పురుషాధిపత్యంపై ‘విసుర్రాయి’

మిగతా స్త్రీవాదుల కథల్లోని పాత్రల్లా  ఈ కథలోని పాత్రలు తిరుగుబాటు చేయవు. కానీ పురుషుడ్ని ఆత్మ విమర్శలోకి తోసేస్తాయి.

రిశోధకురాలిగా, కథా రచయిత్రిగా, నవలా రచయిత్రిగా, విమర్శకురాలిగా, కవయిత్రిగా కీర్తి పొందిన బహుముఖ ప్రజ్ఞాశాలి, విధుషీమణి డా. ముదిగంటి సుజాతారెడ్డి సాహిత్యచరిత్రను రాసిన తొలి రచయిత్రిగా కూడా ప్రసిద్ధిగాంచారు. వీరు ఇప్పటికీ 3 సాహిత్య చరిత్రలు, 6 విమర్శా గ్రంధాలు, 2 యాత్రా చరిత్ర పుస్తకాలు 3 నవలలు, 5 కథా సంపుటాలు, ‘ముద్దెర ’వ్యాస సంకలనం, ‘ముసురు’ ఆత్మ కథను రాశారు. ఇవేగాక ఎన్నో గ్రంధాలకు సంపాదకత్వం వహించారు. వీరి సాహిత్య కృషికి ఎన్నో పురస్కారాలు లభించాయి. ముదిగంటి సుజాతారెడ్డిది భూస్వామిక వారసత్వమే అయినా ఆమె కథలన్నీ ప్రపంచీకరణ, మసకబారిపోతున్న మానవ సంబంధాలు, స్త్రీల సమస్యలు, రైతులు, సామాన్యుల చుట్టే తిరుగుతాయి. ‘నిశ్శబ్దం నిశ్శబ్దం’, ‘గుడిసెలు గుడిసెలు’, ‘మరో మార్క్స్ పుట్టాలే’, ‘మింగుతున్న పట్నం’, ‘వ్యాపార మృగం’లాంటి కథలు వీరికి చాలా పేరు తెచ్చిపెట్టాయి. కొన్ని కథలు ఇతర భాషల్లోకి అనువాదం కూడా అయ్యాయి.  వీరు రాసిన కథల్లోని మరో  విలక్షణమైన కథ ‘విసుర్రాయి’.

అదొక మోస్తరుగా సాగిపోయే కుటుంబం. దాంట్లో భార్య (సక్కుబాయి), భర్త (సుబ్బారావు), వీళ్ళకు ముగ్గురు పిల్లలు రజిత(ఇంటర్మీడియెట్), రాగిణి, సురేష్ (బహుశా 7, 8 తరగతులు అయ్యుండవచ్చు.) ఉంటారు. వీళ్లతో పాటు సుబ్బారావు తల్లి కూడా ఉంటుంది. (ఈమె ఎనభై సంవత్సరాలు పైబడిన వృద్ధురాలు). సక్కుబాయి విసుర్రాయిలాగా తెల్లవారు జామున నాలుగు గంటల నుంచి రాత్రి పడుకునే వరకు ఏదో ఒక పని చేసుకుంటూ ఇంట్లో తిరుగుతూనే ఉంటుంది. భర్త, పిల్లలు లేవక ముందే నల్లా నీళ్ళు పట్టి పెడుతుంది. పిల్లలు లేచాక వాళ్ళకు టిఫిన్లు కట్టి కాలేజీకి, స్కూల్ కు పంపిస్తుంది. చిన్నవాడు సురేష్ “అమ్మా నా ఫ్రెండ్స్ రోజుకో రకం తెచ్చుకుంటారమ్మా! ఉప్మా, పూరీ, బాంబినో నూడిల్స్.. అట్లా రోజుకో రకం తెచ్చుకుంటారమ్మా! ఎప్పుడూ రొట్టెలెనా?” అంటాడు. రాగిణి  మనన్సులో కూడా ఇదే ఉంటుంది కానీ పైకి అనదు. రజిత చేతికి అంది వచ్చిన కూతురే కానీ పొద్దున్నే ఏదో కోచింగ్ కని వెళ్ళి సాయంత్రం అలసి పోయి ఇంటికి వస్తుంది. కూతురి నీరసం చూసి సక్కుబాయి రజితకు ఏ పనీ చెప్పదు.

