి, లంబంగా అటు ఇటు పక్కకు జరుగుతూ పైకెళ్లి హిమము కురిసే నేలల్ని తడిపేసి, ఏటవాలుగా వచ్చి పశ్చిమపు కొమ్ములో సాగరంలో కలిసిపోతాయి. దేవుడి కన్నీళ్లకు మించిన పుణ్యనది మరొక్కటి లేదని.. స్తోత్రాలు రాయబడతాయి. ప్రతిరోజూ కుంభమేళానే. ప్రతిరోజూ పుష్కరమే. జనం పరితపించి, ఆ ప్రవాహంలో మునిగి మునిగి తరించి, ఆ నీటిని నెత్తిమీద చల్లుకుని పరవశించి ముక్తి పొందుతారు.

  ఆ జనంలో సత్తెయ్య పెండ్లాం, కొడుకూ కూడా ఉంటారు.

  • సురేష్ పిళ్ళై గారూ విశ్లేషణగా మీరే ఒక కథ చెప్పారు. ఎంతయినా వాడి వ్యూహం ప్రత్యేకమైనది. ధన్యవాదాలు.

  • కథ రైతు జీవితాన్ని ప్రతిబింబించింది సర్.. మీరు రాసింది కథే అయినా రైతు జీవితాన్ని కవితాత్మకంగా చెప్పారు.. కానీ ఈ కవితలో కళకళలు లేవు.. రైతు విలవిలలు ఉన్నాయి..
   నేను రైతు బిడ్డను.. రైతును.. అందుకే రైతు గురించి రాసిన ప్రతి అక్షరం నా చిరునామా లాగా అనిపిస్తుంది.. మీ రచనా పటిమ గురించి తెలియందెవరికీ..? అభినందనలు సర్..👌👍

 • చాలామంది శత్రువుల గురించి దాట్ల దేవదానం రాజు గారు బహిర్గతం చేశారుగానీ, రైతుకున్న శత్రవుల సంఖ్య ఇంకా లెక్క తేలాల్సి ఉంది. భూమ్యాకాశాల మధ్య భూమిపుత్రుడి వెతలపై రచయిత సంధించిన ఈ కథాస్త్రం చాలా బాగుంది.

  • విజయం భూమి పుత్రుడిదే. రామిరెడ్డి గారూ ధన్యవాదాలు.

 • బాగుంది.రైతు చట్టాల బాగోగులు తెలియదు కాబట్టి వివరంగా చెప్పలేను. దీన్ని కథ అనేకంటే వచన కవిత అనడం సమంజసమేమో.

  • కథను పట్టుకుని కవిత అంటున్నారా? ఏమైనా మీ అభిప్రాయానికి ధన్యవాదాలు.

 • రైతుని దేశానికి వెన్నెముక అంటూనే, రైతుకి వెన్నెముక లేకుండా చేసేవారిని చూస్తూ ఏమీ చెయ్యలేని అసహాయత కలిగించిన ఆవేదన ఆక్రోశంగా మారితే- అందులో ఆవేశం అణగారిపోతే- ఆ వేదనే ఈ కథ. చదివినవారి అసహాయతను ఆవేశంగా మార్చగలిగిన సత్తా ఉన్న ఈ కథనం – మన దేశంలో స్పందించే హృదయాలను గుర్తించే గీటురాయి. కవిత కథలా ఉంటే- కవిత విలువ పెరక్కపోవచ్చు. కానీ కథ కవితలా ఉంటే అది ఘనతే! ‘దాట్ల’ వారు ఆ ఘనతని ఎప్పుడో సాధించారు. ఇప్పుడూ ప్రదర్శంచారు. అభినందనలు.

  • మీ స్పందనకు ధన్యవాదాలు , సార్

 • మట్టిని నమ్ముకుంటాడా? మట్టిని అమ్ముకుంటాడా?

  ఎలా బతుకుతాడో…ఎలా నెగ్గుకు వస్తాడో…ఎలా పోరాడుతాడో…

  rytulandari mundu ive pedda prasnalu

  • ధన్యవాదాలు,రవిప్రకాష్ గారూ

 • మట్టి మనిషి కష్టాలను…. వ్యవసాయంలో ఆటుపోట్లను చక్కగా విశ్లేషణ చేస్తూ… వాక్యాలకు కవిత్వం అద్దిన తీరు బాగుంది.

