ముస్లిం సాహిత్యంపై చిన్నచూపు: షరీఫ్

చాసో  స్ఫూర్తి పురస్కారం  అందుకుంటున్న  సందర్భంగా  మీకు   అభినందనలు  షరీఫ్ .

  • కథా ప్రపంచంలో మీ ప్రయాణం  ఎప్పుడు మొదలైంది?  రాసిన మొదటి కథ ఏది?  అచ్చులో చూసుకున్న కథ ఏది?

నాకు చిన్నప్పటి నుంచే కథలంటే ఆసక్తి ఉండేది. రాసి పంపాలనే ఆలోచన మాత్రం ఇంటర్మీడియెట్ చదువుతున్నప్పుడు చేశాను. ఏం రాసినా తిరిగొచ్చేవి. ఒకసారి వార్త పత్రిక నుంచి Rejected అని కవర్ వస్తే ఇంకేదో అనుకుని చూశాను. అప్పట్లో ఆ పదానికి అర్థం తెలియదు మరి. నిజానికి ఆ పదం నాకు డిక్షనరీ చూసే అలవాటు నేర్పింది. డిక్షనరీలో ఆ పదానికి అర్థం తెలుసుకుని చాలా బెంగ పెట్టుకున్నాను. బెంగ అంటే కళ్లవెంబడీ నీళ్లు వచ్చేశాయి. రాయగా..రాయగా.. చివరికి కథ తిరిగి రావడం మీదే పిల్లల కథ రాశాను. దాని పేరే “పరిశీలన’. ఈ కథ 1999లో అనుకుంటా వార్త మొగ్గలో అచ్చయ్యింది.

కానీ సీరియస్ రైటింగ్ వైపు వెళ్లింది మాత్రం 2003లో. అప్పుడు నేను ఆదివారం ఆంధ్రజ్యోతిలో ట్రయినీ సబ్ ఎడిటర్ గా “వేమన వసంతలక్ష్మి’’గారి దగ్గర పనిచేస్తున్నాను. అక్కడ సండే కోసం  వచ్చే కథలు చదువుతుంటే నాకు పిచ్చెక్కిపోయేది. ఓహో కథంటే “నీతి కాదు జీవితం’’ అనే సత్యం అక్కడే తెలిసింది. అక్కడుండగానే “జీపొచ్చింది’’ కథ రాశాను. నా మొదటి కథను చదివి బావుందని  ప్రచురించి ప్రోత్సహించినందుకు వసంత లక్ష్మి గారి మేలు ఎప్పటికీ మరువలేను.

  • కథతో జీవితాన్ని చెప్పేటప్పుడు మీరు తీసుకునే  జాగ్రత్తలు, పాటించే మెళకువలు ఏమిటి?

నా మీద నాకే ఒక చిన్న కంప్లయింట్ ఉంది. కథలు రాయాలనే దృష్టితో జీవితాన్ని పరిశీలించకపోవడం. జీవితంలో ఎదురయ్యే కొన్ని సంఘటనలే కథలు రాయమని చెబుతుంటాయి. అప్పుడు మాత్రమే రాస్తాను. కొంత అబ్జర్వ్ చేస్తే మరిన్ని రాయొచ్చేమో. మనం అబ్జర్వ్ చేసి రాసేవి అంత క్వాలిటీగా ఉంటాయా..లేదా  అనేది వేరే చర్చ. కానీ రాయకుండా ఉండలేని సంఘటనలే కథలుగా రాస్తే చిక్కగా ఉంటాయి. ఇక అప్పుడు ఏ మెళకువలూ అక్కర్లేదు. ఆ సంఘటనే వస్తువై. శిల్పమై, శైలియై తనదారి తాను వెతుక్కుని చివరికి కథగా మారి నిలుస్తుంది.

  • కథలు రాయడం, అచ్చు కావడం  మొదలయ్యాక మీ మొదటి కథా సంపుటి  రావడానికి ఎంత కాలం పట్టింది? మొదటి  సంపుటి జుమ్మాకి వచ్చిన  స్పందనల్లో విలువైనవి చెప్పండి?

నేను సీరియస్ గా రాయడం మొదలుపెట్టింది 2003లో అని చెప్పాను కదా.  నా మొదటి కథల సంకలనం జుమ్మా 2011లో వచ్చింది. అంటే దాదాపు ఎనిమిది.. తొమ్మిదేళ్లు. ఏడాదికో కథ రాస్తే అదే పెద్ద విషయం. ఇప్పటికీ ఇంతే. చాలా మెల్లగానే రాస్తాను.

