అన్ ప్రొఫెష‌న‌ల్ దున్నపోతు

విప‌రీత‌మైన నిశ్శ‌బ్దంతో  ఉత్కృష్ట్ కి మెల‌కువ వ‌చ్చింది. ఎక్క‌డున్నానా అని చుట్టూతా చూశాడు. మంచం, దుప్ప‌ట్లు, వస్తువులు, గోడ‌లు ఏమీ క‌నపళ్లేదు. త‌నింకా నిద్ర‌లోనే వున్న‌ట్టున్నాడు, ఏదో క‌ల స‌గంలోవున్న‌ట్టుంది అనుకున్నాడు. మ‌ళ్లీ క‌ళ్లు మూసుకున్నాడు. ఒంటికి త‌గులుతున్న చ‌ల్ల‌ని గాలి, గ‌తంలో ఎప్పుడూ అనుభ‌వం లోకి రానంత విప‌రీత‌మైన‌ నిశ్శ‌బ్దం, మ‌న‌సులో ఏ అల‌జ‌డీ లేని ప్ర‌శాంత‌త‌.. ఇదంతా క‌ల మాత్ర‌మే అయ్యుంటే, త‌న‌కి యిప్ప‌టివ‌ర‌కూ వ‌చ్చిన ఆహ్లాద‌మైన క‌ల యిది అనిపించింది అత‌నికి.

“ఇది క‌ల కాదు. లెగు, ఏవైనా క‌బుర్లు చెప్పు. నాకు బోర్ కొడుతోంది” అన్నారెవ‌రో. ఉలిక్కిప‌డి లేచాడు ఉత్కృష్ట్. క‌ళ్లు నులుముకొని తేరిపార చూశాడు. రెండు నిముషాల త‌ర్వాత విష‌యం బోధ‌ప‌డింది అత‌నికి. తాను ప్రాణాల‌తో లేడు. ప్ర‌స్తుతం ఆకాశంలో దున్న‌పోతు మీద ప్ర‌యాణం చేస్తున్నాడు. చ‌నిపోయాన‌న్న నిజం అత‌న్ని పెద్ద‌గా బాధ పెట్ట‌లేదు. ఇక‌నుండీ త‌న‌కి ఏ బాధ్య‌త‌లూ వుండ‌వ‌న్న సంగ‌తి గుర్తొచ్చి మ‌న‌సు కాస్త తేలిక‌ప‌డింది కూడా.

“నీలాంటి వాళ్లు చాలా అరుదుగా వుంటారు” అంది దున్న‌పోతు.

“నాలాంటి వాళ్లంటే?” అడిగాడు.

“చ‌చ్చిపోయాను కాబ‌ట్టీ బాధ్య‌త‌లు వుండ‌వ‌ని సంబ‌ర‌ప‌డేవాళ్లు” అంది దున్న‌పోతు తాపీగా. ఉత్కృష్ట్ మ‌ళ్లీ వులిక్కిప‌డ్డాడు. తాను మ‌న‌సులో ఏమ‌నుకుందో దీనికెలా  తెలిసింది?

“నువ్వ‌లా మాటిమాటికీ వులిక్కిప‌డ‌కు. నాకస‌లే చ‌క్కిలిగింత‌లు ఎక్కువ” అంది దున్న‌పోతు.

“నేను మ‌న‌సులో ఏం అనుకున్నా నీకు తెలిసిపోతుందా” అడిగాడు ఉత్కృష్ట్.

“ఆ తెలిసిపోద్ది” అంది దున్న‌పోతు.

“మ‌రి క‌బుర్లు చెప్ప‌మ‌ని ఎందుకు అడిగావ్ యిందాక‌? నేను ఏమ‌నుకుంటున్నానో ఎలాగూ నీకు తెలిసిపోద్దిగా” లాజిక్కు తీశాడు.

“నువ్వు మ‌న‌సులో ఏం అనుకుంటున్నావో, పైకి ఏం చెపుతున్నావో రెండూ తెలిసిపోతుంటే స‌ర‌దాగా వుంటుంది క‌దా” చెప్పింద‌ది.

