Closure

“నా ప్రేమకి సరిపోయే దగ్గరితనం మన దేహాలు ఇవ్వట్లేదనుకున్నాను. ఇప్పుడు నవ్వొస్తుంది. ఆ అజ్ఞానం ఇంకొన్నాళ్ళు ఉంటే బాగుండనిపిస్తుంది.”

రాము,

మన ప్రయాణం ఎదో ఒక రోజు ముగుస్తుందనీ తెలుసు, అప్పుడు ఇలాంటి ఉత్తరం ఎదో నేను రాస్తాననీ తెలుసు. కానీ ఇంత చిన్న ఉత్తరం రాస్తాను  అని మాత్రం అనుకోలేదు. నీకు ఇలాంటి ఉత్తరాలు  నచ్చవు అని తెలుసు కానీ ఇది రాస్తుంది నీకోసం కాదు, నా కోసం. ఇంత పెద్ద ఘట్టానికి closure లేకుంటే ఎలా?

ప్రతి అక్షరానికీ దాని రచయిత నిర్దేశించే ఉద్దేశం, ఉపయోగం ఉండి తీరుతుందనే నువ్వు, మనుషులకి అలాంటి సంకల్పాన్ని ఆపాదిస్తే మాత్రం నవ్వేస్తావు. నువ్వు  ఎప్పుడూ అనేటట్టు  మన భావాలన్నీ ఆవిరైన రసాయనాలేనా? ఇరవై నాలుగుగంటలూ శూన్యంలోకే చూసే  నీకు అంత మాట అనే హక్కు ఎలా ఉంటుంది?

నీతో ఉన్నప్పుడు ఏ మధ్యాహ్నం పూటో టీ పెడుతూ కిచెన్ లోంచి నిన్ను చూస్తే బాల్కనీ లో ఆకాశం వైపు చూస్తూ సిగరెట్ తాగుతూ కనిపిస్తావు. ఆ సిగరెట్ అయిపోయాక అక్కడి పావురాలతో కలిసి ఎగిరిపోతావేమో అని భయమేసేది.

అయినా పక్షుల్లా ఎగిరే ఫాంటసీలు కావులే నీవి. పుస్తకాల  పురుగులు సీతాకోక  చిలుకలు కావు కాబోలు ఎప్పటికీ. జ్ఞానం ఎవర్ని ఉద్ధరించిందని?  ప్రపంచమంతా తిరిగొచ్చి ఏం కనిపించిందంటే నేను తప్ప ఏమీ కనిపించలేదన్నాడట ఒక యోగి. “ఎంత ఇగో?” అన్నావు నేనా కథ మొదటిసారి చెప్పినప్పుడు.  నువ్వు అంత చిన్నబుచ్చినా నీ పోలికలు చాలా కనిపిస్తాయి అతనిలో. ఈ ప్రపంచం లో దేన్ని  కొలవటానికైనా నీ ఆలోచనా, అభిప్రాయమే కొలమానం అయితే  అది ఇగో కాదంటావా? నిన్ను ఈ లోకానికి తీర్పు తీర్చమని ఎవరు నియమించారు? ఇలా ఏమైనా అడిగితే “నీకు చెప్పినా అర్ధం కాదులే” అన్నట్టు ఒక నవ్వు నవ్వుతావు. లాగిపెట్టి ఒక్కటివ్వాలనిపించేది అప్పుడు.

క్షణానికి ఒక సారి నిండిపోయే సముద్రం నీ ఆలోచన. దాన్ని ఎక్కడ పారబోయలో తెలీక సరిపోవని తెలిసినా విస్కీ గ్లాసులు కొంటూనే  ఉంటావ్. ఎన్ని వేల గ్లాసులు కావాలి మన జ్ఞాపకాల్ని ఒంపాలంటే,  నింపాలంటే? నన్ను గుర్తుపెట్టుకుంటావా? లేక Thoreau లాగా resign from the influence అంటావా? లేక జ్ఞాపకాలు సమయం చెక్కే బొమ్మలు అని మళ్ళీ నాకు అర్ధం కాని ఫిలాసఫీ చెప్తావేమో. (అసలు ఊపిరి ఎలా ఆడుతుంది అన్ని నిక్కచ్చి నిజాల మధ్యలో?)