క్షమించాలి. నాకు విలువైన స్పందనలంటూ ప్రత్యేకంగా ఏమీ లేవు. అన్ని స్పందనలూ విలువైనవే. ఒక్కోసారి ఆ స్పందన మనకు నచ్చచ్చూ.. నచ్చకపోవచ్చు.. అంతేకానీ వాటి విలువలో ఎలాంటి తేడా నేను చూడలేదు. చూడబోను.

  • బాల పాత్రల జీవిత  చిత్రణ  చేస్తూ కథ చెప్పే ఒక ఒరవడి  తెలుగు కథా ధోరణుల్లో  ఉన్నది, మీకు ఎలా  ప్రేరణ  అయింది?

ఇక్కడ ఒక విషయం ఒప్పుకోవాలి. నేను ఆదివారం ఆంధ్రజ్యోతిలో పని చేస్తున్నప్పుడే మహమ్మద్ ఖదీర్ బాబు “పోలేరమ్మ బండ కథలు’ రాశారు. అతను వసంత లక్ష్మిగారి చాంబర్ లో ఉన్న కంప్యూటర్ దగ్గర కూర్చుని సాయంత్రం ఏ ఐదు గంటలకో మొదలుపెట్టి  రాత్రి ఏడెనిమిదాక కథ రాసేవాడు. నాకున్న సహజమైన ఆసక్తితో అక్కడే ఉండి అతను రాయడం అయిపోజేసి కంప్యూటర్లో ప్రింట్ ఆప్షన్ కొట్టగానే ప్రింటర్ దగ్గర వాలిపోయి చదివేవాణ్ని. అలా వేడివేడి కాపీలు చదివి తోచిన అభిప్రాయమేదో అతనికి చెప్పేవాణ్ని. చాలాసార్లు ఆ కథల్ని గతంలా కాకుండా వర్తమానంలా చెబితే బావుండు అనిపించేది. ఆ గతాన్ని ఆసరా చేసుకుని వర్తమానానికి అన్వయించి చెబితే మంచి కథలు పండుతాయి అనుకున్నాను. చాలా కథల్లో నేను అదే చేశాను.

  • అలా బాల పాత్రలను  చిత్రించిన రచయితల్లో మీకు ఇష్టమైన రచయితలు, వారి  కథలు  తెలపండి.

చెప్పాను కదా నేను బాలల రచయితగానే మొదలయ్యాను అని. బాలల కోసం రాయడంలో నాకు ఆనందం ఉంది. రాసేటప్పుడు నాకు తెలియకుండానే నా మనసు ఆ పిల్లల వయసులోకి మారిపోయి నాకు మళ్లీ బాల్యాన్ని అనుభవిస్తున్న తృప్తి కలుగుతుంది. చదువుతున్నప్పుడు కూడా నా మనసు అలాంటి అనుభూతినే పొందుతుంది. నాకు ఇప్పటికీ ఆర్కే నారాయణ్ మాల్గుడి కథలు, ఖదీర్ బాబు దర్గా మిట్ల కథలు, నామిని సిన్నబ్బ కథలు అంటే ఇష్టం. కానీ అంతకన్నా ఎక్కువగా ప్రేమ్ చంద్ అంటే ప్రాణం. అతను పిల్లల పాత్రలను అడ్డం పెట్టుకుని చాలా పెద్ద విషయాలు మాట్లాడతాడు. నోస్టాల్జియాకు నోస్టాల్జియా… జ్ఞానానికి జ్ఞానం. అతని ఈద్గా కథ ఎన్ని సార్లు చదివి ఉంటానో నాకే తెలియదు. ఈ నేలమీద రంజాన్, బక్రీద్ పండగలు ఉన్నంతవరకు నాలో ప్రేమ్ చంద్ బతికే ఉంటాడు. అందులో పిల్లాడు హమీద్ పదేపదే గుర్తుకు వస్తుంటాడు.

  • సంప్రదాయం, వైయక్తిక ప్రతిభ, ఆధునిక చింతన,  ప్రగతి శీలత, వీటిని  మీరు ఎలా అర్థం చేసుకుంటారు? ఒకింత  వివరణ.