రజితకు కాలేజీకి క్యారేజీ పట్టుకుపోవాలంటే నామోషి. తన ఫ్రెండ్స్ పాకెట్ మనీ తెచ్చుకొని హాయిగా టిఫిన్ సెంటర్ లో తింటారని అంటుంది. పోనీ టిఫిన్ కు డబ్బులు మీ నాన్నను అడగవే అంటే “అమ్మో! నాన్నను డబ్బు అడిగి లాభం లేదమ్మా! నీకు తెలియదా? పైగా కోపంతో పొదుపుగా ఎట్లా ఖర్చు పెట్టాలో లెక్చరిస్తాడు. ఆయనకు మాత్రం స్నేహితుల్తో పేకాడడానికి, తాగడానికి మాత్రం డబ్బు పుష్కలంగా ఉంటుంది.” అని వాళ్ళ నాన్నను డబ్బు అడగడానికి వెనకాడుతుంది.  ఇదిలా ఉంటే పండగకు కొత్త డ్రస్ కావాలని అడుగుతుంది. సక్కుబాయికి ఏం చేయాలో అర్థం కాదు. సుబ్బారావు ఇంటి ఖర్చులకని నెలకు రెండు వేలిస్తాడు. ఇంటికి, పిల్లలకు ఏ ఖర్చైనా అందులోనే సర్దుకోవాలి. కొనిస్తాలేవే అని అప్పటికి  ఊరడింపు మాటలు చెప్తుంది.

ఒకసారి సక్కుబాయికి బాగా జ్వరం వస్తుంది. పక్క మీది నుంచి లేవలేక పోతుంది. రాత్రి అన్నం ఉంటే పిల్లలు తిని వెళ్లిపోతారు. వాళ్ళకు టిఫిన్ కి డబ్బులు చేతిలో పెడుతుంది. సుబ్బారావు యధావిధిగా ఎనిమిది గంటలకు లేచి బాత్ రూమ్ లోకి వెళ్తాడు. అక్కడ బకెట్లో నీళ్ళు తోడి లేక పోవడంతో షాక్ అవుతాడు. “ఏమే ఎక్కడ చచ్చావ్! బాత్ రూమ్ లో నీళ్లు లేవేమిటి? చాతగాని ముండ! ఏ పనీ వేళకు చేసి చావదు. తినడం, తిరగడం, కబుర్లు చెప్పడం తప్ప ఏ పనీ చేతకాదు. చచ్చుముండ!” అని విసుక్కుంటాడు. చివరికి తానే కింది నుంచి ఒక బకెట్ నీళ్ళు తెచ్చుకొని స్నానం చేసి ఆఫీసుకు వెళ్ళిపోతాడు. భార్యను కనీసం జ్వరం ఎలా ఉంది? మందులు వేసుకున్నావా? డాక్టర్ దగ్గరికి తీసుకెళ్లాలా? అని కూడా అడగడు.

మధ్యాహ్నానికల్లా సక్కుబాయి ఓపిక లేక పోయినా పక్క మీది నుంచి లేచి ఇంత అన్నం వండి వృద్ధురాలైన అత్తగారికి తినిపించి, అల్లోపతీ డాక్టర్ కు చూపిస్తే ఎక్కువ ఖర్చు అవుతుందని హోమియోపతి డాక్టర్ కు చూపించికొని యాభై రూపాయల్లోనే ఫీజు, మందులూ తెచ్చుకుంటుంది. మర్నాటికి కొంత కుదుట పడుతుంది. ఆ మర్నాడు సుబ్బారావు స్నానం చేసి జుట్టుకు సెంటు నూనె రాసుకొని, ముఖానికి పౌడర్ రాసుకొని, భార్య ఎక్కడా మడత పడకుండా ఇస్త్రీ చేయించిన బట్టలు వేసుకొని ఆఫీసుకు తయారౌతుంటాడు. ఇంతలో సక్కుబాయి

“ఏవండీ! దసరా వస్తుంది గదా! పిల్లలు కొత్త బట్టలు కావాలంటున్నారు” అంది మెల్లగా భయం భయంగానే.    “పిల్లలే అడుగుతున్నారా? నీకొద్దా?” అడిగాడు సుబ్బారావు. అతని ముఖం మీద చిరునవ్వును అపార్థం చేసుకుంది సక్కు.

