తప్పెవరిది? 

ఆదిలాబాద్ జిల్లాకు చెందిన మన్నె ఏలియా సాహిత్య వాతావరణం లేని కుటుంబంలో జన్మించినా, సాహిత్యంపై మక్కువతో కథలు చదవడం, తర్వాత రాయడం ప్రారంభించారు. ఏలియా మొదటి కథ మర్రిచెట్టు 2013లో వెలువడింది. మొదటి కథే ఐనా….పర్యావరణ పరిరక్షణ మీద వచ్చిన అతి కొద్ది కథల్లో ఒకటిగా పాఠకుల ప్రశంసలు అందుకుంది. 2013లో సంగిశెట్టి శ్రీనివాస్, స్కైబాబల నేతృత్వంలో మొదలైన తెలంగాణ వార్షిక కథల సంకలనం   (రంది) కోసం ఎంపికైంది.  దళితుల దేవాలయ ప్రవేశం మీద రాసిన  అపచారం…అపచారం కథ కూడా  ఏలియాకు గుర్తింపు తెచ్చింది. వృత్తి రీత్యా ఉపాధ్యాయునిగా పనిచేస్తూనే ఆకాశవాణిలో నాటక కళాకారుడిగా, వ్యక్తిత్వ వికాస నిపుణిడిగా రాణిస్తున్నారు. తాను నివసించే ఆదిలాబాద్ ప్రాంత ప్రజల జీవితాల్ని కథల్లో చూపించడానికి ఇష్టపడుతుంటారు.

*

 

తప్పెవరిది?

       

హోటల్ తాజ్ కాన్ఫరెన్సు హాల్…

చాలా మంది కంపెని ప్రతినిధులతో, బిజినెస్ మేనేజ్మెంట్ విద్యార్థులతో సందడిగా వుంది. వాళ్ళందరూ ఖరీదైన కోట్లు వేసుకున్నారు. జరగబోయే మీటింగ్ గురించి ఆసక్తిగా మాట్లాడుకుంటున్నారు .

మైకులో అనౌన్స్మెంట్ ….

“ అవర్ హానరబుల్  చీఫ్ గెస్ట్ కమింగ్ షార్ట్లీ…” .

అప్పటివరకు ఇన్ఫార్మల్ గా కూర్చోని మాట్లాడుకుంటున్న వాళ్ళు… సూట్ సర్దుకొని తమ కుర్చీల్లో డీసెంట్ గా కూర్చున్నారు .

ఒక్కసారిగా హాలంతా నిశ్శబ్దంగా మారిపోయింది .

ఈనాటి సెమినార్ రిసోర్సు పర్సన్  ఆనంద్ వచ్చాడు .

“స్కిల్స్ ఫర్ ఏ సక్సెస్ పుల్ పర్సన్  మెనేజ్మెంట్ కెరీర్ ” అనే అంశం పై  పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇస్తున్నాడు.

కొందరు స్మార్ట్ ఫోన్లల్లో,ట్యాబ్ లలో రికార్డ్ చేసుకొంటున్నారు. హాజరైన వారందరూ దేశంలో పేరుమోసిన కంపెనీ  మేనేజర్స్. లక్షల్లో జీతాలు…. ఐనా చిన్న పిల్లల్లాగా శ్రద్దగా వింటున్నారు.

అయిష్టంగానే వచ్చిన కావ్య అథితి ప్రసంగాన్ని విన్నదో లేదో కాని తన ముఖం కనబడకుండా జాగ్రత్త పడింది. బాబ్డ్ హెయిర్ ముఖం మీద పడడంతో స్పష్టంగా కనబడడం లేదు. ఖరీదైన నల్లని రేబాన్ అద్దాలు పెట్టుకొంది. నోటికి అడ్డుగా కర్చీఫ్ పెట్టుకొని తల కిందికి వాల్చుకొని పరధ్యానంగా కూర్చుంది. మెత్తని సోఫాలో కూర్చున్నా ముళ్ళ మీద కుర్చున్నట్టుంది. తను వచ్చిన ఉద్దేశం మర్చిపోయి అసహనంగా వింటోంది. కాని మనస్సు తన ఆధీనంలో లేదు.

సెమినార్  ముగిసింది. హాలంతా చప్పట్లతో మారుమోగుతోంది. తను అప్రయత్నంగానే తల ఎత్తి ఒకసారి చూసి చప్పట్లు కొట్టింది. మళ్ళీ తల కిందకి వంచింది .

ప్రశ్నోత్తరాల సమయానికి ముందు స్మాల్ బ్రేక్ ఇచ్చారు.

కొద్దిసేపు విరామం …

ఆనంద్ పర్సనల్ ఫోన్ కు ఒక ఎస్.ఎం.ఎస్ వచ్చింది “ కుడ్ యూ ప్లీజ్ స్పేర్ ఏ ఫ్యూ మినిట్స్ ఫర్ మీ.  ఐ వుడ్ లైక్  టు టాక్ టు యు పర్సనల్లి”.

తనకు పరిచయం లేని ఫోన్ నంబర్ నుండి వచ్చింది. తన బిజినెస్ లావాదేవీలు ఏవి వున్నా కంపెనీ ఫోనుకు వస్తాయి. ఆశ్యర్యం …తన పర్సనల్ ఫోనుకు వచ్చిందంటే తనకు చాల దగ్గరి వాళ్ళే అయివుంటారు అనుకున్నాడు.

ఆనంద్ రిప్లై పంపాడు “యస్. ఆఫ్టర్ ట్వంటి మినట్స్ ఎట్ సూట్ నంబర్ 707”.

ప్రశ్నోత్తరాల సమయం అయిపోయింది.

సన్మానం, వందన సమర్పణ తర్వాత ఆనంద్ హోటల్ కు చేరుకున్నాడు .

ఇరవై నిమిషాల తర్వాత …

ఆశనో ,ఆనందమో, బాధనో, భయమో తెలియని స్థితిలో కావ్య  సూట్ నంబర్ 707 కాలింగ్ బెల్ నొక్కింది .

