గత్తర్ల, కత్తెర్ల కాలంలో చెదరని సాహసి వీవీ!

81 ఏళ్ల వృద్దాప్యంలో, శారీరక రుగ్మతలు చుట్టుముట్టిన సమయంలో కారాగారవాసం.. బయటకు రాలేని స్థితిలో వరవరరావు గారు రక్తసిక్త చరిత్రకు ప్రతిబింబం.

1978 లో నేను వరంగల్ లో ఇంటర్నీడియట్ రెండో సంవత్సరం చదువుతున్న రోజులు.

సాంస్కృతీ సమాఖ్య నిర్వహించిన మినీకవితా పోటీల్లో నాకు రూ. 50 బహుమతి లభించింది. ఆ బహుమతి తీసుకునేందుకు విజయవాడ వెళ్లాను. విజయవాడ గ్రంథాలయం డాబా పై ఒక పండువెన్నెల రాత్రి ప్రముఖ కథకుడు పెద్దిబొట్ల సుబ్బరామయ్య నాకు బహుమతి అందజేశారు. ఆ బహుమతి తీసుకుంటూ కొన్ని బుడిబుడి వాక్యాలు ప్రసంగించాను. ఆ తర్వాత ఆ సంస్థ నిర్వాహకులు నాతో మాట్లాడుతూ త్వరలో వరంగల్ లో ఒక సాహితీ సదస్సు నిర్వహించబోతున్నాము.. అందులో మీకు కూడా ఒక టాపిక్ ఇస్తాం.. మాట్లాడాలి.. అన్నారు. ఒప్పుకున్నాను.

కొద్ది రోజుల తర్వాత సాంస్కృతీ సమాఖ్య వారి నుంచి ఒక లేఖ వచ్చింది. వరంగల్ సభలో మీరు తెలుగు సాహిత్యం- మార్కిస్టు ప్రభావం పై మాట్లాడాలి.. అని. అది చదవగానే నాకు గుండెలో రైళ్లు పరుగెత్తాయి. నాకేం తెలుగు సాహిత్యం గురించి తెలుసు? పైగా మార్కిస్టు ప్రభావం గురించి నేనేం మాట్లాడగలను? మార్క్స్ అనే ఆయన పేరు గురించి విన్నాను కాని సాహిత్యంపై ఆయనేం ప్రభావం చూపారో నాకేం తెలుసు?

నేను చదువుతున్న లాల్ బహదూర్ కళాశాలలో ఇద్దరు తెలుగు అధ్యాపకులు తెలుగు చెప్పేవారు. ఒకరు కిషన్ రావు, రెండవ అధ్యాపకుడు అనుమాండ్ల భూమయ్య. వారిద్దరికీ ఈ విషయం చెప్పాను. ఇద్దరికీ నేను ఇష్టమైన విద్యార్థిని. ఇద్దరూ ఒకే మాట చెప్పారు. మీరు మాట్లాడాల్సిన అంశంపై బాగా వివరించగలిగిన వారు ఒక్కరే. ఆయన వరవరరావు గారు. సికెఎం కళాశాలలో తెలుగు బోధిస్తున్నారు. ఆయన ఇల్లు హన్మకొండలో ఉన్న కుమార్ పల్లిలో ఉంటుంది.. అని చెప్పారు.

అలా జరిగింది నాకు వరవరరావు గారితో పరిచయం.

ఒక రోజు పొద్దున్నే కుమారపల్లి వెళ్లి ఆయన ఇంటి గురించి వాకబు చేయగానే ఆయన ఇల్లు చూపేందుకు చాలా మంది ముందుకు వచ్చారు. దీనితో ఆయనకు ఆ ప్రాంతంలోఎంత జనాదరణ ఉన్నదో అర్థమైంది. ఆ ఇంటి తలుపు తడుతూ ఒక్క క్షణం ఆగిపోయాను.   ఆ ఇంటినుంచి వేద మంత్రాలు వినపడుతున్నాయి. అప్పటికే కమ్యూనిస్టులంటే నాస్తికులనే అభిప్రాయం ఉన్నందువల్ల నాకు ఆ వేద మంత్రాలు విని ఆశ్చర్యం కలిగింది. తప్పు ఇంటికి వచ్చానా అనుకుంటూనే తలుపు తట్టాను.

కొద్ది సేపటికి తలుపులు తెరుచుకున్నాయి. తెల్లటి మల్లెపూవు లాంటి ఇస్త్రీ చేసిన చొక్కా, అందమైన, ఆహ్లాదకరమైన నవ్వుతో వరవరరావు. ఆయన అప్పటికే కాలేజీ వెళ్లేందుకు సిద్దంగా ఉన్నారనిపించింది. కాని నన్ను చూడగానే ఆయన గుమ్మంలోనే నిలబెట్టకుండానే ‘రండి రండి.. కూర్చోండి..’అని మర్యాదగా పలకరించారు. ఆ గది గోడలపై బ్లాక్ అండ్ వైట్ లో అందంగా నవ్వుతున్న ఇద్దరు బాలికల ఫోటోలు. ఆయన కూతుళ్లు కావచ్చని అనిపించింది.

‘చెప్పండి.. మీరు ఏ పనిమీద వచ్చారు..’ అని బహువచనంతో అడిగారు.

నేను ఒక 16 ఏళ్ల కుర్రాడిని. ఆయన అప్పటికే నాలుగు పదులు దాటిన ఒక సీనియర్ లెక్చెరర్, రచయిత, మేధావి. కాని నన్ను అంత మర్యాదగా పలకరించడం నన్నెంతో ఉప్పొంగేలా చేసింది. నాకు కవితల పోటీలో బహుమతి రావడం, సాంస్కృతీ సమాఖ్య వారు నన్ను తెలుగు సాహిత్యంలో మార్క్సిజం ప్రభావం పై మాట్లాడమనడం గురించి వివరించాను. అవన్నీ ఆయన ఓపిగ్గా విన్నారు.. నేను కవిత్వం రాస్తాననే సరికి ఆయన ముఖం వెలిగిపోయింది. మీరు కవితలురాస్తారా.. ఏదీ ఆ కవిత చదవండి.. అని అడిగి వినిపించుకున్నారు. చాలా బాగా రాశారు. మీరు ఏమీ భయపడవద్దు. ఆ అంశంపై మీరు మాట్లాడగలరు.. నేను కొన్ని పుస్తకాలు ఇస్తాను.. పాత సృజన సంచికలు కూడా తీసుకువెళ్లండి.. అని లోపలికి వెళ్లి పుస్తకాలు, పత్రికలు తీసుకువచ్చారు. మీకు మార్క్సిజం గురించి అవగాహన కావాలంటే ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజీలో జగన్మోహనాచారి అనే ఇంగ్లీషు లెక్చెరర్ ఉన్నారు. ఆయనను కలవండి.. అని చెప్పారు.