ఇవన్నీ చాలా పెద్ద మాటలు కానీ తోచింది చెబుతాను. రచయిత అనేవాడు ప్రగతిశీలంగా ఉంటేనే సమాజానికి మంచిది. మరి ప్రగతిశీలంగా ఆలోచించే వ్యక్తికి మిగతా మూడింటిపై తప్పకుండా స్పష్టత ఉంటుంది. కాకపోతే దేన్ని ఎంతవరకు మోయాలో తెలియకపోవడం ఇప్పటి జెనరేషన్ ఎదుర్కొంటున్న పెద్ద సమస్య. పూర్తి ప్రగతిశీలం, పూర్తి సంప్రదాయం, పూర్తి ప్రతిభ, చింతన కేవలం ఆలోచన వరకే సాధ్యమవుతాయి.

  • సమాజంలో భిన్న సంబంధిత వర్గాల మధ్య సంయమనం, సహజీవన లక్షణం పెంపొందండంలో రచన పాత్ర ఏమిటి?

సమాజంలో ఇప్పుడు శాంతి, సహనాన్ని కోరుకుంటూ ఎక్కువగా రచనలు చేస్తోంది ముస్లిములే. వాళ్లకు మాత్రమే ఇప్పుడు ఆ అవసరం ఎక్కువ ఉంది. చుట్టూ ఉన్న యాంత్రిక జీవితం, మనుషులు అనేక అంశాల గురించి స్పందించమని ప్రేరేపిస్తున్నా వాళ్లు తమను తాము నిగ్రహించుకుని నిబద్ధతగా సహజీవన సౌఖ్యాన్ని కోరుతూ రచనలు చేస్తున్నారు, దాన్ని మనం అభినందించాలి. ఒకవైపు సొంత మత సామాజిక వర్గంలోని ప్రజల్లో చైతన్యం కోరుతూ మరోవైపు మెజార్టీ మత సమూహాల్లోని ప్రజల్లో సంయమనం కోరుతూ రచనలు చేస్తున్నారు. భారతదేశంలాంటి ప్రజస్వామ్య దేశాలకు ఇంతకన్నా మంచి రచనలు ఏముంటాయి. అందుకే వీటిని పాఠ్యపుస్తకాల్లో చేర్చి భవిష్యత్ తరాల్లోనైనా భేషజాలు కొంత తగ్గేలా  జాగ్రత్త తీసుకోవాలి.

రచన సామాజికం అనే అంశాన్నినేను నమ్ముతాను. కాదు వ్యక్తిగతం అనేవాళ్లూ ఉన్నారు. వాళ్లనూ గౌరవిస్తాను. కానీ నా మటుకు నేను సాహిత్యం కళ్ల నుంచి సమాజాన్ని, సమాజం కళ్ల నుంచి సాహిత్యాన్ని చూస్తాను. అందుకే సమాజంలో విలువలు హెచ్చుదగ్గలైనప్పుడు వాటిని సమాంతరంగా ఉంచడానికి రచయితలకు రచనే శ్రేయస్కారం అని చెబుతాను. సమాజ చైతన్యానికి రచన తప్పనిసరిగా ఒక వాహిక. అందుకు ప్రపంచదేశాల చరిత్రే ఒక సాక్ష్యం.

 మీ కథల పై వచ్చిన విమర్శ లో మీకు నచ్చినదీ, మీరు జాగ్రత్త  తీసుకోదలచిన  అంశాలు  ఏవైనా ఉన్నాయా? వాటి గురించి.

విమర్శ లేదని రచయితలూ… విమర్శిస్తే తట్టుకునేవారు లేరని విమర్శకులు అంటున్నారు. నా వరకు నేను సద్విమర్శను స్వీకరించడానికి ఎప్పుడూ సిద్ధంగానే ఉంటాను. నేను పర్దా కథ రాసినప్పుడు ఆంధ్రజ్యోతి వివిధలో ఒక విమర్శ వచ్చింది. కథ, రచయిత స్వగతంలో (ఉత్తమ పురుషలో) ఉన్నప్పుడు వాళ్ల జేజి మనసులో ఉన్న విషయాలు అతనికెలా తెలిశాయి అని. నిజమే. అది పొరపాటే. శిల్పపరంగా ఆ లోపం కథలో ఉంది. నేను గమనించలేదు. తర్వాత రాసే కథల్లో ఆ పొరపాటు చేయలేదు.

  • మీ కథల అనువాదాలు, ఆయా భాషల్లో పాఠకులు, మిత్రుల నుంచి మీ దాకా   వచ్చిన  ప్రతిస్పందనలు గురించి తెలపండి.