ఆనంద్ సెక్రెటరి తలుపు తెరిచాడు. కావ్య ఫోన్ కి వచ్చిన రిప్లై చూపించింది. ఆనంద్ కు విషయం తెలియజేశాడు .

మళ్ళీ వచ్చి“ ప్లీజ్ వెల్ కమ్.  బీ సీటెడ్” అంటూ కుర్చీ చూపించాడు.

ఆనంద్ వచ్చి తన టేబుల్ ముందు కూర్చొని లాప్ ట్యాప్ లో ఏదో చూసుకుంటూ “ఎస్ మేం! ..యువర్ నేమ్ ప్లీజ్” అన్నాడు.

సమాధానం లేదు.

సెక్రెటరీ వైపు చూసింది. అర్థం చేసుకున్నఆనంద్ సెక్రెటరీని బయటకు పంపించేశాడు.

రెండు చేతులతో తల పట్టుకొని కిందికి వాల్చేసింది. టపా టపా కన్నీళ్లు కారిపోతున్నాయి.

“వాట్ హాప్పెండ్ టు యు. హూ ఆర్ యు ప్లీజ్. కంట్రోల్ యువర్ సెల్ఫ్” ఓదార్చాడు .

నిదానంగా తల పైకెత్తింది. కండ్లు ఎరుపెక్కాయి. కండ్లద్దాలు తీసి కర్చీఫ్ తో తుడ్చుకుంది.

ఎక్కడో చూసిన ముఖంలా వుంది ఆనంద్ కు. “సారి మేడం … ఐ కాంట్ రికలెక్ట్ యు రైట్ నౌ ”.

నిశ్శబ్దాన్ని చేధించుకుంటూ … “హౌ ఆర్ యు ఆనంద్! ఐయాం కావ్య” అంది.

పేరు వినగానే వెంటనే  ల్యాప్ ట్యాప్ మూసేసి …కండ్లు పెద్దవి చేసి ఆమె  ముఖంలోకి తీక్షణంగా  చూసాడు. ఆమె అసౌకర్యంగా ఫీలయ్యింది.

“నిజమే ఆ కావ్యనే…చాల మారిపోయింది. వెంట్రుకలు తెల్లబడ్డాయి. బాబ్డ్ హెయిర్ గాలికి ఎగిరి పడుతుంది. నొసటి మీద పడిన వెంట్రుకల్ని చేతితో వెనక్కు తోసేసింది. నుదుటన బొట్టు లేదు. చేతులకు గాజులు లేవు. ఒకప్పటి గ్లామర్ లేదు. ముఖంలో కళ లేదు. కాటన్ చీరలో పెద్దమనిషిలా వుంది. ముఖంలో ఏ రకమైన భావం స్పష్టంగా కనబడడం లేదు. కండ్ల కింద నలుపు వలయాలు, వయస్సు పై బడిన దానిలా… ముఖం మీద ముడతలు  ఉండడంతో పోల్చుకోవడానికి కొంత సమయం పట్టింది.

“కావ్య గారు. బాగున్నారా!” స్వచ్చమైన తెలుగులో పలుకరించాడు .

“మీరు తెలుగు ఇంత బాగా నేర్చుకున్నారా…!”ఆశ్చర్యంగా అడిగింది .

“నేను మీ కోసం తెలుగు నేర్చుకున్నాను. మీరు పోయారు…. తెలుగు నాతోనే వుండి పోయింది. మీరు ఇంగ్లిష్ నేర్చుకున్నట్టే నేను తెలుగు నేర్చుకున్నాను.”

“ మీరు ఇష్టంతో నేర్చుకున్నారు, నేను కష్టంతో నేర్చుకున్నాను. అదే నాకు బ్రతుకు దెరువు నిచ్చింది. ఆఫ్టర్ ఏ లాంగ్ గ్యాప్….మిమ్మల్ని  చూడాలనిపించి వచ్చాను. చూసాను ఇక వెళ్తాను” నిల్చొని మెల్లని స్వరంతో అంది కావ్య.

“కావ్య గారు కూర్చోండి. ఏదో పర్సనల్ గా మాట్లాడాలన్నారు?…వాట్ సార్ట్ ఆఫ్ డ్రింక్ యు విల్ హావ్” అన్నాడు .

“ నో ఫార్మాలిటీస్ ప్లీజ్….”వద్దని సైగ చేసి కూర్చుంది.

“ఏదైనా ప్రాబ్లంలో వున్నారా. పిల్లలెంత మంది. ఏమి చేస్తున్నారు” మంద్ర స్థాయిలో ఆప్యాయంగా అడిగాడు ఆనంద్.

“పాత ఆనంద్ కాదు. పూర్తిగా పరిణతి చెందిన ఆనంద్ ను చూస్తోంది. ఒకప్పటి ఆవేశం, తొందరపాటు తనం, మచ్చుకైనా కనిపించడంలేదు. ప్రశాంతంగా చిరునవ్వుతో పొందికగా మాట్లాడుతున్నాడు..” అనుకుంది మనసులో.

“ నాకొక అమ్మాయి. పేరు స్నిగ్ద. బిటెక్ అతి కష్టం మీద కంప్లిట్ చేసింది…” అంటూ నిట్టూర్చింది.

“ఏది మన అమ్మాయి. సారీ… మీ అమ్మాయి. ఫోటో చూపించండి. “ కుతూహలంగా అడిగాడు

“నా జీవితంనుండి డిలిట్ చేయలేను కానీ నా ఫోనులో నుండి డిలిట్ చేసాను. ప్రస్తుతం నా వద్ద లేదు. చూపించను కూడా. దయచేసి క్షమించండి”.

“ అదేంటి అలా మాట్లాడుతున్నారు. అమ్మాయికి తెలిస్తే బాధ పడుతుంది కదా”.

“అది కూడా నా జీవితంతో ఆడుకుంటుంది” నిట్టూర్చింది కావ్య.

