ఆర్యా సుక్కుకు అంతుందా?

పాతకాలాన్ని బుర్రన మోస్తూ, ప్రస్తుతాన్ని గిర్రున తోస్తూ భవిష్యద్దర్శనం కావించడమే దార్శనికుల లక్షణం. ఇలాంటి ఆలోచనలు తరువాత కాలానికి ‘కళగా, తత్వంగా’ పరిణమించడం సహజంగా జరుగుతుంటుంది. వారి ఆలోచనల్ని మనవరకు మోసుకొచ్చే వాటిలో ముఖ్య పాత్ర పోషించేవి పుస్తకాలు. ఈ పుస్తకాలు రెండు రకాలు:  మౌనపుస్తకాలు – మాట్లాడేపుస్తకాలు.

మనుషుల్లో అక్షరాస్యులకంటే, నిరాక్షరాస్యులే ఎక్కువ. ఈ నిరాక్షరాస్యుల పాలిట మాట్లాడేపుస్తకాలు విజ్ఞాన, వినోద ఔషధగుళికలు. అప్పట్లో ఈ మాట్లాడే పుస్తకాల్ని డ్రామా, నాటకం అనేవారు. ఇప్పుడు సినిమా అంటున్నారు. డ్రామాలకీ, నాటకాలకీ ఉన్న సాహిత్య గౌరవం ఇప్పటి సినిమాలకు లేదు. కొంతమంది బడుద్ధాయిలు సినిమాని వినోదం అంటారు తప్పితే, విజ్ఞానం అనలేరు. ఇందులో కొందరు విజ్ఞానం మీద సినిమాలు తీస్తే, ఇంకొందరు వినోదం మీద సినిమాలు తీశారు. రెండూ కలిపి తీసిన దర్శక జ్ఞానులు కూడా ఉన్నారు. ఇందులో సుకుమార్ తీసిన సినిమాలు వినోదమా? విజ్ఞానమా? అనేది మన చర్చ! ఇప్పుడు చూద్దాం!

రెండువేల నాలుగు నుండి, ఇప్పటి వరకూ పద్నాలుగు సంవత్సరాల సినీ జీవితంలో ఏడు సినిమాలు మాత్రమే ఆయన తీశాడు. ఇక్కడే అర్థమౌతుందిగా ఈ చర్చకు సుకుమార్ అర్హుడా? కాదా? అనేది. దీనిబట్టి ఈయన రాసిన పుస్తకాల్లో వినోదం కన్నా విజ్ఞానం పాళ్ళు కాస్త ఎక్కువనే తెలుస్తుంది. సినీ బొమ్మల ప్రపంచంలో మనుషులు కూడా రబ్బరు బొమ్మలా మారుతూ వ్యక్తిత్వాల్ని తాకట్టు పెట్టుకుంటూ గుంపులో గోవిందలా బతికేస్తుంటారు. ఆ గుంపు నుండి మొట్టమొదటిసారి నేను వేరని ‘జగడం’ చేసి మరీ నిరూపించుకున్నాడు. మౌనపుస్తకాల్లో కునుకుపాట్లు పడుతున్న సిగ్మండ్ ఫ్రాయిడ్ని తన సినిమాల ద్వారా ఫ్రాయిడ్ సిద్దాంతాలకి పాత్రలిచ్చి మాట్లాడించాడు. సినిమాని వినోదంగా వీక్షించే ప్రేక్షకుల దృష్టిలో జగడం ప్లాప్ సినిమా. కానీ జగడం సినిమా ద్వారా సుకుమార్ ప్రతిభాభ్యాసాలు ఏమిటన్నది? ఆ ఔషధగుళికలు మింగిన కొందరకే అర్థమైంది. ఇంకొందరికి అది వ్యర్థమైంది.

