365 రోజుల సాహిత్య తోరణం..ఇది రికార్డు!

పాత్రికేయ వృత్తిలో ఉన్న కంచర్ల సుబ్బానాయుడు సేవ అనే సాహిత్య సాంస్కృతిక సంస్థ స్థాపించి జూం వేదికగా ఎన్నో కార్యక్రమాలు చేస్తున్నారు. ఏ ఒక్క రోజూ క్రమం తప్పకుండా సంవత్సర కాలంగా ‘అక్షర తోరణం’ నిర్వహిస్తున్నారు. ఈ మహోత్కృష్టమైన కృషి 2024 మార్చి 22 నాటికి 365 రోజులు పూర్తిచేసుకుంది. 

తెలుగు సాహిత్యంలో సుప్రసిద్దులూ, వర్ధమాన కవులూ, రచయతలపై ఈ ప్రసంగాలు చాలా కాలంగా శ్రోతల్ని అలరిస్తున్నాయి. ఈ కార్యక్రమాలు సగటు తెలుగువాడి సాహిత్య సంపద పట్ల కించిత్ గర్వపడే క్షణాల్ని కళ్ళ ముందుకు తెస్తాయంటే అతిశయోక్తి కాదు. శోభకృతు ఉగాది నుండి ఈ  క్రోధి నామ తెలుగు వత్సరం దాకా కొనసాగిస్తూ ఏప్రిల్ 9 నుండి 11 వతేది దాకా మూడురోజుల పాటు స్వదేశీ, ప్రవాసీ తెలుగువారితో 60 గంటపాటు రాత్రింబగళ్లు నిర్విరామంగా (NON STOP)  అక్షరతోరణం సమాపనోత్సవాలు జరుపబోతోన్న సందర్భంగా కంచర్ల సుబ్బానాయుడితో శ్రీరాం పుప్పాల జరిపిన సంభాషణ సారంగ పాఠకుల కోసం –

ప్ర: సంవత్సర కాలంగా ఏకధాటిగా సాహిత్య కార్యక్రమాల నిర్వహణ వల్ల మీరు ఆశించిన ప్రయోజనం నెరవేరిందనుకుంటున్నారా ? మీ టీం వివరాలు చెప్పండి

జ :వెయ్యేళ్ళ తెలుగు సాహిత్యంపై మూల్యాంకనం మొదలు పెడితే 365 రోజుల్లో పూర్తయ్యే పనికాదు.  మా పరిమిత దృష్టితో తెలుగు సాహిత్యంలో అన్ని ప్రక్రియలపై సింహావలోకనం చేసాం. అది చాలా సంతృప్తినిచ్చే విషయం. ఈరోజున తెలుగు సాహిత్యానికి సంబంధించి మాదగ్గరున్న డేటాబేస్ మరెక్కడా లభించే అవకాశమే లేదు. సేవ తెలుగు భాష, సాహితీ, సాంస్కృతిక సేవా సంస్థ  అక్షర తోరణం శీర్షికన ఒక మహా యజ్ఞం లా ఈ కార్యక్రమాన్ని నడిపాము. కొత్త తరానికి అమూల్యమైన భాండాగారాన్ని పొందుపరిచామన్న తృప్తి కలిగింది.

ఈ సంస్థ అధ్యక్షుడిగా నాకు చాలా ఎక్కువ గుర్తింపు వచ్చింది. అయితే ఉపాధ్యక్షులు బోర భారతీదేవి, డా. కొణిదల శోభ కృషి వెల కట్టలేనిది. వయసును కూడా లెక్కచేయకుండా ఆచార్య రాచపాళెం చంద్రశేఖర్ రెడ్డి ఈ సదస్సుల నిర్వహణకు ఎంతో దోహదపడ్డారు. ఇదొక సమిష్టి కృషి.

ప్ర: మీ ఈ ప్రాజక్టులో తెలుగు సాహిత్య ప్రక్రియలన్నింటినీ సింహావలోకనం చేసినట్టుగా భావిస్తున్నారా ?

