96 లోని ప్ర‌తి ఫ్రేమూ.. ప్రేమ‌నుంచి ప్రేమ‌లోకి ప్ర‌వాహం!

ఈ సినిమాను చూడాలంటే.. ఫీల‌వ్వాలంటే.. ప్రేమికుడే కాన‌క్క‌ర్లేదు.

ట్రావెల‌ర్ ఫొటోగ్రాఫ‌ర్ రామ‌చంద్ర‌న్ లెచ్చ‌ర‌రు. ఓ రోజు ఆయ‌ప్ప చ‌దివిన బ‌డికాడికి పోతాడు. తన ప‌దోత‌ర‌గ‌తి జీవితం గుర్తొచ్చాది. ఫ్రెండ్సంద‌రూ క‌లుచ్చామ‌ని వాట్స‌ప్పుల్లో మెసేజ్ పెట్టుకుంటారు. రీ యూనియ‌న్ అవుతారు. ఆ రీ యూనియ‌న్‌కి రామ‌చంద్ర‌న్ ల‌వ‌ర్ ఎస్‌. జాన‌కి దేవి సింగ‌పూరు నుంచి వ‌చ్చాది. వీళ్లిద్ద‌రిదీ బ్రేక్ అప్ ల‌వ్ స్టోరీనే 96.

ఓ న‌ల్ల‌పిల్లోడు, నెత్తిమీద న‌డిమిద్దెల పాపిడి..
ఓ తెల్ల‌పిల్ల‌, కుంద‌న‌బొమ్మ..
ప్రేమంటే తెలీని వ‌య‌సులో ఇష్ట‌ప‌న్యారు. ప‌దోత‌ర‌గ‌తి క్లాసులో ఎస్‌.జాన‌కి లేనిదే రామ‌చంద్ర‌న్‌కు పొద్దుపోదు. ఆ పిల్ల బ‌డికి రాకుంటే నిద్ద‌రే రాదు. బువ్వే తిన‌డు.  ఉన్న‌ట్లుండి ఈ న‌ల్ల‌పిల్లోడి కుటుంబం ఊరిరిసిపోయినాది. ఆ పిల్ల‌గాడికోసం  ఆ పాపా బాధ‌ప‌డినాది.  ఆ న‌ల్ల‌పిల్ల‌గాడు.. ఇంట‌రు కాలేజీలో జాన‌కి చ‌దువుతాంద‌ని తెల్సుకోని ఆ కాలేజీ కాడికి పోతే.. ఆ పాప చిన్న‌పొర‌బాటు వ‌ల్ల రామ‌చంద్ర‌న్ దూర‌మైతాడు. ఓ బ్రేక‌ప్ క‌థే.. 96 సిన్మా. రామ‌చంద్ర‌న్ పాత్ర‌లో విజ‌య్ సేతుప‌తి, ఎస్‌. జాన‌కి దేవి పాత్ర‌లో త్రిష న‌టించ‌లేదు. జీవించినారు.

