“నేనంటే ఇష్టమా?” అనడిగావు.
ఎవరైనా ఊలుచొక్కా తొడిగి, అరచేతులు రుద్ది బుగ్గలమీద ఆనిస్తే బావుండని ఎదురు చూస్తుంది ఉదయం. గోడమీది పెయింటింగ్ లో ఒజార్క్ లేక్ ఒడ్డున గులాబిరంగు పొగమంచులో, గుర్రాల మీద తోలు బూట్ల మనుషులు. కప్పు అడుగున సున్నా లాగా చుట్టుకుని మిగిలిపోయిన టీ పొడి. తెల్లవారుఝాము ప్రయాణంలో టీ హట్ లో ఆగినప్పుడు టిష్యూ పేపర్ మీద నువ్వు రాసిచ్చిన ఉత్తరం, అలమరలో చీరమడతల మధ్య వెచ్చగా పడుకుంది అచ్చం నీలాగే.
మంచుపట్టిన అద్దాన్ని ముట్టుకున్నప్పుడు అక్కడ ఏదో ఒకటి రాయాలనిపిస్తుంది. గింజల కోసం రావాలా వద్దా అని పావురంపిల్ల అక్కడక్కడే తారట్లాడుతుంది. హైరోగ్లిఫ్ లాగా వేళ్లతో అద్దం మీద ఏవో గుర్తులేసి పావురం వైపు చూశాను. అది ఉన్నట్టుండి ధైర్యంచేసి గింజలమీదకి వాలింది.
కళ్ళు తిరుగుతున్నట్టు, తలచుట్టూ గాలి వలయాలుగా గిరికీలు కొడుతున్నట్టు, చుట్టూ నువ్వే ఉన్నట్టు, అసలు నా ఊహలో తప్ప నువ్వెక్కడా లేనట్టు, అన్నీ నిజాలే, అన్నీ ఊహలే. కదలకుండా ఒకేచోట ఉంటే ఏదో గుబులు. ఏవో పనులు కల్పించుకుంటూ, ‘ఇష్టమేనా’ అన్న నీ ప్రశ్నని మెడలో లాకెట్లాగా వేసుకుని, ఊరిమీద పడి తిరుగుతూ, ఊరి నుంచి ఊరికి తిరుగుతూ ఉన్నాను.
*
పేరుకుపోయిన కొబ్బరినూనె ఎండపొడకి కరిగి సీసా అంచుల మీద పూసలుగా జారుతుంది. భుజాలమీద పరుచుకున్న జుట్టంతా పైకితీసి ముడి కట్టుకోగానే సూర్యకాంతి మెడచుట్టూ అల్లుకుపోయింది. అలాంటి పెరపెరలాడే మధ్యాన్నం పూట, రెండుచేతుల మధ్యా నీ మొహాన్ని నింపుకుని తదేకంగా చూస్తుంటాను. చూస్తుండగానే నీ కళ్ళు రెండూ మెల్లగా అడవులైపోతాయి. మల్లె విచ్చుకున్నా వినపడేంత నిశ్శబ్దం అక్కడంతా. చెట్లన్నీ కళ్ళు మూసుకుని ఒళ్ళెరక్కుండా ఈలపాట పాడుతుంటాయి. అడవి బయట ప్రపంచం ఇదంతా తెలీకుండానే రాబోయే పండక్కి కొత్తబట్టలు కొనుక్కుంటూ ఉంటుంది.
