Block the Life

భర్త వచ్చాక మొత్తం చెప్పాలి. ఇంక కథలు రాసింది చాలు అంటాడా?

క్క క్షణం స్క్రీన్ మీద కనిపిస్తున్నదేంటో అర్ధం కాక కళ్ళూ చీకిరించి చూసిందామె. అర్ధం అయ్యాక వళ్ళు చల్లబడినట్లయి చెమటలు పట్టి, వాంతి కొస్తున్నట్లు అనిపిస్తే ఫోన్ టేబుల్ మీద పడేసి వాష్‌రూం కి పతిగెత్తింది. మధ్యాన్నం తిన్న అన్నంతో సహా బయటకి వచ్చేసాక  నోట్లో నీళ్ళు పుక్కిలించి ఊస్తున్నప్పుడు మళ్ళీ మోగిందామె ఫోన్.

అఫీషీల్ కాన్ఫరెన్స్ లో ఉందా రోజు. సాయంత్రం నాలుగు గంటలప్పుడు టీ బ్రేక్‌లో వాట్స్అప్ తెరిచింది. కొన్ని అఫీషియల్, పర్సనల్ మేసేజుల మధ్యలో ఒక కొత్త నంబర్.

“ హాయ్ మేడం ఎలా ఉన్నారు”

“బిజీనా”

“కాల్ చేయనా ఒకసారి”

ఎవరో అర్ధం కాక తిరిగి రిప్లై ఇచ్చింది.

“హూ ఈస్ దిస్?”

ఈలోపే మళ్ళీ మీటింగ్ మొదలవ్వడంతో ఫోన్ పక్కన పెట్టింది.

వారం ముందు వరకూ  అలా కొత్త నంబర్ నుంచి మెసేజ్ వస్తే  ఏ టెన్త్ , ఇంటర్ క్లాస్మేట్లో కొత్తగా పెట్టుకున్న వాట్సాప్  గ్రూపుల ఫలితం  అనుకుని ఎక్సయిట్ అయ్యేది . కానీ  పరిస్థితి ఇప్పుడలా లేదు.   వెంటనే వీడియో కాల్. “ఎవరో బాగా తెలిసిన వాళ్ళే… “ అనుకుందామె.  కాస్త ఎబ్‌నార్మల్ గా అనిపించినా మీటింగ్ లో ఉంది కాబట్టి ఎత్తలేదు.

అయిదున్నరకి మళ్ళీ కాల్ వచ్చింది. అది ఆరోసారి. మీటింగ్ అయిపోయాక  పిచ్చాపాటీ మాట్లడుకుంటున్నారు.

కాల్ లిఫ్ట్ చేసినప్పుడు జరిగింది ఇదంతా.

వాష్‌రూం లోంచి బయటకి వచ్చి ఇంకా మోగుతున్న ఫోన్ ను స్విచాఫ్ చేసి పక్కన ఉన్న వాళ్ళని చూసింది. ఎవరన్నా అబ్సర్వ్ చేసారా అని. ఆమెకి ఇంకా వణుకు తగ్గలేదు.

బయటకు వచ్చి కార్‌లో కూర్చున్నాక మళ్ళీ మోగింది ఫోన్. వీడియోకాల్. కట్ చేయబోతూ స్క్రీన్ షాట్ తీస్తే బాగుండనిపించి ఫోన్ ఎత్తింది. మళ్ళీ అదే దృశ్యం. వణుకుతున్న చేతుల్తో  స్క్రీన్ షాట్ కోసం మూడు వేళ్ళతో స్క్రీన్  మీద స్వైప్ చేసింది. ఈలోపే కాల్ కట్ అయింది. నిస్సత్తువగా కాసేపు స్టీరింగ్ ముందు కూర్చుండిపోయింది. కార్ స్టార్ట్ చేయబోతూ అనుమానం వచ్చి తను బ్లాక్ చేసిన కాల్స్ లిస్ట్ తీసి చూసింది. అదే నంబర్. నార్మల్ మెసేజుల్లోకి వెళ్లి చూసింది. ఆ నంబర్ నుంచి వచ్చిన మెసేజ్ లన్నీ బ్లాక్డ్ మెసేజెస్ లో సేవ్అయ్యి ఉన్నాయి. 47 మెసేజ్ లు. ఒకే నంబర్. నీచమైన భాష. ఒక్కసారి దుఃఖం, కోపం తన్నుకు వచ్చాయామెకి. కాల్స్ లిస్ట్ స్క్రీన్ షాట్ తీసి హెల్ప్లైన్ లో ఉన్న స్నేహితురాలికి పంపి.. ఏం జరిగిందో వాయిస్ మెసేజ్‌లో చెప్పడం మొదలెట్టింది. టైప్ చేసే ఓపిక లేదామెకి.

అసలిదంతా వారం  క్రితం మొదలయింది.