మరోసారి సిగ్మండ్ ఫ్రాయిడ్ని తన మనసులోనే దాచుకొని తెలుగు సినిమా హీరోలు అంటే ఇలానే ఉండాలని రాసుకున్న సిద్దాంత శాసనాల్ని కాలరాస్తు సుకుమార్ రాసుకున్న కథే; ఆర్య2. మనిషిలో దాగియున్న భిన్న పార్శ్వాల్ని కథానాయికుడి పాత్రకు జోడించి తీసిన సినిమా ఇది. నిజం చెప్పాలంటే ఈ సినిమా కూడా చాలామంది దృష్టిలో ఫ్లాప్. ఆర్య సినిమానికి వచ్చిన పేరును, ఈ సినిమా తీసి పాడు చేసుకున్నాడని అన్న వాళ్ళు కూడా ఉన్నారు. సుకుమార్ ఏదైతే కొత్త పాయింట్ అనుకున్నాడో సినీ ప్రేక్షకులు దాన్ని పట్టుకోలేకపోయారు. అల్లు అర్జున్ పాత్రని, తమిళ సినీ పాత్రలతో పోల్చడం కూడా వినిపించింది. కానీ ఎక్కడా సుకుమార్కి గౌరవం తగ్గలేదు. ఎందుకంటే, ఆర్య 2 లో కూడా వినోదం కంటే విజ్ఞానమే పాళ్ళే ఎక్కువ కాబట్టి.

ఈ సారి మనిషిలో దాగి ఉన్న ఇగో (నేను) మీద ‘100% లవ్’ కథ రాసుకున్నాడు. ఇలాంటి సబ్జెక్టులు ఫిలాసఫర్స్ బోధించడం జనరల్గా జరుగుతుంటుంది. ఇగో గురించి మాట్లాడుతూ ‘జిడ్డు కృష్ణమూర్తి’ గారు ఏమన్నారో చూద్దాం! ‘‘అనుభవాన్ని మనం వ్యక్తిపరంగా అన్వయం చేసుకున్నంతకాలం, ‘నేను’ అనే భావాన్ని బలపరిచినవాళ్ళమే అవుతాం. ఈ భావం తన ప్రతిస్పందనం ద్వారా, ప్రతిక్రియ ద్వారా తనను తాను స్థిరం చేసుకున్నంతకాలం, సంఘర్షణనుంచి, అయోమయాన్నుంచి, వేదననుంచి అనుభవానికి విముక్తి అనేది వుండదు. ‘నేను’ అనే ప్రవృత్తి నుంచి, అంటే అనుభవం తనదిగా భావించే ప్రవృత్తినుంచి, తెలుసుకోవటం ద్వారా బయటపడ్డప్పుడే స్వతంత్రత అనేది లభిస్తుంది. ప్రతిక్రియలతో నిండివుండే నేను అనేది, అనుభవానికి అధికారికానప్పుడే అనుభవానికి పూర్తి ప్రాముఖ్యత సిద్ధిస్తుంది. అప్పుడు అనుభవం సృష్టిగా పరిణమిస్తుంది, వికసిస్తుంది; విజృంభిస్తుంది.’’[1]. ఈ విధంగా ‘సరైన విద్య’ అనే పుస్తకంలో చెప్పారు. ఈ పుస్తకం ఎంతమంది చదువుకున్న వాళ్ళు చదివారో తెలియదు గానీ, ‘100% లవ్’ సినిమా మాత్రం చదువుతో పనిలేకుండా అందరూ చూశారు. వెంటనే అర్థంకాకపోయినా ఏదో సందర్భంలో బాలు, మహాలక్ష్మీ పాత్రలతో తమని తాము పోల్చి చూసుకోవడం సహజంగా జరిగేలా ఇందులో ఉన్న ఫీలాసఫీ చేస్తుంది. ఇలా ప్రజలు కనక్ట్ చేసుకునేలా పాత్రల్ని మలచడంలోనే దర్శకుడి దార్శినికత బయట పడుతుంటుంది.