చెట్టువేరులా లోపలికి పాతుకుపోయావు ఇన్నాళ్ళూ. ప్లాంటర్ లాగా, మారువేషంలో ఏ పాత సామానులో బాగు చేసుకున్నట్టు నటిస్తూ. తీరికలేని పనిలో ఉన్నట్టు నువ్వు, ఏ పనీ లేకుండా ఊరికే నీవైపు చూస్తున్నట్టు నేనూ. అదే అలవాటైపోయి, అదే అనివార్యం అయిపోయాక- లోకమంతా మనదేననీ, అసలేదీ మనది కాదనీ; జీవితానికి ఏ విలువా లేదనీ, అసలు విలువ కట్టలేనిదని ఒకేసారి అనిపిస్తుంది. నువ్వు లేకపోతే ఏం అనీ, అమ్మో, నువ్వు లేకుండా ఎలా అనీ రెండిటికీ ఒకేలా ఒళ్ళు జలదరిస్తుంది.
*
కాలం హెచ్చరిస్తుంది;
నది కదిలిపోతుందని, మంచు కరిగిపోతుందని, కుట్టుపూల దుప్పటిలాంటి చుక్కలాకాశం అర్ధరాత్రికల్లా ఆచ్చాదన లేక చలికి వణికిపోతుందనీ రుజువులు చూపిస్తుంది. ఈ ఇష్టాలేం శాశ్వతం కాదని అక్కరకొద్దీ మందలిస్తూనే ఉంది. ‘ఏది సత్యం’ అనే తాత్వికుల అనాది శోధన తప్ప విశ్వమంతట్లో శాశ్వతమైంది ఏదైనా ఉందా అనుకుని ఊరుకుంటాను. ఒంటిమీద వాలిన సీతాకోకలు ఎగిరిపోతాయేమోనని ఊపిరిబిగబట్టి కొన్ని క్షణాలపాటు కదలకుండా ఉండిపోతాను.
*
సాయంకాలం గొడ్డుచలిలో ఇల్లంతా గుగ్గిలం పొగ నింపుకున్నాను. ధూపం అడుగునించి రేగుతూ నిప్పురవ్వలు. ‘Embers’ అనే పదం మనసులో మెదలగానే నువ్వు గుర్తొచ్చావు. ఊహూ.. ఈ వాక్యం తప్పు. నువ్వు గుర్తులేని సమయం విడిగా ఏం ఉండదు. (సరిగ్గా చెప్తానుండు) ఆ పదం నీలాగా అనిపించింది. నారింజలో ఊదా కలనేత నిప్పు రంగులోంచి, రవ్వలుగా రేగి కణికలుగా కాలిపోయే మనని గుర్తుకు తెచ్చింది.
పెన్ తో నీ చేతిమీద పిచ్చిగీతలు గీస్తుంటాను; నీ వొళ్ళు నా నోట్బుక్, ఏదైనా రాసుకుంటాను అనే పొగరుతో. గీతలెందుకు? ఏవైనా మాటలు రాయమని అడుగుతావు. అక్షరానికో తోటని పూయించగల మాటల్ని, దారి పొడుగునా దుబారాగా విరజిమ్ముతూ ఇన్ని మైళ్ళు నడిచొచ్చాక, మిగిలిన పదాలు లెక్కపెడితే ఒక హైకూ కి సరిపడా కూడా లేవు. ఏం చెప్పాలా అని పగలంతా ఆలోచించి దీపాలవేళకి నీ అరచేతిలో రాసి దోసిలి మూస్తాను ఒక అందమైన మాటని-
“మనిద్దరం” అని.
*
ఇంతకీ ఇష్టమే అంటావా నువ్వంటే?
*
ఎంత అందమైన లేఖ. పదం,పదంలో గుండె పట్టనంత ప్రేమ. ఇష్టం అనే మాట ఎంత చిన్నదో అడిగినవాళ్ళకి అర్థమయ్యేలా చెప్పారు 🙂
ఎంత వెచ్చని ప్రేమ!
అందానికి అందం ఈ పుత్తడిబొమ్మ
అన్నట్టు వ్రాసి….
అందరికీ అందనిదీ పూవులరెమ్మ
అన్నంత చక్కని శైలి, సున్నితమైన intimate భావాలను అభి వ్క్తీకరించినందుకు అభినందనలండీ…