*         *          *

“అక్కా రాంగ్ టైం లో వచ్చినట్లున్నాం కదా” నవ్వుతూ అంటున్న తమ్ముడి వైపు చూసి సమాధానం చేప్పేలోపే ఆమె ఫోన్ మళ్ళీ మోగింది. అవతల మాటలు వింటూ విప్పారిన మొహంతో “థాంక్యూ, థాంక్యూ..” చెప్తోందామె.

ఆ రోజామె కథ పబ్లిష్ అయ్యింది. ఇప్పుడిప్పుడే కథలు రాస్తోంది. ఆ రోజు కథ ఒక దిన పత్రిక ఆదివారం అనుబంధంలో వచ్చింది. అప్పటి నుంచీ మొదలయ్యాయి ఫోన్లు. కథ పంపినప్పుడు ఫోన్ నంబర్ ఇవ్వడానికి సందేహించింది కానీ, ఇప్పుడు వరస బెట్టి ఫోన్లొస్తుంటే ఆమెకి చాలా  సంతోషంగా వుంది.

“ఈరోజుకి నన్ను అసిస్టెంట్ గా పెట్టుకో అక్కా” తమ్ముడు ఏడిపిస్తుంటే  ఫక్కున నవ్వేసింది గానీ, ఆమెకి చాలా  గొప్పగా గర్వంగా ఉందారోజు. కథ రాసినప్పుడే ఆమెకి ఆ కాన్సెప్ట్ పట్ల నమ్మకం ఉంది. కానీ అంత రెస్పాన్స్ మాత్రం వూహించలేదామె. ఎవరెవరో తెలీని వాళ్ళ దగ్గర్నుండీ.. “ఒకసారి వీళ్ళని కలిస్తే బాగుండు..” అనుకున్న రైటర్స్ దాకా బోలెడు రెస్పాన్స్.. సాయంత్రం దాకా ఆకాశంలో తేలుతున్నట్లే ఉంది. రాత్రికి అందరూ నిద్రపోయాక వంటిల్లు  సర్దుకుని తనూ పడుకుంది. తమ్ముడి కుటుంబం రావడం వల్ల పని వత్తిడి ఉన్నా, అది ఆమెకి ఎప్పుడూ సంతోషమే కాబట్టి హాయిగానే ఉంది. కానీ, పొద్దున్నుంచీ ఫోన్లో మాట్లాడి మాట్లడి అలసిపోయిందామె.

ఫోన్ చార్జింగ్ పెట్టి, ఫ్లైట్ మోడ్‌లో పెట్టబోతుండగా వచ్చిందా ఫోన్.

“ఇంతకీ మోకాలు నెప్పి తగ్గిందా..”

ఒక్క క్షణం అర్ధం కాక.. “ఎవరూ” అడిగింది.

“మోకాలు నెప్పని రాసారు కదా.. తగ్గిందా అని”, అటుపక్క నవ్వు.

అప్పుడు వెలిగిందామెకి. ఆరోజు పబ్లిష్ అయిన కథ గురించి  మాట్లాడుతున్నాడతను. విసురుగా ఫోన్ పెట్టేసింది. ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి పడుకుంది.

భర్త ఇంకా హాల్లో టీవీ చూస్తున్నాడు. క్రికెట్ మేచ్ కామెంటరీ వినిపిస్తోంది. పొద్దున్న  నుంచీ పనీ, పోన్ కాల్స్.. అలసిపోయిందామె. కానీ, ఆ అనుభవం కొత్తగా ఉంది. ఎడిటర్ తన కథని సెలెక్ట్ చేసాక ఫోన్ నంబర్ ఇస్తాం.. అన్నప్పుడు కొంచం ఆలోచించింది గానీ, ఇంకా నయం ఇవ్వకపోయి ఉంటే ఈ రెస్పాన్స్ అంతా మిస్ అయ్యి ఉండేదాన్ని కదా.. మనసులో అనుకుంది.

పొద్దున్న నుంచి ఎన్ని ఫోన్లు  వచ్చి ఉంటాయి. లెక్క పెట్టుకోవాలనిపించింది. ఉషారుగా లేచి ఫోన్ ఆన్ చేసింది. మిస్డ్ కాల్ అలెర్ట్ తో పాటు ఒక మెసేజ్.

“ఫోన్ స్విచాఫ్ చేసావెందుకు?”

విసుగ్గా నంబర్ బ్లాక్ చేసి పొద్దున్న నుంచి వచ్చిన కాల్స్ మెసేజ్‌లూ లెక్కపెట్టుకోవడం మొదలెట్టింది.

సీరియస్ గా రాయాలింక. సగం రాసి వదిలేసిన కథలన్నీ పూర్తి చేయాలి బలంగా మనసులో అనుకుని, వచ్చిన మెసేజ్‌లు అన్నిటికీ రిప్లై ఇవ్వడం మొదలుపెట్టింది.

రెండు మెసేజ్‌లకి రిప్లై ఇవ్వగానే వాట్సప్ లో వచ్చిందొక అలెర్ట్.

