బైపాస్ మస్తానయ్య జీవితంలో ఆరోజు ఏం జరిగిందంటే…
చాలా మందికి లాగే నాక్కూడ కొరొన కష్టాలను కట్టకట్టుకుని తీసుకొచ్చింది. కొరోనా కోసం మాఊరికి దగ్గర్లోని తిక్కవరం ఇటుకుల ఫ్యాక్టరీ మూసేసారు. దాంతో ఆనందం మా జీవితాల నుండి దూరమైంది. చివరకి చేతిలో చిల్లర కూడా లేని పరిస్ధితి, పైగా కొడుక్కి డయాలిసిస్. దాహానికి గొంతు ఎండిపోయి పిడకర్చి పోతే ఎట్లుంటాదో అట్టే అయింది మా కుటుంబ పరిస్థితి . అట్లాంటి, బాగా టైటుగ ఉన్న రోజుల్లో ఒక రోజు నర్సత్త వచ్చి “ఓరే మస్తాన, నేను చెప్పినట్టు చెయ్ అని ఒక సలహా ఇచ్చింది. టపాయిల్లు అనే తనకు తెలిసిన ఒక ఊళ్ళో చేపలు బాగా కొంటారని ఆమెకు తెలిసిన ఒకామె ఆఊళ్ళోనే ఉందని, దగ్గరుండి అమ్మి పెడ్తాది అని చెప్పింది.
ఆ పోబిడితో ఒక ఆదివారం ఉదయాన్నే 1500 రూపాయలకు గెండ్లు కొనుక్కుని పొద్దన్నెఐదున్నరకి వరగలి బైపాస్ కాడ లారీ ఎక్కా. ఈ బైపాసు మీంద నుంచి బండ్లు మద్రాస్ నుండి కలకత్తా వరకు పోతాయి. బ్రిటిష్ వోళ్ళు కన్నా ముందునుంచి ఈ రోడ్డు ఉందంట. ఇంతలోకే టపాయిల్లు వొస్తే ఆ లారీవోడికి 50 రూపాయలు ఇచ్చి ఆ ఊరికాడ దిగాను. ఊర్లోకి పొయ్యి నర్సత్త చెప్పినావి ఇంటి బయట నిలబడి రెండు మూడుసార్లు అరిస్తిని, ఎవురు లెయ్యల. లోపల ఫ్యాను డగ డగా కొట్టుకుంటా బయట దాక ఇనిపిస్తా ఉంది. ఆ పనికిమాలిన ఫ్యాను సౌండ్ కి నామాట వాళ్ళకి గాని వాళ్ళ మాట నాకు గాని వినిపించట్లేదని అర్ధమైంది.
నా అరుపులకి ఐదు ఇళ్ల దూరంలో కల్లాపు చల్లుకుంటూ ఒకామె ఏందని కనుక్కొని చేపలని తెలుసుకొని పిలిచింది. చేపల బుట్టని వాళ్ళింటికి ఇంకో రెండు ఇళ్ళ దూరంలో ఉన్న రచ్చ మింద దించ. అప్పటికే ఆమె ఆ వీధిలో ఉన్న వాళ్ళందరినీ కేకేసింది. ఆడోళ్ళు ఒక్కోక్కరుగ వచ్చి, వచ్చీరావడం తోనే ఒక్కొకరు అర కిలో, ఒకటిన్నర, కిలో, అని మెుత్తం పదిహేను వందల రూపాయల చేపల్ని అరగంటలో కొనేసారు. యబ్బ నాయానందం ఆనందం కాదనుకోండి. ఇంక లేసి తువ్వాలుతో చెమట తుడుచుకుంటా, ఏందబ్బ ఈరోజు పొద్దన్నే ఎవురు మొహం చూసానో ఏందో అనుకుంట, అంతా ఆ ఎంకటేశ్పరసామి దయ అని మనసులో అనుకొని,
ఎవురో తలుపు తట్టినట్టు ఇంకా టీ కూడా తాగలేదు అని గుర్తొచ్చి గబగబ డబ్బులు అడగబడ్తిని, ఇస్తే గదా ఒక్కరైన, డబ్బులు సంగతి పక్కన పెట్టబ్బ, ఆడోళ్ళందరు నా చుట్టూ చేరి మోచేత్తో మూతులు పొడస్త ‘ఏందయ్యో ఎవనుకుంటుండ, రెండు రెండు సార్లు డబ్బులు తీసుకుంటావా ఏంది? ఏవనుకుంటుండ మమ్మల్న, సంసారోల్లంమయ్య మేవ అని అంట మళ్ళ మా ఊరికి రాబాక’ అని అరిస్తిరి.
