సైన్స్ ఫిక్షన్ అంటే ఇదీ!

చిట్టెలుకకు పూలు? కనిపించే అంగవైకల్యం కలిగిన మనుషుల మీద కలిగే జాలి వయసుతోబాటుగా ఎదగని మెదడున్నవాళ్ల మీద సమాజంలోని వ్యక్తులకు కలగదెందుకని? ఈ రెండింటికీ గల సంబంధం? సైన్స్ ఫిక్షన్ కేటగరీలో 1959 లో ప్రచురింపబడి పలు మన్ననలని, పురస్కారాలనీ అందుకున్న Flowers for Algernon (https://www.sdfo.org/gj/stories/flowersforalgernon.pdf ) అన్న కథలో రచయిత డేవిడ్ కీస్ సమాజం తీరుతెన్నుల మీద వేసిన ప్రశ్నలు ప్రపంచంలో అన్ని మూలలకి వెళ్లి ఎవరినీ తాకకుండా వదిలిపెట్టవు.

ఆల్జెర్నాన్ అనేది ఒక చిట్టెలుకకు లాబొరేటరీలో డాక్టర్ స్ట్రాస్, మరియు డాక్టర్ నెమర్ అన్న ఇద్దరు డాక్టర్లు పెట్టిన పేరు. వాళ్ల పరిశోధన ఫలితాలకి బాకా నూదుతూ వాళ్లు దాని మెదడుకు చేసిన ఆపరేషన్ వల్ల ఆ చిట్టెలుక ఎటువంటి వ్యూహాన్నిచ్చినా దానిలో అతివేగంగా విజయాన్ని సాధిస్తోంది. అది మూడు రెట్లు తెలివితేటలని పొందిందని వాళ్లు నిదర్శన పూర్వకంగా చూశారు. ఈ ప్రయత్నాన్ని మానవుల మీద చెయ్యాలని ఆలోచన. దానికి కావలసింది, అతి తక్కువ తెలివితేటలున్న మనిషి.

ఛార్లీ గోర్డాన్ వయసుకు తగ్గ తెలివితేటలు లోపించిన ఒంటరి మనిషి. ఒక ఫాక్టరీలో నేలని ఊడిచే, టాయ్‌లెట్లని శుభ్రపరచే అతి చిన్న ఉద్యోగి. చదవడం, రాయడం పెద్దగా రాదు. చుట్టుపక్కల వాళ్లు అతణ్ణి అపహాస్యం చేస్తున్నా తెలియని అమాయకత్వం. 35 ఏళ్ల వయసులో మొదలుపెట్టి రెండేళ్లపాటు వయోజనులకు బోధించే పాఠశాలలో మిస్ కిన్నియన్ దగ్గర విద్య నేర్చుకుంటున్నాడు. అతను చాలా పట్టుదలతో కృషిచేస్తున్నాడని, ఆ డాక్టర్ల పరిశోధనలు మనుషులమీద విజయవంత మయేటట్లయితే అలా జరగడం ఛార్లీకి ఎంతో ఉపయోగకరమని అతనిపైగల అభిమానంతో అతణ్ణి ఆ డాక్టర్లకు సిఫార్సు చేసింది. ఆ ఆపరేషన్ ఎందుకు కావాలనుకుంటున్నాడో చెప్పమంటే, అతని జవాబు: “I told them because all my life I wantid to be smart and not dumb.” బీదవాళ్లు ధనవంతులుగా మారాలని అనుకోవడం సహజమేనని అనుకుంటాం గానీ, మనం డంబ్ అనుకునేవాళ్లు ఇలా కోరుకుంటారని ఎన్నిసార్లు ఆలోచిస్తాం?

అతణ్ణి ఎంపికచేసే ముందు వాళ్లు అతనికి కొన్ని పరీక్షలు పెట్టారు. దానిలో ఒకటి, అతనికీ, చిట్టెలుకకీ పోటీ. అదెలా గంటారా? ఒక వ్యూహాన్ని కాగితం మీద గీసి, ఒక పెన్సిల్ అతని చేతికిచ్చి దాన్ని ఛేదించ మనడం, అదే సమయంలో చిట్టెలుకని ఆ వ్యూహంలో వదలడం. పదికి పదిసార్లూ అతనికన్నా ముందే ఆల్జెర్నాన్ విజయాన్ని సాధించింది.