ఈసారి ఇంకో  నంబర్.

“ఆంటీ యూ లూక్ హాట్ ఇన్ డీపీ”

ఈ ఆంటీ అన్న పదం వరస నుంచి వెకిలిగా మారి చాలా ఏళ్ళయింది.

చటుక్కున రిపోర్ట్ అండ్ బ్లాక్ కొట్టి వాట్స్అప్ సెట్టింగ్స్ లోకి వెళ్ళి డీపీ వ్యూ సెట్టింగ్స్ మార్చింది.

ఒక్కసారి నీరసంగా దుఃఖంగా అనిపించిదామెకి.

అనవసరంగా నంబర్ ఇచ్చానా.. అప్పటికి ఆ అరగంటలో ఏ పదోసారో ఆ మాట అనుకోవడం. టివీ కట్టేసి లోపలికి వచ్చిన భర్త, “ఇంకా నిద్రపోలేదా. ఎలా ఉందీరోజు.  కథకి రెస్పాన్స్ ఎలా వుంది?” అనడిగాడు. బానే వుందన్నట్లు తలూపింది గానీ, ఆ ఫోన్ కాల్ విషయం చెప్పాలనిపించలేదామెకి. ఇందాక ఉన్నంత చిరాకు అప్పటికి లేకపోవడం, భర్తతో చెప్తే, తన మనసులో రేగుతున్న ఆలోచనల్లానే నంబర్ ఇవ్వకుండా వుండాల్సిందనీ అంటాడేమోనన్న బెరుకు డామినేట్ చేయడం.. రెండూ కారణాలు. ఇంక మిగిలిన మెసేజులకి రిప్లై ఇవ్వడం ఆపి, వాట్సప్ లోంచి బయటకి వస్తూ ఆప్ ఐకాన్ మీద చూసింది. అన్రేడ్ మెసేజ్‌లు 66. ఒకవేళ అవన్నీ ఆమె అప్పుడే చదివుంటే ఆరాత్రి ఆమె నిద్రపోయి ఉండేది కాదు.

మర్నాడు పొద్దున్న భర్త  ‘ఆఫీసులో డ్రాప్ చేస్తా’, అన్నప్పుడు దారిలో వాట్సాప్  తెరిచి అదిరిపడిందామె. కథ గురించి వచ్చిన మెసేజ్ లతో పాటు కనీసం పదిహేను కొత్త  నంబర్ల నుంచి పిచ్చి పిచ్చి మెసేజ్‌లు. అన్నిటినీ బ్లాక్ చేసి నెమ్మదిగా చెప్పింది భర్తకి. అతన్నుంచి ఒకటే జవాబు.

“నంబర్ ఇవ్వకుండా వుండాల్సింది”

తనేం  కోరుకుంది తన కథల ద్వారా.. తనలోపలి అలజడి దించుకోవాలనుకుంది. తను చర్చించిన విషయాలు కనీసం నలుగుర్నైనా ఆలోచింపచేస్తాయనుకుంది. అంతేనా… కాస్త గుర్తింపు  కూడా కోరుకుంది. అలా కోరుకోవడం తప్పా.

ఇది జరిగిన రెండు రోజులు అంతా సజావుగానే అనిపించింది . మూడో రోజు సాయంత్రం ఆఫీస్ నుంచి వచ్చి కాఫీ కోసం పాలు పొయ్యిమీద పెట్టి కూరగాయలు నీళ్లలో వేస్తున్నప్పుడు హాల్ లో ఉన్న ఫోన్ మోగింది.

“ఫోన్ చూడవా” భర్తని కేకేసింది

“ఏదో కొత్త నంబర్”, ఫోన్ లిఫ్ట్ చేయకుండానే తెచ్చిచ్చాడాతను. తడి చేతులు నైటీకి తుడుచుకుని బెరుగ్గానే ఎత్తింది. మొదటిరోజు కొత్త నంబర్ల దగ్గర్నుంచి కాల్ వచ్చినప్పుడు ఉన్న ఎక్జయిట్‌మెంట్ ఇప్పుడు లేదు.

“హలో”

“నా పేరు కార్తీక్ అండీ. మీ కథ చదివాను. బాగుందండీ”

ఆ మాటలు విన్నాక మళ్ళీ ఉత్సాహం వచ్చేసింది.

“థాంక్యూ సో మచ్ అండీ. థాంక్యూ” ఉషారుగా సమాధానం చెప్పింది.

“ఎప్పుడన్నా  మీతో మాట్లాడొచ్చా, మీకు ఫ్రీ ఉన్నప్పుడు?”

” అయ్యో.. తప్పకుండా”, ఇంకా కథ మూడ్ లోనే ఉంది కానీ ఎక్కడో తేడా కొడుతోంది.

” ఏ టైమ్ లో చేయమంటారు?”

సమాధానానికి కాస్త పాజ్ తీసుకుంది.