“నాక్కూడా చీర – చీరలు చినిగిపోయాయి. అవే కట్టుకుంటున్నాను” అంది ఆశగా సక్కు.

“అంతేనా ఇంకా పట్టు చీరలేమైనా కావాలా?” వెటకారంగా చిరునవ్వుతో అడిగాడు సుబ్బారావు. అతని ముఖం మీద ఏదో వికారమైన వెలుగు.”

సక్కుబాయి రోజంతా ఏదో పనిలో బిజీగానే  ఉంటుంది. కాస్త నడుం వాలుద్దామన్నా తీరిక దొరకదు. పని మనిషినైనా పెట్టుకోలేదు. ఓ సారి పని మనిషి కోసం సుబ్బారావునడిగితే “నువ్వు ఇంట్లోనే ఉంటున్నావు గదా! నీకింక పని మనిషి ఎందుకు? అన్నాడు.  ఏదో వెసులు బాటు చూసుకొని విశ్రాంతి తీసుకుందామన్నా ఏదో పని మీద అత్తగారు పిలుస్తుంది. మూడు గంటలకు రజిత వచ్చి భోజనం చేయగానే మిగతా ఇద్దరు పిల్లలు కూడా స్కూల్ నుంచి వస్తారు. ఇక మిగిలిన రోజంతా వాళ్లతోనే గడిచిపోతుంది. రాత్రి పిల్లలకు అన్నాలు పెట్టి, అత్తగారికి మందో, మంచి నీల్లో ఇచ్చి తానూ తిని ఇక పడుకుందామని సిద్ధమవుతుంటారు. అప్పటికి కూడా సుబ్బారావు ఇంటికి రాడు. అతనికి రాత్రి ఇంట్లో భోజనం చేసే అలవాటు లేదు. ఫ్రెండ్స్ తో పేకాట ఆడి, తాగి ఏ రాత్రో వస్తాడు. అప్పటికి అందరూ పడుకుంటారు.

ఆ రోజు “సుబ్బారావు మరీ పొద్దు పోయాక ఇంటికి వచ్చాడు. రోజులాగానే అతని దగ్గర విస్కీ కంపు కొడుతున్నది. చక్కగా నిలబడలేక ఊగిపోతున్నాడు మత్తుతో. వస్తూనే సుబ్బారావు సక్కు దగ్గరికి వచ్చాడు. ఆమెను గిల్లి లేపాడు. గిల్లిన బాధకు ఆమె వెంటనే లేచి కూర్చుంది. ఎదురుగా భర్తను చూసింది. “అర్రలోకి రావే” అని సుబ్బారావు అర్రలోకి వెళ్ళాడు. సక్కు చేసేదేమీ లేక నిద్రమత్తుతో అర్రలోకి వెళ్లింది.

ఇప్పుడు భర్త శారీరక వాంఛ తీర్చక పోతే పెద్దగా అరుస్తాడు. తిడ్తాడు. కొడ్తాడు. పిల్లలు లేస్తారు. వాళ్ళ ఏడుపులు, అరుపులు వాటితో నానా గందరగోళమవుతుంది. ఆయన పిల్లల్ని కొడ్తాడు. అట్లా ఇదివరకెన్నో సార్లు జరిగింది. ఆ గొడవంతా లేకుండా ఉండాలంటే తను భర్త దగ్గరికి వెళ్లవలసిందే! అని అనుకుంటూ సక్కు నిశ్శబ్దంగా భర్త దగ్గరికి వెళ్లింది అతని రాక్షస రతిలో పాల్గొనడానికి.”

