[‘యాక్టివిస్ట్ డైరీ’- పేరులోనే సూచించినట్లు వివిధ సామాజిక అంశాలపై పనిచేస్తున్న కార్యకర్తల అనుభవాల సమాహారం. వారి ఉద్యమ గమన ప్రస్తావన. వారి కుటుంబ పరిస్థితులు, వారి చుట్టూ వుండే సామాజిక పరిస్థితులు, వారు పనిచేస్తున్న అంశాల రాజకీయ ప్రాధాన్యత లను నమోదు చేయటం. వారి ఆంతరంగాలు, అనుభవాలు, ఆచరణలు, ఆకాంక్షలు వెరసి వ్యక్తులు గా, సమూహం లో భాగంగా వారు సమాజం పై వేసిన ముద్రలు, వారికి స్ఫూర్తి నిచ్చిన వ్యక్తులు, సాహిత్యం ఇతర గుర్తుల కలబోత ఈ “యాక్టివిస్ట్ డైరీ ” కి మూలం.
1978వ సంవత్సరం. మహబూబాబాద్ మేజిస్ట్రేట్ కోర్టు ప్రాంగణం. వరంగల్ జిల్లా. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం. అక్కడ కోర్టుహాలులో ఒక పక్కగా కూర్చున్న ఆ ముగ్గురి మొహాల్లో ఆందోళన కొట్టొచ్చినట్లుగా వుంది. నరాలు తెగేంత ఉత్కంఠతో ఒక మనిషి కోసం ఎదురుచూస్తున్నారు. అందులో ఇద్దరు వృద్ధులైన దంపతులు. మరొకరు విద్యాధికుడైన యువకుడు. ఒకరికొకరు సంబంధం లేదు. కానీ, ఎదురు చూసేది మాత్రం ఒక మనిషి కోసమే.
దాదాపు నెలరోజుల క్రితం పోలీసులు తీసుకెళ్లిపోయిన తమ కొడుకు ప్రాణాలతో వున్నాడో లేడో అనే భయం ఆ ఇద్దరు గ్రామీణ నిరక్షరాస్యులది. భయం వారి కళ్లల్లో శాశ్వత చిరునామాగా అనిపిస్తోంది. వారి మనసు నెమ్మదించటం లేదు. వాళ్లతో పాటు అక్కడ నిలుచున్న ఆ యువకుడికి కూడా మనసంతా అల్లకల్లోలంగా వుంది. తనకు పరిచయం లేని ఆ మనిషి ప్రాణాలతో తిరిగి వస్తాడా లేక ‘ఎన్‌కౌంటర్’ చావుగా మిగిలిపోతాడా అనే ఎడతెగని ఆలోచన అతన్ని కూడా అక్కడ నిలబడనీయటం లేదు. కాలం భారంగా నడుస్తోంది. ఏ చిన్న అలికిడి అయినా తాము ఎదురుచూస్తున్న ఆ మనిషి వస్తున్నాడేమో అని ఉలికిపడి చూస్తున్నారు ఆ ముగ్గురూ.
అలా కొన్ని గంటల సుదీర్ఘ నిరీక్షణ తర్వాత వళ్లంతా దెబ్బలతో నడవలేని స్థితిలోవున్న ఒక యువకుడిని ఇద్దరు పోలీసులు తమ భుజాల మీద మోపుకుని దాదాపు ఈడ్చుకొచ్చి మేజిస్ట్రేట్ ముందు నిలబెట్టి అతను సాంకేతికంగా బతికే వున్నాడని తెలియజేశారు. కొడుకుని అలాంటి స్థితిలో చూసిన ఆ తల్లిదండ్రులిద్దరూ ఒక్కసారిగా ఏడుస్తూ కుప్పకూలిపోయారు. పోలీసుల చేతిలో మాయమైన ఆ వ్యక్తి ఆచూకీ కోసం కాలికి బలపం కట్టుకు తిరిగిన ఆ యువకుడు కూడా వాళ్ల పరిస్థితిని చూసి తన కన్నీళ్లను ఆపుకోలేకపోయాడు.
ఆ యువకుడే పౌరహక్కుల సంఘం కార్యకర్త, కాలేజి అధ్యాపకుడు ఎస్. జీవన్‌కుమార్.
————–
అవి, ప్రజాఉద్యమాల మీద, కార్యకర్తల మీద నిర్బంధం పెరిగిన రోజులు. మిస్సింగ్ కేసులు, ఎన్‌కౌంటర్లు వారానికి రెండు మూడు నమోదు అవుతున్న కాలం. నల్గొండ దగ్గర ఒక పల్లెలో కూలిపని చేసుకునే చినవెంకటి అనే దళిత యువకుడిని నక్సలైట్ల సానుభూతిపరుడనే పేరుతో పోలీసులు ఎత్తుకెళ్ళిపోయారు. అతను ఒక కేసు విచారణ సందర్భంగా మహబూబాబాద్ కోర్టుకి వచ్చినపుడు ఈ సంఘటన జరిగింది. అతని ఆచూకీ కోసం వృద్ధులైన అతని తల్లిదండ్రులు తిరగని ప్రాంతమంటూ లేదు. హైదరాబాదులో ఎవరో లాయర్లు సహాయం చేస్తారంటే అక్కడి దాకా వెళ్ళొచ్చారు.
అక్కడ హైకోర్టులో లాయరు, పౌరహక్కుల నాయకుడు పత్తిపాటి వెంకటేశ్వర్లుని కలిశారు. ఆయన హై కోర్టులో హెబియస్ కార్పస్ పిటిషన్ వేసినా ఫలితం లేకపోయింది. దానితో ఆయన ‘వరంగల్ లో పౌరహక్కుల సంఘం వాళ్ళని కలవండి, మీకేమన్నా సాయం దొరకొచ్చు అక్కడికి వెళ్లండి’ అంటే వాళ్లు వరవరరావు, జీవన్ పనిచేస్తున్న సికెఎమ్ కాలేజీకి వచ్చి వాళ్ళని కలిశారు. అప్పటికి జీవన్ వయసు కేవలం 28 సంవత్సరాలు. ఇంకా పెళ్లి కూడా కాలేదు. ఆ కాలేజీలో వరవరరావు తెలుగు అధ్యాపకుడిగా, జీవన్ ఇంగ్లీషు అధ్యాపకుడిగా పనిచేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ పౌరహక్కుల సంఘం వరంగల్ జిల్లా యూనిట్ సభ్యులు ఇద్దరూ. ఆ యూనిట్కి అప్పుడు జీవన్ కన్వీనర్. నిజానికి ఆ యువకుడి అదృశ్యం సంఘటనలో ఎక్కడా ఏ విధమైన ఆధారాలు లేవు. పోలీసులు తీసుకెళ్లారు అని తల్లిదండ్రులు చెబుతున్నారు, కానీ పోలీసులు ఆ విషయాన్ని నిర్థారించటం లేదు.
