బెజవాడలోని కాళేశ్వరరావు మార్కెట్ చాలా పెద్దది. కూరగాయల బండ్లతో నిండు కల్లం వలె వుంది. రకరకాల ధాన్యపు బస్తాలతో నిండిపోయిన యిల్లు వోలే వుంది.
చుట్టూ అడ్తీ దుకాణాలు. వాటిలో పద్దులు రాసే గుమస్తాలు. హమీలీల మీద కేకలేసే యజమానులు.
బేరమాడుతూ రైతులను తిప్పలు పెడుతున్న దళారులు.
సరుకులను ఎడ్ల బండ్ల మీంచి దించోవాళ్లు, లారీలకు ఎక్కించే వాళ్ల అరుపులతో కేకలతో ఆ ప్రాంతం అంతా గొప్ప హడావుడిగా వుంది.
అలాంటి మార్కెట్ ను సెంద్రెయ్య రెండోసారి చూస్తున్నాడు.
వరంగల్లులోని గ్రేయిన్ మార్కెట్, బీట్ బజారులలో తిరిగిన అనుభవం తనకుంది. అజాంజాహీ మిల్లు తీసేసినంక, ఆ స్థలంలో కొంతభాగం మార్కెట్ కు కేటాయించారు. పెద్ద పెద్ద గోడౌన్లతో వరంగల్లు మార్కెట్ ఎప్పుడూ రద్దీగా వుంటుంది.
బెజవాడలోని కాళేశ్వరరావు మార్కెట్ నిజానికి అంత పెద్దది కాదు.
కానీ చాలా ముఖ్యమైనది. మొత్తం ఆంద్రకే అది గుండెకాయలాంటిది.
బతుకుదెరువు యెతుక్కుంటూ వొచ్చిన వాళ్లను ఆదుకొనే కల్లవల్లి అది.
ఈ మార్కెట్ కు ఒక కిలోమీటర్ దూరంలో బస్ స్టేషను వుంది. ఆ పక్కనే రైల్వేస్టేషన్ వుంది.
మార్కెట్ కు కూతవేటు దూరంలో వెచ్చగా పారే కృష్ణ కాలువా.
మూడు కిలోమీటర్ల దూరంలో బెంజ్ సర్కిల్.
ఎర్రజెండాలతో రెపరెపలాడే వీధులు.
కృష్ణ కావల బుద్ధుడు నిద్రాభంగిమలో వున్న ఉండవల్లి గుట్టలు.
అది దాటితే చారిత్రక మంగళగిరి కొండలు.
నిత్యం ఏదోఒక రైలు కూతతో ఉల్లాసంగా నర్తించే బెజవాడ కోస్తాంధ్ర యాసతో కమ్మటి వాసనేస్త్తుంది.
రంగా హత్య తర్వాత రగిలిన జ్వాలలింకా ఆరిపోయినట్టు లేదు.
ఎన్టీరామారావు సినిమాల నుండి రాజకీయాలలో ప్రవేశించి, అతి తక్కువ సమయంలో ఎన్నికలలో గెలిచి ముఖ్యమంత్రి అయిన తరువాత కమ్మ కులస్తులు అన్ని రంగాల మీద పట్టు సాధిస్తున్న సమయం అది.
ఏదోఒక అలజడి బెజవాడను తాకుతున్న కాలమది.
బెజవాడ రౌడీలు దాదాగిరితో భయభ్రాంతులకు లోను చేస్తున్న వాతావరణం అది.
కరువు సీమల నుండి పని వెతుకుతూ వొచ్చిన వాళ్లు, ఒరిస్సా వలస జీవులూ, తమిళనాడు చిన్నవ్యాపారులు, సినిమా వాళ్ల పటాటోపంతో యవ్వనవతిలా వుంది బెజవాడ.
హమాలీ కార్మిక సంఘం జెండా గద్దె ఎర్ర రంగుతో పొగరుగా ఎగురుతుంది.