“నాకేమి అర్థం కావడం లేదు. చిన్న పిల్ల …ఒకవేళ ఏదైనా తప్పు చేస్తే మనమే సర్దుకు పోవాలి. వాళ్లకు అర్థమయ్యేలా చెప్పాలి. అలా కోపం పెంచుకోవడం కరెక్ట్ కాదు…”అన్నాడు ఆనంద్ .

కావ్య కండ్లళ్ళ నీళ్ళు తిరుగుతున్నాయి. “నా జీవితంలో ఏది కరెక్ట్ గా చేసానని…మీరు ఎంత బతిమాలినా వినకుండా మొండిగా, మూర్ఖంగా, అహంకారంతో మాట్లాడి మిమ్మల్ని హర్ట్ చేసి విడాకులు తీసుకున్నాను. దానితో మొదలు. ఎన్నో రాంగ్ డెసిషన్స్ …”.

“మీ పేరెంట్స్ ఎలా వున్నారు. ఆరోగ్యం బాగుందా ?”

“నన్ను చంపలేక వాళ్ళు చావలేక మంచాలకే పరిమితమై బ్రతుకీడుస్తున్నారు”.

“ఏమైంది అలా మాట్లాడుతున్నారు?”.

“దయచేసి మీరు అని అనకండి. నాన్నకు యాక్సిడెంట్ అయ్యింది. వెన్నుపూసకు దెబ్బతగిలింది. దాదాపు యాబై లక్షలు  ఖర్చు చేసాను. ఇక ఎన్నటికీ నడవలేడని డాక్టర్లు చెప్పారు. అతనికి సేవలు చేసి చేసి అమ్మ అలసి పోయింది. టెన్షన్తో బీపి, షుగర్ ఎక్కువైపోయాయి. ట్రీట్మెంట్ నడుస్తుండగానే నాకు ఇంకో పరీక్ష… అమ్మకు పక్షవాతం వచ్చింది. వాళ్ళను చూసుకోవడానికి ఎవరులేరు. వాళ్ళు నాతోనే వుంటున్నారు” .

“మీ తమ్ముడు వున్నాడు కదా”

“ వాడి పెళ్లి తర్వాతే ఇదంతా జరిగింది. ఎంతో గ్రాండ్ గా చాలా ఖర్చు పెట్టి పెళ్లి చేసాడు నాన్న. గొప్పింటి సంబందం. పెళ్ళయిన రెండు నెలలకే అమెరికా వెళ్ళిపోయారు. ఒక్కసారి కూడా  ఇండియాకు రాలేదు. వీళ్ళ గురించి తెలిసి కూడా… చూడలేదు. వాడి భార్య క్లియర్ గా చెప్పెసింది‘…వీళ్ళకు సేవలు చేయడం తన వల్లకాదని’. తమ్మున్ని రానివ్వలేదు. వాడు చాల సార్లు బాధపడ్డాడు….కాని ఏమి చేయ లేనని చెప్పేశాడు.”కర్చీఫ్తో కండ్లు అద్దుకుంది.

“సారీ…కూల్. ” అంటూ వాటర్ బాటిల్ అందించాడు.

కొన్ని క్షణాలు నిశ్శబ్దం…సూటిగా చూడకుండా మాట్లాడుతుంది కావ్య.

ఆనంద్ ఆమెనే గమనిస్తు శ్రద్దగా వింటున్నాడు.

“మీ హస్బెండ్ ఏం చేస్తారు?”

“నా గతమంతా చెప్పి మీ విలువైన సమయం వృధా చేస్తున్నాను” అంది.

“పర్లేదు ఇప్పుడు ఖాళీగానే వున్నాను” ఆనంద్.

“అదో పీడకల నా రెండవ పెళ్లి. సరిదిద్దుకొలేని… నేను చేసిన రెండవ తప్పు. మొదటిది మీ మాట వినక మిమ్మల్ని కాదనుకోవడం. నా మాట నెగ్గించుకోవడం” ….కళ్లల్లో నీళ్లు ఆగడం లేదు.

“ప్లీజ్. కంట్రోలో యువర్ సెల్ఫ్.”

“నా ఒంటరితనానికి కన్నీళ్ళే తోడూ ఆనంద్! మిమ్మల్ని కాదనుకొని విడాకులు తీసుకున్నాక  మీకన్నా గొప్ప వాణ్ని చేసుకుని చూపిస్తానని తో ఆవేశంతో కొద్ది రోజుల్లోనే పెళ్లి చేసుకున్నాను. చాలెంజ్ చేసినట్టే చాలా ధనవంతుడు దొరికాడు. మా నాన్న చిన్ననాటి ఫ్రెండ్ రియలెస్టేట్ బిసినెస్ చేసి బాగా సంపాదించాడు. వాళ్ళ చిన్నబ్బాయి అమెరికాలో ఉంటున్నాడు. అతడు చాల మంచి వాడని చెప్పారు. చూడ్డానికి హీరో లాగుంటాడు. కాని నా జీవితంలో పెద్ద విలన్. తనకు లేని దురలవాటు లేదు. పెద్దగ చదువు అబ్బలేదు. ఇక్కడుంటే అందరికి తెలిస్తే పరువు పోతుందని అమెరికాలో పెట్టి మా మామ గారు డబ్బులు పంపించేవారు. తను ఎంజాయ్ చేయడానికి తప్ప దేనికి పనికి రాడు. బాధ్యత తెలియదు. చెప్పినా అర్థం చేసుకోలేడు. ఎవరి మాట వినడు. మంచి కమ్యునికేషన్ స్కిల్స్ వున్నాయి. ఎవరినైనా మాటలతో ఇంప్రెస్స్ చేయగలడు. మీ పూర్ కమ్యునికేషన్ వల్ల మీకు దూరమయ్యాను. అతని స్కిల్ చూసి ఇలా వుండాలి భర్త  అనుకొని సంబర పడ్డాను పెళ్ళైన కొత్తలో.