మేము మాట్లాడుతుండగా చాయ్, మంచినీళ్లతో వచ్చిన హేమక్కను పరిచయం చేశారు. ఆమె కూడా నవ్వుతూ చాలా రోజులుగా పరిచయం ఉన్నట్లు మాట్లాడారు. మధ్యలో ఆమె తండ్రి పెద్ద పట్టెనామాలతో వచ్చి పలకరించి వెళ్లిపోయారు. ఈయనేనా మంత్రాలు చదివింది.. అని అనుకున్నాను.

వరవరరావు గారు చెప్పినట్లుగానే నేను దాదాపు నెల రోజులు కష్టపడి వ్యాసం తయారు చేసుకున్నాను. జగన్మోహనా చారి జార్జి థామస్, క్రిస్టఫర్ కాడ్వెల్ మొదలైన వాళ్లు రాసిన పుస్తకాలు ఇచ్చి సాహిత్యానికీ, శ్రమకూ ఉన్న సంబంధాన్ని వివరించారు.

హనుమకొండలోని బీఇడి కళాశాలలో జరిగిన సాహితీ సభలో నన్ను మాట్లాడేందుకు వేదికపై పిలిచినప్పుడు ప్రముఖ తెలుగు పండితుడు కోవెల సుప్రసన్నా చార్య, ప్రముఖ కవి అద్దేపల్లి రామమోహన్ రావు ఉన్నారు. సుప్రసన్నా చార్య ప్రాచీన సాహిత్యం గురించి, అద్దే పల్లి మినీ కవిత గురించి మాట్లాడారు. ఆ తర్వాత నా ప్రసంగం మొదలైంది. నేను మొదట సైద్దాంతిక నేపథ్యం, సాహిత్యంలో ప్రజానుకూల దృక్పథం ప్రవేశించడం గురించి మొదలు పెట్టి వాటి ఉదాహరణలు ఆధునిక తెలుగు సాహిత్యం నుంచి ఇచ్చుకుంటూ ఎంత సేపు ప్రసంగించానో నాకే తెలియదు. కుర్రవాడిని, కంఠంలో శ్రావ్యత, మాట్లాడుతున్నవి పెద్ద పెద్ద మాటలు.. వినేవారంతా ఉద్దండులైనప్పటికీ నన్ను ప్రోత్సహిస్తున్నట్లుగా నిశ్శబ్దంగా వింటున్నారు. ఆ ప్రసంగం పూర్తయ్యే సరికి చప్పట్ల వర్షం కురిసింది. ఆ మత్తులో నేను ఉండగానే ఎక్కడినుంచి వచ్చారో కాని వరవరరావు గారు వచ్చి నాతో కరచాలనం చేసి చాలా బాగా మాట్లాడారు.. అని అభినందించారు. మరో వైపు సుప్రసన్న కూడా నన్ను అభినందించి తన ఇంటికి రమ్మన్నారు.

ఆ రోజుల్లో అనేక రకాల అభిప్రాయాలు నాలో ఊగిసలాడేవి. భూమయ్య తీయనిగొంతుతో ప్రాచీన కావ్యాల పద్యాలు చదవడం, సుప్రసన్న నాకు ప్రాచీన సాహిత్యం గురించి వివరించడం, వరంగల్ లో ఎక్కడ కవిసమ్మేళనాలు జరిగినా వెళ్లి పద్యాలు చదవడం చేసేవాడిని. ఒక సభలో కాళోజీ నారాయణ రావు సోదరుడు కాళోజీ రామేశ్వరరావు నాకు శాలువా కప్పారు. సుప్రసన్న మూలంగా విశ్వనాథ సత్యనారాయణ ఒంటబట్టారు. ఇంటర్ మొదటి సంవత్సరంలో కాలేజీ మ్యాగజైన్ లో ‘వాణివి, వీణా పాణివి.’. అని సరస్వతీదేవి పై, జన ధర్మ పత్రికలో ‘ధర్మవస్త్రం చినిగిపోయింది..’అని ఆర్ ఎస్ ఎస్ భావజాలంతో కవిత్వం రాసిన వాడిని ఇంటర్ రెండో సంవత్సరం, డిగ్రీ మొదటి సంవత్సరం లో నాకు తెలియని అనేక మార్పులకు గురయ్యాను. పద్యాలు రాసేవాడిని ఎప్పుడు వచన కవిత్వంలో దిగానో నాకు తెలియదు. హిందీ లెక్చెరర్ శ్రీరాములు నన్ను పద్మాక్షీ గుట్ట వద్ద ఆర్ ఎస్ ఎస్ శిబిరానికి తీసుకువెళ్లినప్పటికీ నాలో ఒక ఉప్పెనలా ప్రవేశించి నన్ను మరో లోకానికి పరిచయం చేసిన వ్యక్తి వరవరరావు గారు.

వరవరరావు గారు నాలో ఈ ప్రభావం చూపడానికి ప్రధాన కారణం ఆయనలో ప్రజాస్వామికత, స్నేహశీలత, వయసు తేడా చూపకుండా అందర్నీ గౌరవించగల వ్యక్తిత్వం. ఎదుటి వారి అభిప్రాయాలు తన అభిప్రాయాలకు భిన్నంగా ఉన్నా అవహేళనగా మాట్లాడని సంస్కారం. ఈ ప్రజాస్వామిక తత్వం ఆయనలోనే కాదు, ఆయన కుటుంబంలో కూడా ఉన్నది. తమ ఇంట్లో ఎవరు ప్రవేశించినా కుటుంబ సభ్యుడులా చూసే వారి ఆదరణకు ఎవరైనా మైనంలా కరిగిపోయేవారు. ఆ ఇంట్లో గంటలు గంటలు గడపడం, భోజనాలు చేయడం, మామూలైపోయింది. సృజన పత్రిక ఎంత ప్రజాస్వామికంగా నిర్వహించేవారంటే సాహితీ మిత్రులు ప్రతి రచనపై కూలంకషంగా చర్చించేవారు. ఒకరు చదువుతుంటే మిగతావారు విని వ్యాఖ్యానాలు చేసేవారు. ఎన్ కే ‘లాల్ బనో గులామీ చోడో’, రామ్మోహన రాజు ‘వసంత మేఘం’, వరవరరావు గారి ‘సముద్రం’ వినడం సాహితీ మిత్రుల సమావేశంలో ఒక అపూర్వ అనుభవం. మొత్తం కుటుంబం సాహితీ మిత్రులను తమ మనుషులుగా భావించడం, ఎడతెరిపి టీలు సరఫరా చేయడం చేసే వారు. ఈ వాతావరణమే నన్ను లోబరుచుకుంది.నన్ను కూడా రచనలు చేయడానికి ప్రోత్సహించి సృజనలో ప్రచురించి నేను ఒక రచయితగా నిలదొక్కుకోవడంలో వరవరరావు గారి ప్రోద్బలం ఎంతో ఉన్నది. సాహితీ మిత్రుల నుంచి విరసం సభ్యుడుగా నాకు తెలియకుండానే మారిపోయాను.