జ: ఖచ్చితంగా. కవిత్వం, పద్యం, గేయం, కథ, నవల, నాటకం, అన్నింటినీ కలయజుట్టాము. దేన్నీ వదిలింది లేదు. ప్రాచీన సాహిత్యం మొదలు ఉత్తరాధునిక సాహిత్య విమర్శ వరకూ అన్నీ మా కార్యక్రమంలో భాగమయ్యాయి. వ్యాసమూ, స్వీయ చరిత్ర, లేఖా సాహిత్య సదస్సులు చాలా ఆసక్తిగా నడిచాయి.

ప్ర: మీరు సంప్రదించిన అనేక మంది వక్తల వస్తు పరిజ్ఞానం, ఉపన్యాస కళ పట్ల మీ అభిప్రాయం చెప్పండి

జ: అనేక విశ్వ విద్యాలయాల ఉపకులపతులను, పూర్వ ఉపకులపతులను, అనేకమంది ఆచార్యులను,  పి హెచ్ డి చేసిన, చేస్తున్న అనేక మందిని భాగస్వాములను చేసాము. కొత్త వక్తలను తయారు చేసాము.  వృత్తిరీత్యా విభిన్న రంగాలలో  వున్ననూ  సాహిత్యం పట్ల అవగాహన, అనుభవం కలిగిన వాళ్ళతో అనేక మంది రచనలపై సమీక్షలు,  ప్రసంగాలు, పత్ర  సమర్పణలు చేయించాము. అనర్గళంగా సమగ్రంగానే కాక వినూత్నంగా తులనాత్మకంగా విమర్శలు చేసినవారూ వున్నారు.  అఫ్సర్, ఓల్గా, ఎన్ గోపీ, జూకంటి జగన్నాథం రచనల చర్చ చాలా ఉత్సాహంగా జరిగింది.

వక్తల సమయ పాలన తో సతమతమయ్యాం. అయితే కవిత్రయం, అష్ట దిగ్గజాలు, అన్నమయ్య, శివారెడ్డి, జాషువా వంటి దిగ్గజ వ్యక్తిత్వాల చర్చ పరిమిత సమయంలో చేయడం దుస్సాధ్యమైన పని అని మాకు బాగా అర్థమయ్యింది. విశేష అనుభవం గల పెద్దలూ, ఇప్పుడిప్పుడే కళ్ళు తెరుస్తున్న వర్ధమాన విమర్శకులూ, సమీక్షకులూ ఇందులో భాగం అయ్యారు. అందరికీ మేము కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము. వారి సమయమూ, జ్ఞాన సంపదా మా కార్యక్రమానికి వన్నె తెచ్చాయి.

ప్ర: విప్లవ సాహిత్యం, ముస్లిం మైనారిటీ సాహిత్యాల పట్ల మీరు సరైన కాంతి ప్రసరింపజేయక పోవడం పట్ల మీ సమాధానం

జ: కొలకలూరి ఇనాక్, కత్తి పద్మారావు లాంటి  దళిత రచయితల మీద, అలాగే  అఫ్సర్, సలీం, వేంపల్లి షరీఫ్, షహనాజ్ బేగం లాంటి ముస్లిం మైనారిటీ  కవులపై సదస్సులు జరిపాం. గద్దర్ పై కార్యక్రమాలు నిర్వహించాము. శిలాలోలిత, శీలా సుభద్రా దేవి, కల్పనా రెంటాల వంటి స్త్రీవాద రచయిత్రుల్ని వేదికపైకి ఆహ్వానించాము. దిగంబర కవుల్ని ప్రస్తావించాము. ప్రత్యేక శీర్షిక కింద ఏదీ చేయలేదు గానీ విప్లవ కథ కవిత్వ ప్రస్తావనలూ సమావేశాలు కూడా జరిగాయి. అన్ని రకాల అస్తిత్వాలపై మేము సమ దృష్టితో ఈ కార్యక్రమాన్ని నడిపాము.

ప్ర: వర్ధమాన తెలుగు సాహిత్యంలో వస్తున్న కొత్త ముఖాల్ని పరిచయం చేయాల్సినంతగా మీరు చేసినట్టు భావిస్తున్నారా ?