కొడుకు ఏమైపోయాడో అనే ఆందోళనతో ఆ తల్లిదండ్రులు తమ ఊరు కూడా వెళ్లకుండా వరంగల్‌లోనే చాలారోజులు వున్నారు. ఈనాడుతో పాటు ఇతర తెలుగు, ఇంగ్లీష్ దినపత్రికల్లో ‘కొడుకు కోసం వెతుకుతున్న తల్లిదండ్రుల వెత’ అనే కథనాలు వచ్చాయి. అయినా కానీ చినవెంకటి ఆచూకీ తెలియలేదు. అతన్ని పోలీసులే ఎక్కడో చంపేసి గుర్తుతెలియని శవంగా పడేసివుంటారు, ఇంక ప్రయత్నం అనవసరం అని మిగతా సభ్యులందరూ అనుకున్నాగానీ, జీవన్ ఆ విషయాన్ని వదిలిపెట్టలేదు. ఒక హక్కులసంఘం కార్యకర్తగా జీవన్ అనేకమంది జర్నలిస్టులతో మాట్లాడారు. హిందూ దినపత్రిక జర్నలిస్టు ఈ విషయమై పేపర్లో రాసి, పోలీసుల మీద పౌరహక్కుల నాయకుడు జీవన్ క్రిమినల్ కేసు వేయబోతున్నట్లుగా రిపోర్టు చేశాడు.
అది వరంగల్ పోలీసు వర్గాల్లోనే కాక హక్కుల సంఘంలో కూడా చాలా పెద్ద చర్చనీయాంశమైంది. ‘పోలీసుల మీద క్రిమినల్ కేసంటే ఆషామాషీ అనుకుంటున్నావా, అది ఎంత పెద్ద విషయమో తెలుసా’ అని వరంగల్ లో ప్రముఖ న్యాయవాది, జిల్లా పౌరహక్కుల సంఘం అధ్యక్షుడు తోకల లక్ష్మారెడ్డి జీవన్‌ని కోప్పడ్డారు. నిజానికి జీవన్ ఆ విధంగా అననప్పటికీ హిందూ దినపత్రిక జర్నలిస్టు అత్యుత్సాహం ఆయనను సమస్యల్లోకి నెట్టింది. జీవన్ కదలికల మీద మరింత నిఘా పెరిగింది. అన్ని ప్రయత్నాలూ విఫలమయ్యాక, ఆ కుర్రవాడు బతికివున్నాడనే ఆశను అందరూ కోల్పోయిన క్షణంలో ఆ కుర్రవాడికి సంబంధించిన కేసుని విచారిస్తున్న మేజిస్ట్రేట్‌ని కలిశారు జీవన్. నిజానికి, విచారణలో వున్న కేసు గురించి నేరుగా మేజిస్ట్రేట్‌ను కలవటం నిబంధనలకు విరుద్ధమని తెలిసినప్పటికీ చివరి ప్రయత్నంగా కలిసి మాట్లాడారు. ఆ తల్లిదండ్రుల పరిస్థితి వివరించి, అతనికి సంబంధించిన కేసు ఆయన దగ్గర విచారణ లోనే వుందని, అసలు బతికివున్నాడా లేదా అనే విషయాన్నైనా తెలియజేయమని విజ్ఞప్తిచేశారు. విషయం పట్ల సానుకూలంగా స్పందించిన మేజిస్ట్రేట్ అసలు పరిస్థితి కనుక్కుంటానని కొంచం సమయం కావాలని చెప్పారు. ఆ కుర్రవాడి గురించి పోలీసు ఆఫీసర్లని వాకబు చేసారు.
దానితో, అతన్ని హాజరు పరచటానికి కొంత గడువు కావాలని పోలీసులు కోరారు. అతను స్పృహలోకి వచ్చి గాయాలు కొంత మానుపట్టాక, కోర్టుకు తీసుకువస్తామని చెప్పారు. దాదాపు రెండుమూడు వారాల సమయం తర్వాతే ఇప్పుడు మనం పైన చెప్పుకున్న సన్నివేశం వాస్తవ రూపంలోకి వచ్చింది. అంటే ఎంతస్థాయిలో చిత్రహింస జరిగిందో ఊహించుకోవచ్చు.
‘‘దీని తర్వాత నేను వెళ్లి మేజిస్ట్రేట్ గారిని కలిసి థాంక్స్ చెప్పి అసలు ఏమైంది సార్ అని అడిగితే ఆయన ఇదంతా వివరించారు. నేను జీవితంలో మర్చిపోలేని సంఘటన ఇది. ఒక మనిషి ప్రాణాన్ని కాపాడగలిగానన్న సంతోషం నాకెప్పటికీ వుంటుంది. ఇది జరిగిన ఆరునెలల తర్వాత ఒకరోజు ఇంటినుంచి నేను కాలేజీకి బయలుదేరుతున్న సమయంలో ఒకబ్బాయి వచ్చి కాళ్ల మీదపడి దండం పెట్టాడు. అతనే చినవెంకటి. ఆరోజు కోర్టులో తీవ్రగాయాలతో వున్నపుడు అతన్ని చూశాను. తర్వాత మళ్లీ అదే చూడటం. వెంటనే గుర్తుపట్టలేకపోయాను’’ అని చెప్తూ, ‘‘ఈ సంఘటనతో నేను చాలా విషయాలు నేర్చుకున్నాను. వ్యవస్థ ఎంత ప్రతికూలంగా వున్నప్పటికీ, మనం ఎక్కడా ప్రయత్నాన్ని మాత్రం ఆపకూడదనేది నేర్చుకున్నాను. మన బాధ్యత కేవలం ఒక ప్రెస్‌మీట్‌తోనో, ఒక ధర్నాతోనో ఆగిపోకూడదని కూడా అర్థమయింది. ఏ విషయమైనా గానీ వదిలిపెట్టకుండా ప్రయత్నం చేస్తూ వుంటే కొంచం ఆలస్యమైనా గానీ ఫలితం వస్తుంది. మా పనిలో అలాంటి ఉదాహరణలు చాలా వున్నాయని’’ అన్నారు.