వరవరరావు గారు కూడా కుటుంబంతో సహా హైదరాబాద్ వచ్చేసిన తర్వాత కూడా . నేను ‘ఉదయం’ పత్రికలో పనిచేస్తూ బాగ్ లింగం పల్లి లో వారి ఇంటికి వెళ్తూ వారి స్నేహమాధుర్యాన్ని చవిచూస్తూ ఉండేవాడిని. బహిరంగ సభల్లో అనర్గళమైన ఆయన ప్రసంగాలు కొన్న రోజుల పాటు నన్ను ప్రకంపనలకు గురిచేసేది. శ్రీశ్రీ మరణం తర్వాత సికింద్రాబాద్ లోని వైఎంసిఏ మైదానంలో ఆయన చేసిన ప్రసంగం ఇంకా నా చెవుల్లో గింగుర్లుమంటోంది. ఒక చరిత్రను సాధికారికంగా చెప్పగల వరవరరావు గారు ప్రసంగంలో భావోద్వేగాన్ని తారాస్థాయికి తీసుకువెళ్లి తనతో పాటు వినేవారి రక్తం కూడా ఉడుకెక్కించేలా చేయగలరు. ఢిల్లీలో హిందీ శ్రోతల్ని కూడా మంత్రముగ్ధుల్ని చేయగల వక్త ఆయన.

కాలం, చరిత్ర రెండూ వేరు వేరు కావు. ఒకే చోట ఉండిపోతే అది ప్రవాహం కాదు. ఈ కాల ప్రవాహంలో నా అభిప్రాయాలు మారిపోయాయి. విరసం నా జీవితంలో ఒక అధ్యాయం మాత్రమే అయింది. అందుకు కారణాలు ఇప్పుడు వివరించడం అసందర్భం. ఢిల్లీ వచ్చిన తర్వాత జాతీయ స్థాయి నుంచి రాజ్యం స్వరూపం గురించి మరింత విస్తృత, విశాల అహగాహనతో అర్థం చేసుకునే అవకాశం లభించింది.

కాని నాలో జరిగిన పరిణామం వరవరరావు గారికి నా పట్ల ప్రేమాభిమానాల్ని పోగొట్టలేదు. ఆయన నా అభిప్రాయాలను గౌరవిస్తూనే నన్ను ఒప్పించే ప్రయత్నం చేసేవారు. నాకు కూడా ఆయనంటే గౌరవం చెక్కుచెదరలేదు. నా తొలి కవితా సంకలనాన్ని ఆయనతోనే ఆవిష్కరింపచేశాను. ఎప్పుడు కలిసినా అదే చిరునవ్వుతూ, ప్రేమగా పలకరించడం, ఢిల్లీకి వచ్చినప్పుడల్లా కలుసుకోవడం సాగించేవారు. నేను ఆయనతో విభేదించి వాదించిన సందర్భాలు లేకపోలేదు. ఉద్యమాలు జరుగుతున్న తీరుపట్ల నాకున్నవ్యతిరేక అభిప్రాయాలను ఖండితంగా చెప్పేవాడిని. ‘దోపిడీ తుపాకిని ప్రజల తుపాకితో కూల్చమనడం తప్పా…’ అని ఆయన వేసిన ప్రశ్న గురించి వాదానికి దిగేవాడిని. ‘కవిత్వం వేరు, జీవితం వేరు అనుకోవడం కన్న ఆత్మ వంచన లేదు’ అనే కవితో ఏం వాదించగలం?

‘స్వేచ్చకోరే వాడు ఎప్పుడూ జైల్లోనే ఉంటాడు, స్వచ్చంద జీవికి సంకెళ్లు వేయనిదే సామ్రాజ్యవాదికి నిద్రపట్టదు..’ అని ఆయనే జీవనాడిలో రాసుకున్నట్లు ఎప్పుడు అరెస్టవుతారో, ఎప్పుడు అజ్ఞాతంలో ఉంటారో ఆయనకే తెలియని పరిస్థితి చూసి నాకు ఆశ్చర్యం కలిగేది. ‘తుఫానులకు భయపడే వాడు జాలరి కాడు’ అని ఆయన ప్రగాఢంగా నమ్మి తన కవిత్వంలోనూ, ఆచరణలోనూ నిర్భయంగా నేటి రాజకీయాలను, రాజకీయ నేతలను తూర్పారబట్టారు. ‘ఏ ఒక్కరి ఆనందం కోసమో వేళ్లు తెగే వీణానాదం కాదు మన పేగుల తీగలపై ప్రపంచ ప్రజల విప్లవాకాంక్షలు మీటుదాం’ అన్న ఆయన వాక్యం కొన్ని దశాబ్దాల పాటు గోడలపై నినాదంగా వెలిగింది.

సార్ రాజకీయ సభల్లో పాల్గొనడం కన్నా సాహితీ జీవిగా సాహిత్యసభలో పాల్గొనడం మంచిదని హేమక్కకు చెప్పినప్పడు ఆమె నవ్వి ‘ఆయన ఎక్కడ వింటారు.’. అని చెప్పేవారు. కాని వారిద్దరూ ఒకే మనిషి, ఒకే నీడలా కలిసి నిజమైన సహచరుల్లా, స్నేహితుల్లా, పరస్పరం ప్రేమాభిమానాల్ని ప్రదర్శిస్తూ జీవించడం చూసి నాకెంతో ఆశ్చర్యం కలిగేది. ఆకాశంలోసగం నీవు.. అన్న వాక్యాన్ని వారు పూరించేవారు.

