వివక్షలో బుడుంగుమన్న జంగాలు

బుడగ జంగాల మతాచారాలు యితర హిందువుల కంటే కొంత మేరకు భిన్నంగా వుండడం విశేషం

ధ్యయుగాలలో వీరశైవం ముందుకు తెచ్చిన సాంఘిక సమానత్వ భావనకు ఆకర్షితులై అనేక అణగారిన కులాలు ఆ మత శాఖలో చేరి బ్రాహ్మణవాద వివక్ష  నుంచి కొంత స్వాంతన పొందాయి. వీరశైవం శివుడిని ‘జంగమ దేవర’ గా పేర్కొనడమే కాక శైవమతాన్ని ఆచరించేవారందరినీ ‘జంగములు’ గా పరిగణించి గౌరవించింది. ఆ విధంగా మధ్య యుగాలలో మాల, మాదిగ, బేడ బుడగ వంటి అణగారిన, వెనుకబడిన కులాలు, సంచార జాతులు ‘జంగమ’ అనే కుల సమూహంలో చేరి ‘మాల జంగం’, ‘మాదిగ జంగం’, ‘బేడ బుడగ జంగాలు’ గా యెంతో కొంత గుర్తింపునూ గౌరవాన్నీ పొందాయి. వైష్ణవ మత శాఖ ప్రభావంతో యేర్పడిన ‘దాసరి అనే సామాజిక మత వర్గాం కూడా యిలాంటిదే!

13 వ శతాబ్దం నాటికే ‘జంగమ’ శబ్దం కుల వాచకంగా గుర్తింపు పొందింది. బ్రాహ్మణ వాద ప్రభావానికి  గురైన వీరశైవ శాఖ క్రమంగా తన వునికిని కోల్పోయినప్పటికీ అది సృష్టించిన ‘ జంగమ’ కులాలు  మాత్రం అవే పేర్లతో మనుగడ సాగిస్తున్నాయి. వివిధ కులాల నుంచి జంగములుగా పరిణామం చెందిన వారిలో కూడా తిరిగి సామాజిక అంతరాలు తలెత్తాయి. కర్ణాటకలో ‘లింగాయతులు’ కూడా ‘జంగమ’ అనే వర్గానికి చెందినవారే అయినప్పటికీ వీరు మిగిలినవారికంటే సామాజిక హోదాలో పై యెత్తున వుండి శివాలయాలలో పూజారులుగా బ్రాహ్మణులకంటే కాస్త తక్కువ స్థాయిని పొందుతున్నారు.  సంచార జాతులలో ‘బుడగ’ లేదా ‘బేడ’ జంగాలు అనేవారు వొక ప్రత్యేక సామాజిక వర్గం గా మధ్య యుగాల నుంచీ ప్రసిద్ధికెక్కారు. వొకప్పుడు వీరశైవం ప్రబలంగా వ్యాప్తి చెందిన కర్ణాటక, ఆంధ్ర ప్రదేశ్ లోని రాయలసీమ ప్రాంతంలో  ‘జంగమ’ పేరుతో ‘జంగాల పల్లె’, ‘జంగం పేట’, ‘జంగాల కండ్రిగ’ అనే పేర్లతో వొక్కో జిల్లాలో  పదుల సంఖ్యలో గ్రామాలు వుండడం వారి ప్రాచుర్యానికి గుర్తుగా భావించవచ్చు.