  ఆకాశంలో కొక్కాలు వేలాడుతున్నాయి. ఆ కొక్కాలకు ఏవో ధరల పట్టీలున్నాయి. సరిగ్గా చూస్తే వాటి మీద పెట్రోలు, డీజిలు, కూరగాయలు, వంటనూనెలు, నిత్యావసర వస్తువుల పేర్లు ఉన్నాయి. ఆకాశానికి అంటుతున్న సరుకుల ధరల జాబితా అది. వాస్తవ చిత్రణ అద్భుతంగా వుంది.

  రంగులీనే సొగసుల రెక్కలు…ఈకలన్నీ పాలు ముంచి తేనె రాసిన రెక్కలు…సప్తవర్ణ శోభితమైన రెక్కలు…జలతారు మెరుపుల రెక్కలు… అద్భుతమైన వర్ణణ.

  అన్నంముద్ద తినిపించే రైతు అమ్మలాన్తివాడు కదా…..హృదయాన్ని తాకిన మంచి వాక్యం.
  ఇలా ఎన్నో… ఎన్నెన్నో…
  ఆణిముత్యాల్లాంటి అక్షరాలతో మంచి కథను అవిష్కరించిన దాట్ల దేవదానం రాజు గారికి బోలెడు అభినందనలు… శుభాకాంక్షలు.

  • మీ అభిప్రాయానికి ధన్యవాదాలు, ఉపేందర్ గారూ

 • అవును… ఏడ్చేవాడే, ఏడవడానికి సిద్దపడేవాడే వ్యవసాయం చేయాలి.

  • ప్రస్తుతం ఇంకా దారుణమైన పరిస్థితులున్నాయి. రైతుకు పిల్లనివ్వడానికి వెనుకాడుతున్నారు. ధన్యవాదాలు.

 • Katha chala baavundi,,,manchi saili,,, చదువుతూంటే మొత్తం పెద్ద సవం ఒకటి విస్తరిస్తున్న ట్టు,,,వ్యవసాయ భవిత,,,దిగులేసింది ,,,కానీ కథ చివర,,,కొడుకుని చూసి భయం వేసింది ,,, దగ్గర కథ ఆగి పోటీనే baavundanipinchindi మారి

  • శివాజీ గారూ ధన్యవాదాలు, మీ స్పందనకూ మీ అభిప్రాయానికీ.

 • అద్భుతమైన కధకు అంతే చదివించేలాంటి కధనం.ఆద్యంతం వెంటాడే వాక్యాలు..

  • ధన్యవాదాలు ప్రసాద్ గారూ

 • వ్యవసాయ కుటుంబం నేపథ్యంగా ఉన్న మీలాంటి వారే ఇలాంటి వ్యధల్ని /కథల్ని గొప్పగా ఆవిష్కరించగలరు రాజు గారూ. ప్రకృతిపరంగా గానీ, దళారీలవల్ల గానీ, కార్పోరేట్ల కనుసన్నల్లో నడుస్తున్న ప్రభుత్వాల అనాలోచిత శాసనాలవల్ల గానీ అనేక రకాలుగా మోసపోతున్న రైతుని ‘ఆవాహన’ చేసుకొని కథను కవితాత్మకంగా చిత్రిక పట్టారు.
  ఇక తెల్ల గడ్డంలో ఎక్కడా నల్ల వెంట్రుక లేకుండా జాగ్రత్తపడే లీలామానుష రూపుడైన ‘దేవుడి’ లీలలు, హంగులు, ఆర్భాటాల వ్యంగ్య చిత్రణ వాస్తవానికి అద్దం పట్టింది. మీరు రాసిన (యాంత్రీకరణలో పడి బహుశా రైతులు కూడా మర్చిపోయిన) “బొంబాయి కర్ర”.. ‘నీటిఎద్దడి’.. చేనుకు “మునుం” వేస్తున్నట్టు.. వంటి పారిభాషిక పదాలు మట్టి వాసనను తట్టిలేపాయి.
  అన్నదాత వెతల్ని వైవిధ్యభరితంగా దృశ్యమానంచేసిన మీకు అభినందనలు దేవదానంరాజు గారు. 🙏

  • జానకిరామ్ గారూ ధన్యవాదాలు. రైతు గురించి ఆలోచించాల్సిన సమయం. పారిభాషిక పదాలెన్నో ఉన్నాయి. వ్యవసాయ సాధనాలు యాంత్రీకరణలో మాయమైనవెన్నో. tq

 • కథావస్తువు, కథనం మనసుకు హత్తుకునేలా ఉన్నాయి.తానేం పోగొట్టుకుంటున్నాడో రైతుకు తెలుసు.దోచుకునేవాడికీ తెలుసు.ధరలు పెరిగాయని గోలపెట్టే వారు కీలకమెక్కడుందో తెలుసుకోలేరు.పోరులో ఏం పక్షం మనది?