కాసేపు మౌనంగా వుండి, “ఈ గ్యాప్ లో నేను ఏం అనుకున్నానో చెప్పు” అన్నాడు ఉత్కృష్ట్.

“య‌ముని మ‌హిష‌పు లోహ‌గంట‌లు మ‌బ్బుచాటున ఖ‌ణేల్‌మ‌న్నాయ్ అనే క‌వితా పంక్తులు గుర్తు చేసుకున్నావ్‌. నాకు గంట‌లు లేక‌పోవ‌డం నువ్వు ఆల్రెడీ గ‌మ‌నించావ్ కాబ‌ట్టీ, ఆ క‌విత రాసినాయ‌న క‌న‌బ‌డితే ఆ విష‌యం చెప్పాల‌నుకున్నావ్” అంది దున్న‌పోతు న‌వ్వుతూ.

“నూటికి నూరు మార్కులు నీకు” అభినందించాడు ఉత్కృష్ట్. “అన్నట్టు, నీ తెలుగు చాలా బావుంది. మా మ‌నుషులు చాలామందికి నీకొచ్చినంత మంచి భాష రాదు” అన్నాడు.

“It is not an acquired skill. I was manufactured like that. So, I don’t think I deserve any appreciation” అంది దున్న‌పోతు నిర్వికారంగా.

అర్థ‌మైంద‌న్న‌ట్టు త‌ల‌వూపి, మ‌బ్బుల వంక చూడ‌డం మొద‌లెట్టాడు ఉత్కృష్ట్. అత‌న్ని డిస్ట‌ర్బ్ చేయ‌డం యిష్టం లేనట్టు దున్న‌పోతు కూడా సైలెంట్‌గా వుండిపోయింది. కాసేప‌య్యాక ఏదో డౌటొచ్చిన‌ట్టు దున్న‌పోతు వైపు చూసి, అడ‌గాలా వ‌ద్దా అన్న‌ట్టు సందేహిస్తూ ఆగాడు ఉత్కృష్ట్.

“నువ్వేం అడ‌గాల‌నుకుంటున్నావో నాకు తెలుసు. కానీ, అడ‌గ‌డంలో వున్న ఆనందం కోసం నువ్వు అడ‌గొచ్చు న‌న్ను” అంది దున్న‌పోతు.

“వాష్‌రూమ్‌కి వెళ్లాల్సిన అవ‌స‌రం వుంటుందా నీకు?” అడిగాడు.

“అస‌లు ఫుడ్ తీసుకోను నేను. మా బ‌య‌లాజిక‌ల్ సిస్ట‌మ్ వేరు. సో, మ‌నం వెళ్లే దారిలో నేను పేడ వేయ‌డం, అది భూమ్మీద జ‌నాల మీద ప‌డ‌డం జ‌ర‌గ‌దు” బ‌దులిచ్చింది.

“నేను చ‌చ్చిపోయినందుకు మా ఆవిడ బాధ ప‌డుతోందా?” అడిగాడు ఉత్కృష్ట్.

“ఆ విష‌యం నేను మాట్లాడ‌కూడ‌దు. కానీ, నీ విష‌యంలో కొన్ని మిన‌హాయింపులు యివ్వ‌డానికి ఫిక్స్ అయిపోయాను కాబ‌ట్టీ చెపుతాను. మీ ఆవిడ గుండెలు ప‌గిలేలా ఏడుస్తోంది. నువ్వంటే చాలా యిష్టం అనుకుంటా” అంది దున్న‌పోతు.

ఉత్కృష్ట్ మొహం వున్న‌ట్టుండి విచారంగా మారిపోయింది.

“చ‌చ్చిపోయినందుకు బాధ ప‌డుతున్నావ్ క‌దూ” అనున‌యంగా అడిగింది దున్న‌పోతు.

కాదన్న‌ట్టు త‌ల అడ్డంగా వూపాడు ఉత్కృష్ట్. త‌న అంచ‌నా త‌ప్ప‌యినందుకు కంగారు ప‌డింది దున్న‌పోతు.  “ఆగాగు. నేనే చెపుతా. సెంటిమెంట‌ల్ గా ఫీల‌య్యేస‌రికి నా జ‌డ్జిమెంట్ తేడా కొట్టింది”, అని ఆలోచ‌న‌లో ప‌డింది.