అణగారిన, వెనుకబడిన శూద్ర కులాల నుంచి వొచ్చిన జంగాలలో ‘బేడ’, లేక ‘బుడగ’ జంగం కులం సంచార జాతులలో ప్రధానమైనదిగా గుర్తింపు పొందింది. ‘బేడ’, ‘బుడగ’ జంగం అనేవి రెండు వేరు వేరు సామాజిక వర్గాలని కొందరు భావిస్తున్నప్పటికీ వారిద్దరూ వొకరేనని ఆ కులానికి చెందిన వ్యక్తులు ప్రకటిస్తున్నారు. ‘బేడ’ అనే పదం వారు చనిపోయినవారికి దహన సంస్కారం చేసేటప్పుడు కధలు చెప్పినందుకు రుసుము గా రెండణాలు అనగా ‘బేడ’ తీసుకోవడం వలన వొచ్చిందనే అభిప్రాయం పరిశోధకులలో వుంది. అయితే ‘బేడ’ అనే పదానికి ‘వేట’ అని అర్ధం వుంది.  వీరి ప్రధాన వృత్తి వేట కాబట్టి ‘బేడ’ అనే  పేరు వీరి పరంగా వాస్తవమై వుండొచ్చు. ఎడ్గర్ థర్ స్టన్ అనే మానవ శాస్త్ర పరిశోధకుడు ‘బోయలు’, ‘బేడ జంగాలు’ వొకరేనని పేర్కొన్నారు. వారు ప్రదర్సించే కళలల్లో వారు ధరించే పాత్రలైన తోలుబొమ్మలాటలు, పగటివేష గాళ్ళు, బహురూపులు, భాగోతులు, శారదగాళ్ళు, కాటి పాపలు, బాల సంతులు, బైరాగులు, కోయదొరలు, కొండ రాజులు, మందెచ్చులు, గురప్పలు అనేవి వుండడం వలన వీరిని వేరు వేరు సామాజిక వర్గాలుగా భావిస్తున్నారు కానీ వీరంతా వొకరేనని బుడగ జంగాలపై పరిశోధన చేసిన యెన్.ఆర్.  వెంకటేశం తమ సిద్ధాంత గ్రంధం లో పేర్కొన్నారు. సంచార జీవితం వలన, వారు చేపట్టిన వివిధ వృత్తుల వలన రక రకాల పేర్లు వారికి వొచ్చి వుండొచ్చు. వీరు తమ కళా ప్రదర్శనలో వుపయోగించే ‘బుడిగె’ అనే వాద్య పరికరాన్ని బట్టి వారికి ‘బుడగ’ జంగాలనే పేరు వొచ్చిందని భావించవచ్చు.  బుడగ జంగాలు నివశించే ప్రాంతాన్ని బట్టి, వారి స్వభావాన్ని బట్టి తిరిగి వరిని ‘వూర జంగాలు, గణాయత జంగాలు, ఈతముక్కల జంగాలౌ, శివ జంగాలు, శ్రీ లేదా సిరి జంగాలు, పిరికి జంగాలు అనే విభజన వీరి పరంగా వొచ్చింది. వొక గ్రామంలో స్తిర నివాసం యేర్పాటు చేసుకుని జీవించే వారిని ‘వూర’ లేదా ‘గణాయత’ జంగాలని అంటారు. వారు ప్రధానంగా శైవ భక్తులే కాక ప్రముఖ శైవ క్షేత్రమైన శ్రీశైల క్షేత్రం పేరు వారి పాత పేరులో  వుంటుంది. ‘శివ జంగాలు’, ‘శ్రీ జంగాలు’, ‘సిరి జంగాలు’ అనే పేర్లు ఆ వారి మతాన్ని సూచించేవే!   వారు పిరికివారనే అభిప్రాయం యితరులలో వుండడం వలన ‘పిరికి జంగాలు’ అని కూడా వొక పేరు వారికుంది.