ఎంపిక అయినప్పటి నించీ అతణ్ణి రోజూ స్టేటస్ రిపోర్ట్ రాయమన్నారు. మార్చి 5 నాటి రిపోర్టుతో కథ మొదలవుతుంది. అప్పటికి అతనికి రాయడం సరిగ్గా రాదు కాబట్టి తప్పుల తడకతో కథ మొదలవుతుంది. ఆపరేషన్ ఫలితాలు మెల్లమెల్లగా చేకూరతాయని చెప్పిన దానికి నిదర్శనం ఛార్లీ రోజు వారీ రిపోర్టులో కనిపిస్తుంది. తప్పులు మాయమవుతాయి. పెద్దపెద్ద పదాలు, భావాలకి విస్తారంగా వివరణ కనిపించడం మొదలవుతుంది. జాన్ మిల్టన్ రచనలతో సహా అతను ఎన్ని పుస్తకాలని చదవగలుగుతున్నాడో, ఎన్ని భాషల్లో నిష్ణాతుడవుతున్నాడో, సైకాలజీతో సహా ఎన్ని రంగాల్లో ప్రావీణ్యతని సంపాదించగలిగాడో అర్థమవుతుంది. ఈ అభివృద్ధివల్ల అతనికి కలిగిన నష్టం, పాత సహోద్యోగులనీ, ఉద్యోగాన్నీ కోల్పోవడం. నిజానికి, ఆ సహోద్యోగులే – ఎనిమిది వందల నలభై మంది – అంత తెలివితేటలున్న అతణ్ణి భరించలేక ఉద్యోగంలోనుంఛీ తొలగించమని కంపెనీ యాజమాన్యానికి అర్జీపెట్టారు. దీనికి తోడు, ఛార్లీకి డాక్టర్లు స్ట్రాస్, నెమర్ ల వ్యక్తిత్వాల గూర్చి సంపూర్ణ అవహగాన వల్ల వాళ్ల ఆలోచన విధానాల్లో లోపాలు కనిపించడం మొదలుపెట్టాయి. అందుకని వాళ్లు అతణ్ణి తప్పించుకుని తిరుగుతున్నారు. రోజులు గడపడానికి లాబ్ లో చిన్న ఉద్యోగానికి ముట్టే వేతనం అతనికి సరిపోతోంది.

ఈ శిఖరం మీద ఉన్నప్పుడు అతను గ్రహించిన విషయాల్లో ఇంకొకటి, ఎవరితోనూ మామూలుగా సంభాషణ జరపలేకపోవడం. వయసులో తనకన్నా వయసులో చిన్నదయిన మిస్ కిన్నియన్ తో సహా. తెలివితేటలు లేనప్పుడు అతనిపై ఆమె జాలిపడింది, మితిమీరి వున్నప్పుడు అతని భాష గానీ, భావం గానీ అర్థం కాలేదు!

ఒక రెస్టారెంటులో తెలివితేటలు తక్కువ ఉన్న ఒక బేరర్ కుర్రవాణ్ణి అక్కడ చేరినవాళ్లు గేలిచేస్తున్నప్పుడు ముందు ఛార్లీ కూడా నవ్వుతాడు గానీ, తను ఆపరేషన్ కు ముందు ఎలా వుండేవాడో గుర్తొచ్చి, స్నేహితులనుకున్నవాళ్లు తనను హేళన చేసేవాళ్లని అతనికి అప్పుడు అర్థమై వాళ్లమీద అరిచి ఆపిస్తాడు. చదవడం, రాయడం వస్తే తెలివితేటలు చేకూరతయ్యనుకునే అనుకునేవాడు.  “Even a feeble-minded man wants to be like other men.” అన్న అతని ఆలోచన తెలుగువాళ్లల్లో – ముఖ్యంగా సినిమాలు తీసేవాళ్లల్లో ప్రవేశిస్తే అంగవైకల్యాన్ని హాస్యంగా చిత్రీకరించడం మానేస్తారేమోనన్న ఆశ కలుగుతుంది.

