1.
వాస్తవానికీ భ్రమకు నడ్మ సన్నని సరళరేఖ కొమ్మను పట్టుకుని యాళ్లాడుతున్న పసితనం.ఫుట్ బాల్ పై పాకుతున్న చీమలా సమతలంపై సాగుతున్న పయనం.ఒక్కపాలిగా వేటకత్తితో వెదురుబద్దను చీల్చినట్టు, గాలిపొరల్ని దునుమాడుతూ దూసుకెళ్తున్న వేగానికి,చేరాల్సిన గమ్యం నిలకడగనే వుంటదని ,ఏండ్లనాటి పచ్చని చెట్టు తాత్వికగీతాల్ని ఆలపిస్తూ చేతులూపుతది
2.
నిలబడ్డచోట వృత్తాల్ని గీసుకుంటూ లోపల ఒక ప్రపంచం,బయటొక ప్రపంచమని బతుకుడు శాతగాక లోలోపలి ప్రపంచంలోకి దొంగలా తొంగి తొంగిజూత్తాంటే,ఏక కాలంలో మూడు ప్రపంచాలు వేటికవే వాటివాటి పనుల్లో మునిగితేలుతూ కొన్ని,ఎదురీదుతూ కొన్ని తారసపడుతయి
3.
మనిద్దరమే ఒకల కళ్లలోకి ఒగలం సూసుకుంట కొయ్యబారిపోయినప్పుడు మన కాళ్ల కింది మట్టిగోళం గిర్రగిర్ర తిరిగే సప్పుడు ఒకే నినాదమై గొంతుచించుకుని ఇనబడుతది.
4.
ఏదీ స్థిరంగ లేదనే వాస్తవాన్ని మనమెప్పటికీ జీర్ణించుకోలేం.మన భ్రమల్లో మనం బతకడమే,మన ఊహల్లో మనం ఊగిసలాడడమే,ఎంతకూ దరిచేరని లక్ష్యాన్ని కలగనడమే మనక్కావలసింది.
5.
మనోవేగాన్ని మించి పయనించాలనే మన కోరిక ఎప్పుడు నెరవేరుతదోనని ఎదురుచూస్తూ వుందాం.
ఒక అడుగు ముందుకేసి…
*
|
Kalale saaphalyaaniki gummaalu
Lakshya saadhana bhrama kaademo?!
భ్రమ కాదని ఒప్పుకుంటాను సార్