ఆ తర్వాత ‘83లో ఖమ్మంలో జరిగిన 2వ రాష్ట్ర మహాసభల సందర్భంగా జరిగిన బహిరంగసభలో చినవెంకటిని కోర్టుకు తీసుకువచ్చిన సంఘటనను తన ఉపన్యాసం లో ఉదాహరించగా అది ఆంధ్రప్రభ పేపర్లో బాక్స్ ఐటెంగా ప్రచురించారు. దాన్ని చదివిన సినిమా డైరెక్టరు ఉమామహేశ్వరరావు అప్పటికే విజయవాడ ఆంధ్రప్రభ లో పనిచేస్తున్న పౌరహక్కుల సంఘం సభ్యురాలు వసంతలక్ష్మి గారి ద్వారా జీవన్‌ని కలిసి ఇంటర్వ్యూ చేశారు. ఈ సంఘటనతో పాటు ఆ తర్వాత వచ్చిన అనేక అంశాలను కూడా కలిపి ‘అంకురం’ అనే సినిమా తీసారు. కోర్టులో చినవెంకటి ని తీసుకొచ్చిన విధానాన్ని యథాతథంగా (ఓంపురిని కోర్టులో హాజరు పరిచే దృశ్యం గుర్తుందా!) చిత్రీకరించారు.
““““
పై సంఘటనకు కారణమయిన పూర్వరంగం గురించి కొంచెం తెలుసుకోవటం అవసరం.
ఫ్యూడల్ ఆధిపత్య దోపిడీ రాజకీయాలకు వ్యతిరేకంగా ఉవ్వెత్తున లేచిన రైతాంగ పోరాటాలు, జైత్రయాత్రలు… తెలంగాణ పల్లెల మీద, కల్లోలిత ప్రాంతాల పేరుతో రాజ్యం అత్యంత క్రూరంగా ప్రయోగించిన నిర్బంధం, లాకప్ మరణాలు, ఎన్‌కౌంటర్ల పేరుతో అదృశ్యమైపోయిన మనుషులు… వారికోసం నిత్యశోకంతో అల్లాడిన కుటుంబాలు… ఇలా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో 70- 80 దశాబ్దాల కాలంలో ప్రజాఉద్యమాలపై జరిగిన హింసాకాండ, తీవ్రనిర్బంధం అంతాఇంతా కాదు. ప్రజాఉద్యమాలలో నిబద్ధులైన ఎంతోమంది చిత్రహింసలపాయ్యారు. అక్రమకేసుల పాలయ్యి కటకటాల వెనక్కి వెళ్లారు. పౌరహక్కుల నాయకులు హత్యలు జరిగాయి.
ప్రజల హక్కుల కోసం గొంతెత్తిన వారిపై రాజ్యం ప్రతీకారంగా రగిలిపోయిన సందర్భం. ఇలాంటి క్రూర హింసాత్మక ధోరణులు చెలరేగినప్పుడు కూడా నిర్భయంగా నిలబడిన వ్యక్తి, పౌరహక్కుల నేత జీవన్. నకిలీ ఎన్‌కౌంటర్లకూ, మిస్సింగ్ కేసులకూ, ప్రజాపోరాటాలపై అణచివేత చర్యలకూ వ్యతిరేకంగా ఉద్యమించారు. ప్రజల ప్రాథమిక హక్కుల పరిరక్షణ కోసం ప్రాణాలకు తెగించి నిబడ్డారు. ఆ క్రమంలో అనేక కష్టనష్టాలను పంటిబిగువున భరించారు. చినవెంకటికి సంబంధించిన విషయంలో ఎంత నిబద్ధతతో పనిచేశారో ఇప్పటికీ 68 ఏళ్ల వయసులో మానవహక్కుల వేదిక ఉభయరాష్ట్రాల సమన్వయ కమిటీ బాధ్యులుగా, వివిధ ప్రజాసమూహాల హక్కులకోసం నిలబడుతున్న జీవన్‌లో అదే నిబద్ధత, ప్రజాస్వామ్య విలువల పట్ల ప్రేమ కనిపిస్తుంది.
అది, రాజ్యహింస బాధితులు, నివాస హక్కులు, సమాజం అంచుల్లో మనుషులుగా కూడా పరిగణింపబడని దొమ్మరి కులస్తులు, సంచార జాతులు, రైతు ఆత్మహత్యలు, ట్రాన్స్ జండర్స్, నిరాశ్రయులు, పిక్‌పాకెటర్స్, కాందిశీకులు, పాకీపనివారు, గృహహింసకు గురయిన మహిళలు, వీధిబాలలు, వేశ్యలు, విద్యార్థులు, దళితులు, ఆదివాసీలు, మైనారిటీ మతస్తులు, నయీమ్ లాంటి మాఫియాల చేతుల్లో బలయిన పేద రైతాంగం… ఇలా ఎవరైనా కావొచ్చు… వారెవరయినా గానీ మనుషులుగా వారి ప్రాథమిక హక్కులను గౌరవిస్తూ, విస్తృత ప్రజాబాహుళ్యాల హక్కులను గుర్తిస్తూ, వాటన్నిటికీ మానవ హక్కుల సంఘంగా, ఉద్యమనేతగా వారి పోరాటాలకు బాసటగా నిలిచే వ్యక్తి జీవన్. మనిషి చాలా సాదాసీదాగా కనిపిస్తారు కానీ, ఎంత కష్టంలో వున్నవారికైనా అండగా, ఓదార్పుగా నిలబడతారు.