వొకప్పుడు వేట ప్రధాన వృత్తిగా సంచార జీవితం గడిపిన బేడ/బుడగ జంగాలు క్రమంగా వేటాడటం తగ్గించి జీవనోపాధి కోసం అనేక వృత్తులను అవలంబిస్తున్నారు. యీతాకు చాపలు అల్లి అమ్మడం, దువ్వెనలు, అద్దాలు వంటి చిల్లర సామాన్లు అమ్మడం, చేపలు పట్టి, అరుదుగా వుడతలు, పిల్లులు, తాబేళ్ళు వంటి జంతువులను ఆహారం కోసం వేటాడడం వంటి వృత్తులను చేస్తూ, సంచార, అర్ధ సంచార జీవితాన్ని గడుపుతున్నారు. స్రీలు యెక్కువగా చాపలు అల్లుతారు. చాపలు అల్ల్డంలో స్త్రీ పురుషులిద్దరూ పాల్గొన్నప్పటికీ స్త్రీలు యితర పనులు చేసుకుంటూ కూడా చాపల్ని నైపుణ్యగా అల్లడం విశేషం. చాపలు అల్లడానికి కావల్సిన ఈతాకు సేకరించడానికి స్త్రీ పురుషులిద్దరూ వెళ్తారు. ఈతాకుకు మట్ట నుంచి ఆకును వేరుచేసి మధ్యలో వుండే కర్రని ‘బరిగె’ అంటారు. ఆ బరిగెను యెరుకల వారు తీసుకుని వాటితో బుట్టలు అల్లుతారు.  ఈతాకు సేకరణ లో వారికి కల్లు గీత వారి నుంచి వ్యవసాయదారుల నుంచి ఆటంకాలెదురైతే కొన్ని సార్లు వాళ్ళను బతిమాలుకుని మరికొన్నిసార్లు దొంగతనంగా కోసుకొస్తారు. ఈతాకు సేకరించడం పైన కూడా వారు పాటలు అల్లుకుని పాడుకుంటారు. వాటిని అమ్మితే వచ్చే డబ్బుతో సుఖంగా బదుకుతాం అనే భరోసా ఆ పాటల్లో కనిపిస్తుంది.  ఆంధ్ర ప్రదేశ్ లో వీరి ప్రస్తుత జనాభా సుమారు నాలుగు లక్షలు వుండొచ్చని అంచనా. రాయలసీమ ప్రాంతంలోని కడప, కర్నూలు, అనంతపురం, దక్షిణ కోస్తా లోని పశ్చిమ గోదావరి, కృష్ణా, గుంటూరు, జిల్లాలు, వుత్తర కోస్తా లోని శ్రీకాకుళం జిల్లలో బుడగ జంగాలు  యెక్కువగా జీవిస్తున్నారు.

ప్రధానంగా సంచార జాతిగా గుర్తించబడిన బుడగ జంగాలు గ్రామాలలోని స్మశాన స్థలాలలోనూ, కాలువ  గట్లపైన, పోరంబోకు స్థలాలలోనూ గుడిసెలు వేసుకుని జీవిస్తూ తమ అవసరాలకు అనుగుణంగా తమ నివాస ప్రాంతాలను మార్చుకుంటూ వలస వెళ్తారు. వారి ఆవాసాలను ‘గుడుం’ అంటారు.

బుడగ జంగాలలో అక్షరాస్యత చాలా తక్కువ. పదో తరగతి కంటే పైన చదువుకున్న వారు దాదాపు లేరంటే అతిశయోక్తి కాదు. వారి భాష తెలుగే అయినా సంచార బతుకులో తమ భాష కూడా కన్నడ, వుర్దూ భాషలతో  సమ్మిళతమైన తెలుగు గా మారిపోయింది.  ఆ భాషకు  లిపి లేదు. వుదాహరణకు కొన్ని పదాలు

