1960లలో ఓ గ్రామం

రాత్రి తొమ్మిదయింది.  భోజనం ముగించుకుని, త్రేన్చుతూ ఓ చుట్ట వెలిగించి, మోతాదు తాతబ్బాయి విసనకర్రతో విసురుతుండగా హరికేన్ లాంతరు వెలుగులో వీధరుగు మీద పడక్కుర్చీలో సుఖంగా ఆసీనుడయ్యాడు కరణం కావరాజు.  అక్కడే రోడ్డు మీద తచ్చాడుతున్నఎలిమెంటరీ స్కూల్ హెడ్ మాస్టర్ “చయనులు” ని గమనించి, ‘వచ్చావుటయ్యా?” అన్నాడు.

‘ఖరణంగారూ, నేనొచ్చి అరగంట పైనే అయిందండీ. మీరు విన్నారోలేదో –  వాళ్ళు “పరాబ్రహ్మ పరమేశ్వర..” ప్రార్థన పద్యాన్ని గోలగా పాడటం కూడా మైకులో లీలగా వినిపించింది.’

‘విన్నాలే. వాళ్ళు పిలిచారనిచెప్పి మనం ఎగబడిపోయి వాళ్ళు చెప్పిన టైముకే వెళ్ళాలా? రా,  ఇలా వొచ్చి  అరుగుమీద కూచో.’

‘బాగా చెప్పేరు. పైగా ఇవతల ఖరణంగారూ, ఇతర పెద్దలెవరూ రాకుండానే నాటకం మొదలెట్టేస్తారా, పొగరు కాకపోతే..?’  కూర్చున్నాడు చయనులు. ఇద్దరూ లోకాభిరామాయణంలో పడ్డారు.

పంచాయతీ ప్రెసిడెంటు యువకిశోరం సూర్యచందర్రావు కొత్త సైకిలెక్కి వచ్చేశాడు.  ఆ వెనకనే జోడెద్దుల బండిలో మునసబు దొరయ్య చేరుకున్నాడు. వాళ్ళేకాకుండా పంచాయతీ బోర్డు మెంబరు సూర్రెడ్డీ, పెత్తందారు పెద్దినీడూ, పెద్దరైతు సూరపరాజూ, మోతుబరి పెదకాపు, కృష్ణమూర్తి యాదవ్, ఇంకా వాళ్ళవెనక కొందరు రైతులూ, కుర్రాళ్లూ నడుచుకుంటూ వచ్చేశారు.

కరణం కావరాజు పడక్కుర్చీలోంచి  బద్ధకంగా లేచి, ఇంట్లోకెళ్ళి పొందూరు ఖద్దరు పంచె, లాల్చీ, కండువా ధరించి నింపాదిగా మెట్లు దిగి మునసబుతో పాటు ఎడ్లబండిలో కూచున్నాడు. మోతాదు తాతబ్బాయిని పిలిచి, ‘సింహద్వారానికి తాళం పెట్టి, నువ్వు ఇక్కడే అరుగుమీద కూర్చోరా’ అన్నాడు. ‘ఫ్యామిలీ  లేరాండి?’ అడిగేడు పెత్తందారు పెద్దినీడు. ‘తణుకులో “శాంతినివాసం” సినిమా చూడ్డానికెళ్ళేరు. వాళ్ళు రావడానికి పదకొండు గంటలవుతుందేమో.’ అన్నాడు కరణం కామరాజు.

ఇంతలోనే ఇంట్లోంచి కరణం అల్లుడైన సుబ్బారావు కూడా బైటికొచ్చేడు.

‘సుబ్బారావుగారూ, ఎప్పుడొచ్చేరు? రాండి. బండ్లో కూసోణ్డి ‘ మునసబు దొరయ్య పిలిచేడు.

‘ఫరవాలేదు. కాస్త నడిస్తేనే మంచిది’ అంటూ మిగిలిన వాళ్ళతో కలిసి బయల్దేరేడు సుబ్బారావు.

‘ఎవరనుకుంటన్నావ్? కరణంగారి అల్లుడుగారు. నాగపూర్ లో లెక్చరరు ‘ అని సూర్యచందర్రావు పెద్దరైతు సూరపరాజుతో అన్నాడు

సైకిళ్లున్నవాళ్ళు ఆ సైకిళ్ళు అక్కడే వదిలేసి చయనులుతోపాటు బండివెనకే నడుస్తున్నారు. పాలేరు ఓ చేత్తో పగ్గాలు, మరో చేత్తో టార్చిలైట్ పట్టుకుని, ఆ వెలుగులో బండిముందు నడుస్తున్నాడు.

బండి ఊరుదాటి పిల్లకాలవగట్టు మీదనుంచి ఆ గతుకుల్లో “పేట” కేసి సాగిపోతోండగా, చీకట్లో దారిపొడుగునా ఏవో డైలాగులు మైకులో అస్పష్టంగా వినబడుతూనే వున్నాయి.

‘ఎక్కడెక్కడి వూళ్లకో కరెంటొచ్చిందని వింటున్నాం. మనూరికెప్పుడొస్తుందో.’ అన్నాడు కరణం కావరాజు.

‘ అయ్యా ఖరణంగారూ. మీరేవైనా చెప్పండి. తగుదునమ్మా అని డొక్కశుద్ధి ఎంతమాత్రం లేని వీళ్ళేవిటి? పౌరాణిక నాటకం వెయ్యడవేఁవిటి? అదికూడా బలిజేపల్లివారి హరిశ్చంద్ర !  దాన్ని చూడ్డానికి తమబోటి పెద్దలంతా నిద్దర్లు చెడగొట్టుకుని ఈ రాత్రివేళ వూరి బయటికి “ఆ” పేటలోకి  బయల్దేరడవేఁవిటి కలికాలం కాకపోతే..’ అన్నాడు చయనులు

‘ ఏంజెయ్యమంటావయ్యా మేస్టారూ? ఆ కిష్టిగాడు నాటకానికి రమ్మని ఒకటే పోరు.’ అన్నాడు పెత్తందారు పెద్దినీడు.

‘నిజవే. నా కాళ్లు ఘాట్టిగా పట్టేసుగుంటాడేమో – వొస్తాననేదాకా వొదిలిపెట్టడేమో అని భయపడి ..  చివరికి ఏం జేస్తాను? ఒప్పుకున్నాను’ అన్నాడు కరణం కావరాజు.

‘ ఇదిగో చైన్లు మేస్టారూ, ఆళ్ళు అంత దైర్యంగా నాటకం ఆడతావంటే అదేంటో సూడాలా వొద్దా?’ అన్నాడు పెద్దరైతు సూరపరాజు.

‘అయ్యా సూరపరాజుగారూ, హిహి. వాళ్ళూ, వాళ్ళ నాటకం. కొంపదీసి అదేదో బావుంటుందనే  అనుకుంటున్నారా ఏవిటి?’

‘చయనులుగారూ, బావుంటుందోలేదో  ముందు మనం చూస్తేకదా తెలిసేది?’ కరణం అల్లుడు సుబ్బారావు.

పిల్లకాలవ అవతలి ఒడ్డున, పేట శివారులో ఓ చిన్నతాటాకుల గుడిసెనుంచి కోరస్ వినిపిస్తోంది. గుడిసె పైకప్పు మీద ఓ సిలువని జాగ్రత్తగా ప్రతిష్టించేరు. ఆ తాటాకు చర్చిలో గుడ్డిదీపం వెలుగులో కొంతమంది మగాళ్ళూ, మరికొంతమంది ఆడవాళ్లూ శ్రావ్యంగా పాడుతున్నారు.

