మీరంతా ఎట్లా బతుకు తున్నారో
నాక్కూడా ఆ విద్యను బోధించండి !
ఇంత దర్జాగా, ఎట్లా గడుపు తున్నారో
ఆ మంత్రం నాక్కూడా నేర్పించండి !
ఎవరి దగ్గర చేరినా, పక్కకు జరుగు తున్నారు
ప్రేమించే వాళ్ళు, ఎక్కడ దొరుకుతారో
అక్కడి చిరునామా నాకు రాసివ్వండి !
ఎవరి వెంట నడిచినా, తిరిగి చూడడం లేదు
స్నేహితులను ఎట్లా గుర్తు పట్టాలో
కొన్ని ఆనవాళ్ళు వివరించండి !
ఎంత అరిచినా, బదులు రావడం లేదు
పిలిస్తే పలికే వాళ్ళు,ఎంత దూరంలో వున్నారో
ఆ మైలు రాళ్ళ లెక్క చెప్పండి !
నేను తప్పిపోయాను
ఒక్క నిమిషం నిలిచి
వాళ్ళను కలిసే మార్గం చూపించండి !
*
మరో కవిత
న్యూస్ పేపర్!
ఎర్రని టమాటాలు —
చితికి పోయినట్టున్న
మొదటి పేజీ మీది పెద్దక్ష రాలను
నీరెండలో కూర్చొని చూడాలంటే,
పొగలు పోగులుగా లేచి
వొయలు వొయలుగా పరిమళించే,
చాయ్ ని చప్పరించినంత మజా కాదు !
పొద్దు పొద్దున్నే
న్యూస్ పేపర్ చదవాలంటే
వేయి ఏనుగుల బలమంత
ధైర్యముండాలి !
నిన్న జరిగిన కాల్పుల్లో
మరణించిన వారెందరో
మిగిలిన వాళ్ళెవరో
ఒక మనిషిగా నీకు వార్త తెలిస్తే
తట్టుకొనే కొండంత గుండె వుండాలి !
వాళ్ళెక్కడ ఎదురు పడ్డారో
వీళ్ళెందుకు కనబడ్డారో
ఇదంతా అర్థం కావడానికి
నడుస్తున్న కాలం తెలిసుండాలి !
నీవు ఇంత గట్టిగా వుంటేనే కానీ,
మొత్తం పేజీలను తిరిగేయలేవు !
(ఒక ఉర్దూ కవిత inspiration)
*
Superb sir
“కిస్ తరహ జీతేహై లోగ్ ….” అని రఫి పాడిన పాటొకటి వుంది. లీలగా గుర్తు. దాని ప్రేరణ కావచ్చు.