లోపలికి ప్రవేశించిన సెంద్రెయ్యకు ఎటు పోవాలో తెలియలేదు.
ఆ జెండా గద్దె పక్కనే వున్న ఒక పెద్ద రాయి మీద కూచుని అటూఇటూ చూస్తున్నాడు.
ఏమయ్యా యిటు రా. బస్తాలు దింపాలె అని సెంద్రెయ్యను పిలిచిండు.
నన్నేనా అనే అనుమానంతో లేచి అతని దగ్గరికి పోయిండు. మొత్తం బస్తాలు దించాలని చెప్పి తన దుకాణంలోకి పోయిండు. మొత్తం ముప్పై బస్తాలు. వాటిని పది నిమిషాల్లో దించి, ఒక గోడలాగా పొందించిండు.
పనిమంతుడని ఆ వ్యాపారికి అర్థమైంది. మరో పని అప్పగించాడు. చకచకా చేసేసిండు.
రాత్రి పది గంటల వరకు పని చేస్తూనే వున్నాడు. ఆకలిగా వుంది. వ్యాపారి ముందు నిలవడి ఏమీ మాట్లాడలేదు. అతనికి అర్థం అయ్యింది. యాభై రూపాయలు తీసి ఇచ్చిండు. లెక్కపెట్టకుండానే వాటిని చేతిలో పెట్టుకొని వెళ్లిపోయిండు. ఆ పక్కనే వున్న ఒక హోటల్లో మంచి భోజనం చేసిండు. యింటి దగ్గర ఎప్పుడూ జొన్నబువ్వ తినడమే అలవాటు తనకు. ఇక్కడ అంతా వరి బియ్యం తింటున్నారు. నాలుగు రకాల కూరలు, నాలుగు రకాల పచ్చళ్లు, పొడులు అరటాకులో పెట్టారు. అవి చూసి ఆశ్చర్య పోయిండు. ఇన్ని రకాలు తింటారా అని ఆశ్చర్య పోయాడు. ఆ బువ్వ చాలా రుచిగా తియ్యగా వుంది. రాగి సంకటి వుందా అని అడగాలని అనుకున్బాడు. కానీ నాలుగు ముద్దలకే కడుపు నిండినట్టు బిర్రుగా అయ్యింది. తినలేకపోయిండు. షేరు గడ్క ఒక్కడే తినే వాడు సెంద్రెయ్య. ఈ బువ్వలో ఏదో కలిపిండ్లు అని అర్థం చేసుకుని, యిక అక్కడ మల్లోసారి తినకూడదని అనుకున్నాడు. ఆ రాత్రి కృష్ణా నది ఒడ్డున వున్న ఒక పార్కులో పడుకున్నాడు.
ఒక గడియ కునుకు తీసాడో లేదో ఎవరో తనను తాకినట్టు అనిపించింది. కళ్లు తెరిచి చూసిండు. ఎదురుగా మసక చీకటిలో ముగ్గురు నిలబడి వున్నారు. నీ దగ్గరున్న డబ్బులు తియ్యి అని గద్దించాడొకడు. ఆ మాటతో వాళ్లు దొంగలని సెంద్రెయ్యకు అర్థమైంది. దొంగలతో ఎలా యవ్వారం నడుపాలో తెలుసు సెంద్రెయ్యకు. కానీ దొంగలకు సెంద్రెయ్య గురించి తెలియదు కదా. అందుకే వాళ్లూహించే లోపే దెబ్బలు తాళలేక పార్కు వొదిలి పారిపోయారు. ఆ తెల్లారి చిట్టి నగర్ లో ఒక సందులో చిన్న యిల్లు కిరాయికి తీసుకున్నాడు. చిట్టి నగర్ లో బతకడానికి వొచ్చి స్థిరపడిన మాల, మాదిగలు వుంటారు. సెంద్రెయ్యకు కిరాయికి ఒక సిన్న యిల్లయితే దొరికింది. అందులో కుండబెట్టి ఒండేది లేదు. ఎప్పుడు తింటాడో ఎప్పుడు పంటాడో తెలువక ఆ సందులోని వాళ్లు ఆశ్చర్య పోతరు.