‘ఈ కొత్త డిపో ఎవడు పెట్టాడో?’ అన్నాడు కరణం కావరాజు.

‘సుబ్బన్నగాడండి. ఆడీ మజ్జెన ఏవీతోచక ఏసుకీస్తుల్లో కలిసిపోయేడు….’ అన్నాడు కృష్ణమూర్తి యాదవ్. ‘పొయ్యేకాలం’ అన్నాడు చయనులు.

“..ఐగుప్తు ఆశలనన్నీయు విడచీ రంగూగ యేసును వెంబాడించీ – పాడైన కోరహు పాపంబుమానీ వీధేయులై వీరాజిల్లుడీ …..  సీయోను పాటలు సంతోషమూతో పాడూచు సీయోను వెళ్ళూదమా…”

‘అయ్యా ఖరణంగారూ. వింటున్నారా? వీళ్లూ వీళ్ల పాటా !  ఎక్కడబడితే అక్కడ అక్షరాలకి దీర్ఘాలు తీస్తూ .. ఆ పాటేవిటో – అర్థంపర్థం లేకుండా..’ అన్నాడు చయనులు.

‘దీర్ఘాలు  తియ్యకుండా మనం కీర్తనలు పాడుకుంటామా? ‘ అన్నాడు అల్లుడు సుబ్బారావు.

‘తీరూతెన్నూలేని ఆ పిచ్చిపదాలకి అర్థాలేవిటో …ఐగుప్తట. సీయోనట .. హిహి .’

‘ఐగుప్తు అంటే ఇప్పుడు మనం ఈజిప్ట్ గా పిలుచుకునే దేశం. అలాగే సీయోను అంటే జియన్. ఇప్పుడు మనం ఇజ్రాయెల్  అని పిలుచుకునే ప్రాంతం. బైబిల్ ఓల్డ్ టెస్టమెంట్ లో ఒకచోట ఈజిప్ట్ దేశం గురించి …    ‘

‘ఒద్దు బాబూ వొద్దు. రామాయణ, భారత, భాగవతాలూ, అష్టాదశపురాణాలూ ఈ జీవిత కాలంలో చదువుకోగలిగితే అదే పదివేలు. ఈ చికాకులన్నీమనకెందుకు? ఒద్దు.’

చయనులు మాటలకి అందరూ నవ్వేశారు. ‘ఏదైనా విన్నాడంటే దాని అంతు చూసేదాకా విడిచిపెట్టడు మా అల్లుడుగారు’ అన్నాడు కరణం కావరాజు.

పేట దగ్గరకొచ్చి ఆగింది బండి. బండిలోంచి పెద్దలిద్దరూ నెమ్మదిగా దిగినతర్వాత, అంతాకలిసి తాటిమొద్దులతో కట్టిన వంతెన మీద ఒకరి చెయ్యి మరొకరు పట్టుకుని మెల్లగా నడుచుకుంటూ కాలవ దాటి, పేట చెరువుగట్టున “పేట రామాలయం” ముందున్న స్థలానికి చేరుకున్నారు.

పేట గుడిసెలకేసి నిరసనగా చూస్తూ ‘అసలు ఇలాంటి చోటికి రావాల్సి వస్తుందని నా ఏభయ్యేళ్ళ జీవితంలో ఎప్పుడూ అనుకోలేదు’ అని వాపోయేడు చయనులు.

‘అంటే ఇక్కడే పుట్టి పెరిగిన మీరు ఈ పేటకేసి ఎప్పుడూ రాలేదంటే ఇది కూడా మీ గ్రామంలో ఓ భాగం అని గుర్తించలేదన్నమాట’ అన్నాడు అల్లుడు సుబ్బారావు.

‘నెహురూ గారు ఈళ్ళనేదో ఉద్దరించేత్తానని ఊదరగొడతన్నాడుగా. అదీ సూద్దాం’ అన్నాడు మునసబు దొరయ్య.

అక్కడ స్టేజి ముందు పది చదరపు గజాలు ఖాళీగా విడిచిపెట్టి, పది కుర్చీలు వీళ్ళకోసం వేశారు. వీళ్ళ కుర్చీల వెనక ఓ నలభై చదరపు అడుగుల ఖాళీ స్థలం ఉంచారు. ఆ ఖాళీ స్థలంలో పేట జనం ఎవరూ కూచోకుండా పేట పెద్దలు చూసుకుంటున్నారు. ఖాళీ స్థలం వెనక పేట జనం కిటకిటలాడుతున్నారు. స్టేజి మీద రెండు పెట్రోమాక్సు లైట్లు వెలుగుతున్నాయి.

పెద్దలు ఎనమండుగురూ ఆసీనులైన తర్వాత, ఆ ఖాళీగా ఉన్న కుర్చీలు ఒకదాంట్లో ఎవరో ఐదారేళ్ళ కుర్రాడు అమాయకంగా వచ్చి కూర్చున్నాడు. వెంటనే పేట పెద్ద అర్జునుడు పరుగెత్తుకొచ్చి, వాడిని తిట్టి, ఓ దెబ్బకొట్టి, వెనక్కి ఈడ్చుకుపోయేడు. అర్జునుడు పంచాయితీ మెంబరు కూడా.

తన రాజ్యానికి విశ్వామిత్రుణ్ణి రాజుగా చేసి హరిశ్చంద్రుడు భార్యాబిడ్డలతో అడవిబాట పట్టే “అడవిసీను” అప్పుడే ఆరంభమవుతోంది. అకస్మాత్తుగా వైట్ ప్యాంటూ, వైట్ షర్టూ టకప్ చేసుకున్నపాతికేళ్ల కుర్రాడు చొరవగా స్టేజి ఎక్కి, మైకందుకున్నాడు. అతన్ని చూడగానే స్టేజి మీద ఆర్టిస్టులంతా ప్రశాంతంగా ఫ్రీజ్ అయిపోయారు.

‘మనయొక్క గౌరవనీయులైనటువంటి మనయొక్క కరణం గారైనటువంటి పెద్దలు శ్రీయుత కామరాజుగారూ మరియు మన మునసబు గారైనటువంటి పెద్దలు శ్రీయుత దొరయ్యగారూ, అదేవిధంగా మన ప్రియతమ పంచాయతీ ప్రెసిడెంటు మరియు యువజన నాయకులు శ్రీ సూర్యచంద్రరావు గారూ, అదే విధంగా మన గ్రామ పెద్దలైనటువంటి శ్రీ సూరపరాజుగారూ, పెద్దినీడుగారూ, శ్రీ పెదకాపుగారూ, శ్రీ సూర్రెడ్డి గారూ, శ్రీ కృష్ణమూర్తి యాదవ్ గారూ, ఇంకా అనేక మంది రైతాంగం, యువజనులూ కూడా శ్రమ తీసుకుని, ఈయొక్క మన నాటకం చూసి, మనయొక్క రామభక్త భజన సమాజాన్నీ, అలాగే ఈయొక్క కళాకారులనీ ఆశ్వీరదించడానికి దయచేసి యున్నారు. వారందరినీ సవినయంగా ఆహ్వానిస్తూయున్నాను. వారందరికీ ఆ శ్రీరామచంద్రప్రభువు అనుగ్రహం ఎల్లవేళలా లభించుగాక అని ప్రార్థిస్తూయున్నాను.’

