సైకిల్ స్టోరీస్

  ఇది ఇట్ల చెప్పుకుంటానికి నాకు సిగ్గయితదిలేగానీ – నేను పదో తరగతి నల్లగొండ ఓల్డ్ టౌన్ టాపర్ వచ్చినప్పుడు – అప్పుడే పుట్టిన రెండు కొత్త కాలేజీల కానించి.. నాలుగైదు కాలేజీలు నన్ను ఫ్రీగ ఇంటర్ చదివిస్తమని ఇంటికొచ్చినయ్. కొందరైతే నేను నూట యాభై కట్టకున్నా నా అడ్మిషన్ వాండ్లంతట వాళ్లే రాసుకున్నరు.

కాలేజీలు స్టార్టయ్యే రోజొచ్చింది. గడియారం సెంటర్‌కాడ ఆగి ’ఏ కాలేజీల చేరుదాం?’ అని అప్పటికప్పుడు కొత్తగ మొదలువెట్టిన ప్రగతి జూనియర్ కాలేజీల చేరిన. అప్పటిదాంక బడి ఇంటికి దగ్గర్లనే జేబట్టి నడ్సుకుంటనే పొయ్యొచ్చేది. కాలేజీ హైదరాబాద్ రోడ్డుల ఉండె. సైకిల్ కొనక తప్పదు. అప్పటికి నేను చానాసార్లు సైకిల్ కొనమని అడిగినా, ఏదో ఒకటి చెప్పి అసలు కొనియ్యకుండనే ఉన్నరు. ఇప్పుడైతే కొనియ్యక తప్పదు. దానికి మా ఇంట్ల పెద్ద మీటింగ్ అయ్యింది. దీనికనేగాదు, ఏది కొనాల్నన్నా మా ఇంట్ల మీటింగ్ అయితది. టీవీ కొంటున్నమా, బీరువ కొంటున్నమా.. ఏది కొనాల్నన్నా ముందైతే ఒక మీటింగ్ అయితది. నా సైకిల్ కోసమని ఒక మీటింగ్ పెట్టిన్రు. ఇంత రేటు లోపల కొనాలని ఫిక్సయి.. నేను, మా బావ, మా అమ్మ ముగ్గురం కల్శి ప్రకాశంబజార్ పోయినం.

పెద్ద సైకిల్, చిన్న సైకిల్, లేడీస్ సైకిల్, రేంజర్ సైకిల్.. ఇవ్వి మేం చిన్నప్పుడు సైకిళ్లనంగనే ఏమేం ఉంటయని వేరు చేసి చూసేది. రేంజర్ సైకిల్ అంటే ఒక కంపనీ సైకిల్ అనేం కాదు, స్టైల్‌గ ఉంటే దాన్ని రేంజర్ సైకిల్ అనుకునేది. “ఈ సైకిల్ ఏతులు పడ్తానికిలే..” అనేది రేంజర్ సైకిల్‌ని.

నాకు కావాల్సిందిగూడ ఆ సైకిలే. దోలాడి దోలాడి కొత్తది ఒక సైకిల్ కొన్న.

’ఆహా! రేపట్నించి నేను ఈ సైకిల్ తొక్కుతున్న..’ నాకు అయ్యాల రాత్రిపూట మా అమ్మతోటి ప్రకాశంబజార్ నించి ఇంటిదాంక సైకిల్ నడిపిచ్చుకుంట రావుడు ఎట్ల ఉండెనో మాటలల్ల చెప్పలేను. మా ఇంట్ల ఎవ్వలికీ బండి లేదు అప్పటికి. నాన్న, అన్న సైకిలే తొక్కుతున్నరు. కాలేజీకి నేనుగూడ సైకిల్ మీదనే పోవాలె.

నేనట్ల సైకిల్ తొక్కుకుంట కాలేజీకి పోయే రోజులల్ల నల్లగొండల పెద్దగ కార్లు లేవు. ఎప్పుడో ఒక్కటి కనిపిచ్చేది. రోడ్డుగూడ ఖాళీగనే ఉండేది. సైకిళ్లు బానే తిరిగేటివి. పొద్దున్నే కాలేజీకి పోయేది, మధ్యానం లంచ్ టయానికి సైకిల్ మీదనే వచ్చి, ఆ ఉన్న కొస్సేపట్లనే తిని మళ్ల కాలేజీకి పొయ్యేది. ఎందుకో బాక్స్ కట్టుకొని పోవుడన్నది నా కాలేజీ లైఫ్‌లనే లేదు. సాయంత్రం కాలేజీ అయిపోయినంక ఆ నల్లగొండ రోడ్ల మీద చిన్నగ సైకిల్ తొక్కుకుంట ఇంటికి చేరుతుంటే.. అబ్బా ఎంత బాగుండేటిదో!