సమస్యను ఒక కొలిక్కి తీసుకురావటం కోసం అహర్నిశలూ కష్టపడతారు. ప్రతికూల పరిస్థితుల్లో ఎదురీదే ధిక్కారి ఆయన. జీవన్ ఉద్యమ గమనంలో ఎన్నో వొడిదుడుకులు, ఆటుపోట్లు ఎదురైన అనుభవాలు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర హక్కుల గమనాన్ని పరిచయం చేస్తాయి. తన మీద, తన కుటుంబం మీద తీవ్ర నిర్భంధం, పహారా వున్నప్పటికీ హక్కుల కోసం గళం ఎత్తటం మానలేదు. పాలకులకి, వారి అడుగులకు మడుగులొత్తే పోలీసులకు కూడా జీవన్ గురించి, ఆయన ఎంత ప్రజాపక్షపాతో చాలా బాగా తెలుసు. ప్రజాఉద్యమాల పట్ల ఎంత పక్షపాతంగా, సంఫీుభావంగా వుంటారో అంతే నిష్పక్షపాతంగా వాటిల్లో చోటుచేసుకునే అవాంఛనీయమైన పెడధోరణులను కూడా ఆయన వ్యతిరేకిస్తారు. వాటిని చర్చకు పెడతారు.
వాస్తవానికి జీవన్ ఒక సాదాసీదా దిగువ మధ్యతరగతి కుటుంబం నుంచి వచ్చారు. ఏ రకమైన రాజకీయ నేపథ్యం, పోరాట చరిత్ర వున్న కుటుంబం కాదు. ఇంకా చెప్పాలంటే కమ్యూనిస్టు వ్యతిరేకత వున్న నేపథ్యం. వీరి బంధువుల్లో ఇద్దరు, తెలంగాణా సాయుధ పోరాటం సమయంలో ఆనాటి కమ్యూనిస్టు పార్టీ చేతిలో చనిపోవటం దానికి కారణం. అందుకే, డిగ్రీ కాలేజీకి వచ్చేవరకూ పోరాటాల చరిత్ర తెలియదు. పోరాటాలను పరిచయం చేసిన స్నేహితులు కాలక్రమంలో ప్రభుత్వాలతో కలిసి అడుగులు వేస్తున్నాకానీ, జీవన్ చూపుడువేలు ప్రభుత్వాల అప్రజాస్వామిక ధోరణులను ఎత్తిచూపుతూనే వుంది. జీవన్ ఉద్యమ సహచరుడు, హక్కులనేత బాలగోపాల్ తను రాసిన ఒక వ్యాసంలో ‘జీవన్ తన స్వభావరీత్యా యాక్టివిస్టు. మానవ జీవితం, మానవ సంబంధాల పట్ల అత్యంత గౌరవం కలిగిన అరుదైన వ్యక్తి’ అని ప్రస్తావించారు. ఇలాంటి నేపథ్యం నుంచి వచ్చిన జీవన్ తన యవ్వనకాలం నుంచీ ఇప్పటివరకూ కూడా ఒక బలమైన ప్రజాగొంతుకగా, రాజ్యహింసకు వ్యతిరేకంగా, హక్కుల సాధన కోసం పనిచేస్తూనే వున్నారు. పోలీసు నిర్బంధానికి, హింసలకు గురయ్యారు. నిత్య చైతన్యశీలిలా మానవ హక్కుల ఉద్యమానికి బలమైన పునాదిగా మారారు. తన జీవనక్రమంలో ప్రభావితం చేసిన వ్యక్తులు, సాహిత్యం, రాజకీయాల గురించి ఆయన మాటల్లోనే వినడం నిజంగా గొప్ప అనుభవం.
కుటుంబ నేపథ్యం:
1951లో వరంగల్ జిల్లా పెదపెండ్యాల గ్రామంలోని మున్నూరుకాపు సామాజిక వర్గానికి చెందిన శ్రీరాముల రామకృష్ణ, పుష్పలీలలకు జన్మించిన జీవన్ పూర్వీకులది భద్రాచలం. అక్కడి నుంచి వలస వచ్చిన వాళ్ల తాత వెంకటేశం ఆ వూరిలో ఒక చిన్న పంతులుబడి (కానిగి బడి)పెట్టుకుని జీవనం సాగించారు. తాత పంతులుగా వుంటే, తండ్రి ప్రజాఆరోగ్యశాఖలో ఉద్యోగం చేసేవారు. ఐదుగురు పిల్లలు. ముగ్గురు మగపిల్లలు, ఇద్దరు ఆడపిల్లలు. జీవన్ రెండో కొడుకు. తనకు పిల్లలు లేకపోవటంతో మేనమామ జీవన్‌ని తీసుకెళ్లి పెంచుకున్నారు.
అలా పదేళ్లు వచ్చేవరకూ అమ్మమ్మ, మేనమామ దగ్గరే హనుమకొండ దగ్గర్లోని వడ్డేపల్లిలో పెరిగారు. అప్పటివరకూ తనకు వేరే తల్లితండ్రులున్నారన్న విషయం కూడా ఆయనకు తెలియదు. జీవన్ పదేళ్ల వయసప్పటి జ్ఞాపకాలలో వడ్డేపల్లి పింగిళి దొర గడీ, దాని చుట్టూవున్న వాతావరణం ఒక సజీవ జ్ఞాపకం. ఆ గడీ యజమానులు కృష్ణారెడ్డి దొర. అతని తమ్ముడు రంగారెడ్డి. అరవైనాలుగు పైగా గదులున్న పెద్దగడీ అది. ఆ గడీని తర్వాతకాలంలో ప్రభుత్వానికి ఇచ్చేశారు. వాస్తవానికి దొరలు ప్రభుత్వానికి చాలా మొత్తం శిస్తు బాకీపడ్డారు, దానికి చెల్లుగా అ గడీని ఇచ్చేశారు. అందులోనే మొట్టమొదటి కాకతీయ మెడికల్ కాలేజీ ప్రారంభమయింది. ప్రస్తుతం అక్కడ ప్రభుత్వ మహిళా డిగ్రీ కాలేజీ నడుస్తోంది. ఆ చుట్టుపక్కల ముప్ఫై గ్రామాలలోని వేల ఎకరాల భూములు ఆ దొరల ఆధీనంలో వుండేవి. ఊరందరూ వారికోసమే పనిచేసేవారు.