” మీకు పెళ్లయిందా”

చటుక్కున ఫోన్ పెట్టేసింది.

రెండు నిముషాల్లో మళ్లీ మోగింది సెల్. అదే నంబర్.

” కట్ చేస్తారేంటండీ”

“చెప్పండి” గొంతు కాస్త పెంచింది.

” పెళ్లయిందా మీకు”

“……”

“నంబర్ ఇచ్చావు. ఫోన్ చేస్తే మాట్లాడవు. చెప్పు పోనీ ఎప్పుడు కాల్ చేయనూ” అటు నుంచి ఏకవచనం

“కథ చదివానని చెప్పారు కదా. దాని గురించి మాట్లాడాలి అనుకుంటే మాటాడండి” వీలైనంత  నెమ్మదిగా సమాధానం చెప్పింది. అంతకన్నా గట్టిగా అరవడానికి పక్కన భర్త ఉన్నాడు. షేర్ చేసుకోవడానికి భయంగా ఉందామెకి. ఈ తలనెప్పులు అవసరమా అంటాడని భయం.

అతను కథ చదవలేదనీ నంబర్ కనిపించీ, పైన ఆడపేరు కనబడగానే చేసాడని అర్ధం అవ్వడానికి ఎక్కువ సేపు పట్ట లేదామెకి. ఒకసారి తలదించి నైటీ వేపు చూసుకుంది. తెల్లటి నైటీకి నడుం కిందగా అటూ ఇటూ మరకలు. తను తుడుచుకున్నవే జిడ్డు, మట్టి మరకలు.

నంబర్ బ్లాక్ చేసి ఫోన్ పక్కన పడేసింది. కానీ మిగిలిన నంబర్లలా ఈ నంబర్ ఆగలేదు. బ్లాక్ కాల్ అలెర్ట్ ఆరోజు రాత్రంతా బ్లింక్ ఆవుతూనే  ఉంది.

మర్నాడు ఆఫీసుకి హాఫ్ డే  సెలవని మెయిల్ పెట్టి, స్నేహితురాలి దగ్గరికి బయలుదేరింది. మహిళా సంఘంలో పనిచేస్తుందామె. పోలీస్ డిపార్ట్మెంట్ లో కాస్త కాంటాక్స్ ఉన్నాయి. కేస్ కాకపోయినా కనీసం వార్నింగ్ ఇస్తారుగా. కార్ ఎక్కి డ్రయివింగ్ సీట్ లో కూర్చుని స్టార్ట్  చేయబోయే ముందు ఒకసారి అద్దం తన వేపు తిప్పుకుని చూసుకుంది. ఒక్కసారి నవ్వూ ఏడుపూ రెండూ వచ్చాయి. మొన్న కథ పబ్లిష్ అయిన ఉదయం ఉన్న హుషారు ఎక్కడికి పోయింది. ఆరోజు పొద్దున్న రెస్పాన్స్ చూడగానే సగం రాసి పక్కన పెట్టిన ఇంకో నాలుగు కథలు ఈ వారంలో పూర్తి  చేసేద్దాం అనుకుంది. కానీ ఒక్క అక్షరం కూడా ముందుకి వెళ్ళ లేదు.

ఈ అగంతకులు తనని గాయపరుస్తున్నారా… తనకి తనే గాయం చేసుకుంటోందా. పబ్లిక్ గా తను నంబర్ ఇవ్వడం తప్పా. ఒకవేళ అలా ఇస్తే తనింక అవైలబుల్ గా ఉన్నట్లేనా. స్నేహితురాలు ఫోన్లో తనకి తెలిసిన ఇన్స్‌పెక్టర్ చేత మాట్లాడించింది. అక్కడా అదే సలహా “నంబర్ బ్లాక్ చేయండి. కానీ, ఇప్పటికే మీ నంబర్ పబ్లిక్‌లోకి వెళ్ళింది కాబట్టి, నంబర్ మార్చుకోండి”

నంబర్ మార్చుకోవాలా.. అమ్మాయిల డ్రెస్సింగ్ వాళ్ళ మీద జరిగే హింసకి కారణం అనే వాళ్ళకీ , వీళ్ళకీ ఎమన్నా తేడా ఉందా. బయటకి వచ్చేటప్పుడు, “వాడు మళ్లీ చేయడు. గట్టి వార్నింగ్ పడుతుంది” స్నేహితురాలు చెప్తే, రిలాక్స్ గా ఇంటికి వచ్చేసింది.

రెండు రోజులు బ్లాక్ లిస్ట్ అలర్ట్స్ కూడా తీసేసి, కొత్త నంబర్లు ఎత్తకుండా వదిలేసింది.

ఆతర్వాత రోజు సాయంత్రం వచ్చింది ఈ వీడియో కాల్.

*  *  *

మర్నాడు మళ్లీ హాఫ్ డే సెలవు పెట్టి స్నేహితురాలు చెప్పిన ఇన్స్పెక్టర్ ని కలవడానికి వెళ్ళింది.

