ప్రేమ అనేదొకటి జీవితంలోకి చొరబడ్డాక మనిషి మనిషి కాదు. మొహమ్మద్ గౌస్ రాసిన 826 కి.మీ. నవలలోని పాత్రలైన హరి, మధులకైనా ఇదే వర్తిస్తుంది. ఆ మాటకొస్తే ఎక్కడ ఏ ప్రేమకథలోనైనా అంతేనేమో. ప్రేమలో పడ్డ మనుషులు వచ్చి మనకొక కథ చెప్తారు. ఆ సమయానికి వాళ్ళ జీవితంలో ఆ ప్రేమించిన వ్యక్తి ఉండకపోవచ్చు. గౌస్ రాసిన నవలలో హరి కూడా మనకొక కథ చెప్తాడు. హరి ప్రేమించినమ్మాయి మధు కూడా అతని జీవితంలోంచి వెళ్ళిపోయిందా? ఇక్కడే మనకు రెండు కథలు దొరుకుతాయనుకుంటాను. ఒకటి ఆ అమ్మాయి ఎప్పటికీ తిరిగిరాదు. రెండు ఆ అమ్మాయి ఎప్పుడో తిరిగొచ్చేస్తుంది. ఈ నవలలో ఏం జరిగిందో చెప్తే అది స్పాయిలర్ అయిపోతుంది కాబట్టి నేను అది చెప్పదలచుకోలేదు. కాకపోతే అక్కడివరకూ మనల్ని గౌస్ తన కథనంతో ఎలా తీసుకెళ్తాడన్నది మాట్లాడుకుందాం.
‘గాజుల సంచి’, ‘జీరో నెంబర్ 1’ పుస్తకాలతో ఇప్పటికే రచయితగా తానేంటో నిరూపించుకున్నాడు గౌస్. తను ఇంతకుముందు రాసిన కథలు ఎక్కువగా యాసతో నడిస్తే, ఈ 826 కి.మీ. నవల అందుకు భిన్నం. ఇందులో సంభాషణలన్నీ చాలా సరళంగా ఉంటూనే పాత్రల లోతైన భావాలను ప్రకటించేలానూ ఉంటాయి. హరి, మధు – ప్రధానంగా ఈ ఇద్దరి మధ్యనే నడిచే కథ ఇది. రిలేటబుల్ క్యారెక్టర్స్ అనుకుంటాం కదా, ఈ రెండు పాత్రలు అలాంటివే. మన చుట్టూ మన జీవితాల్లో లేదా మనలోనే వీళ్ళు ఉంటారు. ఈ నవల చదువుతున్నంతసేపు ఇది మనకు తెలిసిన కథేనా? ఇది మన కథేనా? అనుకోకుండా ఉండలేం. ఈ నవలకు యూఎస్‌పీ కూడా ఇదే అనుకుంటాను.
‘నా భయాలకి, వాటిని దూరం చేసుకోవడంలో మొదటి అడుగులు వేయించిన నగరానికి..’ అంటూ ఈ పుస్తకాన్ని వాటికే అంకితమిస్తూ చెప్తాడు గౌస్. ఈ నవలలోని హరి పాత్రకుండే భయాలను పోగొట్టడానికి కూడా ఈ మైసూరు నగరమే అతడ్ని అక్కున చేర్చుకుంటుంది. అప్పటివరకూ తను పుట్టి పెరిగిన ఊరు, చదువుకున్న కాలేజీ తప్ప ఇంకో ప్రపంచమే తెలియని హరి, భయపడుతూనే మైసూరులో జాబ్ ట్రైనింగ్‌కి వస్తాడు. విశాలమైన క్యాంపస్ అది. “ఎంత చక్కటి ప్రదేశం ఇది. ఇదంతా ఒంటరిగా ఏం చూస్తావ్! నీకో తోడుని ఇస్తున్నానని తనను నాకు పరిచయం చేసింది ఆ క్యాంపస్” అని రాస్తాడు రచయిత. ఆ క్షణం, మధుని కలిసే ఆ క్షణం నుంచి హరి జీవితం వేరే. కొన్ని రోజుల్లోనే అతనికామె ఫేవరెట్ పర్సన్ అయిపోతుంది.