ఢిల్లీలో తెలంగాణ ఉద్యమకర్త జయశంకర్ కోరిక మేరకు వారిద్దరి మధ్య చర్చలకు దోహదం చేశాను. కేసిఆర్ పై వరవరరావుగారికి వ్యతిరేకాభిప్రాయాలున్నప్పటికీ తెలంగాణ ఉద్యమ చారిత్రక అవసరాల రీత్యా కేసిఆర్ ను వ్యతిరేకిండడం సరైంది కాని జయశంకర్ ఆయనకు నచ్చజెప్పారు. కేంద్ర గ్రామీణాభివృద్ది మంత్రి జయరాం రమేష్ అభ్యర్థన మేరకు వరవరావు గారిని ఆయన వద్దకు తీసుకెళ్లి అంతర్గత చర్చలకు వీలు కల్పించాను. కాని ఇరువురి ఆలోచనా విధానానికి పొంతన కుదరకపోవడంతో డిమాండ్లతో చర్చలు అర్థాంతరంగా ముగిసిపోయాయి. ఈ సంభాషణలో నక్సలైట్లు కిడ్నాప్ చేసి విడుదల చేసిన ఐఏఎస్ అధికారి వినీల్ కృష్ణ కూడా ఉన్నారు. ఈ చర్చలు సఫలం అవుతాయని నేను కూడా అనుకోలేదు కాని వారిద్దరి చర్చలు వినడం నాకు చైతన్యవంతమైన అనుభవం.

దాదాపు నాలుగు దశాబ్దాల పైగా వరవరరావు గారు పరిచయాన్నిబట్టి అంచనా వేస్తే ఆయన లో నిరంతరం భావోద్వేగం పెల్లుబుకుతూ ఉండేదని, మనుషుల్ని ప్రేమించడం ఆయన తత్వమని, తాను నమ్మిన దాన్ని నిర్భయంగా ఆచరించడం ఆయన నైజమని నాకు అర్థమైంది. ఆయనను సమీపిస్తే ఆయన ఆకర్షణలో పడిపోతానేమోనన్న భయం కూడా ఉండేది.

వరవరరావు గారు భావుకుడు. నెహ్రూ మరణించినప్పుడు ఆయన ఎంత విలపించారో,అంతే సున్నితత్వం, భావుకత్వం ఆయన కవితల్లో ఎల్లెడలా కనిపిస్తుంది. ఆయన కవిత్వం పై జరగాల్సిన చర్చ జరగలేదని, తెలుగు కవితా ప్రస్థానంలో ఆయన కవితల ప్రత్యేకత సరిగా నమోదు కాలేదని అనిపిస్తుంది.

మాటల్లో ఎంత ఆవేశం తన్నుకువస్తుందో, కవిత్వం రాయడం మొదలుపెట్టేసరికి ఆయన వెన్నెల వర్షంలా, వెచ్చగా తాకుతున్న ఉదయ కిరణంలా, పసిపాపల ముంగురులను స్పృశించే పిల్లగాలిలా ఆయన కవిత్వం జాలువారుతుంది. వెన్నెల ఆయనకెంత ఇష్టమో. ‘అడవి మల్లె తలపూవై అవని వక్షస్సున అంగవస్త్రమై వెన్నెల..’ అని వెన్నెలను అభివర్ణించిన వరవరరావు గారు ‘ఆకాశంలో రేపు విరిసే వెన్నెల అమవాస్యకే కాదు అశాంతికీ స్వస్తి చెప్పాలి’ అని ఆశిస్తారు ‘కిటికీ ఊచలు కత్తెరించిన వెన్నెల’ ను చూస్తూ ఆయన కవిత్వం రాస్తారు. ‘చంద్రుడు తన వెచ్చని చేయి అందించినట్లు ఆ వెన్నెల బాట పట్టుకుని తోటలోని మల్లెపొదల మీదికి, గోపురం మీదికి వెళ్లి అక్కడి నుంచి ఆకాశ ఔన్నత్యాన్ని’ అంచనా వేస్తారు. చంద్రుడు లేని ఆకాశం ఆయనకు ఒక మౌనగీతంలా అనిపిస్తుంది. ‘చివరకు ఉరికంబమూ వెన్నెలను నెమరేస్తున్నట్లు’ అనిపిస్తుంది. ‘వెన్నెల కాస్తున్నదా, వీస్తున్నదా, ఉరికంబానికి వేళ్లాడుతున్నదా.. నా ఊహానిర్గత సౌందర్యమై ఆకాశాన్నీ భూమినీ ఆవరించిందా’ అని పలవరిస్తారు. ‘వెన్నెలా, కడుపులో దేవిందంటా కలలనుంచి కక్కనీ.. నీవలె చరిత్రకు మూగసాక్షిగా ఉండడం నా వల్ల కాదు’ అని స్పష్టం చేస్తారు. ‘వెన్నెల ఎప్పుడూ విడిగా రాదు.. రాత్రిని వెంట తెస్తుంది’ అన్న గతితర్కమూ ఆయన కవితలో ధ్వనిస్తుంది.

వరవరరావు గారు రాత్రినీ, చీకటినీ వర్ణిస్తూనే సూర్యోదయాల కోసం నిత్యం ఎదురు చూసే కవి. దట్టమైన చలిలో ‘చలినెగళ్లు’ వెలిగిస్తూ ఆ కాంతిలో రేపటి ఆకాంక్షల్ని అభివ్యక్తీకరించే కవి. . తెలుగు బోధించే అధ్యాపకుడు కదా.. ఆయన కవిత్వం ప్రాచీన, ఆధునిక సాహిత్య పరిమళంలా గోచరిస్తుంది. వచన కవితా ప్రక్రియను సమర్థవంతంగా ఉపయోగించుకుని తనదైన శైలిని ప్రవేశపెట్టిన ఘనత ఆయన దక్కించుకున్నారు.

కాలాన్ని ఆయన కవితో పోలుస్తారు.

కాలం సంజె చీకటిలో క్రుంకే సూర్యుడు కాదు,

ఎప్పుడూ రేపటి సూర్యుణ్ని చూసే కవి.

కాలం ఒక్కటే గతంలో చూడనిది

కాలం ఒక్కటే సత్యమైన కవి అంటారు.