నాకు గుండెళ్ళో దడ కాళ్ళల్లో వణుకు మెుదలయ్య. ఎప్పుడో మూడో గంట కి లేసి టీ నీళ్ళు కూడా గొంతు లో పోసుకోకుండా ఇన్ని తిప్పలు పడి వస్తే ఇప్పుడు చూస్తే ఇట్టైంది ఏందబ్బ అనుకుంట జేబులో ఉన్న డబ్బుల్ని లెక్కబెడ్తె కంట్లో నుండి నీళ్ళు కారె ఏడొందల్ని చూసి. పై పాణం పైనేపోయా.
ఇంతలో మా అత్త పోబిడి చెప్పివావి నన్ను చూసి అరిచింది. నాకాళ్ళు నన్నామేకాడికి ఈడ్చకపోయనాయి. ‘ఏందయ్యో నువ్వే నా ఆ నర్సమ్మ చెప్పినాయనవి, బుట్టలో చేపల్లేవు, మెుహమేంది మాడిపోయి అట్టుంది, ఏవైంది’ అని అడిగె. కడుపులోంచి వస్తాఉన్న ఏడుపునంతా ఆపుకొని జరిగిందంతా చెప్తే అంతా విని ఆమె వెకిలి గ ఒక నవ్వు నవ్వి, ఏవయ్య ఒక పది నిమిషాలు ఆగలేక పోయా, ఇప్పుడర్దమైందా, మీ అత్త నాగురించి ఎందుకు చెప్పిందో, సర్లేగాని వచ్చేవారమైన నన్ను దగ్గరపెట్టుకో, జాగ్రత్తగా అమ్మిపెడ్తానని చెప్పింది. ఇంకేం చేయలేక ఖాళీ బుట్టని బరువైన నెత్తిమీద పెట్టుకొని భారంగ అక్కడ నుంచి ఊరికి బయల్దేరాను, లచ్చిందేవి లేదు, ఏంకటేశ్వరసామి లేడు అని బయటకే అనుకుంట.
బైపాస్ కి పొయ్యే దారిలో కల్లంగడి కనిపిస్తే ప్రాణం లేసొచ్చింది. గబగబా రెండు చెంబులు తాగితే గాని మనసు తిమితపడ్ల. అప్పుడు గాని అసలు బాధ బయటకి రాల. ఆ బాధలో ‘ఆ సవితి ముండలు రుపాయి డబ్బులు ఈయకుండ ఉన్న చేపల్ని తీసేసుకుని మళ్ళీ సంసారులని కటింగు‘ అని ఇంకా చాలా ఆనేస్తిని బయటకే. నా కర్మకొద్ది అక్కడే కల్లు తాగుతున్న ఆవూరాయన కొట్టడానికి పైకి లేస, వాళ్ళ ఊరి ఆడోళ్ళని అంతేసి మాటలన్ననని. ఆయనకి కథంతా మళ్ళీ చెప్తే, అంత విని, పాపం అంట, సైకిల్ తీసి ఎక్కు పోదాం అన్నాడు. నాకేం అర్థం గాక ఆయన సాయే చూస్తాఉంటే, మళ్ళీ ఆయనే, ‘యో ఎక్కు, ఊర్లోకి పోయి, నీ డబ్బులు నీకిప్పిస్తా అన్నాడు‘. అట్నేఅంటానే తటపటాయిస్తానే ఆయనతో పాటు ఊళ్ళోకెళ్ళ మళ్ళ. ఆ వీధి లోకి పోతానే ఆయన అరుపులు, తిట్లకి నలుగురైదుగురు ఆడోళ్ళు బయటికొచ్చారు. వచ్చి రావడం తోనే అరస్త ‘ఏవూర్రా నీది, నా బట్టా, మమ్మల్నే దొంగలంటావా, ముందు నా కొడుక్ని కట్టేయండ్రా’అని అంట నా తక్కిడిని, తూకం రాళ్ళుని లాగేసుకుని, ఎక్కువ తక్కువ ఉన్నాయెమనని చూడ్డానికి వేరే అంగడిలోకి తీసుకెళ్ళారు. నన్ను తీసుకొచ్చినాయన అడ్రసు లేడు.