‘రామదాసు కొడుకు రామ్మోహన దాసు..’  అన్నాడు సూర్యచంద్రరావ్.

‘ఖరణంగారూ, స్వాగతం బాగానే అప్పగించేడుగానీ ఆశీర్వదించడానికి బదులు “ఆశ్వీరదించడం” అనేశాడు.. ఐనా  ఫరవా లేదు.’

‘చైన్లూ, నీ మేస్టర్ బుద్ధి పోనిచ్చుకున్నావు కాదు. పాపం కుర్రోడు. షెమించెయ్యవయ్యా’ అన్నాడు మునసబు దొరయ్య. అందరూ నవ్వేరు.

వారితోపాటువచ్చిన రైతులూ, కుర్రాళ్లూ కాస్త ఎడంగా నేలమీద పరిచిన చాపలమీద కూర్చున్నారు.

ఇంతలోనే రామదాసు అల్లంత దూరంనుంచే పెద్దలకి నమస్కారం పెట్టుకుంటూవచ్చి, తగుదూరంలో నిలబడి  ‘అయ్యగారూ, ఇవేళ నిజంగా సుదినం. మా అదృష్టంకొద్దీ తమరందరూ శ్రమ తీసుకుని ఇక్కడివరకూ విచ్చేశారు. అంతా దైవసంకల్పం. సాక్షాత్తూ ఆ శ్రీరామచంద్రులవారే తమర్నితన సన్నిధికి రప్పించుకున్నారు. పెద్దలు దయచేసి ముందుగా ఆ శ్రీరామచంద్రులవారి దర్శనం చేసుకోవలసిందిగా…. .’

‘దర్శనానికేం ఉందిరా రామదాసూ? రాముడెక్కడలేడు? మనగుండెల్లో లేడా? ఓపక్క నాటకం నడుస్తోండగా ఇప్పుడు మాకోసం నాటకాన్నిఆపడం పద్ధతికాదురా.’ అన్నాడు కరణం కావరాజు.

‘తమరు ఎలా చెబితే అలాగేనయ్యగారూ .’ అంటూ స్టేజిమీదున్నకొడుక్కి చేత్తో సైగ చేస్తూ స్టేజి వెనక్కి చేరాడు రామదాసు.

‘అమ్మయ్య. ఇప్పడికైతే మన ఖరణంగారు పెద్దగండవే తప్పించేరు’ అన్నాడు చయనులు  సూర్యచందర్రావు చెవిలో.

‘పెద్దల అనుమతితో ఈ యొక్క సత్యహరిశ్చంద్రీయము అనేటటువంటి పౌరాణిక నాటకం కొనసాగిస్తున్నాం. దయచేసి అందరూ నిశ్శబ్దంగా ఉండాలని ప్రార్థన.’  మైకులో ప్రకటించి స్టేజి విడిచి పెట్టేడు రామ్మోహన్ దాస్.

నటీనటులు ఊపిరి పీల్చుకుని నాటకం ఆరంభించేరు.

“ఘనజఘన భారమున లేత కౌనుగునియ …” పద్యాన్ని హరిశ్చంద్రుడు ఎత్తుకోగానే పెద్దలంతా నాటకంలో లీనమై పోయేరు. సుబ్బారావు చిన్నగా నవ్వుకోవడం చూసి ‘అయ్యా. మీకు ఆ పద్యానికి అర్థం తెలిసినంతమాత్రాన వేరేవిధంగా దృష్టి పెట్టడం బాలేదేమో కాస్త ఆలోచించండి ‘ అన్నాడు చయనులు సుబ్బారావు చెవిలో నెమ్మదిగా. సుబ్బారావు ‘నవ్వొస్తే నవ్వరామరి..’ చిన్నగా అని వూరుకున్నాడు. ఆ పద్యం చివర్లో రాగాలాపన అద్భుతంగా  చేశాడు ఆర్టిస్టు. జనవంతా చప్పట్లతో హోరెత్తించేరు.

‘ఎవరయ్యా ఆ హరిశ్చంద్ర వేషం కట్టింది?’ అని ఆ గానానికి ముగ్ధుడైపోయి, ఆశ్చర్యంగా అడిగేడు కరణం కావరాజు.

‘మన కిట్టిగాడే నండి. మొకానికి కోటా కొట్టుకుని, చమ్కీ లాల్చీ ఒకిటి తగిలించుకుని, నెత్తిమీద ఇత్తడి కిరీటవెట్టుకుంటే అరిచెంద్రుడై పోతాడేంటండి!’ అన్నాడు సూర్రెడ్డి వెనకనించి.

‘ఏవిటి? కిష్ఠిగాడే? నాటకానికి రమ్మని తెగ పోరేడు గానీ తాను వేషం కడుతున్నట్టు చెప్పలేదే. అయినా వాడేవిటి? ఇంత నిర్దుష్టంగా పలకడవేవిటి? ఇంత బాగా పాడ్డవేవిటి? వీడితస్సదియ్యా.’

‘అదే నాకూ ఆశ్చర్యంగా ఉంది ఖరణంగారూ. ఎక్కడా ఒక్క ముక్క తప్పు దొరకలేదు. ‘ అన్నాడు చయనులు విచారంగా.

‘ఈళ్ళందరికీ ఎవరో ప్రబాకర్రావని రెడ్దిసీవనించి ఒకతనొచ్చి నేరిపించేడన్నారు’ అన్నాడు మోతుబరి పెదకాపు.

‘ఆ చంద్రమతి ఎవరేంటి, బాగానే పాడతాంది?’ పెత్తందారు పెద్దినీడు ప్రశ్న.

‘పేరు బవానీ అండి. మంచి ఆర్టిస్టు.’ సూర్రెడ్డి చెప్పేడు.

‘ఆ హార్మోనిస్టు ఎవరయ్యా, అద్భుతంగా వాయిస్తున్నాడు..?’ కరణం కావరాజు ప్రశ్న.

‘అతని పేరు బ్రెమ్మవండి. ఈ చుట్టుపక్కల ఏ నాటకానికయినా అతనే కావాలంటారు.’  నాటకం నడుస్తూనే వుంది.

‘ఆర్మోనిస్టు సంగతెలాగున్నా- ఏమాటకామాటే – ఆ చెంద్రమతి మాత్రం తినేస్తందయ్యా. మనిషి పొంకంగా, నిండుగా బాగుంది.’ అన్నాడు పెత్తందారు.

‘ఊరుకోండి పెత్తందారుగారూ. ఆవిడ ఆర్మోనిస్టు బ్రెమ్మంగారి తాలూకు. గొడవయిపోద్ది మరి.’  సూర్రెడ్డి హెచ్చరిక.

అందరూ నవ్వేరు.

“ఏనాడు నడిచినావీ ఎడారులలోన – సలలితరామసీమలనెగాని..” అంటూ హరిశ్చంద్రుడు మళ్ళీ పద్యం అందుకున్నాడు. అంతే. అందరూ నాటకంలో లీనమైపోయేరు.

పద్యం పూర్తయేసరికి హరిశ్చంద్రుడు చంద్రమతి భుజంమీద మృదువుగా, జాలిగా చెయ్యివేశాడు.

‘ఇంకా సూత్తావేంటెహే? నొక్కేసెయ్’ అని  రైతు కుర్రోళ్లలోంచి ఎవడో అరిచేడు హరిశ్చంద్రుణ్ణి ఉద్దేశించి.

