1
నిన్నటిదాకా అతను కనిపిస్తూనే వున్నాడు. అతని గోడ మరచిపోలేని వర్ణచిత్రం. ఆ గోడ మీద ఎంతమందిని కలిశామో లెక్క తేలదు. అందరినీ కలుపుతూ అక్కడే వొక అందమైన పూలకీ, మొక్కలకీ రెప్పల్ని అద్దిన తోటమాలిలా అతను. ఇప్పుడతను లేడూ అంటే తోట నివ్వెర పోతుంది. పూలు రంగు వెలిసిపోతున్నాయి. మొక్కలు తడి తెలియక విలవిల్లాడుతున్నాయి. ఎవరీ బాలాంత్రపు హేమచంద్ర?!
హేమచంద్ర కవి కాదు. కానీ, కవిత్వం అతని చుట్టూరా పచ్చగా పరచుకునే వుంది.
హేమచంద్ర కథకుడు కాదు. కానీ, ప్రతి కొత్త కథా అతని పలకరింతతో మెరిసింది.
హేమచంద్ర గాయకుడూ కాదు. కానీ, ప్రతి పాటా అతని ఎదుట పరవశించింది.
హేమచంద్ర వాటన్నీటి ప్రేమికుడు. స్నేహితుడు. హితుడు. సహృదయ కవాటాలు ఎన్నటికీ మూసుకుపోని ఆత్మీయుడు.
2
బాలాంత్రపు కుటుంబం అంటే నా కుటుంబమే అని ఇంతకుముందు వొక సారి రాసుకున్నాను. ఆ రజనీ గంధ పరిమళం నా బెజవాడ బతుకు పుస్తకంలో ఎప్పటికీ నిలిచే పరిమళం. నిజానికి “మీరు మా కుటుంబం” అన్న మాట హేమచంద్రదే! మేము మొదటి సారి కలవడం ఆలశ్యమైంది. ఎందుకు ఆ ఆలశ్యం అయిందో అర్థం కాదు ఇప్పటికీ- బహుశా, మనుషులతో అంత కలివిద్గా వుండలేని నా అంతర్ముఖత్వం వల్లనే కావచ్చు. బెజవాడ రోజుల్లో అయితే మరీ-
బెజవాడ లబ్బీపేటలో వేంకటేశ్వర స్వామి ఆలయం వీధి- అంటే, ఆంధ్రజ్యోతి వెనక సందు. ఆ సందు చివర కచ్చితంగా గుడి గోడకి ఆనుకొని నేనూ, రుద్రభట్ల కిషన్ కలిసి పంచుకున్న చిన్న గది. సందు మొదట్లోనే రజని గారిల్లు. అంటే, ఆయన ఇంట్లో పాటో, సంగీత వాయిద్యమో మోగితే, నా గది కూడా చెవులు రిక్కించి వినేంత దగ్గిర-
ఆ వీధిలో నడవడమే గర్వంగా వుండేది అప్పుడు- రెండు కారణాలు: వొకటి: వీధి నిండా స్నేహితులు. రెండు: వీధికి అటూ ఇటూ గొప్ప రచయితల కుటుంబాలు. అప్పుడే అక్షరాలు దిద్దుకుంటున్న వయసులో అంతకంటే ఇంకేం కావాలీ?!
3
రజనిగారితో వ్యక్తిగతంగా వుండే దగ్గిరతనం. నిజానికి అందులో మా గొప్పతనమేమీ లేదు. ఆయనలోని ప్రేమే అదంతా. రెండు రోజులు కనిపించకపోతే, కబురొచ్చేది ఆయన దగ్గిర నుంచి.
ఆ తరవాత వెంకోబుతో పరిచయం వల్ల అది మరింత దగ్గిరగా వచ్చింది. వెంకోబూ మేమూ నిశాచరులం. అప్పుడే నేనూ కాస్త పుచ్చుకోవడం మొదలైన కాలం అది. ఆ పుచ్చుకోవడం వెంకోబు పాటతో యింకో trance లోకి లాక్కు వెళ్ళేది. అప్పటికి హేమచంద్ర బహుశా మా అందరికీ పెద్దన్న లాంటివాడు. నా మటుకు నాకు లోపలేదో కాస్త జంకు వుండేది హేమచంద్ర సన్నిధిలో-
4
నిజానికి నేను బెజవాడకి దూరమయ్యాకే హేమచంద్ర నాకు దగ్గిరయ్యాడు. హైద్రాబాద్ లో వున్నా, అనంతపురంలో వున్నా, చివరికి అమెరికా చేరుకున్నాక కూడా- నాకు రజని గారి క్షేమ సమాచారాలు కావాల్సిందే! వెంకోబు చెప్తాడు. రాస్తాడు. బెజవాడ కబుర్లు గుర్తుచేస్తాడు. అయినా, హేమచంద్ర ద్వారా వినడంలో వొక ఉపశమనం ఏదో!