ఆల్జెర్నాన్ ప్రవర్తనలో తిరోభివృద్ది కనిపించడం మొదలయినప్పుడు ఛార్లీకి తనకి కూడా అదే పరిస్థితి ఎదురవబోతున్నదని అర్థ మవుతుంది. పరిస్థితి చెయ్యిజారిపోకముందే ఆల్జెర్నాన్-గోర్డాన్ ఎఫెక్ట్ అన్న శీర్షికతో సిద్దాంత పత్రాన్ని రాసి డాక్టర్లు స్ట్రాస్, నెమర్ లకు పంపుతాడు. మిగిలిన రోజువారీ రిపోర్టులు అతనిలోని మార్పులని తెలియజెయ్యడం మొదలుపెడతాయి. అతని చివరి రిపోర్టు జూలై 28న.

ఛార్లీ తెల్లవాడా లేక నల్లవాడా అన్నది రచయిత స్పష్టంగా పేర్కొనడు గానీ, ఆల్జెర్నాన్ తో పోటీలో ఓడిపోయినప్పుడు అతనికి కలిగిన ఆలోచన I dint know that mice were so smart. Maybe thats because Algernon is a white mouse.” తో మాత్రం అది తేటతెల్ల మవుతుంది.

కథాంశం తిరుగులేనిది. కథనం అద్భుతం. పాత్రలు సహజం. ఏ పాత్ర ఔచిత్యానికీ ఎక్కడా భంగం కలగదు. సున్నితమయిన హాస్యం కథ నిండా చిలకరించబడింది. చిన్నచిన్న విషయాల మీదకూడా రచయిత చూపించే శ్రద్ధ అంతటా కనిపిస్తుంది. ఉదాహరణకు, ఒక చోట పంక్చుయేషణ్ మార్క్ కామా గూర్చి అతను తెలుసుకున్నప్పుడు ఆ రోజు రిపోర్టులో ఒక పేరా నిండా ఎన్నోసార్లు ఆ కామా దర్శన మిస్తుంది.

సైన్స్ ఫిక్షన్ అంటే కొన్ని దశాబ్దాలుగా – ముఖ్యంగా ఈ మధ్యన, తెలుగులో సహా – టెక్నాలజీయే కేంద్రంగా కథలు రాయడం అచ్చులో ఎక్కువగా కనిపిస్తూంటుంది; ఉదాహరణకు గ్రహాంతర యాత్రల గూర్చీ, లేదా 2050వ సంవత్సరంలో ప్రపంచం ఎలా వుంటుందన్న ఊహాగానాల గూర్చీ. దానికి భిన్నంగా మనుషులు ప్రధాన పాత్రలుగా, టెక్నాలజీ పరిణామం వ్యక్తుల మీద ఎలా ఉన్నదన్న విషయాన్ని కేంద్రంగా మలచడంవల్ల ఈ కథ అమరత్వాన్ని పొందిందని చెప్పవచ్చు. బండ్లు ఓడలుగా మారక ముందూ, మారిన తరువాతా కూడా ఎరిగినవాళ్లు ఆ ఓడలు మళ్లీ బండ్లుగా మారినప్పుడు ఎలాంటి మనోభావాలకు గురవుతారో ఛార్లీ సహోద్యోగులు జో కార్ప్, ఫ్రాంక్ ల ప్రవర్తన ద్వారా రచయిత తెలియజేస్తాడు. వాళ్ల ప్రవర్తన మూడు పరిస్థితుల్లోనూ సహజంగానే కనిపిస్తుంది. ఈ సహజత్వమూ, మనుషుల ప్రవర్తనా ఈ కథని అగ్రశ్రేణిలో నిలబెట్టాయి.

రచయిత పరిచయం:

Photo క్రెడిట్:
http://www.fantascienza.com/magazine/notizie/19052/daniel-keyes-se-ne-va-il-papa-di-algernon/

 

Daniel Keyes నాలుగయిదు పుస్తకాలు రాసాడు గానీ అతను ముఖ్యంగా ఒక కథ రచయితగానే ప్రసిద్ధుడు. ఈ కథని నవలగా మలిచాడు. స్టేజీ మీద ప్రదర్శనగా మలచబడింది. అది Charly అన్న పేరుతో సినిమాగా విడుదల అయింది. 1960 లో హ్యూగో అవార్డు ఈ కథనీ, 1966 లో నెబ్యులా అవార్డు నవలనీ వరించాయి. బిబిసి రేడియో నాటకంగానూ, జాపనీస్, ఫ్రెంచ్ భాషల్లోకి అనువదింపబడి టీవీ మూవీలుగానూ కూడా వెలువడ్డది.