” మీరు పంపిన స్క్రీన్ షాట్లు నాకు రాత్రే పంపారండీ. వాడికి అప్పుడే గట్టి వార్నింగ్ వెళ్ళింది”.

” వార్నింగ్ ఇచ్చారా. రాత్రి పదిన్నర కి మళ్లీ కాల్ వచ్చింది చూడండి” వాట్సప్ కాల్ లిస్ట్ చూపించింది.

” నిన్న సాయంత్రం వీడియో కాల్ చేస్తే, రాత్రి దాకా ఎందుకు బ్లాక్ చేయలేదు?” విసుగ్గా అడిగాడాయన.

“ఏం జరిగిందీ??”, ఇంకో ఆఫీసర్ దగ్గరకు వచ్చి అడిగాడు.

వీడియో కాల్ లో తనేం చూసిందో.. ఇప్పుడు వీడికీ చెప్పాలా… తల పట్టుకుందామె.

“ఇంకేం చెయ్యమంటారు మేడమ్… మీరు చెప్పిన నంబర్ కి కాల్ చేసి ఆ కుర్రాడికి వార్నింగ్ ఇచ్చాను. వాడేమో నేను కాదు అని మొత్తుకుంటున్నాడు. నా ఫోన్ లో అసలు వాట్సాప్ లేదంటున్నాడు. తన నెంబర్ తో ఎవరో అలా చేస్తున్నారేమో అంటున్నాడు వాడు. అందుకే వాడికి వాడి నెంబర్ ని మార్చేసుకోమని వార్నింగ్ ఇచ్చా. ఇక వాడు మీ జోలికి రాడు.” చెప్తున్నాడు ఇన్స్‌పెక్టర్.

“అదేమిటి సర్, అలా అంటారు? వాట్సాప్ లేదు కాబట్టి నేను కాదని అనడానికి, అదే నంబర్ నుండి ఎన్నో మిస్డ్ కాల్స్ వచ్చాయి కదా. ఆ స్క్రీన్ షాట్స్ కూడా పంపాను. తను కాదని బుకాయించగానే తనకి నంబర్ మార్చుకోమని సలహా ఇస్తే, ఆ కొత్త నెంబర్ నుండి మళ్ళీ వేధించడని నమ్మకమేంటి?” ఇన్స్‌పెక్టర్ చెప్పిన విషయాన్ని ఎలా రిసీవ్ చేసుకోవాలో కూడా తెలియని అయోమయంలో మైండ్ బ్లాంక్ అవుతుండగా గట్టిగా అడిగిందాయన్ని.

“చూడండి మేడం.. మీరు వీడియో కాల్ లో చూసానని చెప్తున్న దానికి ప్రూఫ్ ఏమీ లేదు కదా. ఇవన్నీ నిలబడడం కష్టం. సోషల్ మీడియా వచ్చాక ఈ హెరాస్మెంట్లు ఎక్కువయ్యాయి మామూలే. ఎన్నని డీల్ చేస్తాం?  మన జాగ్రత్తలో మనం ఉండడమే” అంటున్నాడాయన.

“పోనీ ఆ విషయం పక్కన పెట్టండి. అసలు కాల్ చేయడం తప్పుకదా . ఇంతకు ముందు మీతో మాట్లాడాను. అతని కాల్ లిస్ట్ స్క్రీన్ షాట్ పెట్టాను. మీరు వార్నింగ్ ఇచ్చాను అన్నారు. అయినా మళ్ళా వీడియో కాల్ చేసాడు. చేసి..” ఆమెకి అది అవమానమో ఉక్రోషమో తెలియట్లేదు. అందరి మీదా కోపంగా ఉంది. అనవసరంగా ఒక గుర్తింపు కావాలనుకుని తన నంబర్ బయట పెట్టి, ఇరుకున పడ్డందుకు తనమీద కూడా తనకి కోపంగా ఉంది. అందులో న్యాయం లేదని తెలుసు. అయినా కోపం.

“ కాదనడం లేదు మేడమ్…. అంటే ఈ ప్రాబ్లెమ్ మీ ఒక్కరికి మాత్రమే లేదు. అయినా వారందరూ బయట పడుతున్నారా. కొన్ని చూసీ చూడనట్లు పోవాలి. ఈ కంప్లైట్లు డీల్ మొదలు పెడితే ఇంతకు పదింతలు పోలీస్ స్టేషన్లు కూడా సరిపోవు. అందుకే మీ జాగ్రత్తలో మీరుండాలి. వీలైతే నంబర్ మార్చుకోండి. లేదంటే కొత్త నంబర్లు ఎత్తడం మానేయండి. ఇంతకూ మించి ముందుకు వెళితే అల్లరవడం తప్ప ఉపయోగమేమీ లేదు మేడమ్” కొంచెం విసుగ్గా, కొంచెం అనునయంగా చెప్పాడాయన.