ఎప్పుడన్న సైకిల్ల గాలి తగ్గినా, పంచర్ అయినా మా ఇంటికాడనే ఒకాయన ఉండేటోడు – ఆయన కాడ్నే పంచర్ ఏయించేటోడ్ని. ఇట్లాంటిది కొంచం ఏమన్న అయినా ఎమ్మటే మాధ్యానం డుమ్మా కొట్టేది. ఎందుకో తెల్వదుగానీ – కాలేజీ రోజులల్ల మధ్యానం పూట ఏం చెయ్యకుంట, ఇంట్ల కూసొని అట్ల పడి ఉంటే నాకు ఎక్కడిలేని సంతోషమొచ్చేది. కాలేజీల ఉన్నన్ని రోజులు మధ్యానం ఏంజేసి డుమ్మా కొట్టొచ్చన్నదానిమీదనే మైండ్ తిరుగుతుండేది. పొద్దట్నించి అంతమందిని ఒక రూంల పడేశి చెప్పే ఆ క్లాసులు, రుద్దుడు ఎందుకో మెంటల్ టార్చర్ లెక్క ఉండేది. నైట్ క్లాసులని, ఎర్లీ మార్నింగ్ క్లాసులని.. అవి తప్పిచ్చుకుంటానికి సైకిల్ కరాబ్ కావుడు ఒక మంచి సాకు. మార్నింగ్ క్లాసులైతే ఐదింటికే ఉండేటియి. నేను మా ఇంటి తలుపు తీశి రోడ్డు మీదికి చూశేది పొద్దుగాల్నే. ఆ మలుపుకాడ ఉన్న లైటుకింద వాన పడుతున్నట్టు కనిపిస్తున్నదంటే – ఏదైతే అదైందని పొయ్యి పండుకునేది. వాన పడితే ఎవలు మాత్రం ఎట్ల పోతరు క్లాసులకి?

సైకిల్‌గానీ పంచర్ అయి మధ్యానం డుమ్మా కొడితే.. చిన్నగ పొద్దుగూకే టైమ్‌కి పంచర్ ఏయిస్తుండె. నేను ఏడనయితే సైకిల్ పంచర్ ఏయించేదో .. ఆడ్నే చిన్నగున్నప్పుడు సైకిల్ రెంటుకి తీసుకునేది. ఆ సైకిల్ షాపుల వరుసగ చిన్న సైకిళ్లు, పెద్ద సైకిళ్లు ఉండేటియి. గంటకు ఇంత అని తీస్కపోయేటోళ్లు. చిన్న పిల్లల సైకిళ్లయితే గంటకు రెండ్రూపాలు.

చిన్నప్పుడైతే – “అమ్మా, సైకిల్ తొక్కుకుంటనే.. రెండ్రూపాలు ఇయ్యవే..” అని మా అమ్మను బతిలాడి, గోల చేశి తీస్కునేది. ఆ గంట సేపట్లనే అలిపిరొచ్చేటట్టు తొక్కేది. పొద్దుగూకేటాలకు మళ్లొక్కసారి రూపాయి ఇయ్యమని గోలపెట్టేది. ఎర్ర రంగు, నీలం రంగు.. రెండు రకాలు ఉండేటివి చిన్న సైకిళ్లు.

నేను ఇంకా నేర్చుకోకముందల్నయితే మా ఇంటిదాంక నడిపిచ్చుకొస్తే.. మా చిన్నక్క నన్ను పట్టుకొని నేర్పిచ్చేది. ఇట్లంటే ఇట్ల.. ఐదారుసార్లు తొక్కేసరికల్ల నేర్చుకున్న. సైకిల్ నేర్చుకున్నంక ఆగకుండ తొక్కుడే తొక్కుడు. చేతులు ఇడ్శిపెట్టిమరీ తొక్కేది.