నిన్నా ఇవాళా హేమచంద్రని తలచుకుంటూ అతని ఈ-లేఖలూ, ఫేస్ బుక్ ఉత్తరాలూ చదువుకుంటూ వుంటే, అవి పైపై రాతలు కావు అని ప్రతి వాక్యం సాక్ష్యం ఇస్తోంది. ఆ లేఖల వెంట జతపరచిన అరుదైన అలనాటి ఛాయాచిత్రాలు వొక్కోటీ చూస్తున్నప్పుడు ఎంత చరిత్ర వాటి వెనక నిక్షిప్తమై వుందో గుర్తుకు తెచ్చుకుంటే ఆశ్చర్యమే!
జనవరి 29 రజని గారి పుట్టిన రోజు- హేమచంద్ర తన పుట్టిన రోజుకి తనకి తానేం చేసుకున్నాడో తెలీదు. కానీ, రజని గారి ప్రతి పుట్టిన రోజూ పండగే! “మీరూ మా తమ్ముడే. మనమంతా కలిసే ఏదైనా చేయాలి!” అని వారం పది రోజుల ముందే నన్ను సిద్ధం చేసేవాడు హేమచంద్ర.
ఈ సందర్భంగా వొక మాట అంటే అది రజనీమిత్రులకు పెద్ద అభ్యంతరమేమీ కాదేమో! నా తరందాకా వచ్చేసరికే రజని జ్నాపకాలూ, గొప్ప కృషీ కొంత తెరమరుగు కావడం మొదలైంది. ఇక తన చరిత్ర తానే చదువుకొని మైమరచిపోతున్న ఈ తరానికి ఆయన తెలిసే/ గుర్తుండే అవకాశమే లేదు. అట్లాంటి స్థితిలో రజనిని ఈ తరం దాకా పునః పరిచయం చేయడంలో సంగీతం విషయంలో వెంకోబూ, వ్యక్తిగత పరిచయాల విషయానికి వస్తే హేమచంద్ర ప్రసూన కలిసి చేసిన ప్రయత్నం అపూర్వం. ఏ తల్లిదండ్రులకూ ఏ సంతానమూ చేయలేని గౌరవం.
ఈ తరం రచయితలనీ, కవులనీ కలుస్తున్నప్పుడు రజని కళ్ళల్లో కనిపించే ఆ మెరుపు వుందే, ఆ వెలుగులో నాకు ఈ ముగ్గురూ నవ్వుతూ కనిపిస్తారు ఎప్పుడూ!
*
చిత్రం: మోషే
అఫ్సర్ మాత్రమే రాయగలిగిన నివాళి దుఖాన్ని బాధను బావుంది. అనలేను బాధానరం ఎక్కడో కదిలింది ఆఫ్సర్
ఏం చెప్పాలి ఈ నివాళి గూర్చి, ఆయన్ను ఇష్టపడ్డంత ప్రేమగా చదివి, వెలితిని ఇంకాస్త పెద్దది చేసుకున్నాక.
మా తరానికి ఆయన లేకపోవడం ఖచ్చితంగా లోటేనని తెలుసు.
తరలిపోవుట సహజమైనను
కాలపుటలకు కాంతులద్దీ
నిలచిపోయే వ్యక్తులుందురు
నిర్మలోజ్వలచరితులై
కేవలం రజని కుమారుడు కావడం ఒకటేకాదు, హేమచంద్ర గొప్పతనానికి కారణం. తండ్రిగారి లలితకళాసంపదకి వారసుడు కాకపోయినా, వాటి పరిరక్షణకి పెద్దకొడుకుగా చేయవలసిన దానికంటే ఎక్కువే చేశాడు. ఆ క్రమంలో ఎన్నో పరిచయాలు. అన్నిటినీ కాపాడుకున్నాడు తన ఆత్మీయతా స్పర్శతో.
నా ఆప్త మిత్రుడికి బావమరిది కావడంవలన కాబోలు ఎంతో మర్యాద చేసేవాడు. ఆమధ్య ఒక సందర్భంలో మేమిద్దరం ఒకే హోటలు రూంలో ఉండవలసి వచ్చింది. అర్థరాత్రివరకు ఎన్నోసంగతులు చెప్పాడు. కనిపించని కవి గాయకులు అతనిలో దాగి ఉన్న విషయం కనుగొన్నాను.
మీరు మాత్రమే రాయగల నివాళి వాక్యాలు మా ముందుంచారు. ధన్యవాదాలు అఫ్సర్ గారూ.
స్నేహచంద్రుడికి మరొకసారి జోహార్లు.
గొప్పనివాళి… రజనిగారి గురించి హేమచంద్రగారి టపాలద్వారా బాగా చదివేవాడిని మీ ద్వారా మరిన్ని విషయాలు తెలిశాయి…హేమచంద్రగారికి నివాళి
అద్భుతంగా అక్షర నివాళి ఇచ్చారు హేమచంద్ర (నాన్ళ)గారికి . నిజంగా హేమ’చంద్రు”నికో నూలుపోగు… ❤️మానవ సంబంధాలు పెనవేసుకోవడమే అసలైన సంపద ❤️💯👌
రజనీ గంధ పరిమళం హేమచంద్ర….గౌరవమైన నివాళి .
Baagundi vyasam baadagaa
అతి తక్కువ సమయంలోనే మనసంతా నిండిపోయిన స్నేహితులు హేమచంద్ర గారు నాకు. వారిని గురించి ఇంకా చదవాలి అనిపించేంత బావుంది ఈ నూలుపోగు