జనం గొల్లుమన్నారు. హరిశ్చంద్ర పాత్రధారి కిష్టయ్య మైకు ముందు నిలబడి చేతులు జోడించి ‘అయ్యా, మూడునెలలపాటు మా కూలిపనులు మేవు చేసుకుంటానే కష్టపడి, ప్రాణంపెట్టి ఈ నాటకం నేర్చుకున్నావయ్యా. మాయందు దయుంచి ఎవరూ గొడవచెయ్యకండి బాబూ. ఈ ఆడబడుచుని మనూరోళ్ళు మర్యాదగా చూసుకున్నారనే పేరు మనకి రావాలండి బాబూ. ముఖ్యంగా యవ్వనస్తులు మాయందు దయుంచండి’ అని ప్రార్థించేడు. అతనితోపాటు భవానీ కూడా చేతులు జోడించి నిలబడింది.

దాంతో పెద్దలంతా చలించిపోయేరు. మునసబు దొరయ్య అగ్గిరావుడైపోయేడు. ‘ఎవడ్రాడు?’ అంటూ కోపంగా లేచేడు?  ‘ఆడు బుల్లెంకమ్మదత్తుడు. గారాలబ్బుగాడు’ అన్నాడు పెదకాపు. ‘ముందా  గారాలబ్బుగాడి మెడపట్టుకు గెంటిపారెయ్యండ్రా’ అన్నాడు మునసబు. అప్పటికే గారాలబ్బు తలొంచుకుని గబగబా అడుగులేసుకుంటూ జారుకున్నాడు.

నాటకం తిరిగి మొదలయింది. మునసబు స్పందనవల్ల  రెట్టించిన ఉత్సాహంతో ఆర్టిస్టులు విజృంభించేరు. నిమిషాల్లోనే జనం నాటకంలో మమేకవైపోయేరు.

హరిశ్చంద్రుడు ‘దేవీ! ఎక్కడి సంపదలెక్కడి సౌఖ్యములు?’ అంటూ “తిరమై సంపదలెల్ల వెంటనొకరీతిన్ సాగిరావు” అని పద్యం అందుకుని, “.. కింకరుడే రాజగు రాజే కింకరుడగు కాలానుకూలంబుగన్..” అని ఆలాపన చెయ్యడంతో పెద్దలు వైరాగ్య భావంతో తల్లడిల్లి పోయేరు.

అడివి సీను ముగిసింది.

ఓ ఐదు నిమిషాల తర్వాత తెర లేచింది. ‘కుర్రాళ్ళు గొడవచెయకండ్రా. వారణాసి సీను బిగినవుతోంది’ అన్నాడు కరణం కావరాజు.  దాంతో అందరూ గప్ చుప్.

“భక్తయోగ పదన్యాసి వారణాసి… ” అంటూ హరిశ్చంద్రుడు పద్యం అందుకున్నాడోలేదో జనం ఒకటే ఈలలు, చప్పట్లు. రామ్మోహనదాసు స్టేజీమీదకెక్కి ఓ మూలనించి జనానికి నమస్కారం పెట్టి, నిశ్శబ్దంగా ఉండమని సైగ చేసి స్టేజి దిగి వెళ్ళిపోయేడు. జనం సైలెంటై పోయేరు.

ఒక నిమిషం తర్వాత హరిశ్చంద్రుడు శ్లోకం అందుకున్నాడు.  ” ప్రభుస్త్వం దీనానాం ఖలు పరమబంధుహః పశుపతే … ”  అంటూ. శ్లోకం వింటూ తన్మయంగా ‘ఆహా..’ అన్నాడు కరణం కావరాజు.

‘కాస్త గట్టిగానే సాధన చేశాడండోయ్’ అన్నాడు చయనులు అయిష్టంగా. మూతిమీద చూపుడువేలు పెట్టుకుని ‘మాట్టాడకు’ అనే అర్థం వచ్చేలా సైగ చేశాడు మునసబు దొరయ్య. దాంతో చయనులు  బుద్ధిమంతుడైపోయేడు .

తర్వాత నక్షత్రకుడు “అలయక గుళ్లు గోపురములన్నియు జూచుచు … ” అని పద్యం అందుకున్నప్పుడు జనంలో కలకలం మొదలయింది. నాటకం ఆగిపోయింది.  ఏంటా అనిచూస్తే ముసలయ్య కోడలు ప్రభావతి ఓ కుర్రోడి కాలరు గట్టిగా పట్టుకుని అరుస్తోంది.  ‘అసలు ఈడెవడూ? ఈణ్ణి నేనెప్పుడైనా సూసేనా? ఈడికేం రోగం? ఇంట్లో మాత్త గారొక్కత్తే ఉందిగదా, సంటి పిల్లోడికి పాలిచ్చొద్దావని నేనెల్తంటే “సీకటిగానే ఉంది, సేలోకి ఎల్దాం ఒచ్చేయ్\” అని నా సెయ్యట్టుకుంటాడా? ఈడి కళ్ళు పీకేయ్యాలా వొద్దా?”అంటుండగానే ఒక మొగగొంతు జనంలోంచి ‘ఈడి మెళ్ళిరగ్గొట్టి దమ్ముజేసిన చేలో తొక్కేసి సంపేత్తాను’ అంటూ వినబడింది. ఆ మాటలంటూ  పరుగెత్తుకెళ్తున్నవ్యక్తి ఆమె భర్త.

‘చూశారా? మెడలు విరగ్గొట్టేస్తాట్ట..’అని చయనులు  అంటుండగానే మునసబు దొరయ్య ఒక్క ఉదుటున లేచి, నడుస్తూ ‘ఆణ్ణి పట్టుకోండ్రా’ అనగానే నలుగురు కుర్రాళ్ళు ఠకీమని లేచి, పరుగెత్తి, ఆ ఆకతాయిని పట్టుకున్నారు. దొరయ్య వాణ్ని ఎడాపెడా నాలుగు పీకి ‘ఒళ్ళు దగ్గిర పెట్టుకోరా లమ్మిడీ కొడకా. పో ‘ అని తెలివిగా మేనేజ్ చేసి పంపించేసి, ‘ఒరే అబ్బాయ్. ఆ యెదవకి బుద్దొచ్చిందిగానీ నువ్వు మీయావిణ్ణి ఇంటికి తీసికెళ్ళరా’ అని ఆ పిల్ల మొగుడితో చెప్పి వెనక్కొచ్చేడు.

‘ఎవడాడు?’ పెద్దరైతు సూరపరాజు ప్రశ్న.

‘మన ఆదెయ్యగాడి మూడో కొడుకు’ అన్నాడు మునసబు దొరయ్య.

‘ఆ ఆడమనిషెవరు?’ మోతుబరి పెదకాపు ప్రశ్న.

‘పిలగంగడి కోడలంట’

కరణం ఆదేశాలతో నాటకం తిరిగి మొదలయింది. ‘ఎవరికీ వాళ్ళే అదరగొడుతున్నారయ్యా. ఆ నక్షత్రకుడు ఎంత బాగా పాడుతున్నాడో చూడవయ్యా చయనులూ’

‘సర్లెండి. ఇది వీళ్ళ ప్రతాపం కాదు. వీళ్ళకి నేర్పిన పెద్దమనిషి గొప్పతనం.’ అంటూనే చయనులు లాల్చీ జేబులోంచి ముక్కుపొడి డబ్బీ తీసి, ఓ గట్టిపట్టు పట్టేడు. టెన్షన్ తట్టుకోలేనప్పుడల్లా ముక్కుపొడిని ఆశ్రయించడం అతని అలవాటు.