“మీ ఆవిడ‌కి నిజం చెప్పి వుండాల్సింది అనుకుంటున్నావు కదూ” అంది.

“అవును. కాలం వొక్కరోజు వెన‌క్కి వెళితే బావుండు. త‌న‌తో అబ‌ద్ధం చెప్ప‌కుండా వుంటే, చ‌చ్చిపోయినా ఫ‌ర‌క్ ప‌డ‌దు” అన్నాడు ఉత్కృష్ట్.

“అదెలాగూ జ‌రిగేది కాదు కాబ‌ట్టీ అలా అనిపిస్తుందేమో నీకు” అంది దున్న‌పోతు.

“న‌న్ను క‌వ్వించ‌డానికి అలా అంటున్నావు తప్ప‌, నీకు తెలియ‌దా నా మ‌న‌సులో ఏముందో” అన్నాడు.

“మ‌నం ఎక్క‌డికి వెళుతున్నాం, అక్క‌డ ఏముంటుంది, నీ భ‌విష్య‌త్తు ఎలా వుండ‌బోతోంది తెలుసుకోవాల‌ని లేదా నీకు” అంది దున్న‌పోతు మాట‌మారుస్తూ.

ఇద్ద‌రూ మాట‌ల్లో ప‌డ్డారు. బ‌తికున్న‌న్నాళ్లూ గొప్ప ధైర్య‌వంతులుగా పోజుకొట్టి, తీరా చ‌నిపోయాక త‌నతో క‌లిసి రావ‌డానికి శోకాలు పెట్టిన‌వాళ్ల గురించి చెపుతూ వొక‌ట్రెండుసార్లు ప‌గ‌ల‌బ‌డి న‌వ్వింది దున్న‌పోతు. దానికి కొంత‌మంది ప‌ట్ల గౌర‌వం, కొంత‌మంది ప‌ట్ల చిరాకు, కొంత‌మంది ప‌ట్ల ఆరాధ‌నాభావం వుండ‌డం గ‌మ‌నించాడు ఉత్కృష్ట్. కేవ‌లం మాట‌ల్ని బ‌ట్టే కాదు.. ఒక్కొక్క‌ళ్ల గురించి మాట్లాడుతుంటే దున్న‌పోతు మొహంలో వొక్కో ర‌క‌మైన ఎక్ప్రెష‌న్ క‌న‌బ‌డుతోంది. అన్ని జంతువుల మొహంలోనూ యిన్ని ర‌కాల భావాలు ప్ర‌తిఫ‌లిస్తాయా? గ‌మ‌నించే తీరికా, ఆస‌క్తీ లేక‌పోవ‌డం వ‌ల్ల త‌న దృష్టికి రాలేదా? ఏమో మ‌రి.

“నీకెప్పుడూ ఎవ‌రి విష‌యంలోనూ అయ్యోపాపం వీళ్ల‌ని నాతోపాటు తీసుకెళ్ల‌డం త‌ప్పు అని అనిపించ‌లేదా?” అడిగాడు ఉత్కృష్ట్.

“ఒక్క‌సారి అనిపించింది” బాధ‌గా చెప్పింది దున్న‌పోతు.

“ఎవ‌రా మ‌నిషి?” అడిగాడు.

“చెప్ప‌కూడ‌దు, అది దేవ‌ర‌హ‌స్యం. ఐ మీన్ మ‌హిష‌ర‌హ‌స్యం” అని చిలిపిగా క‌న్నుకొట్టింది దున్న‌పోతు.

