అట్టడుగుస్థాయి ఉద్యోగి

శ్రీలంకకు చెందిన ప్రముఖ తమిళ రచయిత ఎ.ముత్తులింగం, 1937న యాళ్పాణంలో జన్మించారు. దాదాపు అరవై ఏళ్ళుగా తమిళం సాహిత్యంలో తన ఉనికిని చాటుకుంటున్న ఇతను, ఐక్యరాజ్యసమితి అధికారిగా ప్రపంచంలోని వివిధ దేశాల్లో పనిచేశారు. పదవీ విరమణ తర్వాత కెనడాలో స్థిరపడ్డారు. ఈయన రచనలకుగాను శ్రీలంక, భారత మరియు ఇతర దేశాల్లోని పలు తమిళ సాహితీ సంస్థలు పురస్కారాలు ఇచ్చి గౌరవించాయి. ఈయన రాసిన కొన్ని కథలు తెలుగులోకి అనువాదమయ్యి “ఐదు కాళ్ళ మనిషి” అన్న పేరిట అందుబాటులో ఉన్నది.

అట్టడుగుస్థాయి ఉద్యోగి

– ఎ.ముత్తులింగం

కథ ఎక్కడ మొదలవుతుందో అక్కడనుండి మొదలుపెట్టడమే మంచి అలవాటు. నైరోబీలో ఆకాశాన్ని తాకే పెద్దపెద్ద బిల్డింగుల్లో ఎన్నో విదేశీ సంస్థల కార్యాలయాలు ఉంటాయి. ప్రతీ పెద్ద సంస్థలోనూ అట్టడుగుస్థాయి ఉద్యోగి అని ఒకడు ఉంటాడు. బిల్డింగులు వేరైనా, సంస్థలు వేరైనా అతని వ్యవహారం మాత్రం ఒకటే. అతనికీ ఒక కథ ఉంటుంది.

ఒక పెద్ద సంస్థలోకి ఒక పులి రహస్యంగా లోపలికి వచ్చింది. మరుసటి రోజు సెక్రటరి కనిపించలేదు. సంస్థ ఎప్పటిలాగే దానిపోకడలో అది నడుస్తుంది. మరుసటి రోజు ఒక గుమాస్తా కనిపించలేదు. ఎక్కడా ఎలాంటి చలనమూ లేదు. మూడోరోజున పేద్ద పదనిలో ఉండే డివిజనల్ మేనేజర్ కనిపించలేదు. అప్పుడూ ఎలాంటి చర్చాలేదు. నాలుగోరోజు అట్టడుగుస్థాయి ఉద్యోగి కనిపించలేదు. వెంటనే సంస్థంతా కంగారుపడి కట్టగట్టుకుని వెతికింది. ఆలాంటొక అట్టడుగుస్థాయి ఉద్యోగే అబ్దులాటి.

రోజుకు సరాసరిగా అతను ‘యెస్, సార్’ అని 20 సార్లయినా అంటాడు. కొన్నిసార్లు ఎవరూ ఏమీ అనకుండా వాడిని దాటుకుని వెళ్ళినా అప్పుడు కూడా ఒక ‘యెస్, సార్’ పడేసి ఉంచుతాడు, ఎందుకైనా మంచిదిలే అని. ఆ రోజు పొద్దున్నుండి నలబైసార్లు ‘యెస్, సార్’ అనేశాడు. నాలుగు ఏళ్ళు ఆ సంస్థకి అధ్యక్షుడిగా పనిచేసిన జర్మనీయుడు ఊలాఫ్ వాల్డన్ ఆ రోజు పదవీ విరమణ తీసుకుంటున్నాడు. ఆయనకు వీడ్కోలు వేడుకల ఏర్పాట్లు జరుగుతున్నాయి. అబ్దులాటి పలు చోట్ల ఒకే సమయంలో కనబడ్డాడు. ఆ రోజు శుక్రవారం. కొత్త అధ్యక్షుడు సోమవారం పదవి చేపడతాడు అని మాట్లాడుకుంటున్నారు.