‘వన్ నేనొక్కడినే’ సినిమా అనేది మైండ్ గేమ్ అనడం చిన్నమాట అవుతుంది. అంతలా తన దర్శకత్వ ప్రతిభతో సైకిలాజికల్గా మనతో ఆడుకున్నాడు. సినిమా చూసినంత సేపు, రకరకాల అనుభూతులకు గురవుతాం. ఈ సినిమాతో మొదటిసారి సుకుమార్కి ప్రేక్షకుల నుండి షాక్ తగిలింది. కానీ ఎక్కడా గౌరవం తగ్గలేదు. దీనికి సాక్ష్యం తన తరువాత సినిమా మరో బిగ్ టాలీవుడ్ హీరో ఎన్.టి.ఆర్ ‘నాన్నకు ప్రేమతో’ తీయ్యడం మనం గమనించవచ్చు. ఈ సినిమా ఎన్.టి.ఆర్ ఫిల్మ్ కెరియర్లో ఓ అద్భుతం. లాజిక్కులతో సుకుమార్ చేసిన మ్యాజిక్కులు ప్రేక్షకుల్ని కట్టిపారేశాయి. ఇది లెక్కలు చెప్పే క్లాస్ రూమా? లేక సినిమా హాలా అంటూ కొందరు విమర్శించారు. ఇలాంటివి విమర్శలు సుకుమార్ని కాస్త ఆలోచనలో పడేశాయి. అంతే! ‘రంగస్థలం’ రణరంగం మొదలైంది.

‘మతం మత్తులాంటిది’. అని కర్షక, కార్మిక, వర్గాల వెన్నుపూస కారల్ మార్క్స్ చెప్పాడు. అదే ఈ రంగస్థలం సినిమాలో మనం చూడవచ్చు. ఇందులో విలన్ పాత్రైన ఫణీంద్ర భూపతి ఎప్పుడు పూజలు చేస్తుంటాడు. అతను చేసే అన్యాయాల్ని, అక్రమాల్ని  ప్రజలు ప్రశ్నించకుండా భక్తిమత్తులో ఉంచుతుంటాడు. తన ప్రయోజనాలకి ఎవరు అడ్డు వచ్చినా వారిని చంపేసి, దేవుళ్ళ ఖాతలో వేసేస్తుంటాడు. ఆనాటి సాంఘిక, ఆర్థిక, రాజకీయ నేపధ్యాల్ని సహజత్వానికి దగ్గరగా చిత్రించిన చిత్రం రంగస్థలం. ఇది ఇప్పటి మాట కాదులే! ఓ ముఫ్పైఏళ్ళ వెనుకటి మాట. ఇప్పుడంతా రోజులు మారాయి. కంప్యూటర్ కాలమని అనుకుంటుంటారు. కానీ వీళ్ళు గమనించని విషయం ఏమిటంటే? స్మార్ట్ ఫోన్ వాడుతున్న ప్రతీవాడు స్మార్ట్ కాదు. టెక్నాలజీ ముందుకు పోతుంది తప్పితే, మనిషి మాత్రం ఇంకా వెనకే ఉన్నాడు. దానికి సుకుమార్ ‘నేనొక్కడినే’ సినిమానే మంచి ఉదాహరణగా చెప్పుకోవచ్చు. జబర్దస్త్ టీవీ షోలు చూడానికే కొంతమంది స్మార్ట్ ఫోన్లు వాడుతున్న రోజులు నడుస్తున్న వేళ, వీళ్ళకీ కూడా నా సినిమా ఈజీగా అర్థమైయేలా సినిమా తియ్యాలనే సంకల్పంతో సుకుమార్ ముందుకి ఆలోచించకుండా ముఫ్పై ఏళ్ళు వెనక్కి ఆలోచించి రంగస్థలం సినిమా తీశాడు. ఇప్పటి జబర్దస్త్ జనాలు దానికి తోడు అవ్వడంతో రంగస్థలం వందరోజుల పండగ జరుపుకున్నది. మనం చదువుతున్న పుస్తకాల నుండి మనం చూసే సినిమాలు, టీవీ షోలు, తిరిగే స్నేహితులు ఇలా అన్ని కోణాల నుండి మన తాలుక తెలివిస్థాయి (ఐక్యూ) బయటకి తెలుస్తూనే ఉంటుంది.

