:మంచు పూల మాయ:
3 కాళ్ళు;
పలిత కేశాల ముసలి రేయి.
హిమ విభావరి;
కీచురాయి, కొక్కిరాయి, పావురాయి
అంత్యాక్షరి.
వెండిగిన్నె లో గోరుముద్ద,
మంచు కురిసిన వెన్నల రాత్రి,
కాలుజారిన మర్రి నీడల జాబిల్లి తల్లి;
ప్రపంచం పాలవెల్లి.
ఊడల నీడలలో కథల జోల,
ముసలమ్మ మూడో కాలు నేల రాలింది;
వెన్నెలే వెన్నెల!
మంచు దూది,
నెత్తిన ఎర్రెర్రని ఎవరెస్ట్ శిఖరం,
హిమ ధూలి క్రిస్మస్ తాత గడ్డం,
జారుతున్న స్లెడ్జ్ బండి పోలార్ మంచుగడ్డ,
రెయిన్ డీర్ కొనకొమ్మున శిశిరశుష్క చలిజ్వాల.
అమెరికన్ శరద్రాత్రి, శ్వేతవర్ణ ధాత్రి,
తుహిన తుషారం ఘనీభవించిన నిర్నిద్రరాత్రి
మంచుపూల మైదానం.
హిమనీ అందాల అవలోకనా చాపల్యంలో
సీగల్ రెక్కలను తొడుక్కొంది వలస పక్షి.
ఎగిసి పడుతున్న సితాంశు ఎద సింధువు మీద
అలలుఅలలుగా వజవజ వణకుతున్న
తెలిమబ్బు మీగడ తరక;
మంచు తునకల డిసెంబర్ మానస మాసం
తెలతెల్లని ఆనంద గంధం.
పాల వెన్నెల మరీ ఇంత తెల్లగా చల్లగా వుందేం!
ఉప్పుఱాయి పడేను జాగ్రత్త.
ఆకులు రాల్చిన ఆకు పచ్చని ఆకుతేలు
కుట్టేందుకు వస్తున్నది
విసిరేయి నిన్నటి ఫాల్ పూల ఆకురాయిని.
తెల్లవారని ఈ సిత కాంతుల శీతరేకుల నిశీథం,
ఇగము కమ్మిన ఈ హిమ సమూహ సమ్మోహనం
ఓ నియో సర్రియలిజం!
సంద్రమైన స్రవంతీ చైతన్యం మీద తేలాడే
(అధి)వాస్తవిక అలాస్కన్ ఐస్ బర్గ్!
*
ఇగము కమ్మిన ఈ హిమ సమూహ సమ్మోహనం
థాంక్స్