ఆ వేడుకకు సంబంధించి ఏర్పాట్లు చేస్తున్న వ్యక్తి మ్వాండో; అడ్మిన్ మేనేజర్. ఆయన నోరు తెరిస్తే పొగ వస్తుంది లేదా అబద్ధం వస్తుంది. స్ప్రింగు కమ్మీల్లాంటి జుట్టు. తన కిడ్ని ఒకటి అమ్మి కారు కొన్నాడు అన్న పుకారు కూడా గాల్లో వినిపిస్తు ఉంటుంది. నిజమేంటో తెలీదు. నడిచేప్పుడు ఆయన పొట్టలో నీళ్ళు తొణికే శబ్దం వినిపిస్తుంది. ఆయనకన్నా కింద ఉద్యోగం చేసేవాళ్ళు ఆయన్ని చూసినప్పడు ‘చిరు’నవ్వు చిందించినా సగం  ‘చిరు’నవ్వే తిరిగి ఇచ్చేవాడు. ‘చిరు’నవ్వులో కూడా లాభం కొట్టేస్తుంటాడు. ఆయనే తొలి వక్త. విరమణ తీసుకుంటున్న అధ్యక్షుణ్ణి పొగడ్తల్లో ముంచి ఆకాశాన తేల్చాడు. అధ్యక్షుడు వేదిక మీద ఇబ్బందిగా మెలికలు తిరిగాడు.

తర్వాత, అధ్యక్షుడి పర్సనల్ సెక్రటరి, అయానా వంతు. మంచి ఎంబ్రాయ్డరీ చేసిన వస్త్రం దండెం కర్రమీద పడేసినట్టు వేసుకుని ఉంది. హుషారు చిందిస్తూ వయ్యారంగా నడుచుకుంటు వేదిక ఎక్కింది. కిందటిసారి పాత అధ్యక్షుడు వెళ్ళిపోతుండగా మాట్లాడిన అవే మాటలను కంప్యూటర్‍నుండి దింపుకుని పేరు, తారీకు మార్చి మాట్లాడేసింది అన్న విషయాన్ని అబ్దులాటి పసిగట్టి మనసులోనే నవ్వుకున్నాడు. అతను 20 ఏళ్ళుగా అక్కడే ఉద్యోగం చేస్తున్నాడు. నలుగురు అధ్యక్షులను చూశాడు. అతనికి తెలియని రహస్యం ఉండదు.

ఆపైన మరికొందరు మాట్లాడారు. చివరిగా మాట్లాడటానికి అబ్దులాటి వేదికమీదకు ఎక్కాడు. ఎవరూ ఊహించలేదు. అట్టడుగుస్థాయి ఉద్యోగి అయిన అతను ఇదివరకెప్పుడూ వేదిక మీద మాట్లాడిన ఆనవాయితీ లేదు. ఆ బిల్డింగ్ ఆవరణలో పూచిన జక్రాండా పూలతో తయారు చేసిన పూలగుత్తి టేబుల్‍మీద వాడిపోయి ఉంది. అధ్యక్షుడు దాన్ని చూస్తూ విసుగ్గా కుర్చుని ఉన్నాడు.

‘నాలుగేళ్ళ క్రితం వచ్చిన ఈ కొత్త అధ్యక్షుడు ‘పొద్దున 8 కల్లా అందరూ ఆఫీసుకు రావడం అన్నది తప్పనిసరి. సాయంత్రం మాత్రం మీకు కావాల్సిన సమయానికి తిరిగి వెళ్ళొచ్చు. ఒకటే షరతు – పని అయిపోవాలి’ అని అన్నారు. అప్పుడే ఈ ఆఫీసు కథ మారిపోయింది. అదివరకెప్పుడూ లేనంతగా విజయవంతంగా సాగుతూ లాభాలు తెచ్చిపెట్టింది. నేను ఎందరో అధ్యక్షులను చూశాను. అయితే ఎక్కువగా నేను తిట్లు తిన్నది మాత్రం ఈయన దగ్గరే. కటువైన మనిషి. అయితే అంతే కరుణ, దయగల వ్యక్తి. ఉద్యోగులే సంస్థకు యజమానులు అని చెప్పి లాభంలో ఒక వంతుని పంచి ఇచ్చారు. ఈయన మనల్ని వదిలి వెళ్ళిపోయినా ఈయన చెప్పిన మాటొకటి మనతోనే ఉంటుంది. మంచిని నువ్వు వెతుక్కుంటూ వెళ్ళాలి. చెడు తానుగా నిన్ను వెతుక్కుంటూ వస్తుందిఅని.’