తెలుగు                   బుడగ జంగమ భాష

యిల్లు                   మత్తి, ఘరా

అన్నం                   భండారి

తినడం                   మెసగడం

అమ్మాయి                  పింకి

అబ్బాయి                 పింకుడు

తాబేలు                   కుమంగాడు

పిల్లి                     జంగాస్క

దెయ్యం                   కాసికం

వుడత                   తోర్షిగాడు

నక్క                     నర్సిగాడు

వుడుం                   వోలింగాడు

యితర ఆదిమ ద్రావిడ తెగల మాదిరిగానే బుడగ జంగాలు కూడా మాతృస్వామిక వ్యవస్థనే అనుసరిస్తున్నారు. పెళ్ళిలో వరుడి తల్లిదండ్రులు వధువుకు యిచ్చే కానుక ‘వోలి’ ఆచారం వారిలో యింకా వుంది. బాల్య వివాహాలు నిషిద్ధం. పెళ్ళి, చావు వంటి తతంగాలలో బ్రాహ్మణ పురోహితుడి పాత్ర వుండదు. వారి కులపెద్దలే పౌరోహిత్యం చేస్తారు. మంత్రాలకు బదులు పెళ్ళి ప్రమాణాలు చెప్పించి సాదా సీదా గా పెళ్ళి తతంగాన్ని ముగిస్తారు. అయితే యితర ఆదిమ తెగల వలే బుడగ జంగాల కుల పంచాయితీ చాలా బలమైనదని చెప్పొచ్చు. పెళ్ళి సందర్భంగా యిరువైపుల పెద్దలకు మద్యం తాగించి విందు చెయ్యడం అనేది తప్పనిసగా పాటిస్తారు. వివాహం, విడాకులు వంటి విషయాలలో కుల పంచాయతి చర్చించి నిర్ణయాలు తీసుకుంటుంది, పోలీసులు, కోర్టుల జోక్యాన్ని కుల పెద్దలు అంగీకరించకపోవడం విశేషం. వ్యక్తులు కులపరమైన రివాజులను అతిక్రమిస్తే వారికి కుల పంచాయతి జరిమానా విధించడం పరిపాటి. బుడగ జంగాల విషయంలో కుల సమాజం అంటరానితనాన్ని పాటించదు. వారికి హిందూ దేవాలయ ప్రవేశార్హ  త గుర్తించబడుతుంది. కానీ వారు మాత్రం సాటి జంగములైన మాల, మాదిగలను సమానంగా చూడక వారి కంటే తాము పై స్థాయి వారమని భావించడం గమనార్హం.  చనిపోయిన వారిని యితర సూద్రకులాల జంగాలు కూర్చోబెట్టి స్మశానానికి తీకుకెళ్తే బుడగ జంగాలు మాత్రం పాడె కట్టి తీసుకెళ్ళి దహనం చేస్తారు. చనిపోయిన మూడో రోజు దినం చెయ్యడం వారి సంప్రదాయం.

బుడగ జంగాల మతాచారాలు యితర హిందువుల కంటే కొంత మేరకు భిన్నంగా వుండడం విశేషం. వారు మాతృ దేవతలైన యెల్లమ్మ, పోచమ్మ, వన దేవతలు వంటి స్త్రీ దేవతలను ఆరాధిస్తారు. వారి కంటే తమ పితృదేవతలను యెంతో నిష్టతో పూజిస్తారు. పితృదేవతలను ‘పెద్ద గోశాయి’ అంటారు. వారి కొరకు పూజలు చేస్తూ నైవేద్యంగా పందిని గానీ, కోడిని గానీ కోసి ఆ మాంసాన్ని ప్రత్యేక పద్ధతిలో వొండుతారు. కూరలో మసాలా దినుసులు, వుల్లిపాయలు, నూనె వెయ్యకుండా వుప్పు, కారం, కల్లు లేక సారా కలిపి వొండుతారు. వొండిన మాంసాన్ని ఆకుల్లో పెట్టి భూమి మీద మూడుసార్లు పెట్టి సారా లేదా కల్లును కూడా పోస్తారు. పితృదేవత అయిన పెద్ద గోశాయికి పెట్టే నైవేద్యాన్ని ‘నల్ల పట్టు’ అంటారు. బుడగ జంగాల యింటిపేర్లు కూడా ప్రత్యేకంగా వుంటాయి. అవి ‘ఇంగువ’, ‘టేకు’, ‘బయల్పాటి’, ‘ముగ్గు’, ‘ సింగిడి’,  ‘ప్రసాదం’, ‘కళ్యాణి’, ‘గోటూరి’, ‘పస్తం’, ‘మోటూరి’, ‘వ్పురుత్తపు’ మొదలైనవి.