నంబరు మార్చుకోవాలా? ఎన్నో సంవత్సరాల నుండి ఈ నంబర్ నా  ఐడెంటిటీ. దీన్ని నేనెందుకు మార్చుకోవాలి… అసహాయం గా అనిపించి సహాయం కోసం వస్తే వీళ్ళిచ్చే సలహా ఇదా?

ఏదైనా సమస్య అని చెప్పగానే  `కట్టే కట్టు మార్చాలి… పెట్టుకునే బొట్టు మార్చాలి…నడిచే తీరు మార్చాలి… నలుగురిలో నవ్వే నవ్వు మార్చాలి… ఫోన్ నంబర్ మార్చాలి…’ అని అంటుంటే   ఎన్నని మార్చుకుంటూ వెళ్ళగలం. ఆడవాళ్లు  పబ్లిక్ లోకి రావడమే వాళ్ళు చేస్తున్న పాపం అన్నట్లుగా ఉందీ ధోరణి.

వీడియో కాల్.. అందులో తను చూసినది, తల్చుకున్నప్పుదల్లా మరింత అవమానంగా ఉందామెకి. వాడెవరో కనిపెట్టి.. కనిపెట్టి?? ఏం చేయగలదు తను. ఏ బలుపైతే వాడు ప్రదర్శంచాడో ఆ బలుపుని ఏం చేయగలదు.

మధ్యాహ్నం ఆఫీసుకి వెళ్లి డైరెక్ట్ గా లంచ్ రూమ్ కి వెళ్ళింది. బాక్స్ తెరుస్తూ టేబుల్ మీద పరుచుకోవడానికి పేపర్ కోసం చుట్టూ చూసింది. ఇంతకు ముందే చింపి కొన్ని పేజీలు వాడుకున్న ఆదివారం పుస్తకం కనిపించింది. తన కథ పడిన పుస్తకం. ఆఫీసుకి వచ్చే పేపర్. ఎవరూ చదవలేదు. ఎప్పటిలానే పేజీలు చింపి లంచ్ బాక్సుల కింద పెట్టుకుని వాడేసారు.

తనూ ఒక పేపర్ చింపుకొని  బాక్స్ చుట్టూ లీక్ అయిన నూనె తుడిచి పడేస్తూ డస్ట్ బిన్ లోకి తొంగి చూసింది. అంతకు ముందే తన కథ పడిన పేపర్ వాడినట్లున్నారు. కథ చివర తన నంబర్ నూనెలో తడిసి మెరుస్తోంది.

నవ్వొచ్చింది ఆమెకి.

ఇంటికి వచ్చి, నిస్సత్తువగా పడుకుంది. భర్త వచ్చాక మొత్తం చెప్పాలి. ఇంక కథలు రాసింది చాలు అంటాడా? ఆ నంబర్ తీసి పక్కన పడేయ్ అని ఇంతకు ముందే అన్నాడు. తనే తీసి అవతల పడేస్తాడా.?

ఆలోచిస్తుండగానే వాట్సాప్ మోగింది. వీడియో కాల్. వణుకుతున్న చేత్తో ఫోన్ పట్టుకుని తీసింది. ఆడబడచు దగ్గర్నుంచి ఫోన్. మూడేళ్ళ  మనవడిని అప్పుడప్పుడూ వీడియోలో చూపించడం మామూలే. హైపర్ యాక్టివ్  వాడు. స్ట్రెస్ బస్టర్ అని ముద్దుగా పిలుచుకుంటారు. ఉషారుగా ఫోన్ ఎత్తింది.

కానీ ఈరోజు జరిగింది అది కాదు.

“అమ్మమ్మ కి బెల్లం చూపించమ్మా” పక్క నుంచి ఆడబడుచు చెప్తుంటే రెండున్నర ఏళ్ల పిల్లోడు. డైపర్ అలవాటు వల్ల వెడల్పయిన కాళ్ళని అటొకటీ ఇటొకటీ వేసి రెండు చేతుల్తో కాళ్ళ మధ్య పట్టుకుని ఫోన్ స్క్రీన్ కేసి పైకీ కిందకీ ఊపుతూ చూపిస్తున్నాడు.

“చూపించావా బెల్లం” పక్కనుంచి పెద్దగా నవ్వుతోంది.

“సిగ్గులేదూ… ఇవేనా నేర్పేది” గట్టిగా అరిచా అనుకుంది. అంతకు ముందు వాడెవడో వీడియో కాల్ లో చూపించింది గుర్తుకు వచ్చి వణికి పోయింది.

“సిగ్గెందుకు. వాడు మొగాడు. కదా నాన్నా” ఆడబడుచు గొంతు ఇంకా పూర్తి కాలేదు. ఆమె తన ఫోన్ నేలకేసి కొట్టింది.