“అట్ల చేస్తే పడుతవురా!” అని మా అక్క చెప్తున్నా పట్టిచ్చుకోకుండ తొక్కేది. ఎవలికో ఒకలికి తీస్కపోయి పెట్టేది. లేకుంటే నేనే కిందవడేది.

ఒకసారి ఏమైంది.. “మీరైతే ఎక్కుర్రి చెప్త” అని మా అక్కని, రమేశ్, సాయి అని మా పక్కింట్లనే ఉంటరు, నాకంటే రెండు మూడేండ్లు చిన్నపిల్లలు – ఈ ముగ్గురినీ ఎక్కిచ్చుకొని తొక్కుతున్న. ఆ సైకిల్ అటు తిరిగి ఇటు తిరిగి దబక్కున పెద్ద మోర్ల పడ్డది. మేమందరం అప్పటికే దుంకినంగానీ, సైకిల్ ఇడ్శిపెడ్తే అది మోర్ల పడ్డది. ఇగ అయ్యాల నించి నిమ్మలంగ తొక్కుడు అలవాటైంది.

ఇంటర్ కాలేజీ రెండేండ్లు అదే సైకిల్ తొక్కిన. ఆ తర్వాత నల్లగొండలనే ఊరవతల ఇంజినీరింగ్ కాలేజీల చేరినంక ఈ సైకిల్‌తోటి పనిబడలే. నా సైకిల్ మా అన్న తీస్కొని తొక్కుడు మొదలువెట్టిండు.

మరి మా అన్నకు, నాన్నకు అంతకుముందలినుంచే పెద్ద సైకిళ్లు ఉండాలెగదా! ఆడికే వస్తున్న.

మా నాన్న కొండచెల్మ బాయిల పడి ఆపరేషన్ అంత అయినంక ఆయనకి ఒక కాలు సక్కగ లేదని తెల్సుగదా, అందుకే ఆయన సైకిల్ తొక్కే తీరు చూడాలె. గమ్మత్తుగ ఉంటది! ఫస్టు కొంచం దూరం అట్ల అట్ల చిన్నగ ఉరికిచ్చి దానిమీద ఎగిరి ఎక్కుతడు. మళ్ల దిగేదాంక పెడల్‌ని అటు ఇటు కదిలిస్తుంటడు అంతే. మొత్తం పెడల్ తిప్పుతానికి రాదు. అట్ల కొంచం కొంచం కదిలుస్తుంటే సైకిల్ మెల్లగ ముందలికి పోతుంటది. ఎక్కడ్నన్న దబుక్కున ఆగాల్సొచ్చిందంటే ఆ సైకిల్ మీంచి దుంకి హ్యాండిల్ గట్టిగ పట్టుకొని నడుస్తడు. పెద్ద జంక్షన్ ఉన్నా అట్ల సైకిల్ పట్టుకొనే నడుస్తడు. కొన్నేండ్లపాటు ఇట్ల ప్రాక్టీస్ చేసి సైకిల్ తొక్కుడు అలవాటు చేసుకున్నడు మా నాన్న.

అప్పుడంటే నల్లగొండ రోడ్లు ఖాళీగనే ఉండేటియి. ఇప్పుడున్న బండ్ల మధ్యన మా నాన్న సైకిల్ తొక్కుడంటే చిన్న పనిగాదు. అందుకే మా నాన్న ఇంటికొచ్చే టైమ్ దాటుతున్నది, ఇంకా వస్తలేడంటే.. పరేషాన్ కావాల్సిందే. ఈయనేం నిమ్మలం మనిషా? రోడ్డుమీద ఎవలన్న కనబడి – “ఏం మారయ్యో!” అన్నడంటే ఎమ్మటే ఆ సైకిల్ మీంచి ఎగిరి దుంకుతడు. అట్ల అడిగినోనితోటి మాట్లాడేదాంక ఊకోడు. ఊరంతా దోస్తులే ఉండబట్టి ఎప్పుడో పని నించి బయటపడితే ఇంటికొస్తాలికి రాత్రయితది. మాకేమో ఈ ట్రాఫిక్‌ల ఎట్ల వస్తున్నడో అనే భయం ఉంటది. ఒకళ్ల మాట చెప్తే వినేటోడుగూడ కాదాయె. రెండు మూడు సార్లు ఇట్ల సైకిల్ తొక్కుకుంటనే కిందవడ్డడని వార్తలొచ్చినయి.

