స్టాఫ్ హాస్టల్ లో ఛీజోదంతం

నేను విద్యార్ధి దశ నుంచి లెక్చరర్ గా అక్టోబర్, 1969 లో పదోన్నతి పొంది ఈ వ్యాసం వ్రాస్తున్న ఈ అక్టోబర్, 2019 కి సరిగ్గా 50 ఏళ్ళు నిండాయి..అంటే ఇది ఆ విధంగా ఒక స్వర్ణోత్సవ వ్యాసం అని తల్చుకుంటేనే ఒక పక్క ఆశ్చర్యం, మరో పక్క వయో విచారం, ఇంకో పక్క ముసి ముసి నవ్వులూ వచ్చేస్తున్నాయి. అలాంటి ప్రమోషన్లు నా ఒక్కడికే కాదు, చందూ గాడూ, పేర్లు మర్చిపోయిన ఇంకా కొంతమందీ కూడా రిసెర్చ్ స్కాలర్ స్థాయి నుంచి ఉపాధ్యాయుల స్థాయికి బదిలీ అయ్యారు. అంటే విద్యార్ధి కుర్చీల లోంచి లేచి, పాఠం చెప్పే వేదిక మీదకి ప్రమోషన్. అదే మా బొంబాయి ఐ.ఐ.టి కేంపస్ లో నాలాగా బ్రహ్మచారి అయితే ఒక చివరన ఉండే హాస్టల్ వన్ నుంచి దానికి అర మైలు ఎదురుగా చిన్న లోయకి అవతలి వేపు ఉన్న స్టాఫ్ హాస్టల్ కి బదిలీ అనమాట. ఎందుకంటే అప్పటి మా కేంపస్ లో ఏడు మగ పిల్లల హాస్టల్స్ అన్నీ ఒక అర్ధ వర్తులాకారం లో ఉండేవి. ఉన్న ముగ్గురే ముగ్గురు అమాయిలూ లెక్చరర్లు ఉండే ఒక ఫ్లాట్ లో ఉండేవారు. మాస్టర్స్, రిసెర్చ్ స్కాలర్స్ కి ఒకటో నెంబర్ హాస్టల్ ఒక చివరనా, మిగిలినవన్నీ అండర్ గ్రాడ్యుయేట్ కుర్రాళ్ళకీ. వాటిల్లో ఏడో నెంబర్ రెండో చివర్నా ఉండగా దాని పక్కనే ఉన్న పెద్ద భవనం మా స్టాఫ్ హాస్టల్. ఇది లెక్చరర్ల నుంచి ప్రొఫెసర్ల దాకా టీచింగ్ స్టాఫ్ లో బ్రహ్మచారులకీ, పెళ్ళీ పెటాకులూ అయినా క్వార్టర్స్ దొరకని దంపతుల కోసం కట్టిన ఈ స్టాఫ్ హాస్టల్ లో నాకు మూడో అంతస్తులో గది నెంబర్ 47. 1969 అక్టోబర్..అంటే 50 ఏళ్ళ క్రితం “గది ప్రవేశం’ చేసి, 1974 డిశంబర్ లోనో, 1975 జనవరి లోనో (నిజంగానే అసలు తేదీ జ్ఞాపకం లేదు మరి) అమెరికాలో అడుగుపెట్టే దాకా…ఐదున్నర సంవత్సరాలు ఆ గదే నా పిచ్చి వేషాలన్నింటికీ హెడ్ క్వార్టర్స్.