వాళ్ళు చేసే పనులకు కడుపు మండిపోయి ‘ఒకవేళ నా రాళ్ళలో తేడాగాని ఉంటే యాబై వేలు కడతానని అరిచాను. ఒకపక్క కడుపులో కొడతానే ఉంది అంత డబ్బే ఉంటే ఇక్కడికెందుకొస్తాను, చేపలెందుకు అమ్మతాను, వీళ్ళ చేత స్తంబానికి ఎందుకు కట్టేంచుకుంటాను, ఇన్నిన్ని మాటలు ఎందుకు పడతాను, ఆ డబ్బులే ఉంటే నా కొడుక్కి డయాలసిస్ చేపిచ్చే వొన్ని గదా అని అనుకుంటూ ఉండే లోపల తూకం రాళ్ళలో తేడాలేమి లేవని చెప్పారు. అట్టచెప్పిన చాలాసేపటికి గాని నా కట్లు ఇప్పల.
వొంట్లోని శక్తినంతా కాళ్ళలోకి తెచ్చుకొని పరిగిస్తిని బైపాస్ సాయ. ఈసారి పొయినసారి లాగ కాకుంట మనస్సంత కోపం, కసితో నిండిపోయింది, వీళ్ళనంత ఏదైన చేసేయాలని. రాత్రికి రాత్రికి ఒక్కొక్కరిని పెట్రోలన్న పోసి, లేకపోతే కత్తితో ఐన చంపేయాలని. ఆడే, ఆరోడ్డు మీదే, ఓ మూల చాలా సేపు కూర్చిండి పోయాను. కూర్చొని అట్లె నిద్రకూడా పోతిని. ఇంతలోకి ఎవరో అరస్తా ఉంటె లేచి చుస్తే మద్రాసు వైపు నుండి గూడూరు కి పొయ్యే లారీలోంచి ఒక పెద్దామె దిగతా బుట్టలు అందుకోమంది. మావిడిపళ్ళ బుట్టలవి. ఇంత ముసల్ది యాడనుంచి ఇన్ని పళ్ళు తెస్తుందాని ఉండబట్టలేక అడిగేస్తిని.
“మద్రాసుకి మెుదుట్లోనే దిండిగల్ కాడ పండ్ల మార్కెట్టులో రెండు రకాల రేట్లతో బాక్సులెక్కన అమ్మతారు. జాగర్తగ బేరమాడి కొనుక్కో”అని చెప్ప. దాంతో నాకు ఉదాయన నుంచి జరిగిందంతా గుర్తొచి కడుపుబ్బరం ఎక్కువైపోయా, పోయి కొనుక్కోరావాలని. అనుకున్న తడువుతోనే రోడ్డు దాటి నిలబడ్డ. ఇంతలోకే లారీ వస్తే ఆప్తిని. చూస్తే మావూరోడే. చెప్తిని, ఇట్ల మామిడికాయల కోసం పోతా ఉండానని. దానికి వాడేమో “సరే బావ, ఇంటికి పోయేటప్పుడు ‘మెము’ లో వెళ్ళు”అని చెప్ప. సరేనని దిగి మార్కెటు వైపు బయలుదేర్తిని.