కాని ఎన్నో రోజులు నిలువలేదు నా సంతోషం. అతని అసలు రూపం మెల్ల మెల్లగా బయట పడింది. భార్య అంటే అతని దృష్టిలో ఒక మర మనిషి లాంటిది.డబ్బు పడేస్తే ఎంత మందినైన తెచ్చుకోవచ్చని అనే వాడు. అలానే చేసేవాడు. ప్రేమ ఆప్యాయతలేమి లేవు. అతనిని అతని పరిస్తితిని అర్థం చేసుకొనే లోపు పాప పుట్టింది.

పాప కోసమే అన్నీ భరించాను. పాప పెద్దయ్యే వరకు దాన్నే చూసుకుంటూ ఇన్నాళ్ళు బతికాను. పాప హాస్టల్లో వుంటు చదువుకొంటుంది. మా పేరెంట్స్ ను బాధ పెట్ట కూడదని ఇలా చేస్తున్నాను.

మా పాపకు అన్ని వాళ్ళ నాన్న బుద్దులే వచ్చాయి. చాల మొండిది .తను అనుకున్నది  సాధించే వరకు ఎవరిని మనశ్శాంతి గా ఉండ నివ్వదు .ఎంతో జాగ్రత్తగ పెంచాలనుకొన్నాను . ఎక్కడ లోపం జరిగిందో గాని నా మాట వినకుండా తయారయ్యింది . దానికి నాకంటే ఫేస్బుక్  ఫ్రెండ్స్ తోనే లోకం. నాకు ఆరోగ్యం బాగాలేకపోయిన కనీసం పలుకరించదు . ఎప్పుడు చూసినా స్మార్ట్  ఫోన్తోనే గడుపుతుంది . ఎవరిని పట్టించుకోదు..

మీరు చాల సార్లు పంతాలకు పోయి జీవితాన్ని నాశనం చేసుకోవద్దని అన్నారు. కాని నా పంతం నెగ్గిందని, నేనే గెల్చానని విర్ర వీగి పోయాను. కాని గెలుపు రూపంలో వచ్చిన ఓటమని గ్రహించలేక పోయాను. అనుభవిస్తే కాని గెలుపేదో ఓటమేదో అవగాహన కాలేదు . తెలుసుకోనేలోపు జీవితపు చివరి అంకం అరంభమైంది”.

“కావ్య ! జీవితంలో ఆటుపోట్లు తప్పవు .మరణించే వరకు గెలుస్తామనే ఆశతో పోరాడాలి .

జీరో స్థాయినుండి కూడా మళ్ళీ జీవితాన్ని మొదలు పెట్టవచ్చు. ధైర్యంగా ఉండాలి . ఒంటరితనంలోనే నిరాశ చెందకూడదు ”

“చెప్పినంత ఈజీ కాదు. మీరు  మర్చి పోయారా ?…. మర్చిపోయారని  నేను అనుకోను. నా కోసం మీరు ఇంత సమయం కేటాయించారు. నా మీద మీకు కోపం లేదా …? ఆనాడు మీరొక మాటన్నారు “నా మీద కోపంతోనో , కసితోనో విడాకులు ఇవ్వడం లేదు. నా మీద జాలి పడి ఇస్తున్నానన్నారు . ఆ కాస్త జాలి మీ వద్ద దొరుకుతుందనే నమ్మకంతో రావాలని పించింది . నన్ను క్షమించండి . నేను చేసిన ద్రోహానికి నా పై  ద్వేషం పెంచుకొని కనీసం మాట్లడరనుకున్నాను . తప్పుగా అంచనా వేసుకొన్నాను..”.

“ మన ఇద్దరి ఆలోచనలు సరిపడకనే విడిపోయాము. నీది నీకు, నాది నాకు సరైనదే అనిపించింది. ఎవరి దారి వారు వెదుక్కున్నాం . అందులో పగ పెంచుకొని జీవితాన్ని నరకం చేసుకోవడంలో అర్థం లేదు”.

“ నా మిత్రులు ,బందువులు నా గతం తెలసిన వారు ఈసడించుకున్నారు . కొత్తవారికి నా గతం చెప్పదల్చుకోలేదు. వారి ముందు చులకన అవడం తప్ప వేరేమి జరుగదు. అన్నివుండి, అందరుండి ఒంటరి తనాన్ని అనుభవిస్తున్నాను . ఒంటరితనాన్ని మించిన శిక్ష లేదు . అదేంతటి నరకమో అనుభవిస్తే కాని తెలియలేదు. నేను సంపాదించిన కోట్ల ఆస్తితో కోల్పోయిన జీవితాన్ని కొనుక్కోలేను కదా . మనశ్శాంతిని మించిన ఆస్తి లేదని అప్పుడు అర్థం కాలేదు.  మీ మీద కసితో ఛాలెంజ్ చేసి ఇంగ్లిష్ నేర్చుకుని ఎన్నెన్నో కోర్సులు చేసాను . అవే నాకు ఆధారమైనాయి . కాని మీరు నామీద ప్రేమతో తెలుగు నేర్చుకున్నారు . నేను  మరాఠీ , హిందీ నేర్చుకొని ఉండుంటే …మిమ్మల్నిఅర్థం చేసుకొనే దానినేమో ….ఆ ఆలోచనే ఆనాడు నా దరికి రానివ్వలేదు. మనిద్దరి మధ్య కమ్యునికేషన్ గ్యాప్ ఏర్పడింది. ఎవరైనా వాళ్ళ మాతృ భాషలో భావ వ్యక్తీకరణ చేసినట్టు ఇంకా ఏ భాషలోను అంత బాగా చేయలేరు. మీకు తెలుగు సరిగా వచ్చేది కాదు.నాకు తెలుగు తప్ప వేరేది వచ్చేదికాదు . మీరు చెప్పిన ప్రతిది నెగటివ్ గా తీసుకున్నాను. మీ మాట నేనెందుకు వినాలి , నా మాటనే అందరు వింటారు అనుకునే దాన్ని. మా తల్లి తండ్రులకు  ఒక్కతే కూతుర్నని అల్లారు ముద్దుగా పెంచడంతో నాలో మొండితనం విపరీతంగా పెరిగింది. నా మాటను ఎవరూ వ్యతిరేకించేవారు కాదు .