“నీకో సంగ‌తి తెలుసా. నామీద బాగా ప్రేమేసిన‌ప్పుడు మా అమ్మ న‌న్ను దున్న‌పోతా అని ద‌గ్గ‌ర‌కి తీసుకొని వాటేసుకునేది” చెప్పాడు ఉత్కృష్ట్. దున్న‌పోతు ఏం మాట్లాడలేదు. కార‌ణం ఏంటో గానీ, ప్ర‌యాణం మొద‌లైన‌ప్పుడు వున్న వుత్సాహం దున్న‌పోతులో యిప్పుడు లేద‌ని అర్థ‌మైంది ఉత్కృష్ట్ కి. చివ‌రి అర‌గంట‌లో నాలుగైదు సార్లు ఆగి, త‌ల విదిలించి మ‌ళ్లీ చిన్న‌గా న‌డ‌వ‌డం కంటిన్యూ చేస్తోంది దున్న‌పోతు. దానికి అల‌స‌ట‌గా వుందేమో. అలా వుంటుందా? త‌ను యిలా ఆలోచిస్తున్న సంగ‌తి దానికి అర్థం అవుతుందిగా. స‌మాధానం చెప్పాల‌నుకుంటే చెప్పి వుండేదే. అడ‌గ‌క‌పోవ‌డ‌మే బెట‌ర్ అనుకున్నాడు. కానీ త‌న‌ని అంత మ‌ర్యాద‌గా ట్రీట్ చేస్తున్న దున్న‌పోతుని మంచి మూడ్ లోకి తీసుకు రావాల్సిన బాధ్య‌త త‌న మీద వుంద‌ని అనిపించింది అత‌నికి.

“నీ కంపెనీ చాలా బావుంది నాకు. నాకు వూహ తెలిశాక యింక రిలాక్స్డ్ గా, యింత పీస్‌ఫుల్‌గా ఎప్పుడూ లేను” అన్నాడు.

“థేంక్యూ” సిగ్గుప‌డింది దున్న‌పోతు.

“ఏమీ దాయాల్సిన అవ‌స‌రం లేకుండా వున్న‌దున్న‌ట్టు మాట్లాడ్డం చాలా హాయిగా వుంది” అన్నాడు.

“ఆ ఆప్ష‌న్ భూమ్మీద కూడా వుందిగా నీకు. నువ్వు వాడుకోలేదంతే” అంది దున్న‌పోతు.

“దేని విలువైనా పోగొట్టుకున్నాకేగా తెలిసేది” నిరాశ‌గా అన్నాడు ఉత్కృష్ట్.

దున్న‌పోతు మ‌ళ్లీ ఆగింది.

“ఏమైంది” అడిగాడు.

“నిన్ను మ‌ళ్లీ భూమ్మీద దిగ‌బెడ‌తాను. నీ జీవితంలో చివ‌రి ప‌దిగంట‌లూ మ‌ళ్లీ కొత్త‌గా జీవించు. త‌ర్వాత మ‌ళ్లీ నాతో వ‌చ్చేయాలి. స‌రేనా?” అంది దున్న‌పోతు.

“జోక్ చేస్తున్నావా?” అనుమానంగా అన్నాడు.

“లేదు. నిజంగానే. ఇప్పుడీ ప‌ని చేయ‌క‌పోతే ఎప్ప‌టికీ ప‌శ్చాత్తాప ప‌డుతూనే వుంటాను నేను. నువ్వింకేం మాట్లాడ‌కు. ఇది నేను నీకు యిస్తున్న అవ‌కాశం కాదు. నా స్వార్థం కోసం నేను చేస్తున్న ప‌ని . అంతే. ప‌ద వెళ‌దాం” అంటూ వెన‌క్కి తిరిగింది దున్న‌పోతు.

*****

ఠ‌ణ‌ఠ‌ణ ఠ‌ణ‌ఠ‌ణ‌.. కాత్యాయ‌ని గిన్నెలు స‌ర్దుతున్న‌ట్టుంది. క‌ళ్లు తెరిచి చుట్టూతా చూశాడు ఉత్కృష్ట్. అంతా మామూలుగానే వుంది.  తాను చ‌చ్చిపోవ‌డం, దున్న‌పోతుతో క‌లిసి ప్ర‌యాణం చేయ‌డం, మ‌ళ్లీ భూమ్మీద‌కి రావ‌డం నిజ‌మేనా? లేచి వంటింట్లోకి వెళ్లాడు.