కవిత్వం లక్ష్యం సమాజంలో జరుగుతున్న పరిణామాలపై నిఘా వేయడంగా ఆయన భావిస్తారు. ‘నిఘా వేస్తూనే ఉండు కవిత్వం నిప్పయి మండుతూ ఉంటుంది’ అంటారు.

నువు మూసిన నీ చేతుల చాటునుంచి

నా కవిత్వం

ఒక బాధా తంత్రీ ఒక క్రోధ తంత్రీ తెగినట్లు

కన్నీటిని వెలిగించేవి చూపులే అయినట్లు

ప్రవహిస్తూనే ఉంటుంది రుధిరాక్షర నదిగా..

అని రాసుకున్నాను.

మాటలు, ధ్వని లేకపోతే జీవితం నిస్సారంగా ఉంటుందని ఆయన భావిస్తారు. ‘నాకట్లా శబ్దమయ ప్రపంచంలో నేల మీద మొలకెత్తాలని ఉన్నది. శబ్దమే లేకపోతే ఇన్నాళ్లు మనసులో దట్టించిన ఈ మౌనం ఎట్లా పేలేను..’ అని ప్రశ్నించుకుంటారు.

కవిత్వం అంటే మట్టిలో పొర్లాడుతున్నట్లుండాలని ఆయన భావిస్తారు.

నిన్నటి దాకా నువు మట్టిలో పొర్లాడితే తప్ప

రేపు తొలకరిచినుకుల్లో ఎగసే

నేల గంధాన్ని ఆఘ్రాణించలేవు

చెమటా నెత్తురూ చినుకులై ఆరుద్ర పువ్వులై

నాగేటి చాళ్లలో కదలాడితే తప్ప

కళ్లలో కాశ్మీర కుంకుమలు తిలకించలేవు..

అని ఆయన అసలైన కవితా రహస్యాన్ని వివరిస్తారు.

రాలిన పువ్వుల విరిగిన రెక్కల వలె నేల పగుళ్లు

కూలిన గువ్వల మృత్యుకేక వలె పృథ్వీ ధ్వని

భయవిహ్వల పాపలఆత్మరక్షణ ఆర్తి వలె

నను పాకిన తీగల విద్యుత్తు

మింటినీ మంటినీ మిరుమిట్లు గొలిపిన భూ విస్ఫోటన

ఆకాశాన్నీ, అవనినీ అలరించే పక్షుల కలకల

నేనొక రెమ్మ వేస్తున్న వసంతాన్నై తేరుకున్నాను.

అని రాసిన ఆయన కవితా వాక్యాలు ఒకవైపు విద్యుత్తును, మరో వైపు వసంతాన్ని ప్రసరిస్తూ ఉంటాయి.

కొన్ని దశాబ్దాల పాటు ఢిల్లీ లో జర్నలిస్టుగా పనిచేసినప్పటికీ నాకు అర్థం కాని విషయాలను వరవరరావు గారు లోతుగా అర్థం చేసుకున్నారు. ఇంపీరియల్ ఢిల్లీ పేరిట ఆయన కొన్ని దశాబ్దాల క్రితం రాసిన కవితలో ఢిల్లీలో సామ్రాజ్యవాదాన్ని లోతుగా అభివర్ణించారు. ‘ప్రవచనాల పార్లమెంట్ భవనం పునాదుల మీద నిలిచిన ప్రజాస్వామ్యాన్ని కాపాడండి విప్లవం నుంచి’ ఆయన పిలుపునిస్తారు.

సత్యాన్ని హత్య చేసారట.

పార్లమెంట్ లో కోర్టుల్లో,

అడుగడుగునా సత్యాన్ని చంపి,

అబద్దానికి అధికారం ఇచ్చి

చట్టం చట్రంలో

మొహం దాచుకుంటున్న ప్రభుత్వానికి

చచ్చింది సత్యమేననిపిస్తుంది.

అని ఆయన ఏనాడో రాశారు.

నోరున్న వాళ్లకు చెవులప్పగించి

కళ్లు మూసుకున్న న్యాయస్థానాలు

రోజూ చంపే, జీవితాల్ని చింపే

ప్రచ్ఛన్న హింసా వ్యవస్థను ప్రతిఘటిస్తే

హతమార్చే ప్రభుత్వాలు

అని ఆయన వ్యవస్థ స్వరూపాన్ని ఎప్పుడో వివరించారు.

ఆయన కవిత్వంలో మృత దేహాల తెరుచుకున్న కళ్లు చెబుతున్న వాస్తవాలు కనపడతాయి. కరెంట్ పోల్ కు వ్రేళ్లాడుతున్న శవం చెప్పే దారుణాలు తాండవిస్తాయి. చార్మినార్ పై నిం దూకి ఆత్మహత్య చేసుకున్న ఆడపిల్లల ఆక్రందన వినిపిస్తుంది. బూట్లక్రింద నలిగిపోయిన పూల నెత్తుటి పరిమళాలు వ్యాపిస్తాయి. ‘పొన్న పూలకోసం పోయిన పిల్లలు ఖండిత స్వప్నాలై తిరిగి వచ్చిన్రు’ అన్న విషాద గీతికలూ కనపడతాయి.

వరవరరావు గారు ఎన్ని ఆటుపోట్లు, ఎన్ని దాడులు ఎదుర్కొన్నా భయపడిన దాఖలాలు లేవు.

‘బతుకు ఒక అవమానాల చీము పుండుగా, బానిస తనం ఒక వారసత్వ వ్యాధిగా పిరికితనం నెత్తుటి స్వభావంగా బతుకుతున్న వాళ్లు రోజూ ఛస్తూనే ఉన్నారు’ అని ఆయన జీవితంలో రాజీపడుతున్న వారిని నిరసిస్తారు.

వెన్నెలతో పాటు అడవి, ప్రకృతి కూడా ఆయనకు ఎంతో ఇష్టమైన అంశం. ‘అడవిలో ప్రతి చెట్టూ రహస్యాన్ని రాస్తుంది. కొండమీద వీచేగాలులు తెచ్చే ఆ పరిమళాలకు హృదయం పులకించి ఆ పువ్వుల్ని చూడాలనిపిస్తుంది’ అని ఆయన ఒక కవితలో రాసుకున్నారు. ‘పూలు మనకు పరిమళాల వార్తలు పంపి ఏ చీకట్లో మౌనంగా వాడిపోయాయో అని వాపోవడం’ ఆయనకే సాధ్యం.