ఇవ్వాళ ముస్లిమ్ జీవిత కథలంటే అవి అంతర్జాతీయ కథలు. ప్రపంచవ్యాప్తంగా ముస్లిములు ఎదుర్కొంటున్న వివక్షే ఆ సాహిత్యానికి విలువ తెచ్చి పెట్టింది. అది గమనించకుండా మనవాళ్లు సహజంగానే అస్తిత్వ ఉద్యమ సాహిత్యాల పట్ల ఉన్న చిన్నచూపుతో ముస్లిం జీవిత సాహిత్యాన్ని కూడా చూస్తున్నారు. దీంతో అవి తెలుగులో ఎవరికీ పట్టకుండా ఉన్నాయి కానీ పక్క రాష్ట్రాల్లో, పక్క భాషాల్లో మాత్రం ఇక్కడికన్నా ఎక్కువగా ఆదరణ పొందుతున్నాయి.

2007లో హైదరాబాద్ లో జరిగిన మక్కా మసీదు బాంబు బ్లాస్ట్ నేపథ్యంలో నేను రాసిన “జుమ్మా’ కథను ఉస్మానియా యూనివర్సిటీలోని ఇంగ్లీష్ ప్రొఫెసర్ పోపూరి జయలక్ష్మి’ గారు అనువాదం చేసి “మ్యూజ్ ఇండియా డాట్ కామ్’ అనే పత్రికకు పంపారు. భారతదేశంలోని ఉత్తమ ప్రాంతీయ కథల పోటీల్లో ప్రత్యేక ప్రోత్సాహక రచన కింద “జుమ్మా’ను పేర్కొని వాళ్లు ప్రచురించారు. అక్కడ దాన్ని చదివి “మైథిలీ’’ భాషలోకి అనువాదం చేయడానికి బీహార్లోని “వైదేహి’’ అనే పత్రిక వాళ్లు అనుమతి అడిగారు. అలా మొదలైన నా కథల అనువాదం మెల్లగా హిందీ, ఇంగ్లీషు,కన్నడ, కొంకణి భాషల వరకు కొనసాగింది. కన్నడలో ఈ మధ్యే అక్కడి ప్రభుత్వం “జుమ్మా’’ కథల పుస్తకాన్ని ఉత్తమ అనువాద కథల పుస్తకంగా ప్రకటించి బహుమతి ప్రదానం చేసింది. నాకు తెలిసి ఇటీవల కాలంలో ఇలా తెలుగు నుంచి వెళ్లిన కథలకు ఇంతటి గౌరవం దక్కడం నేను వినలేదు. కన్నడలో పాఠకుల దగ్గర్నుంచి రచయితల వరకు “జుమ్మా’’ పుస్తకాన్ని గుర్తుపట్టి మాట్లాడుతారు. అది సంతోషాన్ని కలిగించే విషయం.

  • సామాజిక మాధ్యమల్లో సాహిత్యం, భిన్న రూపాలు తీసుకోవడం జరుగుతున్నది. ఈ మార్పులో కథా పఠనం  నుంచి, కథా శ్రవణం దాకా, ఇంకా వీలైతే, కథా  చిత్రం దాకా  వెళ్ళే వేగం పెరుగుతున్నకాలంలో  రచయితలు ఎక్కువ మంది  ప్రజలకు ఎలా  చేరువ కాగలరు? ఇందులో మీ పాత్ర ఏమిటి?

నడుస్తోంది సాంకేతిక యుగం. ఇందులో ప్రజలకు దగ్గర కావాలంటే రచయితలు తప్పనిసరిగా సాంకేతికతను అందిపుచ్చుకోవాల్సిందే. తెలుగులో ఇప్పుడిప్పుడే ఆ దిశగా అడుగులు పడుతున్నాయి. చాలా కథల్నినెటిజన్లు షార్ట్ ఫిల్ములుగా తీస్తున్నారు. కొందరు సినిమాలు తీయడానికి ప్రయత్నిస్తున్నారు. మరికొంతమంది సామాజిక మాధ్యమాల్లోప్రత్యేక సమూహాలను నడుపుతున్నారు. నేను ఇటీవలే “కథనం’’ అనే యూట్యూబ్ చానల్ ని మొదలుపెట్టాను. ఇందులో కథలు చదివి వినిపించే ప్రయత్నం చేస్తున్నాను. ఈ మధ్య కాలంలో ఎప్పుడైనా ప్రయాణాలు చేస్తుంటే రాత్రిపూట బస్సుల్లో కుర్రాళ్లు ఎక్కువగా యూట్యూబ్ చూస్తూ కనబడుతున్నారు. మరి వారికి సాహిత్యం గురించి తెలియాలంటే ఏదో ఒకటి చేయాలనిపించింది. ఆ ప్రేరణతో చానల్ మొదలుపెట్టాను. సమస్య ఎక్కడుందంటే దాన్ని ఈ తరం కుర్రాళ్ల దగ్గరకు చేర్చడంలో ఉంది. రచయితలే స్వచ్చందంగా స్పందించి ఆ చానల్ గురించి నలుగురికీ చెబుతున్నారు. అది చాలు కొంత ఆలస్యంగానైనా అది అనుకున్న ఫలితాలు సాధించడానికి.