సత్యం నిన్ను స్వతంత్రుణ్ణి చేస్తుంది అన్న జీసస్ కి  నిన్ను చూపించాలనిపిస్తుంది. ఒక్కోసారి సిసిఫస్ లాగ ఒకే రాయిని అదే కొండపైకి ఎక్కిస్తున్నట్టు అనిపిస్తావ్. అంతులేని దుగ్ద ని కళ్ళ నిండా నింపుకొని, చిరునవ్వుతో కప్పమంటే మాత్రం నామోషీ చూపిస్తావ్.  నవ్వటం ఒక blasphemy నీకు. ప్రకృతికీ, ఉనికికీ ఎదో positive acknowledgement ఇచ్చేసినట్టు, అమ్మా  ఎంత ఆశ విశ్వానికి? కానీ నువ్వు దేవుడివి కావు రాము. ఎందుకో నువ్వు దేవుడిమీద  పగబట్టినట్టు కనిపిస్తావ్, అందుకే చెప్తున్నా. ఇన్ని ఫిలాసఫీలు వడబోసిన నీకు,  అన్నం మీద అలిగిన పిల్లాడికీ తేడా  లేకపోవటం బాధ కలిగిస్తుంది అప్పుడప్పుడూ. ఆ నాటకమేదో ఆడేసి తెర వెనక్కి పోవటం మాత్రమే ఖాయం అన్నప్పుడు, కథకి వంకలు పెడుతూ కూర్చోవటం సమంజసం అంటావా? నాకు సమాధానం చెప్పొద్దు. నువ్వు బదులివ్వటం మొదలుపెడితే నీ సమాధానాలకి నా ప్రశ్నలు చిన్నబోగలవు అని తెలుసు. నీ అంత మేధ లేకపోవటం ఎంత అదృష్టమో!

మనం మొదట కలిసినప్పుడే ఈ రోజు ఎప్పుడొస్తుందో ఊహించి ఉంటావు. నీలా అంత దూర దృష్టి లేక నేను కలలు కన్నాను. అందుకే కాబోలు, ఎంత గాఢంగా కౌగిలించుకున్నా నువ్వు ఎక్కడో దూరంగా ఉన్నట్టే ఉండేది. నా ప్రేమకి సరిపోయే దగ్గరితనం మన దేహాలు ఇవ్వట్లేదనుకున్నాను. ఇప్పుడు నవ్వొస్తుంది. ఆ అజ్ఞానం ఇంకొన్నాళ్ళు ఉంటే బాగుండనిపిస్తుంది.

నీ నుండి నువ్వు దూరం వెళ్లే కొద్దీ నీకు నువ్వు దగ్గర అవుతావని ఎప్పుడు తెలుసుకుంటావ్ రాము? నేను చెప్పిన కథలో యోగి చెప్పేది కూడా అదే. అది ఇగో కాదు. మెరుపు లోని క్షణికం, ఆకాశం లోని అనంతం రెండూ నీలో ఉంటాయని అప్పుడు ఎదో రాసావ్. నిన్ను నువ్వు మెరుపులోనూ, మేఘంలోనే కాదు, మనుషుల్లో కూడా వెతుక్కోవచ్చు. ఒక అవకాశం ఇచ్చి చూడు, వాళ్లు  కూడా మెరుస్తారు,  కురుస్తారు.

నీకు తెలిసినవే చెప్తున్నా అని ఈ ఉత్తరం ఎప్పుడైపోతుందా అని అనుకుంటున్నావని తెలుసు. నీ దగ్గర ఉన్నా చూసుకోవని మన జ్ఞాపకాల్ని నేనే తీసుకుపోతున్నా. అడగలేదని ఏమీ అనుకోకు.

సెలవు.

నీ,

ప్రియ

 

స్వరూప్ తోటాడ

6 comments

Leave a Reply to Y. Sekhar Cancel reply

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

  • Why the most promising minds of our generation in Telugu are hankering after movies, inferior medium compared to literature (IMO). Is it ambition, to make it big in life? I don’t know can’t tell. But I wish they intermittently condescend to literature, write something, make the scene more appealing, happening. చుట్టూ యంగ్ రైటింగ్ పేరుతో అచ్చవుతున్న చెత్తతో పోలిస్తే కథ బాగుంది. బాగుందనటం కన్నా, రచయిత చేత ఇంకా మంచి కథలు రాయించే ప్రామిస్ దేన్నో వ్యక్తం చేస్తుందని చెప్పాలేమో.

  • I feel her pain. She wrote a closure for herself. I hope she didn’t mail it to him.

    Lovely lines, some. Dripping a deep understanding of lack of understanding.

‘సారంగ’ కోసం మీ రచన పంపే ముందు ఫార్మాటింగ్ ఎలా ఉండాలో ఈ పేజీ లో చూడండి: Saaranga Formatting Guidelines.

పాఠకుల అభిప్రాయాలు