1
ఇంటికి వెళ్ళినప్పుడల్లా …
ఇంటికి వెళ్ళినప్పుడల్లా అమ్మ ఎప్పటివో విషయాలను గుర్తు చేసుకుంటుంది:
“నీకప్ప్పుడు ఆరేళ్ళు. రాత్రి ఐస్క్రీంకని చీకట్లో పరిగెత్తుకు వెళ్లి ఇనుప చువ్వకు నీ కాలి బొటనవేలి గోరు చీలిపోయి వచ్చావు. ఇల్లంతా రక్తం. నా గుండె ఆగిపోయిందనుకో” అని చెబుతోంది –
ఆమెకు 70. నాకు 50. లోపల ఒంటరిగా ఉండీ ఉండీ, ఇద్దరిలోనూ మూతపడిన గ్రంథాలయాల వాసన. కాంతి లేక, గాలి లేక, అక్కడే ఊపిరాడక ఆ పుస్తకాలు అరిచే వాసన. చిరిగిపోతోన్న శబ్దం కూడా. బయట చీకట్లో ఆవరణ. చికిలించిన తన కళ్ళలోని కాంతిలాగా రాత్రి. ముడతలు పడిన ముగ్గు ముంగిట్లో! మట్టిలో ఏదో ఇంకే శబ్దం, చాలా లీలగా. వేపచెట్టు కొమ్మల్లో ఒక పిల్లిపిల్ల. “అదిలించినా పోవడం లేదు, వీణ వాళ్ళు వచ్చినప్పుడు, పిల్లలు అలవాటు చేసారు దానిని” అని చెబుతోంది కానీ, మంచు కురిసే ఈ ఒంటరి చలి రాత్రుళ్ళలో అదే తనకి తోడు –
****
ఇంటికి వెళ్ళినప్పుడల్లా అమ్మ మరికొంత మృత్యువు చేరువై ఉంటోంది. మరికొంతగా కుంచించుకుపోయి, తైలం అయిపోతోన్న దీపపు కాంతిలా చిన్నగా మారిపోతో, మరికొంతగా గతంలోకి జారిపోతో …
“నాకప్పుడు ఆరేళ్ళు. అమ్మవారొస్తే, పోతుందని కాల్చారు” అని తన నుదిటిపైనున్న పది పైసలంత మచ్చను చూపుతోంది – “పిల్లలను తీసుకురారా. చూసి చాన్నాళ్లు అయ్యింది” అని ఎంతో హడావిడిగా కాఫీ పెట్టడానికి వంటగది వైపు – చల్లని బండలపైనుంచి పగిలిన అరిపాదాలతో – వెడుతోంది. గ్రంధాలయం అనే ప్రతీక వాడాను కదా, కాదు: శిధిలమయిన ఒక ఆలయం, వాడుకునీ వాడుకునీ ఇంకా వినియోగించబడటానికి ప్రతిమగా మార్చబడ్డ ఒక దేవత తను!
***
ఇంటికి వెళ్ళినప్పుడల్లా అమ్మ ఎప్పటివో విషయాలను గుర్తు చేసుకుంటోంది; “ప్రేమ, అమ్మ, పిల్లలూ, సంతోషం’లాంటివి …! అవన్నీ తన నుదిటిపై ఒక మచ్చలా మిగిలిపోయాయనీ, కాల్చిన ఆ జ్ఞాపకమే ఎన్నటికీ మిగులుతుందనీ, కనీసం ఇప్పటికైనా అర్థం అయ్యిందా నాకు?
2
మన అమ్మలు
మరోలా రాయలేనందుకు క్షమించండి. ఇది మళ్ళా అమ్మల గురించే-
సాయంత్రం రాత్రిలోకి మారుతున్న వేళ, ఇంట్లో దీపాలు వెలిగే వేళ, మందగిస్తున్న కాంతిలా తాను చిన్నగా ఒంటరి గదులలో తిరుగుతుంది: చాలా నెమ్మదిగా, కూర్చున్న చోట నుంచి, మోకాళ్ళ పైన అరచేతులు ఆన్చి, అతి కష్టంగా పైకి లేచి, అప్పటిదాకా అల్లిన పూలదండను తన మొదటి బిడ్డలా అతి జాగ్రత్తగా పుచ్చుకుని, ఒంటరి గదులలోకి కదిలే అమ్మ –
మీరు ఇంతకు మునుపే చూసి ఉండవచ్చు తనని: సర్ధినవే మళ్ళా సర్దుతూ, ఎవరూ రారనీ తెలిసీ ఊరకనే ఎదురు చూసే ఆ అమ్మని –
ఆమె కళ్ళల్లో, వడలిన పూవులు, ఇక ఇప్పుడు సువాసనలని వెదజల్లవు- నడి వేసవి పీల్చివేసిన నదీ, వ్యాపించే కరకు గాలీ తనలో: “అయిపోయిందిరా కన్నా, ఇంక సాగలేను. నువ్విట్లా ఉంటే రేపు నీ పిల్లలు ఎట్లారా” అని వాపోయే చిన్ని అమ్మ. తన శరీరాన్నంతా, తన బ్రతుకునంతా, నుజ్జు నుజ్జు చేసుకుని నిన్నూ నన్నూ కనీ, పెంచి చచ్చిపోతున్న అమ్మ –
మీరు అంటారు కానీ, తల్లికి మారుపేరు త్యాగం అనీ, తల్లి అంటే ప్రేమ అనీ, ఇప్పుడు నేను అంటాను, అవన్నీ ఒట్టి అబద్ధాలు అని. అవన్నీ ఊరకే మనం వాడుకునే ప్రతీకలు అని. ఒక్కసారి మీ ముదుసలి తల్లి కళ్ళలోకీ, కనుల కింద విచ్చుకున్న మడతలలోకీ, తన వొణికే అరచేతిని పుచ్చుకుని గుండె మీద చేయి వేసుకుని చెప్పండి – ఒకసారి, ఒక్కసారి నిజ్జంగా చెప్పండి – అదంతా ప్రేమ మాత్రమేనా? ఒట్టి త్యాగామేనా?