మా స్టాఫ్ హాస్టల్ లో ఉన్న వంద గదులలో మూల గదులు వంట గది, రెండు పడక గదులతో విశాలమైన ఆరింటిని కొత్తా, పాతా దంపతులకి కేటాయించారు. కొత్త అంటే కొత్తగా పెళ్ళి అయిన వాళ్ళు అని వేరే చెప్పక్కర లేదు కానీ పాత అంటే ఎప్పుడో పెళ్ళీ, గిళ్ళీ అయి, పిల్లా, జెల్లా ఉండి, విదేశాల నుంచి తిరిగి వచ్చి ఇక్కడ ప్రొఫెసర్లు గా చేరి, సూటూ, బూటూ, నెక్ టై లాంటివి ఇంకా విప్పని బాపతు సంసారులు అనమాట. ఆ భవనం లో ముందు పెద్ద వరండా, ఒక మూల వాచ్ మన్ గారు రాత్రీ, పగలూ నిద్రపోయే కుర్చీ, పక్కన పెద్ద బిలియర్డ్స్ గది, లోపలికి వెళ్ళగానే పేద్ద డైనింగ్ గదీ, వెనకాల అందరూ కేరళా వాళ్ళే అయిన వంట గదీ, అనింటికీ వెనకాల ఇంకా పెద్ద హాలు…అంటే స్టాఫ్ క్లబ్. ఈ స్టాఫ్ క్లబ్ ప్రాముఖ్యత ఏమిటంటే మొత్తం ఐ.ఐ.టి లో ఉన్నలెక్చరర్స్ నుంచి సీనియర్ ప్రొఫెసర్లూ, పిల్లలతో సహా వాళ్ళ కుంటుంబాలూ సాయంత్రాలు ఇకడికి వచ్చి కాలక్షెపం చేసే చోటు. అందుకు వీలుగా ఈ హాలులో టేబుల్ టెన్నిస్ టేబుళ్ళూ, కేరం బోర్డులూ, చదరంగం, బ్రిడ్జ్ ఆటకి పేకలూ, వార్తా పత్రికలూ, అమెరికా, ఇతర దేశాలనుంచి దిగిమతి చేసుకునే రంగ రంగుల ఖరీదైన పత్రికలూ, పైన ప్రస్తావించిన బిలియర్డ్స్ బల్లా కాకుండా, ఆ భవనం ఎదురుగుండా నాలుగు టెన్నిస్ కోర్ట్ లతో అన్ని రకాల హంగులూ ఉంటాయి. ఇప్పుడు చూస్తున్న అమెరికా కళ్ళ తో అప్పుడు చూస్తే ఆశ్చర్యం వేసే విషయం కేంపస్ మొత్త్తం మీద ఒక్కటంటే ఒక్క స్విమింగ్ పూల్ కూడా లేక పోవడం. బహుశా నిక్కర్లు వేసుకుని మగంగులకి పరవా లేదు కానీ బికినీల భయం కావచ్చును. ఇక్కడ ఆడువారు అంటే ఆ రోజుల్లో ఉన్న మొత్తం ఆడ స్ట్యూడెంట్ ముగ్గురే కానీ, మిగిలిన మహిళలు అందరూ సంసార పక్షంగా ఉండే గృహిణీ మణులే కాబట్టి బికినీల లాంటి తక్కువ బట్టలు వేసుకునే అవకాశం కలిగించే ‘తుఛ్ఛ’ స్విమింగ్ పూల్ సంస్కృతి తెచ్చి పెట్టుకోవడం మంచిది కాదు. చీర కట్టుకుని స్విమింగ్ పూల్ లోకి ఎవరు దిగరు కానీ, పంజాబీ డ్రెస్ వేసుకున్నా ఎబ్బెట్టు గానే ఉంటుంది కదా! ఈ రోజుల్లో అయితే ఎవరైనా సరే ఏ సందర్భానికి ఎలాంటి బట్టలు ఎలా వేసుకోవాలీ అనే ప్రసక్తి లేనే లేదు. చిరిగి పొయిన జీన్స్ పంట్లాంతో పెళ్ళి పీటల మీద కూచునే పెళ్ళి కూతుళ్ళు ఉన్న రోజులు ఇవి.

