స్నేహితులను ఎట్లా గుర్తు పట్టాలో  చెప్పండీ !

మీరంతా ఎట్లా బతుకు తున్నారో
నాక్కూడా  ఆ విద్యను బోధించండి !
ఇంత దర్జాగా, ఎట్లా గడుపు తున్నారో
ఆ మంత్రం  నాక్కూడా నేర్పించండి !

ఎవరి దగ్గర చేరినా, పక్కకు జరుగు తున్నారు
ప్రేమించే వాళ్ళు, ఎక్కడ దొరుకుతారో
అక్కడి చిరునామా నాకు రాసివ్వండి !

ఎవరి వెంట నడిచినా, తిరిగి చూడడం లేదు
స్నేహితులను  ఎట్లా గుర్తు పట్టాలో
కొన్ని ఆనవాళ్ళు వివరించండి !

ఎంత అరిచినా, బదులు రావడం లేదు
పిలిస్తే పలికే వాళ్ళు,ఎంత దూరంలో వున్నారో
ఆ మైలు రాళ్ళ లెక్క చెప్పండి !

నేను తప్పిపోయాను
ఒక్క నిమిషం నిలిచి
వాళ్ళను కలిసే మార్గం చూపించండి !

*

మరో కవిత 

న్యూస్ పేపర్!

ఎర్రని  టమాటాలు —
చితికి  పోయినట్టున్న
మొదటి పేజీ మీది  పెద్దక్ష రాలను
నీరెండలో  కూర్చొని  చూడాలంటే,
పొగలు  పోగులుగా లేచి
వొయలు వొయలుగా  పరిమళించే,
చాయ్ ని  చప్పరించినంత మజా కాదు !

పొద్దు పొద్దున్నే
న్యూస్ పేపర్  చదవాలంటే
వేయి  ఏనుగుల  బలమంత
ధైర్యముండాలి !
నిన్న జరిగిన  కాల్పుల్లో
మరణించిన వారెందరో
మిగిలిన  వాళ్ళెవరో
ఒక  మనిషిగా  నీకు  వార్త తెలిస్తే
తట్టుకొనే  కొండంత గుండె వుండాలి !

వాళ్ళెక్కడ  ఎదురు పడ్డారో
వీళ్ళెందుకు  కనబడ్డారో
ఇదంతా  అర్థం కావడానికి
నడుస్తున్న  కాలం  తెలిసుండాలి !

నీవు ఇంత గట్టిగా వుంటేనే  కానీ,
మొత్తం పేజీలను తిరిగేయలేవు !

(ఒక ఉర్దూ కవిత inspiration)

*

Avatar

ఆశారాజు

2 comments

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

  • “కిస్ తరహ జీతేహై లోగ్ ….” అని రఫి పాడిన పాటొకటి వుంది. లీలగా గుర్తు. దాని ప్రేరణ కావచ్చు.

‘సారంగ’ కోసం మీ రచన పంపే ముందు ఫార్మాటింగ్ ఎలా ఉండాలో ఈ పేజీ లో చూడండి: Saaranga Formatting Guidelines.

పాఠకుల అభిప్రాయాలు