ఓల్గా- అంటే పరిచయం అక్కర్లేని పేరు. మూడు తరాల స్త్రీ చైతన్య సంవాద ప్రతీక. కొన్ని రచనల పట్టికా, ఇంకొన్ని పురస్కారాల జాబితా ఇచ్చినంత మాత్రాన్న ఓల్గా సాహిత్య యాత్ర కాదు. తన ప్రతి అడుగునీ ధిక్కారంగా, తన ప్రతి అక్షరాన్నీ చేతనా వలయంగా తీర్చిదిద్దిన బుద్ధిజీవి ఆమె.
-
స్త్రీ వాదం ప్రస్తుతం ఏ కూడలి వద్ద నిలబడి ఉంది ?
స్త్రీవాదం ఏ కూడలి వద్దా నిలబడి లేదు.అనేకానేక అస్తిత్వ వాదాలనూ సంక్లిష్ట సామాజిక నేపథ్యాలనూ కలుపుకుంటూ ప్రవాహం వలే సాగిపోతున్నది.నిలబడే వెసులుబాటు లేదు. ఎన్నెన్నో పాయలు వచ్చి చేరుతున్నాయి.చీలుతున్నాయి.
ఉప ప్రవాహాల వలే సాగి మళ్ళీ కలుస్తున్నాయి. వర్గ,వర్ణ,జాతి,మత,లైంగిక ప్రాధాన్యతల అస్తిత్వాలతో ఒక సంభాషణ నిరంతరం జరుగూతూనే ఉంది.స్త్రీలపై జరిగ హింస పెరుగుతోంది. ప్రత్యేకంగా జరిగే హింసతో పాటు భావజాలపరంగా వారిని వెనక్కి మళ్లించేందుకు నిలబడే వ్యవధానం ఎక్కడుంది? సాహిత్యపరంగా జరిగే కృషితో పాటు స్త్రీల ప్రతిఘటనలు,ఉద్యమాలు కూడా ఎక్కడికక్కడ పదునెక్కుతున్నాయి.కానీ వాటిని కనిపించనీయకుండా, స్త్రీలను చీల్చివేసే ప్రయత్నాలు ముమ్మరమవుతున్నప్పుడు ప్రవాహం దృశ్యమానం కాకపోవచ్చు. పాతాళగంగ పైకి ఒక్కసారిగా ఉబికి వస్తుంది.
-
వోల్గా, మొదట ‘నేను పంచాది నిర్మల వారసురాలినన్న’ కవయత్రి. ఆమె ఇక కవిత్వం రాయరా ?
కవిత్వం రాయనని చెప్పలేను. నాలోపలి కల్లోలాన్ని వ్యక్తీకరించడానికి కవిత్వం తప్ప మరొక ప్రక్రియ సరిపోదనిపించినపుడు తప్పకుండా రాస్తాను. వేరే దారి లేదు కదా!
-
మీ సాహిత్య దృక్పధాలకి, జీవితానికి మధ్య ఖాళీలున్నాయని భావించే వారికి మీ సమాధానం ?
సాహిత్య దృక్పథానికీ జీవితానికి ఉన్న ఖాళీలను పూరించుకోవటమనే పని నిరంతరం చేసే రచయిత్రిని.ఖాళీ లేదు అనటం బూకాయింపవుతుంది. ఈ సమాజంలో మన ఆశయాలను, ఆదర్శాలను తూచా తప్పకుండా ఆచరించడం కష్టం.సమాజంతో,సామాన్య మానవులతో ఏ సంబంధమూ లేకుండా ఎండుకట్టెల వలే జీవించే వాళ్ళ సంగతేమో గానీ,మామూలు మనుషులతో కలిసి పనిచేస్తూ, వారి హక్కుల కోసం మార్గాన్వేషణ చేస్తూ, వారితో స్నేహంగా, ప్రేమగా ఉంటూ ఒకోసారి ఘర్షణ పడుతూ గడిపేవారికి కొన్ని విషయాలలో రాజీపడక తప్పదు.ఒక్కోసారి ఖాళీలు ఏర్పడక తప్పదు. వాటిని గుర్తించి పూరించుకోవడమే రచయిత్రిగా, వ్యక్తిగా నా విజయం.
-
రాసిందానిమీద అస్సంతృప్తి, మిగిలిపోయిన దానిమీద ఆశ ఉన్న రచనాంశాలేమన్నా ఉన్నాయా ?
రాసిన దాని గురించి అసంతృప్తి లేదు. నా చేతనయినట్లు,మనసంతా పెట్టి రాస్తున్న విషయాన్ని నమ్మి,రక్తగతం,అస్తిగతం చేసుకుని రాస్తాను.అలా నాకు నమ్మకం లేనివి రాయను.అసలా పరిస్థితి కూడా ఎప్పుడూ రాలేదు.రాయవలసిన విషయాలు మరీ ఎక్కువ ఉన్నాయని చెప్పలేను.ఇప్పుడు రాస్తున్న రెండు పుస్తకాలు నా ధోరణీలోనే రాస్తున్నా.నాకు సంతృప్తి కలిగేలానే వస్తున్నాయి.
-
ఫెమిస్టు సిస్టర్హుడ్ (Feminist Sisterhood) ఆచరణలో సాధ్యమయ్యిందా ? సమస్యల్ని జయించిన సందర్భం ?