జ: సాహిత్య అకాడెమీ యువ పురస్కారం పొందిన తగుళ్ళ గోపాల్, పల్లిపట్టు నాగరాజు ఇంకా అందరు పురస్కార గ్రహీతల్నీ పరిచయం చేశాము.

ప్ర: మీరు మీ కార్యక్రమంలో కవర్ చేయాలనుకుని చేయలేకపోయిన వాళ్ళెవరన్నా ఉన్నారా ?

జ: కుందుర్తి, కాళోజీ, రారా, తిలక్ వంటి హేమాహేమీలపై సదస్సులు చేయాలి. అనువాద సాహిత్యం పై, గేయం, పాట పై చేయాలి. ఇప్పటికి చేసింది సర్వస్వం అనుకోవడంలేదు. ఇంకా అసంఖ్యాక రచనలమీద కార్యక్రమాలు నిర్వహించాల్సిన అవసరం  వుంది. ప్రధానంగా చెప్పుకోవాలంటే చలం, అల్లం రాజయ్య, వాసిరెడ్డి సీతా దేవి, రావి  శాస్త్రి, శివ సాగర్, చాగంటి సోమయాజులు, దాశరధి కృష్ణమాచార్యులు, రంగా చార్యులు, సురవరం ప్రతాప్ రెడ్డి, సామల సదాశివ, కుసుమ ధర్మన్న, మంగిపూడి వెంకట శర్మ, చిలకమర్తి, ఉన్నవ, పానుగంటి, కట్టమంచి, రాళ్ళపల్లి, పుట్టపర్తి, గడియారం, విద్వాన్ విశ్వం లాంటి వారెందరో మాముందున్నారు. వర్తమాన రచయితలూ వున్నారు. భవిష్యత్తు ప్రణాళికలో ఈ కార్యక్రమాలు రూపుదిద్దుకొంటాయి.

ప్ర: ఈ కార్యక్రమం వల్ల మీరెదుర్కున్న ఇబ్బందులేమన్నా ఉన్నాయా ?  వాటినెలా అధిగమించారు ?

జ: మేము ముందుగా ప్రణాళిక వేసుకున్నట్టు వక్తలు రావడం కుదరనప్పుడు యాతన పడ్డాం. అప్పటికప్పుడు మార్పులు చేర్పులు చేయగలిగినా ఒత్తిడి ఉండేది. ప్రసంగం జరుగుతున్నప్పుడు ఒకరిద్దరు మధ్యలో డిస్టర్బ్ చేసేవారు. అడ్మిన్ బాధ్యత చాలా కష్టతరమైనది. శారీరక, మానసిక, ఆర్ధిక వ్యయప్రయాసలు పడ్డాము. కుటుంబం సహకరించక పోతే ఈ పని మేం చేయగలిగేవాళ్ళం కాదు.

రేవూరు అనంతపద్మనాభరావు, పత్తిపాక మోహన్, కొండ్రెడ్డి వెంకటేశ్వరరెడ్డి, మాడభూషి సంపత్ కుమార్, నాగ రాజ్య లక్ష్మి, జంధ్యాల శరత్ బాబు, బీరం సుందర రావు, ప్రవాసీ కార్యదర్శి సత్యా మల్లుల,  సంధ్యా రెడ్డి , శివరంజని లాంటి వాళ్ళు ఎందరో ఈ కార్యక్రమాల నిర్వహణకు సమన్వయకర్తలుగా వ్యవహరించారు. పద్మశ్రీ కొలకలూరి ఇనాక్, మండలి బుద్ధ ప్రసాద్, తానా తోటకూర ప్రసాద్, వంశీ రామరాజు సహకారాలు మరువలేనివి.

ప్ర: మీ భవిష్యత్ ప్రణాళికలేమిటి ?

జ: సంవత్సర కాలం, 2600  మందికి పైగా  అధ్యక్షులు, అతిధులు, వక్తలు, రచయితలు ప్రధానంగా  ఈ  సదస్సుల్లో పాల్గొన్నారు. జూమ్ అంతర్జాల వేదికలో వేలాది మంది  సాహితీ ప్రియులు పాల్గొన్నారు.   సేవ ఆన్ లైవ్  యూట్యూబ్ ఛానల్   ప్రత్యక్ష ప్రసారంలో  8 లక్షల 5వేల  మంది  వీక్షించగా 28 రోజుల గణాంకాల  ప్రకారం  సగటున 887 మంది చూస్తున్నారు. 4,527 మంది సబ్స్క్రైబ్ చేశారు.