చెట్లు అజ్ఞాత వీర ప్రసవాలు,

ప్రతి చెట్టూ హృదయంలో అగ్ని,

ప్రతి కొండశిఖరమూ చెకుముకి,

ఆకులు నిస్తంత్రీ సందేశం,

పక్షులు సహస్రాక్షులు

అని అడవినీ, చెట్టునూ, పక్షులనూ, కొండశిఖరాలను తన చైతన్యంలో ఆవాహన చేసుకున్నారు. ‘మరిచిపోయిన వానాకాలాన్ని అకాశం మళ్లీ చదువుకుంటే ఎంత బాగుంటుందో’ అని ఆయన తపిస్తారు. ‘ఆకాశమే లాకప్ లో ఉన్నదని ఊహించుకుంటే నీవింకా బతికున్నట్లు.’ . అని నిర్బంధాన్ని ఆయన తేలికగా చూసే ప్రయత్నం చేస్తారు.

జ్ఞాపకం ఏమీ మిగలదా,

దీపంలో చూడు,

చిహ్నం ఏమీ మిగలదా..

చైతన్యం చూడు.

కళ్లను మనసులోకి తెచ్చుకుంటే

నీళ్లలో అలల అలజడి ఉద్యమాన్ని చూడు..

అని ఆయన జ్ఞాపకాలు, చిహ్నాలను మించిన చైతన్యాన్ని తెచ్చుకొమ్మని చెబుతారు.

వరవరరావు గారు సాహచర్యం చేసింది ప్రధానంగా నిరీక్షణ. అందుకే ఆయన తన జైలు డైరీ ‘సహచరులు’ రచనలో ‘నిరీక్షణ’ అన్న అంశాన్ని తొలుత ఎంచుకున్నారు. బయటి జీవితంలో యాంత్రికత వల్లేమి, కార్య నిమగ్నత వల్లనేమమి, కాలం ‘వేళ్ల సందు నుంచి, కళ్ల ముందునుంచి జారిపోతున్నట్లు’ గానే ఉంటుంది. జైలు జీవితం అట్లా కాదు. జైలులో నిరీక్షణ ఒక అలవాటు. ఒక వ్యసనం. ‘జైలు ప్రేమలేని రాత్రి’ అంటారు . పేపర్ కోసమో, వార్తలకోసమో, తనను కలిసేవారి ఇంటర్వ్యూ కోసమో, ఏదో ఒక దానికోసం స్పష్టాస్పష్ట అనుభూతుల మధ్య నిరీక్షణ తప్పదు. అయినా ఆయన అంటారు. ‘భావుకత, చైతన్యం గల రాజకీయ ఖైదీకి నిరీక్షణ ఒక అఖండ దీపం లాంటిది..’ అని. బయట యదాలాపంగా కాలం వెళ్లబుచ్చే మనకు జైళ్లలో మనుషులు నిరీక్షించే స్వేచ్ఛ అర్థం తెలియదు. 26 ఏళ్లుగా నెల్సన్ మండేలా, ఏ కేసు లేకుండా ఎన్నోఏళ్లు శిక్షను అనుభవించిన రవూఫ్, ఉరిశిక్షకోసం రెండేళ్లు నిరీక్షించిన భూమయ్య, కిష్టాగౌడ్ ల గురించి, ఎస్కార్ట్ లేదనే మిషమీద కోర్టు వాయిదాక్కూడా పోలేని ఆభాగ్య జీవుల గురించి, ఆదివాసీల మనం ఎప్పుడైనా తెలుసుకోవడానికి, అర్థం చేసుకోవడానికి ప్రయత్నించామా?

వరవరరావు గారికి కాలక్షేపం కావడానికి ఆయనకు తోడుగా నిలిచిన సహచరులు మొక్కలూ, చెట్లూ కూడా. గాలీ, వెలుగూ, పూలు ఆయన కోల్పోయిన స్వేచ్ఛను ఒకరకంగా గుర్తు చేసేవి, మరో రకంగా మరిపించేవి. వరవరరావు గారికి తాను అంటుపెట్టిన గులాబీ కొత్త మొగ్గ వేసినప్పుడు కోసి అంటు పెట్టిన చోట ఉదయం కిలకిలమంటున్నట్లుగా, ఆ అనుభూతి వేళ్ల చిగుళ్లలోంచి గాయాల పరాగం చిమ్ముతున్నట్లుగా ఉంటుంది. నాటిన మొక్క వాడిపోతుంటే ‘రక్తప్రసరణ ఆగిపోయి కళ్లు మూసిన ఆత్మీయుడి’లా ఉంటుంది.

తనకు తోడుగా నిలిచిన పక్షుల గురించి రాస్తారు ఆయన. ఒంటరి గూటిలో పావురం విహ్వలంగా చేసే ధ్వని ఆయనకు ‘అనాదిగా ప్రేమకోసం ప్రియురాలు చేసే అన్వేషణాక్రందన లాగే’ అనిపిస్తోందట.   ఆ పక్షుల జీవితం గురించి చాలా జాగ్రత్తగా పరిశీలించి రాస్తారాయన.

రిజర్వేషన్ వ్యతిరేక ఉద్యమం జరిగినప్పుడు ఆయన ఒక అద్భుతమైన కవిత రాశారు.

మీరు అదృష్ట వంతులు

మీ ప్రతిభ శవం నగర రాజవీధుల గుండా ఊరేగి

సంస్కృత మంత్రోఛ్చాటనలతో చౌరస్తాలో

దహన సంస్కారాలు జరుపుకుంటుంది.

ప్రతిభచావు కనుక

మీరు సృజనాత్మకంగా శవయాత్ర నిర్వహిస్తారు.

దుఃఖాన్ని అభినయిస్తారు.

మాకు చావడానికైనా,చంపడానికైనా

ప్రతిభ ఉండి ఛస్తే కదా..

అని ప్రతిభ ఒకే వర్గం సొత్తయినట్లు మాట్లాడే వారిని ఎద్దేవా చేశారు.

ప్రముఖ కవి అలిశెట్టి ప్రభాకర్ మరణించిన వార్త విని

రాత్రి గడియారంలో కాలం నిలిచిపోయింది

రక్తం కక్కుకుని ప్రభాకర్ కన్నుమూసాడని

గాలిలో సగం తెగిన నరాల తరంగాల స్వరాలు

అని రాశారు.