మా నాన్న సిన్మా టాకీస్‍ల పనిజేస్తున్నప్పుడు ఎప్పుడన్న ఒకసారి నైట్ డ్యూటీ పడేది. అట్ల ఒకసారి నైట్ డ్యూటీ అయిపోయి పొద్దుగాల్నే ఇంటికొద్దామని తయారైతుంటే.. ఎవడో ఆ టాకీస్ కాంపౌండ్ గోడమీదికెళ్లి దూకి మా నాన్న సైకిల్ తీస్కొని బయటికి ఇసిరేసి ఎమ్మటే వాడు ఆ గోడ ఎక్కి దుంకి పోయిండంట.

మా నాన్న ఉర్కలేడాయె. “ఎవలో సైకిల్ ఎత్తుకపోతున్నరు.. అగో అటు.. అటు..” అనేలోపట వాడు గాయబైండు.

“బంగారమసొంటి సైకిల్ పోయెనాయెరా..” అని బాధవడ్డడు మా నాన్న. ఇగ మా అన్న సైకిల్ ఉన్నదిగదా అని అది తీస్కొని దానిమీద పనికి పోవుడు మొదలువెట్టిండు. మా అన్నకు నా సైకిల్ ఉండనే ఉన్నది.

టాకీస్‌ల నించి హాస్పిటల్ల పనికి మారినంకగూడ మా నాన్న సైకిల్ మీదనే పొయ్యేది. టాకీస్ కంటే ఇది చానా దూరం. బస్టాండ్ ఎదురుంగ ఉంటది హాస్పిటల్. అంతదూరం పొద్దుగాల తొక్కుకుంట పొయ్యేది. మధ్యానం తింటానికి వచ్చిపొయ్యేది. ఇదేందోగానీ మా ఇంట్ల ఎవ్వలికీ లంచ్ బాక్స్ కట్టుకపొయ్యే బుద్ధిలేకపోయింది. రాత్రిళ్లు ఆ చీకట్ల అంత ట్రాఫిక్‌ల వచ్చేది. ఎట్లొస్తున్నడో ఏమోనని కావలు కాసుకుంట చూడాల్సిందే.

ఎట్లయితే ఏంది ఇష్టంగ పోతున్నడు కదా, అంతా బానే ఉందనుకుంటే – ఒకరోజు ఈ హాస్పిటల్ కాడగూడ ఎవలొ సైకిల్ దొంగతనం చేసిన్రు. “ఇదేం గాశారమాయెరా..” అని పోలీసు కంప్లయింట్ చేసిండు. అయినా ఈ కాలంల సైకిల్ పోతే దోలాడి పెడతరా? పోయినట్టే అది ఇగ.

ఏం చెయ్యాలా అని ఆలోచిస్తే మా బావ సైకిలొకటి కనబడ్డది. దాన్ని కొద్దిగ రిపేర్ చేయించుకున్నడు. మా నాన్నకు సైకిల్ రిపేర్ చేస్తానికి లక్ష్మీ భాస్కర్ టాకీస్ కాడనే ఒక దోస్తున్నడు. మేమైనా సైకిల్ పంచరైతే, గాలిపోతే ఇక్కడిక్కడ్నే చేపిచ్చేదిగానీ, ట్యూబు, టైరు మార్పిచ్చాలంటే మా నాన్న దోస్తుకాడికి పోవుడే.

ఆ రిపేర్ చేయించుకున్న సైకిల్‌ని కొత్తదానిలెక్క చూసుకుంట, ఎప్పట్లెక్కనే జోరు మీద హాస్పిటల్‌కి పోతనే ఉన్నడు. మా అన్న నా సైకిల్ వాడుతున్న మాటేగానీ, అట్లాస్ పెద్ద సైకిల్ తొక్కితే ఉన్న సుఖం ఈ సైకిల్‌తోటి కష్టం. చెప్పినగదా, ఈ రేంజర్ సైకిల్ ఏతులు పడ్తానికే పనికొస్తది.