బుడగ జంగాల సామాజిక జీవనంలో వైయుక్తికత కంటే సామూహికతే యెక్కువ. స్త్రీ పుషులిద్దరూ వివిధ కళా రూపాలను గానం చెయ్యడం ప్రధానంగా వుంటుంది. వాటిలో చారిత్రక గాధలైన ‘బొబ్బిలి యుద్ధం’, ‘తిమ్మరాజు కధ’, ‘బాల నాగమ్మ కధ’ , ‘ఆరు మరాఠీలు’, ‘దేశింగరాజు కధ’ మొదలైనవాటిని తంబుర, బుడిగె వాయిస్తూ గానం చేస్తారు. ప్రధాన గాయకుడు  తంబుర మీటుతూ కధ చెబితే పక్కనుండే వంతలు బుడిగె వాయిస్తారు. ‘తుపాకి రాముడు’, ‘బోడి బాపనమ్మ’, ‘బాలసంతులు’, వంటి వేషాలు వేసుకుని ఆయా కధలు చెబుతారు. వారు చెప్పే కధల్లో ‘శారద కధలు’, ముఖ్యమైనవి కాబట్టి వారిని ప్రజలు ‘శారద గాళ్ళు’ అంటారు. ‘తోలుబొమ్మలాటలు’, ‘పగటి వేషాలు’, ‘కాటిపాపల వేషాలు’, ‘మందెచ్చు’ ల వేషాలు కూడా ప్రదర్శిస్తారు. మగవాళ్ళు కూడా యెక్కువగా జుట్టు పెంచుకుని కొప్పు పెట్టుకుంటారు. అది వారికి తమ కళా ప్రదర్శనలో వేషానికి బాగా వుపయోగపడుతుంది.  తమ వేషాలకు కావల్సిన చీరలు, యితర వస్త్రాలు, కిరీటాలు, ఆభరణాలు యాచనలో సంపాదిస్తారు. వారి ప్రదర్శన చూసిన జనం యెంతో కొంత ధాన్యం, చిల్లర డబ్బులు కానుకగా యిస్తారు. పై కులాల జంగములు చనిపోయినప్పుడు బుడగ జంగాలు పాట పాడి కధ చెప్పడం ఆనవాయితీ.

బుడగ జంగమ కులం తెలంగాణా, కర్ణాటక, మహారాస్ట్ర, తమిళనాడు రాస్ట్రాలలో షెడ్యూలు కులంగా రికార్డుల్లో నమోదైతే ఆంధ్ర ప్రదేశ్ లో 1976 లో 108 వ  ఆర్టికల్ ప్రకారం వారిని షెడ్యూలు కులం గానే గుర్తించినప్పటికీ తర్వాత 2008 లో వారిని యెస్సీ జాబితా నుంచి తొలగించి యితర సాధారణ కులాల మాదిరిగా గుర్తిస్తున్నారు. దీనిపై బుడగ జంగాలు తీవ్ర అసంత్రుప్తితో వున్నారు. సాంఘిక, ఆర్ధిక రంగాలలో యెంతో వెనుకబడి  అభివృద్ధికి ఆమడదూరంలో వున్న తమను యెస్సీ జాబితాలో చేర్చి విద్య, వుద్యోగాలలో ప్రభుత్వం రాయితీలు కల్పించవల్సిందిగా  వారు ఆందోళన  చేస్తున్నారు. బుడాగ జంగాల సంక్షేమ సంఘం యీ దిశగా యెన్నో సభలు సమావేశాలు నిర్వహిస్త్తూ వారి ఆకాంక్షలను అధికారులకు తెలియజేస్తున్నారు.

జంగమ కులాలలో పై అంతస్తులో వుండేవారు  ‘లింగాయతులు’ లేక ‘జంగమ దేవరలు’. వారు వీరశైవ మతాచారం ప్రకారం లింగధారణ చేసి ఆదాయ వనరులు బాగా వుండే పెద్ద పెద్ద శివాలయాలలో పూజారులుగా వుంటారు. వారికీ బుడగ జంగాలకీ పెద్దగా సంబంధాలు వుండవు. అందరూ వీరశైవ సంప్రదాయంలోనివారే అయినప్పటికీ లింగాయతులకీ యితర జంగాల కులాలకు కూడా కంచం పొత్తు, మంచం పొత్తు వుండవు. వీరశైవం సమానత్వాన్ని బోధించినప్పటికీ కాల క్రమంలో ఆ మతం ద్వారా ఆవిర్భవించిన జంగమ కులం కూడా కుల వ్యవస్థలోని అసమానతలు, వివక్ష వంటి అవలక్షణాలకు మినహాయింపు కాలేక పోయిందడానికి యిదే తార్కాణం.

