చ(క్కి)లి గింతలు!

చ(క్కి)లి గింతలు!

నాయనా పులి వచ్చె!

ఇప్పుడు పులి ప్రతి సందులోనూ చంకలోనూ తిరుగుతోంది?!

కొందరు దాన్ని చలి అంటున్నారు!

అది నిజంగానే యెముకలు కొరుక్కు తింటోంది!!

బస్తీమే సవాల్!

వస్తాదే!

కాని వణికి చస్తున్నాడు?!

చలి సవాల్ విసిరింది మరి!!

నీళ్ళు చెప్పని నిజం!

చలి చెలంతాలాడుతోంది!

నీళ్ళు నీరుగారుతున్నాయి?!

అయినా చేపలెందుకో వొడ్డెక్కడం లేదు!?

పులి – బుట్ర!

ఊళ్ళోకి పులి వచ్చింది!

అందరూ కలిసి తరిమేశారు!

ఊళ్ళోకి చలి వచ్చింది.. అంతా భయపడి యెవరిళ్ళల్లో వాళ్ళు తలుపులు బిడాయించుకు వణుకుతూ కూర్చున్నారు!!

చల్లందనము!

నేలతో నీడ అన్నది?

నను తాకరాదని!

ఔను మరి… నీడకూడా నేలను తాకి నీరయిపోతోంది!!

దారం లేకుండా!

నీళ్ళు పోసుకుంటే నిప్పులు పోసుకున్నట్టే వుంది?!

చురుక్కుమంటున్నాయి!

వానవిల్లు లేకపోయినా నీటిముల్లు సూదులు గుచ్చుతోంది!!

చాంపియన్!

చలిని గిల్లిమరీ వెక్కిరిస్తోంది చంటిపాప!

ఎడమ కాలితో యెత్తి తన్నింది!

అమ్మ గుండెల్లో వెచ్చగా దూరి!!

ఒద్దన్నా వైద్యం!

జ్వరం లేదు!

టెంపరేచరూ లేదు!

అయినా వొంటికి తడిగుడ్డ పెడుతోంది గాలి!!

హిమగిరి సొగసులు!

అడుగు తీసి అడుగు వెయ్యక్కర్లేదు!

అరకు దాక వెళ్ళక్కర్లేదు?!

ఎక్కడుంటే అదే లంబసింగి!!

గుండెమంట కింద!

బిందే గ్లాసూ బకెట్టూ వాటర్ ట్యాంకూ అన్నీ ఫ్రిజ్జులోనే వున్నాయి?!

కూల్ వాటరు!

కన్నీరొకటే వెచ్చగా వుంది!!

సీజనల్ మ్యూజిక్!

రగ్గూ పెగ్గూ వేసినా-

దవడలు రెండూ దడదడమని కొట్టుకుంటున్నాయి!

‘వొవ్వొవ్వోవ్… వొవ్వొవ్వోవ్’మని సాధన చేస్తున్న సంగీతకారులే అందరూ!!

ధ్రువప్రాంతం!

పెరుగు తోడుకోలేదు?!

ఫ్రిజ్జులో పెట్టకపోయినా కూరలు వాడిపోలేదు!?

మనుషులు మాత్రం వయసయిపోయినట్టు వడలిపోతున్నారు!!

రావోయి మాయింటికి!

ఎండాకాలంలో పగలే చంద్రుడు కావాలి!

ఈ చలికాలంలో రాత్రి సూర్యుడు పొడవాలి!

సూర్యచంద్రులిద్దరూ భూమికి రెండుకళ్ళు గదా- రమ్మంటే రారా- ఆమాత్రం షిఫ్టులు మార్చుకోరా?!

ప్రేమకథ!

ఇద్దరూ మనసులోని మాటని యెలా బయటపెట్టాలా అని తెగ ఆలోచిస్తుంటే చలి చొరవ తీసుకుంది!

‘చలి చలి గాలులు వీచెను’ అమ్మాయి అంటే- ‘నా చేతులు నీకై సాగెను’ అన్నాడు అబ్బాయి, యిద్దరూ వొకపాటకు రెండు పల్లవులైనారు!

పాపం ఆ యిద్దరికీ యిక వొక్కటే జీవితం!!

చలికి సిగ్గేసింది!

ఆమె అతన్ని కప్పుకుంది!

అతడు ఆమెని కప్పుకున్నాడు!

చలి యిద్దర్నీ కప్పుకోలేక కమ్ముకోలేక పక్కకి తప్పుకుంది!!

చల్లని సాయంత్రం!

వేడి వేడి పకోడీలు వేస్తూ-

చలిని నాల్రోజులు వుండి వెళ్ళమందా యిల్లాలు!

ఎందుకంటే- మా ఆయన యింటిపట్టునే వుంటారంది!!

ఊరంతా వుష్ట్నాలే!

ఉష్ట్నోగ్రతల గ్రాఫ్ దబ్బున పడిపోయింది!

పిల్లలూ పెద్దలూ పడకేశారు!

ఆసుపత్రుల ఆదాయపు గ్రాఫు రాకెట్లా పైకిలేచింది!!

చలి చిత్రాలు!

అటుక్కోడి పట్టు దిగడం లేదు!

దుప్పటికింద తలగడలు రెండూ తగవులు మానేశాయి!

చలి చాచికొట్టిందేమో యెడమగా వుండడం యెవరివల్లా కావడం లేదు!!

వింటర్ కాదు హంటర్!

రోడ్లు మళ్ళించినా ట్రాఫిక్ తగ్గలేదు!

ట్రాఫిక్ కానిస్టేబుళ్లు లబోదిబోమన్నా ట్రాఫిక్ జామ్ వీడలేదు!

ఇప్పుడు చీకటిపడితే చాలు రోడ్లు బోసిపోయి నగరం ఖాళీ చేసినట్టుంది!!

శీతకన్ను!

ఫుట్పాతూ ఫ్లాట్ఫామూ పూరిగుడిసె చలికి గజగజా వణికాయి!

ఆకురాలు కాలం రాకుండానే కొన్ని దీపాలు ఆరిపోయాయి!

అన్ని చోట్లా తిరుగాడి భవంతుల్లోకి స్వేఛ్చగా చొరబడలేని చలి తన సమానత్వ గుణానికి హోరుమని యేడ్చింది!!

ఊరంతా సంక్రాంతి!

ఊళ్ళో ప్రతిరోజూ భోగీ పండగే!

పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే ఆ యిద్దరే కాదు, పదిమందీ వొక్కచోట చేరుతున్నారు!

అందర్నీ వొక్కటి చేసింది చలిమంట!!

*

 

 

బమ్మిడి జగదీశ్వరరావు

2 comments

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

  • చలి పులి చక్కలిగింతలు పెడుతున్నా “ కన్నీరొకటే వెచ్చగా వుంది!! “ అని ఓ భాధ్యతాయుతమైన సానుభూతితో అంటున్న బమ్మిడి జగదీశ్వరరావుకి నెనర్లు.

    “ ఏ కన్నీరైనా వెచ్చగా ఉంటుంది, అది కలిమిలేములని మరిపిస్తుంది “ అని అన్నారు మనసు కవి ఆత్రేయ.

‘సారంగ’ కోసం మీ రచన పంపే ముందు ఫార్మాటింగ్ ఎలా ఉండాలో ఈ పేజీ లో చూడండి: Saaranga Formatting Guidelines.

పాఠకుల అభిప్రాయాలు