కండబట్టిన పంది మాంసం నిప్పుల్లో కాలుతున్న ఘుమఘమ గాలిలో వస్తూ ఉంది. విందుకోసం అందరూ కాచుకుని ఉన్నారు. అధ్యక్షుడి ప్రసంగం ఒక కథతో మొదలైంది. ‘ఒకడు డబ్బిచ్చి ఒక ఆక్టోపస్‍ను కొనుక్కుని పనిలోకి పెట్టుకుంటాడు. వాడికి పట్టలేనంత ఆశ్చర్యం. ఏ పని అప్పగించినా ఎనిమిదింతల వేగంతో చేసేస్తుంది. విశ్వాసబద్ధమైనది. ఎదురు మాట్లాడదు. ఒక నిముషం కూడా ఊరకే కూర్చోదు. ఒక రోజు వాడికి సిగరెట్ కాల్చాలి అనిపించింది. ఆక్టోపస్‍ని పంపించి సిగరెట్ కొనుక్కురమ్మన్నాడు. అర్ధ గంట దాటినా ఆక్టోపస్ తిరిగి రాలేదు. వాకిట్లోకి వచ్చి చూశాడు. ఆశ్చర్యపోయాడు. ఆక్టోపస్ అసలు బయలుదేరనేలేదు. ఏమైంది అని అడిగాడు. బూట్లు వేసుకుంటున్నాను అని అంది. నవ్వుకోవడానికోసం ఈ కథ చెప్పడంలేదు. ప్రపంచంలో పరిపూర్ణమైన వ్యక్తి అంటూ ఎవరూ లేరు. ఒక్కొక్కరిలోనూ ఒక గొప్ప లక్షణం ఉంటుంది; ఒక లోపమూ ఉంటుంది. మనం అందరం సమిష్టిగా కలిసి పని చేసేప్పుడు ఒకరి లోపాలను మరొకరు పూర్తి చేస్తాము. ఇదే విజయ రహస్యం.’

*

వేడుకలు పూర్తయ్యాక అబ్దులాటి 19వ అంతస్థులో ఉన్న తన స్టూల్ మీద కూర్చుని ఉన్నాడు. అధ్యక్షుడు ఊలాఫ్ ఏవో ఫైళ్ళను తీస్తూ సర్దుకుంటూ పనిలో మునిగిపోయి ఉన్నాడు. విందు అయిపోయాక ఇంటికి వెళ్ళకుండ ఆయన ఆఫీసుకు వచ్చేశాడు. ‘నువ్వు ఇంటికి వెళ్లొచ్చు. నాకేం సాయం అవసరం లేదు’ అని అధ్యక్షుడు చెప్పాడు. అబ్దులాటి ‘సార్, నేను ఈ నాలుగేళ్ళల్లో ఒక రోజైనా మీకంటే ముందుగా ఇంటికి వెళ్ళానా? ఇవాళ మీరు ఇక్కడ ఉండే చివరి రోజు. నేను మీరు వెళ్ళేంత వరకు ఉంటాను’ అని అన్నాడు.

పొద్దు కిందకు వాలుతోంది. గోడ మీద ఒక చిన్న చక్రంలా వెలుగు పడింది. అబ్దులాటి తన తండ్రి గురించి ఆలోచించాడు. ఇవాళ ఆయన రోజు ఎలా గడిచిందో! తలుపులో తాళం చెవి దోపే శబ్దం వినబడగానే ‘అబ్దులాటీ’ అంటూ ఉత్సాహంగా అరుస్తాడు. కొడుకుని చూడగానే ఆయను ముఖం విచ్చుకుంటుంది. అతనే సూప్ తాగిపించాలి. అమ్మ జాబును చదవమని చెప్పి వింటాడు. ఆమె చనిపోయి పదేళ్ళు అయినా అతను ఆ లేఖను చదువుతాడు. అ తర్వాత వంట పని.