నేను పుట్టినప్పటినుండి మా కుటుంబానికి బాగా కలిసొచ్చిందట , అందుకే అంతటి విలువిచ్చేవారు . నాకు భాదంటే తెలుయకుండా పెంచారు . నేను ఏది చేసిన తప్పనేవారు కాదు . నా నిర్ణయమే ఫైనల్ . మా తల్లి దండ్రుల లాంటి వారు ఎవరికీ ఉండరని చాల గర్వపడేదాన్ని. మీరనే వారు తల్లి దండ్రులు శాశ్వతం కాదు. భర్త పిల్లలే శాశ్వతం అని. అదంతా ట్రాష్ అని కొట్టివేసేదాన్ని. మా తల్లి దండ్రులు దేవుళ్ళు అనిపించేది. వాళ్ళ మాటనే అనుసరించాను. కాని ఇప్పుడిప్పుడే తెలుస్తుంది వాళ్ళు నా జీవితానికి చేసిన ద్రోహం ఎంతటిదో. మా పేరెంట్స్ నాకు తోడుగా నిలబడి ….నేనుండగా నీకెందుకు ….వీడు కాక పొతే వీన్ని మించిన వాణ్ని తెస్తాను … నువ్వేమి భయపడకు ,…..డబ్బు పడేస్తే ఎవడైనా చేసుకుంటాడు….అని చెప్పినప్పుడు. నేను చాల అదృష్టవంతురాల్ని అని సంతోష పడ్డాను. కాని చాలా ఆలస్యంగా తెల్సుకున్నాను …వాళ్ళ ప్రేమ ఎంతటి శాపంగా మారిందో .

ఆ వయస్సులో నేను చాల కరెక్ట్ అని బలంగా నమ్మేదాన్ని. ఆ రోజు అందరి సంసారాలో చిన్న చిన్న సమస్యలుంటాయి సర్దుకు పోవాలి . ఓపికగా వుంటే కొద్ది రోజులకు మంచి జరగుతుందని చెప్పి ఒప్పించే ప్రయత్నం చేయలేదు . ముందు ముందు బంగారు భవిష్యత్తు ఉంటుందని ఆశ కల్పించ లేదు. జీవితమంతా కన్నీళ్ళతో కాపురం చేయాల్సిన దుస్థితి వుండేది కాదు. జీవితాన్ని కటిక చీకటి కమ్మేశాక కాని వాస్తవం తెలిసిరాలేదు.

జీవితమంటే సినిమాల్లో చూపించినంత కలర్ఫుల్ కాదని …ఒడుదొడుకులు తప్పవని…నాకెవరు చెప్పలేదు. వినేదాన్ని కూడా కాదు అప్పుడు . ప్రాక్టికల్ గా తెల్సివచ్చింది . అందరి జీవితాల్లో సుఖదుఃఖాలు వుంటాయి. నా జీవితంలో సుఖానికి చోటే లేదు. కన్నీటికి లోటే లేదు” కొద్దిసేపు మౌనం…

 

“జానే ఓకైసే లోగ్ తే జిన్కె

ప్యార్కో ప్యార్ మిలా

హమ్నే జబ్ మాంగ్ తె ఫూల్

కాంటోం కా హార మిలా” (ప్రేమకు ప్రతిగ ప్రేమ లభించిన మనుషులు ఎటువంటి అపురూపమైన మనుషులై వుంటారు . నేను ఫూలు కావాలని కోరుకుంటే నాకేమో ముండ్ల హారం లభించింది ) పాట ఎన్ని సార్లు విన్నదో!… గుర్తుకొచ్చింది  మనస్సులో.

“ఓటమిని అంగీకరించడమే ఓటమి . పోరాడుతున్నంత సేపు ఓటమి గెలుపుల మధ్య పోటిలో గెలువడానికి కూడా అవకాశం వుంటుంది. ఆట ఆపేసినప్పుడే ఓటమి . అలసి పోవద్దు. గెలుస్తామనే ధీమాతోనే శక్తిని కూడగట్టుకొని ప్రయత్నిచాలి” అన్నాడు ఆనంద్ .

పెళ్ళైన కొత్తలో నేను ఉహించుకొన్న ప్రపంచం వేరు .వాస్తవ పరిస్థితులు వేరు .

మనం విడాకులు తీసుకున్నాక….చాల డిప్రెషన్లోకి వెళ్ళి పోయాను . మా అమ్మ నాన్నలు ఏది చెప్పితే అదే న్యాయం అనుకున్నాను. చెప్పడానికి చాల విషయాలున్నాయి .కాని మీకు సమయం చాల విలువైనది.

ఇన్నేండ్లుగా నా గుండెలో దాచుకున్న లావా ఎక్కడ బయట పడకుండా జాగ్రత్త పడ్డాను. మీతో పంచుకుంటుంటే కాస్త తేలిక పడుతుంది.

రెండవ పెళ్లి చేసుకొని అమెరికా వెళ్లి పోయాను. ఆయనొక శాడిస్ట్ .బయటి వాళ్ళతో చాల హుందాగా మాట్లాడుతాడు. మాటలతో మాయ చేస్తాడు. అతని అసలు రంగు నా దగ్గర బయట పడుతుంది. నిత్యం వేదింపులతో నిద్ర లేని రాత్రులే ఎక్కువ. ప్రతి దానీకి నీ మొదటి మొగుడు ఇలా చేసేవాడా ? అలా చేసేవాడా? ….అని సూటి పోటి మాటలతో చిత్రవధ చేస్తుండే వాడు. నేను మౌనంగా భరించడం తప్ప ఏమి చేయలేక పోయాను. తనను ఏ విషయంలో హెచ్చరించిన , ఎదురు మాట్లాడినా …సెకండ్ హ్యాండ్ దానివి నీకేమి తెల్సు అని హింసించేవాడు. .