మూలాలు అర్ధం అవుతున్నాయామెకి.                                                                                                                                                                                                                                                                                                                                                                                                          *

ఉమా నూతక్కి

వృత్తి రీత్యా ఎల్ఐసి లో Administrative Officer ని. పుస్తకాలు చదవడం ఇష్టం. నచ్చిన భావాలను స్నేహితులతో పంచుకోవడం ఇష్టం. ఏ ఇజాన్నీ అనుసరించలేక పోవడం, ఏ చట్రం లోనూ ఇమడ లేక పోవడం. నా బలం నా బలహీనతా ఇవే.

43 comments

Leave a Reply to Uma nuthakki Cancel reply

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

  • రచయిత(త్రి) నంబరు ఈయకపోవడం, పత్రికలలో వేయకపోవడం మంచిది.

    • కథ రాయాల్సిన అవసరం… ఈ కామెంట్ తో తెలిసొచ్చింది. గుడ్ సజేషన్ మేడమ్

    • రచయిత్రిగా కొనసాగాలంటే, ‘ఫ్యామిలీ విమెన్’ గా ఉండకూడదు – అనే మీ సందేశాన్ని చాలా subtle గా తెలియజేశారు కుమార్ గారూ 🙂

      • Naresh sir.. పొద్దున్నుంచి ఆయన కామెంట్ అర్థం కాక తల పగల గొట్టుకుంటున్నా. ఓహ్ ఇదా.

  • Powerful story. మూలాలు అర్థం చేసుకోవడమే కాదు, పెకిలించి పారేయాలి.

    • This problem is so serious, even women teachers of high school are scared at the type of attention they are getting from boys. Earlier this problem was from college students, now the “Age of concern” is reduced.

      • On-line classess లో అయితే ఈ ఇబ్బంది మరీ ఎక్కువగా ఉంది sir

  • అద్బుతం గా రాశారు. స్త్రీల ప్రతి జీవితంలోనూ ఎక్కడో ఒకచోట, ఏదో ఒక రూపంలోజరుగుతున్న ఇ హింసను బయట పెట్టారు. ప్రస్తుత చరవాణి యుగం లోనూతన పద్దతుల ద్వారా జరుగుతున్న హింసను అద్బుతం గా రాశారు.

  • కామెంట్స్ చదివినప్పుడే కథ ఎలా ఉండబోతోందో ఓ ఐడియా వచ్చింది .ల్యాండ్ లైన్ మాత్రమే ఉన్నప్పుడు ఇదే అనుభవం ఆర్నెల్లు పడ్డా ,కాల్ ట్యాక్సీ అనే అనువాద కథ ఆంధ్రజ్యోతి ఆదివారం సంచికలో పడ్డప్పుడు .మొబైల్ ఐతే నంబర్ బ్లాక్ చేయచ్చు అనుకున్నా .ఇది ఇంకా ఘోరమైన స్థితి. ఇలాంటి అనుభవాలు కలగడం నార్మల్ అన్నమాట.

    • ఇలాంటి హింస ఎక్కువయింది కల్యాణి గారూ. అయితే నార్మల్ అనుకోవద్దు మనం. ప్రతీసారీ పచ్చిగా నొప్పి పెడుతుంది

  • ఆంధ్రజ్యోతి ఆదివారం అనుబంధం లో నా కధ ప్రచురించినప్పుడు ఫోన్లు ఇలాగే వచ్చాయి. అదృష్టవశాత్తూ ఒకేఒకరు రాత్రి పదకొండు గంటలకి ఫోన్ చేసి మీరు మ్యారీడా అని అడిగారు. వివిధ యితివృత్తాలతో రాసినప్పుడు తప్పక ఎదురీదాల్సి వస్తుందేమో మరి శృతిమించినప్పుడు యింట్లో వాళ్ళుకూడా ఏమాత్రం సహకరిస్తారాననిపిస్తుంది తప్పదు ఎదురీదాల్సిందే

  • మూలాలు ఎక్కడి నుంచి వచ్చాయో చెప్పడం బాగుంది. మంచి కథ

  • సమస్య మూలాలను అద్భుతంగా, కళాత్మకంగా ఫోకస్ చేసిన రచయిత్రికి అభినందనలు

  • కథ చాలా బాగుంది మేడం. స్త్రీల పట్ల మృగాడి మిస్ బిహేవియర్ ఏ మూలాల్లోంచి ముదుతుందో చమక్కులాంటి ముగింపులో చెప్పారు. రచయితలకు ఇలాంటి అనుభవాలు ఉన్నాయి. దానిని మీరు కథగా చెప్పడం చాలా బాగుంది. కథ చివరివరకు ఛదివించింది. తీస్తే మంచి షార్ట్ ఫిల్మ్ అవుతుంది. అభినందనలు మీకు.

  • Very well put Uma Nuthakki garu. Instead of just crying out the abuse, you have pointed out the source of the problem. Well done.

