ఒకటే కల
జీవితం నిండా
ముగించని, మాయం చేయలేని
పుట్టుకతో
ప్రసారానికి అంతూ పొంతూ
వుండదు
ఊరింపుల వూరేగింపుల బొమ్మ
అదే పదే పదే
ఏక నామమై, ఒకే నినాదమై,
రద్దు మత్తు జల్లి, సంపూర్ణ దేశభక్తితో
వాయు వేగాల విహారానందం
ఊహ పూసినా, నువ్వు విరబూసినా
జి.ఎస్.టి పెనంపై చేప లెక్కనే
నీ పూజా సామాగ్రి సిద్దపరచబడ్డది
నీ ఇష్టా రాజ్యాలు సెన్సార్ చేయబడ్డవి
శాసనాలైనా ఆసనాలైనా
శిరోధార్యాలే
ఆకాశమందుకునే ఉక్కు విగ్రహం
ముందు
బల్వాన్ పహిల్వాన్ అన్న చరిత్రకే మొక్కాలి
కంటి మాగ్నేట్ కి చిక్కే దేశాలేవో
చూపుకి టార్గెట్ అయ్యే దేశాలేవో
అయోధ్యారాముడు రాసిపెడ్తడు
కుటుంబం లేదు
‘హిందూత్వ’మే కుటుంబం
మనసులోని మాటలన్నీ
నామావళిగా జపించాలి
గంగాజల ప్రోక్షణతో పాపాలన్నీ
ప్రక్షాళనే
త్రికాల నామస్మరణకు మూడు
నామాల
మంత్రోపదేశమే శరణ్యం
ఇన్ని రంగులెందుకు
ఇసీ, ఈ రుచులేమిటి
స్వచ్చ భారత్ లో ఇంత స్వేచ్చ యేల
ఏక్ రంగ్ కి జెండా ఊంచా రహేగా
సదా
హమ్ సబ్ ఏక్ దేశ్ హై
హమేశా ఏక్ హి నేతా
తిరగ రాసిన అక్షరం చెర లోనికే
అత్తరొంపే నెలవంక సరిహద్దు సమాధి
లోనికే
ఎన్ని కలలు కన్నా రద్దు పద్దు లోనికే
ఒకటే ఒకటే కల కను
నిద్ర పట్టని రోజున
ఒకే ఒకే పీడకల కను
*
Add comment