చీకట్లలో, నిద్రలో ఏవో ఏవేవో కలవరించే అమ్మ. అప్పుడే జన్మించినట్టూ, అప్పుడే పెరుగుతున్నట్టూ, కాలవ ఒడ్డున పరిగెడుతున్నట్టూ, తన తల్లి ఒడిలో, లాంతరు వెలుతురులో నిదురలోకి జారుకుంటున్నట్టూ, అమ్మవారోస్తే నుదిటిన కాల్చిన మచ్చకి ఇంకా ఇప్పటికీ వెక్కిళ్ళు పెట్టుకుంటున్నట్టూ, అంతలోనే తన శరీరంలో మరొక శరీరం ఉందనీ, ప్రతి నెలా అది నెత్తురుతో స్వప్నిస్తుందని తెలుసుకున్నట్టూ
అంతలోనే, ఆ కొంత శరీరం, ఆ శరీరంలో వెన్నెలా వానా వెదురు వనాల వేణువూ పలికినట్టూ, సర్వం మరచి నక్షత్రాల కింద వివశత్వంతో ఒక మహా నృత్యంలో నిమగ్నమయ్యి చూస్తే, ఎదురుగా ఒక ఖాళీ పూలబుట్ట: ఒట్టి పిల్లులు మాత్రమే బావురుమంటూ తిరిగాడే గూడూ, నేలా – మరి, నిన్న పెట్టుకున్న గోరింటాకు, ఈ పూటకే పండి, అంతలోనే వెలిసిపోయింది ఎలానో ఎవరికీ తెలియదు. “ఒక్కసారి ఊరికి వెళ్లి మీ అమ్మమ్మని చూసి వద్దాం రా – ఎలా ఉందో ఎవరూ లేక” అని అంటుంది తను-
ఈ లోపల, ఇంట్లో పిల్లలు నిదురపోతారు. ఒక నిశ్శబ్ధం సమస్తాన్నీ అల్లుకుని, లోపలికి వ్యాపిస్తున్నట్టుగా తోచే కాలంలో, ఎక్కడిదో ఒక తూనీగ – ఇక ఈ లోహ దిగ్బంధనాల, అపార్ట్మెంట్ సమూహాలలో కనిపించని – రెక్కలు విరిగేలా ఎగురుతూ బయటకు వెళ్ళాలని, దారి తెలియక ఇక్కడే కొట్టుకులాడుతూ, నేల రాలుతూ, తిరిగి పైకి లేచి బయటికి దారి వెతుక్కుంటో –
ఎప్పుడైనా అడుగుతాను నేను, “తిన్నావా అమ్మా?” అని, షుగర్కీ, బీపీకీ కనీసం మాత్రలైనా తేని నేను, ఆ తల్లిని, త్రాగొచ్చి, త్రాగినప్పుడు మాత్రమే తల్లులు గుర్తొచ్చి, త్రాగినప్పుడు మాత్రమే ఒక తల్లిగా మారే నేను, అంత అర్థరాత్రీ నాకై వేచి ఉండే తనని, తను తినక ఇంత అన్నం వేడి చేసి, కలుపుకు వచ్చి “తిను నాయనా, కడుపు మండుతుంది ఏమీ తినకపోతే” అనే తనని, చల్లబడిన అన్నం లాంటి తన చేతిపై చేయి ఉంచి –
తను తిన్నదో లేదో. తను నిదురోయిందో లేదో. తను ఎవరితోనన్నా ఇన్ని మాటలు, మాల విప్పి పూలను తిరిగి మొక్కలకు అంటించినట్టు, ఉన్నదో లేదో: తెలుసా నీకు చదువరీ? ఇప్పటికీ, నీకైనా నీ పిల్లలకి ఇంత చిన్న నొప్పైనా విలవిలలాడే నీ తల్లి? నీకు ఎప్పటికీ రాని, లేని ధైర్యంతో ఇంతకాలమూ నిబ్బరంగా లోకాన్నీ, కాలాన్నీ గడిపిన నీ తల్లి? నువ్వు తలుపు తట్టినప్పుడు, ఒక ఒంటరితనం చీర అంచులు పారాడుకుంటూ తలుపులు తెరిచే నీ తల్లి? పెద్దవాడివైపోయి, ఇక ఏ మాత్రం తనని గట్టిగా కౌగలించుకుని, నువ్వూ ఏడ్వలేని తన కన్నీళ్ళనీ తాకలేని నీ చిన్ని చిన్నారి తల్లి?