కాని ఒక కవి ఏం చేయగలరు? ఆ స్పృహ కూడా ఆయనలో లేకపోలేదు.

కంటికీ మింటికీ ధారగా

కత్తి చీల్చిన గర్భంలోంచి చిమ్మిన నెత్తురే కారగా

ఏ కవీ ఏం చేయగలడు నేరుగా

గత్తర్ల, కత్తెర్ల కాలంలో

గ్రామశాంతి కోసం వాయించే పంబ వలె

గుండెలతో మోగగలడు

షహనాయీ మూగవేదనకు తోడుగా..

అని కవి చేయాల్సిన పనిని ఆయన గుర్తు చేస్తారు.

నిషేధపు రోజులను ఆయన ఎన్ని అనుభవించారో చరిత్ర పుటల్లో నమోదైంది. పుస్తకాలు, పత్రికల నిషేధాలు, మాటల నిషేధాలు, కదలికల నిషేధాలు ఆయన అడుగడుగునా ఎదుర్కొన్నారు. ఆ పరిస్థితినీ ఆయన కవిత్వీకరించారు.

ఆదివాసులనుంచి ఆది శక్తి మా అమ్మ నుంచి

ఆకాశంలో ఎగిరే పక్షుల కలకూజితాలనుంచి

నీటిలో ఈదే చేప నేర్పుతున్న అలల భాష నుంచి

పువ్వులోని పరాగాన్ని పిలిచీ పిలవని గాలి పలకరింపు నుంచి

పొద్దున్నే మట్టి కప్పిన నేలలోని విత్తనాన్ని

సుతిమెత్తగా తాకీ తాకని సూర్యకిరణం నుంచి

పనిలో చిందే చెమట చుక్క నుంచి

హృదయస్పందనల ప్రేమ నుంచి

నేర్చుకున్న భాషపై ఇక నుంచి నిషేధం

అని రాసుకున్నారు.

మృత్యువుకు కూడా ఆయన భయపడలేదు.

మృత్యువే రానీ

ఆఖరి శ్వాస దాకా నువ్వు నా దగ్గరున్నావు

పర్వతాలు నా మీద విరిగిపడ్డప్పుడు

నేను మేఘాల కౌగిలిలో ఉంటాను

నదులు నన్ను ముంచెత్తినప్పుడు

నేను వెలుగు వెన్నెలను ముద్దాడుతాను

అని చెప్పుకున్నారు.

దుఃఖమే జీవిత వాస్తవమయినప్పుడు దానికీ అర్థం ఉంటుందని ఆయన భావిస్తారు.

ఏం మిగిలాయని రాయనూ

జ్ఞాపకాలు

దుఃఖం మిగిలింది

భూప్రళయం వచ్చి సముద్రం మిగిలినట్లు..

ఇప్పుడైనా నైరాశ్యాన్ని రాయడం లేదు

దుఃఖాన్ని రాస్తున్నాను

అందులో తడి ఉంటుంది కదా

అది చూపుల్నీ మొహాన్నీ స్పృశిస్తుంది

నిన్నూ, నన్నూ ఎదుటివారినీ

తడిగా తాకుతుంది కదూ..

దుఃఖం ఒక్కటే మిగిలిన విలువ

ముందుతరాలకు అందివ్వగల

సంచిత ఆస్తి

అని ఆయన తన ఆత్మీయులకు, సహచరులకూ ఎడతెగని దుఃఖాన్ని అందించారు.

తెలుగు సాహిత్య చరిత్రలో వరవరరావు గారు ఒక విశిష్టమైన, కొన్ని దశాబ్దాలుగా స్రవంతిలా, తెలుగు సాహిత్యంలో అంతర్లీనంగా ప్రవహిస్తున్న కవి ఆయన.

ఇవాళ 81 ఏళ్ల వృద్దాప్యంలో, అనేక శారీరక రుగ్మతలు చుట్టుముట్టిన సమయంలో దుర్భర కారాగారవాసం అనుభవిస్తూ, బయటకు రాలేని స్థితిలో ఉన్న వరవరరావు గారు ఒక రక్తసిక్త చరిత్రకు ప్రతిబింబం. ప్రశ్నించడం, ప్రతిఘటించడం, పోరాడడం చేసే వారు కాలం కత్తులవంతెనపై చేసే ప్రయాణం సాహసోపేతమే కాదు, సుదీర్ఘం కూడా రక్తసిక్త చరిత్రలో తన ప్రయాణం లిప్త మాత్రమే అని ఆయన అంటారు కాని ప్రతి మనిషీ, ప్రతి ప్రాణం, ప్రతి ఆలోచనా, ప్రతి అనుభూతీ, ప్రతి బాంధవ్యమూ విలువైనదే. చరిత్ర పెద్దది కావచ్చు కాని మనిషి ప్రాణం చిన్నది అందుకే విలువైనది. కనుకే ఇవాళ వరవరరావు గారికోసం ఎందరో తపిస్తున్నారు. నడుస్తుంటే ఆయన గొంతు ‘కృష్ణుడూ’ అని అందుకే పిలుస్తున్నట్లనిపిస్తుంది.

వరవరరావు గారిది అర్థవంతమైన ప్రయాణమా, ఇతరులు మార్గదర్శకంగా తీసుకోదగ్గదా అని చర్చించడం రాజకీయ చర్చ అవుతుంది అయితే ఆ ప్రయాణం చరిత్రపుటల్లో నమోదు చేసిన విలువైన ఘట్టాన్ని మరిచిపోలేం. ఆయన త్వరలో బయటకు రావాలని, తన అనుభవాల పుటల్లోంచి తన చారిత్రక ప్రయాణాన్ని భావి తరాలకోసం కవితాత్మకంగా వివరించాలని కోరుకుందాం.