జీవన్ వాళ్ల ఒక మేనమామ కూడా అక్కడ జీపు డ్రైవరుగా పనిచేసేవారు. కృష్ణారెడ్డి భార్యను అందరూ దొరసానమ్మ అనే పిలిచేవారు. దొరసానమ్మకి ప్రతిశనివారం తలంటి స్నానం చేయటానికి పన్నెండు పెద్దపెద్ద కాగుల నిండా నీళ్లు కాచేవాళ్లు అనే విషయం చిన్నప్పుడు జీవన్‌కి చాలా ఆశ్యర్యంగా అనిపించేదట! ఒక్క మనిషి కోసం అన్ని నీళ్లెందుకనే ప్రశ్న వచ్చేది కానీ, బయటకు అననిచ్చేవారు కాదు పెద్దలు. అప్పట్లో ఆ ఊర్లో దొర ఇంట్లో మాత్రమే జీపుండేది. దొరసానమ్మ ప్రతిశనివారం గుడికి జీపులో వెళ్లి వస్తుంటే పిల్లలంతా ఆశ్యర్యంగా చూసేవారట! చాలా పెద్దజుట్టు ఆమెది. గుడి నుంచి వచ్చిన తర్వాత ఆమె గడీ ముందు భాగంలో కూర్చునేది. ఆమె ముందు ఒక పెద్దకుండలో మజ్జిగ, ఒక గంపలో కరివేపాకు వుండేది. ఊరివాళ్లందరూ చెంబులు తీసుకుని మజ్జిగ కోసం వెళ్లి లైనులో నిలబడితే అమె మజ్జిగపోసి, కరివేపాకు ఇచ్చేది.
మిగతా ఇక జీవన్ మాటల్లోనే:
‘‘మేం కూడా చిన్నప్పుడు అలా వెళ్లి మజ్జిగ తెచ్చుకునేవాళ్లం. నేను చాలా చిన్నవాడిని అప్పుడు. ఆ గడీలో ‘ఆడపాపల’ వ్యవస్థ వుండేదని విన్నాను. అయితే చిన్నతనం కాబట్టి వాటి అర్థమేమిటనేది అపుడు తెలియదు. మా పూర్వీకుల్లో ఒకరు అక్కడ ఆ విధంగా వుండేవారని నాకు పెద్దగయిన తర్వాత తెలిసింది. అయితే, మా వాళ్లెవరూ ఆ విషయం ఇప్పటికీ బయటికి చెప్పటానికి ఇష్టపడరు. నాకు గుర్తున్నంతవరకూ పింగిళి దొరలను నేనైతే క్రూరులుగా చూడలేదు ఎప్పుడూ. ఒకసారి పెద్ద కరువొస్తే, వాళ్ల గడీలో నుంచి అందరికీ వడ్లు, బియ్యం పంచటం నాకు గుర్తుంది. ఊర్లో ఎవ్వరికి పెండ్లి అయినా గానీ ముందుగా గడీకి పోవాలి, దొరసాని కాళ్లు మొక్కాలి. ఆమె కాణీనో ఎంతో ఇచ్చి, ఒక రవికె బట్ట, పండు చేతిలో పెట్టేది. ఇవన్నీ చూస్తూ పెరిగాను. వాళ్ల పిల్లలు అప్పట్లోనే ఇంగ్లండ్ లో చదువుకునేవారు. వాళ్ళు సెలవుల కొచ్చినపుడు చూస్తుండేది. ఆడపిల్లలు ఫ్రాకులు వేసుకుని ఆడుతుంటే మాకు చాలా ఆశ్చర్యంగా వుండేది. రాత్రిపూట గ్రామఫోను పెట్టుకుని డాన్సులు చేసేవారు. గ్రామఫోను కూడా వాళ్ల ఒక్కింట్లోనే వుండేది. కరెంటు కూడా అంతే. కృష్ణారెడ్డి దొర రాజమండ్రి నుంచి ఒక నర్తకిని తెచ్చుకుని పెట్టు కున్నాడు! ఆమెపేరు జలజాక్షి. చాలా అందంగా వుండేది. కళావంతుల కుటుంబం, దేవదాసి అని చెప్పేవారు. దాని అర్థంకూడా తెలియదు నాకు అప్పట్లో. దొర ఆమె కోసం వేరేగా ఒక పెద్ద బంగ్లా కూడా కట్టించాడు. అది ఇప్పటికీ వడ్డేపల్లి లో వుంది. ఆమె బయటకు వచ్చినపుడు జుట్టు విరబోసుకుని నాలుగు చక్రాలబగ్గీలో వెళుతుంటే ఊరంతా ఎగబడి చూసేవారు. తమ కులగౌరవానికి తగినవాళ్ళు కాదని ఆమె బిడ్డల్ని ఇక్కడి దేశ్‌ముఖ్ లు ఎవ్వరూ పెళ్లి చేసుకోలేదు. దొర కుటుంబం తీరు వేరు, మా కుటుంబాల తీరు వేరు అని నాకు చిన్నప్పుడే అర్థమయింది కానీ, ఎందుకు అలా వుండేదో తెలిసేది కాదు. మాకందరికీ ఇవన్నీ చాలా ఆశ్యర్యంగా వుండేది. ఈ విషయాల పట్ల స్పష్టత ఏమీ లేదు. అయితే అవి చిన్నప్పటి జ్ఞాపకాలుగా గుర్తుండిపోయాయి.”
చదువు, పుస్తకాలతో పరిచయం:
నేను సెయింట్ గాబ్రియేల్ హైస్కూలులో చేరిన కొత్తలో అక్కడ కొండపల్లి సీతారామయ్య, కె.జి. సత్యమూర్తి నాకు టీచర్లుగా వుండేవారు. అయితే, నాకు వాళ్ల గురించి తెలిసింది నేను కాలేజీకి వెళ్లిన తర్వాతే. నేను అక్కడ ఒక్క సంవత్సరమే వున్నాను. తర్వాత మా కుటుంబం కుమారపల్లిలో ఇల్లు కట్టుకుని అక్కడికి మారటంతో నేను కూడా సుబేదారిలో వున్నస్కూలుకి మారాను. సీతారామయ్య హిందీ, సత్యమూర్తి సోషల్ స్టడీస్ చెప్పేవారు. ఇది కూడా జ్ఞాపకమే నాకు. ఐదవ తరగతి నుంచే బొమ్మల రామాయణం లాంటి పుస్తకాలు చదవటం అలవాటయింది. అప్పట్లో ఆంధ్రప్రభ లాంటి పత్రికలు ఇంటికి వచ్చేవి. అమ్మ పత్రికలూ, అందులో సీరియల్స్ బాగా చదివేది. ఇంట్లో అందరం కలిసి సీరియల్స్ చదివేవాళ్ళం. మా బంధువుల్లో ఒకాయన రచయిత వుండేవారు. ఆకుల భూమయ్య ఆయన పేరు. వాళ్ళది సిరిసిల్ల.