ఫెమినిస్ట్ సిస్టర్ హుడ్ సాధ్యపడకపోతే ఓల్గా ఇలా ఉంటుందా?
అస్మిత రిసోర్స్ సెంటర్ సంగతులు చెబితే తేలికగా అర్ధమవుతుంది. వసంత్ కన్నబిరాన్,కల్పన కన్నబిరాన్ నేనూ కలిసి చేసిన అద్భుతమైన పనులు మా మధ్య ఉన్న పరస్పర స్నేహం, అవగాహన, అంకిత భావాల వల్లే జరిగాయి. “మహిళావరణం” పుస్తకం కనబడే ఉదాహరణ.వేలాది గ్రామీణ స్త్రీలకు మేమిచ్చిన శిక్షణ, ఆ క్రమంలో పరిచయమైన గ్రామీణ మహిళా నాయకుల (స్త్రీవాద) సహకారం అంతా ఎంతో బాగా జరిగింది. “నీలిమేఘాలు” కూడా ఒక ఉదాహరణ సాహిత్యపరంగా. భూమిక సత్యవతితో కొన్ని పనులలో సహకారం.మేధోపరంగా ఎదగడానికి వేమన వసంతలక్ష్మి,వింధ్య,మృణాళినీల స్నేహం, సహకారం.నా తర్వాతి తరం రచయిత్రులు రజనీ పాటిబండ్ల,శిలాలోలిత,సీతారత్నం అయ్యగారి,మందరపు హైమావతి,కల్పనారెంటాల,పద్మ,ప్రతి
నాకంటే వయసులో కొంచెం పెద్దయిన మాలతీ చందూర్,డి.కామేశ్వరిలు పెద్దక్కల వలే ప్రేమ గుమ్మరిస్తారు.ఇక మూడవతరం రచయిత్రులు షాజహానా,మానస ఎండ్లూరి, మెర్సీ మార్గరెట్, వినోదిని,అపర్ణ తోట,పింగళి చైతన్య వీళ్ళందరి ప్రేమాభిమానాలతో నేను ఉక్కిరిబిక్కిరవుతుంటాను.స్థలా
జాజిమల్లిగా స్నేహపాత్రురాలైన మల్లీశ్వరి ఇప్పుడు ఈ సోదరత్వంతో పెద్ద సందర్భాన్ని కల్పించడం ఫెమినిస్ట్ సిస్టర్హుడ్ కాక మరేమిటి ? మల్లీశ్వరి నా భావనని అందిపుచ్చుకున్న మంచి స్నేహితురాలు
సమస్యలు ఉంటాయి. సమస్యలు లేకపోతే అందమే లేదు,ఆనందమే లేదు.ఒక పని కలిసి చేసేటపుడు వచ్చే సమస్యల్ని వివేకంతో నేర్పుగా అధిగమించగలగడమే అసలైన విజయం. ప్రతి సందర్భంలోనూ జయిస్తూనే వస్తున్నాను.
-
ఇప్పుడు రాస్తున్న రచయత్రుల పై మీ కామెంట్ ? మీ దృష్టినాకర్షించిన వారి గురించి చెప్పండి.
ఇప్పుడు రాస్తున్న రచయిత్రులందరూ ప్రతిభావంతులే.వాళ్ళింకా ఉధృతంగా రాయాలని నా కోరిక. జూపాక సుభద్ర, గోగు శ్యామల, చల్లపల్లి స్వరూపరాణి వినోదిని,షాజాహానా,మానస ఎండ్లూరి, చైతన్య, అపర్ణ తోట,పూర్ణిమ తమ్మిరెడ్డి , స్వాతి- వీళ్ల మీద నాకు చాలా ఆశలున్నాయి.తెలుగు సాహిత్యానికి కొత్తకాంతులు తేగలిగిన శక్తి సామర్థ్యాలున్నాయి.వేగంగా, విరివిగా రాయాలి.వీరిలో జూపాక సుభద్ర, గోగు శ్యామల తమను తాము నిరూపించుకుని సుప్రసిద్దులు,సుప్రతిష్టులు అయ్యారు.వారివలే మిగిలిన వారూ కావాలనీ వారి పేర్లు ముందు ప్రస్తావించాను.వారిరువురూ ఇప్పుడు నాయకత్వ స్థానంలో ఉన్నారు. మరుగున పడిన అద్భుత జీవిత దృశ్యాలను ఆవిష్కరిస్తున్నారు.
*
చాలా మంచి ఇంటర్వూ అండి.ఓల్లాగారి వ్యక్తిత్వాన్ని,మనసులోని భావాల్ని చక్కగా తెలిసింది, నేటి రచయితలగురించి ఓల్గా గారు చెప్పిన మాటలూ ప్రోత్సాహభరితం!!! ధన్యవాదాలు!!!
ఓల్గా సప్త దేశాల మధ్య సాగే నది.
ఓల్గా గారు సుప్త లోకాలను నిరంతరం మేల్కొలిపే రచయిత్రి.
సరైన సమయంలో సరైన ఇంటర్వ్యూ
పూర్ణిమ తమ్మారెడ్డి కాదు,
తమ్మిరెడ్డి. సరి చూడగలరు.