అనాదిగా స్త్రీని పురుష జాతి ఎంతగా దోపిడీ చేసుకుంటూ కాల్చుకు తింటుందో చెప్పడానికి ఈ కథ ఒక నిలువుటద్దం. సమాజం స్త్రీని బానిసలకు బానిసగా మార్చి శారీరకంగా, మానసికంగా విసుర్రాయి కింద ధాన్యంలా నలిపేస్తోంది. స్త్రీ చూట్టూ ఎన్నో గీతలు గీసి అందులోనే బతుకుమని నిరంకుశంగా శాసిస్తున్నాడు పురుషుడు. సరళ శిల్పంతో సాగి పోయే ఈ కథ మౌనంగానే ఎన్నో మౌలిక ప్రశ్నల్ని సంధిస్తుంది. ఈ కథలో రచయిత్రి దేన్నీ గొంతు చించుకొని చెప్పదు. నదిలాగా నిశ్శబ్దంగా మన గుండెల్ని కోస్తూ వెళ్తుంది. నిజ జీవితపు దృశ్యాల్ని అంతే సహజంగా పాఠకుడి ముందుంచడం వల్ల కథ కథలాగా కాకుండా జీవితానికి ఉపనదిలా సాగిపోయింది. సక్కుబాయి పాత్ర పిల్లలకూ భర్తకు మధ్య నలిగిపోతుంది. కుటుంబానికి శ్రమ, శరీరం సర్వం అర్పించినా చివరికి ఆమెకు దక్కేది శూన్యం. కనీసం రోగమొస్తే ఎట్లున్నవు? అని అడిగేపాటి మర్యాదకు కూడా నోచుకోదు. భారతీయ కౌటుంబిక వ్యవస్థను బోనులో నిలబెట్టి పురుష మనస్తత్వాన్ని సర్ఫ్ తో కడిగేసే కథ ఇది. కుటుంబ జీవితంలోని ఒక ఇల్లాలు ఒక రోజును దొర్లించడానికి ఎంత హింసను భరించాలో ఈ కథ కళ్ళకు కట్టినట్టు చెప్తుంది. కుటుంబ సేవ చేసీ చేసీ స్త్రీ శరీరం చివరికి అందులోనే అరిగిపోయి శిథిలమై పోతుంది. స్త్రీ ఉనికిని, చైతన్యాన్ని, స్వేచ్చను, జీవన వికాసాన్ని ఈ కథ డిమాండ్ చేస్తుంది.

వివాహ వ్యవస్థ స్త్రీని బలహీనురాలిగా, బానిసగా తయారు చేస్తోంది. కుటుంబ చట్రం ఆమెను ఇంటి చాకిరికే పరిమితం చేసి కనీసం ప్రశ్నించే, కొన్నింటిని నిరాకరించలేని పరిస్థితికి దిగజార్చింది. స్త్రీల మెదళ్ల మీద పురుషాధిపత్యం ఎంతగా పర్చుకుపోయిదో తెలుసుకోవడానికి ఈ కథ ఒక ఆధారం. పురుషులు ఎంత సంస్కార హీనంగా ఉన్నారో చెప్తూనే ఈ కథ  స్త్రీ, పురుషుల మధ్య నెలకొన్న యజమాని, బానిస సంబంధాన్ని ఎండగడుతుంది. మిగతా స్త్రీవాదుల కథల్లోని పాత్రల్లా  ఈ కథలోని పాత్రలు తిరుగుబాటు చేయవు. కానీ పురుషుడ్ని ఆత్మ విమర్శలోకి తోసేస్తాయి. ఇదొక సగటు ఇల్లాలి కథ. మన పక్కింటి అక్క కథ. వ్యవస్థ మీద ఏ రాయి విసరకుండానే పురుషులను నిలువునా కుదిపేసే కథ.

                    *

 

 

శ్రీధర్ వెల్దండి

తెలంగాణా కథా సాహిత్య విమర్శకి ఇప్పుడే అందివచ్చిన దివ్వె వెల్దండి శ్రీధర్. కథా విశ్లేషణలో నలగని దారుల్లో సంచరిస్తున్నవాడు.

2 comments

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

  • కళ్ల ముందు కదలాడె పాత్రలతో కన్నీళ్లు తెప్పించే కథ ……
    విమర్శ అద్భుతః 👌👌

‘సారంగ’ కోసం మీ రచన పంపే ముందు ఫార్మాటింగ్ ఎలా ఉండాలో ఈ పేజీ లో చూడండి: Saaranga Formatting Guidelines.

పాఠకుల అభిప్రాయాలు