చంద్రమతిని అమ్మకానికి పెట్టగా కొనదలిచి, హరిశ్చంద్రుణ్ణి పరీక్షించదలచిన కాలకౌశికుడితో హరిశ్చంద్రుడు పాడిన గీతం “ధరణిలో దొంగతనములో  దొరతనములో – భాగ్యవంతునికేదైన  బాధలేదు..” జనాన్ని బాగా కదిలించింది.

చంద్రమతినీ, లోహితుణ్ణీ అమ్మేసినతర్వాత హరిశ్చంద్రుడు ఆవేదనతో  “దేవీ! భవితవ్యమునెవ్వరెఱుంగుదురు చూడు.” అంటూ పాడిన పద్యం “కలికీ! రెక్కలురాని పిల్లలన్ సాకన్..” తో మొదలుపెట్టి చివర్లో “ఎవ్వారికెవ్వారలో..” అంటూ ముగించడం  విన్నతర్వాత కరణం కావరాజు ఆ రాగానికీ, భావానికీ చాలా ఎమోషనల్ గా ఫీలయ్యాడు. చాలామంది కన్నీరు పెట్టుకున్నారు.

చివరికి కాలకంటకి ఎంట్రీ ఇచ్చిన తర్వాతగాని జనం మూడ్ మారలేదు. మొత్తం నాటకంలో నక్షత్రకుడూ, కాలకంటకి వచ్చినప్పుడల్లా పెద్దలూ, పిన్నలూ కాస్త రిలీఫ్ ఫీలయ్యారు.

పెళ్ళాం గురించి కాలకౌశికుడి స్వగతం “దీని నోటికి వూరి కరణాలు, కాపులు గూడ వెరచుచుందురు” అనగానే మోతుబరి పెదకాపు రియాక్ట్ అయ్యేడు. ‘ఇదేంటండీ కరణం గారూ. మిమ్మల్నీ, మమ్మల్నీకలిపేసి ఎటకారం జేత్తన్నాడు?’ అన్నాడు. ‘ఫరవాలేదయ్యా. ఈ నాటకం రాసినాయన కూడా మావాడే. నాకులేని బాధ నీకెందుకు?’ అని నవ్వేశాడు కరణం.

వీరబాహు హరిశ్చంద్రుణ్ణి  కొనడం, నక్షత్రకుడు పశ్చాత్తాపపడటం జరిగిన తరువాత తెర పడింది. హరిశ్చంద్రుడి దుస్థితికి పెద్దలంతా బాధపడ్డారు. హరిచంద్రుడి ‘కాటిసీను’ మేకప్ కి కొంత టైం కావాలి.

ఈ లోపులో కరణం కావరాజు పిలుపుతో రామ్మోహన్ దాసు ఓ తెల్ల కాగితం తెచ్చేడు. కావరాజు ఆ కాగితం మీద తన పేరూ, తను ‘చదివించదల్చుకున్నకట్నం’ ఎంతో రాశాడు. ఆ కాగితాన్ని మిగతా వాళ్లకి కూడా ఇవ్వగా వారు కూడా తమ తాహతుకి తగినట్టు అంకె వేశారు. చివరగా అల్లుడు సుబ్బారావు దానిమీద నాలుగు ముక్కలు ఏవో రాసి, ఆ కాగితాన్ని రామ్మోహన్ దాసుకిచ్చేడు.

‘అవునుగానీ నాటకంలో  వీరబాహుగురించీ, విశ్వామిత్రుడి కూతుళ్ల గురించీ ప్రసక్తి వచ్చినప్పుడు ..  రచయిత నాటకంలో రాసినప్పటికీ … ఆ కులం ఊసే ఎక్కడా రాలేదు. అదెలా జరిగింది?’ అని అడిగేడు అల్లుడు సుబ్బారావు. ‘మా గురువుగారు ప్రభాకర్రావు గారు చాలా ఆలోచనాపరుడండీ. “ఈ నాటకంలో దమ్ముంది గాని మన బతుకుల్నిచులకన చేసే సందర్భాలు చాలా ఉన్నాయి. అవన్నీ తీసేశాను” అన్నారండి అన్నాడు రామ్మోహన దాసు’

‘ఆయనెవరోగాని చాలా గొప్పవ్యక్తి. కాస్త పరిచయం చేస్తావా?’

‘నాల్రోజులనించీ ఆయనకి  ఒంట్లో బాగుండక భీవడోలు నించి రాలేక పోయేరండి. అంతా మా హార్మోనిస్టు బ్రహ్మం గారే చూసుకున్నారు.’

కాటిసీను మొదలయింది. వాతావరణం చాలా గంభీరంగా మారిపోయింది. ఒక కుండ భుజం మీద పెట్టుకుని హరిశ్చంద్రుడు ప్రవేశించేడు.

‘లోహితుణ్ణి పాము కరిచే సన్నివేశం లేపేశారండోయ్ ‘ అన్నాడు చయనులు .

‘ఆపవయ్యా నీ రంధ్రాన్వేషణ. మొత్తవంతా చూపిస్తే తెల్లారింతర్వాతే ఇంటికెళ్తావ్ తెలుసా?’ అన్నాడు కావరాజు.

“కలవారి ఇండ్లలోపలి నిధానములెత్తనరుగ దొంగలకు సిద్ధాంజనంబు..” అని హరిశ్చంద్రుడు పాడుతోంటే తన్మయంతో వింటున్నాడు కావరాజు.

“కాబోలు బ్రహ్మరాక్షస్సమూహంబిది ఘోషించుచుండె ఋక్కుల క్రమంబు ..”  అందరి దృష్టీ హరిశ్చంద్రుడే. జనం చప్పట్లు.

“మాయామేయ జగంబె నిత్యమని సంభావించి మోహంబునన్ నాయిల్లాలని నాకుమారుడని ..” పూర్తికాగానే పెద్దలూ, పిన్నలూ విపరీతవైన వైరాగ్యభావనకి లోనయేరు.

“ఎన్నోఏండ్లు గతించి పోయినవి కానీ..” అనీ, “ఇచ్చోటనే సత్కవీంద్రుని కలము నిప్పులలో కరిగిపోయే ..” అనీ  జాషువా కవి రాసిన పద్యాలు జనాన్ని కట్టిపారేశాయి.  జనం పదేపదే “వన్సుమోర్” కొట్టేరు. హరిశ్చంద్రుడు మరింత ఉత్సాహంతో మళ్ళీ మళ్ళీ పాడేడు. జనం ఒకటే చప్పట్లు. ఆ పద్యం మొదలుకొని, “ఇట అస్పృశ్యత సంచరించుటకు తావేలేదు… ” వరకూ అన్నీ జాషువా పద్యాలే. జనాన్ని ఉర్రూతలూగించేయి.

‘ఏవిటయ్యా, ఇది? అటు జాషువా కవిని తలుచుకు పొగడాలా? ఇటు మన కిష్టిగాడి పద్యాన్ని పొగడాలా? చాలా ఆశ్చర్యంగా వుందోయ్ ‘ అన్నాడు కరణం కావరాజు.

“ఏది ఏవైనా ఇక్కడ జాషువా పద్యాలు పెట్టడం ఏదో సావెజ్జెప్పినట్టు పిడకలవేటలా లేదూ..?’ అని అడిగేడు చయనులు. ‘లేదు’ అని ఠకీమని జవాబిచ్చేడు అల్లుడు సుబ్బారావు. చయనులు  మళ్ళీ ముక్కుపొడి డబ్బీ తీసేడు.