కాలేశ్వర్రావు మార్కెట్ హమాలీలు సెంద్రెయ్యకు మాంచి దోస్తులయ్యిండ్లు. అడ్తీ దుకాణదారుల మోసాలు కూడా నెమ్మదిగా అర్థం అవుతున్నాయి. చేసిన పనికి తక్కువ డబ్బులు ఇస్తున్నారు. రైతులను తూకంలో మోసం చేస్తున్నారు. అమ్ముకొనే రైతుకు లాభం లేదు. హమాలీకి మిగిలింది లేదు. ఇవ్వాళ తినడానికి, రేపు పని చేయడానికి తప్పా హమాలీ దాచుకున్నదేమీ లేదని ఆర్నెళ్లలో సెంద్రెయ్యకు అర్థం అయ్యింది. హమాలీలకు కూలీ రేటు పెంచితే కొద్దోగొప్పో మేలు జరుగుతుంది. నిజానికి హమాలీలు ఒక్కరోజు సమ్మే చేస్తే చాలు, వ్యాపారులు లక్షల రూపాయలు నష్ట పోతారు. పొగకు వూపిరాడక కలుగుల్లోంచి బయటికొచ్చే ఎలుకల్లా సమ్మే దెబ్బకు వ్యాపారులు దిగొస్తారని సెంద్రెయ్యకు అనిపించింది.
హమాలీ కార్మికుల తో కామ్రేడ్ మోహన్ రావు మార్కెట్ కు ఓ రోజు వొచ్చిండు. హమాలీలు ఆయనకు చాలా గౌరవం ఇస్తున్నారు. వాళ్లు అప్పుడప్పుడు ఆయన్ని చౌదరిగారూ అని పిలుస్తున్నారు. చాలా మర్యాదగా, ఎలాంటి దర్పము చూపకుండా ఒక మామలు వ్యక్తిలా చాలా కలుపుగోలుగా ఆయన మాట్లాడుతున్నాడు.
సెంద్రెయ్యను ఆ మార్కెట్ నాయకుడు నాగేశ్వరరావు పరిచయం చేసిండు. చేతులెత్తి నమస్కారం చేసిండు సెంద్రెయ్య. ఏవూరని అడిగిండు ఆయన.
వరంగల్లు జిల్లా పాలకుర్తి పక్క వూరు అని చెప్పిండు.
నిజమా అని ఆయన సంతోషించిండు. ‘పాలకుర్తి చిట్యాల అయిలమ్మ వూరు. మహాతల్లి. తెలంగాణ సాయుధ పోరుకు ఆమే మూలం. విస్నూరు దేశ్ ముఖ్ ఆగడాలను నువ్వు చిన్నప్పుడు చూసి వుంటావు. ఆ పక్కనే ధర్మపురంలో ఠానూ నాయక్ సోదరుల వీరోచిత త్యాగాలు. దొడ్డి కొమురయ్య బలిదానం. సూర్యపేట, దేవరుప్పుల, కడవెండి,సీతారాంపురం ఎంత గొప్ప ప్రాంతం అది. ఎసిరెడ్డి, నల్లా నర్సింహులు గొప్ప నాయకులు’ అని అందరి వైపూ చూసిండు.
ఈ సెంద్రెయ్య అందుకేనా వాడిగా వేడిగా వుంటాడు. ఒక్క మాటకూడా పడడు. అన్యాయం అనిపిస్తే చాలు కొట్లాడుతాడు అని నాగేశ్వరరావు అన్నాడు.
ఆ గడ్డ గుణం అది. సెంద్రెయ్యను నాయకుణ్ణి చేద్దాం అన్నాడు మోహన్ రావు.
నేను ఏదో కొన్ని నాళ్లు ఈడ పనిచేద్దాం అని వొచ్చిన. మల్లా నేను మా వూరు పోత. నన్ను వొదిలండ్లి అని సున్నితంగా నిరాకరించాడు సెంద్రెయ్య.