వెలుగు చక్రం పైకి వెళ్ళిపోయింది. ఉన్నట్టుండి మెరుపులు, పిడుగులతో వర్షం మొదలైంది. మ్గోంగ్ పర్వతం పిడుగుల శబ్దాన్ని రెట్టింపు చేసింది. కిటికీలమీద వర్షపు చినుకుల చప్పుడు. అబ్దులాటి భయపడినట్టే జరిగింది. కరెంట్ పోయింది. కరెంటు పోతే ఆ బిల్టింగులో టెలిఫోన్‍కూడా పని చెయ్యదు. 19 అంతస్థులు మెట్లమీదే దిగాలి. ఏం చెయ్యాలా అని ఆలేచిస్తుండగా లోపలనుంచి ‘ఢామ్’ అని పెద్ద శబ్దం వచ్చింది. లేచి తలుపు తోసుకుని లోపలికి వెళ్ళాడు. ఇనప అల్మరా నేలమీదకు ఒరిగిపోయుంది. అధ్యక్షుడు దానికింద పడి అల్లాడిపోతు ఉన్నాడు. ఆయన ఎడమ కాలు అల్మరాకింద చిక్కుకుపోయుంది. ఆయన ఏదో భాషలో కేకలు పెడుతున్నాడు. అల్మరాను కదిలించడం వీలుకాలేదు. ఆధ్యక్షుడి ముఖం భయంతోనూ బాధతోనూ నిస్సహాయంగా ఉండటం మెరుపు వెలుగులో కనిపించింది.

ఎలా జరిగి ఉంటుందని ఆలోచించాడు. నాలుగు సొరుగుల్నీ ఒకేసారి తియ్య కూడదు. ఒక్కోటి తీసుకుని, దాన్ని మూసేసి, తర్వాతే మరొకదాన్ని తియ్యాలి. అన్నీ వరుసగా తెరిచి పెట్టేయడంవల్ల భారం మోయలేక పడిపోయింది. అదృష్టవశాత్తు అధ్యక్షుడి లైటర్ అక్కడ ఉంది. ఆ వెలుగులో పరిస్థితిని అంచనా వెయ్యడానికి వీలు కుదిరింది. ఇనప అల్మరాని రెండు చేతులతో తన బలమంతా ప్రయోగించి లేపే ప్రయత్నం చేశాడు. కదల్లేదు. అధ్యక్షుడు బాధతో మూలుగుతున్నాడు. అతను ఇప్పుడు ఏదో ఒక ఉపాయం ఆలోచించాలి. ఒక్కో పైలునూ బయటకు తీశాడు అల్మరా భారం తగ్గేకొద్ది కాలిమీద భారం తగ్గుతూ వచ్చింది. కాలు బయటకు వచ్చింది. ఖరీదైన తెల్ల కార్పెట్ రక్తాన్ని పీల్చుకుంది. వెంటనే ఏదైనా చెయ్యాలి. విందుకు వాడిన బల్లలమీద పరిచిన బట్టలు ఉన్నాయి. ఒకటి తీసుకుని ముక్కలు ముక్కలుగా చీల్చి కట్టుకట్టాడు. ఐస్ పెట్టెలోనుంచి ఐస్ తెచ్చి గుడ్డలో చుట్టి కాలికి కట్టాడు. తాగడానికి నీళ్ళిచ్చాడు. ఆయన ముఖంలో కాస్త ఊరట కనిపించింది. తర్వాత ఏం చెయ్యాలన్నది ఆయనతో మాట్లాడే నిర్ణయించాలి.

19 అంతస్థులు దిగి కిందకి వెళ్ళి ఎవరినైనా సాయం అడుగుదాం అంటే అధ్యక్షుడు వద్దని చెప్పి చిన్న పిల్లాడిలా అతని చేయిని గట్టిగా పట్టుకున్నాడు. ఆయన తల ఊగిపోతు ఉంది. కిందకు వెళ్ళడం ఒకటే మార్గం! అయితే ఆయన ఒప్పుకోనిదే ఏమీ చెయ్యలేము. వర్షం పెద్దగా కురుస్తోంది. రక్తం కారడం ఆగింది. ఆయన ముఖం కొంచం శాంతించింది. ‘ఈ సంస్థలో నా చివరి రోజు అనుకున్నాను. అది ఈ భూమిమీదే చివరి రోజుగా మారగలదని ఊహించలేదు’ అని నవ్వి ‘నువ్వు ధైర్యంగా ఉండు’ అని అన్నాడు. లోలోపల అతనికి నవ్వు వచ్చింది.