“పెరుగు ఫ్రిజ్ లో పెట్టాను. భోజ‌నం చేయ‌డానికి అర‌గంట ముందు తీసి బ‌య‌ట‌పెట్టండి. బ‌ట్ట‌లు బ‌య‌టే వున్నాయి. వ‌ర్షం వ‌స్తుందేమో వొక క‌న్ను అటు వేసివుంచండి. సాయంత్రం ఆరు నుండీ ఏడు వ‌ర‌కూ అమ్ములుకి సంగీతం క్లాసు. మ‌ర్చిపోకండి. ముహూర్తం టైము దాకా వుండ‌న్లే. మొద‌టి బంతిలో తినేసి, తొమ్మిదీ తొమ్మిదిన్న‌ర క‌ల్లా వ‌చ్చేస్తా నేను..” చెప్పుకుపోతోంది కాత్యాయ‌ని.

“నీతో వొక విష‌యం చెప్పాలి” అన్నాడు అడ్డం ప‌డుతూ.

“త్వ‌ర‌గా చెప్పండి. ప్ర‌మీల వాళ్లు ఆల్రెడీ ఆటోలో బ‌య‌ల్దేరార‌ట‌. వాళ్లు న‌న్నొదిలేసి పోయారంటే, మ‌ళ్లీ బ‌స్సుల్లో ప‌డి వొక్క‌దాన్నే పోవాలి” అంది.

“బ్యాంకులో వున్న బంగారం ఫంక్ష‌న్ టైముకి విడిపించి తెస్తాన‌ని చెప్పాను క‌దా. ఎంత ప్ర‌య‌త్నించినా స‌మ‌యానికి డ‌బ్బులు అంద‌లేదు. హారం చేయించిన‌ప్పుడు మోడ‌ల్ కోసం కంసాలికి యిచ్చిన గిల్టు ఛెయిన్ కే మెరుగు పెట్టించి తెచ్చాను. నీతో రాత్రే చెపుదాం అనుకున్నాను. అప్ప‌టికే నువ్వు స‌గం నిద్ర‌లో వున్నావు. నిన్ను లేపి యీ విష‌యం చెప్ప‌డానికి నాకు ధైర్యం చాల్లేదు” అన్నాడు ఉత్కృష్ట్ వొక్కోమాటా కూడ‌దీసుకుంటూ.

అప్ప‌టిదాకా చ‌ప్పుడు చేస్తూ హ‌డావుడిగా అటూయిటూ తిరుగుతున్న కాత్యాయ‌ని ఆగి, చేతులు కొంగుకి తుడుచుకుంటూ భ‌ర్త‌వైపు చూసింది. రెండు క్ష‌ణాలు ఆమె క‌ళ్ల‌లోకి చూసి త‌ల దించుకున్నాడు ఉత్కృష్ట్. కాత్యాయ‌ని అత‌నికి ద‌గ్గ‌ర‌గా వ‌చ్చి నిల‌బ‌డింది. ఆమె వూపిరి అత‌నికి త‌గులుతోంది.

“ఏద‌నుకుంటే అద‌నుకుంటారు. ఈ పూట‌కి ఆగిపోనా” అంది.

“ఒంటిమీద క‌నీసం ఆ మాత్రం బంగారం లేకుండా వెళ్ల‌డం నీకు చిన్న‌త‌నంగా వుంటుంద‌ని నాకు తెలుసు..”

భ‌ర్త‌కి మ‌రింత ద‌గ్గ‌ర‌గా వ‌చ్చి, అత‌ని పెద‌వులు త‌న పెద‌వుల‌కి త‌గిలేలా త‌ల‌ని అటూయిటూ ఆడిస్తూ “అబ్బా, ఆ వెధ‌వ బంగారం గోల కాసేపు వ‌దిలిపెడుదూ. ఆగిపోనా అని అడుగుతుంటే ఎందుకో ఆలోచించ‌వే” అంది ముద్దుగా.