 

సూర్యోదయంలో మెరిసే వసంత మేఘం

 

శరీరమంతా కవిత్వం

పేగుల తీగలపై రణన్నినాదం

విశ్వాసాన్ని కల్పించే చిరునవ్వులో

భవిష్యత్ చిత్రపటం

 

పదాలు వెతుక్కోనవసరం లేని

మనస్సులతో అతడి సంభాషణ

మానవ యంత్రాల మధ్య

నిర్లిప్త దరహాసాల మధ్య

పాదాల క్రింద రేగే ధూళిలో

పోల్చుకోలేని అతడి ప్రత్యేకత

 

శ్మశాన నిశ్శబ్దాన్ని

బద్దలు చేసే ముక్తకంఠం

చెట్ల నీడలు

ఆకుల గలగలగలలు

మోసుకువెళ్లే ప్రవాహంలో

అతడి హృదయ ఝరి

బాల్యాన్ని లాలించే

సూర్యకిరణం

ప్రేమికులను స్పృశించే

వెన్నెల వర్షం

శిథిలాల మధ్య

చిగురించిన మొక్కలలో అతడి పరిచయం

చరిత్ర పదఘట్టనల మధ్య

నలిగిన పూరేకులతో

అతడి అనుబంధం

ఆకాశ హర్మ్యాల మధ్య

ఆత్మల భాష అతడికి తెలుసు

గుర్తు తెలియని మరణాల్లో

మృత్యురహస్యాల కోసం

అతడి అన్వేషణ

కళ్లలో కాంతిపూలతో వచ్చి

కాళ్ల క్రింద

ఎండుటాకుల పదధ్వనితో

అతడి పయనం

సూర్యోదయంలో

మెరిసే వసంత మేఘం

మెరిసే మోదుగుపూల సంధ్యలో

వెన్నెల స్వప్నం

పసిపడవల వాన నీరు

మట్టి వాసనను అన్వేషించే జీవనది

అతడు అనేక వచనం

కాగితాల గుబాళింపులో

స్నేహితాల సౌరభాల్లో

గుండెపొరల్లో

పదిలమైన స్నేహకావ్యం

అతడివి రెండు విజయాలు

ఒకటి జీవితం,

మరోకటి మృత్యువు

(ఇంకెవరు కవితా సంపుటి, 2008)

 

 

కృష్ణుడు

వారం వారం ఆంధ్రజ్యోతి దినపత్రికలో ఢిల్లీ నుంచి కాలమ్ రాసే ఎ. కృష్ణారావు, అడపా దడపా కవితలు రాసే కృష్ణుడూ ఒకరే. జర్నలిస్టుగా 34 సంవత్సరాల అనుభవం ఉన్న కృష్ణుడు కవి, సాహితీ విమర్శకుడు కూడా. ఇండియాగేట్, నడుస్తున్న హీన చరిత్ర పేరుతో రాజకీయ వ్యాసాల సంకలనాలు వెలువరించిన కృష్ణుడు ఇంకెవరు, ఉన్నట్లుండి, ఆకాశం కోల్పోయిన పక్షి అనే కవితా సంకలనాలను వెలువరించారు.

24 comments

Leave a Reply to Devarakonda Subrahmanyam Cancel reply

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

  • స్ఫూర్తిదాయకంగా ఉంది సర్ ! అభివందనాలు.

  • Thanks Krishnudu garu for presenting VV at such close ‘distance’ with such a description of feeling his presence.
    Great man and great write up. Love to see him released and back with his family and all of us

  • Excellent introduction of comrade varavara Rao and his poetry . Marxism prabhaavam gala Sahityam chirakaalam samajamlo vuntundi

  • కృష్ణరావు గారు వరవర రావు గారి గురించి చలబాగా , సరిగ్గారాశారు. మొదటి సారి కల్సినప్పుడు ఎన్నో ఏళ్లగా స్నెహితుడు గా ఆప్యాయంగా మాట్లాడుతారు . వారిని మొదటిసారి ఢిల్లీ లో మిత్రుడు సి.వి.సుబ్బారావు (సుర) మోడల్ టౌన్ లో కలిశాను. చాలా స్నేహంగా మాట్లాడారు. అలాగే హేమగారు కూడా. అలా పరిచయం అయిన ఒక సారి వరంగల్, నేను సహచరి రుక్మిణీ వెళ్లాము. అపుడు అదే ఆత్మీయత. నేను అప్పటికే సృజన చదివేవాడిని. ఢిల్లీలో సృజన subscription drive 1982 లో చేశాను.

    వారు హేమ గారు ఎప్పుడు ఢిల్లీ వచ్చినా మా నేను కలిసే వాడిని .

    ఎన్నో విషయాలు ఆయన నుంచి ఆయన రాసిన కవిత్వం లోంచి నేర్చుకున్నాను.

    ఆయన్ను , సాయిబాబా, తదితర వారీనందరినీ వెంటనే విడుదల చేయాలి .

  • క్రిష్నుడు గారూ, ఎంత బాగా రాసారు! వీవీ గారి వ్యక్తిత్వాన్నీ, వారి ప్రవ్రుత్తినీ సంపూర్ణంగా ఆవిష్కరించారు. ఆయనొక వెన్నెల వర్షం. మెరిసే వసంత మేఘం. మీ అందరి సహకారం తో ఆయన విడుదల అయితే అదే సంతొషం.

  • హృదయాన్ని జ్ఞాపకాల మట్టిరంగుల్లో ముంచి రాశారు. తడితడిగా రాశారు. వరవరరావు గారు- దుఃఖం గురించి రాసిన వాక్యాలు- తాత్వికగాఢతతో లోతైనవి.

  • మీరు చెప్పిన కాలం లోనే, నేను హనుమకొండలో బేంక్వుద్యోగిగా ఓ నాలుగేళ్ళపాటువున్నాను.నాది ఒడిసా,అసలు తెలుగులో ప్రవేశంలేదు.మా మేనేజర్ రామానుజాచార్యులు. నా తెలుగుని సరిచేసేరు.స్వతహాగా, సాహిత్యం ఇష్టం,రామానుజాచార్యులవారి,సాహితీ సాంగత్యం తో,చాలామంది సాహితీ ఉద్దండులతో పరిచయం ఏర్పడింది.ఆ విధంగా,వరవరరావు గారి తో మాటాడే అవకాశం కలిగింది.అప్పటికే ఆయన ఓ కల్ట్ ఫిగర్.ఆ మూడేళ్ళపాటు,విధిగా అన్ని సమావేశలకీ,సాహత్యసభలకీ వెళ్ళేవాడిని.ఆయన వ్యక్తిత్వం నా మీద బలమైన ముద్రవేసింది..
    మీ వ్యాసం స్పూర్తిదాయకం.

‘సారంగ’ కోసం మీ రచన పంపే ముందు ఫార్మాటింగ్ ఎలా ఉండాలో ఈ పేజీ లో చూడండి: Saaranga Formatting Guidelines.

పాఠకుల అభిప్రాయాలు