C/o MH-I, Room no:-206
South Campus.
1
కిటికీలు రెండు
కళ్ళు తెరుచుకున్నట్టు
ఒక గది.
పడక మీద ఒక దేహం
నిద్రలో
ఎదురుబొదురు గోడలకి
స్విచ్ ఆఫ్ చేసిన ట్యూబ్ లైట్లలా.
గుడ్లగూబలా మేల్కునున్న పుస్తకం.
ఐదవ నెంబర్ స్పీడ్ లో ఫ్యాను
కొంత చలి ఇంకొంత ఉక్కపోత
రెండింటి మధ్యలో దుప్పటి.
2
దండెం మీది బద్దకాన్ని చూపించే అద్దం
ఫిలమెంట్ పాడైన బెడ్ లైట్
బకెట్లో అలానే మర్చిపోయిన
స్నానపు తడి అండర్వేర్.
గోడలకి
ఖాళీగా అతుక్కున్న హ్యాంగర్
ఐదడుగుల థర్మోకోల్ షీట్ కి
సూదులతో గుచ్చబడిన షెడ్యూల్ లిస్టు
నేను రాకముందు రాయబడ్డ
కొన్ని- బెంగాలీ కవితలు
3
నన్నెప్పుడూ నవ్వించే ఒక వాక్యం
గ్రీన్ మార్కర్తో
Understanding love is like
An Englishman reading an Urdu poem.
4
వరుసగా పేర్చబడ్డ కితాబులు
వాటిపై నీళ్ళారిపోయిన స్టీల్ ప్లేట్
చీమలు పట్టిన RO water డబ్బా
మజ్జిగ మరకలు పోగొట్టుకోని
ట్రాన్స్పరెంట్ గ్లాస్.
రూమ్మెట్ కోపానికి
తెలిసే Cigarette yash తో శిక్షించబడ్డ కర్రీ బౌల్
బూజు పట్టిన మెస్ గోంగూర పచ్చడి: Wooden Table.
5
మర్చిపోకుండా ఎనిమిదింటికి
“ఏదో ఒక బదులై నను చెరపొద్దని కాలాన్నడుగుతు ఉన్న…”
గొంతు చించుకునే
Alarm ringtone.
Dismiss బటన్ మీద click చేయబడ్డ బొటనవేలు.
2
వెన్నెల రాత్రిలో వాన
12:00 AM @ Amenities
చీకటి
తుంపర్లు తుంపర్లుగా
కురుస్తున్న వాన చినుకులలో
పడి తడుస్తుంది.
*
ఫ్లెడ్లైట్లు చందమామ కాంతితో కలిసి
పుస్తకాన్ని చదివే అమ్మాయి
ఇనుపబొమ్మ వైపూ వెలుగుతున్నాయి.
*
చందమామ
చకోర పక్షులతో గూటిలోకి ఎగిరిపోయింది
*
ఇక్కడ
సమీరం చలిలో వణుకుతూ ఆడుకుంటుంది.
కొంత మనుషుల అల్లరి
*
చీకటి కింద తడుస్తూ
చీకటినీడని పరిచిన చెట్టు కింద
కూర్చుని ఒక అమ్మాయి
నిలబడి ఎదురుగా ఇంకో అమ్మాయి
*
వెళ్లి ఏంటని అడిగితే
*
ముఖమ్మీద cream cake తో
లపలపా కొన్ని కన్నీళ్ళని
చెంపలమీద రాల్చుతూ కూర్చున్నమ్మాయి.
నిశ్శబ్దం
*
‘అతనింకా రాలేదు’-
నిలబడున్న అమ్మాయి బదులు
*
పక్కగా కూర్చుని
ఏడ్వకూ…
అని నేనంటే
భుజమ్మీద తలపెట్టి
ఇంకా: వాన తుంపర్లులాగా ఏడుస్తుంది.
*
కొంత ప్రేమ, అతనొస్తాడని ఎదురుచూపు
అంతే దిగులుతో దుఃఖం
పుట్టినరోజు గుర్తుందో లేదోనన్న బుగులు
ఈమె కన్నుల్లో నుండి
రెండు వెన్నెల జలపాతాలు ప్రవహిస్తున్న దృశ్యం
స్వప్నాలు కొన్ని
మేఘాల్లా నింగిలోకి ఎగురుతున్న దృశ్యం.
*
206 రూమ్ గొప్ప జ్ఞాపకం. ప్రేమవాసనున్న మనుషులుంటున్న రూము. అనేక తాత్విక పద్యాలు దాగున్న స్థలం. ఎంతకాలం అక్కడ ఉన్న నాది కాదు అనిపించని వాతావరణం. మళ్ళీ అక్కడె ఉన్నట్టుంది లిఖిత్. ఆ వెన్నెల రాత్రిలో కవితలో తడిచిపోయాము.
ఎదురుబొదురు గోడలకి
స్విచ్ ఆఫ్ చేసిన ట్యూబ్ లైట్లలా.
గుడ్లగూబలా మేల్కునున్న పుస్తకం.
nice.
206 రూమ్ కి నేనెప్పుడూ వచ్చిన నాకు పుస్తకాలను అందించిన ఓ మినీ లైబ్రరీ … ఈ కవితను చదివిన ప్రతి హెచ్ సీయూ విద్యార్థికి తన రూమ్ తో ఉన్న అనుబంధాన్ని ప్రసాదిస్తుంది.
క్యాంపస్ ను వస్తువుగా తీసుకొని రాస్తున్న అన్ని కవితలు భవిష్యత్తులో క్యాంపస్ కు దూరమున్న వారి వేళ్ళనుపట్టి క్యాంపస్ ని చూపెడుతాయి లికిత్🤝💐