ఈ కార్యక్రమాలన్నీ ప్రస్తుతం యూట్యూబ్లో భద్రపరచబడివున్నాయి. ఈ ప్రసంగాలన్నీ వివిధ రకాల ఫైళ్లలో sevalive.com  మరియు telugue.in వెబ్ సైట్లలో భద్రపరుస్తున్నాము. ఇందులో  ఆ యా సదస్సులకు సంబంధించి అందరి పరిచయాలు, చిత్రాలు, వక్తల ప్రసంగాలు – పత్ర సమర్పణలు పొందుపరుస్తున్నాము. ఇదొక పెద్ద రిపాసిటరీ కానున్నది. ఇపుడు ఉన్నత పాఠశాలల్లో ఇంటరాక్టివ్ ఫ్లాట్ ప్యానెల్‌లు (IFPలు) ఇంటరాక్టివ్ కంటెంట్‌ను ఉపయోగించి,  బైజుస్ టాబ్స్ కూడా విద్యార్థులకు ఇచ్చి ఆధునిక విద్యా బోధనను అందిస్తున్నారు. ఈ నేపథ్యంలో పాఠశాల విద్య  కమీషనర్, ప్రిన్సిపాల్ సెక్రెటరీ దృష్టికి మా కార్యక్రమాన్ని తీసుకెళ్లి  పిల్లలకి తెలుగు సాహిత్య పరిచయం చేయాలని పని చేస్తున్నాం. బాల సాహిత్యంపై అవగాహన కల్పిస్తూ  నిష్ణాతులైన సాహితీ  ప్రముఖులతో  ఆన్  లైన్ శిక్షణా తరగతులను నిర్వహించే ఏర్పాటుకు కృషి చేయాలనుకొంటున్నాము. ఇంకా పాఠశాల, కళాశాల స్థాయిల్లో తెలుగు సాహిత్యంపై శిక్షణా తరగతులను  రాష్ట్ర ప్రభుత్వ సహకారంతో  మొదట జిల్లా స్థాయిలో   ఏర్పాటు  చేయాలనుకొంటున్నాము.

*

శ్రీరామ్ పుప్పాల

ఈ తరం కుర్రాళ్ళలో శ్రీరాం కవిత్వాన్నీ, విమర్శనీ సమానంగా గుండెలకు హత్తుకున్నవాడు. అద్వంద్వం (2018) అనే కవితా సంపుటితో పాటు, బీమాకోరేగావ్ కేసు నేపథ్యంగా 1818 (2022) అనే దీర్ఘ కవితని ప్రచురించాడు. తనదైన సునిశిత దృష్టితో వందేళ్ళ వచన కవితా వికాసాన్ని 'కవితా ఓ కవితా' శీర్షికన అనేక వ్యాసాలుగా రాస్తున్నాడు. ఆ వ్యాస సంకలనం త్వరలో రావలసి ఉంది.

1 comment

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

  • మీరు చేస్తున్న కృషికి అభినందనలు.

    ఇంకా చాలామంది కవులు, కవయిత్రులను మరియు వారి రచనలను వెలికితీయవలసివున్నది.

    ఆ ప్రయత్నంలో మీరు మరింత ముందుకు సాగుతారని భావిస్తున్నాను.

    భవదీయుడు, బుధజన విధేయుడు
    డా. వెల్ముల కృష్ణారావు
    ఇంటిపేర్ల పరిశోధకుడు, నిఘంటుకారుడు మరియు 20+
    విశ్రాంత డిప్యూటీ అసిస్టెంట్ కమీషనరు. (వా.ప)

‘సారంగ’ కోసం మీ రచన పంపే ముందు ఫార్మాటింగ్ ఎలా ఉండాలో ఈ పేజీ లో చూడండి: Saaranga Formatting Guidelines.

పాఠకుల అభిప్రాయాలు