ఆ త‌ర్వాత ఏం జ‌రిగుండేదో కానీ, “అమ్మా” అంటూ నిద్ర‌క‌ళ్ల‌తో అమ్ములు వంటింట్లోకొచ్చింది. రెండ్రోజుల నుండీ కూతురితో మాట‌ల్లేవు ఉత్కృష్ట్ కి. ఫ్రెండ్స్ తో క‌లిసి వారంరోజులు ట్రిప్ కి వెళ‌తా అంది.

వ‌ద్దు. దీని మీద నో ఆర్గ్యుమెంట్స్ అన్నాడు. బాగా హ‌ర్ట్ అయిన‌ట్టుంది. త‌ప్పించుకు తిరుగుతోంది. తండ్రిని చూసి వెన‌క్కి తిరిగి వెళ్లిపోబోయింది.

“అమ్ములూ” పిలిచాడు.

ఆగింది. కానీ వెన‌క్కి తిర‌గ‌లేదు.

“ట్రిప్ కి వెళుదువు గానీ. కానీ వొక కండిష‌న్‌. నిన్ను చూడాల‌ని నాకు ఎప్పుడ‌నిపించినా, నువ్వున్న‌చోట‌కి వ‌చ్చేస్తాను. ఎందుకొచ్చావ్ అని నాతో దెబ్బ‌లాడ‌కూడ‌దు మ‌రి” అన్నాడు.

వెన‌క్కి తిరిగింది అమ్ములు.

“న‌న్ను చూడ‌కుండా వారం రోజులు వుండ‌లేవు కాబ‌ట్టీనేనా నన్ను ట్రిప్ కి వెళ్ల‌వ‌ద్దంది?” అడిగింది.

“అవును” అన్నాడు.

“బాయ్స్ కూడా వ‌స్తారు కాబ‌ట్టీ, నా మీద న‌మ్మ‌కం లేక పంపించ‌ట్లేదేమో అనుకున్నా” అంది అనుమానంగా.

“ఛ ఛ అదేం కాదు. వారం రోజులు అంటే.. 168 గంట‌లు” గొణుగుతున్నాడు ఉత్కృష్ట్.

“సోది మొహాలు. వాళ్ల‌తో క‌లిసి వెళ్లాల‌ని నాకేమీ వుబ‌లాటంగా లేదు. నువ్వు వొద్ద‌న్నావ‌ని పంతానికి వెళ్తా అన్నానంతే” అంది న‌వ్వుతూ. కూతురి మొహంలో న‌వ్వు చూడ‌గానే ఉత్కృష్ట్ కి ప్రాణం లేచొచ్చింది.

“నువ్వు కాస్త ప‌క్క‌కి జ‌రిగి స్పేష్ యిస్తే మా డాడీని హ‌గ్ చేస్కోవాలి నేను” అంది అమ్ములు కాత్యాయ‌ని వైపు చూస్తూ.

“బావుంది సంబండం. నీ త‌ర‌పున వ‌కాల్తా పుచ్చుకోని మీ నాన్న‌ని వొప్పిద్దామ‌ని చూసినందుకు నేనే ప‌రాయిదాన్నై పోయానా?  నాకెందుకొచ్చింది, నేను మా ప్ర‌మీల‌క్క‌య్య‌తో క‌లిసి ఫంక్ష‌న్ కి పోతా అంది” కాత్యాయ‌ని న‌వ్వుతూ.

****

 

దున్న‌పోతు వ‌రండాలో నిల‌బ‌డి వెయిట్ చేస్తోంది.

“నేను రెడీ వెళదామా” అన్నాడు ఉత్కృష్ట్.

“ఆవు పులి క‌థ‌లో మాదిరిగా నేను నిన్ను వ‌దిలేస్తా అనుకుంటున్నావు క‌దూ” అంది దున్న‌పోతు.

“నేనేమీ అనుకోవ‌డం లేదు. మ‌ళ్లీ నా మ‌న‌సు మారి, నేను కూడా శోకాలు పెట్ట‌డం మొద‌లెట్ట‌క‌ముందే బ‌య‌ల్దేరు” అన్నాడు.

“ఇంకో ప‌ది నిముషాలు టైముందిలే మ‌న‌కి. ఈలోగా నీకొక విష‌యం చెప్పాలి” అంది దున్న‌పోతు.