తాడికొండ శివకుమార శర్మ

వృత్తిరీత్యా మెకానికల్ ఇంజనీర్. ఐ.ఐ.టి. మద్రాసులో బాచెలర్స్ డిగ్రీ తరువాత రట్గర్స్ యూనివర్సిటీలో పి.హెచ్.డి. వాషింగ్టన్, డి.సి., సబర్బ్స్ లో పాతికేళ్ళకి పైగా నివాసం. మొదటి కథ "సంశయాత్మా వినశ్యతి" రచన మాస పత్రికలో 2002 లో వచ్చింది. ఇప్పటి దాకా యాభైకి పైగా కథలు పలు పత్రికల్లో వచ్చాయి, కొన్ని బహుమతుల నందుకున్నాయి. "విదేశ గమనే," (జనవరి 2016 లో) "స్వల్పజ్ఞుడు" (జనవరి 2018 లో) అన్న కథా సంకలనాలు వెలువరించారు. "అదృశ్య హస్తపు అస్పృశ్య స్పర్శ" ధారావాహికగా వాకిలి వెబ్ పత్రికలో, ఆ తరువాత అదే శీర్షికతో నవలగా వెలువడింది. అయిదు నాటికలు రచించారు, కొన్నింటికి దర్శకత్వం వహిస్తూ నటించి, డెలావర్ నాటక పోటీల్లో ప్రదర్శించారు. "ఇది అహల్య కథ కాదు" ప్రదర్శన అజో-విభో-కందాళం వారి వార్షిక ఉత్సవాల్లో నిజామాబాదులో 2006 లో, తరువాత 2007 లో హైదరాబాదులోని రవీంద్ర భారతిలో జరిగింది.

2 comments

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

  • చాలా మంచి కథని చదివించినందుకు ధన్యవాదాలు శివకుమార్ గారూ! కేవలం కథలోని భాష ప్రమాణాలే కథకుడి స్థితిని తెలియజేస్తూ ఉంటాయి కాబట్టి, కథ చూపించే ప్రభావం చాలా సూటిగా ఉంటుంది. చాలా బాధాకరంగానూ ఉంటుంది.

    జరగబోతున్నదాన్ని పసిగట్టిన వాళ్లు – డాక్టర్లకి కూడా అనుమానం రాకముందు – ఇద్దరు. ఇద్దరూ ఆడవాళ్లే! ఒకరు మిస్ కిన్నియన్ (“At werst you will have it for a littel wile and your doing somthing for sience.”). 840 మంది అతన్ని ఉద్యోగం నుంచి తొలగించాలని డిమాండ్ చేసినా, ఆ పిటీషన్ మీద సంతకం పెట్టని (ఆ పిటీషన్ చూస్తూనే, ఈవిడ ఒక్కతే సంతకం పెట్టలేదన్న విషయం కథకుడు గ్రహిస్తాడు. అప్పటికి అతని ఐక్యూ స్థాయి ఎలా ఉందో పరోక్షంగా ఈ సంఘటన తెలియజేస్తుంది!) ఫానీ గిర్డెన్ మరొక స్త్రీ (“You used to be a good, dependable, ordinary man—not too bright maybe, but honest. Who knows what you done to yourself to get so smart all of a sudden. Like everybody around here’s been saying, Charlie, it’s not right.”). కథని చదివిన ప్రతిసారీ, ఓ కొత్తవిషయం కనుక్కోగలిగినంత గొప్పగా ఉంది కథనం.

    Ugly Prose – The virtues of very bad sentences అనే వ్యాసం, M. Thomas Gammarino అనే రచయిత రాసింది, కొన్ని నెలల క్రితం The Writer పత్రికలో చదివాను. అందులో ఈ కథలోని భాషని ఆ వ్యాస్తకర్త ఉదహరించడం ఈ కథతో నాకు తొలి పరిచయం.

    ఆ పరిచయం కంటే ఇప్పటి మీ పరిచయం వల్ల కథ చదవగలిగాను. మరోసారి ధన్యవాదాలు!

‘సారంగ’ కోసం మీ రచన పంపే ముందు ఫార్మాటింగ్ ఎలా ఉండాలో ఈ పేజీ లో చూడండి: Saaranga Formatting Guidelines.

పాఠకుల అభిప్రాయాలు