కాని అతనితో కల్సి వున్నన్ని రోజులు నోటితో చెప్పలేని బూతులు తిట్టడం, చేతికి దొరకిన దానితో కొట్టడం మామూలు. ఆ తిట్లకు అలవాటు పడిపోయాను . ఆ రోజుల్లో  చిన్న చిన్న విషయాలకు గొడువ పడేవాళ్ళం. నన్ను ఈడియట్  అన్నందుకే అదే నేరంగా భావించి, మా పేరెంట్స్ కూడా నన్ను ఒక మాట అనరు నన్ను అనే హక్కు మీ కేక్కడిదని బలవంతంగా  విడాకులు తీసుకున్నాను. అది ఎంతటి సిల్లి థింగ్ అని ఇప్పుడనిపిస్తుంది. అప్పుడు అదే గొప్ప అవమానంగా భావించాను. ఆనంద్ మీకు చాల అన్యాయం చేసానని గుర్తుకొచ్చినప్పుడల్లా  చాల బాధ పడ్తున్నాను.”

“ఛా ! అలా అనకూడదు. అవును!  మీ అమ్మ నాన్నకు ఈ విషయాలు తెల్సా ? నేను వుద్యోగం కోసం ఇండియాలో,తను అమెరికాలో పెద్ద వుద్యోగం చేస్తున్నాడని, ఇక్కడ అయనకు తగిన జాబ్ దొరకదని మా వాళ్లకు చెప్పాను. నేను అప్పుడప్పుడు అమెరికా వెళ్తున్నాని చెప్పి నమ్మిస్తున్నాను. ఇన్నాళ్ళు తెలియదనే అనుకున్నాను. ఒకరోజు రాత్రి ఎప్పటిలాగే  చాల సేపు నిద్ర పట్ట లేదు. మా అమ్మానాన్న మాటలు వినిపించాయి.

అమ్మ నాన్నతో “అల్లుడు రాక చాల రోజులైంది. ఒకసారి ఇండియాకు రమ్మని చెప్పండి”అంది.

“ఒసి పిచ్చిదాన ! అది ఎన్నడో అతన్ని వదిలేసి ఇండియాకు వచ్చింది” .

“నీకెట్ల తెల్సు” మా అమ్మ అడిగింది. అది అమెరికా వెళ్తున్నానని చెప్పి ఇండియాలోనే హోటల్లో వుండి వస్తోంది. రెండు మూడు సార్లు అమ్మాయి హోటల్ బిల్ రసీదు తీసి డస్ట్ బిన్లో  పడేస్తే చూసాను. ఆ తర్వాత ఎన్నో సార్లు అమెరికా వెళ్తున్నానని చెప్పిన ప్రతి సారి దాని బ్యాగు వెదికితే బిల్స్ దొరికాయి. మనకు తెలియదని అది అనుకొంటోంది. నేను అలాగే నటిస్తున్నాను దానికి అనుమానం రాకుండా”.

“ఎందుకండీ అలా చేస్తున్నారు. ఏనాడూ నాతో  ఈ విషయం చెప్పనేలేదు. ఎందుకు దాచారు..?”

“ మనల్ని ఈ పరిస్థితిలో వదిలి అది వెళ్లి పొతే ఎవరు చూస్తారు? అందుకే ఏనాడూ దానికి వేరే ఆలోచన రాకుండా…ఎవరికీ తెల్వకుండా ప్రవర్తించాను. మన పోషణ ఎవరు చూస్తారు. దాని  సంసారం సరిగా లేనందుకే  మనతోటి వుంటుంది. మనల్ని చూస్తుంది. అదే లేకుంటే మన బతుకు ఏమయ్యేదో ఆలోచించావా ?” అంటుంటే విన్నాను.

నా గుండె ఆ రోజే పగిలిపోయింది. నా సుఖం కోసం కాదు. వాళ్ళ సుఖం కోసం నా బ్రతుకుతో ఆడుకొన్నారు” కన్నీళ్ల కట్ట తెగింది.

చాల సేపు మౌనంగా కూర్చున్నారు . గడియారం వైపు చూసింది .

“థ్యాంక్ యు ఆనంద్ ! మీ విలువైన సమయం నా కోసం వెచ్చినందుకు… వెళ్తాను” అంటూ లేచి నిల్చుంది .

ఆనంద్ కుర్చిలోనుండి లేచి తలుపు తీసి సాగనంపడానికి వస్తున్నాడు. ఒక్క అడుగు వేయగానే “ ప్లీజ్! ఆనంద్  మీతో కల్సి నడ్చే అదృష్టాన్ని కోల్పోయాను . మీరు ఇక్కడే వుండండి ,నే వెళ్తాను” మెట్లు దిగుతూ ఒక్కసారి ఆనంద్ ను చూసి గబగబా వెళ్ళిపోయింది .

వెళ్లి కారులో కూర్చుంది . కారు వేగంగా ట్రాఫిక్ ను  చేదించుకుంటూ వెళ్తుంది. కావ్య వెనుక సీట్లో కూర్చొని తల వెనుకకు వాల్చింది. ఎన్నో ఏండ్లుగా మోస్తున్న టన్నుల బరువును ఎవరో దింపేసినట్లు తేలికగా వుంది. ఎప్పుడో నిద్రలోకి జారుకుంది.

ఆనంద్ ఒంటరిగా అలానే కుర్చీలో కూర్చొని కళ్ళు మూసుకొన్నాడు. గతం కళ్ళముందు కదలాడుతుంది.

“కావ్య ఒక్కదానిదే తప్పా!… ఆలోచనలు సుడిగుండాలాగా తిరుగుతున్నాయి.

“డబ్బు తప్ప వేరేమి తెలియకుండా పెంచిన ఇద్దరి తల్లిదండ్రులూ బాధ్యులు కారా? నా భార్యను అర్థం చేసుకోనందుకు నేను బాధ్యున్ని కాదా! నా చదువు సంస్కారం నేర్పించిదేమిటి? ప్రతిది డబ్బుతో కొలవడం…డబ్బు కోసమే జీవితాంతం పరుగెత్తడమే నేర్పిన ఈ సమాజానిది కాదా తప్పు?