హరికి చాలా విషయాల్లో భయం. ఇంగ్లీషులో మాట్లాడితే తప్పులు మాట్లాడతానేమో అనే భయంతో ఎవ్వరితోనూ ఎక్కువగా మాట్లాడను కూడా మాట్లాడడు. అలాంటి హరి, మధుకి తెలుగు రాదు కాబట్టి ఆమెతో మాట్లాడాలంటే ఇంగ్లీషులోనే మాట్లాడాలి. మధు పరిచయమయ్యాక అతను ముందు జయించేది ఈ భయాన్నే. ఆ తర్వాత ఒక్కో భయాన్నీ పోగొట్టుకుంటూ వస్తాడు. ఈ క్రమంలో ఇద్దరూ ఒకరికొకరు బాగా దగ్గరైపోతారు. చూస్తుండగానే వాళ్ళ జాబ్ ట్రైనింగ్ అయిపోతుంది, పోస్టింగ్ కూడా వచ్చేస్తుంది. హరికి హైదరాబాద్‌లో, మధుకు మంగుళూరులో. ఇద్దరూ దూరమవ్వక తప్పదు. అప్పటికి వాళ్ళిద్దరి మధ్యన ఉన్నదేంటి? స్నేహమేనా?
హైదరాబాద్‌లో ఉద్యోగంలో చేరాక, మధు కూడా ఇక్కడే ఉంటే ఎంత బాగుంటుంది! అనుకుంటాడు హరి. అతను అనుకున్నట్టే కొన్ని నెలలకే ఆమె కూడా వచ్చేస్తుంది. ఇక్కడ్నుంచి ఈ ఇద్దరిది ఇంకో కథ. దీన్ని స్నేహం అందామా? పోనీ కంపానియన్షిప్? లేదు ఇది ప్రేమే కదా? హరి వెళ్ళి మధుకి తన ప్రేమ విషయం చెప్పేస్తాడు. అక్కడ్నించి ఏడెనిమిదేళ్ళ వాళ్ళ జీవితాలు ఎలా మారిపోతాయన్నది కథ.
ఈ కథలో ఇద్దరు ప్రేమలో ఉన్నప్పుడుండే అన్ని ఎమోషన్స్‌ని చక్కగా పట్టుకున్నాడు గౌస్. ఎక్కడా తెచ్చిపెట్టుకున్న మాటలు ఉండవు. రెండు పాత్రల్నీ ఒకే రకంగా ఇష్టపడతాం. కొన్ని సందర్భాల్లో ఒకే రకంగా తిట్టుకుంటాం కూడా. హరి ఇన్నొసెన్స్‌ని, ఇండిపెండెంట్‌గా బతకాలనుకునే మధు ఆలోచనలను రెండింటినీ ప్రేమిస్తాం. ఇద్దరూ కలిసి బతకాలని పుస్తకం చదువుతున్నంతసేపూ కోరుకుంటాం. ఇక్కడే రచయిత కథను ఏ మలుపు తిప్పాలన్నా జాగ్రత్తగా ఉండాలనుకుంటాను. ఈ విషయంలో రచయితగా మొహమ్మద్ గౌస్ కచ్చితంగా విజయం సాధించాడు. ఈ పుస్తకమంతా చదివాక తేలికపడతాం. హరి, మధులు తిరిగొచ్చిన కూర్గ్, మైసూరు, హైదరాబాద్ అన్ని ప్రదేశాలనూ వాళ్ళతో మనమూ తిరిగొస్తాం.
ఈ ఇద్దరి కథను చదివాక మనకొక ప్రశ్న ఎదురవ్వొచ్చు. ప్రేమ ఏం కోరుకుంటుంది? అని. హరి చేసింది కరెక్టేనా అని ఆలోచించినప్పుడూ, మధు ఎందుకిలా చేసిందని ఆలోచించినప్పుడూ బహుశా వాటికి దొరికే సమాధానాల దగ్గరే మనకు ఎదురయ్యే ప్రశ్నకూ సమాధానం దొరకొచ్చు.
ఒకసారి శీర్షిక దగ్గరికొద్దాం. 826 కి.మీ. దగ్గరా? దూరమా? అనడిగితే మధుని చూడటానికి అంత దూరం బయల్దేరాడు హరి. ఆమెకు దగ్గరగా వెళ్తున్నాడంటే అది దగ్గరే కదా? ఆమెను అంతసేపు తనకు దూరం పెడుతున్న ఈ దూరం దూరమే కదా?
హరి, మధుల ప్రేమను చెప్పే 826 కి.మీ. అందరూ ఇష్టంగా చదవదగ్గ పుస్తకం.
చదువు – ఆన్వీక్షికి పబ్లిషర్స్ ఉగాది నవలల పోటీలో బహుమతి పొందిన నవల – 826 కి.మీ.
రచయిత: మొహమ్మద్ గౌస్
ప్రచురణ: ఆన్వీక్షికి పబ్లిషర్స్
పేజీలు: 150, వెల: రూ. 200
ప్రతులకు: అమెజాన్.ఇన్, అన్ని ప్రముఖ పుస్తక కేంద్రాలు
Add comment