1996 ప‌దోత‌ర‌గ‌తి బ్యాచ్ ల‌వ్ స్టోరీనే ఈ సిన్మా.  ఎస్‌జాన‌కికి పెండ్ల‌య్యింటాది. ఓ కూతురుంటాది. సింగ‌పూర్ నుంచి వ‌చ్చినాక రామ్ కి పెళ్లికాలేద‌ని తెలుస్తుంది. ఫంక్ష‌న్ అయిపోయినాక అనుకోకుండా వారిద్ద‌రూ ఆ రోజు రాత్రి క‌ల్చి ఉండాల్చివ‌స్తాది. వాళ్లిద్ద‌రూ గ‌తాన్ని, జ్ఞాప‌కాల్ని నెమ‌రేసుకుంటారు. చూస్తుండ‌గానే సినిమా అయిపోతాది.  సినిమా అయిపోయినాక నాకైతే ఏడుపొచ్చినాది.. ఎందుకొచ్చినాది ఏడుపంటే చెప్ప‌లేను. ఎవ‌రితో పంచుకోవాలో అర్థంకాక అచ్చ‌రాల్లో ఒంపినా. గుండెంతా ఎందుకో బ‌రువైనాది. గ‌తాన్ని తిప్పిపార్దెంగుదామా.. ఘ‌టోత్క‌చుడు, ఆదిత్య 369 సిన్మాలో మాద్రి అనిపిచ్చినాది. అంత‌టి శ‌క్తి నాకుంటే ఎంత బాగుంటాద‌.. ఆ తిక్క‌శంక‌రుడైన శివుడు ఆ వ‌రం నాకిస్తే ఎంత బాగుంటాది. నేను త‌పస్సు చేసి ఆ వ‌రం పొందితే ఎట్లుంటాద‌నుకున్యా. ఆ తిక్క ఆలోచ‌న‌ల‌కు కేంద్రం ఈ సినిమాలోని ప్రేమే. అది సినిమానే క‌దా అనిపించినాది. గుండె ఉండే ప్ర‌తి ఒక్క పిల్లా, పిల్ల‌గాడికి ఈ సినిమా యాడ‌నో త‌గులుతాది. చూసేవాళ్ల‌కో, చూసేవాళ్ల స్నేహితుల‌కో, బంధువుల‌కో.. అస‌లు జ‌ర‌గ‌క పోయిన్యా… ఈ సినిమా గుండెను తాకి.. కంటిలోని ఉప్పునీటి నోటితో తాగిచ్చాది. ఇదో క్లాసిక్. వెంటాడి వేధించి ఏడిపించి.. కాసేపు న‌గించి.. క‌ట్టెకాలేవ‌ర‌కూ గుర్తుండే గొప్ప జీవమున్న క‌థ‌!

ఈ సినిమాను చూడాలంటే.. ఫీల‌వ్వాలంటే.. ప్రేమికుడే కాన‌క్క‌ర్లేదు. రెండున్న‌ర‌గంట‌లు రామ‌చంద్ర‌న్ పాత్ర‌లో మ‌గ‌పిల్లోడు.. ఎస్‌.జాన‌కి పాత్ర‌లో ఆడిపిల్ల ఊహిచ్చుకుంటే చాలు.. కండ్లెంబడీ జ‌ల‌జ‌లా నీళ్లు కార్తాయి. గుండె వేగం పెరుగుతుంది. అంత‌లోనే చ‌ల్ల‌బ‌డుతుంది. వెక్కి వెక్కి ఏడుస్తుంది. సినిమా అంతా.. ప్రేమ‌. ప్ర‌తి ప్రేమూ.. ప్రేమ‌లోంచి ప్రేమ‌లోకి ప్ర‌యాణ‌మే. మ‌న చేత‌ల్లో అరివీర‌భ‌యంక‌ర ప్రేత‌పిశాచాలు(స్మార్టుఫోన్లు) లేని కాలంలో పూసిన ఓ అంద‌మైన ప్రేమ క‌థ‌. ఇందులో నిజాయితీ ఉంది.. న‌మ్మ‌క‌ముంది. ఎదుటివాళ్లు బావుండాల‌నే కోరిక ఉంది. అందుకే త‌మిళ‌మ‌ట్టిలో పూసిన 96 గులాబీ పువ్వ‌కి  దేశ‌మంతా.. ఇంత‌లా ఫిదా అయినాదేమో. ఎక్క‌డైనా విక‌సించినా.. పండ‌ని ప్రేమ‌లే గొప్ప కావ్యాలు. స‌ఫ‌ల‌మైన ప్రేమ‌క‌థ అయితే.. ఈ సిన్మాను ఎవుడూ దేక‌డు. విఫ‌ల‌మైన ప్రేమ క‌థ ఇది. బ‌డిరోజుల జ్ఞాప‌కాల్ని మ‌న‌ముందు నిల‌బెడుతుంది. అట్లాగ‌ని.. మ‌యాబ‌జార్‌లో శ‌శిరేఖ చేతిలోని మాయాద‌ర్ప‌ణ‌మేమీ ఇక్క‌డ క‌న‌ప‌డదు. అంద‌మైన గ‌త‌మంతా.. అలా గుండెలోకి ఇంకుతాది.