అబ్దులాటి ముఖం చూడటానికి ఆయనకు గిల్టీగా అనిపించింది. ఈ రోజు అతను మాత్రం ఇక్కడ లేకపోయుంటే ఆయన పరిస్థితి ఏమయ్యేది? కచ్చితంగా చచ్చిపోయుండేవాడు. అతన్ని పనినుండి తీసేయడానికి కూడా ఒకసారి ఆదేశాలిచ్చాడు. ఎంతటి విశ్వాసమైనవాడు! ఇవాళ వేదికమీద ఈ అట్టడుగుస్థాయి ఉద్యోగి మాట్లాడినట్టు ఎవరూ తమ గుండె లోతుల్లోనుండి మాట్లాడలేదు. ‘నేను నీతో ఎప్పుడూ మంచిగా ప్రవర్తించలేదు. నీకు నా మీద కోపమే లేదా?’ అని అడిగాడు.

‘మీకు బాధ్యత ముఖ్యం. మీరు నాకు మంచి చేస్తున్నట్టు అనుకున్నారు. ఒక కికియూ కథ గుర్తుకు వస్తుంది’ అన్నాడు అబ్దులాటి.

‘చెప్పు, కథైనా విందాం’

‘చెరువులో ఒకడు వలవేసి వంద చేపలు పట్టాడు. వాటిని నేలమీద వెయ్యగానే అవి ఆనందంగా గంతులేశాయి. ‘నేను మిమ్ముల్ని నీళ్ళల్లో మునిగిపోకుండా రక్షించాను’ అని అన్నాడు వాడు. అప్పుడు అవి చచ్చిపోయాయి. వాటిని వృధాగా పోనివ్వకుండా సంతలో అమ్మి ఆ డబ్బుతో మరిన్ని వలలు కొన్నాడు. అప్పుడే కదా వాడు మరిన్ని చేపల్ని కాపాడ గలిగేది?’

‘మంచి కథ, అబ్దులాటి. నేను ఎన్నో సంవత్సరాలుగా చేస్తున్నది ఇదే!’ అని అన్నాడు. ఆయన వళ్ళు వణకసాగింది.

అబ్దులాటి బల్లమీద వేసే బట్టలు తీసి ఆయన ఒంటిమీద కప్పాడు. కాస్త కుదుటపడ్డాక ఆయన మాటలు కొనసాగించాడు ‘ఇంత బాగా మాట్లాడతున్నావే, నువ్వు ఏం చదువుకున్నావు?’ అని అడిగాడు.

‘సీనియర్ సర్టిఫికేట్, ఫస్ట్ క్లాస్’

‘అవునా! నీకంటే తక్కువ చదువుకున్నవాళ్ళు లోపల కుర్చీలో కూర్చుని పని చేస్తున్నారు. నువ్వు బయట స్టూల్ మీదే కూర్చుని ఉన్నావేం?’ అని అడిగాడు.

‘నాకు కుర్చీలో కూర్చునే పని ఇవ్వరు, సార్. నేను కికియూ తెగకు చెందినవాడిని. స్టూలే నాకు అతి ఉన్నతమైన స్థానం. ఇంతకంటే పైకి ఎదగడం కుదరదు’ అని చెప్పి ముగించాడు, కరెంట్ వచ్చింది. అబ్దులాటి ఆయన చేతిని విడిపించుకుని బయటకు పరిగెట్టాడు.

*

హాస్పిటల్‍లో ఊలాఫ్ కళ్ళు తెరిచినప్పుడు సమయం తెల్లవారుజామున ఐదు అయుండచ్చు. అబ్దులాటి ఒక కుర్చీలో కూర్చుని ఉన్నాడు.