‘‘ఒక ప్రాపంచిక దృక్పథం లేనప్పుడు మానవ వ్యక్తిత్వాన్ని సంపూర్ణంగా, స్వేఛ్ఛగా వ్యక్తం చేయటం సాధ్యం కాదు. అలాంటి ప్రాపంచిక దృక్పథాన్ని సాధించనంత వరకు నవల (సాహిత్యం) కొత్త జీవితాన్ని పొందలేదు[2]. రాల్స్ ఫాక్స్ ‘నవల – ప్రజలు’ అనే పుస్తకంలో చెబుతారు. ఏ సృజనకైనా రాసేవారికి సరైన ప్రాపంచిక దృక్పథం లేకపోతే, ఆ రాతలన్ని అల్లరిపాలు అవుతాయి తప్పితే, ఎవరికీ చర్చనీయాంశాలు కాలేవు. సుకుమార్ ఒక సినిమా దర్శకుడు మాత్రమే కానీ ఇప్పటి వరకూ ఆయన తీసిన సినిమాలు కేవలం వినోదాన్నే పంచితే ఆయన తప్పకుండా దర్శకుడే అయ్యిండేవాడు కానీ, విజ్ఞానాన్ని కూడా అందించబట్టే సుకుమార్ దార్శనిక దర్శకుడు అయ్యాడు.

ఇక ఆర్య సినిమా దగ్గరకు వస్తే ‘ఫీల్ మై లవ్’ అంటూ సుకుమార్ చేసిన మెస్మరైజ్ ఎప్పటికీ మరిచిపోలేనిది. అప్పటి వరకూ తెలుగు ప్రేక్షకులు కనీ, వినీ ఎరుగని లాజిక్కులతో ఒక అందమైన ప్రేమలోకంలో విహరించేలా చేశాడు. ఆర్య సినిమా చూసిన వాళ్ళను ‘సినిమా ఎలాగుందని ఎవరినడిగితే?’ ఆశ్చర్యమైన ముఖం పెట్టి ‘ఆ….సినిమా ఏమిట్రా బాబు! మైండ్ బ్లాక్ అయ్యిపోయింది’ అనడం నాకు ఇంకా గుర్తుంది. అప్పటి దాకా ముక్కుతూ, మూల్గుతూ ఉన్న తెలుగు సినిమా ఒక్కసారిగా ఉలిక్కి పడిలేచి, మనసారా సుకుమార్ని ఆత్మీయ ఆలింగనం చేసుకొని గర్వంగా తలెత్తుకుంది.

ఇక సుకుమార్ సినిమాలు పక్కన పెట్టేస్తే, అతని వ్యక్తిత్వం ఏమిటో చూద్దాం! ‘సుకుమార్’ పేరుకు తగ్గట్టే చాలా సుకుమారమైన వ్యక్తిత్వం కలిగిన వ్యక్తిగా ఆయన ఇంటర్వ్యూలు గమనిస్తే మనకు తెలిస్తుంది.‘‘ఏదైనా ఎవరినైనా అన్నానేమో; ఎవరినైనా బాధపెట్టానేమో; వాళ్ళకు అది చేస్తానన్నాను కానీ చేయ్యలేనేమో ఇలాంటి విషయాలు నేను ఎక్కువ ఆలోచిస్తుంటాను. ఇలాంటి ఆలోచనల నుండి బయటపడలేక పోతున్నాను’’[3]. అని టి.ఎన్.ఆర్. ఇంటర్వ్యూలో సుకుమార్ చెప్పాడు.