ఈ రోజుల్లో ప‌దో త‌ర‌గ‌తిలోప‌లే ల‌వ్వులు. అన్నీ కొవ్వులూ శరీరం విదుల్చుకుని.. అంతే సుల‌భంగా బ్రేక‌ప్ పార్టీలు ఇచ్చిమ‌రీ విడిపోతున్న కాల‌మిది. ఇట్లాంటి వాతావ‌ర‌ణంలోని యువ‌త ఈ సినిమా చూడాల్సిన అవ‌స‌రం చానా ఉండాది. విఫ‌ల‌ప్రేమ నాక్కూడా న‌చ్చ‌దు. అయితే విజ‌య్ సేతుప‌తి గ‌డ్డంలో దేవ‌దాసులాగా ఉండి.. ప్రియురాలు క‌న‌ప‌చ్చినాక అత‌ను ప‌డే మాన‌సిక వేద‌న చూశాక‌.. ఇట్లాంటి ప్రేమ పిచ్చోళ్లూ ఉంటార‌నిపించినాది. ఇట్లాంటి ప్రేమ‌పిచ్చోళ్ల‌ను నా స‌ర్కిల్‌లో చూడ‌లేదు. అయితే విన్యా. ల‌వ్ చేస్తార‌ని చూసినా. ఇదేం కామెడీరాబాబూ.. అనుకుండేవాణ్ణి. అంత‌గా ప్రేమించి.. జీవితాన్ని నాశ‌నం చేసుకోవ‌టం ఎందుకూ.. జీవితం ముఖ్యం క‌దా.. అని ఇంట‌ర్‌, డిగ్రీ, జాబ్ టైంలో చూసిన అమ‌ర‌ప్రేమికుల్ని *మెంట‌ల్ గాళ్ల‌*ని కొట్టిపారేసినా. అయితే వాళ్ల‌తో జ‌ర్నీ చేసినాక‌.. వాళ్ల‌ను గౌర‌వించినా. ప్రేమ‌లో ప‌డిన‌వాళ్ల‌ను.. భ‌గ‌వంతుడూ కాప‌డ‌లేడంటే ఇదే. మ‌ళ్లా వెన‌క్కి పోతే.. రామ‌చంద్ర‌న్‌, ఎస్‌.జాన‌కి ఇద్ద‌రూ ఒకే హోట‌ల్‌గ‌దిలో, ఇంట్లో క‌ల్చినా.. ఎక్క‌డా అస‌భ్య‌త ఉండ‌దు. ఇప్ప‌టి యువ‌త ఎప్పుడెప్పుడు ముద్దుసీన్‌, బెడ్‌సీన్ వ‌స్తుందా.. అనే ఆలోచ‌న‌కి ఈ సినిమాలోని ప్ర‌ధాన‌పాత్ర‌లు నాగ‌లోక‌మంత దూర‌మిది. ఇందులో ప్రేమే ఉంది. శ‌రీరాన్ని కోరుకునే ప్రేమ‌లేదు.

సాధార‌ణంగా మ‌న తెలుగు చిత్రాల్లో ప్రేమ‌క‌థ‌లంటే ఇంట‌ర్వెల్ షాక్‌, ప్రీక్ల‌యిమాక్సు ఉండాల‌. క్ల‌యిమాక్సు నగుతా ఉండాల‌. అయితే త‌మిళ ద‌ర్శ‌కులు దాదాపు వీటికి దూరం. జీవితాలు, క‌థ‌ను చెబుతారు. జ‌రిగింది.. జ‌రిగిన‌ట్లు కండ్ల‌కు క‌డ‌తారు. అట్ల‌నే ఈ 96 సినిమాను ద‌ర్శ‌కుడు ప్రేమ‌కుమార్ తీసినాడు. వేయిమంది రాసిన వేయి ప్రేమ క‌విత‌ల బుక్కు వేచ్చే ఎట్లుంటాదో.. అంతంకంటే ఎక్కువ‌గా ఈ సినిమాలో క‌విత్వం పోశాడీ ద‌ర్శ‌కుడు.  ప‌దోత‌ర‌గ‌తి నోటుబుక్కులో, తెల్ల‌చొక్కాపై ఇంకీ చ‌ల్ల‌టం.. క్లాసులో టీచ‌రు ప్రెజెంటేయిచ్చుకునేప్పుడు.. సైక‌ల్ల‌తో ప్ర‌యాణం.. ఆ పిల్ల‌గాడికోసం ఇంటికాడికిపోయి క‌నుక్కోవ‌టం.. ఎంత అద్భుత‌మైన స‌న్నివేశాల‌వి. ఎస్‌.జాన‌కి వెళ్లి ఖాళీగా ఉండే త‌ర‌గ‌తి బ‌డిలో రామ‌చంద్ర‌న్ కుర్చుంటే బ‌ల్ల‌మీద కూర్చోవ‌టం.. సినిమాలోనే బెస్ట్ స‌న్నివేశం అనిపిచ్చింది నాకైతే.