“చతురంభోధి పరీత భూవలయ రక్షాదక్ష చామీకరాయత దండంబు ధరించునీ కరమే …” విన్న పెద్దలకి హరిశ్చంద్ర మహారాజుమీద విపరీతంగా సానుభూతి ఏర్పడింది. జనం చప్పట్లు మామూలే.

మరికొంత సన్నివేశం నడిచిన తర్వాత “నానాటన్ పరిపాటి నామది దురంతంబైన చింతాహుతిన్ ..”

పద్యం ముగిసిన తర్వాత ‘వీడికిక  తిరుగులేదు. కూలిపని మానేసి  ఏదైనా పేరున్న నాటక సమాజంలో చేరితే అటు పేరుకి పేరూ, ఇటు డబ్బుకి డబ్బూ..’ అన్నాడు కరణం కావరాజు.

చంద్రమతి ప్రవేశించి, “జలదమా సుంత మార్పలికిన దోసమా .. ” అంటూ సీస  పద్యం ఎత్తుకుని హరిశ్చంద్రుడికి తనేమీ తీసిపోనని రుజువు చేసుకుంది. జనం ఒకటే చప్పట్లు. “వన్సుమోర్” అని కేకలు. ఆమె మళ్ళీ అదే స్థాయిలో పాడి జన హృదయాలు పూర్తిగా దోచుకుంది.

‘ఇద్దరూ పోటాపోటీగా ఏం పాడతన్నారయా’ అన్నాడు పెత్తందారు పెద్దినీడు.

“పడతీ! ఎవ్వతెవీవు? రాలుగరుగన్ వాపోవుచున్నావు..? ” అని హరిశ్చంద్రుడు అడిగినదానికి “పురుషవరేణ్య నీవెవడవో ఎరుగన్ ..” అంటూ చంద్రమతి పాడటం, ఆ క్రమంలో హరిశ్చంద్రుడు “ఈయలివేణి నోట వచించెడు ఒక్కొక్క మాట యొక్క వజ్రాయుధమై … .. ఇస్సీ! అనరాదుగాని స్పృహియించును చంద్రమతీ సతీమణిన్ ” అని పాడటంతో జనం ఊపిరి బిగబట్టి చూస్తున్నారు.

‘వీళ్ళలో ఇంత విద్వత్తా? చాలా ఆశ్చర్యంగా ఉందే’ అన్నాడు కరణం కావరాజు.

మొత్తంమీద ఆమె చంద్రమతి అనీ, ఆ చనిపోయింది తన కొడుకేననీ హరిశ్చంద్రుడు తెలుసుకోవడం, అయినా కాటిసుంకం తెమ్మని చంద్రమతిని పంపడం, అంతలోనే రాజభటులు చంద్రమతిని ఒక హంతకురాలిగా తీసుకొచ్చి, ఆమె తల నరకమని రాజాజ్ఞ తెలియజేయడం ఓ ఉద్విగ్నసన్నివేశం.

“హృదయమా! సతికి నా రుణమెల్ల సరిపోయె నీ కేటి యాస ఈ నెలతపైన ..” అంటూ “సత్యమునకై ఈ హరిశ్చంద్రు వంశ మంతరించెడుగాక ..” అంటూ కత్తినెత్తడం, వెంటనే విశ్వామిత్రుడు ఎంట్రీ ఇచ్చి తన కూతుళ్లను పెళ్లాడితే భార్యాపుత్రుల ప్రాణాలే గాక రాజ్యంకూడా దక్కుతుందని ఒత్తిడి చెయ్యడం, హరిశ్చంద్రుడు నిరాకరించడం, విశ్వామిత్రుడు నిస్సహాయుడై శివుణ్ణి ప్రార్థించడం, శివుడూ, పార్వతీ వసిష్ఠుడితోపాటు కలిసి ప్రత్యక్షమై, లోహితుణ్ణి బతికించడం, వసిష్ఠుడు అదంతా దైవమహిమవల్లే జరిగిందని, హరిశ్చంద్రుడి సత్యనిరతిని ప్రశంసించి, తిరిగి రాజ్యం చేపట్టాలని ఆదేశించడంతో స్వస్తి.

నాటకం ముగిసిన నిశ్శబ్ద వాతావరణంలో ‘ఇంతోటి దానికేనా పెళ్ళాన్నీ, పిల్లోణ్ణీ ఇన్ని తిప్పలు పెట్టేడు? సత్తెవంట సత్తెం’ అంటూ పేటజనం లోంచి వెనకనించి ఓ ఆడగొంతు నిరసనగా వినబడింది.

‘ఎవత్తెరా అదీ?’ అని కోపంగా అడిగేడు మునసబు దొరయ్య.

‘యోహాను గాడి కూతురండి. వజ్రావతి’ చెప్పేడు సూర్రెడ్డి.

‘పొగరెక్కి కొట్టుకుంటంది’ అన్నాడు కృష్ణమూర్తి యాదవ్.

జనం లేచి ఒళ్ళు విరుచుకుంటుండగా రామ్మోహన్ దాసు ‘ఒక్క ఐదు నిముషాలు కూర్చోవలసిందిగా ప్రార్థిస్తున్నాను’ అని వారిని కూర్చోబెట్టి, జేబులోంచి కాగితం తీసి చదవసాగేడు.

‘మన ఈనాటి మన ఈయొక్క నాటకంలో పాత్రధారులను అభినందిస్తూ పెద్దలు తాము వాగ్దానము చేసిన కట్నములు ప్రకటించవలసిందిగా నన్నుఆదేశించినారు గాన చదువుచున్నాను. మన గౌరవనీయులు శ్రీ కరణంగారైనటువంటి శ్రీ కామరాజుగారు ఫది రూపాయలు. శ్రీ మునసబు దొరయ్యగారు పది రూపాయలు. అలాగే మన పంచాయతీ ప్రెసిడెంటు శ్రీ సూర్యచంద్రరావు గారూ, శ్రీ పెద్దినీడుగారూ, శ్రీ పెదకాపుగారూ, శ్రీ సూరపరాజు గారూ, శ్రీ సూర్రెడ్డిగారూ, శ్రీ కృష్ణమూర్తి యాదవ్ గారూ ఒక్కొక్కరూ పది రూపాయల చొప్పున వాగ్దానము చేసియున్నారు. అలాగే మన గ్రామ రైతులు పదిహేనుమంది  ఒక్కొక్కరూ ఐదేసి రూపాయలచొప్పున వాగ్దానము చేసియున్నారు. చివరిగా ఇక్కడ ఒక విశేషం చెప్పవలసివుంది. మన కరణంగారి అల్లుడుగారైన శ్రీ సుబ్బారావు, లెక్చరర్ గారు ఈ రోజు మేకప్పు, దుస్తులు, మైకు వగైరాలకు ఐన ఖర్చులన్నీతానే పెట్టుకుంటాననీ, అదే విధంగా చంద్రమతి పాత్రధారిణికీ, హార్మోనిస్టుగారికీ చెరొక పది రూపాయలు ఇస్తున్నట్టు వాగ్దానం చేసియున్నారు. రేపు ఉదయమే పెద్దలందరివద్ద ఈ రొక్కము తీసుకొని ఇచ్చుట నా ప్రథమ కర్తవ్యమని తెలియజేసుకుంటూయున్నాను’

సుబ్బారావు ఇస్తానన్నకట్నాల ప్రసక్తి రావడంతోనే జనం మరీ ఎక్కువ చప్పట్లు.