‘సార్, ఒక చిన్న ఫ్రాక్చర్ మాత్రమే. అంతా బానే ఉంది. రక్తం ఎక్కించారు. ఇవాళే మిమ్ముల్ని డిస్చార్జ్ చేసేస్తారు. రేపే మీరు విమానం ఎక్కేయొచ్చు. సూప్ ఉంది తాగండి’ అని అన్నాడు.

‘నువ్వు ఇంటికి వెళ్ళలేదా?’

‘వెళ్ళాను, సార్. వెళ్ళి స్నానం చేసి బట్టలు మార్చుకుని వచ్చాను’

‘నీకెలా కృతజ్ఞత చెప్పాలో తెలీడంలేదు. నిన్ను చాలా సార్లు తిట్టాను’

‘సార్, నాకు అమ్మ లేదు. నాన్న మంచం పట్టాడు. ఆయన్ని నేనే చూసుకోవాలి. ప్రతిరోజూ తెల్లవారుతూనే ఆయన్ని లేపి శుభ్రం చేసి బట్టలు మార్చి, తిండి పెట్టి, పడుకో బెట్టాకే ఆఫీసుకు వస్తాను. ఈ కారణంగా అప్పుడప్పుడు కొంచం ఆలస్యంగా ఆఫీసుకు వస్తుంటాను. పక్కింటామె మధ్యలో ఇంటికి వచ్చి నాన్నకు తాగడానికి ఏమైనా ఇచ్చి వెళ్తు ఉంటుంది. నేను సాయంత్రం వెళ్ళి శుభ్రం చేసి, బట్టలు మార్చాలి’ అన్నాను.

‘నీ పరిస్థితిని చెప్పుండాల్సింది కదా?’

‘అందరూ నాకు శిక్షవేశారు, నా జీతం కత్తిరించారు. ఏ ఒక్కరూ నేనెందుకు ఆలస్యంగా వస్తున్నాను అని అడగలేదు, సార్’

‘నీకు భార్య లేదా?’

‘ఉంది, సార్. చాలా మంచి అమ్మాయి. నాన్నను చూసుకోవడం ఆమె వల్ల కాలేదు. ఒక సారి గడువు తీరిపోయిన మందులు ఇచ్చేసింది. నాన్న ఆమెను నానా బూతులు తిట్టాడు. ఒంటికి సోపు రాసేప్పుడు నాన్నకు అక్షరాలున్న వైపు చెరిగిపోకూడదు. నా భార్యని ఇంటినుండి వెళ్ళిపో అని తరిమేశాడు. నా భార్యకు సూపర్ మార్కెట్‍లో మంచి ఉద్యోగం. అక్కడ జరిగిన ఒక దొంగతనంలో ఒక దుర్మార్గుడు ఈమెను ఇరికించేసి వాడు తప్పించుకున్నాడు. ఆమెను జెయిల్లో పెట్టారు, సార్’

‘ఈ దేశంలో న్యాయస్థానాలు లేవా? అక్కడ న్యాయం దొరకదా?’

‘ఆమె కూడా నాలాగే కికియూ తెగకు చెందినదే, సార్’

‘నువ్వు స్టూల్‍నుండి ఎదగడం కుదరదు అన్నావే, ఎందుకలా?’

‘సార్, ఇక్కడ అధికారం అంతా స్వాహీలీల చేతిలోనే ఉంటుంది. ఎంత ప్రయత్నించినా నాకు కుర్చీలో కూర్చుని చేసే ఉద్యోగం రాదు. స్వాహీలి భాషను అరబిక్ అక్షరాలతో రాస్తారు. కుడినుండి ఎడమ వైపుకు రాస్తారు. కికియూ భాష ఎడంనుండి కుడికి రాసే భాష. నేను రాసేటప్పుడు నన్ను గేలి చేస్తారు, సార్’

‘నువ్వు నాతో ఒక సారైనా ఈ విషయం చెప్పి ఉండచ్చు కదా?’