 • దాట్ల వారు పేరెన్నికగన్న రచయిత, కేవలం పేరు సూచించి నంత మాత్రానే, వస్తువు నెన్నుకొని 14 కథలను” కథల గోదారి ” లా ప్రవహింప చేసిన ఘనాపాటి, ప్రస్తుత కథలో రైతు వెతలను, తనదయిన శైలిలో, వంగ్యాన్ని , మేళవించి బాగా చెప్పారు, కథనంలో దాట్ల వారు ఇంతవరకూ చూపని కొత్త టెక్నిక్ ఈ కథలో చూపి పాఠకుల ప్రశంసలు కు పాత్రులయ్యారు. కుహనా రాజకీయాల్లో , సేద్యగాన్ని విస్మరిస్తున్న తీరు, ఆవేశం తెప్పిస్తుంది, నిజమే, కవితాత్మక పదాలు పేర్చ బడిన కథ అనడంలో అతిశయోక్తి లేదు.

  • బాబు గారూ ధన్యవాదాలు
   నా గురించి చాలా విషయాలు చెప్పారు.

 • మంచి కథ. కవితాత్మకంగా సాగింది.

  దేవుడు గెడ్డం లో రైతుతో పాటూ దేశమే చిక్కుకొంది.

  మంచిరోజులు రావాలి.

  థాంక్యూ సర్.

  • ధన్యవాదాలు బాబా గిరూ

  • ధన్యవాదాలు అనిల్ గారూ

 • ఏళ్ళు గడుస్తున్నా మారని రైతు వెతలను ఎన్ని కతలుగా మలచినా, ప్రకృతిని రైతు బంధుగా మార్చే అవసరాన్ని, అవకాశాలనూ చేపట్టణన్నాళ్లు మిగిలేవి వెతలూ, కతలే.
  కథనం చాలా చాలా బాగుంది. అభినందనలు సర్ 🙏🙏

  • ధన్యవాదాలు మీనాక్షీ శ్రీనివాస్ గారూ

 • చాలా బాగుంది రాజు గారూ

  • ధన్యవాదాలు విజయలక్ష్మి గారూ

 • మా నాన్న పేరు సత్తెయ్య. నెల్లూరు జిల్లా కండ్రిగ లో ఓ చిన్న రైతు. పంట వేసిన ప్రతి ఏడాది ఏదో ఒక నష్టం, కష్టం మమ్మల్ని పలకరించేవి. రుణాలు చేసిపెట్టిన పెట్టుబడి కి పంటకి గిట్టుబాటు ధర రాక నేల తల్లి ని నమ్ముకోలేక, అమ్ముకోలేక మా నాయన ఎంతో ఆవేదన అనుభవించడం నా చిన్నప్పుడు కళ్ళారా చూసాను నేను. కథ చదువుతున్నంత సేపు మా ఊరు, మా నాయన గుర్తు కు వచ్చారు. రైతు వెతలకి, ఆవేదన కి అత్యున్నతమైన కదా రూపం శ్రీ దాట్ల దేవదానం రాజు గారి కథ “మట్టిని నమ్ముకుంటాడా?మట్టిని అమ్ముకుంటాడా?” . రాజుగారికి అభినందనలు 🌹🙏

  • రైతు వెతలకు ప్రాంత, పంట భేదాలు లేవండి.
   ధన్యవాదాలు రోహిణి గారూ

 • ప్రస్తుత రైతు స్థితి గతుల్ని అద్దంలో చూపారు రచయిత.(ప్రజా)దేవుడెప్పుడూ నీళ్ళున్న చోటికే ఎగిరిపోయే కొంగ.రైతెప్పుడూ వైకుంఠపాళీలో పాము నోట్లో కే.పంట దెబ్బ తిన్న ప్రతిసారీ వైరాగ్యం.తిరిగి పునరపి.కడాఖర్న కొడుకు గురించిన బెంగ హృద్యంగా ఉంది.రచయితకు జయహో.

‘సారంగ’ కోసం మీ రచన పంపే ముందు ఫార్మాటింగ్ ఎలా ఉండాలో ఈ పేజీ లో చూడండి: Saaranga Formatting Guidelines.

పాఠకుల అభిప్రాయాలు