 

(సమాచారాన్ని అందించిన బుడగ జంగమ కులసంఘం నాయకుడు సత్యన్నారాయణ గారికి, సంచార జాతుల హక్కుల సంఘం అధ్యక్షుడు పండ్ర వీరన్నకూ ధన్యవాదాలు)

 

చల్లపల్లి స్వరూప రాణి

2 comments

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

  • బేడ/బుడగ జంగాలను కేవలం తెలంగాణా పది జిల్లాలకే పరమితం చేసే రాష్ట్రపతి ఉత్తర్వు 2002 సం.లో వెలువడింది. సాధారణంగా అలాంటి సవరణ రాష్ట్ర ప్రభుత్వాల నివేదికల , నివేదనల ఆధారంగా జరుగుతాయి. కానీ 2002 రాష్ట్రపతి ఉత్తర్వుకు కారణమేమిటని మేము 2002 నుండీ ఆన్వేషిస్తూనే వున్నాము. ఇంతవరకూ ఒక డాక్యుమెంట్ దొరకలేదు.
    ఆ పిమ్మట కర్నూలు కలెక్టర్ తో చర్చించి ఒక ఎన్క్వైరీ కమిటీ వేయించాము. ముగ్గురు జిల్లాస్థాయి అధికారుల ఆ కమిటీ సమగ్రమైన పరిశీలన చేసి కర్నూలు జిల్లా లోని బేడ/ బుడగ జంగాలు పొరుగునున్న మహబూబ్ నగర్ జిల్లా నుండీ వలస వచ్చారని స్పష్టంగా నిరూపించారు. ఆ నివేదిక ఆధారంగా ఈ సముదాయం s.c. కుల ధృవీకరణ పత్రాలు పొందుతూ వచ్చింది.
    2008 సం.లో దార సాంబయ్య అనే ప్రజాప్రతినిధి వత్తిడి కారణంగా ఆం.ప్ర. ప్రభుత్వం G.O . 144 విడుదల చేసింది. ఈ ఉత్తర్వు కారణంగా ఆం.ప్ర. లోని బుడగ జంగాలు పూర్తిగా తమ ఉనికిని కోల్పోయారు. హక్కులు కోల్పోయారు. దళితుల్లోని ఒక అత్యంత శక్తివంతమైన ఉపకులమొకటి వీరి హక్కుల హరణ లో ప్రధాన పాత్ర పోషించడం విషాదకర వాస్తవం.
    న్యాయం కొరకు ఈ అత్యంత బలహీనమైన , నిరుపేద సముదాయం యొక్క ఆన్వేషణ సాగుతూనే వుంది.
    కర్నూలు జిల్లాలో వీరి పోరాటానికి అద్భుత నాయకత్వం వహించిన నారాయణ , తూర్పాటి మనోహర్ తదితరుల ను వీలైనప్పుడు సంప్రదిస్తే చాలా లోతైన ఉద్యమ వివరాలు బయటపడగలవు.
    మరుగున పడిన అత్యంత పీడిత సముదాయం గురించి రాసినందుకు ధన్యవాదాలు.

  • నమస్కారం గౌరవ రచయిత గారికి మీరు రాసిన ఆర్టికల్ చాలా బాగుంది…. బుడగ జంగాలు గురించి నాకు తెలిసిన సమాచారం
    బుడగ జంగాలు వాల్మీకీ బోయ కులస్తులలో కొన్ని గోత్రాలవారు ఉదాహరణకు నలబోతుల గోత్రం వారు ముందు నరసింహ స్వామి సేవ చేస్తారు అందరూ ఒక్క పొద్దులతో………పెళ్ళి కుమారుడు నెత్తిన కళశంతో ఊరంతా తిరిగి వీర కత్తుల తో వీరంగం….. భజన పలకులతో భజన చేసుకుంటూ…..నిప్పు కాగడావతో……కోలాహలంగా నరసింహ స్వామి సేవ చేస్తారు ఈ సేవలో మగ మరియు,ఆడవారికి ఆ గోత్రాలవారికి లేదా ఆ వంశ ఆడబిడ్డడలకు పూనకాలు రావడం జరుగుతుంది…. సేవలో ఈ జంగాలు వచ్చి పాల్గొని ..నరసింహ స్వామి సేవ దగ్గర వుండి అత్యంత భక్తి శ్రద్ధలతో..పూర్తి…. చేసి….బోయలు ఇచ్చిన ఇనామ్…లేదా కట్టడి తీసుకొని ….బోజనం చేసి వెలతారు…

‘సారంగ’ కోసం మీ రచన పంపే ముందు ఫార్మాటింగ్ ఎలా ఉండాలో ఈ పేజీ లో చూడండి: Saaranga Formatting Guidelines.

పాఠకుల అభిప్రాయాలు