ఆమె నాలాగానే యంత్రంలాగా పనిచేసి డబ్బు సంపాదించాలని వేధించిన మా అమ్మ దోషి కాదా!”.

సెక్రటరీ తలుపు తోసుకొని లోపలి వచ్చాడు . ఆ చప్పుడుకు ఆనంద్ కళ్ళు తెరిచాడు .

వెంటనే కుర్చిలోంచి లేచి బెడ్ రూం లోనికి వెళ్ళాడు .

తన సెల్ ఫోన్ అందుకొని వాట్శాప్ కావ్యకు మెసేజ్ పంపాడు .

మరో సారి ఆ మెసేజ్ చదువుకొన్నాడు.

దీర్ఘంగా నిట్టూర్పు విడిచి ….. రిలాక్స్ డ్ గా కళ్లుమూసుకున్నాడు.

                                    ***

 

తెలంగాణా భాషలో రాస్తే వేసే పత్రికలు లేవు

– ఏలియా గారు. నమస్తే. ఎలా ఉన్నారు. ఇటీవలే మీ కథల సంకలనం “మర్రిచెట్టు “వెలువడింది కదా. అభినందనలు.

-బాగున్నానండీ. థాంక్యు అండి.

.మీ మొదటి కథ ఏది ? దాని నేపథ్యం గురించి చెప్పండి .

– నా మొదటి కథ “ మర్రి చెట్టు” నమస్తే తెలంగాణలో (20అక్టోబర్ 2013 ,బతుకమ్మ) అచ్చయ్యింది .ఆ సంవత్సరం వచ్చిన ‘రంది’ అనే కథ సంకలనంలో చోటు సంపాదించుకుంది . మంచి స్పందన వచ్చింది . నాకు  సంతృప్తినిచ్చింది .

ఆ కథ వచ్చినప్పుడు చాల మంది ఫోన్ చేశారు . ఒక రిటైర్డ్ ఇంజనీర్ నల్గొండ నుండి ఫోన్ చేసి “మీ కథ చదివిన తర్వాత మా వూరు గుర్తొచ్చింది .రేపు వెళ్తున్నాను” అన్నాడు

నా మొదటి కథ సంపుటికి ‘మర్రి చెట్టు’ అనే పేరు పెట్టుకున్నాను .

మా ఊరు దండేపల్లి(ఆదిలాబాద్ )లో బస్ స్టాండ్ లేదు. రోడ్డు పక్కన చాల పెద్ద మర్రి చెట్టుండేది . మేము దానికింద ఆడుకొనే వాళ్ళం . అంగడి , హోటల్లు అన్ని దాని కిందనే ఉండేవి .

ఒక నాడు నేను ఆదిలాబాదు నుండి బస్సు దిగగానే మర్రి చెట్టు నరికి వేయబడి కనబడ్డది . ఊరికి కళ పోయిందనుకున్నాను . నా దోస్తులను చెట్టుకేమైనదో అడిగి తెల్సుకొన్నాను . చాల బాధ అనిపించింది .

నా బాధను కాగితం మీద పెట్టాను  . అది కథ అవునో కాదో తెలియదు . నేను కథ అనుకోని రాయలేదు. నా మిత్రుడు తుమ్మల దేవురావు (కవి, రచయిత) చూసి , ఇది బాగుంది ఏదైనా పత్రికకు పంపించమన్నాడు . కథలో పూర్తిగా తెలంగాణా జీవితం , భాష వుంది కాబట్టి నమస్తే తెలంగాణా కు పంపాను . నాకు కథ అంటే ఎలా ఉండాలో తెలియదు. సాహిత్యం చదువలేదు.

 -తెలంగాణ ప్రాంతం నుంచి కొత్త తరం కథకులు చాలా తక్కువ మంది రాస్తున్నారు. ఎందుకని.

కొత్తతరం కథకులు అన్ని ప్రాంతాలలో తక్కువనే వస్తున్నారు . యువతరం కథలు రాయడం తక్కువే . యూత్ ఎక్కువగా కవిత్వం రాస్తున్నారు . కథ రాయాలంటే చాలా సమయం కావాలి . పేజీలు ఎక్కువగా రాయాల్సి వుంటుంది. అనేక పర్యాయాలు చదువుతూ , ఇంకా బాగా రావడం కోసం కథను చెక్కుతూ వుండాలి . కథ రాయాలంటే చాల లోతైన పరిశీలన, జీవిత అనుభవం మొదలైనవి అవసరం .  తెలంగాణా ఉద్యమ సమయంలో చాల మంది పాటల రచయితలూ వెలుగు లోనికి వచ్చారు . నేడు అందరికి  సాంకేతిక పరిజ్ఞానం అందుబాటులోకి వచ్చిన తర్వాత ఎవ్వరకి తీరిక దొరకడం లేదు. డబ్బు సంపాదించడానికి ఇచ్చే సమయం సాహిత్యానికి ఇవ్వడం లేదు . ప్రజల వద్ద సమయం లేదు .

అవేనా ఇంకా ఏమైనా కారణాలు ఉన్నాయంటారా…?

తెలంగాణాలో కథకులు ఎక్కువగా రాకపోవడానికి ముఖ్య కారణం తెలంగాణా జీవితాన్ని తెలంగాణా భాషలో చిత్రిస్తే ప్రచురించడానికి ఏ పత్రిక సిద్ధంగా లేకుండె.  ఇప్పటికీ కొన్ని పత్రికలూ వేసుకోవడం లేదు . అది కొత్త రచయితలను నిరుత్సాహ పర్చింది.  ఏ రచయితైనా తన రచనను అచ్చులో చూసుకుంటే కలిగే అనుభూతి ఇంకా ఉత్సాహంగా రాయడానికి టానిక్ లాగ పనిచేస్తుంది .