అప్పుడు ఇల్లంతా, తను నడుస్తున్నప్పుడు మోకాళ్ళు కలుక్కుమని చేసే చప్పుళ్ళు, పావురాళ్ళ రెక్కలని ఎవరో తాపీగా తెంపుతున్నట్టు. తను నీవైపు చూసి, తిరిగి వెళ్ళిపోతూ విడిచిన నిట్టూర్పు – ఎవరో శవాన్ని తిరగతోడుతున్నట్టు. “అమ్మా” అని నువ్వు నీ అంతటితోనూ పిలవాలనుకున్న మాట – ఒక ఆఖరి మాట – నీ పెదాలపై ఆగిపోయి ఇక…, గుర్తుందా నీకు, నీ పెదాలకు తాకిన తన తొలి పాల చినుకూ, ఆ ప్రాణవాయువూ, నీ నుదిటిపై తన తొలి ముద్దూ నువ్వు మరచిపోయిన తన చేతివేళ్ళ చివర్లూ, తన ఒడిలోని వాసనా, అలసటా చెమటా?
ఏమీ లేదు. కొంత గాలి. కొంత ఉక్కబోత. అప్పుడిక నువ్వు రహస్యంగా, ఒక నేరాపరాధనతో తొంగి చూస్తే, నేలపై బొంతపై, మరో లోకంలో నిదురోయే నీ తల్లి: కొంత శాంతితో, కొంత ప్రాణంతో, ఈ జీవితపు రహస్యాన్ని ఏదో అర్థం చేసుకున్న ఒద్దికైనతనంతో, ఒక అంగీకారంతో, దయగల ముఖంతో – తన చిన్నటి గురక, శైశవంలో నిన్ను జోకోట్టిన జోల వలే, ఒక లయతో, ఓంకార నాదం వలే, కుండీలోంచి మొలకెత్తబోయే చిగురాకులోని లాలిత్యంతో, లేతదనంతో, పసిపాపల గుప్పిళ్ళలోని లేత ఎరుపుదనంతో –
ఏమీ లేదు: మరోలా రాయలేనందుకు క్షమించండి. ఇది మళ్ళా అమ్మల గురించే, కొడుకుల గురించే –
3
లేనిది
దీపం ఆర్పినాంక, కాంతికీ చీకటికీ మధ్య క్షణకాలం అట్లా
తటాలున మెరిసి మాయమయ్యే
స్మృతి ఒకటి –
***
ఆకురాలు కాలం. ఇంటి ప్రాంగణమంతా, గాలికి ఎండిన ఆకులు
దొర్లే సవ్వడి. చారలుగా
ఆకాశం, నీడలూ, రాత్రీ –
ఎక్కడో బావురుమంటూ పిల్లలు పెట్టిన పిల్లి. ఆరుగుపై దానికి
పాలు పోసే మట్టి ముంత
ఎండి పగిలి, ముక్కలయ్యి –
అది, ఆ ముంత – పల్చటి చీకటి పరదాల మధ్య, మోకాళ్ళ
నొప్పులతో కుంటుకుంటూ నడిచే
నీ తల్లి కావొచ్చు. చెట్ల కింద
మొక్కల్లో, తప్పిపోయిన పిల్లికూనకై బావురుమనే ఆరుపు
నీ హృదయం కావొచ్చు. ఈ ఒంటరి
వేసవీ, తపనా కావొచ్చు –
***
చూడు –
దీపం ఆరినాంక, రాత్రి వ్యాపించినాంక – దూరంగా ఎక్కడో చీకట్లో –
పడుతూ లేస్తూ, ఇంటికి దారి
వెదుక్కుంటూ, నడకైనా రాని
కళ్లయినా తెరవని – నీ నుంచి తప్పిపోయి
చికిలించిన కళ్ళతో
దారి వెదుక్కుంటూ తిరిగే –
పిల్లికూనలాంటి, అమ్మ –
***
(From upcoming Madre: Poems on M/other)
Nice expression saar
prati vaarikI ammanu gurtu chese nostalgia
heart touching
చదివాక
ఒక్కసారి అమ్మను కావిలించుకోవాలనిపిస్తుంది