ఈ రోజుల్లో ఎంతమంది తమ పక్కనున్న వాళ్ళకోసం ఆలోచిస్తున్నారు?. తన దగ్గర పని చేస్తున్న సహాయక దర్శకులను, రచయితలను ఆయన ప్రతీ సినిమా పంక్షన్లలో ప్రత్యేకంగా పరిచయం చెయ్యడం గమనిస్తే, ‘ఎంత గొప్ప వ్యక్తిత్వం’ అనిపించక తప్పదు. గొడ్డు చాకిరీ చేయించుకొని తెర మీద పేరు వెయ్యడం పక్కన పెట్టండి! కనీస కూలిడబ్బులు కూడా ఇవ్వని ఈ సినీ మాయ రంగుల ప్రపంచంలో ఇంత సుకుమారమైన హృదయంతో ఇంతకాలం నుండి ఎలా నెట్టుకు రాగలుగుతున్నాన్నది నాకు పెద్ద ప్రశ్న?. ‘మాయమైపోతున్నడమ్మా మనిషన్నవాడు మచ్చుకైన లేడు చూడూ మానవత్వం ఉన్నవాడు’. అనే పాట రాసిన అందేశ్రీ గారికి సుకుమార్ని చూపిస్తే ఆయన ఖచ్ఛితంగా గర్వపడతారనడంలో ఏమాత్రం అతిశయోక్తి లేదు.

మనిషి మేధస్సనేది హృదయాన్ని స్పందించకుండా మొద్దుబారుస్తుంటుంది. అలా కాకుండా ఉండడమనేది ఫీలాసఫర్స్ కు మాత్రమే సాధ్యమైయ్యేపని. మనుషుల్లా కనిపించే మరబొమ్మల మధ్య ఓ మట్టిగుండె ఇంకా గట్టిగానే కొట్టుకుంటుంది. ఆ సుకుమార హృదయాన్ని మసకబారనియ్యక ఓ…నా..దార్శనిక సుకుమారమా!

[1] . జిడ్డు కృష్ణమూర్తి. ‘సరైన విద్య’. వ్యాసాల సంపుటి.

[2] . రాల్స్ ఫాక్స్ నవల- ప్రజలు” (తెలుగుసేత-వల్లంపాటి వెంకటసుబ్బయ్య)

 

[3] . సుకుమార్. టి.ఎన్.ఆర్. ఇంటర్య్వూ. (జనవరి 29/2016.)

ప్రవీణ్ యజ్జల

10 comments

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

  • సినిమాని మీరు చూసే విధంగా అందరూ చూడలేమోరే… అందుకే ఇంత బాగా లో రాయగలుగుతు న్నారు.. మంచి వ్యాసం..🤗

  • 100℅ గ్లోరిఫికేషన్! సుకుమార్ ఒక ప్రతుభావంతుడైన మాములు కమర్షియల్ దర్శకుడు. మీరు జిడ్డు కృష్ణమూర్తి తో ఆపినందుకు ధన్యవాదాలు. ఇంకానయం కార్ల్ మార్క్స్ తరువాత స్థానం సుకుమార్ దే అనలేదు. వ్యక్తిగత అభిమానానికి ఫిల్మ్ క్రిటిసిజం రూపం ఇవ్వకండి దయచేసి. అది మీ ఇమేజి కే నష్టం.

    • ఇప్పుడున్న ఎంతోమంది తెలుగు సినీ దర్శకులకంటే ఎంతో నయమైనవాడు సుకుమార్. అందువల్ల అంత సమర్ధింపు అవసరమని తలచే పూర్తి స్పృహతో రాశాను. మీకు అనవసరం అనిపిస్తే మీరు మరో వ్యాసం రాయండి అంతకంటే గొప్పగా, మీకు గొప్పనిపించిన దర్శకుడి మీద!. నా కష్టనష్టాలు నేను చూసుకోగలను, మీ సలహాకు ధన్యవాదాలు.!