రామ‌చంద్ర‌న్‌, జాన‌కి.. ఇద్ద‌రూ కారులో ప్ర‌యాణించ‌టం..  ఊరంతా తిర‌గ‌టం.. సెలూన్‌కి వెళ్ల‌టం.. ఇంట్లో భోంచేయ‌టం.. పెండ్లి ఎందుకు చేసుకోలేద‌ని అడ‌గ‌టం.. ఆ పాత జ్ఞాప‌కం గురుతొచ్చి జాన‌కి ఏడ్వ‌టం.. అదే సీన్ రామ‌చంద్ర‌న్ స్టూడెంట్స్ ముందు జాన‌కి.. వేరేలా చెప్ప‌టం సూప‌ర్‌. ల‌వ్ మ్యారేజ్ చేసుకున్యామ‌ని చెప్ప‌టం.. రామ‌చంద్ర‌న్  ఇంటికెళ్లి బువ్వ‌తిన‌టం.. రామ‌చంద్ర‌న్ పాత సూట్‌కేసు తీసి.. ఇంకుప‌డిన తెల్ల‌చొక్కాను చూపించ‌టం అద‌ర‌హో. తాను రాసుకున్న ప్రేమ క‌విత‌ను వినిపించ‌టం.. ఎంత చ‌క్క‌ని అంద‌మైన వాన రాతిరో అది. బ‌య‌ట వ‌ర్షం.. లోప‌ల మాత్రం ప్రేమార్షం.. ఆ సీన్‌!

ఎప్పుడో విడిపోయిన ఇద్దురు.. అస‌లు ఐ ల‌వ్ యూ చెప్పుకోని ఓ ఇద్ద‌రు.. ఇర‌వ‌ది రెండు ఏళ్లు త‌ర్వాత క‌ల్చినాక‌.. ఇంకా కాద‌ల్ అట్ల‌నే ఉండాద‌ని ఎంత బాగా సూపిచ్చాడో ద‌ర్శ‌కుడు ప్రేమ‌కుమార్‌.  సిన‌మా స్టార్టింగునుంచి న‌డిమ‌ద్దెవ‌ర‌కూ ఫ్లూట్… మ‌ల్ల వాయిలిన్‌, కీబోర్డు.. ఎంత అంద‌మైన, హృద్య‌య‌మైన సంగీత‌మో. ఈ బ్రేక‌ప్ ప్రేమ‌కి మ‌రింత ఫీల్‌గుడ్ ట‌చ్ ఇచ్చి.. ప్రాణం పోసింది మాత్రం సంగీత ద‌ర్శ‌కుడు గోవింద్ వ‌సంత‌. ఇంత అందంగా ఆవిష్క‌రించింది… పాత కాలాన్ని…ఫీలింగ్స్‌ను చిత్రిక అద్భుతంగా ప‌ట్టింది సినిమ‌టోగ్రాఫ‌ర్స్ మ‌హేందిర‌న్ జ‌య‌రాజ్‌, ఎన్‌.ష‌ణ్ముగ సుంద‌రం.. ఎడిటింగ్ చేసినేది ఆర్‌. గోవింద‌రాజ్‌. ఇట్లా ఇర‌వై నాలుగు క్రాఫ్టుల‌ను ఖ‌చ్చితంగా ప‌నిచేయించ‌టంలో ద‌ర్శ‌కుడు 200 ప‌ర్సెంట్ స‌క్సెస్‌. *96లో ప‌దోత‌ర‌గ‌తి చ‌దువుతాండే పిల్లోళ్లు ప్రేమించుకున్యారు.. రీయూనియ‌న్‌కి క‌లుచ్చారు. ఓ రోజు రాత్రి ఇద్ద‌రూ క‌లిసి ఉండాల్సి వ‌చ్చాంది. జ్ఞాప‌కాల‌ను తొక్కుంటారు* అనే క‌థ లైన్ చెబితే.. *బ‌య‌టికి దెంకోనిపో సోమీ* అని వాకిలి తీసే ప్రొడ్యూస‌ర్లు చానా చోట్ల ఉంటారు. అయితే ఈ సినిమా ప్రొడ్యూస‌ర్ నంద‌గోపాల్‌.. అలా చేయ‌క‌పోవ‌టం వ‌ల్ల‌నే.. సినిమా చూసినాం మ‌నం!

