కోవిడ్ మూలంగా మాకు కూడా ఇంట్లోనే ఉంటూ ఇతర భారతీయ భాషలలోనూ, ప్రపంచ సినీమాలోనూ, ముఖ్యంగా హాలీవుడ్ సినీమాలోనూ అలాగే టీవీ సీరియల్స్ లోనూ వస్తూన్న కొత్త తరహా చిత్రాలను చూడగల అవకాశం లభించింది. అవన్నీ గొప్పగా ఉన్నాయనికాదుగానీ – చాలా వాటిల్లో స్థలకాల నిర్దిష్టతలు, స్థానిక సమాజాల వాస్తవిక చిత్రణ మెండుగా ఉన్నాయని తోచింది. కొందరు మిత్రుల సూచన మేరకు కొత్తగా వచ్చిన కొన్ని తెలుగు సినీమాలు చూసే ప్రయత్నం చేశాం. అవన్నీకూడా (మినహాయింపుల ప్రసక్తి మరికాసేపట్లో) కృతకంగా, కృత్రిమంగా, నిర్జీవంగా అగుపించాయి. సామాన్య ప్రజాజీవితం కాదుకదా, కనీసం మధ్యతరగతి జీవితంకూడా వాటిల్లో కనిపించలేదు. ఘనచరిత్రను కలిగిన తెలుగు సినీమా ఈ విధంగా ఎందుకు చతికిలపడిందా అనిపించింది. మరికొంత లోతుగా పరిశీలించిన మీదట పరిస్థితి ఆశాజనకంగానే ఉందని అర్థమైంది.
అరవైలనాటి తెలుగు సినీమాల్లో నగరం అంటే మద్రాసు; పల్లెలన్నీ బహుశా కృష్ణా, గుంటూరు లేదా గోదావరి జిల్లాలలో ఉంటాయి. అయితే అవన్నీ కొంత నమ్మశక్యంగానే ఉండేవి. పామరులనబడేవారిని కూడా చేరుకున్న ఆనాటి నాటకరంగ ప్రభావం మూలంగా, పౌరాణిక, జానపద చిత్రాల ప్రాచుర్యం మూలంగా భాష, అభినయం – వీటిపట్ల కనీస శ్రద్ధ ఉండేది.
మద్రాసు నగరం మనది కాకుండా పోయాక హైదరాబాదు ఆ లోటుని భర్తీ చెయ్యగలదనే అనుకున్నారుగానీ అది సాధ్యపడలేదు. ఎందుకంటే హైదరాబాదు ఆత్మ పాతనగరంలో ఉంది తప్ప సైబరాబాదులో లేనేలేదు (చదవండి- పరవస్తు లోకేష్ రచనలు). నేటి తెలుగు సినిమాల్లో కనిపించే ఐటీరంగ యువతరపు అనుభవాలు అట్టముక్కల సెట్టింగుల్లాంటి కాఫీడేలకూ, పబ్బులకూ, బార్లకూ పరిమితమవుతాయి. అవి ఏ నగరంలోనైనా ఉండొచ్చు. ఆవిధంగా తెలుగు సినీమా నగరకేంద్రాన్ని, అది అందించగల స్థానికతను పోగొట్టుకుంది. ఇందుకు భిన్నంగా హిందీ, మరాఠీ సినీమాలకి బొంబాయి మహానగరం ఉంది; అలాగే బెంగాలీ సినీమాకి కలకత్తా.
విజయవాడ పెద్ద టౌను. విశాఖపట్నం నగరమేగానీ ప్రస్తుతానికి మెట్రో స్థాయి మహానగరం కాదు. మహానగరమంటే ఏమిటి? కాంక్రీట్ జంగిల్ లో ట్రాఫిక్ జామ్స్ మధ్య ఎవరిమానాన వారు రాత్రీపగలూ పెట్టే ఉరుకులూ పరుగులూ మాత్రమే కాదు. ఇంకా ఏదో ఉంది; ఉండాలి. మ్యూజియంలు, పబ్లిక్ లైబ్రరీలు, ఆర్ట్ గ్యాలరీలు, థియేటర్లు, ఆడిటోరియంలు, కెఫేలు, చాయ్ దుకాణాలూ, అడ్డాలు ఉండితీరాలి. అవన్నీ అన్ని తరాల, వర్గాల నగరవాసులూ మేధావులూ, కళాకారులూ, రచయితలూ, విమర్శకులూ కలుసుకోగల వేదికలను ఏర్పరుస్తాయి. చర్చలు, వాదనలు, విబేధాలు, పరిష్కారాలు – వీటన్నిటికీ పబ్లిక్ స్పేస్ ను ఏర్పరుస్తాయి. అప్పుడు వాళ్లు చరిత్రను సృష్టిస్తారు. అప్పుడే నగరవాసులు నాగరికులవుతారు. ఈ సంగతి గత తరాల హైదరాబాదీలకు, ఇరానీ కెఫేలకూ ఎప్పుడో తెలుసు. అందుచేత ప్రతీ మహానగరమూ అనేకమైన భాషలు వినిపించే జనసందోహం. భిన్న సంస్కృతులు వికసించగల ప్రదేశం. ప్రతీ మహానగరానికి అది నడిచివచ్చిన నిర్దిష్టమైన రహదారి ఉంటుంది. అది దాటివచ్చిన మైలురాళ్లుంటాయి.