అట్లా అన్నాడే గానీ ఆ తర్వాత కూలీ రెట్లు పెంచాలని జరిగిన పోరాటంలో అందరికన్నా ముందుండి కొట్లాడిండు. నీకెంత కావాలో చెప్పు ఇస్తాం. కానీ సమ్మేలో పాల్గొనొద్దని డబ్బు ఆశపెట్టిండ్లు. నలుగురి కోసమే నా కొట్లాట గాని నాకే ఆశ లేదని వ్యాపారులకు మెత్తగా చెప్పిండు.
ఒకదశలో పోలీసులు కేసులు పెడుతామని బెదిరించిండ్లు. మీకు నచ్చింది చేసుకొమ్మని సెంద్రెయ్య గట్టిగా నిలబడ్డడు. నాలుగోనాడు వ్యాపారులు దిగొచ్చిండ్లు. బస్తాకు ఒక రూపాయి అదనంగా పెరిగింది. హమాలీలు గెలిచామని సంతోషించారు. ఆ సాయంత్రం జరిగిన సభలో మోహన్ రావు కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలను, పెట్టుబడిదారీ వ్యవస్థ ఎందుర్కొంటున్న సంక్షోభాన్ని గొప్పగా తన ఉపన్యాసంలో చెప్పిండు. సెంద్రెయ్య వాటిని అర్థం చేసుకోవాలని ప్రయత్నం చేసిండు. మోహన్ రావు మాటల్లోని చాలా వాటికి తనకు అర్థమే తెల్వదు. ఆ మాటలు అర్థం అయితే గానీ వీల్లనుకొనే సమాజం ఏర్పడదని అనుకున్నాడు.
మల్లేశు తనకు మంచి దోస్తయిండు. తనీడువోడే. భార్యా, ఇద్దరు పిల్లలతో కోదాడ నుంచి బతుకుదెరువు యెతుకుతా బెజవాడ చేరిండు. మార్కెట్ లో హమాలీ అయ్యిండు. మంచివాడు. ఒళ్లు దాసుకోకుండా కట్టం చేస్తడు. సెంద్రెయ్యలోని తెగింపు గుణం తనకు బాగా నచ్చింది.
ఇట్లా తెగిస్తే ఎట్టనే సెంద్రెన్న అన్నడు ఒకనాడు. సావుకు సత్యేనికి భయపడొద్దు మల్లేశు అన్నడు సెంద్రెయ్య.
మధ్యాహ్నం తింటానికి తెచ్చుకొనే సద్దిని తినమని సెంద్రెయ్యకి ఇచ్చేవాడు. వొద్దువొద్దు అని మొహమాట పడితే నీకూనాకూ మోమాటమేందే అనేటోడు.
అంత మంచి మనిషి ఒక్కసారిగా కాలిరిగిన కుందేలయ్యిండు.
లోడు దించుతా కిందపడ్డడు. మీద బస్తా వుంది కదా. యెన్నుపూసలో కలుక్కుమంది. నొప్పికి విలవిల్లాడిపోయిండు.
సెంద్రెయ్య మల్లేశును సర్కారు ఆసుపత్రిలో చేర్పిచ్చిండు.
నెలరోజులు బరువులెత్తొద్దని డాక్టర్ చెప్పిండు. ఆ మాటకు మల్లేశు కన్నీళ్ళు పెట్టుకున్నడు. దినాం బస్తాలెత్తితే తప్పా పెళ్లాం పిల్లలకు కంచంలో మెతుకు వుండదు. మల్లేశుకు అంతా సిమ్మసీకటిలా అనిస్తంది.
సెంద్రెయ్యకు పరిస్థితి తెలుసు. భయమొద్దు. నెల రోజులు ఓపికపట్టు అన్నడు.