తెలంగాణ కథకులు తక్కువగానే వున్నా చాల మంచి కథలు రాసారు, రాస్తున్నారు .

పెద్దింటి అశోక్ కుమార్, కే.వి నరేందర్ , బి.మురళీధర్ , బెజ్జారపు రవీందర్, నలిమెల భాస్కర్ ల రచనలు వివిధ భాషల్లోకి అనువాదమయ్యాయి . విశ్వ విద్యాలయాల్లోపాఠ్యంశాలుగా వున్నాయి .పెద్దింటి అశోక్ గారి కథలు సినిమాలుగా కూడా వస్తున్నాయి .

తెలంగాణా ఏర్పడ్డ తర్వాత  కథ రచయితలూ కొత్త కొత్త ఇతి వృత్తాలతో మంచి కథలు రాస్తున్నారు.

మీకు నచ్చిన కథలు, కథకులు ఎవరు ?

నాకు నచ్చిన కథలు చాలా వున్నాయి . మాయిముంత , చీకటి ,  జుజుమురా…

పెద్దింటి అశోక్ కుమార్, అల్లం రాజయ్య, మధురాంతకం రాజారాం , అల్లం శేషగిరి రావు   మొదలగువారు  చాల ఇష్టమైన కథకులు .

-మీరున్న ఆదిలాబాద్ ప్రాంతం ఒక ప్రత్యేకత కలిగివుంది. తెలుగుతో పాటూ ఉర్దూ , మరాఠీ , గోండి భాషల (గిరిజన ప్రాంతం ) ప్రజలు కలిసిపోయి వుంటారు . మీ ప్రాంతంలో సాహిత్య వాతావరణం ఎలా వుంటుంది ?

ఆదిలాబాదు గిరిజన ప్రాంతమైనప్పటికి ఇప్పటికి  ఉర్దూ ,మరాఠీ , హిందీ పాఠశాలలు వున్నాయి . తెలుగుతో సమానంగానే  ఈ భాషలు కూడా మాట్లాడుతారు . మార్వాడి , గుజరాతి మాట్లాడేవాళ్ళు కూడా వున్నారు . ఉర్దూ , మరాఠీ , హిందీ పత్రికలూ చదివే తెలుగు వారు వున్నారు.

తొలితరం రచయిత  కేంద్ర సాహిత్య అవార్డ్ గ్రహిత  డా.సామల సదాశివ ఉర్దూ , ఫారసీ, మరాఠి  భాషల్లో పండితులు ఆదిలాబాద్ కు చెందిన వారే . తెలుగు సాహిత్యాన్ని ఉర్దూ వారికి , ఉర్దూ సాహిత్యాన్ని తెలుగు వారికి పరిచయం చేసినరు .  మేస్రం మనోహర్  గోండి భాషలో రాస్తున్నారు . వీరు భాషాభివృద్ధికి విశేష కృషి చేస్తున్నారు . వసంత రావు  దేశ్ పాండే “అడవి” నవల గిరిజనుల (గోండు) జీవిత పోరాటాల మీద వచ్చిన మొదటి ఏకైక నవల .

గోపి భాగ్యలక్ష్మి  రాసిన కథ “జంగు బాయి” గోండు స్త్రీల జీవితాలను గురించి రాసిన మంచి కథ .

హిందీ, మరాఠీ లో మధు బావల్కర్ , ఉర్దూ లో ఫాగల్ ఆదిలాబాది , డా .కదీర్ ,రహీమ్ రాహి ఇక్కడి భాషల్లో అద్భుతంగ రాస్తున్నారు .

మీరు ఎలాంటి కథలు రాయడానికి ఆసక్తి చూపుతారు ?

జ: నేను చూసిన, నాకు తెలిసిన పల్లె జీవితాలు చిత్రించడం అంటే చాల ఇష్టం . అవి రానున్న తరాలకు మనం ఎలా జీవించామే తెలిపే రికార్డ్ లాగా వుంటుంది.

మీ నేపథ్యం గురించి చెప్పండి..?

జ: మన్నె శామ్యూల్ , దేవపాలకు మూడవ సంతానం . మాది వ్యవసాయ కుటుంబం . మా తల్లి దండ్రులకు అక్షరజ్ఞానం వుంది.మా అమ్మ నానాలు కథలు చాల ఆసక్తి కరంగా చెప్పేవారు .తెలంగాణా భాష , సామెతలు చాల విరివిగా వాడేవారు . అది నేను కథలు రాయడానికి ఎంతగానో ఉపకరించింది .మా ఇంట్లో చదువుకున్న మొదటి వాణ్ని . ప్రస్తుతం గణిత శాస్త్ర ఉపాద్యాయునిగా పని చేస్తున్నాను.

మన్నె ఏలియా

4 comments

Leave a Reply to MUNINDER RAJU Cancel reply

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

  • మనుషులు,మనస్తత్వాలు వాటి మధ్య భావవేశాలను చాలా చక్కగా విశ్లేషించారు.
    కాలమనే ప్రవాహంలో మనిషి ఎదుర్కునే ఆటుపోట్ల వర్ణన బాగుంది.కథనంలో సాంకేతికతను జోడిస్తూ రాయడం మనసుకు ఆహ్లాదంగా ఉంది.ఏలీయా గారు…మీ నుండి ఇలాంటి మరిన్ని రచనలు రావాలని కోరుతూ మీ మిత్రుడు…….మునిందర్ రాజు

  • అద్భుతమైన కథ…….. జీవితన్నీ నాశనం చేసే విజయం కన్నా….జీవితాన్ని గెలిపించే,ఓటమి గొప్పది…నీతి………. విలువలు చాలా వివరించారు……..చాలా చాలా బాగుంది

  • అందంగా తీర్చి దిద్దిన కథ. చాలా బాగుంది.

‘సారంగ’ కోసం మీ రచన పంపే ముందు ఫార్మాటింగ్ ఎలా ఉండాలో ఈ పేజీ లో చూడండి: Saaranga Formatting Guidelines.

పాఠకుల అభిప్రాయాలు