‘ఎలా చెప్పగలను, సార్? వాళ్ళు నన్ను మీ దాకా రానివ్వరు. పని చేసే అందరికీ సంస్థ లాభాల్లో వాటా ఉంది అని మీరు అంటు ఉంటారు. ఆ పనివాళ్ళను ఎలా ఎన్నుకుంటున్నారు అన్నదాన్ని గురించి ఎవరూ పరిశీలించరు, సార్’

‘నిజమే. నేను చాలా పెద్ద తప్పు చేసేశాను’

‘ప్రపంచం రెండుగా విడిపోయి ఉంది, సార్. పాలించేవాళ్ళు, పాలించబడేవాళ్ళు. ఆదినుండి నుండి అలానే నడుస్తోంది. దీన్ని ఎవరూ మార్చలేరు, సార్’ అని అన్నాడు అబ్దులాటి.

*

విమానాశ్రయంలో మొదటి ప్రకటన వినిపించింది. ఊలాఫ్ కర్ర పట్టుకుని విమానాశ్రయంలోకి వెళ్ళడానికి ఆయత్తమయ్యాడు. ఆయన రెండు సూట్కేసులు లోపలికి వెళ్ళిపోయాయి. అబ్దులాటి ఆయన ముఖానికేసి చూస్తూ నిల్చున్నాడు. ఊలాఫ్ బూడిద రంగు కళ్ళు చెమర్చాయి.

వణికే గొంతుకతో ‘అయితే నా కాలు విరిగి నీ గురించి తెలుసుకోవాలని ఉందేమో. నువ్వు మంచివాడివి. చేపలను ఇకమీద ఎప్పటికీ రక్షించను. నన్ను క్షమించు’ అని అన్నాడు.

‘చాలా పెద్ద మాట, సార్. నేను నా డ్యూటీ చేశాను. నా సేవకొరకు డానియల్ అరాప్ మొయ్ 21 ఫిరంగులు మోగించడు. క్షేమంగా వెళ్ళండి’

‘నాన్నను జాగ్రత్తగా చూసుకో. నీ భార్యతో కలిసి జీవించడం కుదరదా?’

‘అదెలా కుదురుతుంది! ఆమె చాలా మంచిది. అయితే మా నాన్న ఆమెను తరిమేస్తాడు, సార్’

‘నేను నీకు ఏదైనా చెయ్యాలి’ ఊలాఫ్ గొంతు పూడుకు పోయింది.

‘ఏమీ వద్దు, సార్. మీ అభిమానం చాలు. నా కొడుకుని ఒక్కసారి చూస్తే అది చాలు ఈ జన్మకు’

‘కొడుకా? ఎవరు ఆ కొడుకు?’

‘మీకు తెలుసుగా! నా కొడుకే, సార్’

‘నువ్వు చెప్పనేలేదు’

‘వాడు పుట్టినప్పుడు ఒక రోజు శెలవు కావాలని అడిగాను, సార్. కుదరదన్నారు’

‘అవునా?’

‘పుట్టి ఆరు నెలలు అవుతోంది, సార్’

‘ఎక్కడున్నాడు?’

‘జెయిల్లోనే, వాళ్ళ అమ్మతో’

నివ్వెర బోయాడు ఊలాఫ్. కర్రను వదిలేసి భారం మొత్తం అబ్దులాటి మీద మోపి గట్టిగా వాటేసుకున్నాడు.

రెండోసారి విమాన ప్రకటన వినిపించింది.

మూల కథ:  కడైనిలై ఊళియన్

*

చిత్రం: బీబీజీ తిలక్ 

Avineni Bhaskar

2 comments

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

 • మంచి కథ, మంచి అనువాదం. శ్రీ శ్రీ గారూ అన్నట్టు

  “ఏ దేశచరిత్ర చూచినా

  ఏమున్నది గర్వకారణం

  నరజాతి చరిత్ర సమస్తం

  పరపీడన పరాయణత్వం

  నరజాతి చరిత్ర సమస్తం”

 • ఎప్పట్లాగే అద్భుతమైన అనువాదం. చేపలను రక్షించే కథ భలే వుంది.

‘సారంగ’ కోసం మీ రచన పంపే ముందు ఫార్మాటింగ్ ఎలా ఉండాలో ఈ పేజీ లో చూడండి: Saaranga Formatting Guidelines.

పాఠకుల అభిప్రాయాలు