నెల రోజులు అన్న డాక్టర్ మరో రెండు నెలలు ఏ పనీ చేయొద్దన్నడు. ఆ మూడు నెలలు మల్లేశు బాగోగులు తనే చూసుకున్నడు.
తను సంపాయించిన డబ్బులు ఆ కుటుంబానికే యిచ్చిండు. రోజూ ఏదోఒక సమయంలో మల్లేశును తప్పకుండా కలిసేటోడు. యింత తినమని అతని భార్య అడిగేది. ఇప్పుడే తినొస్తన్న అనేటోడు. మందులను మాత్రమే నమ్ముకోవద్దు తమ్మీ. రోజు యింత బొక్కలచారు తాగు. ఎద్దు బొక్కలైతే సానా మంచిది. ఒళ్లుకు సాధన అవుసరం. నడుము బలంగా వుంటేనే ఏదన్నా సేయగలం. నీకు కొన్ని ఇకమతులు సెప్తా. అవి రోజూ తెల్లారక ముందే సెయ్యాలే. నువ్వుల నూనెతోటి ఒళ్లంతా తీడాలే అని మల్లేశు భార్యకు సెప్పిండు. సెంద్రెయ్య చెప్పినవి చేసే సరికి మరో పదిహేను రోజులకు మామూలు స్థితికి వొచ్చిండు మల్లేశు.
రంగారావు చౌదరి అడ్తివ్యాపారి. అతనికాన్నే సెంద్రెయ్య, మల్లేశు, ఇంకో పదిమంది పని చేస్తండ్లు. మల్లేశు కిందపడి యాతన పడుతంటే ఈ చౌదరి పట్టించుకోలేదు. ఒక్క రూపాయీ సాయం చెయ్యలేదు. హమాలీ సంఘం నాయకులతో ఆ సంగతి చర్చించిండు. అంతా కలిసి చౌదరిని సాయం చెయ్యాలని అడిగిండ్లు. తను పాపం అన్నాడు. ఏదోఒకటి చేద్దాంలే అన్నడు. కానీ ఏమీ చెయ్యలే. ఒకటి రెండు సార్లు సెంద్రెయ్య అడిగిండు. వాడి పేరు చెప్పి నువ్వు రాజకీయం చెయ్యమాకు అని చౌదరి కసిరిండు. నువ్వు ఎక్కువ మాట్లాడితే పనిలోంచి తీసేస్తా అని బెదిరించిండు. కార్మిక నాయకుడు మోహనరావు నీకు పెద్దగావొచ్చు. వాడు మా బంధువే. నా మాట కాదనడు తను అన్నాడు చౌదరి.
చౌదరి, మోహనరావు ఇద్దరూ బంధువులని అప్పుడే తెలిసింది సెంద్రెయ్యకు. హమాలీలను ఎదురు తిరక్కుండా చూడ్డానికే మోహనరావు వున్నాడని అర్థం అయ్యింది. అడ్తి వ్యాపారులతో గానీ పెద్ద పెద్ద వ్యాపారులతోగానీ మోహనరావు తగాదాపడ్టది లేదు. హమాలీలను సముదాయించే పనే తప్పా వాళ్లలో పోరాట పటిమను పెంచింది లేదు. సెంద్రెయ్యకు చానారోజుల నుంచి వున్న అనుమానం అప్పుడు బలపడ్డది.
మల్లేశు పనికి వొచ్చిండు.
తమ్మీ నువ్వేమీ వీపు మీన మొయ్యకు. నీ పని నేనే చేస్త. నువ్వట్లా పని చేస్తున్నట్టు వుండు అన్నడు సెంద్రెయ్య.
సగం లారీ లోడు చేసిండు.
రంగారావు చౌదరికి గుస్సుగా వుంది. మల్లేశు పని చేయట్లేదని గమనించిండు.
నువ్వు యజమానివారా? బస్తాలు మొయ్యవా? ఊర్కే డబ్బులు దొబ్బితిందామనుకుంటన్నావా? అందరూ నా సొమ్ముదినే నాయాళ్లే అని తిట్లు లంకించుకున్నాడు.