‘ఇప్పుడు పాత్రధారులను పరిచయం చేస్తాను. ముందుగా హరిశ్చంద్రుడు శ్రీ జాన్ క్రిస్టోఫర్ గారు. హరిశ్చంద్రుడు జనానికి నమస్కారం పెడుతూ స్టేజీమీదికొచ్చేడు.

‘ఏవిటి? కిష్టిగాడే? మతం మార్చుకున్నాడా?’ షాక్ తిన్నాడు కరణం కావరాజు.

‘ఉండండి. ఇంకా శానా ఉందండి’ అన్నాడు కృష్ణమూర్తి యాదవ్.

‘విశ్వామిత్రుడు శ్రీ పరిశుద్ధరావు గారు’

‘పాపయ్య గాడండీ ‘ అన్నాడు సూర్రెడ్డి.

‘నక్షత్రకుడు శ్రీ జోసెఫ్ దైవప్రసాద్ గారు’

‘దేవయ్య గాడండీ ‘ కృష్ణమూర్తి యాదవ్.

ఒక్కొక్కడూ స్టేజి మీదికొచ్చి జనానికి దణ్ణం పెడుతోంటే కరణం కావరాజు మూడ్ క్రమంగా మారిపోతోంది.

‘కాలకౌశికుడు శ్రీ శాంసన్ బాబు గారు’

‘ఈడు సహదేవుడుగాడండి’

‘కాలకంటకి శ్రీ మోసెస్ గారు’

‘ముత్యాలు గాడండీ’

‘వీరబాహు శ్రీ విక్టర్ జీవరత్నం గారు’

‘ఎంకన్నగాడు’

‘లోహితుడు మాస్టర్ శామ్యూల్ పరంజ్యోతి’

‘ఈడు మునియ్యగాడి మనవడండి’

‘చివరిగా చంద్రమతి శ్రీమతి భవానీ గారు’  జనం చప్పట్లు కొడుతూనే ఉన్నారు.

కరణం కావరాజుకి ఊహించని దెబ్బ తగిలింది. “ఇంతమంది మనూరివాళ్ళు చాప కింది నీళ్లలా అన్యమతాన్ని కావిలించుకున్నారా!” అని చెప్పరానంత మధన పడ్డాడు.

కాస్త దూరంలో వినయంగా నిలబడ్డ రామదాసుని చూసి, ‘ఏరా రామదాసూ, ఇదా నీ నిర్వాకం? స్వధర్మాన్నిలెక్క చెయ్యకుండా ఇంతమంది మతం మారితే ఏంచేస్తున్నావు? గాడిదలు కాస్తున్నావా?’ అని అరిచేడు కరణం.  ఆ దెబ్బతో కరణం గారికీ, ఇతర పెద్దలకి ప్రత్యేకంగా దండాలు పెడదామని స్టేజి దిగబోయిన ఆర్టిస్టులు అలాగే ఉండి పోయేరు.

‘అయ్యగారూ. చాలా బాధగా ఉందయ్యగారూ. మన రోజులు కాదండయ్యగారూ. మన మాట వినే పరిస్థితి లేదండయ్యగారూ’

కావరాజు రెండు క్షణాలు నిశ్శబ్దంగా ఉండిపోయేడు. తర్వాత శక్తులుడిగిపోయినట్టై  నిస్సహాయంగా అడుగులు వేశాడు.

‘ఓ వారం రోజులు కూలి పనులకి పిలవకుండా డొక్కలు మాడ్చితే అప్పుడు బుద్దొస్తది.’ అన్నాడు పెదకాపు.

కరణం బృందం జాగ్రత్తగా కాలవ దాటేరు.  పేట పెద్దలు కరణం బృందాన్నికాస్త దూరంనుంచి అనుసరించి వెళ్తున్నారు.

కరణం రియాక్షన్ గాని, రామదాసు సంజాయిషీగాని ఇవతల తెరవెనక మేకప్ మన్ కీ, కాస్ట్యూమ్ సప్లయర్ కీ పేమెంట్ సెటిల్ చేస్తున్న రామ్మోహన్ దాసుకి తెలీవు. ఎవరో అన్నారు: ‘కరణం గారు బైదెళ్ళేరు.’ వెంటనే ‘ఇప్పుడే వస్తా’ అంటూ అక్కడినించి పరిగెత్తుకుంటూవెళ్లి, కాలవదాటి, మునసబు, కరణం బండెక్కిన తర్వాత కరణంతో ‘అయ్యగారూ, మా పేట తరఫున ఓ చిన్న కోరికండీ. తమరు గాని, ఈ పెద్దల్లో ఎవరైనా ఒకరు దయచేసి సతీమణి సమేతంగా ఈసారి శ్రీరామనవమికి మా పేట రామాలయంలో పీటలమీద కూర్చుని సీతారాముల  కళ్యాణం జరిపిస్తే తమకి ఎంతో రుణపడి ఉంటాం అయ్యగారూ. దయుంచండయ్యగారూ ‘ అన్నాడు రామ్మోహన్ దాస్.

బండిదిగి, అతణ్ణి చెప్పుకాలితో గట్టిగా తన్నాలి అనిపించి, మరుక్షణంలో అతి కష్టం మీద సంబాళించుకుని, ‘ఓ పని చెయ్యండ్రా. మాసంగతి తర్వాత చూద్దాంగానీ ఈ సారికి ఆ మాదిగపేటనించి ఎవర్నైనా కూచోబెట్టి కళ్యాణం జరిపించేసెయ్యండి.’ అన్నాడు కరణం కావరాజు ప్రశాంతంగా.

‘అలాగంటారా  అయ్యగారూ’

‘కుర్రతనం అయ్యగారూ. తెలిసీ తెలవని మాటలు’ అని సర్దిచెప్పజూశాడు రామదాసు.

‘మంచిదిరా.’ అని బలంగా నిట్టూర్చి, ‘పోనివ్వరా బండి’ అన్నాడు కరణం. పాలేరు ఎద్దుల్ని అదిలించేడు. బండి కదిలింది.

పేట పెద్దలు నమస్కారం పెట్టి అక్కడే ఆగిపోయేరు.

‘ఏం దెబ్బ కొట్టారండీ ఖరణంగారూ. మాస్టర్ స్ట్రోక్ అంటే ఇదే కాబోలు. ఉప్పు-నిప్పులా ఉండేవాళ్ళని కలిసి చూపించమని తిరుగులేని మెలికే పెట్టేరు..!’ అన్నాడు చయనులు.

‘లేపోతే ఏంటయ్యా? అంతమంది ఏసుకీస్తుల్లో కలిసిపోతే ఆ అబ్బాకొడుకూ ఏంజేస్తన్నారు?’ అన్నాడు పెత్తందారు పెద్దినీడు. పెద్దలంతా ఎవరికి వాళ్ళే తీవ్రమైన ఆగ్రహం వెలిగక్కేరు కొన్ని తిట్లతో కలిపి.