  • Totally agree with Aranya Krishna gari’s comment. సుకుమార్ ఒక డిఫరెంట్ బట్ స్టిల్ పక్కా కమర్షియల్ డైరెక్టర్. హీరోయిన్ల అంద చందాలు, ఐటమ్ సాంగ్ లు లేకుండా సినిమా తీయలేని ఒక మామూలు డైరెక్టర్.
    “ రెండువేల నాలుగు నుండి, ఇప్పటి వరకూ పద్నాలుగు సంవత్సరాల సినీ జీవితంలో ఏడు సినిమాలు మాత్రమే ఆయన తీశాడు. ఇక్కడే అర్థమౌతుందిగా ఈ చర్చకు సుకుమార్ అర్హుడా? కాదా? అనేది. “ ఇందులో గొప్ప విషయమేముంది? రాజమౌళి 5-6 ఏళ్ళలో ఒక్క సినిమా తీసాడు, కృష్ణవంశీ సినిమా తీసి ఎన్నేళ్ళయ్యుందో. వాళ్ళిద్దరూ చటుక్కున గుర్తుకొచ్చేరంతే. ఈయన కంటే వాళ్ళు మంచి డైరెక్టర్లని కాదు. డైరెక్టర్లు తక్కువ సినిమాలు తీయడం వాళ్ళు గొప్పవాళ్ళనడానికి కొలబద్ద ఎలా అవుతుంది?

    • అప్పుడెప్పుడో ఆర్య సూపర్ హిట్. మళ్ళీ అలాంటి సూపర్ హిట్ రంగస్థలంతో అందుకున్నాడు. ఈ మధ్యన వచ్చిన సినిమాలన్ని యావరేజ్ హిట్స్. మరి మీరు చెప్పిన ఐటమ్ సాంగ్స్ వీటిలోనీ ఉన్నాయి కదా? మరి ఆర్యా, రంగస్థలం అంత పేరు ఎందుకు రాలేదు. జనాలను ఆకట్టుకుంటూనే తను అనుకుంటున్న సినిమాలు తియ్యాలి. కాదని తన నమ్మిన సిద్ధాంతమే గొప్పని సినిమాలు తీశాడు కనుకే అవి ఆడలేదు. నాకో సామెత గుర్తుకు వస్తుంది ఈ సందర్భంలో ‘అదుగో పులి అంటే అదిగో తోక’ అన్నారట!

  • ≤ కొంతమంది బడుద్దాయిలు …. వినోదం అంటారు తప్ప విజ్ఞానం అంటారు>

    ఈ వాక్యం దగ్గరే ఈ వ్యాసం పరిస్థితి అర్థమైపోయింది. రింగ రింగ , ఆ అంటే అమలాపురం, డియాలో ……లాంటి పాటలతో ఏమి విజ్ఞానం నేర్చుకున్నారో, అసలు విజ్ఞానం అనే పదాన్ని ఏ అర్థం లో వాడారో తెలపగలరు.

    పుస్తకాల్లో మూలుగుతున్న ఫ్రాయిడ్ సిద్దాంతాలని సినిమాల్లోకి తీసుకొచ్చారా….?
    వామ్మో….!

    టంగుటూరి ఆవాలు తాటికాయలంత అంటే ఏమిటో అనుకున్నా

    • మీరు ఆ పాటల దగ్గర ఆగిపోయారు. నేను దాన్ని దాటి చూడగలిగాను. అందుకే ఇది రాయగలిగాను. మీరు ఆగిపోయారు కనుకే మళ్ళీ ఈ వ్యాసంలో కూడా ఆ పాటల్నే వెతుకున్నారు. 100్% లవ్ సినిమాలో ఇడ్, ఇగో, సూపర్ ఇగో మూలాలనుండే బాలు, మహాలక్ష్మి పాత్రలను మలచడం జరిగింది. జగడం సినిమాలో అయితే ఫ్రాయిడ్ చెప్పిన వాక్యాలతోనే టైటిల్స్ మొదలౌతాయి. మీకు గుర్తు లేకపోతే ఆ పుస్తకాలు చదవండి. అంత ఓపిక లేకపోతే కనీసం ఆ సినిమా టైటిల్స్ అయినా చూడండి. బహుశా అలాంటి వాక్యాలు పాటలు,ఫైట్లు, కామిడీల దగ్గర ఆగిపోయిన బడుద్దాయిల కోసం రాశానులేండి. మీకోసం కాదులే కంగారుపడకండి!

‘సారంగ’ కోసం మీ రచన పంపే ముందు ఫార్మాటింగ్ ఎలా ఉండాలో ఈ పేజీ లో చూడండి: Saaranga Formatting Guidelines.

పాఠకుల అభిప్రాయాలు