  • చాసో కథల్లో మీకు  నచ్చిన ఈ రచనా లక్షణాలను,   మీరు అనుకునే ప్రాథమ్య  క్రమంలో  చెప్పండి.
    1. ఇతివృత్తం. నిడివి. 3. శైలి. 4. సామాజిక దృష్టి. 5. కొత్తదనం. 6. భాష
    2. 7. ప్రాంతీయత
  1. కొత్తదనం 2. ఇతివృత్తం 3. సామాజిక దృష్టి 4. ప్రాంతీయత 5. శైలి 6. భాష
  2. నిడివి
  • తన కథల పై సరైన  విమర్శ రాలేదు అన్నారు చాసో. మీరు మీ కథల పై  ఎటువంటి  విమర్శను  కోరుతున్నారు?

విమర్శ అనేది అర్థవంతంగా, సహేతుకంగా, ఆచరణాత్మకంగా ఉండాలి. అంతేకాదు అది శాస్త్రీయతకు నిలబడాలి. అలాంటి విమర్శను నేను ఎప్పుడూ ఆహ్వానిస్తాను. మనం ఇతర భాషల్లో గమనిస్తే యువ విమర్శకులు ఎంతోమంది తయారవుతున్నారు. కానీ మన దగ్గర అలాంటి పరిస్థితి లేదు. యూనివర్సిటీల్లో సాహిత్య పరిశోధన బలంగా లేనంతకాలం విమర్శకుల లోటు తెలుగునాట ఉంటుంది.  అంతేకాదు ఇప్పుడు చాలామంది సీనియర్ రచయితలు సాహిత్య అధ్యయనం చేస్తున్న కుర్రాళ్ల భుజాల మీద చేతులు వేసి “నువ్వు కథ ఎందుకు రాయవు? కవిత్వం ఎందుకు రాయవు? అని అడుగుతున్నారు తప్పితే “నువ్వు విమర్శ ఎందుకు సాధన చేయడం లేదు’’ అని అడగడం లేదు. తెలుగు విమర్శ అనుకున్నంత లేకపోవడానికి స్వయం కృతం కూడా కొంత కారణమని నా అభిప్రాయం.

  • వేగంగా కథలు రాసే రచయితల జాబితాలోకి మీరు రారు. కథ రాసేలా మిమ్మల్ని కదిల్చాక, అతి తక్కువ సమయంలో రాసిన కథ ఏది. అలాగే  రచన  బాగా  ఆలస్యంగా జరిగిన కథ ఏది?

కథ రాయాలి అని నిర్ణయించుకున్నాక అది ఎలా రాయాలి అన్నది మనసులోనే మధనం జరుగుతుంది. ఆ మధనం పూర్తిగా జరగకముందే రూపం వచ్చేసిందనుకుని పొరపడుతుంటాము చాలాసార్లు.  అలాంటప్పుడు కథ ఆలస్యమవుతుంది. మరికొన్ని సార్లు రూపం పూర్తిగా వచ్చేసిన కూడా ఒకటికి రెండుసార్లు నిర్ధారించుకున్నాక కానీ రాయడానికి పూనుకోము. అలాంటప్పుడు కథ త్వరగానే అయిపోతుంది.  అయితే ఇక్కడ మరో చిన్న చిక్కు ఉంది. ఒక్కోసారి మనసులో రూపం ఏర్పడకుండానే ఏర్పడిందనుకుని కథకు కూర్చోవడం వల్ల రాయాలనుకున్న కథకన్నా ఇంకేదో రాసి అది మంచి కథ అయ్యే అవకాశమూ ఉంది.  కానీ అది చాలా అరుదుగా జరుగుతుంది.