ఆయన సెలవుల్లో మా వూరికి వచ్చినపుడు, ఆయన రాస్తుంటే ఆయన పెన్నులో ఇంకు నింపి ఇవ్వటం అనేది నాకు గర్వంగా వుండేది. అలా ఆయన్ని చూస్తూ చదువు పట్ల ఒక ఇష్టం ఏర్పడింది. సుబేదారి లో మా స్కూల్ కి దగ్గరలోనే కాళోజి వుండేవారు. అయితే ఆయన నాకు అప్పుడు పరిచయం కాలేదు. అప్పట్లో స్టాంప్స్ సేకరించటం చాలా ఇష్టంగా వుండేది. అది తెలిసి మా ఫ్రెండ్స్ కాళోజి ఇంటి దగ్గర చాలా స్టాంప్స్ దొరుకుతాయని, ఆయన చాలా పెద్ద కవి అని చెప్పారు. అప్పట్లో కవి అంటే అర్థంకాకపోయేది. దూరం నుంచి ఆయన్ని చూస్తే చాలా భయమయ్యేది కూడా. అయినా గానీ అలా వాళ్లింటికి వెళ్లి ఇంటి బయట పారేసిన ఉత్తరాల కవర్లనుంచి స్టాంపులు తీసుకుని వెంటనే పారిపోయి వచ్చేసేవాడిని.
హైస్కూలులో వుండగానే యద్ధనపూడి సులోచనారాణి నవలలు చదవటం అలవాటయింది. మా అక్కయ్యలు, చిన్నమ్మలు చదువుతుండే వారు. నాక్కూడా అవి ఎందుకో బాగా నచ్చాయి. ఎందుకు అంటే చెప్పలేను. చదవటానికి చాలా సులభంగా వుండేవి. దిగువ మధ్యతరగతి నుంచి ఎగువ మధ్యతరగతికి వెళ్తున్న కుటుంబం మాది. బహుశా ఆ ఆలోచనా ధోరణితో వుండేవి కాబట్టి నచ్చివుండవచ్చు. లైబ్రరీకి కూడా తరచూ వెళ్ళేవాడిని. అక్కడ నాకు శరత్ పుస్తకాలు పరిచయమయ్యాయి. బడదీది, దేవదాసు, పరిణీత, చరిత్రహీనులు చదివాను. చరిత్రహీనులు నవలని ఒకసారి కాదు చాలాసార్లు చదివాను. అది నన్ను బాగా తాకింది. నా లోపలి ఆలోచనలకు సరిపోయినట్లనిపించింది. దాని ప్రభావం నామీద చాలా వుంది కూడా. అయితే అప్పుడు దాన్ని విశ్లేషించేంత వయస్సు కానీ, పరిపక్వత కానీ నాలో లేవు. నచ్చింది అంతే.
అయితే, కాలేజీకి వచ్చిన తర్వాత ఎందుకు ఆ పుస్తకం నాకు నచ్చింది అని ఆలోచిస్తే, మానవ సంబంధాలను, స్వభావాలను లోతుగా విశ్లేషించటం ఆ నవలలో నన్ను బాగా ఆకట్టుకున్న విషయంగా అర్థం చేసుకున్నాను. నేను చిన్నప్పటి నుంచి కూడా మనుషుల పట్ల చాలా సున్నితంగా వుండేవాడిని. తొందరపడి ఎవర్నీ ఏమీ అనేవాణ్ణి కాదు. గొడవలకు పోయేవాడిని కాదు. నా చుట్టుపట్ల వుండే వాళ్లతో ప్రేమగా వుండేవాడిని. అది నా స్వభావం. నేను ప్రైమరీస్కూలులో వున్నప్పుడు మా ఫ్రెండ్స్ మా బంధువుల పేర్ల చివర దాసు అని వుండటం గురించి కొంత ఎగతాళిగా మాట్లాడేవారు. ముందు అర్థం కాకపోయేది. పెద్దయిన తర్వాతే ఆ విషయం అర్థమయింది. అలానే, నేను బాగా ఇబ్బంది పడిన విషయం, గ్రామంలో మనుషుల మధ్య వుండే అసమానతలు. నా దగ్గరి స్నేహితులందరూ వెనుకబడిన, దళిత, ముస్లింలు వుండేవారు. ఐలయ్య అని దోస్తుండే. పద్మశాలీ అతను. చాలా తెలివికలవాడు. కానీ, అతని ఇంట్లో ఎప్పుడూ తిండి వుండేది కాదు. దళితవాడల్లో భాగోతాలు ఆడినప్పుడు పండుకోవటానికి ఒక బస్తా తీసుకునిపోయి రాత్రంతా అక్కడే వుండేది. పొద్దున్నే ఇంటికి రాగానే, స్నానం చేస్తే కానీ మా అమ్మమ్మ లోనికి రానిచ్చేది కాదు. ఇవేవీ నాకు నచ్చేవి కాదు, కానీ ఎలా చెప్పాలో తెలిసేది కాదు. తర్వాత, బాగా ఇబ్బంది పెట్టిన అంశం గ్రామంలోని స్త్రీ- పురుషుల మధ్య వుండే వివాహేతర సంబంధాలు.