స్థలకాల నిర్దిష్టతలూ, చారిత్రక నేపథ్యం, సామాజిక పరిణామాలూ – ఇవేవీ పట్టనప్పుడు, లేదా చేతకానప్పుడు ఇక మిగిలింది గ్రాఫిక్స్ తో కూడిన ఫాంటసీ మాత్రమే. ఐటీ పుణ్యమా అని మనకి ఏనిమేషన్ ఉండనే ఉంది. అందుకే వాస్తవికతనుండి పూర్తిస్థాయి పలాయనమైన ‘బాహుబలి’ తెలుగు చిత్రపరిశ్రమలో సాధ్యపడింది. ఏ మాధ్యమంలోనైనా నిస్సారవంతమైన కథాంశాలకు ఆధునిక సాంకేతికత అందించే మెరుగులను అద్దినప్పుడు కృత్రిమత్వం పరాకాష్టకు చేరుకుంటుంది.
రెండు తెలుగు రాష్ట్రాలకుగల ఏకైక నగరం హైదరాబాదుని సినీమాపరిశ్రమ తన స్థానికతకై వినియోగించుకోలేకపోయింది. (‘పాతనగరంలో పసివాడు’వంటి చిత్రాలతో దర్శకుడు అక్కినేని కుటుంబరావు ఈ ప్రయత్నం చేశాడు).
ఇక మిగిలినవన్నీ చిన్న టౌన్లు మాత్రమే. అయితే వాటిల్లో నగరజీవన సంక్లిష్టత, ఆధునికత ఉండకపోవచ్చు గానీ, మానవానుభవాలు ఉండవా? అంటే తప్పకుండా ఉంటాయి. చిన్న ఊళ్ల స్థానికతని హిందీ సినీమాలూ, సీరియళ్లూ పట్టుకున్నాయి (ఉదాహరణకి – ‘గాంగ్స్ ఆఫ్ వసేపూర్’). ఇదే దారిలో ‘కంచరపాలెం జంక్షన్’, ‘పలాస’, ‘జాతిరత్నాలు’, ‘డీజే టిల్లు’వంటి కొన్నిచిత్రాలు స్థలకాల స్వాభావికతలు ఆధారంగా నిలబడ్డాయి. మరో అడుగు ముందుకి వేసి జీవనచిత్రణలో పరిపూర్ణతను సాధించిన చిత్రం ‘మల్లేశం’. చాలా కాలానికి ఒక తెలుగు రచనను ఆధారంగా చేసుకొని తీసిన ‘కొండపొలం’. అయితే ఇవన్నీ తెలుగు సినీమా సంప్రదాయానికి భిన్నంగా, మధ్యాంధ్రను దాటివచ్చిన ఉత్తరాంధ్ర, తెలంగాణా, రాయలసీమ ప్రాంత చిత్రాలు. వాటికి తమదంటూ ఒక భాష, చరిత్ర, మట్టివాసన ఉన్నాయి. ఇది ఆహ్వానించదగ్గ పరిణామం. ఎట్టకేలకు తెలుగు సినీమారంగంలో కూడా పరిధి, కేంద్రం తమ స్థానాలను పరస్పరం మార్చుకోక తప్పని పరిస్థితులు ఏర్పడడం మంచి సంకేతం. ‘జై భీం’ ప్రేరణతో తెలుగు సినీమా ఇంకా రావాల్సి ఉంది.
పెద్ద బడ్జెట్ సినీమాల నిర్మాతలు పెట్టిన డబ్బు తిరిగి వస్తుందో రాదో అనే ఆందోళనతో ఫార్ములాలనూ, సూపర్ స్టార్లనూ ఆశ్రయిస్తారు. సృజనాత్మకత, ప్రయోగాత్మకత వెనక్కిపోతాయి. ఇందుకు భిన్నమైన వాణిజ్య మోడల్ ను కలిగిఉన్న నెట్ ఫ్లిక్స్ , అమెజాన్, ఆహా, వగైరాలు కల్పించే అవకాశాలను వినియోగించుకుంటూ – కథాంశాలను, పాత్రలను చిన్నటౌన్లలో, ప్రాంతీయ నిర్దిష్టతల వాస్తవికతలో, స్థానిక ప్రజల భాషలో వెతుక్కోగలిగితే తెలుగు సినీమాకి కూడా మంచిరోజులు రావచ్చు అనిపిస్తోంది. ఈ అంశాలన్నింటిలోనూ నాలుగడుగులు ముందు నడుస్తూన్న తెలుగు కథా సాహిత్యం, కొత్త సినీమా ప్రయాణానికి దారిని ఏర్పరుస్తుందా? కోవిడ్ విధించిన గృహ నిర్బంధకాలంలో ప్రేక్షకుల అభిరుచులు, కొలమానాలు మారిపోయాయి అనడంలో మాత్రం సందేహంలేదు.
*
సినిమా మీద ఆసక్తి తో, మీ పూర్తి పాఠం చదవటం జరిగింది, మంచి విశ్లేషణ,’పాత నగరం లో పసి వాడు’ సినిమా ఏ OTT లో ఉందో తెలియదు…కోవిడ్ పుణ్యమా అని OTT platformలో చాలా సినిమాలు చూడటం జరిగింది… భవిష్యత్తులో విశాఖపట్నం, ఆంధ్రప్రదేశ్ సినీ రాజధాని గా , మహారాష్ట్ర కి ముంబాయి లాగా పేరు తెచ్చుకునే అవకాశాలు ఉన్నాయి అని అనుకుంటున్నాను.
మంచి విశ్లేషణ. ఒక ముఖ్యపాయింట్ వదిలేశారనిపించింది. మహారాష్ట్ర,బెంగాల్, కర్ణాటక, కేరళ లాంటి రాష్ట్రాల్లో మంచి విలువల నాటకం రూపు తీసికొంది. అది తెలుగు రాష్ట్రాలలో జరగలేదు.
తెలుగు సినిమా లో ఆ లోటు కనపడుతోంది