నా మటుకు నాకు బాగా ఇబ్బంది పెట్టిన కథలు రజాక్ మియా సేద్యం, తలుగు. రజాక్ మియా సేద్యం ఎంతకూ తెగక అలా గంటల తరబడి కంప్యూటర్ ముందు కూర్చోవడం వల్ల నాకు సైట్ ఉందన్న విషయం బయటపడింది.  ఇక తలుగు కథ అప్పుడు ఏకంగా సిక్ అయిపోయాను. అయినా ఆ కథకు నా మీద జాలి కలగలేదు.  అనేక సార్లు తిరగ రాస్తే కానీ ఒక కొలిక్కి రాలేదు.

  • మీకింత వరకూ పరిచయమైన ప్రపంచ సాహిత్యంలో మీకు  నచ్చిన రచన గురించి?

నాకు ఒక్కటనీ కాదు ప్రపంచ సాహిత్యంలో చాలా పుస్తకాలు నచ్చుతాయి. వాళ్లు ఏదైనా ఒక అంశాన్ని తీసుకుంటే  దాన్ని పూర్తి స్థాయిలో అధ్యయనం చేసి కానీ రాయరు. అధ్యయనం అంటే అలా ఆషామాషీగా కాదు. ఇక అది కంప్లీట్ నాలెడ్జ్ అన్నమాట. అందుకే వాళ్లు నవలలు రాయడానికి చాలా సమయం తీసుకుంటారు. ఒక్కో పుస్తకం కోసం ఐదేళ్లు, పదేళ్లు కూడా శ్రమ చేస్తుంటారు. అలా చూసినప్పుడు నాకు రూట్స్, అల్కెమిస్ట్, మొన్నామధ్య వచ్చిన ఒక దళారి పశ్చాత్తాపం, అమ్మ, విరాట్, మొదటి ఉపాధ్యాయుడు, జమీల్యా ఇలా చాలా ఉన్నాయి. ఏ నవల తీసుకున్నా ఆయా కాలాల సామాజిక, సాంస్కృతిక, రాజకీయ సమస్యలు కూడా ప్రభావ వంతంగా చిత్రించడం నాకు నచ్చుతుంది. ఆదర్శంగా తీసుకోవాలనిపిస్తుంది.

  • ఒక యువకునిగా, రచనా రంగంలో కథకునిగా మీ ప్రయాణంలో ఇంతవరకూ ఎక్కువ సంతృప్తి కలిగిన  సందర్భం ఏది? ఈ  ప్రయాణంలోనే ఇంకా బలంగా ఉన్న అసంతృప్తి మాతో పంచుకుంటారా?

సంతృప్తి అనేది ఒట్టి మాట. రాయాల్సినంత రాయలేకపోతున్నాను. చూపాల్సినంత వైవిధ్యం చూపలేకపోతున్నాను. ఇంకా స్పష్టంగా చెప్పాలంటే నవల మీద మనసుంది. ఎప్పుడో ఐదేళ్ల క్రితం విఫలమయ్యాను. నవలంతా పక్కన పెట్టేసి అందులో ఒక సంఘటనను కథగా మార్చి దానికి “తలుగు’’ అని పేరుపెట్టాను. ఆ కథకు మంచి పేరు వచ్చింది కానీ నవలను చంపేశాను కదా ఆ పాపం అంత సులభంగా పోవడం లేదు.

  • చివరిగా చాసో కథల్లో మీకు బాగా నచ్చి, గుర్తుండేది?

అలా చెప్పడం కష్టం. ఆయన కథను దేన్నీ వొదులుకోలేం. ఫలాన రచయిత అనగానే ఆయన రాసిన ఏదో ఒక కథ గుర్తుకొస్తుంది కానీ చాసో  అలా కాదు. ఆయన పేరు చెప్పగానే “చాసో కథలు’ అనే పుస్తకం గుర్తుకువస్తుంది తప్పితే వాటిల్లో ఏదో ఒక కథే గుర్తు రాదు. అదే ఆయన ప్రత్యేకత.

*

జగద్ధాత్రి

అనేక భాషల సాహిత్యాన్ని ఇష్టంగా చదువుకోవడమే కాకుండా అంతే ఇష్టంగా రాసే జగద్ధాత్రి సాహిత్య వ్యాసాల మీద ప్రత్యేకంగా దృష్టి పెడ్తున్నారు. తెలుగులోకి ఇతర భాషా సాహిత్యాల వెలుగుని ప్రసరిస్తున్నారు.