ప్ర‌ధాన పాత్ర‌లో విజ‌య్ సేతుప‌తి, త్రిష జీవించారు. వారుత‌ప్ప మ‌రొక‌రిని ఊహించుకోలేనంత గొప్ప‌గా సిన్మాలో క‌లిసిపోయినారు. ఓ ప్రేమికుడిగా ప్రేయ‌సి జ్ఞాప‌కాల‌తో బ‌తికే రామ‌చంద్ర‌న్ గురించి ఇన్యాక‌.. ఎస్‌.జాన‌కి మ‌న‌సు సుడులు తిరుగుతుంది.  మ‌గువ మ‌న‌సు స‌ముద్రం లాంటిది క‌దా. స‌ముద్రంలో ఎలాంటి అల‌లు ఎప్పుడొచ్చాయో ఎవ‌డికి తెల్దు. అయితే ద‌ర్శ‌కుడు సెలూన్‌నుంచి బ‌య‌టికొచ్చినాక‌.. క‌థానాయిక‌తో *నువ్వు వ‌ర్జిన్‌వా* అని క‌థానాయ‌కుడిని అడ‌గ‌టంతో .. ఏమైనా అవుతుందా.. అని చానామంది సూచ్చారు. ఆమె కోరిక స‌ఫ‌ల‌మ‌వుతుందేమో.. వాళ్లిద్ద‌రూ ఈ రాత్రికి క‌లుస్తారేమోన‌ని ఫాంట‌సీతో ప్రేక్ష‌కులు ముందుకు వెళ్తారు. అక్క‌డ ప్రేమ వెలిగి.. వాన‌చీక‌టి రాత్తిరికి వెల్తురునిచ్చాది.

త్రిష ఎల్లో డ్రెస్‌, విజ‌య్ సేతుప‌తి గ‌డ్డం.  బ‌డిలో బ‌ల్ల‌.. చొక్కామింద ఇంకీ.. సైకిల్లు, వంతెన‌.. జాన‌కి కోసం వేసుకొచ్చే సుజికి.. పాత సూటుకేసు, హీరో వాడే ఎర్ర‌టి డ‌స్ట‌రు కారు.. అన్నీ ప్ర‌ధాన పాత్ర‌ధారులే. రెండుమూడు చొక్కాలు మార్చే ప్రేమ‌క‌థ‌లో విజ‌య్‌సేతుప‌తి, త్రిష న‌టించి.. నాకు మ‌రింత న‌చ్చినారు. హావ‌భావాల్లో ఇద్ద‌రూ నువ్వానేనా అంటూ పోటీప‌డ్డారు. ముఖ క‌వ‌ళిక‌ల ఎక్స్‌ప్రెష‌న్సుతో త్రిష గొప్ప‌గా న‌టించింది. మ‌నూర్ల‌లో మాసిన గ‌డ్డంతో, ఏదో చొక్కా ఏసుకోని.. న‌డిపాపిడి తీసి.. త‌న ప‌నితాను చేస‌క‌పోయే విజ‌య్ సేతుప‌తి పాత్ర మ‌న‌కు ఎక్క‌డో చోట త‌గిలే ఉంటాది కాబ‌ట్టే.. అత‌డు మ‌న‌కి న‌చ్చినాడు.