    • రిషి శ్రీనివాస్ గారూ థాంక్స్ అండి

  • రావాల్సిన కథ ఉమా చాలా మంది రచయిత్రులు..లేడీ డాక్టర్ లు ఫేస్ చేస్తున్న సీరియస్ సమస్య ఇది.కథ మొదటి నుంచి చివరిదాకా బాగా తీసుకెళ్లావు.. ఎదిగిన పురుషుడి వికృత మనస్తత్వానికి మూలాలు ఎక్కడున్నాయో ముగింపులో చెప్పడం బాగుంది

  • సమస్యను కథగా మలచడమే కాకుండా… మూలాన్ని కూడా ఎత్తి చూపించారు మేడం. అభినందనలు.
    ఒక్క కథలు రాసే మహిళలదే కాదు మేడం. చాలామంది మహిళలు ఈ సమస్య ఎదుర్కొంటున్నారు. అవతలి వైపు ఆడమనిషి ఐతే చాలు, ఫోన్ కావచ్చు, బస్ లో కావచ్చు, ఆఫీస్ లో కావచ్చు….ప్రతిచోటూ వేధింపుల కేంద్రమే.

  • ఉమా గారు, కథ చాలా బాగుంది. contemporoary and ప్రతి అమ్మాయి connect అయ్యే కథ. నాకు చాలా బాగా నచ్చింది

  • కథ వాస్తవానికి దగ్గరగా వుంది. అయితే to be more practical and realistic numbers ఇవ్వకపోవడంలోనే సేఫ్టీ వుందేమో! మంచి సమస్య రైజ్ చేశారు

    • ఏమో శ్యామల గారూ. ఫోన్ నంబర్ ఇవ్వకపోవడం లో safety ఉంది నిజమే. బయటకి వెళ్తే హింస ఉంది కాబట్టి, రేపు ఇంట్లో ఉంటే safety ఏమో… అని మనమే అనుకునేలా ఉన్నాం.

  • కథలో ఫోకస్ ఉంది. చెప్పిన తీరు కూడా బాగుంది. చివర్లో ట్విస్ట్ చెయ్యడానికి చెప్పిన సంఘటన కూడా నప్పింది. అదొక్కటీ సింబాలిక్ గా, శాంపుల్ గా తీసుకొమ్మని చెప్పినట్లుంది. టీవీ పెట్టండి, సినిమా చూడండి, పితృస్వామ్యపు ఛాందస భావాలూ, స్త్రీల అంగాంగ ప్రదర్శనలూ ఒక accepted norm అయి మనందరికీ కనిపిస్తూనే ఉన్నాయి. మొహ్రా చిత్రంలోని ఒక పాటలో మొదలైన pelvik thrust -అప్పట్లో vulgar అనిపించుకుందేమో గానీ, ఇప్పుడది లేని స్టెప్పులు అతి తక్కువ! మనం బతుకుతున్న వ్యవస్థ అంతటా ఇటువంటి ధోరణులకి acceptance చాలా unfortunate గా చలామణీ అవుతోంది. గొంగట్లో అన్నం తింటూ వెంట్రుకలొస్తున్నాయనుకుని ఏం లాభం? కానీ ఇటువంటి సమస్యలకి flagging ఒక్కటీ చేస్తే సరిపోదేమో! మొదటి బడి స్థాయి నుంచే, ఓనమాల, యేబీసీడీ బడి స్థాయినుంచే ఇటువంటి ధోరణులను పరోక్షంగానూ ప్రత్యక్షంగానూ తుదముట్టించే ప్రయత్నాలు మొదలుకావాలి. అంతవరకూ ఇటువంటి వేదనలు తప్పవు.

  • కొత్తకథ 2022, కదా సంకలనంలో కథా రచయితల పేర్లు ఉన్నాయి కానీ మొబైల్ నెంబర్లు లేవేమిటా అనుకున్నాను. రచయిత/ రచయిత్రులతో వారి కథలపై అభిప్రాయాలు పంచుకోవటమో, అభినందనలు తెలియజేయటమో చేసేవాళ్ళు కదా పాఠకులు అనుకున్నాను. ఇలాంటి సమస్యలు ఉన్నాయా…??

    కథ బాగుంది. కథనం మరింత బాగుంది. వేగంగా కథ ముందుకు సాగింది‌. సమస్యకు పరిష్కారం ఇప్పించేందుకు పోయారు రచయిత్రి. చూద్దాం… రేపేమైనా పరిష్కారం దొరుకుతుందేమో. అభినందనలు ఉమగారూ…

  • అదనపు కొత్త సమస్య ఇది. బాగా రాసారు. ముగింపుతో మగస్వామ్యం చెంప ఛెళ్లు మనిపించారు.

  • చాలా బాగా రాశారు అండి. అక్కడక్కడ అన్ని రంగాలలోనూ ఇలాంటి ఇబ్బందులు ఉండనే ఉన్నాయి అనుకంటాను..

‘సారంగ’ కోసం మీ రచన పంపే ముందు ఫార్మాటింగ్ ఎలా ఉండాలో ఈ పేజీ లో చూడండి: Saaranga Formatting Guidelines.

పాఠకుల అభిప్రాయాలు