13 comments

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

  • ఇస్టంగా చదివే పాఠకులకు భాషభేదముంటుందని నేను అనుకోను షరిఫ్ గారు– పోతే వ్యక్తి జీవితమెప్పుడు సమజాన్నిప్రతిఫలించ లేదేమో కాని వ్యక్తులజీవితాలే సమాజము తప్పకుండ అవుతుంది– పరిశీలించి చూడండి– నేను మీ కథలన్ని చదువుతా–మీవే కాదు అఫ్సర్ గారివి ఖదీర్ బాబు వి– అందరికంటే ముందు శరత్- ప్రేంచంద్ వి కూడా–

  • కథా దిగ్గజం చాసో. ఆయన పేరిట గల పురస్కారాన్ని అందుకొన్న ప్రముఖ కథకులు షరీప్ ని
    ‘సరి లేరు నీకెవ్వరు’ జగద్ధాత్రి చేసిన ప్రశ్నోత్తరావిష్కరణం చాలా బాగుంది

  • చాలా ఉపయోగకరమైన ఇంటర్వ్యూ. చిక్కని ప్రశ్నలు, ఆలోచింపజేసే సమాధానాలు. క్లిష్టమైన విషయాలని ఇంత స్పష్టంగా వ్యక్తపరచడం ఇటీవల కాలంలో నేను చదవలేదు. రచయితలందరూ ఈ ఇంటర్వ్యూ ని reference material గా భద్రపరచుకోవాలి అనిపించింది.

  • ప్రస్తుత కాలం లో మనసున్న రచయిత షరీఫ్ గారు. ఆయన నిజాయితే ఆయన్ను మరింత గొప్ప స్థాయికి తీసుకువెళ్తుంది. ప్రతీ ఒక్కరిని రిసీవ్ చేసుకునే గొప్ప వ్యక్తిత్వం ఆయనకే సొంతం. ఎస్. కె. జహంగీర్

  • అవార్డు తీసుకుంటున్నందుకు అభినందనలు..

  • షరీఫ్ ఇంటర్వ్యూ చదువు తుంటే సాహిత్య పరంగా నన్ను నేనే చూసుకొంటున్నట్లు అనిపించింది. నిర్దిష్ట దృక్పథం తో కొనసాగుతున్న షరీఫ్ కు చాసో పురస్కారం సందర్భంగా హృదయ పూర్వక శుభాభినందనలు

  • మంచి ఇంటర్వ్యూ, షరీఫ్ గారికి, జగద్దార్తి గారికీ అభినందనలు

  • “ ప్రేమ్ చంద్ అంటే ప్రాణం, ఈ నేలమీద రంజాన్, బక్రీద్ పండగలు ఉన్నంతవరకు నాలో ప్రేమ్ చంద్ బతికే ఉంటాడు “ అన్నందుకు నీ కాల్మొక్కుతా వేంపల్లి షరీఫ్.

    ( కొన్ని కథలు మన కళ్లల్లో గడ్డకట్టిన కన్నీళ్లని ప్రవహింప చేస్తాయి. మనసు కరిగిపోతుంది. ప్రపంచంలోని గొప్ప కథకుల్లో ఒకడైన మున్సీ ప్రేంచంద్‌ ‘ఈద్‌ పండుగ’ ‘ / ఈద్గా ( మసీదు ) కథ చదివిన వ్యక్తుల కళ్లు ఆ కథలోని హమీద్‌ నానమ్మ అమీనాతో పాటు వర్షిస్తాయి. మనిషిగా ఎలా వుండాలో ఆలోచింప చేస్తాయి. ఈ కథలో ప్రేమా, మానవత్వం అనుబంధం ఎన్నో కలగలిపి ఉంటాయి. )

    ఇస్మత్ ఆపా మీకింకా పరిచయం కాకుంటే మా బెజవాడ పి. సత్యోతక్కయ్య అద్భుతంగా అనుసృజన చేసిన ఇష్మత్ చుగ్తాయ్ కధల పుస్తకాన్నిమీ దృష్టికి తీసుకురావచ్చా?

    కథకుల కథకుడు చాగంటి సోమయాజులు, చాసో గారి ” ఎందుకు పారేస్తాను నాన్నా ? ” కథని ఆ తరం నుండి నేటితరం వరకూ పాఠకులు ఇప్పటికీ ఎందుకు మర్చిపోలేకపోతున్నారో వీలుచూసుకుని చెప్పరూ?