ఎంత సింగ‌పూర్‌కి పోయిన.. జాన‌కి.. ప‌సుపుప‌చ్చ కుర్తా డ్రెస్‌మీద చున్నీ మిస్ కావొద్ద‌నే నీ ఆలోచ‌న‌కు హ్యాట్సాఫ్‌.  ఇప్పుడు అడుగ‌డునా అత్యాచారాలు, ప్రేమించ‌కుంటే మ‌ర్డ‌ర్లు చేసే సైకోల మ‌ధ్య తిరుగుతున్న మ‌న‌కు.. ఈ 96 క‌థ గొప్ప‌కావ్యంలా క‌న‌ప‌చ్చాది. ముఖ్యంగా ప్రేమిస్తే.. అవుత‌లోళ్లు ఎర్ర‌పువ్వ‌తో ఐల‌వ్యూ చెప్పాల‌ని దాడులు చేసి, చంప‌టానికి వెన‌కాడ‌ని శాడిస్టుల‌కు.. ఈ సినిమా ఓ మెట్టుదెబ్బ‌. ప్రేమ.. ప్రేమిస్తుంద‌నే గొప్ప సందేశ‌మే .. 96 సిన్మాబండికి ఇరుసు!
ల‌వ్యూ విజ‌య్ సేతుప‌తి.
ల‌వ్యూ ద‌ర్శ‌కుడు సి. ప్రేమ్‌కుమార్ అండ్ ఆల్ యూనిట్‌
వాళ్లు క‌ల‌వ‌రు.. అయితే క‌ల్చిన‌ట్లు రాసుకోవాల‌గా.. *రామ‌జాను*.
ఇట్లు
ఓ డెడ్‌లేజీ ప్రేక్ష‌కుడు
రాళ్ల‌ప‌ల్లి రాజావ‌లి
(2018లో వాన‌ల‌కాలంలో ఈ సినిమా వ‌చ్చే.. 2020 చ‌లికాలంలో ఈ సినిమా చూసినా. ఆ అవ‌కాశం జియో సినిమా క‌లిపిచ్చినాది. ఈ సిన్మాను.. సిన్మాహాలులో చూడ‌లేక‌పోతినే అనే ఓ జీవిత‌కాలం వేద‌న న‌న్ను వెంటాడ‌కమాన‌దు. సారీ 96. నీ రెండోజ‌న్మ‌నే నా భాష‌లో సూచ్చా.. త్వ‌ర‌లో *జాను*గా వ‌చ్చాంది క‌దా!)

*

రాళ్ల‌ప‌ల్లి రాజావ‌లి

రాళ్ల‌ప‌ల్లి రాజావ‌లి

4 comments

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

 • Correct sir,
  నాకు తమిళ్ రాదు accidentally పాట ఒకటి విని సినిమా చూసా, really enjoyed alot.ముఖ్యంగా ఈ సినిమా సంగీతం చాలా బావుంది. actors నిజంగా జీవించారు.తెలుగు లో కూడా బావుండచు.
  Sarva బాగా చేస్తారు కానీ నేను vijaysetupati ని మరువలెను.

 • Nenu vijaysetupati ni pizza movie nundi follow avtunna … ye paatra ainaa Vijay cesinantha easy ga inko Ye actor ceyaleremo I bet’.. Ade thanaki intha stardom tecchipettindi…
  Fans andaru vijay ni kalisinappudalla enduku muddu pettadaaniki istapadataaro “SUPER Delux “ cinema chuste artham aipotundi nijaga Vijay is a SUPERDELUX Actor in India … Ram‘ character ki Vijay ni tappa inkevarini oohinchalem And JANAKI ‘ character lo Trisha ni kuda evaru replace ceyaleru… Adi Mana telugu ‘jaanu’ chusaaka inkaa nijam anipinchindi .!!!
  ‘Ram-Jaanu’ madhya emotion ni kudaa inkokaru replace cesedi kaadu … Eee movie first look nundi follow avtune unna music release aindi …
  Andulo oka song undi “kaadale” ani andulo 80% music unte 20% lyrics untundi enduko aaa song first time vitunnappudu Kallalo neellocchesaai aa sangeethaniki … nannu anthalaa kadilinchina song inkokati ledu ani nenu khacchitanga ceppagalanu … ceppalante ee cinema ki sangeethame aayuvu..
  Cinematography aite sooper asalu… Metro shots flyover shots aite adhbhutam ane ceppali ..
  Ika cinema gurinchi entha ceppina takkuve ..
  Ilaanti cinema lu malli malli raavu .. ilaanti cinema ni malli teeyaali anukovadam kudaa porpaate enduko Jaanu’ trailer chustene artham aipotundi .
  (”96 ni okkasaare chusaanu … Inkosaari chuse dhryam ceyalekapoya emotions ni handle ceyalenemo ani .. kaani 96 lo prathi frame gurthundipoindi … Endukante idi cinema kaadu Mana chuttu entho mandi Ram-jaanu la katha “)

‘సారంగ’ కోసం మీ రచన పంపే ముందు ఫార్మాటింగ్ ఎలా ఉండాలో ఈ పేజీ లో చూడండి: Saaranga Formatting Guidelines.

పాఠకుల అభిప్రాయాలు