ఇవన్నీ అర్థంచేసుకునే వయసు లేదు కానీ, ఆ క్రమంలో మనుషుల మధ్య పెరిగే గొడవలు, ఎప్పుడూ ఆడవాళ్లే బాధితులుగా మారటం చూస్తూ పెరిగాను నేను. ఇవన్నీ ఫ్యూడల్ వ్యవస్థ ప్రభావాలు అనే విషయం కూడా నాకు తెలియదు. ఇదంతా సహజమనుకునేది. చరిత్రహీనులు నవల అంత చిన్న వయసులోనే నచ్చటానికి ఇవన్నీ కారణమయి వుండొచ్చు. చిన్నప్పటి నుంచి కష్టాల్లో వున్నవాళ్లకు సహాయం చేయటం, వారెవరైనా గానీ వ్యతిరేకత లేకపోవటం నా స్వభావంలో రూపుదిద్దుకుంది. 1968లో నేను మల్టీపర్పస్(12వ తరగతి) పూర్తిచేసాను. తొలి తెలంగాణ ఉద్యమం వాళ్ళ కాలేజి లో అడ్మిషన్లు ఆలస్యమయ్యాయి. అందరికీ ఒక సంవత్సరం చదువు పోయింది. ‘69లో ఆర్ట్స్ కాలేజీలో బి.ఏ ఇంగ్లీష్ లిటరేచర్లో చేరాను. కాలేజీలో కొచ్చిన తర్వాత నా ఆలోచనా సరళి మారింది. నాకు అక్కడే నా స్నేహితుల ద్వారా రైతాంగ పోరాటాల గురించి తెలిసింది. ఎస్‌ఎఫ్‌ఐ పరిచయమయింది.
ఇప్పుడు సిపియం లీడర్ గా వున్న రాములు డిగ్రీలో నా జూనియర్. టంకశాల అశోక్ నాకు క్లాస్మేట్. సుందరయ్యగారి గురించి మొదటిసారి విన్నది అక్కడే. అయితే ఆయన పుస్తకాలు ఏమీ చదవలేదు నేను అప్పుడు. తర్వాతెప్పుడో చదివాను. నన్ను బికాం చేయమని మా బాపు చెప్పారు కానీ, అప్పటికే సాహిత్యం మీద ఇష్టం వుండటం వల్ల బి.ఏ ఇంగ్లీషు తీసుకున్నాను. నేను లైబ్రరీకి బాగా పోతుండేది. నేను తెలుగులో చదివిన మొట్టమొదటి కవిత్వ పుస్తకం తిలక్ ‘అమృతం కురిసిన రాత్రి’. చాలా నచ్చింది అది. దాదాపు నోటికి వచ్చు. రెండో పుస్తకం వరవరరావు ‘చలినెగళ్లు’. అది ఆయన మొదటి కవిత్వ సంపుటి. మా రమక్కయ్యకు (పెద్దమ్మ కూతురు) వరవరరావు సీనియర్. నేను బి.ఏ లో జేరిన తర్వాత మా అక్కయ్య ఈ పుస్తకం తీసుకువచ్చి చదవమని ఇచ్చింది. అప్పటికి నేను శ్రీశ్రీని కూడా చదవలేదు. హనుమకొండ లో మిత్రమండలి అని ఒక ఇన్‌ఫార్మల్ సాహితీ సంస్థ వుండేది. ప్రతినెలా సాహిత్య సమావేశాలు జరుగుతూ వుండేవి. మొదటి కన్వీనర్ అంపశయ్య నవీన్. వరవరరావు, కాళోజి, వాళ్ల అన్నయ్య రామేశ్వరరావు…ఇలా అందరూ వచ్చేది. నేను కూడా కొత్తగా వెళ్లటం మొదలుపెట్టాను. (ఇప్పటికీ కూడా మిత్రమండలి నడుస్తోంది.) నాకు కాళోజి బాగా పరిచయమయింది అక్కడే. నా జీవితాన్ని అత్యంత ప్రభావితం చేసినవాళ్లలో కాళోజి చాలా ముఖ్యమైన వ్యక్తి. తర్వాత కాలంలో కన్నబిరాన్, బాలగోపాల్, వరవరరావు…ఇంకా అనేకమంది నా సహచరులు, విద్యార్థులు ఉన్నారు.
‘69 తెలంగాణ ఉద్యమం:
నేను అప్పుడప్పుడే కమ్యూనిజం గురించి, సుందరయ్యగారి గురించి తెలుసుకోవటం మొదలుపెట్టాను. అదే సమయంలో నక్సల్‌బరి ఉద్యమం ప్రారంభమయింది. ‘69 లోనే తెలంగాణ రాష్ట్ర సాధన కోసం కూడా తొలి ఉద్యమం మొదలయింది. దాదాపు ఒకే సమయంలో. ఇక్కడ ఈ ఉద్యమ నేపధ్యం తెలుసుకోవాలి. వడ్డేపల్లి గడీలో కాకతీయ మెడికల్ కాలేజి మొదలయిందని చెప్పాను కదా. అక్కడ 40 సీట్లు మంజూరయ్యాయి. 35 మంది ఆంధ్రప్రాంతం నుంచి వచ్చిన కమ్మ, రెడ్డి, బ్రామ్మల పిల్లలకే సీట్లు వచ్చాయి. 5వ బాచ్ లో మా అన్నయ్యకు కూడా సీటు వచ్చింది కానీ అప్పుడు కాపిటేషన్ ఫీజు 5000 రూపాయలు వుండేది. అవి కట్టే స్థోమత లేక ఆ సీటు వదిలేసుకోవాల్సి వచ్చింది. మా ఊరిలో పెట్టిన కాలేజీలో మా అన్నయ్య చేరలేకపోయాడు!
ఈ అంశం నన్ను చాలా ఆలోచనలో పడేసింది. విజయవాడ, గుంటూరు నుంచి వచ్చినవాళ్లు అక్కడే ఇళ్లు తీసుకుని వుండేవాళ్లు. వాళ్లలో కొంతమందికి మా చిన్నమ్మమ్మ వంట చేసిపెట్టేది. ఆవిడ పేరు సత్తెమ్మ. మొదటిసారి మేము ఇడ్లీ అనే పదార్ధాన్ని చూసింది అప్పుడే. మేం ఏంమాట్లాడినా ఆటపట్టిస్తున్నట్లుగా బనాయించేవారు. మంచివాళ్లే, కానీ ఈ తేడా ముల్లు గుచ్చినట్లు బాధపెట్టేది. మా ప్రతిమాటనీ ఎగతాళి చేసేవారు. అక్కడికి దగ్గర్లో గుంటూరు పల్లెలని వుండేవి. అవి మా ఊర్ల కన్నా చాలా తేడాగా వుండేవి. మాదొక తీరు, వారిదొక తీరు. అలా ప్రతిచోటా ఈ తేడా పెరుగుతూ పోయింది. ఇక్కడి వాళ్లకు ఉద్యోగాలు లేవు. లెక్కలు, సైన్స్, సోషల్, ఇంగ్లీష్ ఇట్లా చాలామంది టీచర్లు ఆంధ్రానుంచి వచ్చిన వాళ్లే వుండేవారు. ఇక్కడి వాళ్లు తెలుగు, క్రాఫ్ట్, డ్రాయింగ్ వంటివాటికి వుండేది. తెలంగాణాకు అన్యాయం జరిగిందన్న నేపథ్యంలో వచ్చిన ప్రత్యేక రాష్ట్ర ఉద్యమం కోసం విద్యార్థులుగా పాల్గొన్నాం.