“ఏంట‌ది?” అడిగాడు.

“ప‌దిహేనేళ్ల క్రితం యిలాగే మీ అమ్మ‌ని తీసుకెళ్లాను. దారిపొడుగూతా నీ గురించి మాట్లాడుతూనే వుంది. నిన్ను ప్రేమ‌గా దున్న‌పోతా అని పిలిచేద‌న్న సంగ‌తి త‌ను కూడా చెప్పింది నాకు. ఆవిడ ఆ ప‌దాన్ని ఎంత తియ్య‌గా ప‌లికిందంటే.. జీవితంలో మొద‌టిసారి నా పేరు నాకు చాలా అందంగా వినిపించింది. న‌న్ను ముద్దు పెట్టుకున్న మొద‌టి మ‌నిషి కూడా త‌నే. ఆ క్ష‌ణ‌మే త‌న‌ని వెన‌క్కి తీసుకొచ్చేద్దామ‌నుకున్నాను. అలా చేసి వుంటే నేను కూడా భూలోకంలో ఆగిపోవాల్సి వ‌చ్చేది.  కానీ నాకు అప్ప‌ట్లో ధైర్యం చాల్లేదు. నేను నీకు అబ‌ద్ధం చెప్పాను. ఒక‌సారి భూమ్మీద‌కి పంపాక మ‌ళ్లీ నిన్ను వెన‌క్కి తీసుకెళ్లే శ‌క్తి లేదు నాకు”.

“అంటే యిప్పుడు మ‌నం” న‌మ్మ‌లేన‌ట్టు అడిగాడు ఉత్కృష్ట్.

“ప్ర‌స్తుతానికి యిద్ద‌రం యిక్క‌డే. మ‌ళ్లీ నీ వంతు రావ‌డానికి చాన్నాళ్లు ప‌డుతుంది. ఈలోగా నేను యీ లోకంలోనే కాలం చేస్తాను. దేని విలువైనా పోగొట్టుకున్నాకే తెలుస్తుంద‌ని బాధ ప‌డ్డావుగా. అలాంటి పొర‌పాటు యిక మీద‌ట చేయ‌వ‌నే న‌మ్మ‌కం నాకుంది” చెప్పింది దున్న‌పోతు.

అంటే అమ్ముల్నీ, కాత్యాయ‌నినీ మ‌ళ్లీ చూస్తాన‌న్న‌మాట‌. చ‌చ్చిపోయాన‌ని తెలిసిన‌ప్పుడు రావాల్సిన ఏడుపు యిప్పుడొస్తుందేంటి. రేప‌ట్నించీ..

“బాగా ఆక‌లిగా వుంది. తిన‌డానికి ఏమైనా పెడ‌తావా” అతని ఆలోచనలకు అడ్డం పడుతూ అడిగింది దున్న‌పోతు.

“ఏం కావాలి” దాని మెడ‌చుట్టూ చేయి వేసి ప్రేమ‌గా అడిగాడు.

“ఏదో వొక‌టి. బై ద వే. నౌ అయాం యాన్ ఆర్డిన‌రీ యానిమ‌ల్‌. రేప‌ట్నించీ వాష్‌రూమ్ కి పోవాల్సొస్తుంది. ప‌ర్వాలేదా” అంది.

“దున్న‌పోతా” అంటూ దాని నుదిటి మీద ముద్దు పెట్టుకున్నాడు ఉత్కృష్ట్.

*

శ్రీధర్ బొల్లేపల్లి

21 comments

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

 • రీడబిలిటీ శ్రీధర్ కథల్లో సుగుణం.సునిశిత హాస్యం తో
  జీవితాన్ని రంగరించి దర్శించడం అందరికీ సాధ్యం కాదు.ఈ మాట నామినిని ఉద్దేశించి రమణ గారు అన్నట్టున్నారు.
  వేగంగా రాయడం మరో సుగుణం.
  పాఠకుడ్ని నిరాశకు లోనుచేయకపోవడం మరో సుగుణం.
  I enjoyed reading

  • అన్నా,
   నీ కామెంట్ చదివి ఎంత సంబరంగా ఫీలయ్యానో మాటల్లో చెప్పలేను. చాలా చాలా కృతజ్ఞతలు ❤🙏❤

 • కథనం బాగుంది. హ్యూమరస్ గా వుంది.

