అనేక నేనుల ఒక్క నేనే!

లుచటి నీరెండలో
వెలుపలి గాయాలకు తెలియకుండా
మలాము రాసే పదాల పూత ఊర్మిళ కవిత్వం

గజిబిజి గందరగోళాలకు తావులేకుండా ,
నదితో పడవ మాట్లాడినట్టు
తన వాక్యాలు అలా నడిపించుకెడతాయి

కళ్ళను అక్షరాలకు అప్పగించినతరువాత
ఒక ధ్యానంలోకి వెడతాము .

ఏకాంతాన్ని వెతుక్కుని
పేజీలను అలా తిప్పుకుంటూ పోతే ,
మళ్ళీ మన కలవరింతలు  పలవరింతలు
దారి మలుపులో పలకరిస్తాయి

కొన్ని కన్నీళ్ళు
మరింత విచారం , గుప్పెడు ఎదురుచూపు
అన్నీ ముడివడి పొరలు పొరలుగా
తారసిల్లుతాయి అనేక రంగుల్లో …

సాంద్రమైన తన కవిత్వంలో సారవంతమైన
భావాల అనుభూతులు ఎవరికి వారు
మోహంగా పోగుచేసుకోవాల్సిందే.

మనల్ని మనం రద్దు చేసుకుని
నిశ్శబ్దంగా ఒలికిన తన ప్రశ్నలకు
మార్మిక ధ్వని, తాత్విక తాదాత్మ్యం,
ఒంటరితనపు ఖాళీ, సున్నితపు పలవరింత
మెత్తని గాయాల చింత, తీపి శాపపు దుఃఖం
‘ఒక్క నేనే’ లో అనేక రూపాలతో దర్శిస్తాము

అత్తరు బుడ్డి పగిలిన తరువాత
గుచ్చిన గాజుపెంకు సలుపు ఓవైపు
పరిమళపు సువాసన మరోవైపు
రెండిటి అనుభూతి ఏక కాలంలో కలిగే
ఒక అలౌకిక ఉపశమనం ఊర్మిళ కవిత్వం.

 

ఊర్మిళ కొత్త కవిత్వం “ఒక్క నేనే” విడుదల సందర్భంగా ఒక సంభాషణ: 

రెండవ కవితా సంపుటి ‘ఒక్క నేనే ‘విడుదలయిన సందర్భంలో మీకు అభినందనలు ఊర్మిళ గారు. మనశ్శకలాల అనేక రంగులే మీ కవిత్వం. ఏమంటారు  ?

అంతేకదా! ఏదైనా అనుభవంలోకి వచ్చినప్పుడు  ఎన్నో అనుభూతులు కలుగుతాయి. ఎదో ఒకటి మనసును పట్టుకొని ఉక్కిరి బిక్కిరి చేస్తుంది. పారదర్శకమైన పొరపై ఒక గాఢమైన రంగునో ఒక ముద్రనో చిత్రిస్తుంది.  శ్వేత వర్ణంపై రంగుల వలలే అన్ని. వాటిని ఛేదించడమో హత్తుకోవడమో చేయాలి మరి.

‘ఒక్క నేనే ‘ స్వరం వెనుక ఆవహించిన అనేక స్వరాల సంవేదనలు ఉన్నాయి కదా ?

అనేక స్వరాల సంవేదన అంటే మళ్ళీ నేనే. నా మనసే.

హృదయంతో చూసేవి అన్ని మనసును తాకుతాయి. క్షణంలో ఎన్నో భావాలు విస్పోటనం చెందుతాయి కదా!  గులకరాళ్లపై నీటి ప్రవాహం లా, ఒంటరి ప్రయాణంలో కొండచరియ విరిగి పడినట్టు, సవ్వడి లేనిచోట ఎండలో గాలి సుడి తిరిగినట్టు,నిండు సముద్రంలో తిమింగలాలు చుట్టు ముట్టినట్టు లేదా సాయం సందె వేళ ఇంద్ర ధనస్సు విరిసినప్పుడు కలిగే స్పందనలు అనేకం. అయితే సంతోషం మనసులో కాసేపు వుంటుంది. కానీ బాధ కలిగించే గాయాలు ఒక అలజడిని సృష్టిస్థాయి.ఎన్నో రకాల సంఘర్షలను కలిగిస్థాయి.  నా మట్టుకు నేను ఆ రాపిడిలో ఎన్నో ముక్కలు గా విడిపోతాను. కానీ ఉనికి లో వున్నది మళ్ళీ నేనేగా.

కవిత్వం మీద మోహం ప్రతి కవితలో … మీ కవితా నేపథ్యం వివరిస్తారా?

మనసు ఉద్వేగాలు  చెందడం సహజం. జీవితంలో ఎదురైన ఏ సంఘటనను అయినా ఇష్టంగా తీసుకోవడం చేయాలి. అప్పుడు ఏ మలుపు అయినా దాటడం సులువు అవుతుంది.  ఇష్టంగా తీసుకున్నది మోహపురితమే. బహుశా అందుకే పదాలు మోహం కలిగిస్తాయి కావచ్చు.

ఇక కవితా నేపథ్యం అంటూ పెద్దగా ఏమి లేదు. పెద్ద కుటుంబం. అమ్మ ఉనికి ఒక అంతులేని మోహంగా వుండేది.
బాపు మంచి అభిరుచి వున్నవాడు. సాహిత్యం మంచి సంగీతం మాకు పరిచయం చేశాడు. రోజు రాత్రిళ్ళు భారత రామాయణ పద్యాలే కాదు పుష్ప విలాపం కుంతీ విలాపం ఎంకి పాటలు పాడి మాకు వినిపించేవాడు. అలా నాకు కవిత్వం పై ఆసక్తి కలిగిందేమో.

మొదటి కవితాసంపుటికి రెండవ సంపుటికి మధ్య చేసిన ప్రయాణం మీకెలా అనిపించింది?

అలా ప్రత్యేకంగా ఏమి చెప్పలేను. మొదటి కవితా సంపుటి “అంగార స్వప్నం” నేను రాయడం మొదలుపెట్టినప్పటి నుండి రాసినవాటిలో నా వద్ద మిగిలినవి. అవి అప్పటి సమయంలో నాలో కలిగిన భావాల వ్యక్తీకరణ. దాపరికాలు అతిశయోక్తులు సంశయాలు ముసుగులు లేని నేను. ఇప్పుడు కూడా అంతే. ఇదో ప్రయాణం అని ఇలా దారులు వేసుకోవాలి అని కానీ ఈ మొక్క ను నాటాలి అని కానీ అనుకోను సరికదా అంచనా కూడా వేయను. అప్పటి కప్పుడు  ఒక అనుభం కలిగించిన  అనుభూతిని  సంవేదనను వ్యక్తీకరించడానికి చేసే ప్రయత్నమే.

ఇప్పుడు అనేక నేనుల మీద మీ అభిప్రాయం ఏమిటి ?

మీరు అంటున్నది విరి విరిగా వస్తున్న కవిత్వం గురించి అయితే కనుక మంచి పరిణామమే. కవుల గురించి నేనెలా చెప్పగలను. వాళ్ళు రాస్తున్నది కవిత్వమే అయితే నిలుస్తుంది. లేకుంటే లేదు.

*

తెలుగు వెంకటేష్

Add comment

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

‘సారంగ’ కోసం మీ రచన పంపే ముందు ఫార్మాటింగ్ ఎలా ఉండాలో ఈ పేజీ లో చూడండి: Saaranga Formatting Guidelines.

పాఠకుల అభిప్రాయాలు