*
” హక్కులనేత బాలగోపాల్ తను రాసిన ఒక వ్యాసంలో ‘జీవన్ తన స్వభావరీత్యా యాక్టివిస్టు. మానవ జీవితం, మానవ సంబంధాల పట్ల అత్యంత గౌరవం కలిగిన అరుదైన వ్యక్తి’ అని ప్రస్తావించారు. ఇలాంటి నేపథ్యం నుంచి వచ్చిన జీవన్ తన యవ్వనకాలం నుంచీ ఇప్పటివరకూ కూడా ఒక బలమైన ప్రజాగొంతుకగా, రాజ్యహింసకు వ్యతిరేకంగా, హక్కుల సాధన కోసం పనిచేస్తూనే వున్నారు. పోలీసు నిర్బంధానికి, హింసలకు గురయ్యారు. నిత్య చైతన్యశీలిలా మానవ హక్కుల ఉద్యమానికి బలమైన పునాదిగా మారారు. తన జీవనక్రమంలో ప్రభావితం చేసిన వ్యక్తులు, సాహిత్యం, రాజకీయాల గురించి ఆయన మాటల్లోనే వినడం నిజంగా గొప్ప అనుభవం.” చాలా మంచి పరిచయం చేశారు సజయ గారూ.
ధన్యవాదాలు సుబ్రహ్మణ్యం గారు. రెండో భాగం వచ్చే సంచికలో వస్తుంది
అస్పష్టంగా ఉన్న చాల విషయాలు తెలిశాయి. జీవన్ గారు బాల్యం నుంచి తన వ్యక్తిత్వాన్ని తీర్చిదిద్దుకున్న తీరు,ఎదిగిన విధానం గొప్ప స్ఫూర్తినిచ్చేదిగా ఉంది. “యాక్టివిస్టు డైరీ” శీర్షిక భలే నచ్చింది. అభినందనలు సజయా!
Thank you Siva lakshmi
Hats off to Sajaya !
Thank you Ramnarayana garu
Thank you Ramanarayana garu
viluvalu leni prasuta samayam lo etuvanti vayktula gurimchi chadivi o niturupu .
Chandra sekhar gaaroo, rendo bhagam vacche sanchikalo chudandi.
అరుదైన వ్యక్తి గురించి మంచి పరిచయం చేశారు.
Thank you Nitya
యాక్టవిస్టు డైరీ శీర్షిక కల్గించిన ఆసక్తితో కళ్లు అక్షరాల వెంట పరుగులు.. జీవన్ సార్ గురించి తెల్సుకోవడం స్పూర్తినిస్తుంది. రెండోభాగం కోసం ఎదురు చూస్తున్నా
థాంక్స్ శాంతి. వచ్చే సంచికలో చూడండి.
, చాలా బావుంది సజయా, అభినందనలు.
థాంక్స్ కాత్యాయని.
Very interesting to read about a activist and public intellectual Jeevan. Good job.
Thank you Ramanaidu
Very interesting narration. A good beginning sajaya!
థాంక్యూ అరణ్య కృష్ణ గారు. రెండో భాగం కూడా చూడండి. ఇంకా చాలా మంది ఇంటర్వ్యూ లు ఉన్నాయి. రాస్తున్నాను.
చాలా స్ఫూర్తిదాయకమైన శీర్షిక. యాక్టీవిస్టు నాడితో పాటు వాళ్ళు రూపొందిన తీరూ ఆనాటి సామాజిక రాజకీయ స్థితిగతులు చెప్పడం బాగుంది. వాళ్ళ జీవిత నేపథ్యం వాళ్ళ మాటల ద్వారానే తెలియజేయడం మరీ బాగుంది. చక్కటి స్కీం. అభినందనలు సజయ గారూ !
థాంక్స్ ప్రభాకర్ గారు. వాళ్ల అనుభవాల్లోంచి కొంతైనా అక్షరీకరించాలని ఈ తాపత్రయం.
Maa voori arudaina vyakti gurchi chakkati parichayam sajaya garu…👌🙏
మీ ఊరితో నాకు కూడా మంచి అనుబంధం ఉంది వాణీ గారు. మొదటి, చివరి లాఠీ దెబ్బలు తిన్నది ఇక్కడే నేను. చాలా మంచి స్నేహితులున్నారు.
సంజయ Medam Garu maadi SC
Dakkali kulam. Sanchara jivanam గడుపుతున్నారు.veeriki venuka mundu yevaru lerani policelu CT yacht prayoginchi PS chuttu roju thipputhu chithra himsalu petevaru. JEEVAN KUMAR Sir oka Devuni la mundudi police la badalu lekunda chesharu. Ap lo Vinukonda (Guntur dist) ,Matur(నెల్లూరు) Lo Konni veilla kutunbalu pillalanu chadivinchu Kuntu Shanthoshanga vuntunnaru. Sir lekunte varantha Aathma yathya చేసుకునేవారు.jeevan sir Gariki prathyeka dhanyavadalu. Sir Gurinchi Thelsu kovadam spurthi Nistundi
Excellent write up on Jeevan Kumar
Sir,
Good Morning,
Just I read the the article Saranga part 1.
Really heart touching. I Feel proud to be with
a great personality. Please forward part 2 also.
With great regards,
**A police officer
Article chadivanu,Jeevan gari gurinchi Chala thelisindi, thanks.