 • ఇది కథా!!!?

  నాకైతే నేనూ ఇంకా శానామంది కనబడ్డారు..

  బావుందోయ్ శ్రీధరం..

 • చాలా బావుంది శ్రీధర్ , భలే రాస్తారు. మీ శైలి నాకు చాలా ఇష్టం. ఆపకుండా చదివించేలా వుంటుంది.

  • నా కథల్నీ, నన్నూ ఎక్కువసార్లు ఆశీర్వదించింది మీరే.. ❤🙏❤

 • విజయవాడ రాగానే నిన్ను (నువ్వు అనొచ్చా?) నా ఇంటికి లంచ్ కి పిలుస్తా

  • అమ్మా,
   అంతకన్నా భాగ్యమా. కానీ, మీ ఇంట్లో నుండి బయటకి వచ్చిన మరుక్షణం నుండీ “జ్ఞానపీఠ్ అవార్డు గ్రహీత శ్రీధర్ బాబు” అనే రాసుకుంటా నా పేరు.. ❤

 • Very Creative!
  some key aspects of life were touched very subtly in the story, enjoyed reading it. Kudos to Sridhar Garu

 • విభిన్న/విరుద్ధ భావాలు రెండే ప్రోటగనిస్ట్ క్యారెక్టర్ లతో ఆవిష్కరించడం, చదివే వారిని ఐడెంటిఫై చేపించగలడం రేర్ క్వాలిటీ, చెప్పేదేముంది మీ కరవాలంకు తిరుగేముంది..

 • కథలో వేగమూ,చదివించే గుణం మీ ట్రేడ్మార్క్.
  మృత్యువును కథలోకి తెచ్చిన తీరు బాగుంది.

  దున్నపోతు….ఎంత చాకిరీ చేసి ఉంటుంది.. ఎటువంటి ప్రేమ పొందకుండా.. ఎంత దుఃఖం దానిది.

  అది unprofessional కాదు unappriciated.

  అది మనవతను,సహజ జంతుత్వాన్ని, నశ్వరత్వాన్ని కోరుకున్నది.

  దంపతీ శృంగారాన్ని మీరు చూపే తీరు గొప్పది.

 • కథ బాగుంది. రచయితకు శుభాకాంక్షలు

 • భలే ఉందండీ…. ఇంత సరళంగా, ఆర్భాటం లేకుండా కథ రాయొచ్చా??!! వెరీ నైస్.. శ్రీనివాస్ గారు అన్నట్టు…. చదివించే గుణం మీ సొంతం. అభినందనలు.

 • అబ్బా అప్పుడే అయిపోయిందా?! మీ రాతల్లో ఏదో మాయ ఉందండి. ఇంకా ఇంకా చదవాలనిపిస్తోంది. నా ఫ్రెండ్ షేర్ చెయ్యకపోతే మిస్ అయ్యేదాన్నేమో! చాలా బాగుంది అనేది చిన్న మాట శ్రీధర్ గారు. ఇప్పుడే మరికొంత మందికి అర్జెంట్ గా షేర్ చేసేయాలి.

 • నేను మీ కథ ని ఇప్పుడే చదివాను….ఒక మంచి కథ చదివిన అనుభూతి. సున్నితమైన భావోద్వేగాన్ని చాలా balanced గా ఒడిసిపట్టుకుని చాలా skilful గా నడిపించారు కథ…sensible humour one more asset…. Imagination కూడా ఇంత బాగుంటుందా అనిపించేలా రాసారు….last లో దున్నపోతా అని ప్రేమ గా ముగించడం చాలా నచ్చింది.

‘సారంగ’ కోసం మీ రచన పంపే ముందు ఫార్మాటింగ్ ఎలా ఉండాలో ఈ పేజీ లో చూడండి: Saaranga Formatting Guidelines.

పాఠకుల అభిప్రాయాలు