‘వాళ్ళని అనడం సుళువే. కాని వాళ్ళు ఏ పరిస్థితిలో మతం మారుతున్నారో  ఒక్క క్షణం ఆలోచించాలి. తరతరాలుగా మన ఊళ్లలో వాళ్ళున్నపరిస్థితి ఏవిటి? మనలో దాదాపు అందరం ఇన్నేళ్ల తర్వాత మొట్టమొదటిసారి ఆ పేటలోకి అడుగుపెట్టాం. కానీ మనం రోజూ తినే తిండి ఎక్కణ్ణించొస్తుంది? అది రైతులూ, వీళ్లూ పొలాల్లో కష్టపడి పండించిందేకదా?  మరి అంటూ సొంటూ అనేది తిండి ధాన్యాలకుండదా? మరో విషయం. వీళ్లూ, మాదిగలూ ఎప్పటికీ ఐక్యంగా ఉండరు అని మనం ఎందుకనుకోవాలి? ఏమో. ఆ రోజు కూడా వస్తుందేమో’

‘అమ్మో. అదేగనక జరిగితే ఈళ్ళని పట్టుకోగలమా?’ అన్నాడు మునసబు దొరయ్య.

‘అదేవీ జరగదు. ఇదిగో సుబ్బారావ్, నీ మునిమనవడి మనవడి  కాలానిక్కూడా అది జరగదు. కావాలంటే రాసిస్తాను’ అన్నాడు కరణం కావరాజు అల్లుడితో.

‘బాహా చెప్పేరు’ అన్నాడు చయనులు .

సుబ్బారావు చిన్నగా నవ్వుకున్నాడు. చీకట్లో అది ఎవరికీ కనబడలేదు.

*

క్రాంతిమిత్ర

21 comments

Leave a Reply to Krantimitra Cancel reply

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

  • బలే బాగుందండీ కథ… ఉత్కంఠ తో చదివించారు. నాటకం లోకీ దాని నిర్వహణ, ప్రదర్శన, లోకీ, పల్లెల్లోకీ బలే తీసికొని పోయారు.. అభినందనలు..

    • ధన్యవాదాలు రావు గారూ. నా కథని మీకు రికమెండ్ చేసిన ప్రకాశరావు గారికి కూడా ధన్యవాదాలు.

  • ఆనాటి సామాజిక పరిస్థితులు, ఆ ప్రాంత మాడలికంతో పాటు హరిశ్చంద్ర నాటకాన్ని కళ్లకు కట్టినట్లు ‘క్రాంతివంతంగానచూపించిన రచయితకు వందనాలు! – డా. సగిలి సుధారాణి

  • తణుక్కీ, తాడేపల్లిగూడేనికీ సమానదూరంలో ఉండే మా ఊరినీ; కరెంటు లేని ఆ కాలాన్నీ; పగటివేషాలూ, పెట్రోమాక్స్ లైట్ల కాంతిలో జంఘాల కథలూ, హరికథలూ, బుర్ర కథలూ, నాటకాలూ అబ్బురపరిచి, ఊహలకు రెక్కలు తొడిగి, మంత్రనగరులకు ఎగిరేలా చేసిన నా బాల్యాన్నీ.. గుర్తు చేసింది. ఇంతకీ కథలోని ఊరేదో చెపుతారా?

    • ధన్యవాదాలు సూర్యచంద్ర రావు గారూ. కథలో సహజత్వం కోసం రచయితలు తమకి తెలిసిన జీవితాన్నీ, ప్రాంతాన్ని, వాతావరణాన్నీ, మాండలికాన్నీ ఉపయోగించుకుంటారు. అంతే. ఫలాని ఊరంటూ ఏమీలేదు.

  • మిత్రులు ఇదేదో నోస్టాల్జియా స్టోరీ అనుకుంటున్నారేమో కానీ ఇది 1960ల నాటి ప్రగతిశీలకంగా స్తబ్దంగా వున్న వాతావరణాన్ని నగ్న వాస్తవికతతా దృక్పథంతో తేటతెల్లం చేసిన అపరూపమైన కథగా భావిస్తున్నాను. ప్రగతిశీలకంగా స్తబ్దంగా వుండటమంటే ఆర్ధికంగా, సాంఘీకంగా ఆధిపత్యం, దాష్టీకం అప్రతిహతంగా, అతి మామూలుగా కొనసాగిపోవటం. ప్రశ్నించే అవకాశం లేకుండటం స్తబ్దత ముఖ్య లక్షణం. మతం మారినా కళకి, సంస్కృతికీ ఎవరూ దూరం కారనే గొప్ప సత్యాన్ని హృద్యంగా చెప్పారు రచయిత. అప్పటి కాలపు ప్రజల అవగాహనలో వున్న కళల్లో ప్రజా కళలు లేవని, పద్య నాటకాలే అన్ని వర్గాల ప్రజల ఆదరనకి నోచుకునేవని, ఎంత ఉద్వేగ పరిచినా అది సామాజిక స్తబ్దతకి ప్రతీకేనని కథ మొత్తం చదివాక అర్ధం అవుతుంది. శ్రామిక వర్గానికి, సాంఘికంగా అట్టడుగు వర్గానికి చెందిన వారి దృక్పథంలో వారు నమ్ముకొని తరించిన కళ ఎటువంటి మార్పు తీసుకురాలేక పోయింది. అంతేకాదు, ఈ కథలో అనేక అంశాలు దట్టించబడ్డాయి. కులాధిపత్యపు దాష్టీకం, మత మార్పిడుల పట్ల తీవ్ర దాష్టీక కులాల ఆగ్రహం, కింది కులాల్లోని శాఖల మధ్య వైరుధ్యాన్ని అడ్డుపెట్టుకొని వారి మధ్య చిచ్చు పెట్టాలని చూసే కపటత్వం, కింది కులాల వారు చదువుకొని పైకొస్తే తమ ఆధిపత్యానికి ముపు ఏర్పడుతుందేమొనన్న పై కులాల అభద్రతాభావం, పై కులాల్లో కూడా సంస్కరణాభిలాషులైన ఇన్ సైడర్స్, …. ఈ అంశాలనన్నింటినీ రచయిత చాలా కౌశలంగా చిత్రించారు. రచయితగా తన అభిప్రాయాలేమీ చెప్పకుండానే పాత్రల ద్వారా మొత్తం చెప్పించారు. కథ మొత్తం చదివాక నాకు ఈ స్తబ్ద వాతావరణమే కాదూ దిగంబర కవిత్వానికి ఆజ్యం పోసింది అనిపించింది.

    • సవివరంగా మీరు చేసిన విశ్లేషణ రచయితకి ఆక్సీజెన్. ధన్యవాదాలు అరణ్య కృష్ణ గారూ.

  • కురుక్షేత్రం నాటకంలో ఒకటో కృష్ణుడు,రెండోకృష్ణుడు లా రెండో హరిశ్చంద్రుడూ,రెండో చంద్రమతీ వస్తుందనుకున్నా.భలేగుంది.

  • “సుబ్బారావు చిన్నగా నవ్వుకున్నాడు . చీకట్లో అది ఎవ్వరికీ కనపడలేదు ”
    ఇప్పటికీ సుబ్బరావు నవ్వుతూనే వున్నాడు కాకపోతే చాల బహిరంగంగా , అయినా సరే ఆ నవ్వు లో అంతరార్ధం గ్రహించలేకపోతున్నాం. గ్రహించి కూడా ఏమి చెయ్యలేకపోతున్నాం.

‘సారంగ’ కోసం మీ రచన పంపే ముందు ఫార్మాటింగ్ ఎలా ఉండాలో ఈ పేజీ లో చూడండి: Saaranga Formatting Guidelines.

పాఠకుల అభిప్రాయాలు