మా స్టాఫ్ హాస్టల్ లో నాకు బాగా నచ్చినది ఖరీదైన మా మెస్. ఎంత ఖరీదూ అంటే….నా రిసెర్చ్ స్కాలర్ షిప్ నెలకి 400 అయితే, ఇప్పుడు లెక్చరర్ గా జీతం 560 రూపాయలలో మా స్టాఫ్ హాస్టల్ మెస్ బిల్లు 160 రూపాయలు. అంటే స్టేటస్ మార్పు తప్ప ఆదాయం సేమ్ టు సేమ్. అయితే అంత వరకూ హాస్టల్ వన్ లో నెలకి 40 రూపాయలకి డబ్బు లేని అక్కడి మెస్ లో మూడేళ్ళు ఆ మలయాళీ వంటవాడి వేపుళ్ళ లాంటి నానా గడ్డీ తిన్న నాకు ఇక్కడ రోజూ పొద్దున్నే బటర్..అవును నిజంగానే బటర్, జామ్ లతో, కత్తీ కఠారులతో, పింగాణీ కంచాలలో బ్రెడ్డూ, ఆమ్లెట్..అవును ..నిజమైన ఆమ్లెట్టూ, పళ్ళ ముక్కలూ, రాత్రీ, పగలూ భోజనానికి సింగ్ అనే వంటవాడు అద్భుతంగా చేసే పుల్కాలు, పంజాబీ కూరలు, గుజరాతీ స్వీట్లు….కిళ్ళీలూ….వావ్…అంతా రాజ భోగమే.

అన్నింటి కన్నా అర్ధం కాని ఆశ్చర్యకరమైన పదార్ధం పేరు “చీజ్”. అది మన వెన్నకాదు. అలా అని అముల్ బటర్ లాగా రొట్టె మీద రాసుకునేదీ కాదు. అసలు ఏమిటో, ఎలా తినాలో, ఎందుకు తినాలో తెలీదు కానీ ఆ నాటి నాగరీకుల ఇళ్ళలో, సినిమా తారలు, ఐశ్వర్య వంతులూ కొనుక్కుని, కొరుక్కుతినే నాజూకు బ్రహ్మ పదార్ధం ఆ “చీజ్” అనేది. ఇప్పుడు నవ్వు రావచ్చు కానీ ఆ రోజుల్లొ ఆ “చీజ్” విలువ చెప్పాలంటే ఒక చిన్న ఉదంతం చెప్పాలి.