మార్కెటు చాలా పెద్దది. ఎటు చూసిన రకరకాల పళ్ళు, పళ్ళ సముద్రం లాగుంది. పోయి ఇద్దర ముగ్గురిని రేట్లడిగి రెండు మామిడ పళ్ళ బాక్సులు కొని రైల్వే స్టేషన్ వైపు బయలదేరా. ఒకరూంతసేపు తర్వాత చెనై నుండి సూళ్ళూరుపేటకి మధ్య తిరిగే ‘మెము’వచ్చింది. ముందు ఊర్లో అమ్మదామనుకున్నోని చాలామంది బుట్టలోల్లు అమ్మడం చూసి నేను కూడ అమ్మడం మెదలు పెడ్తిని. పోతాయో లేదో అనుకున్నోని అరగంటలో అంటే సూళ్ళూరుపేట వచ్చేకాడికి అయిపోయాయి.
ఉధాయన్నుంచి అలసిపోయిన నా శరీరం, మనస్సు మళ్ళీ నా ఆధీనంలోకి వచ్చాయనిపించింది. ముందుగ నా డబ్బులు నాకొస్తే చాలనుకున్నొని ఇప్పుడు ఇంకా కావాలనిపించి వెంటనే సూళ్ళూరుపేట స్టేషన్లోనే దిగేసా. అంతకుముందున్న కోపం, కక్ష, పెట్రోలు పోయడం అన్ని నా మైండ్ లోంచి ఎల్లిపోయి, అట్లాగే, నా కుల అలవాట్లకు విరుద్దమైన అత్యాశ నా మనస్సులో మెదిలింది. వెంటనే నాకాళ్ళు నాకు సంబంధం లేకుండ మార్కెట్టు వైపు నడిచాయి. దాచుకోవడం తెలీని నేను, రేపటి గురించి ఆలోచించని నేను మెదటిసారి ఇంకా సంపాదించాలి, మిగుల్చుకోవాలి అనుకోవడానికి కారణము మెూసపోవడమేన, ఏమో.
మళ్ళీ వెళ్ళి ఇంకో రెండు బాక్సుల పండ్లు కొని ఇంకో ట్రైన్లో ఎక్కి అమ్మేసాను. మూడోసారి కూడ వెళ్ళి, ఈసారి ఉన్న డబ్బులన్నీ పెట్టి ఐదు బాక్సులను కొని వాటిని కూడా అమ్మి ఇంకా ఇంటికి బయలుదేరాను. ఇంటికొచ్చి డబ్బులు లెక్కపెడితే ఐదువేలు వరకు ఉండింది. ఆరోజు నా ప్రయాణం పదిహేనువందల నష్టం నుండి బయలుదేరి ఐదు వేల రుపాయల ఆదాయంతో ఆగింది. ఆరోజు నాదేనా? ఏమో. నేను అనే భావన ఉండి లేననిపించే రోజది. రేపు కూడా పోతే ఎట్ట ఉంటాది?
అయితే మస్తానయ్య ఇప్పుడు వరగలి ఛీల్రోడ్ కాడ తోపుడుబండి మీద టెంకాయలు అమ్ముకుంటా ఉన్నాడు. ఆశకి అత్యాశకి సంబంధం లేకుండా వాటికీ చాలా అంటే చాలా దూరంగా బతుకుతున్న కుటుంబాలలో మస్తానయ్య కుటుంబం కూడా ఒకటి.
*
చాలా బాగుంది అన్న.కానీ కొంచెం నెల్లూరు మాండలికం తగ్గినట్టు వుంది నా.చాలా బాగుంది
Bro super i like you very much iam your inspiration. I love you ..this story very nice .very beautiful . It related our thoughts. So great…wrote many stories and inspirational every one …god bless you….
thank you gopanna.
thank you, Nazeer. Will improve for sure.
మస్తానయ్య ని కధానాయకుడు చేసారు. వెరీ స్పెషల్ స్టోరీ. మీకు చాలా కృతజ్ఞతలు. కొనసాగించండి. హ్యాపీమస్తాన్. గుంటూరు#