మా అన్న పనిచేసేకాడ్నే ఒక పిలగాడు – “అన్నా, నాకు ఈ సైకిల్ ఇయ్యొచ్చుగా! నువ్వు నా సైకిల్ తీస్కో” అన్నడంట. ఆ పిలగానికి ఆళ్ల నాన్న పెద్ద సైకిల్ ఇచ్చిండంట. కాలేజీకి అది ఏస్కపోతానికి అతనికి నామోషీ. మా అన్నకి ఎట్లయినా పెద్ద సైకిల్ ఇష్టమేగా, ఎమ్మటే సైకిళ్లు అటు ఇటు మార్చేసిండు.

ఒకసారి ఇట్లనే ఎవరో సెకండ్ హ్యాండ్‌ల బండి అమ్ముతున్నరంటే అది కొన్నం. మా అన్న అది తోలుకుంట సైకిల్ పక్కన పడేసిండు. మా నాన్న మటుకు ఓపికతోటి సైకిల్ మీదనే హాస్పిటల్‌కి పోయి వస్తున్నడు.

ఒకరోజు హాస్పిటల్ల ఉండంగనే చక్కరొచ్చినట్టయ్యిందంట. చేతకాలేదని ఆయన పనిచేస్తున్నకాడ్నే డాక్టర్‌కి చూపెట్టుకున్నడు. అటెన్క ఇంకో డాక్టర్‌కి చూపెట్టినం. మూత్రం సరిగ్గ వస్తలేదు. ప్రోస్టేట్ గ్లాండ్ ఎన్‌లార్జ్‌మెంట్‌కి ఆపరేషన్ చెయ్యాలన్నరు. నల్లగొండల కాదని, మా నాన్న వయసుకైతే లేజర్ ట్రీట్‌మెంటే కరెక్టని, గుండె సరిగ్గ సపోర్ట్ చెయ్యదు మామూలు ఆపరేషన్‌కని అన్నరు.

హైదరాబాద్‌ తీస్కొచ్చి ఆపరేషన్ చేయించినం. నయమైంది. రెండు నెలలు అవస్థ పడ్డంక నిమ్మలమైండు. అప్పట్నించి హాస్పిటల్ల పనికి బంద్ పెట్టిస్తే ఇంట్లనే ఉంటున్నడు. ఎప్పటిసందో పనిజేసిన మనిషాయె – “నేను మళ్ల పనికి పోత ఏంది?” అని అడుగుతుంటడు. నేను వద్దంటే వద్దని చెప్పిన.

అయితే ఊకనే ఇంట్ల ఉన్నా యాష్టకొస్తున్నదని, అట్ల బయటికి పోయొస్త అని అంటడు. అప్పుడు సరే పొమ్మనమే అనుకో – చిన్నపిలగానిలెక్క సైకిల్ బయటికి తీస్తడు.

“ఇప్పుడు సైకిల్ తొక్కుతావే?” అని అన్నమంటే – “ఎహెయ్.. ఇప్పుడేడ తొక్కుత? ఊకనే అట్ల పక్కనపొంటి నడిపిచ్చుకుంట పోత” అంటడు.

“అంత బరువు సైకిలెందుకే మరి? ఒక చిన్న కట్టె పట్టుకో ఏమైతది?” అంటే – “డెబ్బై ఐదు ఏండ్లు ఉండవయ్యా నాకు?” అని చెప్పుకున్న మా నాన్నే – “నేనేమన్న ముసలోణ్నారా?” అని తిడుతడు, ఆ సైకిల్‌ని పట్టుకొని నడుసుకుంట పోతూ.

*

వి. మల్లికార్జున్

కొత్త కథకి సరికొత్త వాగ్దానం మల్లికార్జున్. రాసిన ప్రతి వాక్యం భిన్నంగా రాయాలన్న తపన. తను చెప్పాలనుకున్న కథకి ప్రయోగమనే గీటురాయి మీద నిరంతరం పరీక్షించుకునే నూత్న పథికుడు.

1 comment

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

  • Very heart warming story. You have that touch of nostalgia in all your writings that sure will leave a sweet taste on the reader’s mind.

‘సారంగ’ కోసం మీ రచన పంపే ముందు ఫార్మాటింగ్ ఎలా ఉండాలో ఈ పేజీ లో చూడండి: Saaranga Formatting Guidelines.

పాఠకుల అభిప్రాయాలు