ఒక రోజు అర్హ్దరాత్రి ఒక నలుగురు చడీ చప్పుడూ లేకుండా వచ్చి, నిద్రపోతున్న మా వాచ్ మన్ గాడి నోట్లో గుడ్డలు కుక్కేసి, చేతులు కట్టేసి, డైనింగ్ రూమ్ లో ఉన్న రిఫ్రిజిరేటర్ కి చుట్టూ కట్టి తాళం వేసిన ఇనప గొలుసులు కత్తిరించి, అందులో ఉన్న పది చీజ్ స్లైసెస్ పేకెట్…అదొక్కటే…మిగతా జామ్, బటర్, పళ్ళు, పాలూ, మజ్జిగా…ఆఖరికి అసలు సిసలు వెన్నని కూడా వదిలేసి, కేవలం ఆ చీజ్ అనే బ్రహ్మ పదార్ధాన్నే దొంగతనం చేసి ఉడాయించారు. ఆ వాచ్ మని ఎలాగో, అలాగ విదిలించుకుని లబో, దిబో మని మరాఠీలో పెట్టిన గొడవ కంటే మా మెస్ సెక్రటరీ… అమెరికా దిగుమతి అయిన ఒక అసిస్టెంట్ ప్రొఫెసర్ గారు ఇంగ్లీషులో పెట్టిన గొడవ ఐ.ఐ.టి. డైరెక్టర్ దాకా వెళ్తుందేమో అని భయం వేసి మా సెక్యూరిటీ ఛీఫ్ ఆ ‘చీజ్’ దొంగలని పట్టుకోడానికి ఒక చిన్న పథకం వేశాడు. ఆయన పేరు ముడ్గల్ అనే కన్నడం ఆయన. ముడ్గల్ ప్లాన్ ప్రకారం మేము ఎవళ్ళం ఈ దొంగతనం గురించి ఎక్కడా మాట్లాడకూడదు. అసలు జరిగినట్టు బయటకి పొక్క కూడదు. అలా అయితే ఆ దొంగలకి ధైర్యం వచ్చి, మళ్ళీ వస్తారు. చీజ్ కున్న పవర్ అటువంటిది కదా! ఆ సమయం లో మాటు వేసుకుని రహస్య స్థావరాలలో దాగి ఉన్న సెక్యూరిటీ సిబ్బంది వాళ్ళని పట్టుకుని, ముక్కు పిండి డబ్బు వసూలు చేసి, మా చీజ్ మాకు కొనిపెడతారు. అదీ అతని ప్లాన్. సరిగ్గా పది రోజుల తర్వాత ఆయన ఊహించినట్టుగానే ముగ్గురు రావడం, దొరికి పోవడం జరిగింది. తీరా చూస్తే వాళ్ళు మా పక్కనే ఉన్న హాస్టల్ వన్ నివాసులు. అండర్ గ్రాడ్యుయేట్స్. ఆ రింగ్ లీడర్ పేరు ప్రదీప్. మెటలర్జీలో మూడో ఏడు టాప్ రేంకర్ అయిన చాలా బ్రిలియంట్ స్ట్యూడెంటే కాక, విద్యార్ధి నాయకుడు కూడానూ. మన స్ట్యూడెంట్సే కదా అని గట్టిగా చివాట్లు వేసి, కెరీర్ ధ్వంసం చేశేస్తాం జాగ్రత్త అని వార్నింగ్ ఇచ్చి వదిలేశాం. పూర్తి పేరు వ్రాయడం లేదు కానీ ఆ ప్రదీప్ ఇప్పుడు. పెట్రొ కెమికల్ & ఆయిల్ ఫీల్డ్ ఇంజనీరింగ్ పరిశ్రమలో చాలా పేరున్న మేనేజ్మెంట్ కన్స్లల్ టెంట్. అంతే కాక మంచి సృజనాత్మకత ఉన్న కళాకారుడు. నాకు హ్యూస్టన్ లో మంచి మిత్రుడు. ఇద్దరం కలిసి చాలా కార్యక్రమాలు చేసి, వీలున్నప్పుడల్లా హానికరం కాని అలనాటి ‘చీజ్’ వ్యవహారం గురించీ, ఈ నాడు దొరుకుతున్న వందలాది ‘చీజ్’ రకాలనీ తల్చుకుని నవ్వుకుంటూ ఉంటాం. ఆ మెస్ లో నాకు నచ్చిన మరొక చిన్న మరాఠీ వంటకం వెల్లుల్లి కారం. అమెరికాలో అది డ్రై గార్లిక్ చట్నీ అని దొరుకుతుంది కానీ ఆ రుచే వేరు. నేను అక్కడ ఉన్న ఐదేళ్ళ లో ఒక సారి మెస్ సెక్రటరీ గా పని చేసినప్పుడు, కంది పొడి పెట్టగానే ఆ ఘాటుకి నన్ను ఏకంగా నా లెక్చరర్ ఉద్యోగం నుంచే ఫైర్ చేసినంత పని చేశారు. ఆ నాటి మా మెస్ ఫొటో ఒకటి ఇక్కడ జతపరుస్తున్నాను.

ఇవన్నీ ఎలా ఉన్నా, ఆ స్టాఫ్ హాస్టల్ లో నేను పాత కొంతా..అంటే డాక్టరేట్ విద్యార్ధిగానూ, కొత్త కొంతా..అంటే ఇంజనీరింగ్ పాఠాలు చెప్పే వాడిగానూ, మేధావులూ, ఉన్నత ఆదర్శాలు ఉన్న మంచి స్నెహితులనీ సంపాదించుకున్నాను. ఆ వివరాలు..త్వరలోనే….

*

 

 

 

 

వంగూరి చిట్టెన్ రాజు

Add comment

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

‘సారంగ’ కోసం మీ రచన పంపే ముందు ఫార్మాటింగ్ ఎలా ఉండాలో ఈ పేజీ లో చూడండి: Saaranga Formatting Guidelines.

పాఠకుల అభిప్రాయాలు