    ఆంధ్రజ్యోతిలో ట్రయినీ సబ్ ఎడిటర్ గా “వేమన వసంతలక్ష్మి’’ గారి దగ్గర పని చేసిన మీరు మా అనంటపూర్ అప్ప, హక్కుల సూరీడు బాలగోపాల్ గారి గురించి కూడా చెప్పండి.

    సమాజ చైతన్యానికి రచన తప్పనిసరిగా ఒక వాహిక. అందుకు ప్రపంచ దేశాల చరిత్రే ఒక సాక్ష్యం అన్నందుకు మీ నోట్లో ఓ గుప్పెడు పందార పొయ్యాలని ఉంది షరీఫ్. ప్రజల్లో వర్గ చైతన్యం కోరుతూ, ప్రగతిశీలంగా ఆలోచించి, సామాజిక స్పృహతో రచనలు చేసిన వ్యకులు గురించిన మాట వచ్చినప్పుడు కవి దేవిప్రియ గారు కూడా మాతరం వాళ్లకి గుర్తుకొస్తారు.

    హైదరాబాద్ లోని మక్కా మసీదులో శుక్రవారం ప్రార్థనల సమయంలో జరిగిన బాంబు పేలుళ్ల నేపథ్యంలో మీరు రాసిన కథ జుమ్మా (అంటే ఉర్దూలో శుక్రవారం అని అర్థం ) మేమెప్పుడూ మర్సిపోలేము. గజయీతరాలు కధల మా గొరుసన్న కూడా అట్టా మనసును కదిలించే కధలు రాసాడు తెలుసా ? కడప జిల్లా లోని ఓ మారుమూల దేవమాస పల్లె నుండి వచ్చిన బడుగుడు, దళితుడు, తనకబ్బిన బహుముఖీన కళలతో గుర్తింపుపొందుతున్న ( కధా రచన, బాతిక్ పెయింటింగ్స్, జానపద గీతాలు రాయడం పాడటం ) బుడ్డగిత్తరంకి కథ పుట్టాపెంచల్దాస్ కూడా మీకు తెలుసు కదూ.

    సాహిత్యం ప్రజలకు దగ్గర కావాలంటే అది భిన్నరూపాలు ( ప్రింట్ పత్రికల మాధ్యం నుండి, అంతర్జాల పత్రికల అందుబాటు సౌలభ్యానికి; . . . ఫేస్ బుక్కు, వాట్సాప్ ల్లోని సామాజిక మాధ్యమాల ప్రత్యేక సమూహాలు ) తీసుకోవాల్సిన అవసరాన్నిగురించి ప్రస్థావించటం ( యూట్యూబ్ చానల్ లో “కథనం’’ శీర్షికన కథలు చదివి వినిపిస్తున్న మీ ప్రయత్నానికి ) హార్ధిక అభినందనలు.

    సామాజిక, సాంస్కృతిక, రాజకీయ సమస్యలు సాహిత్యంలో ప్రభావ వంతంగా చిత్రించడం నచ్చుతుంది అన్న వేంపల్లి షరీఫ్ గారూ! మీ సాహితీ ప్రయాణం ఆ దారిలో ఇలాగే కొనసాగాలని, కొనసాగుతుందనీ నమ్ముతూ

    ఇన్ని విలువైన విషయాలని యీ ఇంటర్వ్యూ ద్వారా ప్రస్థావించిన షరీఫ్ గారికి, జగద్దార్తి గారికీ కృతజ్నతలు.

    చాసో 104వ జయంతి సందర్భంగా 2019 – చాసో స్ఫూర్తి పురస్కార స్ఫూర్తి పురస్కారం అందుకుంటున్న సందర్భంగా మీకు అభినందనలు తెలియజేసుకుంటున్నా వేంపల్లి షరీఫ్ గారూ !

    ~ ఇట్లు, త్రిపుర గారి బెంగళూరు బెమ్మ రాచ్చసుడు

    అవునూ మీ విజయాల వెనక మీకు వెన్నుదన్నులా, అండదండగా నిలిచిన మీ జీవిత భాగస్వామి గురించి ఒక్క ముక్క కూడా సెప్పలేందబ్బా అని అనాలని ఉంది . . . తంపుల మారి రావయ్యా అని మా గొరుసన్న ఖోంపడ్డా !

‘సారంగ’ కోసం మీ రచన పంపే ముందు ఫార్మాటింగ్ ఎలా ఉండాలో ఈ పేజీ లో చూడండి: Saaranga Formatting Guidelines.

పాఠకుల అభిప్రాయాలు