సెంద్రెయ్యకు కడుపు రగిలిపోతుంది.
లారీలో బస్తా దించిండు. చౌదరిగారూ. ఇక్కడ లెక్క సరిగా తెలుస్తలేదు. ఓసారి లారీలోకి ఎక్కండి అని పిలిచిండు.
ఏ పని సరిగా చేసి సావరు అని తిట్టుకుంటూ లారీ ఎక్కిండు.
కాలికి ఏది అడ్డం తాకిందో తెలువదు. కిందపడి పోయిండు.
చౌదరిగారి మీద ఆలుగడ్డ బస్తాలు దబీమని పడ్డాయి. ఆలుగడ్డలు చాలా బరువు. పైగా గట్టివి. చౌదరి వెన్నుపూసకు బాగా దెబ్బలు తాకినయి. నోటి వెంట మాట రావట్లే. అరరె బస్తాలు చౌదరిగారి మీద పడ్డయి. తొందరగా రాండి అని సెంద్రెయ్యే అందరినీ పిలిచిండు. వాళ్లొచ్చి ఆ బస్తాలు తీసేసి చౌదరిగారిని లారీ దించిండ్లు.
ఎటూ కదల్లేక మూల్గుతున్న శునకం మాదిరిగా వున్నాడు రంగారావు చౌదరి. సర్కారు ఆసుపత్రిలో చేర్పించిండ్లు. ఆర్నెళ్లు ఎటూ కదలొద్దని డాక్టర్ చెప్పిండు.
కావాలనే సెంద్రెయ్య నడుములిరిగేలా బస్తాలు మోదేసిండని చౌదరికి అనిపించింది. కానీ అది తను నిరూపించలేడు. తన పెద్ద కొడుకు సురేష్ చౌదరికి మార్కెట్ పని అప్పగించిండు. తను యింట్లనే వుంటండు.
చౌదరి తన కొడుకుకు ఏమి చెప్పిండో తెలివదుగానీ మల్లేశుకు రెండు వేల రూపాయలు ఇచ్చిండు.
అవి దోసిళ్లలో పట్టుకొని సెంద్రెయ్యకు చూపెట్టిండు. నీకెన్ని కావాలో తీసుకో అన్నాడు మల్లేశు.
సెంద్రెయ్యకు పైసలతోటి పనిలేదు. మనిషికి సాయం సెయ్యాలే. నువ్వు సల్లగ బతికితే నాకదే సాలు అన్నడు సెంద్రెయ్య.
సెంద్రెయ్య గుణం ముందు బెజవాడ గుట్టలు చానా చిన్నవైపోయినట్టు మల్లేశుకు కనిపించింది.
*
Thanks a lot Afsar sir.
మనుషుల సైకాలజీని భలే పట్టుకున్నారు శ్రీనివాస్ గారూ
ఇలాంటి చంద్రయ్యల అవసరం చాలా ఉంది ఈరోజున
Thank you very much.
సెంద్రయ్య కథలు బాగా రాస్తున్నవ్ జిలుకరా! సహజంగా జీవంతో ఉంటున్నయ్.. ఈ కథలో విజయవాడను, అక్కడి మార్కెట్ ను, హమాలీల వాతావరణం బాగా వచ్చింది.. ముబారక్🌿
Thank you sky.
పోరాడితే పోయేదేమీ లేదు..అన్న వాస్తవాన్ని గ్రహించిన మనిషి సెంద్రయ్య. బైండ్ల సెంద్రయ్య ఊళ్లే ఉన్నా…దొరలని వణికిస్తడు. విజయవాడ పోయినా, ఏ ఊరు పోయినా…దోపిడాదారులను వణికిస్తడు. ఇలాంటి బైండ్ల సెంద్రయ్యలే ఇప్పుడు మనకు స్ఫూర్తి. మంచి కథలు రాస్తున్నారు సార్. అభినందనలు
thank you very much Chandu.